top of page

పందిట్లో పెళ్లవుతున్నది! 'Panditlo Pellavuthunnadi' - New Telugu Story Written By Vijayasundar

Published In manatelugukathalu.com On 13/01/2024

'పందిట్లో పెళ్లవుతున్నది' తెలుగు కథ

రచన: విజయా సుందర్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్"పిల్ల చాలా బాగున్నది కదరా" తల్లి మాటకి రాజీవ

 ముక్తసరిగా, "ఆ.. బాగున్నదమ్మా"అన్నాడు. కొడుకు ఇంత ముక్తసరిగా మాట్లాడటం ఎరగని శాంత విస్తుపోయింది! 


 తల్లి తాము చూసి వచ్చిన అమ్మాయి గురించి తన అభిప్రాయం చెప్పమంటే రాజీవ్, " అమ్మా! ఆ అమ్మాయి చాలా అందంగా ఉన్నది. కానీ.. మర్యాద అనే మాటకు అర్థం తెలియని దానిలా విసురుగా కూర్చుని, ‘మిస్టర్ రాజీవ్! నాకు ఇప్పుడ్డప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. అదీ ఇలా సంతలో పశువులా, ఓ ఎక్జిబిట్ లా అసలే ఇష్టం లేదు. మా నాన్న చాదస్తంతో.. ఎనీవే నేను ఆయన కూతుర్నే. నాకు మీ సంబంధం ఏ రకంగానూ నచ్చలేదని చెప్పేస్తాను’ అని వెళ్ళిపోయింది. 


“అమ్మా! ఇదా పద్ధతి ? అసలు నాకు ఏమి మాట్లాడటానికి ఇష్టమనిపించట్లేదు. నిష్కర్షగా చెప్పెయ్యండి వద్దని" అని రాజీవ్ విసురుగా లేచి వెళ్ళిపోయాడు. 

 ఆ మాటలు విన్న శాంత, భర్త రామనాథం నిస్పృహతో నిట్టూర్చారు!


కాఫీ అడగడానికి వచ్చిన రాజీవ్, ఇంకా ఆలోచిస్తూ అక్కడే కూర్చున్న తల్లిదండ్రుల్ని చూసి ఆశ్చర్యపోయాడు. 

"అదేమిటి నాన్నా అలా అయిపోయారు? ఆ అమ్మాయి మీ ప్రాణ స్నేహితుడి కూతురు.. ఆంతే కదా అంతమాత్రాన, నేను ఆ అమ్మాయిని కాదంటే ఇంతలా రియాక్ట్ అయ్యారేమిటీ?" అన్నాడు. 


"రాజూ! కొన్ని విషయాలు నిలుచున్న పళంగా తేల్చి చెప్పలేము నాన్నా! ఆ అమ్మాయి తండ్రి నాకు స్నేహితుడు ఒక్కడే కాదురా.. నా ప్రాణదాత!"


"ప్రాణదాతా?"


శాంత రాజీవ్ భుజం మీద చెయ్యి వేసి అనునయంగా, "మీ నాన్న కి నువ్వు నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడు షుగర్ పెరిగి రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి! నా కిడ్నీ సూట్ కాలేదు. కొనడానికి ప్రయత్నం చేస్తే ఏవీ సూట్ కాలేదు. 

అప్పుడు తన ప్రాణ స్నేహితుడు గంగాధరం, "అరేయ్ ఏంట్రా అలా కృంగిపోతున్నావు? నువ్వు డిప్రెస్ అయితే ఈ సంసారానికి దిక్కెవరు? నాకు రెండు కిడ్నీలున్నాయి కదరా.. నీకొకటిస్తాను.. అంతే సింపుల్" అంటూ ఏదో రెండు ఆపిల్స్ ఉంటే ఒకటి ఇస్తానన్నంత తేలిగ్గా అన్నాడు. 


అన్నీ తానే నిర్ణయాలు తీసుకుని డాక్టర్ తో మాట్లాడి, తన కిడ్నీ మ్యాచ్ అయిందని తెలుసుకుని, అన్ని ఏర్పాట్లు చేసి, కిడ్నీ ట్రాన్సప్లాంట్ చేయించేశాడు. 


తన కుటుంబం నుండి ఎంత వ్యతిరేకత వచ్చినా కేర్ చెయ్యలేదు. భార్య రెండేళ్లు పుట్టింట్లోనే ఉండి పోయింది. నాన్న తన వలన వాళ్లిద్దరూ విడిపోతున్నారని, ఆవిడ దగ్గరకు వెళ్లి, బతిమాలి, బామాలి పిల్లకోసమైనా తప్పదని ఇద్దర్నీ కలిపారు. తిరిగి వచ్చిందన్న మాటే గానీ, భార్యాభర్తల మధ్య అగాధం ఏర్పడిపోయింది. నాన్న తన వలననే అని బాధపడితే గంగాధరం, " నీ మొహం నీ వల్లనేమీ కాదురా. నేను చదువుకునే రోజుల్లో వాళ్ళ ఇంట్లో వారాలు చేసుకున్నాను. వాళ్ళ నాన్న కష్టపడి పైకొచ్చే నన్ను మెచ్చి, ఆవిడ మెడలు వంచి మా పెళ్లి చేసాడుట. అది నాకు తెలియదు. అందుకని నేనెప్పటికీ ఆవిడకి రాంగ్ నెంబర్నే" అని ఓదార్చేవాడు. " తల్లి ముగించింది. 

 


 రామనాథం, "ఈ మధ్య వాడు కూతురి గురించి బాధపడ్డాడు. చిన్నప్పుడు తన దగ్గరే ఎంతో మాలిమిగా ఉండే పిల్ల, పెద్దది అవుతున్నప్పట్నుండి తల్లి ప్రభావం పడుతున్నదనీ, తొందరగా పెళ్లి చేసి పంపాలని ఉన్నదనీ, మనలాంటి మంచి ఇంట్లో అయితే బాగుంటుందని తన మనసు విప్పి చెప్పాడు. అందుకే మేము ఆశపడ్డాము ఇలా వాడి రుణం తీర్చుకోవచ్చునని.. కొడుకు మనసులో మెదిలే ఆలోచనలు పసికట్టినట్లు ఆయన, "అలాగని నీ ఇష్టానికి వ్యతిరేకంగా చెయ్యాలని కాదు.. అయినా ఆ అమ్మాయి తనకి ఇష్టం లేదని చెప్పేస్తానన్నది కదా. చూద్దాం ఏం జరుగుతుందో?" అన్నాడు. 

***

రాజీవ్ ముఖకవళికలను బట్టి, తన కూతురి గురించి తెలిసిన గంగాధరం వాళ్ళు వెళ్ళగానే మిహిరను నిలదీసాడు. 

"అవును నేను చెప్పాను అతను నాకు నచ్చలేదని" నిర్లక్ష్యంగా చెప్తున్న మిహిరని చురచురా చూస్తూ, "ఆ అబ్బాయికి ఏమి లోపమున్నదని నచ్చలేదో చెప్పమ్మా" లేని సహనం తెచ్చుకుని అడిగాడు. 


"నాకు నచ్చలేదంతే. "" అంటే కేవలం నేను చెప్పిన సంబంధమని, అంతేనా?". మిహిర తల్లి రాధ, "దానికి నచ్చలేదంటే వినరేమిటీ? మీకెందుకంత పట్టుదల?"


ఎన్నడూ రానంత కోపమొచ్చింది గంగాధరానికి, "నువ్వు నోర్ముయ్.. దాన్ని కూడా నీ లాగానే తయారు చేస్తున్నావు. పిల్లవాడు మేలిమి బంగారం. మిహీ బంగారు తల్లీ! నా మాట వినమ్మా.. నువ్వు చాలా సుఖఃపడతావు. "


కూతురు మౌనంగా ఉండి ఏదో ఆలోచిస్తుంటే రామనాథం, ఆ అబ్బాయి గుణగణాలు ఇంకా వర్ణిస్తూ, "మీ అమ్మకి అంతస్థు సరిపోలేదుట.. అమ్మా నాకున్నదంతా నీదే కదా! ఇంకా ఎందుకు సంపద? అయినా వాళ్ళూ అంత లేని వాళ్లేమీ కాదు. ఆ అబ్బాయి మంచి కంపెనీలో ప్రాజెక్ట్ మానేజర్ పోస్ట్ లో ఉన్నాడు! మీ అమ్మ రాక్షసి!. ఇల్లరికం రావాలంటుంది. అమ్మా నీకు తెలియదు.. ఆ జీవితం నరకం.. నేను అనుభవించాను పెళ్లి అయిన పదేళ్లు. " ఇంకా ఏవో చెప్తూనే ఉన్నారు ఆయన.. మిహిరకి వాస్తవం అప్పుడు గుర్తొచ్చింది. ' అమ్మో గీచి గీచి ఖర్చు పెడతారని చెప్పింది అమ్మ. అయినా ఈ నాన్న తక్కువవాడా అమ్మ ఎన్ని చెప్పింది ఈయన గురించి? అసలు ఎవరన్నా తన శరీరంలో భాగం ఇచ్చేస్తారా? అదీ భార్య ఇష్టానికి వ్యతిరేకంగా.. ఊహు.. నాకు అమ్మని బాధ పెట్టిన వాళ్లంటే అసహ్యం. నా నిర్ణయం సరి అయినదే' అని తలపోసి, "నాన్నా! నువ్వు అమ్మని అంతలా ఆడిపోసుకోవటం నాకు నచ్చలేదు. నాకు వాళ్ళు నచ్చలేదని చెప్పేసెయ్యి వాళ్ళకి!" మిహిర మాటలు గంగాధరానికి ఆశనిపాతాలయ్యాయి! 


ఈ విషయంలో చాలా పట్టుదలతో ఉన్నాడేమో, ఆఖరి అస్త్రం కూడా ఉపయోగించాడు. "మీ అమ్మ ఈ ఆస్తి తన తండ్రిది అనుకుంటున్నదేమో.. చాలా భ్రమలో ఉన్నదని చెప్పు. వాళ్ళ నాన్న మిగిల్చింది ఈ ఇల్లు మాత్రమే! ఈ ఆస్తంతా నా స్వార్జితం! నీ బాగు కోసమే ఈ సంబంధం చేసుకో మంటున్నాను. నువ్వు మొండికేస్తున్నావు. నేనూ మొండివాణ్ణే. ఈ ఆస్తిలో నీకు, మీ అమ్మకి ఎటువంటి హక్కు లేదని పత్రాలు తయారు చేయించేస్తాను. దీనికి తిరుగులేదు అంతే! ఇంకా ఏమిటి మీ అమ్మని బాధ పెట్టానంటున్నావు కదూ.. ఎవరు ఎవర్ని ఎలా బాధ పెట్టారో మీ అమ్మనే అడుగు. నా నోరు తెరిపించకు. మర్యాదగా నువ్వు ఈపెళ్ళికి ఒప్పుకోవడం ఒక్కటే నీకున్న ఛాయిస్!"ఆ తల్లి కూతుళ్లు మ్రాన్పడిపోయారు.. ఎంత మాత్రమూ ఊహించని ఈ మలుపుకి!


అప్పుడే తన ఆలోచనల్ని అమలు చేయడం మొదలుపెట్టేసాడు గంగాధరం.. బీరువా తాళం చెవి తన దగ్గరే పెట్టుకున్నాడు. జాయింట్ అకౌంట్లు సింగిల్ ఆపరేషన్ చేసేసాడు.. హడలి పోయారు తల్లీ కూతుళ్లు!

**

 గంగాధరం, రామనాథంతో తన బాధనంతా చెప్పుకున్నాడు.. ఆయన తన కొడుకుని ఈ పెళ్లికి సుముఖుణ్ణి చెయ్యాలని బ్రతిమాలాడు.. "మిహిర. చెడ్డది మాత్రం కాదురా రామం.. నాకు నమ్మకముంది రాజు దాన్ని దారిలో పెట్టగలడని" స్నేహితుడి కన్నీళ్లు రామనాథాన్ని ఆలోచింపచేసాయి.. 'తన కూతురే ఇలా ఉంటే.. ' అంతే, "పెళ్లికి ముహూర్తాలు పెట్టించరా" అన్నాడు. 

***

 రాజీవ్ తండ్రి మాటకి, ఋణవిముక్తికి, మీదు మిక్కిలి తనకి ఆ అమ్మాయిని చూడగానే కలిగిన గిలిగింత తలపులకి, ఆమెని తాను మార్చుకోగలనన్న ధైర్యానికి బద్ధుడై, పెళ్ళికొడుకు అయినాడు!


 వేద మంత్రాలు, పెళ్లి జరిగేటప్పుడు ఆ సాన్నిహిత్యం మిహిర అంతరంగాన అతని మీద ప్రేమ కలిగిస్తున్న ప్రతిసారి, తల్లి వాళ్ళ గురించి చెప్పే హీనోక్తులు మనసును ఎదురు తిరిగేట్లు చేస్తున్నాయి. దాంతో ఆమె ప్రవర్తన నలుగురూ చెవులు కొరుక్కునేట్లు ఉన్నది. 


తనదైన వ్యక్తిత్వంతో రాజీవ్, మిహిర ప్రవర్తనని అడుగడుగునా కమ్ముకుంటూ వస్తున్నాడు. శాంత, రామనాథంలు అన్నీ తెలిసిన వాళ్ళు కనక తమ ప్రేమతో మిహిరని శాంతపరుస్తున్నారు. అత్తగారిల్లంటే ఎంత విముఖాత ఉన్నా, అక్కడ ఉన్న మూడు రోజులూ రామనాథం, శాంతల అన్యోన్యత మిహిరని అబ్బురపరచింది! 


'ఆంటీ ఎందుకు అంకుల్ పిలవగానే 'జీ హుజూర్ 'అన్నట్ల వెళ్తుంది అనుకున్నానో లేదో అంకుల్ అందరి ఎదురుకుండానే ఆంటీ కాళ్ళకి నూనె రాస్తున్నారు! నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను!. ఇంత పెద్ద వాళ్లయినా, ఇద్దరూ కలిసి కూర్చుని, హాసప్రతిహాసాలతో, ఒకరికొకరు సాయ చేసుకుంటూ.. ఇలా ఉంటారా భార్యా భర్తలంటే.. " తన తల్లిదండ్రుల దగ్గర ఎన్నడూ చూడని ఈ సన్నివేశాలు మిహిర హృదయంలో ఓ సున్నిత కోణాన్ని తట్టి లేపాయి!


రాధ నిర్లక్ష్య వైఖరి తెలిసిన గంగాధరం, రాజీవ్ కోరినట్లు తమ ఇంట మూన్నిద్రలు లాంటి సాంప్రదాయాలని పక్కన పెట్టేసి, నూతన వధూవరులు హనీమూన్ కి వెళ్లడానికి ఒప్పుకున్నాడు. రాజీవ్ తన ఖర్చుతో, తన లైఫ్ స్టైల్ లో మాత్రమే భార్యతో ఊటీ, కోడైకెనాల్ వెళ్లడానికి డిసైడ్ అయ్యాడు!

***

 ఎంతో సతాయించాలని, తన తండ్రి మీద పగ, భర్త మీద తీర్చుకోవాలని ఎన్నో ప్లాన్లు తల్లితో కలిసి వేసిన మిహిరకి, రాజీవ్ ప్రవర్తన అవకాశమే ఇవ్వలేదు. 


సుందర ప్రదేశాలన్నీ ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా ఒక ప్రాణస్నేహితుడు లాగా తిప్పి చూపించాడు. ఒక్కటే మంచం మీద పడుకున్నా ఎటువంటి వికారమూ లేకుండానే ఉన్నాడు! మిహిర ఒకానొక చలిరాత్రి దగ్గరగా రాబోయినా, సున్నితంగా పక్కకి జరిగి లేచి వెళ్లి సోఫాలో పడుకున్నాడు. ఆ రోజు మొదలు ప్రతీ రాత్రీ అంతే! మిహిర అహానికి అది పెద్ద దెబ్బ! ఉక్రోషంతో కసి, కోపంతో మిహిరని ఆందోళన, ఆవేదన, అనురాగం ముప్పిరిగొనగా రాజీవ్ స్థితప్రజ్ఞతతో, ఏమాత్రం కొరుకుడు పడకుండా నిలిచాడు!


రామనాథం రోజూ కొడుక్కి మెసేజ్ చేసి విషయాలు తెలుసుకుంటున్నాడు. శాంతకి భర్త ద్వారా తెలుస్తున్నాయి. ఒకరోజు శాంత రాజీవ్ కి, "మరీ ఓవర్ డోస్ ఇవ్వద్దు.. వికటించగలదు" అని. మెసేజ్ చేసింది. 


 


ఫస్ట్ క్లాస్ కుపేలో రాజీవ్ నిద్రపోకుండా, అటు ఇటు మెదుల్తున్న భార్యని, "ఏమయ్యింది నా చిన్నీ" అన్నాడు. 

అంత తలనెప్పిలోనూ ఉలిక్కిపడ్డది మిహిర, తన తండ్రి తనను మొన్న మొన్నటిదాకా ప్రేమతో పిలిచిన పిలుపు.. వివశురాలైపోయింది.. ప్రేమ కోసం వాచి పోయిన ఆ చిన్న ప్రాణం! తనను దగ్గరకు తీసుకుంటున్న రాజీవ్ ని చుట్టుకుపోయి బావురుమన్నది. ఏదో మాట్లాడుతున్న ఆమె పెదవులని తన పెదవులతో మూసేసాడు! ఆ రాత్రి వారి తొలిరేయి అయింది!

**

 కూతురి కోసం బెంగ పడి జ్వరం తెచ్చుకున్న తల్లిని చూడటానికి వచ్చినరోజునే పుట్టినింటికి వెళ్ళింది.. ఎవరితోనూ చెప్పకుండా వెళ్ళడానికి చెప్పులు వేసుకుంటున్న మిహిరని ఆపి, "నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పక్కర్లేదా?"


రాత్రి అంత మార్దవంగా, సన్నిహితంగా మెసిలిన భర్త కరకు కంఠంలోని అధికార ధోరణికి కంగుతిన్నది మిహిర! ఒక్క నిమిషంలో ఆమెలోని ఆభిజాత్యం పడగ విప్పి "నాకు ఎవరి పర్మిషన్ అక్కర్లేదు" అన్నది. 


"ఇది పర్మిషన్ కాదు ఇన్ఫర్మేషన్. ఈ ఇంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఈ ఇంటి సభ్యులు పాటించి తీరాలి!"

"షిట్! ఆఫ్ట్రాల్ నేను మా ఇంటికి వెళ్ళడానికి.. "


"ఓకే నాకు ఇన్ఫర్మేషన్ అందింది. నువ్వు భోజనానికి వస్తావో రావో చెప్పి వెళ్ళాలి. మా ఇంట్లో మేము అనవసరంగా వేస్ట్ చెయ్యము" రాజీవ్ మాట లెక్కలేనట్లుగా వెళ్ళిపోయింది!


తల్లి ఉద్బోధలు, రాజీవ్ తో గడిపిన మధురమైన కాలాన్ని మరుగున పడేసి, మిహిరలోని మూర్ఖత్వాన్ని తట్టి లేపింది. 

 అత్తగారింట్లో ఎలా గొడవలు లేవదీయాలో, .. అదీ అవతలి వాళ్లదే తప్పనిపించేట్లు, తన భర్త చేసిన పెళ్లిని ఎలా తలక్రిందులు చేయాలో వైనవైనాలగా చెప్పింది. మిహిరలో ఉన్న ద్వంద్వ ప్రకృతి ఆమెని పూర్తిగా తల్లి మాట శిరోధార్యంగా తీసుకోనివ్వడం లేదు.. రాజీవ్ సాన్నిహిత్యం కోరుకుంటున్న మనసు, శరీరం అందుకు ఒప్పుకోవడం లేదు. ఆ చిరాకంతా తల్లి మీదే చూపించి అన్నం తినకుండా వచ్చేసింది. సరిగ్గా బైట అడుగుపెట్టగానే బయటకు వెళ్లి వస్తున్న తండ్రీ కనపడ్డాడు. ఆయన చేసిన పెళ్లి అని ఆయన్ని నాలుగు దులిపేసింది.. అన్నింటికీ పర్మషన్ అడగాలని ఆంక్షలు విధిస్తున్నాడు రాజీవ్ అంటూ. అప్పుడే రాజీవ్ తో మాట్లాడి అంతా బాగుంటుందన్న ఆశాభావంతో ఉన్న గంగాధరం గారు చిన్నబోయారు!

**

మిహిర అన్నం తినటానికి వచ్చి, డైనింగ్ టేబుల్ ఖాళీగా ఉండటం చూసి, అవాక్కయింది!. "నేను అన్నం తినాలి. అక్కడ ఏమీ లేవు" మిహిర విసురుగా అంది. అప్పడే ఆమెని చూస్తున్నట్లు రాజీవ్, " ఓ నువ్వు అన్నం తినాలా? మాకు తెలియదే నువ్వు భోజనానికి వస్తావని. అమ్మా వాళ్ళు పెళ్లికి వెళ్లారు. నేను మా ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ లో భోజనం చేసేసాను. అదేమిటీ మీ అమ్మ అన్నం పెట్టలేదా?"

మిహిర ఆకలికి.. కళ్ళు తిరిగినట్లై పడబోయింది. రాజీవ్ లోని మనిషి మేల్కొన్నాడు. గబగబా లేచొచ్చి మిహిరని మంచం మీద పడుకోబెట్టి, మారు మాట్లాడకుండా షర్ట్ వేసుకుని, దగ్గర్లో ఉన్న కర్రీ పాయింట్ లో అన్నం కూరలు తెచ్చి, గబగబా ప్లేట్ లో అన్నం కూరలు కలిపి నోట్లో పెట్టాడు. మిహిరలోని అహం బుసలు కొడుతున్నా, ఆకలి, రాజీవ్ ప్రేమ మారుమాట్లాడకుండా కలిపినవన్నీ తినేసేట్లు చేసింది. 


రాజీవ్ కి బాగా అర్థమయింది మిహిరలోని ద్వంద్వ ప్రవృత్తి! 'ఎలా కాపాడుకోను నా చిన్నిని, తల్లి అనే ఆ రాక్షసి నుండి?


*** 

పసిపిల్లలాంటి మనసు ఒకవైపు తల్లి మాటలకి తాన తందాన అనే అహంకారి మిహిర మరోవైపు! తాను బాధపడుతూ, భర్తని, అత్తమామల్ని బాధ పెడుతూ, ఆఖరికి తల్లి మాట ప్రకారం భర్త దగ్గరకు వెళ్లక యాడాది గడిచిపోయింది. 


కొద్ధి రోజులు స్వేచ్ఛాజీవితాన్ని ఎంజాయ్ చేసింది. తోటి వాళ్లందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి.. ఒంటరిగా పార్టీల కొచ్చే మిహిర మీద కన్నేసిన రాహుల్ ఆ రోజు ఇంట్లో దింపుతానని తీసుకు వెళ్లి, తన గెస్ట్ హౌస్ లో బలవంతం చేయబోతే, అదృష్టవశాత్తు ఆ గెస్ట్ హౌస్ వాచ్మెన్ తమ ఇంట్లో డ్రైవర్ గా చేసిన అతను కావడం వలన, రాహుల్ తో కలియబడి రక్షించాడు!, 


బాధాతప్త హృదయంతో తల్లి దగ్గరకు వెళ్లబోయిన మిహిర తండ్రి గొంతు విని ఆగిపోయింది. 


గెస్ట్ హౌస్ వాచ్మెన్ ఫోన్ వలన విషయం తెలిసిన గంగాధరం మళ్లీ చరిత్ర పునరావృతమైతున్నదని గ్రహించి భార్యతో ఒక పుష్కరం తర్వాత ఏకాంతం ఏర్పరుచుకుని', "నీకు జరిగిన అన్యాయం నీ కూతురికి కూడా జరగబోయి, దేవుడి దయ వలన తప్పిపోయింది! నీకెంతమాత్రమన్నా ఆరోజు నా క్షమకు విలువ అనేది ఉంటే వెంటనే దానికి భర్త విలువ తెలియచెప్పి రేపటి కల్లా చీరె సారెతో నువ్వే దింపి రావాలి. ఇందుకు భిన్నంగా జరిగితే, నాకు ఎల్లుండి ఉదయం అనేది ఉండదు" విసవిసా బైటకు వచ్చిన గంగాధరం, కూతుర్ని అక్కడ చూసి, సిగ్గుతో చితికిపోయాడు!


మిహిర, తన తండ్రి పాదాలు తాకి తనని క్షమించమన్నది. కూతుర్ని దగ్గరకు తీసుకొని భార్య దగ్గరకు వెళ్ళాడు. చూడు మిహిరా! ఇప్పుడు నువ్వు విన్నది ఇక్కడే మర్చిపోతానని నీకెంతో ఇష్టమైన మీ అమ్మ మీద ప్రమాణం చెయ్యి. ఇది కేవలం మా భార్యాభర్తలకి మాత్రమే సంబంధించింది! 


మిహిర తల్లి రాధ తన అర్థం లేని అహంకారం కూతురి జీవితాన్నే బలి తీసుకోబోవడంతో, భర్తని క్షమించమని కాళ్ళు పట్టుకున్నది. గంగాధరం భార్యని పొదువుకుని, "తానెప్పటికీ ఆమెకి బాసటగా నిలుస్తా" నన్నాడు. మిహిరకి తండ్రి ఔన్నత్యం, అన్నిటినీ మించి భార్యాభర్తల అనుబంధం యొక్క విలువ, వేదమంత్రాల సాక్షిగా పడ్డ మూడుముళ్ల శక్తి అవగతయింది!

****

రాజీవ్ వివాహానికిచ్చే ఇచ్చే విలువ మూలంగా ఎంతమంది ఎన్నిసార్లు మళ్లీ పెళ్లి చేసుకోమన్నా, , "మిహిర నా భార్య.. మా బంధానికి గ్రహణం పట్టింది కానీ అది వీడిపోనిది! ఇది రాముడు ఏలిన రాజ్యం!" అనేవాడు. రాజీవ్ లాగా భార్యాభర్తల బంధాన్ని అర్థం చేసుకుంటే మామిడాకులే గానీ విడాకులుండవు కదా!

***

పందిట్లో పెళ్లవుతున్నది! మిహిర, రాజీవ్ దండలు మార్చుకుంటున్నారు.. కొడుకు కోడలు, కూతురు అల్లుడు, మనవళ్ళు మనవరాళ్ల సమక్షంలో, షష్టిపూర్తి మహోత్సవంలో!

 సమాప్తము


విజయా సుందర్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/vijayasundar

నా పేరు వారణాశి వెంకట విజయలక్ష్మి. కలం పేరు 'విజయాసుందర్'. నేను ముఖపుస్తక మాధ్యమాలలో రచనలు చేస్తుంటాను. గత 5 సంవత్సరముల నుండియే నేను వ్రాస్తున్నాను. ప్రముఖ ముఖపుస్తకము భావుకలో రెండు గొలుసు కథలు, రెండు సీరియల్స్, అనేక కథలు వ్రాసాను. పలు పోటీల్లో పాలుపంచుకుని అడపా దడపా బహుమతులు గెలుచుకున్నాను. భావుకథసలు పేరిట అచ్చు అయిన పుస్తకంలో నా కథ ' బాజా భజంత్రీలు' ఈనాడు పుస్తకపరిచయంలో చోటు చేసుకున్నది. 'కథాకేళి', 'ప్రియమైన నీకు, పిల్లలు చెప్పిన పాఠాలు' పుస్తకాలలో న కథలు అచ్చు అయ్యాయి. 'భావుక' లో 'బిజ్జు బామ్మ కబుర్లు' అనే శీర్షిక కొన్నాళ్ళు నడిపాను.మన కథలు మన భావాలు, ముఖపుస్తకం లో కూడా ఎన్నో కథలు రకరకాల కాన్సెప్ట్స్ కి తగ్గ రచనలు చేస్తూ ఉంటాను.

'లీడర్', 'ఉదయం', ఇంకా కొన్ని వెబ్ పత్రికలలో నా కథలు చాలా అచ్చయ్యాయి, పలువురి ప్రశంసలు అందుకున్నాయి. నా సాహితీ ప్రయాణంలో పలువురు సీనియర్ రచయితల సూచనలను అంది పుచ్చుకుంటూ నా రచనలను మెరుగు పర్చుకునే దిశలో ప్రయాణిస్తున్నాను. నమస్సులు!
69 views0 comments
bottom of page