top of page

నిత్య పెళ్ళికొడుకు


'Nithya Pellikoduku' New Telugu Story


Written By Lakshmi Sarma Thrigulla


'నిత్య పెళ్ళికొడుకు' తెలుగు కథ


రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ


(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


"అబ్బో ఇంత అందమా.. నేనిప్పటివరకు ఇలాంటి అందం చూడనేలేదు, పూతపోసిన బంగారంలా ఉంది," పైకి వినిపించేలా అంటున్నాడు చరణ్. తనకు రెండడుగుల దూరంలో నిలుచున్న ముప్పయి నలుబది మధ్య వయసులో ఉన్న శ్రావణిని చూసి. ఆమెను చాలాసార్లు బస్టాండులో చూసాడు. అందగత్తె, పైగా కొంచెం ఉన్నతురాలులాగా ఉంది. ఎలాగైనా ఆమెతో పరిచయం పెంచుకోవాలను కున్నాడు. ఆమె గురించి వాకబు చేసాడు.పెళ్ళై ఒకబాబుకు తల్లి అని కూడా తెలుసుకున్నాడు. శ్రావణికి వినిపించికూడా విననట్టే ఊరుకున్నది. ఎవరినుద్దేశించి మాట్లాడుతున్నాడో నాకేం పని అనుకున్నది. "హలో మేడమ్ మిమ్మల్నే.. మీలాంటి అందగత్తెలు మాతో మాట్లాడకూడదా, ముత్యాలు ఏమైనా రాలితే ఏరుకుంటాం లేండి, " అన్నాడు ఆమెకు మాత్రమే వినిపించేలా. చటుక్కున అతనివైపు తిరిగింది శ్రావణి. "ఏంటి ఆడవాళ్ళు కనిపించగానే మీ ఇష్టం వచ్చినట్టు వాగడమేనా? నీకు అక్కాచెల్లెళ్లు లేరా? కళ్ళుమూసుకపోయాయా.. పిచ్చివేషాలు వేషావంటే పోలీస్ కంప్లయింట్ ఇస్తా, " అంటూ గట్టిగా దబాయించింది. "అబ్బా.. ఏంటండి.. నేనేదో మిమ్మల్ని అల్లరి చేసినట్టు తెగ కంగారుపడుతున్నారు.. నేను పుట్టి బుద్దెరిగినప్పటి నుండి ఇంత అందమైన వాళ్ళను చూడలేదు. ఆనందం తట్టుకోలేక పైకి అనేసాను. నేనేం రౌడివెధవను కానులెండి. ఆడవాళ్ళంటే నాకు చాలా గౌరవం. చక్కగా ఉద్యోగం చేసుకుంటున్న బుద్దిమంతుడిని. అందంగా ఉందని తాజ్‌మహల్ ను చూస్తాము. అందమైన గులాబీని ఏరికోరి మనసైన వాళ్ళకు ఇచ్చుకుంటారు. ఇదికూడా తప్పేనంటే ఏం చేస్తాం చెప్పండి, "ముఖం బేలగా పెడుతూ అన్నాడు. "సారీ అండి.. నేను తొందరపడి మిమ్మల్ని అపార్ధం చేసుకున్నాను. మీరు అలా అనేసరికి కోపం తట్టుకోలేకపోయాను. ఇంతకు మీరేం చేస్తారు .. అదేనండి ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు, " అడిగింది శ్రావణి. అతను బాధపడుతుండడం చూసి మంచివాడిలాగే ఉన్నాడనుకుని మాట కలిపింది. ‘అమ్మయ్యా.. మొత్తానికి మాట కలిపింది. ఇక చూసుకో నా తడకా..’ అనుకుంటూ లోపల సంబరపడిపోతూ. "నేను బ్యాంకులో ఉద్యోగం చేస్తాను. రోజు ఇదే బస్టాపులో నిలబడతాను. కానీ మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు ఇంతవరకు.. మిమ్మల్నే కాదు, ఇంతవరకు నేను ఏ ఆడపిల్లను కన్నెత్తి చూడలేదంటే మీరు నమ్ముతారా? చెప్పండి, " అమాయకంగా ముఖంపెట్టి అడిగాడు. అతని అమాయకత్వాన్ని చూసి పక్కున నవ్వింది శ్రావణి. “అబ్బా.. ఈ కాలంలో కూడా ఇంత అమాయకులు ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది, " అంది ఇంకా నవ్వుతూనే. "ఆగండాగండి.. నా దోసిలి పట్టనివ్వండి, ముత్యాలన్ని కిందపడిపోతాయేమో, " అంటూ దోసిలి తెచ్చి శ్రావణికి దగ్గరగా పెట్టాడు. ఆశ్చర్యంతో చరణ్ వైపు చూడసాగింది. పెళ్ళైనప్పటినుండి ఇప్పటివరకు ఏ ఒక్కరోజు కూడా తను అందంగా ఉన్నానని అన్నపాపాన పోలేని తన భర్తను గుర్తు తెచ్చుకుని బాధపడుతుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. "ఏమండి.. నా మీద కోపంగా ఉందా? ఎందుకండి.. ఆ కన్నీళ్ళు? నేనేమన్నా తప్పుగా మాట్లాడానా,.. "అడిగాడతను. "అబ్బే, అదేంలేదు.. ఇవి కన్నీళ్ళు కాదు. కళ్ళల్లో ఏదో పడినట్టయింది. ఆ.. ఇంతకు మీరెక్కడుంటారు? చెప్పలేదు.. " అంది. ఇంతలో బస్ రావడంతో "ఓకే, రేపు కలుద్దాం,” బస్సెక్కుతూ చెప్పింది. "మేడమ్.. మీ ఫోన్ నెంబర్ ఇస్తారా, "బస్సు కిటికీ దగ్గరకు వచ్చి అడిగాడు. "రేపు వచ్చినప్పుడు ఇస్తాను, "చెయ్యి ఊపుతూ చెప్పింది. ఈల వేసుకుంటూ ఆనందంగా గంతులు వేసుకుంటూ రేపటి గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోయాడు చరణ్. శ్రావణి బస్సెక్కినప్పటి నుండి అతని మాటలు తలుచుకుంటూనే ఉంది. ఇంటికి వెళ్ళాక కూడా అద్దం ముందు నిలుచొని తదేకంగా చూసుకోసాగింది తన అందాన్ని. "ఏంటీ.. ఈరోజు వింతగా చేస్తున్నావు ? నీ అందాన్ని ఏ అడ్డగాడిదైనా పొగిడినట్టున్నాడు. అందుకేనా మురిసిపోతూ చూసుకుంటున్నావు, "వెనకనుండి ఎప్పుడు వచ్చాడో ఏమో హేళనగా అడిగాడు శ్రావణి భర్త మధు. "నువ్వెలాగు నా గురించు పట్టించుకోవు. బయటవాళ్ళు పొగిడితే నీకెందుకంత ఆరాటం? అయినా నాకదే పని.. నాగురించి ఎవరు పొగుడుతున్నారు.. ఎవరు నాతో మాట్లాడుతారు.. అని ఎదిరి చూడడమే నాపని, "విసురుగా తన పొడవాటి జడను వెనుకకు విసురుతూ అంది. "ఏంటి నోరు బాగానే లేస్తుంది? అందుకే ఆడది బయట తిరిగితే ఏకు మేకవుతుంది అని, ఉద్యోగం వద్దు అన్నాను. విన్నావా.. వినవు. ఇలా తయారవుతావనే బయటకు పంపరు ఆడవాళ్ళను, " శ్రావణి ముందుకు వచ్చి ముఖంలో ముఖం పెట్టి అడిగాడు. ‘ఛీ ఛీ.. నువ్వు మారవు. నీ అనుమానం పోదు. నీకు ఎదురు సమాధానం చెప్పే బదులు ఏదో ఒకటి చెప్పి పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడం మంచిది’ అనుకుంటూ, "అదేంలేదు, మా ఆఫీసులో కొత్తగా ఒకమ్మాయి వచ్చింది. తనకు దగ్గరుండి చెయ్యవలసిన పనులు చెప్పేసరికి లేటయింది అంతే, "అంటూ స్నానం చెయ్యడానికి వెళ్ళిపోయింది. ఇక్కడే ఉంటే ఏం అడుగుతాడోనని. రాత్రంతా చరణ్ అన్న మాటలే గుర్తుకు వచ్చినప్పుడల్లా, ఏదో తెలియని అనుభూతితో పులకించిపోయింది శ్రావణి మనసు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా.. ఆఫీసుకు వెళ్ళి వచ్చేటప్పుడు అతన్ని కలవాలి అని మనసులో ఆత్రంగా ఉంది. "హయ్, " ఆఫీసునుండి బస్టాండుకు వచ్చిందో లేదో ఆ గొంతు వినిపించగానే, నాదస్వరం విన్న నాగినిలా చివ్వున అటువైపు తిరిగి చూసింది ఆశ్చర్యంతో. "ఏంటండి అలా ఆశ్చర్యపోతున్నారు? వీడు మళ్ళి వస్తాడోలేదో అనుకున్నారా ఏంటి? నిజం చెప్పాలంటే మిమ్మల్ని చూసినప్పటినుండి రాత్రంతా కంటిమీద నిద్రలేదంటే నమ్ముతారా మీరు.. కళ్ళు మూసుకుంటే చాలు కళ్ళు చెదిరిపోయే మీ అందం నిలువనీయలేదంటే ఒట్టు. అబ్బ.. ఇంతందంగా పుట్టించి నాకు కనిపించేలా చేశాడు చూడు.. ఆ దేవుడికి ఎన్ని దండాలు పెట్టినా తక్కువేనేమో! " తియ్యటి మాటలతో శ్రావణిని మైమరింపచేసాడు. "నన్ను మరీ ఆకాశానికి ఎత్తుతున్నారు. అదంతా మీరు చూసే మీ కళ్ళ ప్రభావం కావచ్చు. మీరనుకున్నంత అందగత్తెను కాను, " అంది సిగ్గుపడుతూ. "అయ్య బాబోయ్.. అంటే నేను చెప్పేవన్ని అబద్దాలు అనుకుంటున్నారా? అంతేలెండి.. మీలాంటి వాళ్ళు గొప్పలకు పోరు. ఏంటండి.. ఇక్కడ నిలబడి మాట్లాడుకునే బదులు అలా నడుచుకుంటూ వెళ్ళి కాస్త కాఫీ తాగుదాం పదండి, " అన్నాడు అడుగు ముందుకువేస్తూ. "అమ్మో! ఇంకా నయం.. లేటుగా వెళితే మా ఆయన చంపేస్తాడు బాబు.. ఇంకోసారెప్పుడన్నా వెళదాము. మా బాబు కూడా నాకోసం ఎదిరిచూస్తుంటాడు." అంది. "శ్రావణిగారు.. మొదటిసారి అడుగుతున్నప్పుడు కాదనకండి. తొందరగానే వెళుదురుగాని.. నా మాటకాదనకండి. నన్ను చులకన చేసారనే బాధతో ఈ రాత్రంతా నిద్రపట్టదు, " అన్నాడు బాధపడుతూ. "నాకు భయంగా ఉంది. ఎవరైనా చూస్తారేమోనని.. " మొహమాట పడుతూనే అతనితోపాటుగా నడకసాగించింది. కాఫీ తాగాక ఫోన్ నెంబర్లు తీసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. సరియైనా సమయానికి రావడం వల్ల మధు ఏమి అనలేదు. ‘అమ్మయ్యా’ అంటూ ఊపిరి తీసుకుని బాబుని దగ్గరకు తీసుకుంది. ఇక ఆరోజునుండి మొదలు.. ఇద్దరు ఫోన్ లో చాటింగ్ చేసుకోవడాలు.. చాటుమాటుగా ఫోన్ మాట్లడుకోవడం.. రోజు ఆఫీసు అయిపోతూనే కాఫీ తాగడం.. కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకోవడం పరిపాటయిపోయింది. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తున్నంతసేపు ఎవరు చూడలేదనుకుంటుంది. చూసినప్పుడే దాని వీపు మోగిపోతుందని తెలియనట్టే వీళ్ళకు తెలియడం లేదు. మధు ఏది అడిగిన పెడసరంగా జవాబివ్వడం, ఇంటికి లేటుగా రావడం ఎందకిలా చేస్తుందో అర్దంకావడం లేదు మధుకు. బాబును పట్టించుకోవడం తగ్గించింది. ఉండబట్టలేక ఓకరోజు నిలదీసాడు శ్రావణిని. "శ్రావణి .. నేను నీతో మాట్లాడాలి. మనం ప్రశాంతంగా మాట్లాడుకొని చాలా రోజులవుతుంది. కాసేపు ఇలా కూర్చుంటావా?" అడిగాడు. ‘ఏంటి మాట్లాడేది’ అన్నట్టుగా చివ్వున తలెత్తి భర్తవైపు చూసింది. "చూడు .. నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాను అవునా?” శ్రావణి వైపు చూస్తూ అడిగాడు. "అవును.. అయితే ఏంటి ఇప్పుడు కొత్తగా మాట్లాడేది.. మనిద్దరం మాట్లాడుకున్నామంటే గొడవ తప్పితే సామరస్యం ఉండదు కదా! నాకు గొడవ పడడం ఇష్టంలేదు. నా పని నన్ను చేసుకొని, "అంది అటువైపు తిరిగి కూరలు తరుగుతూ. "అంటే గొడవలన్ని నావలనే వస్తున్నాయంటావా? నీ తప్పేమి లేదా? ఇప్పుడు కాదు, మన పెళ్ళి నాటి నుండి కూడా నువ్వు మనస్పూర్తిగా నాతో మాట్లాడిందే లేదు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నదానిలా ఉంటావు. నిన్ను సంతోష పెట్టటానికని నువ్వు అడగకుండానే బంగారం కొన్నాను. ప్రతి పండగకు నీకు నచ్చిన చీరలు కొనిస్తాను. నువ్వు బాధపడకూడదని నువ్వేదడిగినా కాదనకుండా చేసాను. నువ్వు ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడినా సహించుకున్నాను. ఈ మధ్య నీ ప్రవర్తన వింతగా కనిపిస్తుంది. అడిగితే అడ్డదిడ్డమైన సమాధానం చెబుతున్నావు. అందుకే నేను నిన్ను కసురుకుంటున్నాను కానీ తరువాత నాలో నేనే కుమిలిపోతున్నాను, నిన్ను బాధపెడుతున్నానని. చెప్పు శ్రావణి.. ఎందుకిలా చేస్తున్నావు?"అడిగాడు శ్రావణిని. నిర్లక్ష్యంగా భర్త వైపు చూస్తూ "ఏముంది చెప్పడానికి.. నేను మామూలుగానే ఉన్నాను. పచ్చ కామెర్లవాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు"నీ కళ్ళకు అన్నీ అలానే కనిపిస్తాయి, నీకు కోపం వచ్చినప్పుడు నువ్వేదన్న సహించుకోవాలి. నీకు భార్యవసరం తప్పా మనిషిని అర్ధం చేసుకునే మనస్తత్వం లేదు. కుక్కలకు బిస్కెట్లు వేస్తే తోక ఊపుకుంటూ వెంబడి తిరిగినట్టు, ఆడవాళ్ళకు బట్టలు బంగారం కొనిస్తే ఏమన్నా పడివుంటారనుకుంటారు నీలాంటి మగవాళ్ళు. భార్యంటే బానిసలా పడివుండాలి అనుకునే నీలాంటి వాళ్ళకు, కట్టుకున్న భార్యను ఎలా సంతోష పెట్టాలి తెలిస్తే కదా! ‘మొరటోడికేం తెలుసు మొగలి పువ్వు వాసన’ అన్నట్టు నీకు వ్యవసాయంలోనే తృప్తి. మట్టి పిసుక్కునే నీకు మగువ మనసు ఏం తెలుసు, " అంటూ చకచక వంటగదిలోకి వెళ్ళిపోయింది. శూలాల వంటి మాటలు గుండెలొ కుచ్చుకున్నట్టయ్యాయి మధుకు. ‘నిజంగా నేను తనను ప్రేమగా చూసుకోవడం లేదా! తనకేం తక్కువ చెయ్యట్లేదే, ఎందుకో తను పూర్తిగా మారిపోయింది. చూడాలి తన మార్పుకు కారణమేంటో..’ తనలో తానే బాధపడుతూ బయటకు వెళ్ళిపోయాడు. చరణ్, శ్రావణిల చాలా దగ్గరయ్యారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి వచ్చింది. చూచాయగా మధుకు తెలుస్తూనే ఉంది వాళ్ళ వ్యవహారం. నలుగురు నోళ్ళల్లా పడకముందే శ్రావణిని కాపాడుకోవాలి అనుకున్నాడు. కానీ మధు మాట్లాడే ప్రతి మాటకు వేరే అర్ధం చేసుకుని గొడవచేస్తుంది శ్రావణి. నమ్మకం లేకపోతే చచ్చిపోతాను అని బెదిరిస్తుంది. ఏం చెయ్యాలో తోచక తలమునకలవుతున్నాడు ఎలా మార్చుకోవాలో. "హలో హలో చరణ్ .. ఏమైంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడం లేదు, అంత తీరికలేకుండా ఏం చేస్తున్నావు? ఈ మధ్యన చాలా గమనిస్తున్నాను.. నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావనిపిస్తుంది, " అంది. "అరే శ్రావణి.. ఎందుకలా మాట్లాడుతున్నావు? ఎంతసేపు నీ చుట్టు తిరగాలంటే నాకు వేరే పనులుండవా చెప్పు? అయినా నువ్వు ఫోన్ చెయ్యగానే ఎత్తకపోతే నిన్ను పట్టించుకోనట్టేనా.. సరే ఇంతకు ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. నాకు కొంచెం అర్జంటు పని ఉంది, " అన్నాడు కొంచెం కసురుతున్నట్టు. "చూసావా చరణ్ .. నీ మాటల్లోనే తేడా కనిపిస్తుంది, నువ్వు కనిపించి నాలుగురోజులవుతుంది. ఫోన్ చేస్తే ఎత్తవు. ఇప్పుడేమో ఇలా అంటున్నావు. నీకు నేనంటే మోజు తీరిపోయింది కదూ! నేనేమో నీకోసం రోజు ఎదిరి చూస్తున్నాను. అంతేలే.. అవసరం తీరిపొయ్యాక నన్ను వదిలేస్తున్నావు, " అంటూ తన మనసులోని బాధను వెళ్ళగక్కుతూ ఎడవడం మొదలుపెట్టింది. "ఇదిగో.. నాకు ఇలా ఏడిచే ఆడవాళ్ళంటే ఇష్టముండదు. శ్రావణి .. నాకు తెలియక అడుగుతాను.. నేనేమన్నా నీకు శాశ్వతంగా ఉంటానని మాటిచ్చానా. లేదే! ఏదో మాటలు కలిసాయి.. కొన్ని రోజులు ఇద్దరం హాయిగా గడిపాము. ఎంతసేపు పాత చింతకాయ పచ్చడే తినాలంటే నావంటికి సహించదు. నీకెలాగు మీ ఆయన ఉన్నాడు. అతనితో తిరుగు సరిపోతుంది. కాదు కూడదంటావు.. ఇంకా ఎవరైనా నాలాంటి వాడు దొరక్కపోడు, ప్రయత్నించి చూడు, " అన్నాడు. శ్రావణి ఆవేశం తట్టుకోలేకపోయింది. కసి కొద్ది చరణ్ చెంప పగలగొట్టింది. "నీది నోరా పెంటకుప్పనా.. నోటికెంతొస్తే అంత మాట్లాడుతావా? అసలు నువ్వు మనిషివేనా? నా మానాన నేను బ్రతుకుతుంటే కల్లబొల్లి మాయమాటలు చెప్పి నన్ను మోసం చేసావు. నా దగ్గరున్న బంగారమంతా లాగేసుకున్నావు. నా భర్తకు నాకు విరోధం కల్పించావు. ఇన్ని చేసిన నువ్వు ఇప్పుడు నన్ను వద్దంటున్నావు. ఇప్పుడు నేనేమైపోవాలి? నన్నెవరు ఆదరిస్తారు, " అంటూ రెండుచేతులలో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఎడుస్తుంది శ్రావణి. నిమ్మకు నీరెత్తిన వాడిలా జేబులో చెయ్యిపెట్టుకుని ఒకచేత్తో సిగరేటు కాలుస్తూ నిలబడ్డాడు చరణ్. "చరణ్ .. నువ్వెందుకు ఇలా మారిపోయావు, నేనంటే ప్రాణం అన్నావు నేను లేకపోతే బతకలేనన్నావు. నాకు ఏ లోటు రాకుండా చూసుకుంటానన్నావు కదా! ఏమైంది.. ఎందుకు మారిపోయావు, ఏ ముఖం పెట్టుకుని నా భర్తతో కలిసుండాలి? నా కోసం ఎన్ని చేసాడు నా భర్త .. అలాంటి వాడిని కాదని, నీ మాటలు నమ్మి నా కాపురంలో నిప్పులు పోసుకున్నాను. ఇప్పుడు నువ్వు కాదంటే నాకు చావే శరణ్యం " కోపంతో పిచ్చిగా అరుస్తూ పరుగెత్తింది చనిపోవడానికి సిద్ధపడుతూ. "పో పో.. నీలాంటి బెదిరించే వాళ్ళను చాలా మందిని చూసాను. మొరిగే కుక్క కరవదు అన్నట్టు నీ గురించి నాకు తెలియదనుకున్నావా, " అంటూనే తన బండి స్టార్టు చేసాడు వెళ్ళిపోవడానికి. అంతలోనే వెనకనుండి పోలీసులు వచ్చి. "ఎక్కడిపోతావు నిత్య పెళ్ళి కొడుకా.. నీ భాగోతం బయటపడింది. పద కటకటాల్లో ఊచలు లెక్కపెడుదువుగానీ, ఎన్నాళ్ళుగానో నీకోసం వెదుకుతున్నాము. తప్పించుకొని తిరిగుతున్నావు, " చేతులకు బేడీలు వేస్తూ అన్నాడు పోలీసు. "ఇదేంటి.. నేనేం తప్పు చేసానని నాకు బేడీలు వేస్తున్నారు? మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో.. నాకే పాపం తెలియదు, "అమాయకుడిలా నటిస్తూ అన్నాడు. "అవునవును నువ్వు చాలా అమాయకుడివని మాకు తెలుసు. నిత్య పెళ్ళికొడుకులా ఇప్పటివరకు ఎంతమంది అమ్మాయిలను మోసం చేసావో పోలీసు స్టేషనుకు పోతే నీ చిట్టా మొత్తం విప్పుతారు. అప్పుడు చెబుదుగాని నువ్వు అమాయకుడివని.. ఇప్పటికి ఎంతమంది ఆడపిల్లల గొంతుకోసావు.. అన్ని బయటకు వస్తాయి పద పద, " జీపు ఎక్కిస్తూ హేళనగా అన్నాడు పోలీసు. ‘పోలీసులకు ఎలా తెలిసిందబ్బా.. శ్రావణి ఇప్పటివరకు నాతోనే ఉంది కదా! మరింకెవరు చెప్పి ఉంటారు’ కటకటాల్లో కూర్చొని ఆలోచిస్తున్నాడు చరణ్. "ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? నీ గురించి పోలీసులకు చెప్పింది ఎవరా అని కదూ.. నేనెవరో తెలియదు కదా నీకు, చక్కగా కాపురం చేసుకుంటున్న మనిషి జీవితంతో ఆడుకుని మోసం చేసావు చూడు.. ఆ శ్రావణి భర్తను. మీరిద్దరు మాట్లాడుకోగా నేనంతా విన్నాను. అందుకే నిన్ను పోలీసులకు పట్టించాను. ఇప్పటికైనా అర్ధమైందనుకుంటాను. ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటే ఎప్పటికైనా శ్రీ కృష్ణ జన్మస్థానం తప్పదని. శ్రావణి అదృష్టం బాగుంది కాబట్టి సమయానికి తనను కాపాడుకోగలిగాను. అవును కదూ శ్రావణి, "భార్యను దగ్గరకు తీసుకుంటూ అడిగాడు మధు. "నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేసాను. " వంగి భర్త కాళ్ళను పట్టుకుని అడిగింది శ్రావణి. రెండుచేతులతో భార్యను లేవనెత్తి గుండెలకు అదుముకున్నాడు. గువ్వలా ఒదిగిపోయింది శ్రావణి. ॥॥శుభం॥॥

లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.










































57 views0 comments
bottom of page