top of page

పని-మని-షీ

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link

'Pani Mani Shi' New Telugu Story


Written By Lakshmi Sarma B



అబ్బబ్బా చస్తున్నాను పని చెయ్యలేక! ఒక్కరు కూడా ఇటున్న పుల్ల అటు పెట్టేవాళ్ళులేరు, అంతా తిని కూర్చునేవాళ్ళే. ఏమిటో ఈ చాకిరి.. హాయిగా పెద్ద చదువులు చదువుకుంటేనన్నా ఉద్యోగం చేసుకుంటుండేదాన్ని. ఈ అడవచాకిరి తప్పేది”.. గట్టిగా అంటూనే కడిగిన గిన్నెలను పెద్దచప్పుడు వచ్చేటట్టు బుట్టలో వేస్తోంది అరుణ.


“ అరుణా.. కాస్తా టీ ఇస్తావా!” హల్లోనుండే కేక వేసాడు చైతన్య.


“ ఆహా… ఏది తప్పినా ఇది మాత్రం తప్పరు తమరు. ఎంతపనిలో ఉన్నా అడిగిందే తడవుకావాలి. పాపం

పనిలో ఉన్నట్టుందే.. కాస్తా సహాయం చేసినట్టుంటింది అని టీ పెట్టుకొని నా మొహానా ఇంతపొద్దామే అనే ఆలోచననే రాదు ఈ మనిషికి”.


గొణుస్తూనే రుసరుసలాడుతూ టీ తీసుకొచ్చి భర్త చేతికిస్తూ అక్కడే ఉన్న కూర్చిలో కూర్చుంది అరుణ.


“ అరే.. ఏమైందిరా? ఎందుకంత కోపంగా ఉన్నావు? తలనొప్పిగా ఉందా.. టాబ్లెట్ వేసుకున్నావా.. ” కంప్యూటర్ లో నుండి తల ఎత్తకుండానే అడిగాడు.


“ అవును. నాకేం పనిపాటలేదుగా! ఎప్పుడు కోపంగానే ఉంటాను మరీ, మీకంటే బోలెడు పనులాయే, ” ముక్కు ఎగబీలుస్తూ.


“ అరుణ…. అసలేమయిందో చెప్పకుండా ఈ వ్యంగ్యాలేంటో అర్ధంకాలేదు, ఏమైందో చెప్పురా

నీ బాధేంటో, ” కంప్యూటర్ పక్కన పెట్టి అరుణ దగ్గరకు వచ్చి అరుణ చుబుకం పట్టుకుని

అడిగాడు.


“ అదికాదండి… పని చేసుకోలేక చస్తున్నాను, ఒక్కపనిమనిషి దొరికిచావడం లేదు, మీ అమ్మానాన్నలకు సకలం అందించాలి, ఒంటినిండా బీపిలు షుగర్లు అందుకోసమని, రెండుగంటలకోసారి వాళ్ళకు ఏదో ఒకటి అందిస్తూనే ఉండాలి, కరోనా కాలం వచ్చినప్పటినుండి మీరు ఇంటినుండే పని చేస్తున్నా, హాడావుడి తగ్గుతుందనుకున్నా ఇంకా ఎక్కువే అయింది, మాటిమాటికి టీ అంటారు తినడానికి ఏదో అడుగుతూనే ఉంటారు, ఇక పిల్లలైతే రోజుకో వెరైటి చేస్తే తప్పా టిఫిన్ బాక్స్ లు తీసుకపోరు, ఇంటికి వచ్చాక ఇంకోరకం చేయ్యాలి, ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే గంపెడు గంపెడు గిన్నెలు అవుతున్నాయి, పొద్దుకు పదిసార్లు కడుగుతున్నా సరిపోవడంలేదు, నేను చెయ్యలేనండి మీరు ఏం చేస్తారో ఏంటో నాకు అర్జంటుగా పని

మనిషిని తీసుకరండి, లేదంటే ఎవ్వరి పనులు వాళ్ళుచేసుకోండి, ” చేతులుతిప్పుతూ చెప్పింది అరుణ ఆయాసపడుతూ.


“ సరే నీకు కావలసింది పనిమనిషి అంతేకదా ! నా స్నేహితులను అడుగుతాను, నీకు తెలిసిన వాళ్లింట్లో

పనిమనుషులు ఉండరా వాళ్ళను అడిగి మాట్లాడుకోవచ్చు కదా అరుణ, డబ్బులగురించి ఆలోచిస్తున్నావా ? బయటకు వెళితే ఎంతమంది కనిపిస్తారు పనివాళ్ళు, ఎవరినో ఒకరిని మాట్లాడుకో నీకు ఇబ్బంది తగ్గుతుంది, ” చెప్పాడు చైతన్య


“ అయ్యో రామా… రామాయణం అంతా విని రాముడికి సీతేం కావాలి అన్నట్టుంది మీ తీరు, ”

కాలింగ్ బెల్ మ్రోగడంతో మాట్లాడుతున్నదల్లా ఆపింది. వెళ్ళి తలుపుతీసాడు ఎదురుగా ముప్పై

ఏళ్ళుంటాయేమో ఒకావిడ నిలబడి ఉంది. చూడడానికి బాగుంది జార్జెట్ చీరకట్టింది. జుట్టుకు

రబ్బర్ బ్యాండ్ పెట్టి జుట్టువదిలేసింది. చూస్తుంటే మంచి ఉద్యోగం చేసేదానిలా ఉంది ఎందుకొచ్చిందో

ఏమిటో అనుకుంటూ,


“ ఎవరు కావాలండి మీకు.. ఏదైనా పనిమీద వచ్చారా?” గౌరవంగా అడిగాడు చైతన్య.


ఆమె ఎగాదిగా చైతన్యను చూస్తూ, “ ఏటండోయ్ మీరేకదా పనిమనిషి కావాలని అడిగారట, మా పనిమనుషుల సంఘం నుండి పంపించారు పక్కకు తప్పుకోండి మీ ఆడాళ్ళు ఏరీ, ముందు మీ ఇల్లంతా చూడని నన్ను, ” చకచకా లోపలకి వెళ్ళిపోయి ఇల్లంతా కలియతిరుగుతూ తనలో తాను మాట్లాడుకుంటూ చేతితో ఏవో లెక్కలు వేసినట్టుగా వేళ్ళు కదపసాగింది. పనిమనిషి అనే సరికి చైతన్య ఆశ్చర్యంతో అలానే చూస్తున్నాడు . చూసావా పనివాళ్ళను కళ్ళెగరేస్తూ చైతన్యవైపు చూసింది అరుణ.


“ ఇదిగో మీ ఇల్లంతా చూసాను ఇల్లు పెద్దగానే ఉంది, మీ ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటారు,

ఏమేమి పనులు చెయ్యాలో చెపితే దాన్నిబట్టి లెక్కేసి చెప్పాలి దేనికెంత తీసుకోవాలో, ” అరుణవైపు చూస్తూ అడిగింది.


“ మొత్తం ఆరుగురం ఉంటాము, గిన్నెలు తోమాలి, బట్టలు వాషింగ్ మిషన్‌లో వెయ్యాలి, వారానికొకసారి

ఇంటిచుట్టు కడగాలి, వాకిలి ఊడవడానికి వేరే ఆమె ఉంది, ” చెప్పింది అరుణ.


“ అబ్బో ఇంతమందంటే చాలా పనే ఉంటుంది, మనిషికి రెండువందలు గిన్నెలకు, బట్టలకేమో వాషింగ్ మిషన్‌లో వెయ్యడమే కదా అందుకని మనిషికి నూటయాబై చొప్పున తీసుకుంటాను, మిగిలింది కడగడం అన్నావు దానికో అయిదొందలు ఇచ్చావంటే, రేపటినుండే వస్తాను రమ్మంటావా, ” అడిగింది. గౌరవం మొహమాటం లేదు మనిషికి.


“ చాలా తల్లి… నువ్వడిగినన్ని డబ్బులివ్వటానికి మా ఇంట్లో పైసలచెట్లు లేవుగానీ నువ్వు వెళ్ళిపో

తల్లి, ” అంది అరుణ .


“ ఏంటేంటి… తల్లి గిల్లి అంటున్నావు మర్యాదగా మాట్లాడు, మాకేం గతిలేక రాలేదు మీ ఇంటికి నీ ఇల్లు కాకపోతే, మాకు మస్తుగా దొరుకుతాయి పనులు పని చేయించుకునే రకంలా లేవు, ” రుసరుసలాడుతూ

వెళ్ళిపోయింది వచ్చినావిడ.


“ వామ్మో తుఫాన్ వెలిసినట్టయింది, అరుణ వచ్చినామె పనిమనిషి లా ఉందా అసలు, ” ఆశ్చర్యపడుతూ అడిగాడు చైతన్య.


“ మరదే నేను మొత్తుకునేది పనివాళ్ళ వాలకం ఇలా ఉంది అని, అందుకే చెపుతున్నాను ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే నాకు శ్రమ తప్పుతుంది, పనివాళ్ళ బెడద ఉండదు డబ్బులు మిగులుతాయి, ” అంది.


“ అదికష్టం అరు… నువ్వింకేదన్న ఉపాయం చెప్పు, మాకెవ్వరికి పనులు చేసే అలవాటులేదు నువ్వలా

తయారు చేసావు, నువ్వు చేసిపెట్టడం మేము తిని పెట్టడడం అలవాటయింది, ఇప్పుడు కొత్తగా పనులు

నేర్చుకోమంటే అది అయ్యే పనికాదు, ” నవ్వుతూ అన్నాడు చైతన్య .


“ అవునవును నేను చేసి పెడుతున్నన్నీ రోజులు కమ్మగపుల్లగా తింటూ కూర్చోండి, ఏదో ఒకరోజు నేను

మూలన పడితే అప్పుడు తెలుస్తుంది అందరికి, ” కోపంగా భర్తవైపు చూస్తూ అన్నది.


“ అయ్యో … నిండింట్లో అవేం మాటలే తల్లి, నువ్వు మంచిగా ఉంటేనే మా ముసలి ప్రాణాలకు ఊరట,

రేపటినుండి మా పనులు మేము చేసుకుంటాము నువ్వేమి దిగులుపడకు, ” అంది కోడలు పడుతున్న బాధలు చూడలేక అరుణ అత్తగారు అన్నపూర్ణమ్మ.


మనసు చివుక్కుమన్నది అరుణకు. పెద్దవాళ్లు పాపం ఇంతపెడితే తినడం తప్పా ఏమి చాతకాని వాళ్ళు,

అనవసరంగా ఏదేదో అంటున్నాను పాపం వాళ్ళిద్దరు చేతనైనన్ని రోజులు కష్టపడ్డారు. అయినా ఈ మాత్రం పనులు చేసుకోవడానికి నేనేదో పెద్ద కష్టపడిపోతున్నట్టు బాధపడుతున్నాను. ఉద్యోగానికి వెళ్ళొచ్చే వాళ్ళు చేసుకోవడంలేదా అనుకుంది అరుణ.


“ అరెరే … నేనేదో సరదాకు ఆయన్ని అన్నాను మిమ్మల్ని కాదు అత్తయ్యా, మీరివయసులో మీ పనులు మీరు చేసుకుంటారా ఇంకా నయం, కోడలిగా నా పరువేం కావాలి చెప్పండి, ” నవ్వుతూ అడిగింది.


“ అలాకాదమ్మా… ఏవో చిన్న చిన్న పనులు మావి మేము చేసుకున్నా నీకు కొంచెం శ్రమ తగ్గుతుంది,

పైగా పనివాళ్ళు దొరకడంలేదాయే అన్ని పనులు నువ్వు ఒక్కదానివే చేసుకోవలసి వస్తుంది, ” బాధపడుతూ అంది అరుణ అత్తగారు. తలుపు కొడుతున్న చప్పుడు విని వెళ్ళి తలుపుతీసింది అరుణ.

ఎదురుగా యాభై ఏళ్ళున్నావిడ నిలుచోని ఉంది.


“ ఎవరమ్మా మీరు… ఎవరు కావాలి?”


“ నాపేరు రత్తాలండి… మీ ఇంట్లో పనిమనిషి కావల్నంట గందా, ఏమి పనుల్నయో చెప్పు జీతం ఎంతిత్తారు

బేగి చెప్పు, ” అంది వచ్చినావిడ.


అమ్మో మొన్న తుఫానులాంటి మనిషి వస్తే ఈ రోజు సునామే వచ్చినట్టుంది అనుకుంటూ.

“ ఆ అవును … ఏమిటో పనిమనిషికోసం వెతుకుతున్నాము గానీ, మంచి మనిషికోసం దొరకడంలేదు,

నేను అంతకుముందు పని చేసినావిడకు ఏడొందలు ఇచ్చేదాన్ని, ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇద్దామనుకున్నాను, ” అంటూ తమ ఇంట్లో ఏమేం పనులు చెయ్యాలో చెప్పింది అరుణ.


“ ఓలమ్మో … పనేమో శానా ఉంది, జీతం గంత తక్కువిస్తే ఎవరు మాత్రం వత్తారనుకున్నారు, ఈబోటి

జీతానికి మంచి మనుషులు కావాల్నట, ఇంకో ఐదొందలు ఇస్తే రేపట్నుంచి చేస్తా అదికూడా ఒంటిపూటనే, ”

అంది ధీమాగా.


“ వద్దులే నేను అంతకంటే ఎక్కువిచ్చుకోలేను వెళ్ళిరా, ” అంది.


“ పో పో అమ్మా … ఎల్లకపోతే నీకాడనే ఉంటాననుకున్నావా ఏంటి? పొద్దుగాలనే బలే బేరం దొరికింది, ”

రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది రత్తాలు. ఊపిరి పీల్చుకున్నట్టయింది అరుణకు రత్తాలు వెళ్ళగానే.

వామ్మో ఏం మనుషులో డబ్బు తప్పా ఇంకో ముచ్చటనేలేదు. లోపల్నుండి అంతా విన్న చైతన్య నవ్వుతూ

బయటకు వచ్చాడు.


“ ఏమిటోయ్ బెదిరిపోయావా ఆవిడ మాటలకు, ” అరుణను ఉడికిస్తూ అన్నాడు.


“ విన్నారా మీరు ఆమె మాటలు, ఇంకా ఐదు వందలు ఇవ్వాలట పోని అంటే ఒక్కటే పూట వస్తుందట,

అంటే ఈ లేక్కన చూస్తే రెండుపూటల వచ్చిందంటే మూడువందలు ఇవ్వాలేమో, వీళ్ళకు బాగా అలవాటయింది ఎంతడిగినా ఇస్తారు అని, వీళ్ళు అలానే ఉన్నారు ఇచ్చే వాళ్ళు అలానే ఉన్నారు, ”

అయాసం వచ్చి కుర్చీలో కూర్చొని తలపట్టుకుంది అరుణ.


“ అరుణ … మా ఫ్రెండ్ చెప్పాడు వాళ్ళింట్లో చేసే ఆవిడా చాలా మంచిగా చేస్తుందట, ఇంటిమనిషిలాగా

అన్ని పనులు చకచక చేస్తుందట, ఆమెను పంపిస్తాను అన్నాడు బహుశా ఈ రోజు వస్తుందేమో,

ఇంద కాసిన్ని మంచినీళ్లు తాగు అలసిపోయావు, ” అంటూ అరుణ తలమీద చెయ్యివేసి నిమురుతూ

అన్నాడు చైతన్య. ఆప్యాయతకు అరుణకు పట్టరాని ఆనందం వేసింది.


రెండురోజుల తరువాతనేమో వచ్చింది చైతన్య ఫ్రెండ్ చెప్పినావిడ. చూడడానికి పొందికగా కష్టసుఖాలు తెలిసిన మనిషిలా ఉంది. “ నమస్కారమండి… నా పేరు చంద్రిక అండి, నన్ను వేణుగారు పంపించారు, ” అంది వినయంగా.


“ అవును మొన్ననే వస్తావని చెప్పారు వేణుగారు, ” అంది అరుణ. పేరుకు తగ్గట్టుంది అమ్మయ్యా ఈవిడను చూస్తే చాలా నెమ్మదిగానే ఉంది. పరవాలేదు నేనుకున్న వెయ్యి రూపాయలు ఇచ్చిన నష్టంలేదు ఈవిడకు. మనిషిని చూస్తేనే తెలుస్తుంది పని చేసేలాగా అనిపిస్తుంది అనుకుంది మనసులో. తను జీతం ఎంతిస్తుంది ఏమేం పనులు చెయ్యాలో చెప్పింది.


“ సరే అండి మీరు చెప్పినవన్ని ఒప్పుకుంటాను కాకపోతే, నాకు కొన్ని షరతులున్నాయండి అవి మీకు

నచ్చితేనే నన్ను పనిలో పెట్టుకోండి, ” అంది చంద్రిక.


అంతా బాగుంది అనుకున్నాక మళ్ళి ఈ షరతులేమిటో. “ చెప్పు నీకేం కావాలో, ” అడిగింది అరుణ.


“ అంతపెద్ద కోరికలేం కాదండి ఏవో చిన్న చిన్నవి, దసరా పండుగకు, బోనాలపండుగకు నాకు కొత్తచీర పెట్టాలి, ప్రతి పండుగకు పండుగ ఇనాం ఇవ్వాలి ఏదో మీకు తోచినంత, ప్రతి ఆదివారం నాకు సెలవుకావాలి,

మీ ఇంటికి చుట్టాలువస్తే బట్టలు గిన్నెలు చాలా ఉంటాయి కదండి, అందుకని డబ్బులివ్వాలి మీరిస్తారో వాళ్ళతో ఇప్పిస్తారో నాకు తెలియదు, నేనెప్పుడైనా అర్జంటు పనిమీద రాలేకపోయాననుకోండి

ఆ గిన్నెల్ని మరుసటిరోజుకు అలాగే పెట్టకండి, రోజు నాకు టిఫిన్ …టీ ఇవ్వాలి రాత్రి చేసినవి ఏమైనా మిగిలి ఉంటే తీసుకపోతాను ఇంట్లో పిల్లలు ఎదురుచుస్తారు ఇంతేనండి నేను చెప్పాలనుకున్నవి, ” అంది.


“ ఏమ్మా… చిన్నవే అంటూ చాట భారతమంత విప్పావు కదా నీ చిట్టా, నువ్వడిగినవన్ని బాగానే ఉన్నాయి

కానీ! ఇవన్ని చూస్తుంటే నువ్వు పనిమనిషిలాగా అడిగినట్టు అనిపించడంలేదు నువ్వే యజమానురాలిగా

చెప్పనట్టుంది, నీ కోరికలు తీర్చటం కొంచెం కష్టమే, మాకు ఏదో మాములు పనిమనిషి చాలు నీకెవరైనా తెలుసుంటే పంపించు, ” అంది. నువ్వు వద్దు అని చెప్పకనే చెబుతూ.


“ అరుణా… ఏం మాట్లాడుతున్నావు? పాపం ఆమె ఏమి అడిగిందని, ఏవో చిన్న చిన్న సరదాలేకదా!

నువ్వు ఈమెను కూడా వద్దంటే ఎలా అరుణా, నువ్వేమి ఆలోచించకు ఇంతకంటే తక్కువకు ఎవరురారు,

అందులో మర్యాద మనిషిలాగా ఉంది, ” అరుణకు చంద్రికకు జరిగినంత విన్న చైతన్య అరుణను లోపలికి

చెప్పాడు .


“ సరేలేండి … నాదేం పోతుంది డబ్బులిచ్చేది మీరేకదా కానివ్వండి నామాటెప్పుడు విన్నారు గనుక, ” చిర్రుబుర్రులాడుతూనే బయటకు వచ్చి, “చూడు చంద్రిక… నేను ఒకటిరెండురోజుల్లో వేణుగారుకి ఫోన్ చేసి

చెబుతాను, ” అంది.


“ మీరు తొందరగా ఏ సంగతి చెబితే నేను వేరే ఇల్లు చూసుకుంటాను, ” అంటూ వెళ్ళిపోయింది.


ప్రస్తుతానికి ఈ గండం గడిచింది ఈ లోపల ఎవరైనా తక్కువలో వచ్చే వాళ్ళను వెతుక్కోవాలి. లేదంటే

అంత డబ్బిచ్చి చంద్రిక అడిగినవన్నీ ఇయ్యాల్సిందే లేకపోతే ఈయన ఒప్పుకోడు. గట్టి ప్రయత్నం చేస్తాను

తనకు తెలుసన వాళ్ళందరిని అడిగింది. వాళ్ళందరూ వాళ్ళింట్లో పనిచేసే మనిషిని

పంపుతామన్నారు చూద్దాం అనుకుంది. మరుసటి రోజు ఇంటర్వ్యూ కు వచ్చినట్టే ఒకరితర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. ఒక్కక్కరు అడిగేదాన్ని చూస్తుంటే అరుణకు చిర్రెత్తుకొస్తుంది.


“ ఏమైందమ్మా ఏం మాట్లాడకుండా చూస్తున్నావు, నా పని నచ్చితేనే నేనడిగినంత డబ్బులివ్వు

లేదంటే నా మానాన నేను పోతాను, ” అలాగే కూర్చొని ఏదో ఆలోచిస్తున్న అరుణను అడిగింది పనికోసం వచ్చిన మంగమ్మ.


“ ఆ …ఆ ఆదే ఆలోచిస్తున్నా… నువ్వడిగిన డబ్బులు నేనివ్వలేనేమో అనుకుంటున్నాను, ” నువ్వు

వెళ్ళిరా, ” అంది. ఇంకచాలు వీళ్ళందరి కంటే గుడ్డిలో మెల్లా అన్నట్టు ఆ చంద్రికనే నయం అనిపిస్తుంది

ఏమన్నా గానీ ఆమెనే పిలుస్తాను .


“ హలో ఎవరున్నారండి ఇంట్లో, ” తలుపు టకటక కొడుతుంటే వెళ్ళి తలుపుతీసాడు చైతన్య.

“ ఎవరండి మీరు…, ” అడిగాడు వచ్చినావిడను చూసి. సేల్స్ గర్ల్ కావచ్చేమో అనుకున్నాడు.

సన్నగా నాజూగ్గా ఉంది జీన్స్ పుల్ షర్ట్ వేసుకుంది. ఒకచేతికి వాచి ఉంది ఇంకో చేతిలో ఫోన్

పట్టుకుని నోటిలో బబుల్ గమ్ నములుతూ నిలుచోని ఉంది.


“ అదేంటి … పనిమనిషి కావాలి అడిగారట కదా! మీ ఆవిడకు ఫ్రేండ్ ట సునితమ్మ పంపింది,

ఏది మీ ఇంటివాడిను పిలు ఏం చెయ్యాలో అడుగుతాను, ” అంది లోపలకు చూస్తూ.


ఓస్ పనిమనిషి కే ఇంత బిల్డప్పా, ఇంకా నయం ఇంట్లోకి పిలిచి సోఫాలో కూర్చోమనలేదు.

“ ఉండు మా అరుణను పిలుస్తాను మీరు మీరు మాట్లాడుకోండి ఎందుకొచ్చిన గొడవ, ” అన్నాడు.


అరుణ వస్తునే ఎగాదిగా చూసింది ఆమెను. అబ్బో పనిమనుషులు ఇలా కూడా ఉంటారా! ఆశ్చర్యంగా చూస్తూ, “ మా సునితవాళ్ళింట్లో చేస్తున్నావా నువ్వు, ” అడిగింది ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్టు.


“ అవును… ఐదేండ్లనుండి వాళ్ళింట్లో చేస్తున్నాను, నా గురించి అంతా చెప్పామన్నాను చెప్పిందా సునితమ్మ, ” అడిగింది రప్ గా.


“ ఆహ … ఏం చెప్పలేదు, ” ఆమె దుడుకుతనం మాటలకు తడబడతూ అంది.


“ ఇదిగో నేను పొద్దున్నే ఐదు గంటలకు వస్తాను పనికి, నేను వచ్చేసరికి మీ ఇంట్లో వాళ్ళందరివి

స్నానం అయిపోవాలి, బట్టలన్నీ వాషింగ్ మిషన్ లో వేసి గిన్నెలు కడుగుతాను, గిన్నెలు ప్లేట్లు కచరలేకుండా

ఉండాలి నీళ్ళు పోసి నానపెట్టండి ఎండిపోతాయి గిన్నెలన్ని, నేను పోయేటప్పుడు చాయ్ పొయ్యాలి

ఆరుగంటలకల్లా నేను పోతాను, ఇంక నెలజీతమొచ్చి సునితమ్మ ఇంట్లో నాలుగువేలిస్తున్నారు,

ఆయమ్మ పంపింది గనుక మీరు కూడా అంతనే ఇవ్వండి, బయట వాళ్ళకైతే ఐదువేలకు తక్కువలేదు, ”

రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పినట్టు అన్ని గబగబా చెప్పేసింది.


నోరు తెరుచుకోని అలానే వినసాగింది అరుణ. చైతన్య వచ్చి “ ఏయ్ అరుణా… ఏమిటి ఆమెకు సమాధానం

చెప్పకుండా అలానే నిలుచుండిపోయావు, ఏదో ఒకటి చెప్పేయ్ వెళ్ళిపోతుంది, ” అరుణకు మాత్రమే వినపడేట్టుగా అన్నాడు.


“ ఏంటండి ఇది… ఎరక్కపోయి అడిగాను పనివాళ్ళకోసం బుద్ధి వచ్చింది, ఇదిగో మా ఇంట్లో డబ్బులు కాసే

చెట్టేమి లేదు, మీరసలు పనిమనుషులా లేకా పని- మని- షీ… లా, ఏం చూసుకుని మీరు అంతింత డబ్బులడుగుతున్నారో నా కర్ధం కాలేదు, అసలు అంత డబ్బు ఖర్చు చేసి మిమ్మల్ని పెట్టుకుంటే

సగం పని మేమే చేసుకోవలసి వస్తుంది మీరు రానప్పుడల్లా, మీకు భయపడుతూ గిన్నెలు ఎక్కువపడకుండా చూసుకోవాలి, మేము తిన్నా తినకున్నా మీకోసం చాయ్ టిఫిన్ చేసి ఇవ్వాలి, మీరడిగినప్పుడల్లా చేబదులు డబ్బులు చీరలు ఇస్తేనే మంచివాళ్ళకింద లేక్క, లేదంటే ఆ ఇంటి ముచ్చట్లు

ఈ ఇంటికి, ఈ ఇంటి ముచ్చట్లు ఆ ఇంటికి చేరవేయ్యడము, మంచిదికాదు… గయ్యాళిది… పిసినారిది అని

మీ ఇష్టం వచ్చిన బిరుదులు ఇస్తారు, ఒకప్పుడు ఎంతమంచిగా పనిచేసేవాళ్ళు డబ్బే ముఖ్యం అనుకోకపోదురు, ఏది ఇస్తే అది తీసుకోనిపోదురు, పని చెయ్యకున్నా ఊరికేనన్నా వచ్చి అమ్మా నాకు

కొంచెం బియ్యం పెట్టవా, లేకపోతే ఇంత అన్నం ఉంటే పెట్టమ్మ అనో అడిగేవాళ్ళు, పెద్దవాళ్లని మర్యాదగా మాట్లాడేవాళ్ళు ఇప్పుడేం లేదు, చక్కగా వచ్చి సోఫాలో కూర్చోమన్నా కూర్చుంటారు అలా ఉన్నారు

ఈ తరం పని మనిషులు, నువ్వెళ్ళిరా నిన్ను భరించుకోవటం నావల్ల కానిపని, ” ముఖం మీదనే చెడామడా

అనేసింది అరుణ.


“ అబ్బో ఇంతోటి మనిషివని తెలిస్తే రాకనేపోదును, నువ్వెక్కడో పాతకాలం మనిషిలాగున్నావు, పున్యానికి

పని చేస్తే చేయించుకునేలా ఉన్నావు, దొరుకతరు నీకు అలాంటి మనుషులు చాల్చల్చేవమ్మ, నీ దగ్గర పని చేసేకంటే అడుక్కుతిన్నది నయం, ” గట్టి గట్టిగా అరుస్తూ తను వెంటనే తెచ్చుకున్న చిన్న లూనామీద

వెళ్ళిపోయింది.


“ చూసారా చూసారా … ఎన్ని మాటలందో, బొత్తిగా మర్యాదలేదు పొగరుబోతు మనిషి, ఏమండి …

నాకే పనివాళ్ళు వద్దండి చక్కగా నాకు నచ్చినట్టు నేనే చేసుకుంటాను, ఆ మనిషికి ఇచ్చే డబ్బులేవో

నేనే దాచుకుంటే పోలా, ” చీరకుచ్చిళ్ళు నడుములో దోపుకుంటూ వంటింటిలోకి వెళ్లింది అరుణ.


పిచ్చి అరుణ. ఈ కాలంలో ఎవరు ఊరికే చేస్తారనుకున్నావు నీ పిచ్చికాకపోతే, డబ్బులిస్తేనే మర్యాదగా పనిచేస్తారు. అయినా ఒకరు చేస్తే మెచ్చేరకానివా నీ పని నువ్వు చేసుకుంటేనే నీకానందం అరుణను చూస్తు నవ్వుకుంటూ అనుకున్నాడు చైతన్య.

****** ****** ******* ****** *******

॥॥ శుభం ॥॥

B. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత్రి పరిచయం : B.లక్ష్మి శర్మ (త్రిగుళ్ళ)

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్
























































97 views15 comments
bottom of page