'Pulavana' - New Telugu Story
Written By Pandranki Subramani
'పూలవాన' తెలుగు కథ
రచన : పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఒక సూక్ష్మ ప్రాణి రూపంలో వచ్చిన కరోనా క్రిమి చేస్తూన్న వినాశకర విలయతాండవం అంతా యింతా కాదు. మాటలతో చెప్పలేనిది. పదజాలానికి అందనిది. మరింత సూటిగా చెప్పాలంటే- బయట నిరంతర కలకలం, లోపల బీభత్సం, నలువైపులా అల్లకల్లోలం. ఇదీ యిప్పటి వాతావరణం.
కట్టడం రెండు అంతస్తుల్లోని పిల్లలందరూ యధాప్రకారం అంకుల్ మహేశ్ యింట్లో గుమికూడారు. కాని ఈసారి వాళ్ళు సంతోషంగా లేరు. ముఖాన కళ లేదు. నవ్వుల వెలుగు లేదు. చిందులు వేసే చలోక్తులు లేవు. దిగులుగా మహేశ్ ముఖంలోకి తేరి చూస్తూ కూర్చున్నారు;అతడి ఆలోచన కోసం- స్పందన కోసం యెదురు చూస్తూ- ఇప్పుడు వాళ్ళ పరిస్థితి పంజరంలో బంధించబడ్డ పక్షిలా ఉంది. లాక్ డౌన్ ఆంక్షలు లేకుండా ఉంటే—యధాప్ర కారం బడికి గాని వెళ్ళ గలిగితే యెంచక్కా నేస్తాలతో కలసి మడత పడని ఏక రూప దుస్తుల్లో కూర్చుని కబుర్లాడుతూ గడిపేవారని. రీసెస్ లో ఆటల సమయంలో క్లాస్ మేట్సుతో కలసి కసరత్తు చేయవచ్చు. గెంతులు వేయవచ్చు. కేరింతల గురించి యిక చెప్పనే అవసరం లేదు.
ఇప్పుడు వాళ్ళకదేమీ లేదు. నగరమంతా నిశ్శబ్ద యెడారి గుడారం- సడలింపు లేని కట్టడి. అసలు యిండ్లలోని అమ్మానాన్నలు అక్కయ్యలూ బావలూ వాళ్ళను అలా కాసేపు బైటకు వెళ్ళనిస్తేనే కదా! కదలితే చాలు కాళ్ళకు బంధాలు వేసేస్తున్నారు. ముఖ కవచాలు తొడిగేస్తున్నారు. “అదిగోపులి! ఇదిగోయెలుగు! ”అని చూపిస్తున్నట్టు కరోనా మహమ్మారి గురించి పదే పదే చెప్పి బెంబేలు పెట్టించేస్తున్నారు. ఇది కడతేరాలంటే ఇంకెన్నాళ్ళు ఆగాలో!
ఎట్టకేలకు మహేశ్ ఆలోచనలనుండి తేరుకుంటూ పిల్లలందరికీ భరోసా యిచ్చేందుకు పూనుకుంటూ పెదవి విప్పాడు.
”మనకిదంతా కొత్తగా భయం కలిగించేదిగా ఉండవచ్చేమో గాని, ఇదేమీ కొత్త పరిస్థితి కానే కాదర్రా! నేనప్పటికి పుట్టి ఉండక పోవచ్చేమో గాని, మా అమ్మా నాన్నలూ అత్తామామయ్యలూ చెప్తుండే వారు- ప్రపంచ యుధ్ధ కాలంలో పరిస్థితి యింతకంటే ఘోరంగా ఉండేదని. శత్రువిమానాల రాక గుర్తించి సైరన్ మ్రోగించిన వెంటనే యెక్కడి వాళ్ళక్కడ గప్ చిప్. దీపాలు ఆర్పేసి కుంపట్లు ఆర్పేసి యెక్కడి వారక్కడ దాక్కునే వారు. తింటూన్న కంచాలను అక్కడివక్కడే విడిచి గంతల్లోకి వెళ్ళి ప్రాణాలు కాప్పాడుకునే వారు. అప్పటి వాళ్ళకు ఆరోజుల్లో పగలూ చీకటీ ఒకేలా ఉండేదట.
మరీ లోతుగా చెప్పి మిమ్మల్ని కంగారు పెట్టించడం యెందుకు గాని- ఎటువంటి పరిస్థితయనా కలకాలం వచ్చింది వచ్చినట్లుగా నిలచిపోదు. ఇప్పుడో అప్పుడో వెళ్ళిపోతుంది. లేదా మారిపోతుంది. ఇది ప్రకృతి ధర్మం- లా ఆఫ్ నేచర్- అదే విధంగా ఈనాడు మనల్ని ఆడిపడేస్తున్న కరోనా విజృంభణ కూడాను అంతే- దానిని అరికట్టడానికి నగరం నలువైపులా విధించిన లాక్ డౌన్ ఆంక్షలు కూడాను అంతే-
ఇది ఒక విధంగా మనం పాటించబోయే క్రమశిక్షణకు సవాలు వంటిది. ఎందుకంటే, రేపో మాపో ఇప్పటి వైరస్ ప్రభావం తగ్గు ముఖం పట్టినా రేపు మరొకటి మరొక రూపంలో ప్రవేశించి మనుషుల్ని అటాక్ చేయవచ్చు ఇటువంటి సందర్బాన మనం గరుడపక్షి కీ పాముకీ మధ్య జరిగిన సంభాషణ గుర్తుకి తెచ్చుకో వాలి”
పిల్లలందరూ ఉగ్గబట్టలేక, “అదేమిటి అంకుల్?” అని ముక్త కంఠంతో అడిగారు.
”ఓపిక పట్టండర్రా! మరీ తొందరపడి పోతే యెలా? మనందరకూ బాగా తెలుసు.. గరుడ పక్షికీ, పాముకీ మొదట్నించీ సఖ్యత లేదని. ఒకసారి ఆకాశంలో పచార్లు చేస్తూన్న గరుడ పక్షి, యెక్కడ లేని అక్కర చూపిస్తూ నేలపైన వంకర్లుపోతూ సాగిపోతూన్న పాముని చూసి అడిగిందట- క్షేమమేనా సర్పమా! ” అని.
గరుడ పక్షి కపట పరామర్శింపు గమనించిన పాము- చట్టున- ‘ఎవరుండాల్సిన చోట వాళ్ళుంటే అందరూ క్షేమంగానే ఉంటారు! ’ అని బదులిచ్చి పుట్టలోకి తుర్రుమందట.
అదే రీతిన మీరందరూ యిప్పటి పరిస్థితిని బట్టి ఎక్కడి వారక్కడుంటే సాధ్యమైనంత మేర యెడం యెడంగా ఉంటూ పూసుకుని తిరక్కుండా ఉంటే అందరూ క్షేమంగానే ఉంటారు. అలా ఉంటామని యింట్లోని పెద్దల ఆదేశాల ప్రకారం బడి టీచర్లు యిచ్చే సూచనల ప్రకారం నడచుకుంటామని ఇక్కడికిక్కడ మాటివ్వండి. ప్రమాణం చేయండి. రేపు మీ అందరి యిండ్ల ముందూ పూలవాన కురుస్తుంది. ”
“పూలవాన కురుస్తుందా! అదెలా!" పిల్లల ఆనందోద్వేగ అరుపులు మిన్ను ముట్టాయి.
“ఇప్పుడు అడక్కండి. ఎలా అని ఆరా తీయకండి. రేపు చూస్తారుగా! ” అని చెప్పడం ముగించి లేచి నిల్చున్నాడు మహేశ్ అంకుల్.
వరసగా ఉన్న అపార్టుమెంట్ల నుండి పిల్లలందరూ మరునాడు ఉదయమే లేచి తలుపులు బారుగా తెరిచి చూసారు. అప్పటికప్పుడు పూలవాన కురవలేదు గాని, అందరి యిండ్లముందూ పూల చెండ్లూ, చాక్లెట్ల బాక్సులూ ఉన్నాయి మిలమిల మెరుస్తూ— పరిమళాలు వెదజల్లుతూ—వాటి ప్రక్కనే మరొకటీ ఉంది— సర్జికల్ ముఖ తొడుగు.
పెద్ద అక్షరాలతో తెల్లని నోటు కూడా వ్రాసుంది. “పిల్లలూ! ఇవన్నీ కరోనా మహమ్మారికి విరుగుడుగా జాగ్రత్తలు పాటించేవారికి మాత్రమే సుమా! ఇంట్లో నిత్యమూ సవ్యంగా సజావుగా మరచిపోకుండా పాఠాలు చదువుతూ హోమ్ వర్క్ చేస్తున్నవారికి మాత్రమే సుమా! మరొక ముఖ్యమైన విషయం—కరోనా ప్రభావం బాగా తగ్గిన తరవాతనే మనం మళ్ళీ ఉమ్మడిగా కలుసుకునేది. అంత వరకూ టాటా! చీయర్స్! వెలుగు తరవాత చీకటి వస్తున్నట్లు చీకటి తరవాత వెలుగు తప్పకుండా వస్తుందనేది మరచిపోకండి పిల్లలూ! ”
***
|
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
Comments