top of page

'నీవు నేర్పిన విద్యయే' అనే 'బూమరాంగ్'


'Nivu Nerpina Vidyaye Ane Boomerang' New Telugu Story

Written By Sripathi Lalitha

'నీవు నేర్పిన విద్యయే అనే బూమరాంగ్' తెలుగు కథ

రచన: శ్రీపతి లలిత


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


"అర్చనా ! సాయంత్రం నారాయణ అంకుల్ పోయారు." సావిత్రి కూతురుకి ఫోన్ చేసి చెప్పింది. నారాయణగారు, సావిత్రి భర్త రామారావు గారు, ఒకే కంపెనీలో పనిచేసి ఒకే కాలనీలో ఉంటారు. దాదాపు 30 ఏళ్ళ నుంచి పరిచయం. రెండు కుటుంబాలు బాగా కలిసి మెలిసి ఉంటారు. సావిత్రి కంటే నారాయణగారి భార్య విజయ చిన్నదే కానీ, ఇద్దరూ ఏవైనా కొనడానికి వెళ్లడం, కిట్టీలకి వెళ్లడం కలిసే చేస్తారు. సావిత్రి కూతురు అర్చన, విజయ కూతురు సుమన, కొడుకులు ఆకాష్, రవి, ఒకటి, రెండు ఏళ్ళ తేడాలో ఒకే వయసు వాళ్ళు, స్నేహితులు. "అయ్యో! ఎలాగమ్మా? మొన్న నేను వచ్చినప్పుడు కూడా కలిసాను. పాపం విజయ ఆంటీ ఎలా ఉన్నారు? వాళ్ళ అబ్బాయి రవి అమెరికా నుంచిరావాలేమో." హడావిడిగా అంది అర్చన. "బయలుదేరారుట, వాళ్ళు వచ్చాకే అన్నీ మొదలు. అప్పటిదాకా బాడీ మార్చురీలో పెడతారట. ఏమిటో పాపం.. అంతా అప్పటికప్పుడు అయిపొయింది. మధ్యాన్నం భోంచేసి పడుకున్న మనిషి అలాగే మరి లేవలేదు. సుమనా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు కనుక కొంచెం నయం అనుకో. నువ్వు రేపు ఒకసారి వచ్చి వెళ్ళు" చెప్పిన సావిత్రి తో. "అయ్యో నువ్వు చెప్పాలా? పిల్లల్ని కాలేజీకి పంపాక వస్తాను" అంది అర్చన. సావిత్రి, రామారావులకి ఇద్దరు పిల్లలు. అర్చన, ఆకాష్. ఆకాష్ వాళ్ళు తల్లితండ్రుల తోనే ఉంటారు. అర్చన ఈ ఊళ్ళోనే కొద్దిగా దూరంగా హైటెక్ సిటీలో ఉంటుంది. విజయ, నారాయణలకి ఇద్దరు పిల్లలు. సుమన, రవి. రవి కుటుంబం అమెరికాలో ఉంటుంది. సుమనకి ఇద్దరు పిల్లలు. భర్త వ్యాపారం. పిల్లలు డిగ్రీ చదువుతున్నారు. రామారావు, నారాయణ పనిచేసే కంపెనీలో బయట ఊర్లకి టూర్లకు వెళ్లాల్సి వచ్చేది. కుటుంబాన్ని వదిలి 2, 3 నెలలు వేరే ఊరు వెళ్లడం అంత ఇష్టపడని రామారావు గారు, తప్పనిసరి అయితే, ఏడాదికి ఒకసారి ఓ పది రోజులు వెళ్లేవారు, కానీ అదే అవకాశం కోసం చూసే నారాయణ లాంటివాళ్లు ఏడాదికి తొమ్మిది నెలలు క్యాంప్లోనే ఉండేవారు. విజయ తల్లి తండ్రులు కూడా ఇదే ఊర్లో ఉండేవారు. విజయ తండ్రి ఏదో చిన్న ఉద్యోగం. కష్టపడి ఒక ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు. విజయకి ఒక అన్న. అన్న ప్రభుత్వ ఉద్యోగం. తల్లి, తండ్రికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడని కొడుకును దూరం పెట్టారు విజయ తల్లి తండ్రులు. విజయను చిన్నప్పటినుంచి తల్లి, తండ్రి బాగా గారాబంగా పెంచారు. పెద్ద చదువు లేకపోయిన పని కూడా అలవాటు లేదు. పద్దెనిమిదికే పెళ్లి చేసారు. ఇరవైకి ఇద్దరు పిల్లలు. తను నారాయణగారి కంటే పది ఏళ్ళు చిన్నది. ఆయన నల్లగా పొడుగ్గా ఉంటే, విజయ తెల్లగా సన్నగా పొట్టిగా ఉండేది. అయన బావుండక పోయినా, మంచి ఉద్యోగం అని విజయని ఇచ్చి పెళ్లి చేసారు. చక్కటి భార్య, వయసులో చిన్నది అని నారాయణ కూడా బాగా గారాబం చేసేవారు. ఆయన క్యాంపుకి వెళ్ళగానే పిల్లలని తీసుకుని పుట్టింటికి వెళ్ళేది విజయ. పిల్లలు స్కూల్లో చేరే వయసు వచ్చాక అక్కడ స్కూల్ లోనే చేర్పించి తల్లి గారింట్లోనే ఉండిపోయింది. కూతురిని డబ్బులడగడం ఇష్టంలేక విజయ తండ్రే కష్టపడి ఇల్లు నడిపేవాడు. విజయ మాత్రం పైసా బయటికి తీసేది కాదు. విజయ అన్నగారు డబ్బులకి ఇబ్బంది పడుతున్నాడని తెలిసినా, అతనికి తండ్రి నుంచి ఏ సాయం అందలేదు. విజయ తత్త్వం తెలిసిన సావిత్రి అనుకునేది, తల్లి, తండ్రి కొద్దిగా అన్నవేపు మెత్తబడ్డా విజయ పడనిచ్చేది కాదు అని. భర్త జీతం, క్యాంపులకి వెళ్లినందుకు వచ్చే పై డబ్బులతో విజయ బంగారం కొనేది. నెమ్మదిగా ఆఫీసులో అప్పు తీసుకొని, విజయ, నారాయణ రెండు అంతస్తుల ఇల్లు కట్టి, పై వాటాలు అద్దెకి ఇచ్చారు. ఇల్లు కట్టేటప్పుడు కూడా, విజయ కొంత డబ్బు తండ్రి దగ్గరనుంచి తెచ్చింది. పిల్లలు కాలేజికి వచ్చాక విజయ కుటుంబం సొంత గూటికి చేరారు. కొడుకు చదువు, కూతురి పెళ్లి అయాక విజయ తల్లి ఇంటికి వెళ్లడం కొంత తగ్గింది. రవి అమెరికా వెళ్ళాడు. అక్కడే ఉద్యోగం వచ్చి స్థిరపడ్డాడు. అతని భార్య కూడా ఉద్యోగం చేస్తుంది. ఇద్దరు పిల్లలు. రవి వెళ్లిన రెండో రోజే, సుమన, భర్త, పిల్లల్తో విజయ దగ్గరికి వచ్చేసింది. పిల్లలని ఇక్కడ స్కూల్లో చేర్పించింది. ఒకొక్కసారి సావిత్రి దగ్గర వాపోయేది విజయ " పిల్లలతో వచ్చేసారు. ఒక్క పైసా తియ్యదు సుమన, ఎలా సావిత్రీ! ఉన్న డబ్బులన్నీ వీళ్ళకే అయిపోతున్నాయి." అంటూ. సావిత్రికి నాలిక చివరిదాకా వచ్చేది. 'నువ్వు చేసిన పనే నీ కూతురు చేస్తోంది' అని. సావిత్రికి వాళ్ళ విషయాల్లో ఎక్కువ కల్పించుకుని మాట్లాడడం ఇష్టం ఉండేదికాదు. అందుకే ఏమీ అనలేక నవ్వి ఊరుకునేది. అకస్మాత్తుగా ఒకరోజు విజయ తండ్రి చనిపోయాడు. ఇంతకాలం విజయ చూస్తోంది కదా తల్లి ఇక్కడికి వస్తుంది అనుకుంది సావిత్రి. ఇన్నిరోజులు పుట్టుకు రాని ప్రేమ అన్న మీద వచ్చింది విజయకి. తండ్రి కార్యక్రమాలకి పిలిచి తల్లి బాధ్యత అప్పచెప్పింది. తండ్రి సంవత్సరీకాల సమయంలో విజయ అన్న "విజయా! నా ఉద్యోగం చిన్నది. తక్కువ జీతంలో ఇద్దరు పిల్లల చదువులు, మిగిలిన ఖర్చులు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అమ్మ బాధ పడుతుందని ఈ కార్యక్రమం, కానీ నాకు శక్తికి మించినది, నువ్వు అమ్మ ఖర్చు కోసం నెల, నెలా ఏదైనా సాయం చెయ్యి" అడగలేక అడిగాడు. "ఎందుకు అన్నా! ఈ ఇల్లు డెవలప్మెంట్ కి ఇద్దాము, మాకు తెలిసిన ఆయనని అడిగితే, ఆయనకి అయిదు, మనకి నాలుగు ఇస్తాను అన్నాడు. మనం ఇద్దరం ఒకో ఫ్లాట్ తీసుకుందాము, అమ్మ ఒక దాంట్లో ఉంటుంది, ఇంకోటి అద్దెకి ఇచ్చినా, అమ్మినా అమ్మకి సరిపోతాయి." నిమిషంలో సమస్య తీర్చేసింది. ఆ ఏరియాలో పెద్ద అద్దెలు రావు. అందుకని విజయ వాళ్ళ అమ్మ ఇంకో ఫ్లాట్ అమ్మేసి, కొడుకును ఆ డబ్బులు తీసుకొని తన పోషణ భారం అతన్ని తీసుకోమని చెప్పింది. "ఎవరో ఎందుకు? సుమన కొనుక్కుంటుంది ఫ్లాట్ " అని బయటివాళ్లకంటే ఒక లక్ష తక్కువకి కూతురికి ఇప్పించింది. ఆవిడకి తట్టిందా, లేక కొడుకు, కోడలు చెప్పారో తెలీదుకానీ, తాను ఉంటున్న ఫ్లాట్ తన తదనంతరం కొడుకు పిల్లలకి చెందేటట్టు వ్రాసింది విజయ వాళ్ళ అమ్మ. ఆరోజు నుంచి విజయ తల్లి దగ్గరకి వెళ్లడం తగ్గించేసింది. సుమన ఇల్లు అద్దె తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ దగ్గర కాసేపు కూర్చుని వచ్చేది. అకస్మాత్తుగా విజయ అన్న చనిపోయాడు. పాపం విజయ తల్లికి పెద్ద దెబ్బ, కానీ ఆవిడ ఏనాడూ కోడలితో గాని, కొడుకు పిల్లలతో గాని సరయిన సంబంధాలు పెట్టుకోలేదు. దానితో వాళ్ళు ఆవిడని మనిషిని పెట్టి చూస్తే చాల ఖర్చు అవుతుంది అని ఓల్డ్ ఏజ్ హోంలో చేర్పించారు. పాపం ఆవిడ "విజయా! నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు. నేను ఇక్కడ ఉండలేను " అని మొత్తుకుంది. "మా ఇంట్లో స్థలం ఏది అమ్మా ! సుమన, అల్లుడు, పిల్లలు రెండు గదుల్లో ఉంటారు. మాగది మాకు. నువ్వు ఎక్కడ ఉంటావు ? " అన్న విజయతో "హాల్ లో పడుకుంటాను. కాస్త మన వాళ్ళు కంటిముందు తిరుగుతూ ఉంటే బావుంటుంది." అని బతిమిలాడింది ఆవిడ. "చూద్దాములే" అంటూ తల్లిని చూడడానికి కూడా ఎక్కువ వెళ్ళేది కాదు, ఇంటికి తీసుకెళ్లమని గొడవ చేస్తుంది అన్న భయంతో. ఏడాది తిరగకుండా, అన్న ఎంత అకస్మాత్తుగా పోయాడో భర్త కూడా అలానే పోయాడు విజయకి. మర్నాడు అర్చన తో పాటు సావిత్రి కూడా వెళ్ళింది. "చూడు అర్చనా! మీ అంకుల్ నన్ను అన్యాయం చేసి వెళ్లారు." అని ఏడుస్తుంటే "బాధపడకండి ఆంటీ. సుమనా, రవి ఉన్నారు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు." అని చెప్పి ఓదార్చింది అర్చన. సుమన భర్త వ్యాపారం చేస్తూ నారాయణ గారిచేత ఇల్లు అప్పుకి గ్యారంటీ గా పెట్టించాడు. వీళ్లెవరికి తెలియని విషయం సుమన భర్త వ్యాపారంలో బాగా నష్టపోయాడు. అప్పు తీర్చకపోతే బ్యాంకు వాళ్ళు ఇల్లు వేలం వేస్తామని నోటీసు ఇచ్చారు. ఆ విషయం ఇటు భార్యకి, అటు కొడుక్కి చెప్పుకోలేక సతమతమైన ఫలితం.. ఆయన అకస్మాత్తు మరణం. రవి అమెరికా నుంచి వచ్చాక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసారు. బ్యాంకు అప్పు సంగతి బయటపడింది. రవి నానా యాగీ చేసాడు. ఈ సంగతి నాకు తెలియదు అన్న విజయ మాటలు నమ్మలేదు. "నేను వెళ్లిన రెండో రోజు నుంచి అక్క కుటుంబం అంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ ఖర్చు అంతా మీరే పెట్టారు. నేను ఒకమాట మాట్లాడలేదు. నాన్న డబ్బు సరిపోవడంలేదు అంటే అప్పుడప్పుడు పంపాను. ఇప్పుడు ఇల్లు అమ్మి నాకు సగం ఇవ్వండి. ఆ తరవాత మీరేమి చేసుకుంటారో నీ ఇష్టం నీ కూతురి ఇష్టం." అని మొండికి వేసాడు. బ్యాంకువాళ్ళు వేలం వేస్తే రేటు సరిగ్గా రాదు అని, వీళ్లే అమ్మకానికి పెట్టారు. అప్పటికీ ఉన్న ధర కంటే తక్కువ వచ్చింది. సగం రవి తీసుకుని, అప్పుకి కట్టాక ఉన్న డబ్బులు విజయకి ఇచ్చారు. అవి కనీసం పాతిక లక్షలు కూడా లేవు. "నేను నీతో వస్తా రవీ" అని విజయ అడిగితే వీసా టైం అయిపొయింది. ఒకవేళ మళ్ళీ చేయించినా నువ్వు అక్కడ ఆరు నెలలు కూడా ఉండలేవు." అన్నాడు రవి. "అప్పులన్నీ తీర్చడంకోసం ఫ్లాట్ కూడా అమ్మేశాము. మాకు ఉండడానికి ప్రస్తుతం మా అత్తగారిని బతిమిలాడాము. నిన్ను మేము తీసుకెళ్లలేము" అంది సుమన. చివరికి అందరూ కలిసి విజయని కూడా వాళ్ళ అమ్మ ఉన్న ఓల్డ్ ఏజ్ హోంలో నే చేర్చారు. విజయ వెళ్లే రోజు సావిత్రిని పట్టుకొని ఏడ్చింది. "మా అమ్మ బతిమిలాడింది పాపం వృద్ధాశ్రమంలో వద్దు, ఇంట్లోనే ఉంటాను అని. ఆ రోజు ఆవిడ మాట వినలేదు. ఈ రోజు నేను కూడా ఆవిడ దగ్గరకే వెళ్తున్నాను. ఎప్పుడైనా వచ్చి నన్ను చూడండి సావిత్రీ" అంటూ. "తప్పకుండా విజయా! మీరు కూడా ఫోన్ చేస్తూ ఉండండి. ఎప్పుడైనా వచ్చి రెండు రోజులు ఉండి వెళ్ళండి" అంది సావిత్రి. "ఇదేమిటమ్మా అచ్చం 'బూమరాంగ్ ' లాగ ఆంటీ వాళ్ళ అమ్మకి ఏమి చేసారో ఆవిడకి అదే అయింది" అంది అర్చన ఆశ్చర్యంగా. "పిల్లలు ఎప్పుడూ తల్లి తండ్రులని గమనించి వాళ్లనుంచే నేర్చుకుంటారు ఏ విషయమైనా. అందుకే వాళ్ళ దగ్గర మన మాటలు చేతలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలే కదా, వాళ్ళకి ఏమి అర్థం అవుతుంది అని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము. కానీ వాళ్లు మనని ఎంతగా గమనిస్తారో మనకి తెలీదు. విజయా ఆంటీ వాళ్ళ అమ్మని ఎలా చూసిందో సుమనా, రవీ కూడా వాళ్ళ అమ్మని అలాగే చూసారు. 'నీవు నేర్పిన విద్యయే'అని మనం ఏమి చేస్తే పిల్లలు అదే చేస్తారు. అందుకే ఏ కష్టం అయినా మనకి అలా జరగకూడదు అంటే మనము వేరే వాళ్ళకి చెయ్యద్దు అన్న విషయం గుర్తుంచుకుని నీ పిల్లలని పెంచు " అంది సావిత్రి అర్చనతో. "అమ్మా! నువ్వు ఛాన్స్ వస్తే వదలవు కదా! పాఠాలు చెప్పడానికి " నవ్వుతూ అంది అర్చన. "ఇవి జీవిత పాఠాలు. ఎప్పటికీ అయిపోవడం ఉండదు. నేను చెప్తూనే ఉంటాను, నువ్వు వింటూనే ఉండాలి." అంది సావిత్రి. ****

శ్రీపతి లలిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.

నేను ఆంధ్ర్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.

నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.

నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.

అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.

నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.

ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.

నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.

పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.41 views0 comments

Comments


bottom of page