top of page

ప్రేమకు సోపానం


Premaku Sopanam Written By A. Annapurna

రచన : A. అన్నపూర్ణ


''అవినాష్ చాల దుడుకు పిల్లడు.మేం కొట్టలేం, మందలించలేం. రూల్స్ ఒప్పుకోవు. మిగిలిన పిల్లలు భయపడుతున్నారు.'' అని క్లాసులో టీచర్లు రాగిణికి, సాగరుకి ఫిర్యాదు చేశారు.

'అయితే ఎలా వీడికి చదువు వస్తుంది? అని బాధ పడింది రాగిణి.

''ఇప్పుడు ఇంకా చిన్నక్లాసు. హైస్కూల్ కి వచ్చాక కుదురు కుంటాడు. ఇంటి దగ్గిర ప్రయివేటు చెప్పిద్దాం. నువ్వు కనిపెట్టి వుండు..''అంటూ ఓదార్చి ట్యూషన్ ఏర్పాటు చేసాడు సాగర్.

అవినాష్ లో మార్పు లేదు. కానీ టీచర్ ధరణి పేరుకి తగ్గట్టే సహన వంతురాలు..ఓర్పుతో దారికి తీసుకు రావడానికి ప్రయత్నం చేయసాగింది.

రాగిణి కలగ చేసుకోకుండా చాటుగా గమనించేది. ఆమె వయసుకి చిన్న అయినా ఎంతో అనుభవం వున్నట్టు హ్యాండిల్ చేస్తోంది. కుటుంబంలో తమ్ముళ్లు చెల్లెల్లు ఉన్నట్టున్నారు. పెళ్ళికాలేదు.బాధ్యతలు తెలిసినట్టు వుంది. నెట్లో వెదికి పిలిస్తే వచ్చింది. అదృష్టం. మంచి టీచర్...అని సంతోష పడింది.

ఐతే ఫీజ్ ఎక్కువ అడిగి వారానికి పే చేయాలంది. అవినాష్ బాగు పడితే చాలని ఒప్పుకుంది.

నెలకోసారి ఎలా వున్నాడని అడిగితే....మీరే గమనించండి....స్లో ఇంఫ్రూమెంట్....అయితే మీరు డాక్టర్ ని కూడా కన్సల్ట్ చేయండి. అందువలన ఇంకా మెరుగవుతాడు.''అంది ధరణి.

డాక్టర్ పరీక్షలు చేసి అన్నారు. ''మీ కుటుంబంలో ఎవరికో ఈ ప్రాబ్లెమ్ వుంది....పరవాలేదు.

ఇప్పుడు మంచి ట్రీట్ మెంట్ వుంది. బాగవుతాడు....అవినాష్ టీచర్ ఎవరో మీకు మంచి సలహా ఇచ్చారు.మీరు, నేను ఆవిడను ముందుగా మెచ్చుకోవాలి''అన్నారు.

అప్పటినుంచి ధరణి అడగకుండానే ఫీజు ఎక్కువ చేసింది రాగిణి.

అవినాష్ పూర్తిగా మారకపోయినా మెరుగవుతున్నాడు మెల్లిగా.

అతనిమీద ప్రెషర్ తేకుండా అతను ఏది చదువుతాను అంటే అదే చదివించండి అన్నారు టీచర్లు కూడా .

మొత్తమ్మీద డిగ్రీ పూర్తిచేసాడు. అవినాష్ స్వభావం ఎలావుంటుంది అంటే...తన మాటే నెగ్గించుకోవాలనే మొండితనం .....ఎదుటివారిని .. అకారణంగా బాధించడం, అమ్మాయా అబ్బాయా అనే తేడా లేకుండాద్వేషం. ఒక్క అమ్మ నాన్న తప్పితే స్నేహితులంటూ లేరు. పరాయి వారిని ఇంటికి రానివ్వక పోవడం .....జరిగేది. అసలు ఏదో ఒకలా చదవడమే గొప్ప అనిపించింది.

మళ్ళి రాగిణి కి దిగులు. ఎలావుంటాడో... వుద్యోగం పెళ్లి జీవితం అంటూ మరో మనిషి వుంటారు కదా...వారిని ద్వేషిస్తే ఇక బంధాలు ఏముంటాయి? భవిష్యత్తు ఏముంది!

మళ్ళి డాక్టర్నే ఆశ్రయిన్చారు.

''ఒకటి తెలిసింది. ధరణి టీచర్ ఇంటికి వస్తే మరీ ద్వేషించలేదు....కొత్తపోయాక ఆవిడతో బాగానేవున్నాడు. అంటే తరచుగా చూసే మనిషిని ఇష్టపడతాడు.అఫ్కోర్స్ ...అందులో ఆవిడపాత్ర చాల ముఖ్యమైంది. సందేహంలేదు. మీరు, టీచరు...ఇక రాబోయే సహచరి మీ ఇంటికోడలు అవినాష్ బాధ్యతను స్వీకరించాలి.అలాంటి అమ్మాయిని తీసుకురావాలి. అప్పుడు అతడిలో మార్పు రావచ్చు. ప్రయత్నం చేయండి...''అన్నారు డాక్టర్.

ఇంటికి వచ్చాక సాగర్, రాగిణి ఆలోచన చేసారు. ''ఈనాటి అమ్మాయిలు స్వతంత్రులు. పూర్వంలా అమ్మ, నాన్న, తాతల సలహాలు వినరు. వాళ్ళ లైఫ్ ని వాళ్ళే ఎంచుకుంటున్నారు. సంపాదన చదువు కెరియర్....అలా. అవినాష్ కి ఏమిచూసి దగ్గిర అవుతారు? డబ్బుకి లోటురాదు కానీ వున్నత చదువులు లేవు. అనుకున్నారు. 'టీచర్ ధరణి ని కూడా సలహా అడగాలి' అని చాలా కాలానికి ఫోను చేసారు.

''బాగున్నారా ధరణీ మేము గురుతున్నామా? అంది రాగిణి.

''గుర్తున్నారండి. మర్చిపోను. నేను బాగున్నాను.అవినాష్ ఏమి చేస్తున్నాడు...ఆరోగ్యం బాగుందా...''

''బాగుంది. డాక్టర్ ఇలా అన్నారు. మీ సహాయం సలహా కావాలి.... అంటూ డాక్టర్ గారి చెప్పిన విషయాలు వివరించింది రాగిణి.

'అవినాష్ ని దగ్గిరగా చూసేను. అర్థం చేసుకున్నాను. మీ బాధ ఎలాటిదో తెలుసు. కనుక నా అభిప్రాయం చెబుతాను. నాకు కొద్దిగా టైము ఇవ్వండి. మీకు సలహా చెప్పేటంత గొప్పదాన్ని కాదు.స్వార్థం అని మీరు అనుకోకుంటే.....నాలుగు రోజుల తరువాత చెబుతాను.''అంది ధరణి.

''అలాగే టైము తీసుకోండి.....మీరు మంచిగా చెబుతారు, మాకు నమ్మకం వుంది.''అంది రాగిణి.

అంతలో ధరణికి బెస్ట్ టీచర్ అవార్డు రావడం సభలు సన్మానాలు జరగడంతో రాగిణితో మాటాడటం ఆలస్యం జరిగింది.

ఈలోగా అవినాష్ కి అతని భవిష్యత్ గురించి సాగర్, రాగిణి చెప్పేరు.

''నాన్నా ! నీకు ఇరవై అయిదేళ్ళు వచ్చాయి. నీకో తోడుకావాలి. స్నేహితురాలు ఉండాలి. ఒక జీవితం కావాలి. మన ఇంటికి తీసుకు వస్తాము. ఇష్టమేనా....అన్నారు.

''మీరు ఉన్నారుగా...నాకు కావలసినవి ఇస్తారుగా...కొత్త అమ్మాయి ఎందుకు....వద్దు....అన్నాడు అవినాష్.

''కాదు బాబూ మేము ఇచ్చేవి వేరు. అమ్మాయి నిన్ను ఇంకా మంచిగా చూస్తుంది. వచ్చాక నీకే అర్థం అవుతుంది. అప్పుడు నువ్వు మేము లేకపోయినా బెంగ పడవు. నాకు ఆరోగ్యం బాగాలేదు.

కొన్ని రోజులు ....హాస్పటల్లో ఉండాలి ...అది కేరళ స్టేటులో నర్సింగ్ హోము. నీకు అక్కడ ఉండటం కష్టం. నువ్వు ఆర్టిస్టువి. ఇదివరకు అక్కడ నీకు కూడా ట్రీట్మెంట్ జరిగినపుడు, బొమ్మలు వేసేవాడివి. గుర్తు వుందా.....ఇవిగో ఆచిత్రాలు....అంటూ గుర్తు చేసాడు సాగర్.

అవినాష్ గుర్తు చేసుకుని సంతోషంగా ''అందుకే నేను మీతో వస్తా....బొమ్మలు వేసుకుంటా !, అన్నాడు.

''ఇప్పుడుకాదు తరువాత నీ ఫ్రెండ్తో వద్దుగాని. మీఇద్దరికి నచ్చితే అక్కడ ఇల్లు కొంటాను. ఉండచ్చు.''అని ఇంకా కొన్ని శరీర ధర్మాలు ఒక అమ్మాయి సాంగత్యంలో కలిగే ప్రయోజనాలు...చెప్పేడు సాగర్ ఒంటరిగా.

అవేమి అర్థం కాలేదు అవినాష్ కి. కానీ ఎందుకో సరే....అన్నాడు.

ధరణి ఫోన్ చేసింది. నేను వస్తున్నాను మీఇంటికని.

ఆమెను గుర్తుపట్టి అవినాష్ చాల సంతోషపడ్డాడు...."టీచర్ ఇన్నిరోజులూ ఏమయ్యారు..." అన్నాడు అలిగినట్టుగా.

అతన్ని దగ్గిరగా తీసుకుని '' నీలాటి వారికి చదువు చెప్పాలికదా ...తీరిక లేదమ్మా...ఇకనుంచి ప్రతి వారం వస్తాను ఓకేనా..."అంది.

''నిజంగానా టీచర్?' అని, చిన్న పిల్లాడిలా గంతులు వేసాడు.

''నేనంటే నీకు చాలాఇష్టం కదూ....మరి నేను చెప్పినట్టు వినాలి. వింటావా..?"

''వింటాను...టీచర్...'అన్నాడు బుద్ధిగా.

''గుడ్ బాయ్ ...చూడు ఈ అమ్మాయి నాచెల్లి...పేరు...మమత. ఇకనుంచి నీకు కొత్త ఫ్రెండ్. నీతో మీఇంట్లో ఉంటుంది. నీకు బొమ్మలు వేయడం నేర్పుతుంది.''

అనగానే, "వద్దు వద్దు. నువ్వే ఉండాలి టీచర్. నాకు ఫ్రెండ్ వద్దు....'అని గొడవ చేసాడు. దూరంగా పారిపోయాడు.

''వద్దూ! ఐతే నేను మీ ఇంటికి రాను....వెళ్ళిపోతాను....నామాట వింటాను అన్నావు. కానీ వినడం లేదుగా.నీతో కటీఫ్..." అంటూ కోపం నటిస్తూ లేచి నిలబడింది.....ధరణి.

మంత్రం వేసినట్టు. బుద్ధిమంతుడిలా సైలెంట్ ఐపోయాడు అవినాష్. ధరణి ప్రభావం అతడిమీద బాగా పనిచేస్తుంది. అదే అదనుగా మమత తాను తెచ్చిన కలర్స్ కేన్వాస్ బైటికి తీసి అల్లరిచేసే అవినాష్ని అచ్చు అతనే నిలబడినట్టు బొమ్మ వేసింది.....కొన్ని పక్షులు ....ప్రకృతి దృశ్యాలు ...చిత్రీకరించింది వేగంగా...అవినాష్ ముగ్ధుడై ...కాసేపు తదేకంగా వాటిని గమనించి....తానూ వేయడం మొదలుపెట్టాడు.....పోటీగా అన్నట్టు. ఆ తరువాత మమతను తన రూముకి తీసుకెళ్లి తన బొమ్మలు చూపించాడు...ఏవో కబుర్లు చెప్పేడు....ఇద్దరూ ఫ్రెండ్స్ ఐపోయారు.

ధరణి, రాగిణి, సాగర్ ఆనందంగా ప్రోత్సహిస్తూ క్లాప్స్ కొట్టేరు.....!

అప్పుడు తన పధకం వివరించింది ధరణి.

''మాచెల్లికి కూడా కొంత వరకూ అవినాష్ లక్షణాలే వున్నాయి. మీరు చెప్పగానే ఆలోచన వచ్చింది. ఐతే మమతకు కూడా అబ్బాయిలంటే పడదు. చిత్రకారుడని నీకంటే బాగా బొమ్మలు వేస్తాడని ఒప్పించి తీసుకువచ్చాను. ఒకరోజులో ఒప్పుకోలేదు. అందుకే ఆలస్యం ఐనది. మన ఇద్దరి సమస్య తీరింది...రాగిణి గారూ!' అంది సంతోషంగా.

''అవును...ధరణీ! వాళ్ళిద్దరికీ సరిపడి పెళ్లిదాకా రావాలని కోరుకుంటూన్నాను. మీకు అభ్యంతరం లేదుగా? పెద్ద చదువులు లేవు. జీవితకాలము కనిపెట్టి ఉండాలి....అవినాష్ని.ఒక రకంగా రిస్క్ కూడా మరి.."అందిరాగిణి.

''ఎన్నివున్నా ఈనాటి అమ్మాయి, అబ్బాయిలు లైఫ్ ని నాశనం చేసుకుంటున్నారు. అలాకాకుండా ఇద్దరిలో లోపాలు గుర్తించి, ఇద్దరి మధ్య స్నేహం పెంచి, మనమే వాళ్ళకి పెళ్లి చేస్తున్నాం కనుక ఎలాటి సందేహం లేదు. వాళ్ళు బాగుంటారు." అంది ధరణి.

''అవును ధరణి నువ్వు మమ్ములను కలసినరోజే అవినాష్ జీవితానికి మంచి బాట వేశావు.

నీ మేలు మరువలేము.''అంది రాగిణి,

''ఇద్దరికీ మేలు జరిగిందిగా .నన్ను పొగడవద్దు. ....ఇలా మన చేత అయినంత వరకూ ....ఇతరులకు సాయం చేద్దాం.'' అంది ధరణి.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి



రచన : A అన్నపూర్ణ

రచయిత్రి పరిచయం : నాపేరు అప్పాద్వేదుల అన్నపూర్ణ. కాకినాడలో పుట్టి పెరిగి అక్కడే చదువుకున్నాను.

మా నాన్నగారు పీ ఆర్ కాలేజీలోనూ, ఉమెన్స్ కాలేజీలోనూ ఇంగ్లీష్ లెక్చరరుగా పనిచేసారు. 'శ్రీ బులుసు వేoకటేశ్వర్లు గారు'వారి పేరు.

మాఇంట్లో గొప్ప సాహిత్య గ్రంధాలు ఉండేవి. నాన్నగారు కవి, రచయిత కావడం వలన పుస్తకాలు చదవడం,రాయడమూ అలవాటు వచ్చింది. దాదాపు అన్ని ప్రముఖ పత్రికల్లో కథలు కవితలు వచ్చాయి. చతురలో నా నవలలు ప్రచురించారు. నా నవలను చదివిన యండమూరి ' నా శైలి, చెప్పిన విధానం చదివించేలా ఉన్నాయని అభినందించారు. 'చతుర' చలసాని ప్రసాదుగారు, 'రచన' వసుంధరగారు...ప్రోత్సహించడంతో రచనలను చేస్తూనే వున్నాను.

.హైదరాబాదు వచ్చాక 'లోక్ సత్తా' ఉద్యమ సంస్థ స్థాపకులు డా' జయప్రకాశ్ నారాయణగారి సంస్థలో ఇరవై ఏళ్ళుగా పనిచేయడం గర్వముగా భావిస్తాను.వారి సంస్థ పత్రిక జన బలంకి వ్యాసాలు వ్రాస్తూనే వున్నాను ఇప్పుడు గత ఏడు సంవత్సరాలుగా అమెరికాలో స్థిరపడ్డాను.వీలున్నప్పుడు ఇండియా వస్తూనే వుంటాను. ఇదీ నా పరిచయం.






83 views0 comments

Comments


bottom of page