'Nirnayam' New Telugu Story Written By Padmavathi Divakarla
'నిర్ణయం' తెలుగు కథ
రచన: పద్మావతి దివాకర్ల
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
"ప్రియాతి ప్రియమైన రోహిత్కి, అసలు నేను నీకు గుర్తు ఉన్నానో లేదో నాకు మాత్రం తెలియడం లేదు. నువ్వు వెళ్ళి అప్పుడే రెండు నెలలు దాటింది తెలుసా! నీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. నువ్వే నా ప్రాణం అన్నావు, నువ్వే నా లోకం అన్నావు, కానీ నీ నుంచి ఇంతవరకూ ఎలాంటి ఫోనూ లేదు. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది, నావద్ద ఇంకే కాంటాక్ట్ నంబర్లు లేవు. నీకు ఉత్తరం రాయడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి.
అంకుల్, ఆంటీని ఒప్పించి నన్ను పెళ్ళి చేసుకుంటానని మాటిచ్చావు, మర్చిపోయావా? నా మనసు ఎంత గందరగోళానికి గురవుతోందా బోధపడుతోందా రోహిత్!
అన్నట్లు, నాకిప్పుడు మూడో నెల. నా పరిస్థితి ఇప్పుడు ఏమిటో అర్థం కావడం లేదు. ఇంట్లో మన గురించి ఇప్పటివరకూ చెప్పలేదు. మీ వాళ్ళని ఒప్పించిన తర్వాత చెప్పాలని అనుకున్నాం కదా! కనీసం ఈ ఉత్తరానికైనా జవాబిస్తావని ఆశిస్తున్నాను. ఈ రెండు నెలల నుండీ నేనిప్పటికో పాతికసార్లు నీ అడ్రెస్కి ఉత్తరాలు రాసి ఉంటాను. ప్రతీ రోజూ నీ వద్ద నుండి ఫోన్ గాని కబురు గానీ వస్తుందని ఎదురు చూసి చూసి కనులు కాయలు కాచాయి.
ఈ ఉత్తరానికైనా స్పందిస్తావని ఆశిస్తున్నాను. నీ జవాబు కొరకే కాదు, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నీ వద్దనుండి ఎలాంటి జవాబు రాకపోతే నాకు ఇక ఆత్మహత్యే శరణ్యం. త్వరగా నువ్వు రాకపోతే ఇదే నా ఆఖరి ఉత్తరం అవుతుంది. నా భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది.
........నీతో జీవితం పంచుకోవాలని ఆశిస్తున్న నీ ప్రియమైన రోహిణి."
ఉత్తరం రాయడం పూర్తి చేసి కవరులో పెట్టిందామె. ఆమె కళ్ళలోంచి రెండు కన్నీటి చుక్కలు కవరు మీద పడ్డాయి. ఆమెకి తన భవిష్యత్తు అంతా మసకమసకగా, అగమ్యగోచరంగా తోచింది.
"అమ్మా రోహిణీ!" అని హాల్లోంచి తల్లి గొంతు వినబడేసరికి రాసిన ఉత్తరాన్ని హాండ్ బ్యాగ్లో పెట్టి కళ్ళు తుడుచుకుంది.
"వస్తున్నా అమ్మా!" అంటూ ఆ గది నుండి భారంగా బయటకు నడిచింది.
* * * * * *
రోహిత్, రోహిణి ఇద్దరూ క్లాస్మేట్స్. ఇద్దరికీ కాలీజీలో పరిచయం అయి అతి కొద్దిరోజుల్లోనే ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ఇష్టం ఏర్పడింది. కాలేజీలో నోట్స్ ఇచ్చిపుచ్చుకోవడంతో ప్రారంభమైన పరిచయం మనసు ఇచ్చి పుచ్చుకోవడంవరకూ వెళ్ళింది. వాళ్ళిద్దరిలో ప్రేమ చిగురించిన తర్వాత ఎక్కడ చూసినా వాళ్ళ జంటే! శని ఆదివారాలు, సెలవులు వస్తే చాలు ఏ బీచ్కో, సినిమాకో వెళ్ళేవారు వాళ్ళిద్దరూ. వీళ్ళ చనువు చూసి కాలేజీలో అందరూ గుసగుసలాడుకోవడమే!
భవిష్యత్తు గురించి తీయని కలలు కంటున్న వాళ్ళిద్దరికీ అసలు సమయమే తెలియలేదు. చూస్తూ ఉండగానే పరీక్షలు కూడా పూర్తయ్యాయి. రోహిత్కి క్యాంపస్ సెలెక్షన్లో బెంగుళూరులో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరడానికి వెళ్తూ రోహిత్ అన్న మాటలే ఆమె చెవుల్లో ఇప్పటికీ మారు మోగుతున్నాయి.
"ఇంటికి వెళ్ళి మన ప్రేమ గురించి మా అమ్మా నాన్నలతో చెప్తాను. విశాల భావాలు గల వాళ్ళిద్దరూ మన పెళ్ళికి మనస్పూర్తిగా అంగీకరిస్తారు. పెళ్ళైన తర్వాత ఇక మన కాపురం బెంగుళూరులోనే!" అంటూ ఆ రోజు ట్రైన్ ఎక్కిన రోహిత్నుండి మరి ఫోన్లూ రాలేదు, ఏ సమాచారమూ అందలేదు. అతనికి ఫోన్ చేసి చేసి అలిసిపోయిన రోహిణి మనసులో చాలా అనుమానాలు మొలకెత్తాయి.
'తన రోహిత్ కూడా అందరి మగవాళ్ళలాంటి వాడేనా? తనతో బూటకపు ప్రేమ నటించి మోసం చేసాడా?' అని చాలా సార్లు అనుకుందామె.
మళ్ళీ తనే, ‘ఛ...ఛ...తన రోహిత్ అలాంటివాడు కాదు. ఏవో చెప్పుకోలేని ఇబ్బందుల్లో ఉండి ఫోన్ చెయ్యలేకపోయి ఉంటాడు. అతని ఇంట్లో పరిస్థితులేమిటో! ఇవాళో, రేపో ఫోన్ గానీ, మెసేజ్ గానీ రావచ్చు.’ అని రోహిత్ కోసం ఎదురు చూపులు చూస్తూనే ఉందామె.
అలా ఎదురు చూసి చూసి రోజులు గడుస్తున్నాయే తప్ప రోహిత్ నుండి ఎటువంటి కబురూ లేదు. ఈలోపున తను తల్లిని కాబోతుందని తెలియడంతో ఆమెలో ఆందోళన పెరిగింది. ఒక్క క్షణం కాళ్ళు చేతులు ఆడలేదు. ఏం చెయ్యాలో తెలియక వెళ్ళేముందు రోహిత్ తనకి ఇచ్చిన అడ్రెస్కి మళ్ళీ ఉత్తరం రాసింది. చివరి ఉత్తరం రాసి అప్పుడే వారం రోజులైంది, ఇంతవరకూ ఎలాంటి ఫోన్ గానీ, కబురు గాని రోహిత్ నుండి లేదు. ఆమె మదిలో బెంగ గూడు కట్టుకొంది.
రోహిత్ కూడా అందరి మగవాడి లాంటి వాడేనని ఓ నిర్ధారణకి వచ్చిందామె. తను అంత సులభంగా అతని వలలో ఎలా పడిపోయిందో అని చింతించింది. తను చాలా అమాయకంగా అతనికి తన మనసూ, తనువూ అర్పించిందే! తను వేసిన తప్పటడుగు తనకు శాపంగా మారబోతోందా?
తనని నమ్మించి మోసం చేసిన రోహిత్ మీద చాలా కోపం వచ్చిందామెకి. ఆమెలో భయం మొదలై రోజు రోజుకీ పెరిగిపోసాగింది. తల్లితండ్రులతో తనేం చెప్పగలదు?
వాళ్ళకి తన మొహం ఎలా చూపించ గలదు! తమ కుటుంబ గౌరవ మర్యాదలు ఏమైపోతాయి?
ఈ వార్త తెలిస్తే సంప్రదాయాలకు విలువనిచ్చే తన తల్లి తండ్రులు ఏమైపోతారు? ఇలా పలు రకాల ఆలోచనలతో ఆమె నిద్రకు దూరమై చాలా రోజులైంది. అంతా తన దౌర్భాగ్యం, అన్యాయానికి గురైన తనకి దారేదీ? ఆత్మహత్యే శరణ్యమా? ఆత్మహత్య తప్పితే మరో మార్గం లేదా?
ప్రేమికుల్ని నమ్మి మోసపోయిన ఎన్నో ఉదంతాల్ని తను విన్నది కానీ తనకే అలాంటి విషమ పరిస్థితి ఎదురవుతుందని ఆమె ఎన్నడూ అనుకోలేదు. రోజురోజుకీ బెంగతో భయంతో ఆమెకి మనస్థిమితం తప్పుతోంది.
ఆమె వాలకం చూసి ఓ రోజు తల్లి అడగనే అడిగింది, "ఏమైంది రోహిణీ, ఒంట్లో బాగులేదా!" అని.
"కొద్దిగా తలనొప్పిగా ఉందమ్మా!" అంటూ తలని రెండు చేతులతో పట్టుకొని తన రూముకి వెళ్ళి, తలుపులు వేసుకొని మంచంపై అడ్డంగా పడి చాలా సేపు రోదించింది. దిండు తడిసిందే తప్ప ఆమెకి ఎలాంటి పరిష్కారం గోచరించలేదు.
ఆలోచనలతో సతమతమవుతున్న రోహిణి తన సెల్ మోగేసరికి ఆతృతగా చూసింది, రోహిత్ వద్ద నుండి వచ్చిందేమోనని. ఏదో తెలియని నంబర్ నుండి వచ్చిన కాల్ అది. రోహిత్ బహుశా ఇంకో ఫోన్ నుండి చేస్తున్నాడేమోనని వెంటనే ఎత్తిందామె.
"హల్లో!...రోహిణి గారే మాట్లాడుతున్నారా?" అవతల వైపు నుండి గుర్తు తెలియని కంఠం వినిపించింది.
"అవును, ఎవరు మాట్లాడుతున్నారు?" అడిగిందామె ఫోన్ చేసిందెవరో తెలియక.
"నేనెవరో మీకు తెలియదు, కానీ మీ గురించి నాకు బాగా తెలుసు. రోహిత్ గురించి మీకో విషయం చెప్పాలని ఇక్కడికి రావలసి వచ్చింది. మిమ్మల్ని కలసుకోవడానికి వీలవుతుందా?" అన్నాడు ఆ అపరిచిత వ్యక్తి.
రోహిత్ పేరు వినగానే అంతులేని ఉద్వేగానికి గురైందామె. "రోహిత్ కూడా వచ్చాడా? నాతో నేరుగా మాట్లాడకుండా మిమ్మల్ని ఎందుకు పంపించాడు?" అని అడిగిందామె.
"ఆ విషయమే మాట్లాడాలని వచ్చాను. ఫోన్లో చెప్పే విషయం కాదిది! ఎక్కడ మిమ్మల్ని కలసుకోవడానికి వీలవుతుందో చెప్పండి ప్లీజ్!" అన్నాడు ఆ వ్యక్తి.
'తన కోసం రోహిత్ నుండి ఏం సందేశం అందించడానికి ఆ వ్యక్తి వచ్చి ఉంటాడు? అతను రోహిత్కి బంధువా, చుట్టమా, లేక స్నేహితుడా? తను ఇన్ని సార్లు ఉత్తరాలు రాసినా జవాబివ్వకుండా, ఫోన్ కూడా చెయ్యకుండా మరో వ్యక్తిని తనతో మాట్లాడటానికి పంపించడంలో రోహిత్ ఉద్దేశ్యం ఏమిటి? సదుద్దేశ్యం ఉంటే తనతోనే నేరుగా మాట్లాడవచ్చుగా?
తప్పనిసరి పరిస్థితిలో మరో పెళ్ళికి ఒప్పుకోవలసి వచ్చింది, తనని పూర్తిగా మర్చిపొమ్మని చెప్పి ఒప్పించడానికి ఇతన్ని పంపించాడా! తను స్వయంగా వచ్చి చెప్పడానికి మొహం చెల్లక మధ్యవర్తిని పంపించాడా!’ ఇలా పరిపరి విధాల ఆమె మనసు ఆలోచిస్తోంది.
"ఏమిటి ఆలోచిస్తున్నారు? నా మీద మీకేమైనా అనుమానముంటే నేనే మీ ఇంటికి వస్తాను." అని ఆతను అనడంతో, రోహిణి తడబడుతూ, "...వద్దు. నేనే సాయంకాలం నాలుగు గంటలకల్లా గాంధీ పార్క్కి వస్తాను." అంది రోహిణి.
"అలాగే! మీ కొరకు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను." అని ఫోన్ పెట్టేసాడా వ్యక్తి.
సాయంకాలం నాలుగు గంటల వరకూ స్థిమితంగా ఉండలేకపోయింది రోహిణి. మాటి మాటికి టైమెంతయిందో చూసుకుంటూ, మూడు గంటలయ్యేసరికే తల్లికి ఏదో చెప్పి ఇంటి నుండి బయటపడిందామె. అరగంట ముందే పార్కులో కూర్చొని రాబోయే ఆ వ్యక్తి కోసం ఎదురుచూస్తూ ఆలోచనలతో తలమునకలవుతూ ఉంది రోహిణి.
సరిగ్గా నాలుగు గంటలయ్యేసరికి ఆమె వద్దకు వచ్చాడు అతను. పొడుగ్గా ఆరడుగుల ఎత్తు ఉన్నాడు. కళ్ళద్దాలు ధరించి ఉన్నాడు. ఇంచుమించు రోహిత్ వయసే అని తెలుస్తోంది, అతను బహుశా రోహిత్ స్నేహితుడై ఉంటాడని అనుకొంది ఆమె మనసులో.
"మీరు...మీరు రోహిణే కదూ!...నేనే మీకు ఉదయం ఫోన్ చేసాను. నా పేరు ఆనంద్. నేను రోహిత్ స్నేహితుడ్ని." తనని పరిచయం చేసుకుంటూ అన్నాడు ఆ వ్యక్తి.
"చెప్పండి! మీకు రోహిత్ ఏం చెప్పి పంపించాడు? అతను వెళ్ళి రెండు నెలలైనా కనీసం ఒక్కసారి కూడా ఫోన్ చెయ్యలేదు, సరికదా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు. నన్ను ఇక్కడ ప్రేమించి మోసం చేసి అక్కడ మరో పెళ్ళి కోసం సిద్ధమయ్యాడా? తన గురించి నన్ను మర్చిపొమ్మని కబురు పంపించాడా?" అని సూటిగా అడిగిందామె కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరుగుతూ ఉండగా.
ఆమె కళ్ళల్లో నీళ్ళు చూసి ఓ క్షణం చలించిపోయాడు ఆనంద్. తల వంచుకున్నాడు మౌనంగా.
"మీ నోటంట వాస్తవం చెప్పడానికి మనసు రావడం లేదా?" అందామె ఆనంద్ వైపు చూసి బేలగా. ఓ క్షణం మౌనం రాజ్యమేలింది ఇద్దరి మధ్యా.
"అవును, వాస్తవం మీకు తెలియజేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. మీరనుకున్నట్లు రోహిత్ మోసగాడు కాదు. మిమ్మల్ని మనసారా ప్రేమించాడు. మీ గురించి ఎప్పటికప్పుడు నాకు అన్ని విషయాలు చెబుతూ ఉండేవాడు. రోహిత్ నాకు ఆప్త మిత్రుడు. మా ఇద్దరి మధ్యా ఏ రహస్యాలూ లేవు. మీరు రైలు ఎక్కించిన రోహిత్ అక్కడికి ప్రాణాలతో చేరుకోలేదు. స్టేషన్ నుండి నా రూముకి వస్తున్నప్పుడు టాక్సీ ఏక్సిడెంటుకి గురై తీవ్రంగా గాయపడి వారం రోజులపాటు కోమాలోనే ఉండిపోయాడు.
వారం రోజుల తర్వాత కోమాలోనుండి బయట పడి మీ పేరే తలుస్తూ ప్రాణాలు విడిచాడు. ఇదీ వాస్తవం! రోహిత్ సెల్ ప్రమాదంలో గల్లంతవడం వల్ల, మీ కాంటక్ట్ నంబర్ తెలియకపోవడం వల్లా మీకు ఈ విషయం చెప్పడం కుదరలేదు. అంతే కానీ, రోహిత్ మోసగాడు కాదు. మిమ్మల్ని అమితంగా ప్రేమించాడు. అక్కడికి వచ్చే ముందు తను మిమ్మల్ని త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నట్లు చెప్పాడు.” అంటున్న ఆనంద్ కళ్ళల్లో నీళ్ళు నిండాయి.
అతని మాటలు విన్న రోహిణి విభ్రాంతికి గురైంది. రోహిత్ ఈ లోకంలోనే లేడన్న నిజాన్ని గ్రహించడానికి ఆమెకి కొద్దిసేపు పట్టింది. ఆమెలో దుఃఖం కట్టలు తెంచుకుంది. రెండు చేతుల్లో మొహం దాచుకొని కుమిలికుమిలి ఏడ్చిందామె. అలా ఎంతసేపు ఏడ్చిందో ఆమెకే తెలియలేదు.
‘తన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది, ఇంక తనకి దిక్కేది?’ అని ఆమె మనసు ఆక్రోశించింది.
ఆమెని మౌనంగా చూస్తూ ఉండిపోయాడు ఆనంద్. చాలా సేపు అదే స్థితిలో ఉండిపోయింది రోహిణి. ఆమె బుర్ర పని చెయ్యడం మానేసింది.
కొద్ది సేపు ఆమెని అలా ఉండనిచ్చి ఆనంద్ నోరు తెరిచాడు. "మీరు ఏమీ అనుకోనంటే ఓ మాట చెప్తాను. బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి రండి." అన్నాడు ఆమె వైపే చూస్తూ.
అప్పటికే బాగా ఏడ్చిందేమో అంతా మసక మసకా కనిపిస్తోందామెకి. అతని వైపు చూసి నిశ్శబ్దంగా 'చెప్పండి!'అన్నట్లు చూసింది.
"మరో సారి చెప్తున్నాను. నేను ఇలా అన్నందుకు దయచేసి మరో విధంగా భావించవద్దు. బాగా ఆలోచించి మాత్రమే మీ నిర్ణయం చెప్పండి, తొందరేమీ లేదు." అని ఓ క్షణం ఆగి,
"మీ గురించి నాకు గత మూడేళ్ళగా తెలుసు. ఎలాగంటారా! రోహిత్ నాకన్నా రెండేళ్ళు చిన్నయినా మేమిద్దరమూ మంచి స్నేహితులం. మీకు కాలేజీలో నేను రెండేళ్ళు సీనియర్ని. అప్పట్లో రోహిత్ ఉండే వీధిలోనే రెండేళ్ళ క్రితం వరకూ నేను ఉండేవాణ్ణి. ఆ తర్వాత బెంగుళూరు వెళ్ళి జాబ్లో చేరాను.
మీకు నేను తెలియకపోయినా మీరు నాకు బాగా తెలుసు. కాలేజీ రోజుల్లో మీరంటే నాకు ఆరాధన ఉండేది. ఆ తర్వాత రోహిత్ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకొని నేను నా మనసు మార్చుకున్నాను. ఇవేవీ తెలియని రోహిత్ మీ గురించి సమస్తం నాతో చెప్పేవాడు. ఆ విధంగా మీ ఇద్దరి ప్రేమ గురించి నాకు పూర్తిగా తెలుసు.
తనకి ఇక్కడ జాబ్ రావడంతో నా రూముకే వచ్చి ఉండి ఇంకో ఇల్లు చూసుకుందామనుకున్నాడు. ఇంతలో ఈ ఘోరం జరిగిపోయింది. చనిపోయే ముందు కూడా నన్ను పిలిచి రోహిత్ మీ గురించి చెప్పి మీకేం కష్టం కలగకుండా చూసుకోమన్నాడు." అని ఊపిరి తీసుకోవడానికి ఓ నిమిషం ఆగాడు.
"మీకు అభ్యంతరం లేకపోతే...లేకపోతేనే...మీకు కొత్త జీవితాన్ని ప్రసాదించడానికి నేను ఉన్నానని గుర్తుంచుకోండి. తొందరేమీ లేదు, నిదానంగా ఆలోచించి మీ నిర్ణయం తెలపండి." అన్నాడు ఆనంద్ నెమ్మదిగా.
ముందు ఆమెలో ఆవేశం పెల్లుబికింది. ఆనంద్పై కోపం కూడా వచ్చింది. చురుగ్గా చూసిందతని వైపు. ఏ భావమూ వ్యక్తపరచకుండా స్వచ్ఛంగా ఉందతని ముఖం. నిర్మలంగా, స్థిరంగా ఉందతని భావం. రెండు నిమిషాల తర్వాత మామూలు మనిషైందామె.
"నా గురించి మీకు పూర్తిగా తెలియదు. నేనిప్పుడు..." అని ఆమె చెప్పబోతుంటే అడ్డుపడ్డాడతను.
"నాకు అన్నీ తెలుసు. మీ వద్ద నుండి వచ్చిన ఉత్తరాలేమీ చదవకపోయినా, సంస్కారం అడ్డువచ్చినా మీ ఆఖరి ఉత్తరం మాత్రం చదవక తప్పింది కాదు. అందులో మీ ఫోన్ నంబర్, అడ్రస్ ఉండటంతో మిమ్మల్ని ఇలా కలవగలిగాను. నా తరఫు నుంచి నేను పూర్తి హామీ ఇస్తున్నాను. పుట్టబోయే రోహిత్ బిడ్డకి తండ్రిగా బాధ్యత వహించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మనస్పూర్తిగా నేను ఆ బాధ్యత తీసుకుంటాను.
ఎటొచ్చీ, ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడం మీ వంతు! మీ నిర్ణయం ఏదైనా, నా హృదయంలో మీ కోసం ఎప్పుడూ పవిత్రమైన స్థానం ఉంటుందని మర్చిపోకండి. ఆలోచించండి! నా ఫోన్ నంబర్ ఎలాగూ మీవద్ద ఉంది." అని తను చెప్పవలసింది అంతా చెప్పేసి, ఆమె నుండి సెలవు తీసుకున్నాడు ఆనంద్.
ఒక్క క్షణం స్థాణువు అయింది రోహిణి. ఆలోచనలతో తన తల పగిలిపోతోందా అని అనిపించింది. అలా అక్కడ ఎంత సేపు కూర్చుందో ఆమెకే తెలియదు. ఆమె మనసులాగే హఠాత్తుగా ఆకాశంలో మేఘాలు కమ్ముకొని చినుకులు పడనారంభించాయి. వడివడిగా ఇంటివైపు అడుగులు వేసిందామె ఆలోచనల భారంతోనే.
ఆ రాత్రంతా నిద్రకు కరువైందామె. ఏ నిర్ణయం తీసుకోవాలా అని చాలా సేపు మధనపడి, తెల్లవారుతుండగా ఓ స్థిర నిశ్చయానికి వచ్చి, ఆనంద్కి మెసేజ్ పెట్టి, ఆ తర్వాత నిశ్చింతగా నిద్రపోయిందామె.
తెల్లవారిన తర్వాత తనకి వచ్చిన సందేశం చూసిన ఆనంద్ ఆనందంగా రోహిణి ఇంటికి వెళ్ళాడు ఆమె తల్లి తండ్రులతో మాట్లాడటానికి.
***
పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.
Comments