top of page

పెద్దవాళ్ళూ... తస్మాత్ జాగ్రత్త!

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






'Peddavallu Thasmath Jagrattha' Written By Nallabati Raghavendra Rao

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

ఇతరులకు ఉచిత సలహాలిస్తుంటారు చెన్న కేశవులు లాంటి వాళ్ళు.

నయం కాని తండ్రి జబ్బు కోసం ఎక్కువ ఖర్చు చెయ్యొద్దని తమ్ముడి కొడుక్కి సలహా ఇస్తాడు.

కానీ విషయం తనదాకా వచ్చినప్పుడు బెంబేలెత్తుతాడు.

తన పొరపాటు తెలుసుకుంటాడు.

ప్రముఖ రచయిత నల్లబాటి రాఘవేంద్రరావు గారు ఈ చక్కటి కథను రచించారు.


బుజ్జిబాబు సెల్ ఆన్ చేసాడు.. ఆతృతగా తన పెదనాన్న చెన్నకేశవులు కి ఫోన్ చేశాడు.


" పెదనాన్నా.. నేను బుజ్జిబాబు ని."


" ఏరా బుజ్జి..."


" పెదనాన్నా.. నాన్నకి.. ఒంట్లో బాగోలేదు. నాకు భయం వేస్తుంది. హాస్పిటల్కి తీసుకువెళ దాం పెదనాన్న.. నువ్వు ..రాము..అన్నయ్య ఇద్దరూ త్వరగా రండి పెదనాన్నా..."


" ఏరా ఏమైంది ..మొన్నే కదా హాస్పిటల్ నుండి వచ్చాము."


"ఆయాసం అంటున్నారు.. ఊపిరి అందడం లేదు అంటున్నారు... త్వరగా రండి పెదనాన్న.."


"ఇది నాలుగోసారి.... ఇక జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలి రా అన్ని విషయాలు... ఎందుకంటే నాకు ఏవేవో పనులు ఉంటాయి... మీ అన్నయ్య రాముకి... ఇలా అస్తమానం తిరుగుతూ ఉంటే చదువు పాడవుతుంది.... నువ్వు పెద్ద వాడివి అయ్యావు కదా.... కాస్త నువ్వే ఈ విషయాలన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి."


" అది కాదు పెదనాన్నా! నాకు భయం వేస్తుంది."


"ఇందులో భయపడేది ఏముందిరా బుజ్జి బాబు .... ఇప్పుడు నువ్వే ఆలోచించు. ఈ సంవత్సరంలో మీ నాన్న గురించి నాలుగు సార్లు హాస్పిటల్ చుట్టూ తిరిగాను.నువ్వే అర్థం చేసుకోరా! నాకు మీ నాన్న సొంత తమ్ముడు... అందుకనే..... హైదరాబాద్ వెళ్ళాం అందరం... అక్కడ పెద్ద డాక్టర్కు చూపించి నెలరోజులు హాస్పటల్లో ఉన్నాము.... తిరిగి వచ్చాక మళ్లీ అదే పొజిషన్.



హెల్త్ కుదుట పడలేదు... మళ్లీ వైజాగ్ వెళ్ళామా లేదా .... నువ్వే ఆలోచించరా.... డబ్బు నువ్వే పెట్టుకున్నావ్ అనుకో... కొంచెం నేను ఖర్చు పెట్టాను.. అది కాదు అసలు విషయం.... ఎన్నిసార్లు మేము రాగలం చెప్పు? "


"ఆ తర్వాత.... మన ఊర్లో వెంకటసిద్ధార్థ హాస్పిటల్ లో 15 రోజులు ఉన్నాం..... ఇంటికి వచ్చిన మర్నాడే గాంధీ హాస్పిటల్ కి వెళ్లి అక్కడ పది రోజుల ఉన్నాం."


"పోనీ రాము అన్నయ్య ని పంపించు పెదనాన్నా." బుజ్జిబాబు బ్రతిమాలాడుతూ అడిగాడు.


"ఇద్దరం వస్తున్నాం... తప్పుతుందా? ఇదిగో మీ అన్న రాము ఇక్కడే ఉన్నాడు... అంతా వింటున్నాడు... వాడితో మాట్లాడి.... కాసేపట్లో ఇద్దరం వస్తాం."


సెల్ ఆఫ్ చేశాడు బుజ్జిబాబు పెదనాన్న చెన్నకేశవులు.


** *** **


అందరూ కలిసి బుజ్జిబాబు తండ్రి.....సత్య కేశవులు ని ఊర్లోని హాస్పటల్ కి తీసుకువెళ్లి జాయిన్ చేయించారు.


"ఇలా కూర్చోరా బల్లమీద బుజ్జిబాబు... డాక్టర్ గారు 20 రోజులు హాస్పిటల్లో ఉండాలి అంటున్నారు కదా... ఒరేయ్ రాము నువ్వు కూడా ఈ పక్కన కూర్చోరా.


బుజ్జిబాబు.... మీ నాన్నకి గుండెకు సంబంధించి ఎవరికీ అర్థంకాని జబ్బు వచ్చిపడింది.

ఆయనతోపాటు మనందరం నలిగిపోతున్నాము. చూస్తున్నావు కదా.... నువ్వు పిలిచావు కదా.. రాకపోతే... ఏమైనా అనుకుంటావ్ అని వచ్చాము రా... నాకు ఆ ధాన్యం బస్తాలు తూకం దగ్గర ఈ రోజంతా పని సరిపోతుంది.. ఇడుగో మీఅన్న రాము గాడికి....ఏవో ప్రైవేటు క్లాసులు ఉన్నాయట. అయినా వచ్చాము.... తప్పదు కదరా ..నాకు తమ్ముడు..


కానీ బుజ్జి బాబు.... నేను అంటున్నాను అని కాదు కానీ.... నువ్వు కొంచెం ఆలోచించాలి కదా... ఈసారి జబ్బు తగ్గితే పర్వాలేదు.... లేకుంటే నేను చెప్పినట్టు చేయరా...."


ఏదో చెప్పబోయాడు చెన్నకేశవులు.


చెన్నకేశవులు కొడుకు రాము... బుజ్జి బాబు... ఇద్దరూ..చెన్నకేశవులు ముఖం వైపు శ్రద్ధగా వింటున్నట్టు చూస్తూ ఉండిపోయారు.


" మీ నాన్న తెగులు గురించి ఇప్పటివరకు అవి ఇవి అమ్ముకొని రెండు మూడు లక్షల వరకు ఖర్చు పెట్టావు. నువ్వు మాత్రం ఇంకా ఎంత ఖర్చు పెట్టగలవు? మీ అమ్మకు నీకు కొంచెం మిగలాలి కదా! లేకపోతే ఎలా బ్రతికేది. అందుకని ఈసారి ఏం చేస్తావంటే ఇంటి దగ్గరే ఉంచి.. మన రాజన్న ఉన్నాడు కదా.... అదేరా ఆర్ఎంపీ డాక్టర్..... వాడిని రోజూ వచ్చి చూడమను..... మనం అనుకుంటాం కానీ ఎవరు ఇచ్చినా ఒకే రకం టాబ్లెట్లు రా. నెమ్మదిగా కోలుకుంటాడు. బాగా సీరియస్ అయితే అప్పుడు హాస్పిటల్ కి తీసుకొద్దాం. ఎలాగూ తప్పదు కదా. అలా చేయరా".... అన్నాడు చెన్నకేశవులు తన తమ్ముడు కొడుకు బుజ్జిబాబుకి, తన కొడుకు రాముకి బాగా వినబడేటట్లు.


" అదేమిటి పెదనాన్నా! మన ఇరుగు పొరుగు ... బంధువులు ఎవరైనా చూసినా బాగుండదు కదా. తండ్రిని హాస్పటల్లో చూపించటం లేదని... నానా మాటలు అంటారు కదా."



" ప్రజలు రకరకాలుగా కూతలు కూస్తారు రా. అన్ని పట్టించుకుంటే బ్రతకలేము. ఎవరైనా అడిగితే 'ఇంటి దగ్గరే మంచి డాక్టర్ ను పెట్టి వైద్యం చేయిస్తున్నాం' అని చెప్పు" అంటూ బాగా హితబోధ చేశాడు చెన్న కేశవులు.


"కాస్త నేర్పుగా ఆలోచించే బుద్ధి, ఇంకాస్త ప్రపంచ జ్ఞానం, మరికాస్త సమయ సందర్భ ఆలోచన... ఇవన్నీ నేర్చుకోవాలి రా. లేదంటే ఈ ప్రపంచంలో బ్రతకడం చాలా కష్టం!!!"


పెదనాన్న హితబోధ శ్రద్ధగా విన్నాడు. బుజ్జి బాబు. అతనితో పాటు అతని పక్కనే కూర్చున్న చెన్నకేశవులు కొడుకు రాము కూడా అంతే శ్రద్ధగా విన్నాడు.


20 రోజులు పోయాక కొంచెం కుదుట పడడంతో సత్యకేశవులు ని ఇంటికి తీసుకు వచ్చేశారు.


** *** ***


సత్యకేశవులు ఇంటికి వచ్చాక... కొంచెం కొంచెం రికవరీ అయ్యాడు.... బుజ్జిబాబు కొంచెం ప్రశాంతపడి.... తన పనులు చూసుకునే ప్రయత్నం లో పడ్డాడు.... సత్యకేశవులు....నెమ్మదిగా

తన ఫ్యాన్సీషాపు తెరుచుకోవడం మొదలు పెట్టాడు.


ఆరోజు ఆదివారం..... అమావాస్య...

చెన్నకేశవులు కళ్ళు తిరిగి ఇంటి దగ్గర గడప మీద పడిపోయాడు. అతని కొడుకు రాము.. భయపడి తన చిన్నాన్న సత్యకేశవులు కి విషయం చెప్పి త్వరగా రమ్మని ఫోన్ చేశాడు.అంతే హుటాహుటిన సత్యకేశవులు, బుజ్జిబాబు మోపెడ్ మీద స్పీడ్ గా వెళ్లి చెన్నకేశవులు ని సిటీ లోనే పెద్ద ప్రైవేటు హాస్పటల్ కి తీసుకువెళ్లి జాయిన్ చేశారు. డాక్టర్గారు మొత్తం పరీక్షలన్నీ చేసి కాలేయానికి సంబంధించి ఏదో వ్యాధి వచ్చిందని చెప్పి, పది రోజులు హాస్పిటల్లో ఉంచారు. కొంచెం రికవరీ అయ్యింది. ఇకమీదట వాడవలసిన పూర్తి మందుల కోర్సు రాసి ఇచ్చి ఈ సారి ఇలా జరిగితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రావలసిందిగా మరీ మరీ చెప్పి హాస్పటల్ నుండి పంపించేశారు.


అంతా బాగానే ఉంది. చెన్నకేశవులు ఇంటి దగ్గర నెమ్మదిగా కుదుట పడుతున్నాడు.


నెల గడిచింది. ఆరోజు...


చెన్నకేశవులు మళ్లీ కళ్ళు తిరిగి దొడ్లో పడిపోయాడు.

రాము తండ్రి దగ్గరికి వచ్చి చూసి జాగ్ర త్తగా లోపలకు తీసుకెళ్ళి పడుకోబెట్టాడు.


వెంటనే ఊర్లోనే ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ రాజన్నకు ఫోన్ చేశాడు కంగారుగా, అతను వచ్చాడు అర్ధగంటలో... కండిషన్ చూసి, తను ఏవో నాలుగురకాల మందులు రాసి ఇచ్చి వాడమని చెప్పి వెళ్ళిపోయాడు , అతను వెళుతున్నప్పుడు ప్రతిరోజు వచ్చి జాగ్రత్తగా చూడవలసిందిగా... చెప్పాడు రాము.

" సరే" అంటూ వెళ్లిపోయాడు.. ఆర్.ఎం.పి డాక్టర్ రాజన్న.


చెన్నకేశవులు కి కొంచెం తెలివి వచ్చింది. కొడుకుని దగ్గరకు పిలిచాడు.

" ఏరా.. ఏం చేస్తున్నావు.. నావిషయం ఏం ఆలోచించావు?."అంటూ అడిగాడు.


"నాన్నా! నువ్వు ప్రశాంతంగా పడుకో. వైద్యం చేయిస్తున్నాను కదా... ఇదిగో నాలుగు రకాల మందులు రాజన్నగారు రాసిచ్చారు.

తెచ్చాను. ఇవి శ్రద్ధగా వేసుకో. ఒక వారం పోయిన తర్వాత ఆలోచిద్దాం లే" అంటూ బయటకు వెళ్ళి పోయాడు.

మళ్లీ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు.

చెన్నకేశవులు.. కొడుకుని దగ్గరకు పిలిచాడు.

"ఏంట్రా.... నాకు ఇలా జరిగితే వెంటనే హాస్పి టల్కు తీసుకురమ్మన్నారుకదా డాక్టర్ గారు... నువ్వు ఏమీమాట్లాడకుండా ఊరుకున్నావేమిటి?"... కొడుకుని ప్రశ్నించినట్టు అడిగాడు చెన్నకేశవులు.


"డాక్టర్ గారు ఇంటికొచ్చి చూస్తున్నారు కదా.. ఎందుకు కంగారు?..."...అంటూ తండ్రి చెప్పేది వినకుండా బయటకు వెళ్ళిపోయాడు రాము.

నాలుగు రోజులు గడిచింది తన ఆరోగ్యంలో పెద్దగా మార్పు రాలేదని గ్రహించాడు చెన్న కేశవులు. ఇప్పుడు ఏం చేయాలి?? బాగా ఆలోచించాడు చెన్నకేశవులు. తను ఒక్కడే హాస్పటల్ కు వెళ్ళే స్థితిలో లేడు... తన తమ్ముడు సత్యకేశవులికి విషయం చెప్పి ఉండడు రాము. ఈ విషయం తెలిస్తే ఈపాటికే తన తమ్ముడు సత్యకేశవులు... అతని కొడుకు బుజ్జి బాబు..... పరుగు పెట్టుకొని వచ్చి ఉండేవారు. తన తమ్ముడికి ఆరోగ్యం బాగోలేనప్పుడు తను వెళ్లి... చూసే వాడు కదా.... మరి తన ఆరోగ్యం బాగా లేనప్పుడు తనతమ్ముడు ఎందుకు రాడు.. వస్తాడు.

ఎటొచ్చీ ఈ విషయం తెలిసి ఉండక పోవచ్చు

ఇప్పుడు ఏం చేసేది??? ... ఫోన్ చేద్దామంటే తన ఫోన్ వర్కింగ్ లో లేదు...


బాగా ఆలోచించాడు.. చెన్నకేశవులు. తన ఇంటి పక్కనే ఉన్న స్నేహితుడు మూర్తి

గారిని పిలిపించాడు తన భార్య సహాయంతో.

మూర్తిగారు వచ్చారు. బయట కూర్చున్న రాము తో చాలాసేపు మాట్లాడారు...మూర్తి

గారు.

" నాన్నగారికి ఒంట్లో బాగాలేదు అంట కదా! నన్ను కబురు పెట్టారు.... ఏం జరిగింది అసలు? అంటూ ప్రశ్నించారు మూర్తిగారు రాముని.


" ఆయనది అంతా కంగారు మూర్తిగారు." చెప్పాడు రాము.


" మరిప్పుడు ఏం చేద్దాం.. హాస్పిటల్కు తీసుకువెళ్దామా. ... ఊర్లోనే ఉన్న మీ చిన్నాన్న కు కబురుపెట్టావా??" ప్రశ్నించారు మూర్తి గారు.


ఇద్దరూ కలిసి నడుస్తూ పక్క గదిలో మంచం మీద పడుకున్న చెన్నకేశవులు దగ్గరికి వెళ్లారు.


" అక్కర్లేదు మూర్తిగారు... వాళ్ళు అన వసరంగా కంగారు పడతారు. నేను ""ఇంటి దగ్గరే మంచి డాక్టర్ ను పెట్టి వైద్యం చేయిస్తు న్నాను"" కదా...అంతగా అవసరమైతే...... అప్పుడు..... చూద్దాం..."


చెవులారా విన్నాడు తన కొడుకు అన్న ఆ మాటలు... చెన్నకేశవులు.!!


అతనికి ఎక్కడో కాలినట్టు అనిపించింది.!


ఎవరో తన గూబ మీద గట్టిగా చరిచి నట్లు అనిపించింది.!


ఇంకెవరో తన వీపు మీద కొరడాతో కసక్ కసక్ అని కొట్టినట్లు అయింది!


చెన్నకేశవులు మత్తుగా మగతగా ఒక పక్కకు ఒరిగిపోయాడు.!


కొంచెం తెలివి వచ్చి చూసుకునే సరికి... తను పెద్దహాస్పటల్ లో బెడ్ మీద ఉన్నట్టు గ్రహించాడు.!


ఇద్దరు నర్సులు సెలైన్ ఎక్కించే ప్రయ త్నంలో ఉన్నారు.!


ఓ స్పెషల్ డాక్టర్ తన కేసుషీటు ని పరిశీలి స్తున్నాడు.


మరో డాక్టర్ తన బీపీ, షుగర్ చెక్ చేస్తున్నాడు..


కొంచెం దూరంలో తన స్నేహితుడు మూర్తి గారు.. 'పర్వాలేదు' అన్నట్టు ధైర్యం చెబు తున్నారు!


ఇటుపక్క.... తన తమ్ముడు సత్యకేశ వులు, అతని కొడుకు బుజ్జిబాబు, తన భార్య

'భయం లేదు' అన్నట్టు చేతులు ఊపు తున్నారు...!!


మరో వ్యక్తి గురించి పరిశీలనగా చుట్టూ పరికించాడు చెన్నకేశవులు....


తన రక్తపు వాసన పీల్చుదామంటే ఎక్కడా లేదేమిటి??


తన రూపపు ప్రతిబింబం చూద్దామంటే ఎక్కడా కనపడదే????


చాలాదూరంలో... చాలాచాలా దూరం లో.. ఎవరి గొడవ పట్టనట్టు ఒంటరిగా బల్లమీద కూర్చున్న ఆ వ్యక్తి...మసకగా కనిపిస్తున్న ఆ అస్పష్టపు వ్యక్తి....తను అనుకున్న వాడేనా... ఏమో.... ఏమో????కావచ్చు..... కాకపో వచ్చు!!!!!????


(( పసివాళ్ల మనసులను పాడు చేసేది పెద్దల మనస్తత్వమే అంటాను... ఇట్లు రచయిత..)

🏵️🏵️శుభం🏵️🏵️


రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం....


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు





170 views0 comments

Comments


bottom of page