'Panjaramlo Chiluka' New Telugu Story
Written By Gannavarapu Narasimha Murthy
రచన : గన్నవరపు నరసింహ మూర్తి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
నేను ఎస్పీగా జిల్లాకి వచ్చి సంవత్సరం అయింది. నేను వచ్చే నాటికి జిల్లాలో ఎన్నో సమస్యలు... ఒకవైపు నక్సల్స్ సమస్య, ఇంకో వైపు రాజకీయ సమస్యలు; రాజీకీయంగా ఈ జిల్లా చాలా సెన్సిటివ్. ఇక్కడ ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలకు ఈ జిల్లా చాలా ముఖ్యమైనది... ఈ జిల్లాలో వెనుకబడినవారు, గిరిజనులు ఎక్కువగా ఉండటంతో రాజకీయ ప్రాధాన్యత ఎక్కువ; ఈ మధ్యనే డ్రగ్స్ సమస్య కూడా ఎక్కువైంది. చాలా మంది యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో క్రైమ్ రేటు పెరుగుతోంది.
నేను చేరిన రెండు నెలలకు జిల్లా ముఖ్యపట్నంలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్న లావణ్య అనే విద్యార్థిని కిడ్నాప్‌కి గురైంది. మా వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆమె ఆచూకీ దొరకలేదు. దాంతో ప్రతిపక్షాలు, కాలేజి విద్యార్థుల ఆందోళన మొదలైంది.
నేను మా డీఎస్పీ సుధాకర్ని పిలిచి కేసు గురించి వాకబు చేసాను.
అతను “సార్! ఆమెను అధికార పక్షం ఎమ్మెల్యే గోవర్థన రావు కొడుకు కుమార్ కిడ్నాప్ చేసాడు... అతను ఇది వరకు డ్రగ్స్ పట్టుబడ్డ కేసులో ముద్దాయి. బాగా మత్తుమందులకి అలవాటు పడ్డ వ్యక్తి; అతను ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ మన పోలీసులకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. అతన్ని అరెస్ట్ చేస్తే అధికార పక్షానికి రాజకీయంగా పెద్ద నష్టం జరుగుతుంది. అందుకే మన వాళ్ళు ఆలోచిస్తున్నారు. అరెస్ట్ చేస్తే మనం ఎవ్వరం ఇక్కడ ఉండం! అందర్నీ బదీలీ చేస్తారు” అన్నాడు.
“సుధాకర్! రాజకీయ నాయకులకు భయపడి మనం మన కర్తవ్యాన్ని మరచిపోకూడదు.. బదిలీలు అనేవి మన ఉద్యోగంలో సహజం.. వాటికి భయపడితే మనం ఉద్యోగం చేయ్యలేము. మీరు వెంటనే వాడిని అరెస్ట్ చేసి ఆధారాలను కోర్టుకి సమర్పించండి మీకేం జరగకుండా చూసే బాధ్యత నాది” అనీ చెప్పాను;
ఆ అమ్మాయి ఆచూకీ తెలుసుకొనీ ఆమెను వాడి బారి నుంచి కాపాడాము;
ఆ తరువాత అరెస్ట్‌ల పర్వం మొదలైంది. అతన్ని వివిధ సెక్షన్ల కింద అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించాము; ఆ అరెస్ట్ అధికార పార్టీని ఒక కుదుపు కుదిపింది. దాంతో మా ఐజీ గారు నన్ను పిలిచి గట్టిగా మందలించారు. నేను అతనికి పరిస్థితిని వివరించీ, అరెస్ట్‌కి కారణాలను చూపించాను. అయినా అతను శాంతించలేదు.
అదే సమయంలో ఏజెన్సీ లో పనిచేస్తున్న నలుగురు రెవెన్యూ అధికారులను నక్సల్స్ కిడ్నాప్ చేస్తే నేను ఏజన్సీలో నాలుగు రోజులు కాంపు చేసి వాళ్ళని విడిపించాము.
ఆ తరువాత మఫ్టీలో పోలీసులను నియమించి బస్టాపుల్లో ఆడపిల్లలను ఆటపట్టించే ఆకతాయిలను అరెస్ట్‌లు చేయించాను. కాలేజీల్లో రేగింగ్ చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసాము. అలాగే ప్రతీ కాలేజీకి వెళ్ళి ప్రిన్సిపాల్స్, లెక్చరర్స్‌తో మీటింగ్ పెట్టి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చాము.. రౌడీషీటర్స్ మీద కన్నేసి వాళ్ళని నియంత్రించాము.
ఇలా నేను వచ్చిన ఆరునెలల్లో శాంతి భ్రదతలను పూర్తిగా అదుపు చేసాను.. రాజకీయ జోక్యాన్ని అనుమతించలేదు. ఏ పోలీసైనా డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే నిర్దాక్షణ్యంగా వుద్యోగం లోంచి తీసేసాము.
బీహార్ ముఠా దొంగతనాలు చేస్తుంటే రాత్రిపూట మఫ్టీలో తిరిగి వాళ్ళని పట్టుకున్నాము... వాళ్ళందరూ ఇప్పడు కటకటాల వెనక ఉన్నారు.
అలా సంవత్సరం తరువాత శాంతిభధ్రతలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి; చాలా వరకు సమస్యలు తీరాయి.
కానీ రాజకీయ నాయకులనుంచీ మాకు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది; నేను కర్తవ్య నిర్వహణలో కఠినంగా ఉండటంతో అధికార పార్టీ నాయకులకు కంపరం మొదలైంది. వాళ్ళ ఆటలు సాగకపోవటంతో శాసన సభ్యులు, మిగతా నాయకులు హొం మంత్రికి నా మీద ఫిర్యాదు చేసారు... వచ్చే ఎన్నికల్లో జిల్లాలో అధికార పార్టీ గెలవాలంటే నన్ను బదిలీ చెయ్యక తప్పెదనీ వాళ్ళు ముఖ్యమంత్రితో జరిగిన సమిక్షా సమావేశంలో చెప్పడంతో ఒకరోజు నన్ను డీజీపీ గారు పిలిచారు...
“మిస్టర్ ప్రసాద్! నువ్వు సరిహద్దు రేఖని దాటావు. ఎంత మనం ఐపీఎస్లమైనా మనం ఎన్నుకున్న ప్రభుత్వాల కనుగుణంగా పని చెయ్యాలి . లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము... ఎంతైనా అధికారం రాజకీయ నాయకుల చేతిలో ఉంటుంది... ఆ విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి... ముఖ్యంగా మనకు `లౌక్యం` కావాలి... అది లేకపోతే రాణించలేము” అన్నారు అతను నర్మ గర్భంగా...
“సార్! నిష్టతో, కార్యదీక్షతో ప్రజలకు సేవ చెయ్యాలనీ మనకు నేషనల్ పోలీస్ ఎకాడమీలో చెప్పారు కానీ లౌక్యం గురించి, సరిహద్దుల గురించి చెప్పలేదు.. మనం రాజ్యాంగానికీ, ప్రజలకూ జవాబుదారీ కానీ ఐదేళ్ళకోసారి మారే రాజకీయ నాయకులకు కాదు... వాళ్ళ అడుగులకు మడుగులొత్తడం మన బాధ్యత కాదు…” అనీ అతనితో కొంచెం ఆవేశంగా చెప్పాను...
వారం రోజుల తరువాత నాకు డీజీపీ ఆఫీసులో ఎస్పీ అడ్మినిస్ట్రేషన్ గా పోస్టింగిస్తూ జిల్లా నుంచి బదిలీ చేసారు. నేను ముక్కు సూటిగా, నిజాయితీతో పని చేసినందుకు నాకు ప్రభుత్వం ఇచ్చిన బహుమానం ఈ బదిలీ; వారం తరువాత నేను రిలీవ్ అయిపోయాను.
.........
కొత్త ఉద్యోగంలో పెద్దగా పనుండదు. ఆఫీసు పని.. రోజూ వచ్చే ఉత్తరాలకు డీజీపీ తరపున బదులివ్వడం.. మీటింగులు... అందరి ఎస్పీలకు కొత్త మార్గదర్శకాలను సర్యులేట్ చెయ్యడం; ఇదే నా పని...
ఇది వరకు నేను 24 గంటల పని చేసినా సరిపోయేది కాదు. అయినా అందులో ఒక తృప్తి ఉండేది. ఇప్పడు నాలో నిర్లిప్తత ఆవరించింది. అయినా కాలం ఎవరి కోసం ఆగదు... అది నిరంతర భ్రమణ శీలి...
ఇండియన్ పోలీసు ఎకాడమీ లాంటి గొప్ప సంస్థలో 2 సంవత్సరాలు శిక్షణ పొంది ప్రజాసేవ చెయ్యాలనే కోరికతో ఈ పోలీసుశాఖలో చేరిన నా లాంటి ఐపీయస్‌లను పని చెయ్యకుండా అడ్డుకుంటున్న నేటి రాజకీయ వ్యవస్థ నిజంగా దేశానికి నష్టం చేస్తునాది ... ఇలా చెయ్యిడం ఎగిరే పక్షికి రెక్కలు కత్తిరించినట్లే...
ఇలా భారంగా ఈ ఉద్యోగంలో సంవత్సరం గడిచి పోయింది... నాలో రాను రాను ఆవేశం తగ్గిపోయి, దాని స్థానంలో వేదాంతం చోటు చేసుకోసాగింది.
ఒకరోజు డీజీపీ గార్నుంచి నాకు తనని కలవమనీ ఫోన్ వచ్చింది. ఉదయం పదిగంటలకు అతన్ని ఛాంబర్లో కలిసాను.
ఆ సమయంలో అతను ఒక్కడే ఛాంబర్లో ఉన్నారు. నేను విష్ చెయ్యగానే నన్ను కూర్చోమనీ కుర్చీ చూపించాడు.. కుశల ప్రశ్నలనంతరం “ప్రసాద్! నీకో పెద్ద ఎసైన్‌మెంట్ అప్పచెప్పబోతున్నాను. దానికి నువ్వే సరియైన వ్యక్తివనీ ప్రభుత్వం భావించింది. నువ్వు ఎస్పీగా పనిచేసినప్పడు నువ్వు చూపించిన కార్యదీక్ష,కఠిన నిర్ణయాలు, ధృడ సంకల్పం నిన్నీ పోస్టుకు ఎంపిక చేయ్యడానికి కారణాలు” అనీ ఆయన చెప్పారు;
అతని మాటలు నాకర్థం కాక మౌనంగా అతని వైపు చూస్తూ కూర్చున్నాను.
“చాలా రోజుల నుంచీ ఏజన్సీలో మావోఇస్టుల ప్రాబల్యం పెరిగింది... చాలా సంవత్సరాల నుంచీ స్తబ్దుగా ఉన్న వాళ్ళ కార్యకలాపాలు మన డిపార్టుమెంట్ ఉదాసీనత కారణంగా మళ్ళీ ఎక్కువవుతున్నాయి;. వాళ్ళ కదలికలు ఒరిస్సా బోర్డర్లో పెరుగుతున్నాయి. ఈ మధ్యన గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ ఉద్యమాలు కూడా వాళ్ళ వల్లే ఊపందుకుంటున్నాయి... వాళ్ళ కార్యకలాపాలను తక్షణం అదుపు చేసి శాంతి భద్రతలు కాపాడమనీ ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పారు. వాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే నీలాంటి ఆఫీసర్ల అవసరం ఎంతైనా ఉంది. అందుకే నిన్ను ఏజన్సీలో ఓయస్‌డీగా అంటే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పోస్టింగ్ చేస్తున్నాను... నువ్వు తక్షణం రంగంలోకి దిగి వాళ్ళ కార్యకలాపాలను అడ్డుకట్టవెయ్యాలి...
ఆ విషయం చెబుదామనే నిన్న పిలిచాను. నీకు ఇష్టమే కదా? అఫ్‌కోర్స్... నీ కిటువంటి ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం అనీ నాకు తెలుసు” అన్నాడు కుర్చీలో రిలాక్సింగ్‌గా కూర్చుంటూ...
అతని మాటలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక కొద్దిసేపు మౌనం దాల్చేను...
ఆ తరువాత “సార్! నాకు ఈ ఎసైన్‌మెంట్ వద్దు. నా బదులు ఇంకెవర్నైనా పోస్ట్ చెయ్యండి. నేనైతే ఆ పదవికి న్యాయం చెయ్యలేను” అన్నాను అతనితో మెల్లగా...
నా మాటలకు అతను ఆశ్చర్యపోయాడు. “నువ్వేం చెబుతునావో నాకర్థం కాలేదు... దిసీజ్ ఎ గ్రేట్ ఛాలెంజ్ ఫర్ ఎ డైనమిక్ ఆఫీసర్ లైక్ యూ! ఈ విషయం చెప్పగానే ఎగిరి గంతేస్తావనుకున్నాను. కానీ నీ నుంచి ఇలాంటి సమాధానం వస్తుందని నేనూహించలేదు” అన్నాడాయన టేబుల్ మీదకు వంగుతూ...
“ఇది వరకైతే మీరు చెప్పినట్టు ఎగిరి గంతేసేవాడిని సార్... కానీ ఇప్పుడు కాదు... గాలిలో స్వేచ్ఛగా ఎగురుతున్న పావురాన్ని తెచ్చి పంజరంలో పెట్టేరు... మొదట్లో విశాల విశ్వంలోంచి చిన్న పంజరంలోకి మారిన తన అస్తిత్వాన్ని చూసి మొదట గాబరా పడినా తరువాత ఆ చిన్ని పంజరానికి అది అలవాటు పడిపోయింది. ఏ వేటగాడి నుంచీ ప్రమాదం లేని, ఆహారం కోసం పోరాటం చెయ్యక్కర్లేని సౌకర్యవంతమైన, ప్రశాంతమైన బతుక్కి అది అలవాటు పడిపోయింది... ఇప్పుడు మీరు ఆ పంజరం తలుపులు తీసినా అది బయటకు ఎగిరిపోదు... మీరు దాన్ని బయటకు విసిరేసినా అది మళ్ళీ అందులోకి వచ్చేస్తుంది” అన్నాను.
నా మాటలకు అతని భృకుటి ముడివడింది.
"నువ్వు చెబుతున్నదేమిటో అర్థం కావటం లేదు`` అని అన్నాడాయన
“ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది సార్ . నేను ఎంతో ఉత్సాహంతో, అకుంఠిత దీక్షతో పనిచేస్తుంటే అధికార పక్షానికి ఇష్టం లేదని నా రెక్కల్ని విరిచి ఈ ఆఫీస్ లో పడేసారు; సంవత్సరం నుంచి నేనీ ఆఫీసులో పనిచేస్తుండడం వల్ల నా ఆలోచనల్లో మార్పొచ్చింది... దేశం, ప్రజాసేవ, పేదప్రజలు వీటి గురించీ ఆలోచించడం వ్యర్థం అనీ అర్థమైపోయింది. కేవలం అధికార పక్షానికి వత్తాసు పలుకుతూ, వాళ్ళ అడుగులకు మడుగులు వత్తే వాళ్ళే ప్రభుత్వానికి కావాలి. నిజానికి నేను అధికార పక్షానికి వ్యతిరేకంగా పని చెయ్యలేదు. న్యాయం వైపు, ధర్మం వైపు పనిచేశాను... అవినీతిని ప్రోత్సహించలేదు. కాకపోతే అవి అధికార పక్షానికి నచ్చలేదు... అప్పడు నేను ఆ ఉద్యోగానికి పనికిరాననీ, నాకు లౌక్యం తెలీదనీ, ఇచ్చి పుచ్చుకునే ధోరణి లేదనీ సాకులు చెప్పి అడవిలో సంచరించే పులి లాంటి నన్ను తీసుకొచ్చి జూలో ఇనుపకేజ్ లాంటి ఈ ఆఫీసులో పడేసారు... ఒకసారి జూ వాతావరణానికి కి అలవాటు పడ్డ పులి జంతువులను వేటాడలేదు.. కారణం దాని స్వేచ్ఛని హరించడం వల్ల... ఇప్పడు నా పరిస్థితి కూడా అంతే! పోరాటాలను, ఛాలెంజ్‌స్‌ని ధైర్యంగా ఎదుర్కొనే నేను ఇప్పడు ప్రశాంతతకి,కడుపులో చల్ల కదలని ఈ ఉద్యోగానికి అలవాటు పడిపోయాను... అందుకని మీరు చెప్పిన ఉద్యోగానికి న్యాయం చేకూర్చలేను…” అన్నాను..
నా మాటలు విన్న డీజీపీ గారి ముఖం ఎర్రగా మారిపోయింది.
“ప్రసాద్! నీ లాంటి వాళ్ళు మన డిపార్ట్‌మెంటులో ఎవ్వరూ లేరు... ఒక్కసారిగా ఆలోచించు” అన్నాడయన.
“సార్... ఎందుకు లేరు; బోలెడు మంది వున్నారు; డబ్బు సంపాదనకూ, అధికారానికీ , హోదాకూ,ప్రభుత్వానికీ నచ్చిన విధంగానూ పనిచేసే లౌక్యం గల అధికారులు నక్సల్స్‌కి వ్యతిరేకంగా ఎందుకు పోరాడలేరు? అంటే ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడే ఉద్యోగాలకు నేను పనికొస్తాను కానీ జిల్లాలో ఎస్పీగా పనికిరాను... మీరు చెప్పిన ఉద్యోగంలో ఎంతో రిస్కు ఉంది. సంఘర్షణ ఉంటుంది. ప్రాణాలకు అనుక్షణం ముప్ప పొంచి ఉంటుంది. బయటకెళ్ళే వాళ్ళు ఇంటి కొచ్చేదాకా నమ్మకం ఉండదు. ఒకవేళ ఏదైనా అనుకోని ఘటన జరిగి నా ప్రాణం మీదకు వస్తే నా కుటుంబం గతి ఏం కావాలి? అప్పడు ఎవరు నా కుటుంబాన్ని ఆదుకుంటారు? అప్పడు నీతులు చెప్పే ఈ అధికార పక్షం గాని, ప్రభుత్వం గాని, మన పోలీసు శాఖ కానీ నా ప్రాణాలను తెచ్చివ్వగలదా? అందుకే నేను ఆ ఉద్యోగానికి న్యాయం చేయలేను. ఆ ఛాలెంజెస్‌ని నేను ఎదుర్కోలేను . ధైర్యవంతుడినైన నన్ను పిరికివాణ్ణి చేసింది ఈ ప్రభుత్వం... ఇప్పడు ధైర్యం రమ్మంటే రాదు.. దయచేసి ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దు” అని అతనికి నమస్కారం పెట్టి బయటకు వచ్చేసాను;
రెండు నెలల తరువాత నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి మా ఊరు వెళ్ళిపోయాను...
(సమాప్తం)
గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
Twitter Link
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.
コメント