top of page

పిలుపులో ఏముంది



'Pilupulo Emundi' - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 11/04/2024

'పిలుపులో ఏముంది' తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



“ఏమిటండీ అల్లుడు అని మర్యాద లేకుండా నువ్వు అనడం, పేరు పెట్టి పిలవడం నాకు నచ్చలేదు, మీరైనా ఒకసారి వియ్యంకుడితో చెప్పండి మా అబ్బాయికి గౌరవం యివ్వటం లేదని” అంది విశాలాక్షి మొగుడితో తన కొడుకును అత్తంటివారు చిన్న చూపు చూస్తున్నారని.


“పొనీలేద్దు, నీ కొడుకుకు లేని బాధ నీకెందుకు, వాళ్ళ అల్లుడు.. వాళ్ళ యిష్టం” అన్నాడు శంకరం.


“మన పెళ్లి అయ్యి ముప్పై ఏళ్ళు అయినా మా అన్నదమ్ములు మిమ్మల్ని ‘బావగారు వున్నారా’ అని అడుగుతారే గాని ‘బావ వున్నాడా’ అని అడగరు. ఏమైనా నాకు మన అబ్బాయి ని వాళ్ళ మామగారు ‘ఏయే వినయ్, నువ్వు ఒకసారి చూడు’ అంటూ సంభోదించటం నచ్చటం లేదు. నేనే వీలు చూసుకుని అడిగేస్తాను. అయినా మన వాడు యిటు పెళ్ళాం దగ్గర, అటు అత్తమామల దగ్గర, రేపు పిల్లలు దగ్గర లోకువ అయిపోయి బతకాలిసిందేనా?” అంది.


“అబ్బా ఊరుకో వెధవ గొడవ, ఎవ్వరు ఎలా పిలుచుకుంటే మనకెందుకు, నువ్వు నన్ను గౌరవంగా పిలువు చాలు” అంటూ చిరాకుపడ్డాడు శంకరం.


“ఏమిటో మీరు ఏమీ పట్టించుకోకపోవడం వలన ఆడదానిని నన్ను నలుగురూ “ఏమిటి అక్కయ్యా మన వినయ్ ని వాళ్ళ అత్తగారు నువ్వు అని అని పిలుస్తోంది, మేము మా అల్లుడు అంటే వణికిపోతాము. యిప్పటికి మా అల్లుడు ముందు నుంచుని మాట్లాడాలి అంటే భయం’ అంటున్నారు మీ తమ్ముళ్ల భార్యలు” అంది విశాలాక్షి.


“నుంచుని కాకపోతే కూర్చుని మాట్లాడుకోమని చెప్పు, అనవసరంగా మన వియ్యంకుడితో గొడవలు పడాలి అని, అది తెలిసి కోడలు మనల్ని గెంటేయాలి అని వాళ్ళ కోరిక. వాళ్ళ మాయ మాటలు నమ్మి నన్ను విసిగించకు” అన్నాడు శంకరం.


ఒకరోజు విశాలాక్షి పుట్టినరోజు అని వియ్యంకుడు, వియ్యపురాలు వచ్చారు. వాళ్ళని చూడగానే విశాలాక్షి ‘రారా అన్నయ్య, బాగున్నావా’ అని పిలిచింది. దానితో వియ్యంకుడు సుబ్బారావు కొయ్యబారిపోయాడు తనని రా అని సంభోదించడంతో. యిహ వియ్యపురాలు మొహం అయితే నల్లబడిపోయింది.


తన భార్య ఏదో పగ తీరుచుకోవడానికి ప్లాన్ వేసినట్టు వున్నట్టు వుంది అనుకుని శంకరం, “ఏమిటో స్వంత అన్నగారి కంటే మీరు ఎక్కువ దగ్గర అయిపోయారు బావగారు” అన్నాడు వియ్యంకుడితో.


మనం మాత్రం ఏం తక్కువ అనుకుంది ఏమో, “అన్నయ్యా, నువ్వు వదిన పుట్టినరోజు అని పిలవకపోయినా వచ్చేసాను” అంది శంకరం ని వియ్యపురాలు. 


దానితో వుండేలు దెబ్బ తిన్న కాకిలా అయిపోయాడు శంకరం. ఈ పిలుపులు నా ప్రాణం మీదకి వచ్చాయి అనుకుని మోనంగా కూర్చున్నాడు. భార్య చేసిన పనికి సంతోషం తో వియ్యంకుడి మొహం ఆనందంతో వెలిగిపోతోంది.


“రా అన్నయ్యా, నీకు భోజనం త్వరగా చెయ్యడం అలవాటు కదా, కొద్దిగా మా యింట్లో రెండు కూరలు, రోటీ పచ్చడి, పులుసు వుంటాయి, నీకు యిన్ని వేసుకుని తినడం అలవాటు లేకపోయినా పరవాలేదు, ఈ పూటకి కడుపునిండా తిను” అంది విశాలాక్షి తన కోడలు తండ్రి సుబ్బారావు తో.


యీవిడ నా మీద అభిమానం చూపిస్తోందా లేకపోతే మీ యింట్లో తిండి కూడా సరిగ్గా తినరాని దెప్పిపొడుస్తోందా అనుకుంటూ వచ్చి కంచం దగ్గర కూర్చుని “మీరు కూడా రండి బావగారు, మీరు తినకుండా నేను ఎలా తింటాను” అన్నాడు సుబ్బారావు శంకరం తో.


“వస్తున్నా, వస్తున్నా! నాకు పూజా, సంధ్యవందనం లాంటివి వున్నాయిగా, మీకా బాధలేదు” అంటూ వచ్చి కంచం దగ్గర కూర్చున్నాడు.


“ఎందుకు వచ్చాం రా నాయనా, మొగుడు పెళ్ళాలు యిద్దరూ కలిసి యిలా అవమానం చేస్తున్నారు, అదివరకు ఎంతో మర్యాదగా చూసే వాళ్ళు యిప్పుడేమైంది వీళ్ళకి” అనుకుంటూ అన్నం తింటున్నాడు. “ఏమాటకి ఆ మాట విశాలాక్షి గారి వంట అమృతం” అన్నాడు పైకి.


“ఆ ఏముంది లే అన్నయ్య, నువ్వు తిండికి ఆగలేవని కానీ లేదంటే యింకో రెండు కూరలు రెండు పచ్చళ్ళు చేసేదానిని” అంది విశాలాక్షి.


ఛాన్స్ దొరికింది అనుకున్న సుబ్బారావు “అన్ని కూరలు పచ్చళ్ళు చేసుకోవడానికి యివ్వాలేమి తద్దినం కాదుగా, నీ పుట్టినరోజు కదా” అన్నాడు. ఈ మాటతో విశాలాక్షి మొహం మాడిపోయింది.


మొత్తానికి భోజనాలు అయిన తరువాత అందరూ హాల్ లో కూర్చుని వున్నారు. ఎవ్వరు ముందు నోరు విప్పితే ఏ అవమానం పడాలిసివస్తుందో అనుకుని సైలెంట్ గా వున్నారు.


పదినిముషాలు అటు యిటు చూసి, సుబ్బారావు లేచి శంకరం చెయ్యి పట్టుకుని “ఏమైంది బావగారు, మా వల్ల ఏమైనా తప్పు జరిగిందా, లేకపోతే మా అమ్మాయి అంటే మీ కోడలు ఏమైనా తప్పుగా మాట్లాడిందా చెప్పండి, , ఈ ఏకవచన ప్రయోగం భరించలేను” అన్నాడు.


శంకరం కంగారు పడి లేచి సుబ్బారావు ని కుర్చీలో కూర్చోపెట్టి, “ఏమి లేదండి బావగారు, ఏకవచనo తో పిలిస్తే యితరులు ఎంత బాధ పడతారో తెలియటం కోసం మీ చెల్లమ్మ ఆడిన నాటకం. మీరు మీ అల్లుడిని నువ్వు అని పిలవడం మీ చెల్లెలు కే కాదు నాకు నచ్చటంలేదు. మామగారు పిలిచాడు అంటే సద్దుకోవచ్చు, అత్తగారు కూడా అల్లుడుని నువ్వు అని పిలవడం బాగుండదు కదా, ఏ మేనల్లుడో అయితే పిలిచినా పర్వాలేదు, మేము మా అల్లుడు ముందు కూర్చుని వుండటానికి కూడా ఆలోచిస్తాం అంతే. మీకు ఏకవచన ప్రయోగం ఎంత బాధగా ఉంటుందో తెలిసింది కదా, మీరు వేరుగా అర్ధం చేసుకోకుండా మీ అల్లుడిని మీరు గౌరవం గా పిలిస్తే మీకు గౌరవం, మీ అల్లుడికి గౌరవం” అన్నాడు శంకరం.


“అన్నయ్య గారు, ముందు ఈ షుగర్ లేని కాఫీ తాగండి, మిమ్మల్ని నువ్వు అన్నందుకు నాకు బాధగా వుంది, కానీ మా అబ్బాయిని మా ఆయనే చంటాడా అనిపిలుస్తారు, నువ్వు అనరు ఎప్పుడో కోపంలో తప్పా” అంది.


సుబ్బారావు కాఫీ కప్ అందుకుని, “యిహ నుంచి మా అల్లుడిని మీరు అనే సంబోధిస్తాం., కానీ నాకు ఎందుకో మీరు నన్ను నువ్వు అని, నేను నిన్ను చెల్లాయ్, నువ్వు అని పిలుచుకుంటేనే బాగుంటుంది అనిపిస్తోంది, యిహ మా బావగారు వాళ్ళ చెల్లెలు వాళ్ళ యిష్టం మీరు అనుకుంటారో నువ్వు అనుకుంటారో” అన్నాడు.


“అలాగే అన్నయ్య, నాకు స్వంత అన్నయ్య లేని లోటు తీరి పోయింది” అంది సంతోషంగా విశాలాక్షి.


“చంపారు, అయితే యిప్పుడు మేమిద్దరం ఎలా పిలుచుకోవాలో తేల్చుకోవాలి అన్నమాట” అన్నాడు శంకరం వియ్యపురాలు వంక చూస్తో.

“మీరు ఎలా పిలిచినా ఓకే అన్నయ్య గారు నేను మాత్రం అన్నయ్య గారు అనే పిలుస్తాను, అయినా అభిమానం ఉండాలి తప్పా పిలుపులో ఏముంది వదినగారు” అని అంటించింది వియ్యపురాలు.


“సరే అయిదు అవుతోంది, చీకటిపడితే డ్రైవింగ్ నాకు కష్టం, యింక వెళ్తాము” అంటూ లేచారు.


శంకరం వియ్యంకుడుకి వియ్యపురాలకి కారు దాకా తోడు వచ్చాడు. అన్నయ్యా! వుండు నేను ఎదురు వస్తాను” అంటూ కొద్ది దూరం ముందుకి నడిచివెళ్లి కారుకి ఎదురు వచ్చింది విశాలాక్షి. అదేమిటో తన శకునం అంత మంచిది అని పిచ్చ నమ్మకం విశాలాక్షి కి.


“మీరు కూడా వీలు చూసుకుని మా యింటికి రండి” అంటూ కారు ముందుకు పోనిచ్చాడు సుబ్బారావు.


“ఈ గొడవంతా మన కోడలికి చెప్పి తగదా పెట్టరు కదా” అంది భర్తతో.

 

“అలాంటిది ఏమి వుండదు లే” అన్నాడు శంకరం. కొన్నాళ్లకి కొడుకు కోడలు సెలవులు అని వచ్చారు. విచిత్రం అంతకు ముందు మొగుడిని అరేయ్ వినయ్ అని పిలిచే కోడలు యిప్పుడు ఏమండీ అని పిలుస్తోంది.


 అంటే వాళ్ళ అమ్మ కూతురికి అంటించింది అన్నమాట అంది విశాలాక్షి భర్తతో.

 

“పోనిద్దు, నువ్వు నీ కూతురికి చెప్పుకున్నట్టే, ఆవిడ వాళ్ళ అమ్మాయికి చెప్పుకుంటుంది, ఇందులో తప్పేముంది” అన్నాడు శంకరం. 


“మీతో మాట్లాడటం నా బుద్దితక్కువ, నాకే వాత పెడతారు” అంటూ రుసరుసలాడుతో వెళ్ళిపోయింది వంటగదిలోకి.


వెళ్లినంత సమయం పట్టలేదు, రివ్వున వెనక్కి వచ్చి శంకరం కి వినిపించే విధంగా “ఏమండీ, కోడలు అబ్బాయి తో అంటోంది, ‘ఒరేయ్! అత్తయ్యా మామయ్యగారికి భయపడి నిన్ను మీరు అనలేక చస్తున్నాను, హాయిగా మనం నువ్వు అని పిలుచుకోవడమే బాగుంది’ అని.

 వాడు మరీనూ ‘అంటే మీరు అని పిలిచింది నన్నా, మా అమ్మని అనుకున్నాను’ అని నవ్వుతున్నాడు” అంది విశాలాక్షి.


సాయంత్రం అయ్యింది, కోడలు శంకరం చేతికి కాఫీ కప్ యిస్తో, “మేము సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం, మీరూ అత్తయ్య కూడా వస్తే బాగుంటుంది” అంది.


“మేము సినిమాలు చూడటం మానేసి చాలా రోజులైంది, నువ్వు యిటు రా అమ్మా” అంటూ కోడలికి వినిపించేడట్లుగా “నువ్వు మీ ఆయనని నీకు ఇష్టమైన విధంగా పిలుచుకో పర్వాలేదు, మీ అత్తయ్య ఏమి అనకుండా నేను చూస్తా లే” అన్నాడు శంకరం.


“పరవాలేదు మామయ్యగారు, మీరు అని పిలవడం అలవాటు చేసుకుంటున్నాను, పెళ్ళికి ముందు స్నేహితులు అవ్వడం, ఒకటే ఆఫీస్ అవడంతో ఆ పిలుపు అలవాటు అయ్యింది” అంది సిగ్గుపడుతూ.


“మామయ్యగారు, ఒక మాట అడగవచ్చా” అంది కోడలు.


“”దానికేం భాగ్యం అడుగు” అన్నాడు, ఇంతలో శంకరం కొడుకు కూడా వచ్చి సోఫాలో కూర్చుంటో, “ఏమిటి మామాకోడళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు” అన్నాడు.


“అడుగు తల్లీ, ఆగిపోయావే” అన్నాడు కోడలిని. 

“ఏమి లేదు ఎప్పుడైనా అత్తయ్య మిమ్మల్ని నువ్వు అన్నారా” అంది నవ్వుతో. 


“మా నాన్నని ఎదురుపడి ఎప్పుడు అమ్మ నువ్వు అనలేదు నాకు తెలిసి కానీ నా ముందు అనేది మీ నాన్న చాదస్తం తో చచ్చిపోతున్నాను అని”  అన్నాడు వినయ్ భార్యతో.


“ఒరేయ్ యింటిగుట్టు బయటపెట్టకు రా” అన్నాడు శంకరం నవ్వుతూ.


 శుభం


జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







64 views0 comments
bottom of page