కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
'Pacchani Prema' written By Pendekanti Lavanya Kumari
రచన: పెండేకంటి లావణ్య కుమారి
అదొక అందమైన పల్లెటూరు. సీతయ్య, గౌరమ్మలు ఆదర్శ దంపతులు.
తమ ఊరిని, పిల్లలనే కాకుండా తాము పెంచుకొనే మూగ జీవాలను కూడా అభిమానిస్తారు.
అనుకోని పరిస్థితులలో ఇద్దరూ మరణిస్తారు.
వాళ్ళ అబ్బాయి రాము అనాధ అయ్యాడు.
కానీ బంధువులతో పట్నం వెళ్లకుండా అక్కడే ప్రకృతి మధ్య ఉండిపోయాడు.
ప్రకృతి ప్రేమికులకు నచ్చేలా ఈ కథను రాశారు రచయిత్రి పెండేకంటి లావణ్య కుమారి గారు.
అది కొండ సానువుల్లోని ఒక చిన్న పల్లెటూరు. అక్కడ పశువుల కాపర్ల కుటుంబాలే ఎక్కువ. ప్రతి ఇంట్లోనూ పాడి పశువులుంటాయి. ఆ వూళ్ళోనే వున్న సీతయ్యకు ఈ మధ్యనే మరదలు వరసయ్యే గౌరమ్మతో పెళ్ళయ్యింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్ట పడి చేస్కున్నారు. చూడముచ్చటైన జంటని అందరూ అనుకుంటుంటారు. అంతే కాదు చాలా అన్యోన్యంగా వుండేవారు కూడా.
సీతయ్యకు రెండెకరాల భూముంది. దాంట్లో సిరి ధాన్యాలు, ఆవులకు దాణా, కూరగాయల్లాంటివి పండించుకునేవారు. వీళ్ళు తమ పెళ్ళవగానే ఒక ఆవును కొన్నారు. దాన్ని లక్ష్మి అని పిలుచుకునేవారు. రోజూ సీతయ్య పొలం పనులు చూస్కోవాలి, గౌరమ్మ ఆవు పనులు, ఇంటి పనులు చూస్కోవాలనుకున్నారు. కానీ లేస్తూనే సీతయ్యే, ఆవును, ఆవుండే గొడ్లపాకని శుభ్రం చేసేవాడు, ఒక్కోసారి ఆవును ఏటికి తీస్కెళ్ళి నీళ్ళలో బాగా కడిగి దానికి కొంచెం సేదతీరేలా చేసి తీస్కొచ్చేవాడు.
'నన్ను ఆవు పని చూస్కోమని మళ్ళీ మీరే చేస్తారేంట'న్న గౌరమ్మను 'నాకు చేతకానప్పుడు నువ్వు చూస్కుందువులేయే' అనేవాడు. గౌరమ్మ వంట చేస్కోని, పొలానికి సద్ది తీస్కోని ఆవును కూడా తోల్కోని వెళ్ళేది. అక్కడ పొలంలో ఆవును గడ్డి తినడానికి, అలా కొంచెం తిరగటానికి వదిలేవారు. సీతయ్య సద్దిప్పి ‘నీవు తిన్నావా’ అని అడిగేవాడు, ‘మీరు తినకుండా నేనెట్టా తింటా’ అనేది. తర్వాత ఇద్దరూ ఒకరికొకరు తినిపించుకుంటా అక్కడే తినేవారు.
తర్వాత గౌరమ్మ ఇంటికి పోకుండా పొలంలోనే ఆ పనీ, ఈ పనీ చేస్తుంటే ‘నీకెందుకే నేనున్నాగా, ఎండకు కందిపోతావే’ అనేవాడు.
‘కందిపోయి నల్లబడితే నన్నొదిలేస్తావా ఏంటి?’ అనేది.
‘నీవు నా లచ్చిమివి. నీవు కందినా వదలను, ఏ పనీ చేయకున్నా వదలను’ అనేవాడు. ఇద్దరూ కలిసి చేస్తే పని తొందరగా అయిపోతుందని తనూ పని చేసేది. ఆడుతూ, పాడుతూ ఇద్దరూ పని పూర్తి చేస్కోని తిరిగి ఆవుతో పాటు మాట్లాడుకుంటూ, ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ ఇంటికొచ్చేవారు.
వీళ్ళను చూసిన పక్కింటి సుబ్బమ్మవ్వ “చూడండ్రా ఎంత అన్యోన్యంగా వున్నారో, జంట అంటే అలా వుండాలి” అనేది.
“ఆఁ! కొత్తగా పెళ్ళైనోళ్ళందరూ అలానే వుంటార్లేయే” అని తీసి పారేసే వాళ్ళే అందరూ. ఇంటికొచ్చాక ఇద్దరూ కలిసి వంట చేస్కోని తిని, ఆవును ఆంబోతు దగ్గర వదిలి వచ్చి కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయేవాళ్ళు. అప్పుడప్పుడూ ఇద్దరూ కలిసి పల్లెపదాలు పాడుకునే వారు. ఎన్నేళ్ళయినా వాళ్ళ దాంపత్యం లో మార్పు రాలేదు, ఇద్దరూ ఒకరికొకరు పనుల్లోనే కాదు, కష్టాల్లో, సుఖాల్లో తోడుగా వుంటూనే వచ్చారు. సుబ్బమ్మవ్వ ఎప్పుడూ వారిని పొగుడుతూ వుండేది, ఎవర్నైనా దీవించినా వారిలా వుండాలని దీవించేది.
ఇంతలో ఆవు లక్ష్మి గర్భం దాల్చింది, ఇద్దరూ దాన్ని ఎంతో శ్రద్ధగా తమ బిడ్డను చూస్కున్నట్టు చూస్కున్నారు. ఒక శుభ ముహూర్తాన ఆవు చిన్న లక్ష్మిని ఈనింది. ఇంకారోజు వాళ్ళు పండుగ చేస్కున్నారు.
“మీ ఆవు ఈనింది ఇంక మీరెప్పుడూ?” అని సుబ్బమ్మవ్వ తొందరపెడుతూనే వుండేది. కొంతకాలానికి గౌరమ్మ కూడా నెల తప్పింది, సీతయ్య ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఏ పనీ చేయనీయడు, గౌరమ్మ మాత్రం పని చేస్తేనే 'కాన్పు సులభంగా జరుగుతుంది' అని అన్ని పనులు చేస్తూనే వుండేది. ఇంక నెలలు నిండాక సీతయ్య ఏ పనీ చేయనీయలేదని కాదు కానీ, గౌరమ్మ కు కూడా చేతనయ్యేది కాదు. గౌరమ్మకు సుఖ ప్రసవం అయ్యింది. పండంటి మగపిల్లాడు పుట్టాడు. ఇద్దరి ఆనందానికి అవధులు లేవు, వాడికి 'రాము' అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా చూస్కునే వారు.
సీతయ్య అప్పుడప్పుడూ “నేనొక్కడినే గౌరమ్మా, వీడికన్నా ఒక చెల్లెల్ని కన”మనే వాడు. అదేమో రాము పుట్టాక గౌరమ్మకు మళ్ళీ పిల్లలే పుట్టలేదు, అట్టాగే ఆవు లక్ష్మి కూడా మళ్ళీ ఈనలేదు. కొన్నేళ్ళకు చిన్న లక్ష్మి ఈతకొచ్చింది, దాన్ని కూడా ఎప్పట్లా జాగ్రత్తగా చూస్కున్నారు. అది ఈనింది. లేగదూడ. బాగా బొద్దుగా, చలాకీగా వుండటం చూసి 'బండోడు' అని పిల్చుకునేవారు. రాము అప్పటికే ఎనిమిదేళ్ల వాడు కావటంతో బండోడితో ఆడుతూ దాన్ని బాగా చూస్కునేవాడు.
సీతయ్య, గౌరమ్మ, రాము, లక్ష్మి, చిన్న లక్ష్మి, బండోడు ఇదీ వాళ్ళ కుటుంబం. ఇంతలో చిన్నలక్ష్మి మళ్ళీ ఈనింది. దీనికి రామే పేరు పెట్టుకున్నాడు చిన్నోడని. ఎప్పుడూ రాము చిన్నోడ్ని ఎత్తుకు తిరిగే వాడు. వాడికి బండోడు, చిన్నోడే లోకం.
రాము పదకొండేళ్ళ వాడయ్యాడు, వాడు కొంత కాలం నుండి స్నేహితులతో కలిసి బండోడ్ని కొండ మీదకు మేపుకు రావటానికి తోల్కెళ్ళేవాడు. ఇప్పుడు చిన్నోడ్ని కూడా తీస్కెళ్తానని తోల్కెళ్తున్నాడు. అందరూ కొండ మీదకు ఆవుల్ని తోల్కెళ్ళారు. పిల్లలంతా అక్కడక్కడా మేపుతూ తిరుగుతున్నారు. ఇంతలో చిన్నోడు పరుగెత్తుతుంటే, రాము దానితో ఆడుతూ పరిగెత్త సాగాడు. అలా కొంత దూరం పరిగెత్తాక చిన్నోడు కొండ వాలుకు చేరాడు, రాము అక్కడికెళ్ళకూడదు పడిపోతావని దగ్గరికెళ్ళేసరికి అది జారింది, ఎట్లాగో రాము క్రింద పడుకున్నట్లుగా పడి దాని కాలిని అందిపుచ్చుకున్నాడు.
తర్వాత కష్టపడి ఎట్లాగో ఇంకో కాలిని కూడా పట్టుకున్నాడు. కానీ పైకి లాగలేక పోతున్నాడు. ఎంత అరిచినా ఎవ్వరికీ వినపడలేదు. ఇంకరిచినా ప్రయోజనం లేదని అట్లే దాన్ని పట్టుకుని ఎవరైనా వస్తే పిలవాలని ఎదురు చూస్తున్నాడు. చేతులు నొప్పెడుతున్నాయి, ఎక్కడ జారిపోతాడో అని భయంగా వుంది, ఏడుపొస్తోంది వాడికి, ఏడుస్తున్నాడు కానీ చేతులు దూడను వదలటం లేదు. ఒక చేతికి కొంచెం అలుపిచ్చి, మళ్ళీ ఇంకోచేతికి కొంచెం అలుపిచ్చి అలా ఎలాగో కష్టపడి దాన్ని పట్టుకునే వున్నాడు. ఎంతో సేపటికి వాళ్ళ స్నేహితులు వీడి కోసం వెతికేది వినపడి అరిస్తే వచ్చి దాన్ని కాపాడారు. అందరూ వాడ్ని మెచ్చుకున్నారు. ఇంటికెళ్ళాక సీతయ్యకు విషయం తెలిసి, ఒరేయ్ చిన్నోడ్ని వదలకుండా అంతసేపు అంత కష్టపడి పట్టుకున్నావెందుకురా అని అడిగితే. దాన్ని వదిలితే అది క్రింద పడి దానికేమైనా కావచ్చు, అది నా తమ్ముడు నాన్నా దానికేమైనా అయితే నాకు బాధేస్తుందన్నాడు. సీతయ్య వాటి మీద రాముకున్న బంధాన్ని చూసి ఆనందపడ్డాడు.
ఒకరోజు రాత్రి బాగా వర్షం కురుస్తుంది, సీతయ్య లేచి చాలా వర్షం పడుతుంది, గొడ్లపాక ఎట్లుందో చూసొస్తానని బయటికెళ్ళాడు, గౌరమ్మ కూడా వాకిట్లో నిలబడి చూస్తుంది. ఇంతలో పక్కన కొద్ది దూరంలోనే వున్న పాడుబడిన చెట్టు విరిగిపడిన శబ్దం వచ్చింది. ఏమయ్యిందో చూద్దామని సీతయ్య అటు పక్కకెళ్ళాడు. అలా వెళ్ళాడో లేదో, తను ఏ చెట్టు కింద నిలబడున్నాడో దాని మీద పిడుగుపడి నిమిషంలో కాలి పోయాడు. అది దూరం నుండి చూసిన గౌరమ్మ, "అయ్యో!" అని అరుస్తూ కుప్పకూలిపోయింది. ఆ శబ్దాలకు అందరూ బయటకొచ్చారు. చూసేసరికి ఇద్దరూ విగత జీవులై పడున్నారు. రాము ఏడ్చే ఏడుపును ఓదార్చే శక్తి ఎవ్వరికీ లేకుండా పోయింది. సుబ్బమ్మవ్వ ఏడుస్తూనే వీళ్ళ అన్యోన్యం చావులో కూడా వీరిని విడవలేదంటూ గొప్పగా చెప్తూనే వుంది. కొంతమంది బంధువులొచ్చారు కార్యక్రమాలన్నీ సవ్యంగా పూర్తి చేసారు. అప్పటికి రామూకు ఇంకా పన్నెండేళ్ళే అందుకే వాళ్ళ మేనమామ తానుండే చిన్న పట్నానికి రామును తీసుకుపోతాను, అక్కడే మాతోనే వుంచుకుని ఏదైనా పని నేర్పిస్తే, చేస్కోని బ్రతుకుతాడన్నాడు. వాడు ఏమీ పలక లేదు. తర్వాత వాళ్ళ మామ ఆవులని అమ్మకానికి పెట్టాడు. ఒక్కొక్కరు ఒక్కోటి కొనుక్కుంటామన్నారు. అన్నింటినీ ఒకరే తీస్కోటానికి ముందుకు రాలేదు, సరేలే అని అలాగే అమ్మాలనుకున్నారు...
ఇంక అప్పుడు మాట్లాడేడు రాము, మామయ్యా! వీటిని అమ్మొద్దు, నేనే వీటిని చూస్కుంటూ ఇక్కడే వుంటా అన్నాడు. ఎలా వుంటావురా ఒంటరిగా, నీకు తిండెట్టా అంటే కూడా నేను రానని మొరాయించాడు. ఊర్లో వాళ్ళు చెప్పి చూసారు, వినటం లేదు. ఇంక సుబ్బమ్మవ్వ వాడి దగ్గర కూర్చొని లాలనగా చెప్పాలనుకుంది.
“రామూ! నీకూ మీ నాయన సాలే వచ్చిందిరా. వాడూ ఒక్కడే కొడుకూ, వాడూ చిన్నవయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. కానీ వాడప్పుడు నీయంత చిన్నవాడు కాదురా పదిహేడేళ్ళ పైగానే వుంటాయి. నీవు మరీ చిన్నవాడివిరా వెళ్ళి మీ మామయ్య దగ్గర వుండ “మనింది. నేనెళ్ళనన్నాడు, మొదట వెళ్ళడానికి ఏమననోడివి ఇప్పుడేందిరా ఇలా మొండికేసావు అని లాలనగా అడిగితే. వాడు ఏడుస్తూ అవ్వతో “నాకెలాగూ అమ్మానాన్న దూరమయ్యారు, బండోడికి, చిన్నోడికి వాళ్ళమ్మ దూరం కాకూడద”నన్నాడు.
దానికవ్వ వాడి వెన్నలాంటి మనసు చూసి వాడికి తనే చేతనయినంత సాయం చేస్తూ, ఊర్లోవాళ్ళనే అప్పుడప్పుడూ వాడి మంచి, చెడు చూస్కుంటూవుండేలా అందరికీ సర్ది చెప్పాలని నిర్ణయించుకుంది.
ఇలా వుంటాయి పల్లెల్లో జీవించే మనుషుల స్వచ్ఛమైన మనసులు, వారి జీవితాలు. కుళ్ళూ కుతంత్రాలకు దూరంగా, కల్మషం లేని జీవితాలు వారివి. పచ్చని ప్రేమ జంటని ప్రకృతి తనలోకి ఐక్యం చేసుకుంది. అయినా వారు ప్రకృతిని నాశనం చెయ్యరు, ప్రకృతిలోనే మమేకమై జీవిస్తారు.
-----×-----
ఇప్పటి యువత ప్రేమకు, పెళ్ళికి సరైన అర్థం తెలీక విడాకులు తీసుకోవటం కూడా ఎక్కువయ్యింది. నేటి యువత మనుషులతో కంటే మర యంత్రాలతో ఎక్కువగా కాలం గడిపేస్తున్నారు. కానీ అక్కడైనా ఏం చేస్తున్నారు ఎవరో తెలియని వారితోనో, తెలిసినా దూరంగా వున్న వారితోనో మాట్లాడ్తున్నారు, 'దూరపు కొండలు నునుపు' అన్న చందాన. దగ్గరలోని వారు కంటికి ఆనరు, ఎక్కడో వున్న వారు, వాళ్ళకు ప్రొద్దుపోవటానికి కొంచెం పొగిడి, కాస్త పలకరించుదాం అనుకునే వారిది గొప్ప అభిమానమనో, ప్రేమనో అనుకుని గంటలకు, గంటలు మాట్లాడేస్తుంటారు. కుటుంబంలోని వారు కాస్త కసురుకున్నారనో, పలకరించలేదనో చిన్న, చిన్న వాటికి కూడా విడిపోవాలని సిద్ధపడే వాళ్ళు ఎందరో తయారవుతున్నారు. తీరా ఇక్కడ కుటుంబాన్ని వదులుకుని సోషల్ మీడియాలో పలకరించిన వారి దగ్గరకు వెళ్ళినా, అక్కడా కొన్ని రోజులలోనే అదే పరిస్థితి. వీళ్ళకు తెలియని దేమంటే మనం ఇతరులను ప్రేమగా చూస్తేనే ఇతరుల నుండి ప్రేమ లభిస్తుందనే విషయం. ఇంక మర యంత్రాలతో కాదని, మర బొమ్మల నుండి ప్రేమ దొరకాలన్నా కూడా మనం దానికి ప్రేమ అనేదాన్ని ప్రోగ్రాం చేయాలి, అప్పుడే అది ప్రేమను గుర్తించ గలుగుతుంది. దానికైనా అది ఆ భావనను ఎలా గమనించాలనే విషయాన్ని నీవెలా ప్రోగ్రాం చేస్తావో అలానే తీస్కుంటుంది, అలానే ప్రవర్తిస్తుంది. అంటే మర యంత్రాలు కూడా నీవు నేర్పించిన ప్రేమనే తిరిగిస్తాయి. అంటే అటు తిరిగి ఇటు తిరిగి చివరకు జీవరాశి అయినా, జీవము లేని రాశి అయినా మనం ప్రేమను ఇస్తేనే తిరిగి ప్రేమనిస్తాయని అర్థమయింది కదా. అంత దానికి అందమైన ప్రకృతిని నాశనం చేసి, అంతటా వ్యర్థాలను ప్రోగేసి, అనారోగ్యాల పాలయ్యి, ప్రకృతిని నాశనం చేయటం కంటే తమ తోటి వారిని, ప్రకృతిని ప్రేమిస్తూ ఆనందంగా జీవించడం ఉత్తమోత్తమం.
అందుకే నేటి యువతను పచ్చని ప్రేమతో జీవిస్తూ పచ్చదనాన్ని, ప్రకృతిని కూడా ప్రేమించమని కోరుకుంటున్నాను.
నా మాట
ప్రకృతిలో మరణమూ, పుట్టుక రెండూ ఒకటే,
ప్రకృతిలో నాశనము, సృష్టి వేరు కాదు,
అవిరామంగా జరిగే ఈ క్రమమే ప్రకృతి వునికి,
దాని నాశనమే అందరి వినాశనానికి హేతువు.
ప్రకృతి అంటే చెట్లు, చేమలు, కొండలు,
కోనలు, నదులు, సెలయేళ్ళు మాత్రమే కాదు, మనుషులతో పాటు వుండే మిగిలిన జీవరాశి అంతా కూడా ప్రకృతే.
ఒక జీవరాశి అవశేషాల నుండి ఇంకో జీవరాశి పుడుతుంది. ఒక జీవరాశి నుండి వచ్చే వ్యర్థాన్ని ఇంకో జీవరాశి తన అవసరంగానో, ఆహారంగానో చేస్కుని బ్రతుకుతుంది. ఇలా ప్రకృతి చక్రము ఒక పద్ధతిలో ఎప్పుడూ నడుస్తుంది. అలాంటి ప్రకృతే అవసరంలో రక్షిస్తాడని మనిషిని సృష్టించింది. కానీ మనిషి ప్రకృతిలో అంత సులభంగా జీర్ణం కాని వ్యర్థాలను సృష్టిస్తూ ప్రకృతి చక్రాన్నే అస్తవ్యస్తం చేస్తున్నాడు.
ఎవరైనా దేని మీదైనా ప్రేమ వుంటే దానిని భద్రంగా చూస్కుంటారు. ఎప్పుడైతే మనిషికి కృత్రిమమైన వాటి వల్ల తమ అవసరాలు తీరడం మొదలయ్యిందో, అప్పటి నుండి ప్రకృతి మీది ప్రేమ సన్నగిల్లిపోతుంది.
అవసరానికి యంత్రాలను తమకు తాముగా సృష్టించుకోవటం వల్ల వాటి అవసరం తీరగానే వాటిలో కొన్ని వేటికి ఉపయోగపడని చెత్తగా మిగిలిపోతున్నాయి. ఇలానే కొనసాగితే మనుషులు, యంత్రాలు, చెత్తే మిగిలి పోతాయి. అందుకే ప్రకృతి పై ప్రేమను పెంచుకోవాలని కోరుకుంటూ ఈ కథ వ్రాసాను.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
నేను చదివింది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ గృహిణిగా స్థిరపడ్డాను. కవితలు, కథలు వ్రాయటం నా ప్రవృత్తి. పదవతరగతి ఆటోగ్రాఫ్లో వ్రాయటంతో మొదలయ్యింది. ఏదైనా శుభాకాంక్షల్లాంటివి చెప్పటానికి, ఎవరైనా అడిగితేనో వ్రాయటం చేసేదాన్ని. నేను అప్పుడప్పుడూ వ్రాసుకున్న కథలను చదివిన మా అమ్మాయి నన్ను కథలు బాగా వ్రాయగలవని ప్రతిలిపిలో వ్రాసేలా ప్రోత్సహించింది. కొన్ని నెలల నుండి కథలు, కవితలు ప్రతిలిపిలో వ్రాస్తున్నాను. నేను నా కథలు సమాజానికి ఉపయోగ పడేలా వుండాలి అనే ధోరణిలోనే చాలా మటుకు వ్రాసాను. ఇప్పటికి హాస్యం, హారర్, డిటెక్టివ్ లాంటి అన్ని రకాలలో కథలు వ్రాసాను. రకానికొక్క కథైనా వుండాలని అన్ని రకాల కథలను ప్రతిలిపిలో వ్రాసాను.
Guru M • 9 hours ago
Lavanya: Its nice story with good message, congratulations.