top of page

పెళ్లిసందడి


'Pelli Sandadi' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

'పెళ్లిసందడి' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


పెళ్ళి సందడి.. 1930 కి ముందు.


"ఏమే! రంగమ్మత్తా! నాకూతురి పెళ్లికి ఇయాలా వచ్చేది? పెద్దదానివి నీవన్నీ ఎన్నంటే ఉండి సూడద్దూ! లోనికెళ్ళు. "


"ఆరే అబ్బాయి.. అంటే అన్నానంటావు గానీ..

నీ ఒక్కగానొక్క కూనని 6 మైళ్ల దూరమిస్తావా ఏటీ.. ఇంతోటి ఊళ్ళో ఆపాటి పోరిగాడు కానరాలేదా ?"


"నువ్వూరుకోయే అత్తా! ఏటా మాటలు? ఇప్పుడా ఆనేది? మంచి సమ్మందం. పిల్లాడు పిటపిట లాడుతున్నాడు. కూనకి నచ్చింది. నీవు గమ్మునుండు"


"ఒరేయ్! యాకోబూ, రంగన్నా! ఏడ తొంగున్నారు? ఎడ్ల బండ్లు కట్టండిరా. మగపెళ్ళోరి బండ్లు ఇంకో ఘడియలో ఊరి పోలారలోకి లగెత్తుకొచ్చేస్తాయి. " ఆ మేళగాళ్ళాడున్నారో! ఎదురొడ్డి తోడ్కొని రావాల”


"ఏమే లచ్చిమీ! యాడున్నావే! ఈ యాడాళ్ళ సింగారం ఎంత వరకూ తెవలదు. తనే శోభనపు పెళ్ళికూతురన్నట్లు ముస్తాబవుతారు. బేగి రాయే. బండెక్కాల"

"ఏరా బామ్మర్దీ! కూసింత వంట సావిడి లోకెళ్ళి వంటోళ్ళను బేగిర పెట్టి విడిదిలోకి ఉడుకుడుకు పలహారాలను పంపించు. సల్లారితే బాగవదు"


“యాసం కాలం సూరీడు సిటసిట లాడుతున్నాడు. అయినోళ్ళు, ఊరోళ్ళు వచ్చి తాటాకు పందిరిలో సందడి సేస్తున్నారు. ఒరేయ్ సిన్నోడా! సల్లని మట్టి కుండలోని వట్టిఏళ్ళ పానకం ఇత్తడి గలాసుల్లో నింపి వాళ్ళకందించు. వాల్ల పానాలు కూసింత సల్లబడాల! "


"అమ్మగోరూ! కాగడాల వాళ్ళమండీ.. నాలుగు పాత గుడ్డలు, కూసింత ఆయిలు ఇప్పిస్తే మాపని మేం సేసుంటాం. మళ్ళీ అయ్యగారు కేకలేస్తారు."


"ఒరేయ్ వెంకట్రావ్! పెట్రొమాక్సు లాంతరులు తెచ్చాను.. యాడెట్టాలి?. కానరాకపోతే మల్లీ హడావుడి సేస్తావ్"


"ఒరేయ్! ఇంటికాడ మేనాని పూలతో సింగారించి ఉంచండ్రా! పెళ్ళి కూతురుని ఊరేగించాల."


రచ్చ బండ వేపచెట్టు కాడ కాసిని కురిసీలు వేయాల. పెళ్ళోరు దేవదాసీల అందసందాల సిందులు సూసి మేను పులకరించి ఖుసీ అవ్వాల!


ఈ కుర్ర ఎదవలంతా ఏడున్నారు? ఏడన్నా కల్లుతాగి మత్తులో తొంగున్నారా?


అయ్యగారూ! తెల్ల గుర్రాన్ని పూలతో అలంకరించి తెచ్చానండీ.. హుషారుగా తెగ సిందులేస్తోంది. ఎక్కడ కట్టమంటారూ.. పెళ్ళికొడుకును ఊరేగించాల. "


"అయ్యా! మా దొర గారు మగ పెళ్లార కోసమని అరిటి గెళ్లు.. పనసకాయలు, మామిడి పళ్ళు పంపారండి. యాడెట్టాలి? రేపటినుండి.. వారం రోజులూ ఆడనుండే పాలు, పెరుగులు పంపిత్తామని సెప్పమన్నారు.. "


"సర్లే ఆడెట్టెళ్ళు. ఇదిగో అరటాకులు కూడా పట్టుకొచ్చెట్టు. "


"అలాగే దొరా.. ఎల్లొస్తా.. "


"అయ్యా.. శాస్త్రి గారు ఈ పైకం మీకిమ్మన్నారండి.. లెక్కలు తర్వాత సరిసూసుకుందామని సెప్పారండి"..


పెళ్లిసందడి.. 1940 to 1990.


"మాకు పిల్ల నచ్చింది. కుందనపు బొమ్మ లా ఉంది. చిదిమి దీపం పెట్టుకోవచ్చు. మాకు సొమ్ము పదానం కాదు. లాంఛనాలేమిస్తారూ.. ఆడబడుచులు నలుగురు. 'ఆడపడుచు అర్థమొగుడు' అంటారు కదా మరి వాళ్ళను త్రృప్తిపరచొద్దూ.. కంచి పట్టు చీరె, తలొక, నకిలెస్ చాలు. పెళ్ళి కొడుక్కి ఫియట్ కారు మీరెలాగూ ఇస్తారాయే. ఉంగరం, బ్రేస్లెట్, మెడలో మందపాటి గొలుసు పెడితే ఇంకా బాగుంటుంది. అది మీ వేడుక - మీ సరదా. మేం మాత్రం కాదంటామా సెప్పండి"


"మీ పిల్లకి బంగారం మీరెలాగూ ముచ్చట కొద్దీ పెట్టుకుంటారు.. అందులో ఏం మొహమాట పడద్దు బావగారూ. మీకు మాత్రం ముద్దూ- ముచ్చటా తీరద్దూ.. మీ ఇంటి వద్ద పెళ్లంటే కాస్త ఇబ్బందే.. పోనీ ఓ పని సేయండి.. ఓ మాంచి కళ్యాణ మండపం సూద్దురూ.. చాలా గాండ్ గా పెళ్లిచేస్తే నాలుగూళ్ళల్లో మీ పేరు నానుతూ ఉంటుంది.. రాబోయే పదేళ్ళపాటు జనాలందరూ ఈ పెళ్లి గురించి ఘనంగా సెప్పుకోవాల. మేం విని పొంగిపోవాల.. మేమంతా తరలి రావటానికి ఎన్ని బస్సులు ఎడతారో మీరు ముందే పిపేరవ్వాలి. ఇంటి ముందే బస్సులెక్కాలి సుమా! .


అన్నట్టు మీకు ఇంకోటి సెప్పాల. పెళ్లి కొడుకు బావలు కార్లలో తప్ప రారట.. మా ఇంటి అల్లుళ్ళాయే.. వాళ్ళను గవరవ పరచాలి. పెళ్ళికొడుక్కి ఎలాగూ పూలతో డెకరేషన్ చేసిన కారెడతారుగా బావగారూ.


పెళ్ళి మంటపం సినిమాలలో లాగా బెంగళూరు ఫ్రెష్ గులాబీలు, తెల్లని మల్లెలతో ఘుమఘుమ లాడాలి. అన్నట్టు వీడియోలు కూడా మీరే పెట్టాల.


కొంపదీసి.. సాపకూడెట్టద్దు.. మేం కింద కూసోము. మా పిస్టేజి సెడుద్ది. ఆ బల్లల మీల్సే పెట్టండి. కాస్త బ్యాండు మేళం, పక్కన సన్నాయి ఉంటే చూడండి.. మాంచి సినిమా పాటలు కూడా వాయించాల.. రికార్డింగ్ డాన్సెట్టాల.. మా బంధువులకు వసతిగా ఉండేందుకు రూములివ్వాల. పెళ్ళవగానే వాళ్ళు అటునుంచి అటే రైళ్లలో వెళ్తారుట.. వాళ్ళ వివరాలిస్తాను.. రిజర్వేషన్స్ చేయిద్దురూ. ఆపని మీరు కాదనరు. నాకు తెలుసు బావగారూ. "


పెళ్లిసందడి.. 1990 to 2020.


"కట్నం మేం తీసుకోము. (కట్నం తీసుకోవటం నేరం) పిల్లలిద్దరూ ఉద్యోగులే కదా.. మాకు డబ్బు ఆశ లేదు బావగారూ! కాకపోతే లాంఛనాలు, వేడుకలు జరగాలి. పెళ్లి మీరెలాగూ ఘనంగా మాహోదాకు తగ్గట్టు చేస్తారు. అది ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదనుకోండి. మాకు చుట్టాల బలగం ఎక్కువండీ.. మాఇంటి దగ్గరే ఏసీ ఫంక్షన్ హాలు పెద్దది ఉంది. రెండు నెలల ముందే మీరు బుక్ చేయాలి.. మా బంధువులు ఉండేందుకు ఫైవ్ స్టార్ హోటళ్ళలో రూములివ్వాలి.. పెళ్ళిలోకి మెనూ మీకు పంపిస్తాము. ఆరోజు స్టార్ నైట్ పెట్టాలి.. మా ఫామిలీకి ఫ్లెయిట్ టిక్కెట్లు బుక్ చేయండి. అఫ్ కోర్స్. మీరు చేస్తారనుకోండి.


పెళ్లి సందడి.. మార్చి. 2020 నుండి.


"మా అబ్బాయి పెళ్లి.. ఫలానా వారి అమ్మాయితో.. ఫలానా సమయంలో.. పెళ్లి కూతురి ఇంట్లోనే. ".. అని ఫోనుల ద్వారా వాట్సప్ పెళ్ళి పిలుపు. ఇలా అందరినీ పిలవాలి కదా అని మెసేజ్ పంపుతున్నాము. పిలిచామని దయచేసి మీరెవరూ పెళ్ళికి తరలి రావద్దు.. వస్తే కరోనా మీ ఎన్నంటే.. మీ శేయస్సు కోరి సెపుతున్నాము.


అతి ముఖ్యులైన 50 మంది వరకే ఆహ్వానం పరిమితం. ఆడపెళ్లి వాళ్ళకి 25 ఇవ్వగా మిగిలింది మాకు 25 మాత్రమే. ఆ లిస్టులో మీపేరు లేదు.. కనుక మీరొస్తే పోలీసులు చర్య తీసుకొంటారు.. అందుకు మాబాధ్యత లేదు.. గమనించ మనవి.


ఇక పెళ్లికి.. మీరు వస్తూ మాస్కులు, శానిటైజర్స్ తెచ్చుకోవాలి. కనీసం మూడడుగుల దూరం పాటించాలి.


"కానుకలొద్దు- కరోనా వద్దు. "


వాట్సాప్ మెసేజ్ లు పెట్టాం.. జూమ్ లింక్ ఇచ్చాం.. అంతగా మాపై పేముండి పెళ్ళి సూడాలనిపిస్తే మీ కొంపలోనుండే ఆ లింక్ లో సూడొచ్చు. అచ్చింతలు మీ లాప్ టాప్ లో ఆ లింక్ కు ఏయండి. మాకు శానా సంతోసం.

ఇంకో ఇసయం ఇవరంగా సెప్పాల. పెళ్ళిభోజనాలు లేవు.. కరోనా సమయంలో.. క్యాటరింగ్ వాళ్ళు హోం ఐసోలేషనులో ఉన్నారు. వాళ్లు ఇల్లు కదిలితే కాళ్లిరగ దీస్తామని పోలీసు వారి ఘాటైన హెచ్చరిక..


చివరగా ఒక మనవి..


ఇక పరిస్థితులు సక్కబడిన తర్వాత గాండ్ గా రిసెప్షన్ జరుపుకోవాలని మా ఇరు కుటుంబాల ఒప్పందం. ఈ స్పీడు యుగంలో దంపతులు తొందరపడి.. ఒకరో.. ఇద్దరో పిల్లలని కంటే.. అప్పుడు రిసెప్షన్ ఉండదు.. మనవడిదో, మనవరాలిదో బారసాల ఉంటుంది.. అప్పటికి పోయినవారు పోగా.. మిగిలినవారితో.. అప్పటి ప్రభుత్వ నియమనిబంధనలనుసరించి ఆ వేడుక ఉంటుంది..


అంతవరకూ.. Stay Home. Stay Safe.

***

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు



"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏







79 views0 comments
bottom of page