top of page

వన్ పర్సన్'One Person' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 09/05/2024

'వన్ పర్సన్' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


అవినీతి, లంచగొండితనం అంటే ఏంటో.. సామాన్యులకు, పేదోళ్ళకి బాగా తెలుస్తుంది. కానీ..  దాన్ని ఎలా అడ్డుకోవాలో తెలియక వాటికి బలైపోతుంటారు. కరెంటు లేని పూర్వకాలంలో ఒకరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రభుత్వ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నారు. అప్పుడు ఆయన ఒక రాత్రి గుడారంలో బస చేయల్సి వచ్చింది. ఆయనకు తోడుగా ఒక కూలి కూడా ఉన్నాడు. మరుసటిరోజు పని కోసం ఒక కొవ్వొత్తి వెలిగించి దాని వెలుగులో ప్రాజెక్ట్ వర్క్ చేసి తర్వాత ఆ కొవ్వొత్తి ఆర్పివేశాడు. భోజనం అయ్యాక మరో కొత్త కొవ్వొత్తి వెలిగించి కాలక్షేపం కోసం పుస్తకం చదవసాగాడు. 


ఆ కూలీకి ఏమీ అర్థంకాక, "అయ్యా.. మొదట కొవ్వొత్తే మరలా వెలిగించి అది పూర్తికాగానే కొత్తది వెలిగించవచ్చు కదా " అన్నాడు.


అప్పుడు విశ్వేశ్వరయ్య చిన్నగా నవ్వి 

"మొదటి కొవ్వొత్తి ప్రభుత్వం ఇచ్చినది. కాబట్టి ప్రభుత్వ పని అనగా..  రేపటి ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేశాను. తర్వాత కొవ్వొత్తి నా సొంత డబ్బులుతో కొనుక్కున్నది. పుస్తకం చదవటానికి అనగా.. నా సొంత పని కోసం వాడుకున్నాను. ప్రభుత్వం నాకు జీతం ఇస్తుంది. అది చాలు. నిజాయితీగా పని చేయటం నాకు ఇష్టం" అన్నాడు. ఆ కాలం అలా సాగింది. 


ఆరోజుల్లో ఒక్క ఉద్యోగి కూడా ప్రభుత్వ, ప్రజల సొమ్ము తిన్నారంటే మనం నమ్మలేం. అవినీతి ఈరోజుల్లో మామూలు అయిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులంటే ఈరోజుల్లో గౌరవం పోయింది. అలాంటి రోజుల్లో బాలాజీ తన కొడుకు రవికుమార్ ను ప్రభుత్వ ఉద్యోగం సాధించేలా చేశాడు. బాలాజీ ట్రైన్లో టీ అమ్ముకుని, వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించేవాడు. 


తన తమ్ముడి కొడుకు బంటి కూడా బాలాజీ తో ఉంటూ పనిలో మెలుకువలు నేర్చుకునే వాడు. బంటి చదువుకోలేదు. బాలాజీకి అక్షరం ముక్క కూడా రాకపోయినా కుటుంబంలో ఎప్పుడూ ఇబ్బందులు లేకుండా సంపాదించేవాడు. కొడుకు ఉద్యోగ ప్రయత్నాలు మొదలయినపుడు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చినా.. చివరకు బాలాజీ కష్టం, పడిన శ్రమ రవి ఉద్యోగం రూపంలో అదృష్టం తలుపు తట్టింది. బాలాజీకి రవి ఒక్కడే కొడుకు. ఉద్యోగం వచ్చిన బాలాజీ మాత్రం తన పని ఆపలేదు. తాను చేసే పనిని ఎంతో నిజాయితీగా, మనసు పెట్టి చేసే రకం బాలాజీది. 


కొడుకు ఉద్యోగంలో చేరాక జీతం కంటే ఎక్కువ డబ్బులు తెచ్చేవాడు రవి. ఆ డబ్బులు మరలా కనపడకుండా ఎక్కడికో తరిలించేవాడు. ఏమని అడిగితే 

"బాగా పని చేస్తే పై నుండి ప్రోత్సాహకాలు ఉంటాయి నాన్న" అనేవాడు. 


 కొన్ని సంవత్సరాలు గడిచాక అవనీతి శాఖ అధికారులమని, మీ కొడుకు లంచాలకు బాగా అలవాటు పడ్డాడని, అతడి పై చాలా ఆరోపణలు ఉన్నాయని, సోదాలకు వచ్చామని చెప్పారు. 


అయితే రవి ముందు జాగ్రత్తగా ఇంట్లో ఏ విధమైన పత్రాలు కానీ డబ్బు కానీ ఉంచలేదు. కానీ.. రవి కష్టపడి ఈ ఉద్యోగం సాధించాడు. అది కూడా తన కార్యాలయంలో అతడే పెద్ద ఉద్యోగి. అలాంటి రవి పై ఆరోపణలు రావటం, ఏసీబీ అధికారులు సోదాలకు రావటంతో బాలాజీ తన పరువు పోయిందని భాదపడ్డాడు. 


ఒకవైపు ఉద్యోగాలు లేక,నోటిఫికేషన్లు రాక యువతలో నిరుద్యోగం పెరుగుతుంది. మరోవైపు జీతాలు చాలక, కుటుంబం గడవక జీతాలు పెంచాలని ఎందరో ఉద్యోగులు రోడ్లు ఎక్కుతుంటే తన కొడుకు.. అదే..  ట్రైన్లో టీ అమ్ముకునే వాడి కొడుకు ప్రభుత్వ ఉద్యోగం సాధించి, నెలకు వేలల్లో జీతాలు తీసుకుని మరలా అమాయకులైన ప్రజల వద్ద లంచాలు తీసుకోవటమా.. ఇవి బాలాజీ ఆలోచనలు, బాధలు. 


కొడుకు రవిని మార్చాలనుకుని 

"బాబూ రవి! నా చిన్నప్పటి నుండి ఏ ప్రభుత్వ కార్యాలయంలో అయినా లంచాలు తీసుకోవటం, లంచాలు ఇవ్వటం నేను చూడలేదు, వినలేదు. అవి జరుగుతున్నా.. ఎక్కడో పెద్ద పెద్ద నగరాల్లో. అది కూడా ఎవరో ఒకరో ఇద్దరో అవనీతికి పాల్పడితే మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల పైన, ప్రభుత్వం పైన నింద పడుతుంది. అది అటు ఉంచితే నాకు తెలిసీ.. అవినీతి చేస్తు అక్రమ డబ్బులు సంపారించే ఒకే ఒక్క పర్సన్ నువ్వే. ఈ పరిస్థితి మారాలి బాబు" చాలాసార్లు నచ్చజెప్పాడు 


"హే నువ్వేంటి నాకు చెప్పేది.. ? భవిష్యత్ అవసరాల కోసం ఎంత డబ్బు అవసరం అవుతుందో ఎవడికి తెలుసు.. అందుకే ముందే అవకాశం దొరికిన చోట కూడబట్టుకోవాలి " అన్నాడు కొడుకు. 


"భవిష్యత్ లో ఎంత డబ్బు అవసరం అయినా.. పోయాక రూపాయి కూడా పట్టుకుపోలేం. టీ అమ్ముకుని వచ్చే డబ్బుతో నిన్ను గొప్పవాడ్ని చేశాను. అలాగే నీవు నీ కష్టార్జితంతో సంపాదించే డబ్బుతో నీ పిల్లలను  పోషించగల్గితే వాళ్ళే నీ చివరి దశలో చూసుకుంటారు. ఒకర్ని మోసం చేయకుండా బతికే బతుకు నా దృష్టిలో, ప్రపంచం దుష్టిలో గొప్పది" అన్నాడు. 

 

ఆ మాటలు రవికి ఎక్కితేగా.. 


బాలాజీ చాలా బాధపడ్డాడు. ఎందుకంటే బాలాజీ మంచివాడని, ఎవరిని మోసం చేసేతత్వం కాదని అంటూ జనం చెప్పుకుంటారు. కష్టపడకుండా వచ్చే డబ్బుకు తాను విలువ ఇవ్వడు. బాలాజీతో పని చేసిన బంటిది కూడా పెద్దయ్య మనస్థత్వమే. ఎందుకంటే బాలాజీ ఒక స్టేషన్ లో టీ అమ్ముతు ఎవరికైనా చిల్లర సమస్యతో డబ్బులు ఇచ్చేలోగ రైలు కదిలితే ఆ డబ్బులు తిరిగి ఇచ్చేందుకు మరుసటి స్టేషన్లో బంటిని పెట్టి ఫోన్ లో వివరాలు చెప్పి అక్కడ వారి డబ్బులు వారికి ఇప్పించేవాడు. అలా వాళ్ళు బంటిని మెచ్చుకుంటు ఆనందం వ్యక్తం చేయటంతో బంటి కూడా మంచితనం వైపు నడిచాడు. 


ఇదిలా ఉంటే ఒకరోజు బంటీకి ఆరోగ్యం బాలేక అతడి ప్లేసులో సెలవులో ఉన్న రవిని పెట్టాడు. అయిష్టంగానే ఒప్పుకున్నాడు రవి. ఆరోజు రైలు పెట్టెలో ఒక వ్యక్తి తనతోపాటు దాదాపు తనకు తెలియని ఒక పదిమందికి టీ ఇప్పించి ఐదువందల రూపాయలు కాగితం ఇచ్చాడు. బాలాజీ తన జేబులో అంత చిల్లర ఉందో లేదో చూశాడు. లేదు. దీంతో పక్కనే షాపు దగ్గర తెచ్చేలోగ రైలు కదిలింది. వెంటనే రవికి ఫోన్ చేసి ఆ పెట్టె వివరాలు చెప్పి 370 రూపాయలు తిరిగి అతనికి ఇవ్వాలని సూచించాడు. 


పాపం రైల్లో ఆ వ్యక్తికి అతడి భార్య చీవాట్లు వేసింది. 

"డబ్బులు అంత సులభంగా వస్తున్నాయా.. ? నీకు, నాకు పాపతో పాటు ఫోజుకు పెట్టెలో అందరికీ టీ ఇప్పించాలా.. ? వాడు చూడు ఎంత తెలివిగా ఐదు వందలు సంపాదించాడో.. అసలు వాళ్ళు టీ అమ్మి సంపాదించేదేముంది. ఇలా రోజుకు నలుగురు, ఐదుగురికి మోసం చేస్తే చాలు. ఈయనకు బుద్ధి ఉంటేగా.. ముందు టీ వాడు చిల్లర ఇచ్చాకైనా డబ్బులు ఇస్తే బాగుండేది" అని.

 పాపం వాళ్ళ ఆవిడ చీవాట్లకు అందరు నవ్వారు. 

"పోనీలేవే మన డబ్బులు తింటే వాళ్ళకేం వస్తుంది.. ? వాళ్ళకి కూడా పెళ్ళాం, పిల్లలు ఉంటారుగా.. మనకు మోసం చేస్తే వాళ్ళు ఎంతకాలం బతికేస్తారు చెప్పు.. ? మన డబ్బులతో వాళ్ళు మేడలు మిద్దెలు కట్టేస్తారా.. చెప్పు " అంటూ బార్యని సముదాయించాడు. 


ఇంతలో మరో స్టేషన్ వచ్చింది. దాదాపు అక్కడ పదినిమిషాలు ఆగింది. రవి తండ్రి చెప్పిన పెట్టె వద్దకు వెళ్ళి ఒక వ్యక్తిని

"సార్ పక్క స్టేషన్లో పదమూడు టీ లు ఆర్డర్ చేసింది మీరే కదా.. " 


"అవును బాబు నీకెలా తెలుసు.. ?


డబ్బులు ఇస్తూ.. " నేను వాళ్ల కొడుకునండీ. అక్కడ డబ్బులు ఇచ్చే క్రమంలో రైలు కదిలితే ఇక్కడ నేను ఇచ్చేలా ఏర్పాటు చేశారండీ నాన్న గారు" అన్నాడు రవి. 


ఆ మాటలకు ఆ వ్యక్తి "బాబు.. కష్టపడి సంపాదించే మీకు ఇంత నిజాయితీ ఉందా.. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని. ఏనాడూ అక్రమంగా డబ్బు సంపాదించలేదు. ఆ డబ్బుతో నా కుటుంబాన్ని నేను పోషిస్తే ఆ పాపం నా వాళ్ళకు తగులుతుంది. అడుక్కునైనా తింటాను కానీ పరుల డబ్బుతో ఏనాడూ బతకలేదు. అందరూ నన్ను మెచ్చుకుంటూ ఉంటారు. నీతి, నిజాయితీలో ఒకే ఒక్క పర్సన్ నేనే అని కానీ.. ఈరోజు చూస్తున్నాను నాకంటే గొప్పవాళ్ళు, మంచివాళ్ళు ఉన్నారని. మంచితనం అనే బండి నీ తండ్రి నడుపుతున్నాడు. దానికి రెండు చక్రాలు నువ్వే బాబు. నా డబ్బులు తిరిగి నాకు రాకపోయినా నేను బాధపడను కానీ. ! నువ్వు, నీ తండ్రి చేసే ఈ గొప్ప పనికి నేను ఆనందిస్తున్నాను. నువ్వు పిల్లాపాపలతో నూరేళ్ళు చల్లగా ఉండు బాబు. " దీవించి వెళ్ళాడు అతడు. 


ఆ మాటలు రవిలో మార్పు తీసుకొచ్చాయ్. పరులు డబ్బుతో బతికితే నిజంగా ఎప్పటికైనా ఆ పాపం మనకు తగులుతుంది అనే సత్యాన్ని రవి గ్రహించాడు. తండ్రికి ఒక మాట ఇచ్చాడు. 


" నాన్న.. మొదటి రోజు ఉద్యోగానికి వెళ్తున్నా ఆశీర్వదింంచండి" అడిగాడు రవి.

 

"అదేంట్రా మొదటి రోజు అంటున్నావ్.. ?” ఆశ్చర్యంగా అడిగాడు బాలాజీ. 


"అవును నాన్న.. నీతి, నిజాయితీగా ఉద్యోగం చేయటానికి ఈరోజు నుండే తొలిసారి వెళ్తున్నాను. పొట్టకూటి కోసం ఎన్ని విన్యాసాలైనా చేస్తాను కానీ ఒకరి పొట్ట కొట్టి మాత్రం సంపాదించను. ఈ ప్రపంచం మొత్తం అవనీతిలో మొదటి స్థానంలో ఉన్నా.. నిజాయితీగా పని చేసే ఒకే ఒక్క పర్సన్ నేనే అవుతా నాన్న..” అని రవి బయలుదేరాగా.. కంటి చెమ్మను తుడుచుకుని కొడుకును సాగనంపాడు బాలాజీ. 

**** **** **** **** **** ****

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం

49 views0 comments

Comments


bottom of page