top of page

పరువు


'Paruvu' - New Telugu Story Written By Padmavathi Divakarla

Published In manatelugukathalu.com On 21/10/2023

'పరువు' తెలుగు కథ

రచన: పద్మావతి దివాకర్ల

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


శివరామ శర్మ దేవునికి హారతి ఇచ్చి వెనక్కు తిరిగేసరికి కనులు మూసుకొని ముకుళిత హస్తాలతో నిశ్చలంగా నిలబడిన ఉన్న నీలిమ కనిపించింది. కొద్ది క్షణాల తర్వాత కనులు తెరిచి ఎదురుగా ఉంచిన హారతిని కళ్ళకద్దుకుందామె. ఆమెని చూసి చిరునవ్వు నవ్వాడు శివరామ శర్మ. నీలిమ ఆ ఊళ్ళోకెళ్లా ధనవంతుడైన ధనుర్జయరావు ఏకైక కుమార్తె. ఆయన ఆ ఆలయం ధర్మకర్త కూడా.


ఆమె కళ్ళల్లో సన్నటి నీటిపొర కదలాడుతూ అతని కంటపడేసరికి ఆందోళన చెందాడు శర్మ. "ఏమ్మా ఏం జరిగింది? ఎందుకు కలతగా ఉన్నావు?" వాత్సల్యంతో వ్యాకులంగా ప్రశ్నించాడు.


ఆమె మౌనంగా నిలబడిందో క్షణం. "మా నాన్న నా పెళ్ళి నిశ్చయించారు..." అని మళ్ళీ మౌనం ఆశ్రయించిందామె.


ఆమె మాటలకి సంతోషించిన శివరామ శర్మకి ఆమె పెళ్ళి నిశ్చయమవడానికి, కన్నీళ్ళు పెట్టుకోవడానికి సంబంధమేమిటో మాత్రం బోధపడలేదు. తల్లి తండ్రులను విడిచిపెట్టి పరాయి ఇంటికి వెళ్ళవలసి వస్తుందని ఆమె బెంగపడుతున్నదేమో అనుకున్నాడు. "చూడమ్మ నీలిమా! పెళ్ళైన తర్వాత ఏ ఆడపిల్లైనా అత్తవారింటికి వెళ్ళాల్సిందే! అది తప్పదు. మధ్యమధ్య మీ అమ్మా నాన్నలను చూడాలనిపించినప్పుడు పుట్టింటికి వస్తూ ఉండవచ్చు. అంతేకాక వాళ్ళు కూడా మీ ఇంటికి తరచూ వస్తూంటారు, అంత మాత్రానికే బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. పైగా పెళ్ళి కుదరబోతున్నందుకు సంతోషించ వలసిన సమయం ఇది." అని ఆమెని అనునయిస్తూ ఆమె చేతిలో ప్రసాదం పెట్టాడు శివరామ శర్మ.


"అది కాదండీ బాబాయిగారూ, మా నాన్న కుదిర్చిన సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేనో అబ్బాయిని ప్రేమించాను. అతనితోనే కలిసి జీవితం పంచుకోవాలని నిశ్చయించాను. ఈ విషయం తెలిసి మా నాన్నగారు నన్ను గట్టిగా మందలించి హడావుడిగా ఓ సంబంధం కుదిర్చారు." అందామె మళ్ళీ కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతూండగా.


తను చూస్తూండగానే పెరిగి పెద్దైన నీలిమ ప్రేమించిందనేసరికి ఆశ్చర్యపోయాడు శివరామ శర్మ. నీలిమ అతని కళ్ళకి ఇంకా చిన్నపిల్లలానే కనిపిస్తోంది. "అలాగా! ఎవరా అబ్బాయి? మీ నాన్న గారికి నచ్చచెప్పలేకపోయావా? అతనికి నచ్చితే ఇంక సమస్యేమీ ఉండదు కదా! కూతురి సుఖం కన్నా తల్లితండ్రులకి ఇంక ముఖ్యమైనది ఏముంటుంది తల్లీ?" అన్నాడు.


"మా నాన్నగారికి నచ్చచెప్పటం చాలా కష్టం! అతనితో పెళ్ళికి మా నాన్న ఎంత మాత్రమూ ఒప్పుకోరు. కోపంలో ఇంకేం చేస్తారో కూడా తెలియదు." అందామె బేలగా.

"ఏం ఎందుకు ఆ అబ్బాయి యోగ్యుడు కాదా?" ప్రశ్నించాడు శివరామ శర్మ.


అప్పుడే ఓ రెండడుగులు వెనక నిలబడ్డ నీలాద్రి ముందుకు వచ్చి ముందు దేవునికి ఆ తర్వాత శివరామ శాస్త్రికి దండం పెట్టాడు. "ఓ నీలాద్రీ నువ్వట్రా? బాగున్నావా?" అని అడిగాడు శివరామ శాస్త్రి.


మౌనంగా తల ఆడించాడు. అతని వదనం కూడా వాడిపోయి ఉంది. "ఏంట్రా నీకేమైంది అలా మొహం ముడుచుకున్నావు?" అని అడిగాడు లాలనగా.


"అతన్నే నేను ప్రేమించింది బాబాయిగారూ! నీలాద్రి చాలా మంచివాడు. తనూ బాగానే చదువుకున్నాడు. మీకు తెలుసు కదా, ఈ మధ్యే మంచి ఉద్యోగం కూడా వచ్చింది. మా నాన్న మేమిద్దరమూ పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకోరు. అసలు నీలాద్రికి ఏం తక్కువైంది, మా కులం కాదన్న ఒక్క లోపం తప్పించి. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. పోనీ మీరైనా మా నాన్నగారికి నచ్చచెప్పరాదూ, మనుష్యులందరూ ఒక్కటే అని మీరంటారు కదా. కులమూ మతమూ అడ్డుగోడలని, వాటిని మనమే కూలదోయాలని చెప్తారు కదా!" అర్థించిందామె.


ఆమె మాటలు విన్న శివరామ శర్మకి గొంతులో పచ్చి వెలక్కాయి పడినట్లు అనిపించింది. అతనికి నీలాద్రి కూడా చిన్నప్పటి నుండి తెలుసు. నీలాద్రి తండ్రి సింహాద్రి పొట్ట చేతపట్టుకొని పాతికేళ్ళ కిందట ఆ ఊరు వచ్చాడు. పాలేరుగా ఆ ఊళ్ళో కామందులవద్ద పని చేసి ఈ మధ్యనే కొద్దిగా స్థిరపడ్డాడు. తనలా తన కొడుకు కష్టపడకూడదని నీలాద్రిని స్కూల్లో వేసాడు.


స్వతహాగా తెలివి తేటలు గల నీలాద్రి బాగా చదువుకొని ఉపాధ్యాయుల మన్నన పొందాడు. కొంతమంది సహృదయులు సహాయం చేయడం వల్ల అతని చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగమే సంపాదించాడు. అతని చదువుకి సంతానం లేని శివరామ శర్మ కూడా తన వంతు సహాయం చేసాడు. అయినా అతని అంతస్తు ఎక్కడ, నీలిమ తండ్రి ధనుర్జయరావు అంతస్తెక్కడ? వాళ్ళిద్దరి పెళ్ళి చెయ్యడానికి అతను ఎంతమాత్రం ఒప్పుకోడు. కులాంతర వివాహానికి అతను రాజీ పడడు. అవసరమైతే పరువు హత్య చెయ్యడానికి కూడా వెనకాడకపోవచ్చు. అతని స్వభావం శివరామ శర్మకి బాగా తెలుసు. తన పరువు ప్రతిష్టలకోసం ఎంతకైనా తెగించే వ్యక్తి ధనుర్జయరావు.


తనిప్పుడు ఆమెకేమి సలహా ఇవ్వగలడో తనకే బోధపడలేదు. అయోమయంగా వాళ్ళిద్దరి వైపు చూసాడు శివరామ శర్మ. ఈ సారి నోరు విప్పాడు నీలాద్రి. "వాళ్ళింట్లోనూ కాదు, మా ఇంట్లోనూ ఒప్పుకోరు. గొప్పవాళ్ళతో వియ్యమందాలంటే మా వాళ్ళకీ చాలా భయమే. ఈ విషయం తెలిసిన దగ్గరనుండీ నేనేమైపోతానో అని మా అయ్య ఒకటే బెంగ పెట్టుకున్నాడు. పెద్దవాళ్ళతో మనకొద్దురా సంబంధం అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు మా అయ్య. మీరే ఏదో తరుణోపాయం చెప్పాలి." మరోసారి అతనికి దండంపెడుతూ చెప్పాడు నీలాద్రి.

వాళ్ళిద్దరికీ ఏం చెప్పాలో అర్థం కాలేదు శివరామ శర్మకి. కులం, ఆస్తి విషయంలో తప్పితే నీలాద్రిని ఎంచడానికేం లేదు. మంచి పిల్లవాడు. అతను నీలిమకి తగిన వాడనటంలో ఎలాంటి సందేహం లేదు.


"మేం ఇంటి నుంచి వెళ్ళిపోయి పెళ్ళి చేసుకోవచ్చు. అది మా నాన్న తలవంపులకి, ఆగ్రహానికి కారణమౌతుంది. తన పలుకుబడి ఉపయోగించి మమ్మల్ని వెతికి పట్టుకోవచ్చు. తన పరువుకోసం ఎలాంటి పని చేసినా ఆశ్చర్య పోనవసరం లేదు. అలా అని నా మనసు చంపుకొని నాన్న తెచ్చిన సంబంధం చేసుకోనూ లేను, నీలాద్రిని వదులుకొనూ లేను. నీలాద్రిని తప్పించి ఇంకెవరినీ పెళ్ళి చేసుకోలేను. ఇక మాకు ఆత్మహత్యే శరణ్యం." అంటూ కళ్ళు ఒత్తుకోసాగింది నీలిమ.


నీలాద్రి కూడా తనదీ అదే అభిప్రాయమంటూ అతనివైపు చూసాడు. అతని కళ్ళూ వర్షించసాగాయి. "అయ్యయ్యో! అంత మాట అనకమ్మా!" అన్నాడు శివరామ శర్మ ఆదుర్దాగా. వాళ్ళ కోసం ఏమైనా చెయ్యాలని తీవ్రంగా ఆలోచించగా ఓ ఉపాయం తోచింది శివరామ శర్మకి. వాళ్ళకి ఆ విషయమే చెప్పి సమాధాన పర్చి ఇంటికి పంపాడు.


***********

గుడిముందు చిన్న పందిరేసి ఉంది. అక్కడ శివరామ శర్మతో సహా చాలా కొద్దిమంది ఆహ్వానితుల మధ్య నీలాద్రికి, నీలిమకీ నిరాడంబరంగా వివాహం జరుగుతోంది. ఇంకో నిమిషంలో నీలిమ మెడలో తాళి కట్టబోతుండగా, ఈ వార్త తెలియడంతో ఆఘమేఘాలమీద ధనుర్జయరావు తన మందీ మార్బలంతో, ఊరి పెద్ద మనుష్యులతో నాలుగు సుమోలు వేసుకొని అక్కడికి చేరుకున్నాడు.


ధనుర్జయరావుని చూస్తూనే, "రండి! సరిగ్గా ముహూర్తం సమయంకి వచ్చారు. మీ అమ్మాయి, అల్లుడిపై అక్షింతలు చల్లి ఆశీర్వదించండి." అన్నాడు శివరామ శర్మ.


ఆ మాటలకి ధనుర్జయరావుకి అరికాలి మంట నెత్తికెక్కింది. "ఏమిటి శర్మగారూ, ఏమిటిదంతా? నాకు తెలియకుండా నా కుమార్తె వివాహం జరిపించటానికి మీకెంత ధైర్యం? ఆ సింహాద్రి కొడుకు అదే... నీలాద్రికెంత ధైర్యం, నా కూతురి పక్కన కూర్చోడానికి! మా సరసన కూర్చొనే అర్హతే లేనివాడు నా కూతుర్ని వివాహమాడటమా!" అని మండిపడ్డాడు తన చేతిలో ఉన్న అక్షింతలు విసిరికొడుతూ.


నీలాద్రి తండ్రి సింహాద్రి కూడా అప్పుడే అక్కడికి చేరుకొని ఓ పక్క వణుకుతూ నిలబడ్డాడు. ధనుర్జయరావుని చూస్తూనే, "బిడ్డా! లేచి వచ్చేయ్! పెద్ద వాళ్ళతో మనకొద్దురా!" అన్నాడు ఆదుర్దాగా పెళ్ళి పీటలదగ్గరికి రాబోతూ.


అతని దారికి అడ్డు నిలబడ్డాడు శివరామ శర్మ. "ఇంత దాకా వచ్చినాక ఇప్పుడు వెనక్కు తగ్గడం మంచిది కాదు!" అని అతన్ని వారించాడు.


ఆ మాటలకి ధనుర్జయరావు విపరీతమైన ఆగ్రహంతో వణికిపోయాడు. "ఏమిటి శర్మగారూ, అంతా మీ ఇష్టమేనా? ఆలయంలో పూజరిగా ఉన్న మీకు ఇలా చెయ్యటం తగునా? నేను నీలిమ కన్న తండ్రిని. అమెనెవరికిచ్చి పెళ్ళి చెయ్యాలో నాకు బాగా తెలుసు, ముందు అడ్డు లేవండి! వాడి కులమేమిటి, మా కులం ఏమిటి? ఆస్తి లేకపోయినా పర్వాలేదు కాని అలాంటి వాడితో నా బొందిలో ప్రాణం ఉండగా పెళ్ళి జరగడానికి నేను ఒప్పుకోను. నాకు ప్రాణం కన్నా పరువు ముఖ్యం." అంటూ ముందుకు దూసుకొచ్చాడు.


"ఆగండి! అసలు మీ ఉద్దేశ్యం ఏమిటి? పరువు గురించే కదా మీ బెంగ? నీలాద్రి కులం మీ కులం కన్నా తక్కువని కదా మీ అభ్యంతరం! నిన్ననే నేను అతన్ని దత్తత చేసుకున్నాను. ఇప్పుడు నాది అతనిదీ ఒక్కటే కులం. ఇప్పుడు నీలాద్రి నా అబ్బాయి. నాతో వియ్యమందడానికి ఇప్పుడు మీకు ఏమైనా అభ్యంతరం ఉందా చెప్పండి!" అని అందరి సమక్షంలో నిలదీశాడు.


హఠాత్తుగా ఈ మాటలు వినేసరికి ఏమనాలో ధనుర్జయరావుకి అర్థం కాలేదు. అతని వెంట వచ్చిన పెద్ద మనుష్యులు శర్మగారి పెద్ద మనసుకి మనసులోనే జోహార్లు అర్పించి పెళ్ళి పీటల మీద కూర్చున్న నూతన వధూవరులపై అక్షింతలు వెయ్యడానికి ముందుకు వచ్చారు. తన వెంట వచ్చిన పెద్ద మనుష్యులు కూడా ఆ ప్రేమికుల జంట పక్షాన, శివరామ శర్మ పక్షాన నిలబడేసరికి ఏమనాలో అర్థంకాలేదు ధనుర్జయరావుకి. ఒక్కసారి అతని ఆగ్రహం చల్లారిపోయి మౌనం వహించాడు. ఏమనాలో తోచలేదు.


అతని వైపు సూటిగా చూసి, "నీలాద్రిని నేను దత్తత చేసుకున్న తర్వాత అతను నీలాద్రి శర్మ అయ్యాడు. మా అబ్బాయి ఉన్నత విద్య పూర్తి చేసి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అతని కన్న యోగ్యుడు ఇంకెవరున్నారు చెప్పండి? నీలిమని మా ఇంటి కోడలుగా చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇద్దరూ మేజర్లు. వాళ్ళిష్టానుసారమే ఈ పెళ్ళి జరుగుతోంది.


మీ అమ్మాయి సుఖంగా ఉండటం మీకిష్టమా, లేక మీ పరువే మీకు ముఖ్యమా? ఇప్పుడు కూడా మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి!' అన్నాడు శివరామ శర్మ.


అందరివైపూ ఒకసారి పరికించి చూసిన ధనుర్జయరావు మౌనంగా అక్షింతలు అందుకొని నూతన వధూవరులను ఆశీర్వదించడానికి ముందుకు వచ్చాడు. అందరి కళ్ళల్లోనూ ఆనందం విరుస్తూండగా నీలాద్రి నీలిమ మెళ్ళో మూడుముళ్ళూ వేసాడు.


**************

పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:


పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.


57 views0 comments

Comentarios


bottom of page