top of page

ఒకరికొకరు



'Okarikokaru' - New Telugu Story Written By Susmitha Ramana Murthy

Published In manatelugukathalu.com On 16/03/2024

'ఒకరికొకరు' తెలుగు కథ

రచన : సుస్మితా రమణ మూర్తి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



“అయ్యగోరూ! ఇల్లు ఊడిసాను. తడిబట్ట ఎట్టినాను. అంట్లు తోమినాను. బట్టలు అన్నీ ఉతికి, ఆరేసీనాను. అన్ని

పనులు అయిపోనాయి”


“ అయితే ఇక వెళ్ళు”


పని మనిషి కదలలేదు. 

ప్రశ్నార్థకంగా చూసారు పురుషోత్తం. 


“ రేపు రానండి. ఆదారు కారుడు పనుంది. అమ్మగోరు పూజలో ఉన్నారు. ఆరికి సెప్పండి”


“ మేము పనులు చేసుకునే ఓపిక లేకనే కదా?నిన్ను పెట్టుకుంది. సర్లే! ఎవరినైనా పంపించు. రోజు పైసలు వెంటనే ఇచ్చేస్తా!” పని మనిషి మాటలకు ఫైలులో పెట్టబోయే కాగితాలు బల్లపై ఉంచుతూ అన్నారు పురుషోత్తం. 


“ ఒక్క రోజయితే ఎవురూ రారండి..మా పిలదాన్ని అంపుతా. దానికిచ్చే వంద, నా జీతంలో పట్టుకోకండి!”


ఆమె మాటలకు తలూపారు వారు. తను వెళ్ళి పోయింది. 

ఎనభైకి దగ్గర పడిన పురుషోత్తం విశ్రాంత ప్రభుత్వ అధికారి. డెబ్బయి దాటిన సీతమ్మ గృహిణి. ఆ ఇంట్లో ఇద్దరూ ఒకరి

కోసం ఒకరుగా జీవిస్తున్న అన్యోన్య దంపతులు. వారి అబ్బాయి, అమ్మాయి, పిల్ల పాపలతో వేరే ఊర్లలో ఉంటున్నారు. 


స్వదేశంలోనే ఉంటున్నా, వారి కష్ట సుఖాలు, బాగోగుల పరామర్శలు అన్నీ ఫోన్లోనే! పురుషోత్తం, సీతమ్మ

దంపతులు తమ బాధ్యతగా పిల్లలను పెంచి, పెద్ద చేసారు. విద్యా, బుద్దులు నేర్పించారు. పెళ్ళిళ్ళు చేసారు. ఒక్క

నాడూ వారినుంచి ఏమీ ఆశించలేదు. అందరిలాగే పిల్లలు, మనవలు, మనవరాళ్ళు తమ ఎదుట ఉంటే బాగుండునని

ఆశ పడ్డారు. ఎవరి బతుకులు వారివే కావటంతో ఇద్దరూ ఒకరి కొకరుగా మిగిలిపోయారు. పది నిమిషాల తర్వాత సీతమ్మ పూజ గదిలోంచి వచ్చింది. పనిమనిషి విషయం పురుషోత్తం భార్య చెవిలో వేసారు. 


“ అంతా విన్నానులెండి! దాని పిల్ల వస్తుందిగా!.. మరీ ఓపిక లేని బతుకులు అయిపోయాయి మనవి. ఎంత కాలమో ఇలా?.. ఇద్దరికి ఒకేసారి పిలువు వస్తే బాగుంటుంది. మన రాతల్లో ఏముందో?.. ”


భార్య వేదాంత ధోరణి భర్త చెవులకు సోకలేదు. వారి ధ్యాసంతా ఫైలులో కాగితాలు సర్దడంలోనే ఉంది. 


“ లేచిన దగ్గర నుంచి అదే పనిగా ఆ కాగితాలు చూస్తున్నారు. అవి అంత అవసరమా అండీ?”


భార్య ప్రశ్నకు, భర్త వివరంగా చెప్పారు. 

“ఈ జీవిత చక్రం ఉంది చూసావూ!.. ఎవరిది ముందు ఆగుతుందో, ఎవరిది వెనుకో, రెండూ ఒకే సారో..

తెలియదు కదా?.. అందుకనే మన జాయింట్ బేంకు అకౌంట్ల వివరాలు, నా పెన్షన్ కాగితాలు, ఈ ఇంటి

డాక్యుమెంట్లు, మన ఆధార్, పేన్, హెల్త్ కార్డుల వివరాలు..ఇలా మనకు సంబంధించిన అన్ని ఒరిజనల్సుకి జిరాక్స్ కాగితాలు ఈ ఫైలులో ఉంచుతున్నాను. ఒరిజినల్స్ అన్నీ ఓ బేగులో పెట్టి లోపల బీరువాలో ఉంచాను “


“ అర్థమైందండీ!.. ఆ బేగు గురించి ఇదివరకే చెప్పారు. నాకు బాగా గుర్తుంది. మీ ముందు చూపుకి జోహార్!”


భార్య మెచ్చుకోలుకి సంతోషించారు వారు. 

“ మనకు రాను రాను జ్ఞాపక శక్తి తగ్గిపోతోంది కదా?.. అందుకే అన్ని విషయాలు అప్పుడప్పుడు నీకు చెబుతూ నేనూ గుర్తు పెట్టుకుంటున్నాను. 


ఇలా కాగితాలన్నీ ఒకేచోట ఉంచుకుంటే అవసరమైనప్పుడు వెతుకులాట ఉండదు” అవునన్నట్లుగా ఆమె తలాడించింది. 


“ ఈ ఫైలులోని కాగితాలు నీవు కూడా వీలున్నప్పుడల్లా చూస్తుంటే, అందులోని విషయాలు బాగా గుర్తుంటాయి”


“ మీరుండగా నాకు ఎందుకండీ ఇవన్నీ?.. పుణ్య స్త్రీగా ఎప్పటికైనా మీ చేతుల మీదుగానే పోతానండీ నేను”


“ నీ ధోరణి నీదేగాని నా మాట వినవు కదా?.. ముఖ్యమైన కాగితాలు ఈ గ్రీన్ ఫైలులో ఉన్నాయన్న విషయమైనా

గుర్తుంచుకో!”


“ అలాగేనండీ!” అంటూ భర్త పక్కన కూర్చుంది ఆమె. 


“ మూడ్రోజుల క్రితం నాకో పాడు కల వచ్చిందండీ!.. ”


“ కలలు ఎప్పుడూ కల్లలే! మన గజి బిజి ఆలోచనలే కలలు! భయపడడం అనవసరం”


“అదే కల రెండోసారి కూడా తెల్లవారు జామున వచ్చిందండీ! భయంగా ఉందండీ! అందుకే ఆంజనేయ స్వామి గుడిలో

పూజలు, శివాలయంలో అభిషేకం చేయించాను. ఆ పంతులు గారికి నాకల చెబితే- వారూ మీలాగే అన్నారు. కలలన్నీ నిజాలు కావన్నారు. మన ఆలోచనలే కలలన్నారు. భయపడ వద్దన్నారు. ఎందుకైనా మంచిది ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకో మన్నారు “


“ఇంతకీ నీకు ఎలాంటి కల వచ్చిందో చెప్పు” 


“ నేను నిద్రలోనే పోతానని.. “ 


“ పంతులు గారు చెప్పారు కదా?.. భయపడకు. పూజలు చేయించావు. దోషాలేఁవైనా ఉంటే పోతాయిలే!”


“ ఏఁవండీ! ఈ ఏడాది ప్రారంభంలో మాఅక్క పిల్లలు వచ్చినప్పుడు, వారితో షిర్డీకి పంపించారు నన్ను. మరోసారి

తిరుపతికి పంపించారు. మీరు కీళ్ళ నొప్పుల వలన నడవలేక, రాలేక పోతున్నా నన్ను పంపిస్తున్నారు”


తన ఆరోగ్య పరిస్థితి అర్థం చేసుకున్నందుకు భార్య వేపు ప్రేమగా చూసారు వారు. 


“ మీకు ఎప్పుడూ చెప్పలేదండీ! పంతులు గారు కూడా ఆదే సలహా ఇచ్చారండీ! ఎన్నాళ్ళనుంచో నాకూ అదే కోరిక

ఉందండీ! ఇదే నా చివరి కోరిక అనుకోండి.. ”


భార్య నోటిపై చేయి ఉంచుతూ అన్నారు పురుషోత్తం. 

“ అలా అనకు. ఈ చివరి దశలో మన ప్రతి చిన్న కోరిక తీర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆతర్వాత పైవాడి దయ! ఇంతకీ ఆ కోరికేమిటి?“ అంటూ భార్య వేపు చూసారు పురుషోత్తం.


కాసేపు తటపటాయిస్తూ చెప్పింది తను. “ కాశీ యాత్రండి!

పంతులు గారు కాశీ నాధుని దర్శనం చేసుకోమన్నారు” 


“అంతేనా?.. అలాగే చేసుకో! మన అపార్టుమెంట్లో ఉంటున్న గణపతి ట్రావెల్స్ ఓనర్ రామకృష్ణ గారివి రెండు బస్సులు కాశీ యాత్రకు బయలు దేరుతున్నాయి. ఒక బస్సేమో ఈ నెలాఖరులో బయలు దేరుతుంది. ఆ బస్సులో రామకృష్ణ గారు వారి అమ్మ, నాన్నలను తీసుకు వెళుతున్నారు. వారితో నిన్ను పంపిస్తాను. ఇక రెండో బస్సు రెండు నెలల తర్వాత బయలు దేరుతుంది. ఎందులోనైనా వెళ్ళొచ్చు. నీ కోరిక తప్పక తీరుతుంది”


“ అది కాదండీ! మన ఆరోగ్యం బాగుండాలని, మీతో కలసి ఆ కాశీనాధుని దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నానండీ!”


 భార్య మాటలకు పురుషోత్తం అవాక్కయారు. అవునంటే వారి ఆరోగ్య పరిస్థితి యాత్రలు చేయడానికి అనువుగా లేదు. కాదంటే ఆమె మనసు గాయపడుతుంది. చివరకు ఆమె మాట కాదనలేక పోయారు. పురుషోత్తం భార్యతో కాశీ యాత్రకు అయిష్టంగానే బయలుదేరారు. భర్త తన కోరికను మన్నించి నందుకు పొంగిపోయింది సీతమ్మ. 

****


బస్సు కాశీకి దగ్గర పడుతుండగా నిద్రలోంచి దిగ్గున లేచింది సీతమ్మ. ఒళ్ళంతా చెమటతో నిండి పోయింది. 

“మళ్ళీ అదే కలండీ! నాకెందుకో భయంగా ఉందండీ! కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోకుండానే పోతానేమోనండీ!.. ఒకవేళ నేనిలా మీ చేతుల మీదే పోతే..మీరే నా చితాభస్మం గంగా నదిలో.. ..”


ఆమె చేతులు బిగుసుకున్నాయి. శరీరం చల్లబడింది. 

*****

పురుషోత్తం పిల్లలకు ఫోను చేసినా ప్రయోజనం లేకపోయింది. కొడుకు ఆరోగ్యం బాగులేక ఆసుపత్రిలో ఉండటం వలన రాలేక పోయాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా కూతురు ఫోను కలియలేదు. బస్సు యజమాని సహాయంతో పురుషోత్తం భార్య అంత్య క్రియలు అక్కడే కానిచ్చారు. 


భార్య కోరినట్లే చితాభస్మం గంగా నదిలో కలిపి, వెను తిరిగినప్పుడు, ఒళ్ళు తూలి నదిలో పడిపోయారు. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేక పోయారు. 


నదీమ తల్లి ఒడిలో శాశ్వత నిద్రలోకి జారి పోయారు వారు. 

మీచేతి మీదుగానే నేనని— అనుకున్న సీతమ్మ గారి అభీష్టం అలా నెరవేరడం పైవాడి లీల!


ఒకరి కోసం ఒకరం— అన్న భావన గుండె నిండా నింపుకున్న పురుషోత్తం ఊహించని విధంగా నదిలో పడి అనంత విశ్వంలోకి గువ్వలా ఎగిరి పోవడం కూడా ఆ విధాత చిద్విలాసమే!


 / సమాప్తం /

################## ######### 

సుస్మితా రమణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : సమ్మెట్ల వెంకట రమణ మూర్తి

కలం పేరు : సుస్మితా రమణ మూర్తి

పుట్టుక, చదువు, వుద్యోగం, స్వస్థలం .. అన్నీ విశాఖలోనే.

విశ్రాంత జీవనం హైదరాబాద్ లో.

కథలు, కవితలు, కొన్ని నాటికలు .. వెరసి 300 పైచిలుకు వివిధ వార, మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి లో కూడా ప్రసారం అయ్యాయి.

బాగా రాస్తున్నవారిని ప్రోత్సహిస్తూ , కలం కదిలితే రాయాలన్న తపనతో

      మీ సుస్మితా రమణ మూర్తి.




198 views6 comments
bottom of page