top of page

ఓ మనిషి..'O Manishi' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 06/02/2024

'ఓ మనిషి' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


తమను తామే వుద్ధరించుకోలేని మనుషులు సమాజాన్ని వుద్ధరించరు కదా.. ఈ మాట ప్రతి మనిషి నుండి వస్తుంది అంటే.. దాదాపు ఈ వాక్యం ప్రతి మనిషికి సూట్ అయినట్లే. 


చౌదరి టిఫిన్ షాపు వద్ద, ఎప్పుడూ కూడా జనమే. అతడి షాపులో బోజనం అంత రుచి మరియు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు. అతడి జీవనాధారం కూడా అదే. 


ఒకరోజు తెల్లవారి షాపు వద్ద జనం నిండుగా ఉన్నారు. చౌదరి, అతనితో పని చేసే మరో ఇద్దరు చాలా బిజీగా ఉన్నారు. ఇంతలో ముగ్గురు చిన్న పిల్లలు రెండు గిన్నెలు పట్టుకుని వచ్చి 

" అంకుల్, అమ్మ డబ్బులు రేపు ఇస్తుందట.. ఈరోజుకి బువ్వ, సాంబారు పోయమంది " అన్నారు. 


ఆ మాటలకు అంత బిజిలో ఉండి కూడా, డబ్బులు ఇచ్చే వారిని కాదని, పిల్లల వద్ద ఉన్న గిన్నె తీసుకుని, అన్నం వడ్డిస్తున్నాడు. 


అది చూసి అక్కడ ఉన్న కొందరు "ఏమి చౌదరి గారు.. ! జీవితంలో గొప్ప అనుభవం ఉన్న మీలాంటోళ్ళకి ఇలాంటి వాళ్ళు డబ్బులు ఇవ్వరు అని తెలియదా.. ? మీకు ఖచ్చితంగా ఇలాంటి వారి వలన నష్టం వస్తుంది అని తెలియదా.. ? పైగా వాళ్ళు మీకు డబ్బులు బాకి పడ్డారు కూడా " ప్రశ్నించారు. 


"అయ్యా.. ! నేను చేసే పనుల్లో ఆనందం వెతుక్కుంటున్నాను. వాళ్ళ తల్లి నాకు డబ్బులు బాకి పడిన మాట వాస్తవమే. అయినా.. వాళ్ళు నా డబ్బులు నాకు ఎప్పటికైనా తిరిగి ఇస్తారనే నమ్మకం నాకు ఉంది. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. లాభాల్లో వాటిని నేను పొందగలను. పాపం ఎంత కష్టం వచ్చిందో.. ఆ తల్లి తాను అడగటానికి సిగ్గుపడి పిల్లలను పంపింది. డబ్బులు ఇవ్వకపోతే వారికి సహాయం చేసినట్లు ఊహించుకుని ఆనందిస్తాను. ఈ భూమి పై దానం కంటే గొప్ప పుణ్యం మరొకటి లేదు కదా.. !” అన్నాడు 

 

మరో గిన్నె తీసుకుని సాంబారు పోస్తు

"ఇప్పుడు నేను ఇవ్వకపోతే ఆకలితో ఆ పిల్లల బాధ ను చూడలేక ఎలాగైనా పిల్లల ఆకలి తీర్చాలనే ఉద్దేశ్యంతో ఆ తల్లి దొంగతనం చేయవచ్చు, లేదా ఏదైనా అఘాయిత్యం చేసుకోవచ్చు. 

ఆకలి ఒక మనిషిని దొంగతనం చేసేలా చేస్తుంది, ఆకలి ఒక మనిషిని మోసగాడిని చేస్తుంది, ఆ ఆకలి మనిషిని స్వార్ధపరుడిని, అదే ఆకలి ఒక్కోసారి మనిషిని హంతకుడిని చేస్తుంది. ఈరోజు నేను చేసిన సహాయం, పనితో ఒక కుటుంబం, ఒక మనిషి ఇలాంటి అఘాయిత్యాలు చేయకుండా నిలువరించగలిగాను. 


మీరు డబ్బులు ఇచ్చి అడుగుతున్నారు. వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా అడుక్కున్నారు. అడగటానికి, అడుక్కోవడానికి పెద్దగా తేడ ఏమీ లేదు. రెండు కూడా పొట్ట కూటి కోసమే. ఆకలితో ఉన్న మనిషికి ఏది చేసినా అది దైవంతో సమానం. లేనివాడు ఆకలిని జయించటానికి నానాపాట్లు పడుతుంటే.. ! ఉన్నవాడు రుచులను వెతుక్కుంటున్నాడు. 


నేను కేవలం ఆనందం కోసమే ఇలాంటి పనులు చేస్తాను. మనిషి తన సంపాదనలో రోజుకి పదిరూపాయలు పేదవాడి కోసం కేటాయిస్తే ఆ పది రూపాయలు విలువ మన కంటే లేనివాళ్ళకి బాగా తెలుస్తుంది. ఆ ఇచ్చేవాడు ఎంత ఆశ్చర్యపడతాడంటే, పదిరూపాయిలు ఇస్తే ఇంత ఆనందపడుతున్నారా అన్నట్లు.. 


నిజంగా మనిషి, మనిషిగా ఆలోచిస్తే తన తోటి వారికి ఉన్నంతలో సహాయం చేస్తాడు. ఆ సహయంలో కేవలం నిస్వార్థత, ఆనందం మాత్రమే చూసుకుంటాడు. తిరిగి ఆశించడు. తిరిగి ఆశించి చేసే దానిని ఎప్పుడూ సహయం అనలేరు. 


కష్టపడి పైకి వచ్చేవారు ఎప్పుడు కూడా తన తోటి మనుషులను అర్థం చేసుకుంటారు. ఇంకొందరు ఒక్క అడుగు ముందుకేసి తోచిన సహాయం అందిస్తారు. ఈరోజుల్లో మనిషి కష్టపడి పైకొచ్చినా, తోటి మనిషిని కష్టపెడుతు వారిని తక్కువ చేసి చూస్తాడు. పుట్టుకకు అర్థం తెలిసినవాడు లేనివాడికి, ఆపదలో ఉన్నోడికి సహాయం చేస్తాడు. అదికాక సహాయం చేయలేనివాడు తానంతట తాను బతుకుతాడు తప్ప ఏ మనిషికి ఇబ్బందులుకు గురి చేయడు. 

 అది మనిషి లక్షణం. ఇక ధర్మానికి, పుణ్యానికి పోయేవాడు నాలాగనే ఆశించకుండా సహయపడతాడు. 


ఒకరు సహాయం అడిగినంత మాత్రాన వాళ్ళ స్థాయిని తక్కువగా చూడకూడదు. నిజంగా సహాయం అడిగేవాడే బలహీనుడు అయితే ఈ సృష్టిలో బలవంతుడు లేనట్లే కదా.. " అన్నాడు చౌదరి. 


 " అయ్యా.. ! చౌదరి గారు మీరు చెప్పేది నిజమే. మానవత్వంలోను, జీవితానుభవంలోను మీరు పీ హెచ్ డి చేసినట్లు ఉన్నారు. అయితే.. ! మీరు చెప్పినట్లు అందరూ మీలాగనే ఉండరు. మీలాంటి మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు "అన్నారు వాళ్ళు. 


"అవును చాలా తక్కువ మంది ఉంటారు. కానీ.. అందరూ మంచోళ్ళే. వారి వారి పరిస్థితులు బట్టి మారిపోతుంటారు. మార్పు కోసం ప్రయత్నిద్దాం " 


"మార్పు సాద్యమంటారా.. చౌదరి గారు " అడిగాడు ఒకడు


"ఒక మనిషిని ఇంకో మనిషి దగ్గరుండి మార్చటం అంటే సాద్యం కాదు. మనుషులు ఎలాంటివారంటే.. ! గుడిలో ఫ్రీగా పులిహోర పెడతారని ఇంకో కప్పు కోసం మరలా వరుసలో నిలబడే మనుషులు. మార్చాలంటే ఎలా మార్చగలం.. ? ఎదుటోడికి కష్టం వస్తే నవ్వుకుంటారు, వాళ్ళకి కష్టం వస్తే ఏడుస్తారు. నువ్వు తప్పు చేస్తే నిలదీస్తారు, వాళ్ళు తప్పు చేస్తే తప్పించుకుంటారు. మిత్రమా.. !నటన నేర్చిన మనుషులు వీళ్ళు. వీళ్ళ నుండి మార్పుని కోరటం అంటే ఎడారిలో పన్నీటిని వెతకటమే. అయినా.. !మార్పు కోసం ప్రయత్నిద్దాం. ఎలా అంటే.. ! ఈరోజు నువ్వు చేసిన సహాయం వాళ్ళు ఇంకొకరికి చేసేలా ప్రోత్సహించటం ద్వారా.. 


ఒకరికి సహయం చేయటం ద్వారా వచ్చే ఆనందం ఇతరులకు వివరించటం ద్వారా.. 

 ఇలాంటి పరిస్థితులే తప్ప ఒక మనిషి తానంతట తాను మారాలే కానీ ఇంకో మనిషి మార్చితే మారే మనుషులు కాదు వీళ్ళు. నేను మనిషిగా ఆలోచించాను. ఇక మీరు కూడా నన్ను చూసి మారితే మార్పు ఇక్కడి నుండే మొదలవుతుంది " ఆన్నాడు చౌదరి. 


" నువ్వు చెప్పే మాటలు, సహాయం చేసి నువ్వు పడిన ఆనందం, ప్రశాంతత ఏ మనిషికి ఇంక ఎక్కడ కూడా దొరకవు. ఓ మనిషి మేం మారుతాం. మేము కూడా మనుషులమని నిరూపించుంకుంటాం " అన్నారు వాళ్ళు. 


 ఆ మాటలకు సాంబారు కలుపుతు చిన్నగా నవ్వి మనసులోనే వారికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు చౌదరి. 

***

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం 


39 views0 comments
bottom of page