top of page

పుణ్యం కోసం

(హాస్య కథ)

వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)


'Punyam Kosam' - New Telugu Story Written By Jidigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 03/04/2024

'పుణ్యం కోసం' తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



“అలా డబ్బాలు వెతుకోక్కపోతే నాలుగు జంతికలు వేసుకోవచ్చుగా, నాకు కుడి చెయ్యి పని చెయ్యదు. లేకపోతే నేనే చేసే దానిని” అంది శ్రీలక్ష్మి, భర్త శేఖరం తో.


“జంతికలు చెయ్యడానికి నీ చెయ్యి పనికిరాదు, తినడానికి నాకు పళ్ళు నొప్పి. అందుకే పాత స్టాక్ ఏమైనా వుందేమో అని డబ్బాలు వెతుకుతున్నాను” అన్నాడు. 


“సరే గాని 24 గంటలు ఆ భగవంతుడి థ్యాసే గాని భర్తకి రెండు మైసూర్ బజ్జిలు గాని, లేదా ఏ టమోటో పులిహోర చేద్దామని గాని నీకు వుండదా” అన్నాడు భార్య తో.


“తిరిగి తిరిగి నా మీదకి వచ్చారా, సాయంత్రం అలా బజారు వెళ్ళినప్పుడు ఏమైనా కొని తెచ్చుకోవాలి, అన్నీ ఇంట్లోనే అమర్చి పెట్టాలి అంటే నా వల్ల కాదు. రోజూ మీరు కూడా ఆ భగవంతుడి గురించి కొంతసేపు తలుచుకుంటే మళ్ళీ మానవ జన్మ వస్తుంది, లేకపోతే జంతువు గా పుడతారని గరికిపాటి వారు, చాగంటి వారు రోజూ చెపుతున్నారు” అంది శ్రీలక్ష్మి.


“నాతో చెప్పినప్పుడు చూద్దాం లే, అయినా నీ పుణ్యం లో సగం నాకిస్తావుగా” అన్నాడు.. 


“ఇదేమన్నా వండుకున్న కూర అనుకున్నారా నాకు లేకపోయినా మీకు వడ్డించడానికి, నా మాట విని రేపటి నుండి ఏ భాగవతం పుస్తకం నుంచి రెండు పేజీలు చదువుకోండి, మీ మంచికే చెప్పేది” అంది. 


“సరే రేపటి నుండి చదువుతానులే” అని మేడ మీదకి వెళ్ళిపోయాడు శేఖరం మొక్కలకి నీరు పోయడానికి.


తోటలో కాసిన గులాబీలు, చామంతి, మల్లెపూలు కోసి దేముడు గదిలో పెట్టాడు, భార్య ఉదయమే లేచి స్నానం చేసి దేముడికి ఒక గంటసేపు అయినా పూజ చేస్తుంది. శేఖర్ లేచి సాయిరాం అనుకుంటూ స్టవ్ దగ్గరికి వెళ్లి కాఫీ కలుపుకుని వచ్చి టీవీ లో న్యూస్ చూడటం మొదలుపెట్టాడు.


మేడమీద నుంచి కిందకి దిగుతో, “త్వరగా స్నానం చేసి ఆ శివుని విగ్రహం మీద పాలు పోసి, మారేడు దళం పెట్టండి, ఈ రోజు శివరాత్రి అని గుర్తుందా” అంది భర్త తో శ్రీలక్ష్మి.


“ఓహో ఈరోజు శివరాత్రా, అయితే చలి తగ్గిపోతుంది” అన్నాడు. 


“నా ఖర్మ, ఈ రోజు నేను ఉపవాసం, మీరు కూడా ఉపవాసం వుంటారా” అంది.


“షుగర్ పేషెంట్స్ ఉపవాసం వుండకూడదు, నేను నాకోసం వంట చేసుకుంటాలే” అన్నాడు శేఖర్.


“సరే అయితే త్వరగా స్నానం చేసి రండి శివాలయం కి వెళ్లి అభిషేకం చేసుకుందాం, ఈరోజు చేసిన అభిషేకం ఎంతో పుణ్యం యిస్తుంది” అంది శ్రీలక్ష్మి.


“చూడు.. ఒక పక్కన పూజలతో పుణ్యం సంపాదించుకుని, యింకో పక్కన నన్ను సాధిస్తో పాపం తెచ్చుకుంటున్నావు. చివరికి మిగిలేది సున్నా, అందుకే నీ పూజలు నువ్వు చేసుకో, నా దారికి రాకు, నేను మనసులోనే దేముడిని తలచుకుంటో వుంటాను తెలుసా” అన్నాడు శేఖర్.


తలుపు దగ్గరగా వేసి “నేను గుడికి వెళ్తున్నా” అంది. 


“వుండు, ఎండలో ఎలా వేడతావు, నేను దింపుతాను” అని లేచి చెంబుడు నీళ్లు తలమీద పోసుకుని, బట్టలు మార్చుకుని కారు గుడివైపు పోనిచ్చాడు. 


“బాబోయ్ ఏమిటి ఈ జనం, అభిషేకం చేయాడానికే! నేను ఈ అరుగు మీద కూర్చొని వుంటాను, నువ్వు త్వరగా పూజ ముగించుకుని రా” అన్నాడు శేఖర్. 


“యింత దూరం వచ్చారుగా, మీరుకూడా రండి అభిషేకం చేద్దురుగాని” అంది శ్రీలక్ష్మి.


“ఈ జనం లో నేను నుంచోలేను, త్వరగా రా” అని అక్కడ అరుగు మీద కూర్చున్నాడు. చాలా పెద్ద గుడి, ఈ గుడి చుట్టూ నాలుగు సార్లు తిరిగేస్తే ఈరోజు వాకింగ్ అయిపోతుంది అనుకుంటూ నడవడం మొదలుపెట్టాడు. మనసు తనంతట తనే శంభో శంకరా అంటోంది. అరగంట తరువాత శ్రీలక్ష్మి బయటకు వచ్చి భర్త కోసం చూస్తే, గుడి చుట్టూ తిరిగేస్తున్న శేఖర్ కనిపించాడు.


“మీరే నయ్యం గుడి చుట్టూ ప్రదక్షణ చేసుకున్నారు, నన్ను ఒక్కక్షణం కూడా దేముడిని చూడనివ్వలేదు పాడు జనం” అంది శ్రీలక్ష్మి. 


“అయితే అభిషేకం చెయ్యలేదా?” అన్నాడు శేఖర్.

“ఎక్కడా, జనం తోసేస్తో వుంటే” అంది చేతిలోని బుట్ట భర్త చేతికి యిస్తో.


“సరే కూర్చో”, అంటూ బుట్టలోని అరటిపళ్ళు అక్కడే వున్న ఆవుకి వేసి, పాలు ఆవు మీద పోసాడు. 


“అయ్యో అయ్యో అదేమిటి.. నేను సాయంత్రం వేరే గుడికి వెళ్దాం అనుకుంటూ వుంటే పళ్లు, పాలు ఆవుమీద గుమ్మరిస్తారా, నాదీ తప్పు బుట్ట మీ చేతికివ్వడం” అంది కోపంగా శ్రీలక్ష్మి.


“యింకా శివరాత్రి సాయంత్రం కూడా వుందా” అన్నాడు నవ్వుతు కారు ముందుకి పోనిస్తో. 


“నన్ను విసిగించకండి. చిరాకుగా వుంది” అంది శ్రీలక్ష్మి.


శేఖర్ తన కోసం వండిన అన్నం తినేసి పడుకున్నాడు. శ్రీలక్ష్మి భక్తి టీవీ లో శ్రీశైలమహాత్యం చూస్తో కూర్చుంది.


కారులో వెళ్తున్న శేఖర్ దంపతులని ఎదురుగా లారీ వచ్చి గుద్దేసేంది. 

“నడవమ్మా పెళ్లి నడకలు, యిలా అయితే ఇంద్రసభ లో రంభ డాన్స్ వుంది మిస్ అయిపోతాము” అంటున్న దేవభటులుని చూసి శ్రీలక్ష్మి అయితే తను చనిపోయి స్వర్గం కి వచ్చాను అన్నమాట, అవునులే ఎన్నీ పూజలు చేసాను, ఫలితం వుంటుంది మరి అనుకుంది.


‘పాపం ఆయనని ఏ లోకంలోకి తీసుకుని వెళ్ళారో, అప్పటికి చెపుతోనే వున్నాను కొద్దిగా కృష్ణా రామా అనుకోమని, వింటేనా పాపం ఆ యమలోకంలో ఏం బాధ పడుతున్నారో’ అనుకుంది భర్త శేఖర్ గురించి.


ఇంద్రలోకం లోకి ప్రవేశించారు, కిటకిట లాడుతున్న సభని పరికించి చూసి, సినిమాలో చూపించినంత అందంగా లేదు అనుకుంది శ్రీలక్ష్మి. అదేమిటి ఇంద్ర దేముడి ఆసనం పక్కన వున్న ఋషి గారితో తన భర్త కూర్చుని ఏదో కబుర్లు చెప్పేస్తున్నారు అనుకుని తన పక్కన వున్న భటుడిని, “బాబూ నేను పూజలు చేసాను కాబట్టి స్వర్గం కి వచ్చాను, మరి అటువైపు ఋషి గారితో మాట్లాడుతో కూర్చుని వున్న మా ఆయన ఏ పూజ చెయ్యకుండా యిక్కడికి ఎలా వచ్చారు” అంది.


“మీ ఆయన అంటే మాకేం తెలుసమ్మా, వుండు ఎలా వచ్చాడో తెలుసుకుని చెపుతాను” అని మాయం అయిపోయాడు.


“ఒక గడియలో మళ్ళీ వచ్చిన భటుడు, “అమ్మా! ఆయన నీ కంటే ఎక్కువ పుణ్యం సంపాదించాడు. నువ్వు చేసే దేముడు పూజలకు రోజూ పువ్వులు కోసి సిద్ధం చేసేవాడు, నువ్వు ప్రశాంతం గా పూజ చేసుకోవటానికి తన టిఫిన్ తనే చేసుకునేవాడు, ఎండలో గుడికి వెళ్తోంది పాపం అని నిన్ను తన కారులో తీసుకుని వెళ్ళేవాడు. అన్నిటికంటే శివరాత్రి నాడు గోవు కి అభిషేకం చేసి శివకేశవులకి బేధం లేదని నిరూపించాడని శివుడు మెచ్చి స్వర్గంలోకం ప్రాప్తిరస్తు అన్నారుట, అది విషయం” అన్నాడు.


ఇంతలో ‘నారాయణా నారాయణ’ అంటూ సభలోకి నారదుడు ప్రవేశించాడు. ఆయన గురించి భూలోకంలో ఎన్నో కథలు విన్న శ్రీలక్ష్మి భక్తి గా ఆయన కాళ్లకు నమస్కారం చేసింది. 


“లేమ్మా, యింతవరకు భార్యాభర్తలు యిద్దరూ కలిసి ఒకే లోకం కి రావడం యిదే మొదటిసారి. అటు చూడు తల్లీ, మీ ఆయన దేవ గురువుగారిని కాకా పట్టి తను శాశ్వతంగా స్వర్గంలో వుండేట్లు ప్లాన్ చేసుకుంటున్నారు. అటు చూడు గురువుగారు అలా విరగబడి నవ్వడం నేను అదివరకు చూడలేదు.


నీ భక్తికి మెచ్చి నీకు ఒక సహాయం చేస్తాను, వెళ్లి నీ భర్తకి నమస్కరించు, ఆయన చెప్పినట్టు చెయ్యి” అన్నాడు నారద ముని.


‘సరే స్వామి’ అని, మెల్లగా వెళ్లి భర్త కి ఎదురుగా నుంచుని నమస్కారం చేసి “మిమ్మల్ని మళ్ళీ యిలా కలవడం చాలా సంతోషం గా వుంది’. 


నారద ముని మహిమ వల్ల తన భార్యని గుర్తించి, “గురువుగారికి ప్రణామం చెయ్యి”, “స్వామి ఈమె నా భార్య, మహా భక్తురాలు, నిత్యం దైవ స్మరణతో గడిపేది, అందులో మీ మహిమలు గురించి ఎన్నో ప్రవచనాలు వినేది” అని చెప్పేడు..


సంతోషం తో గురువుగారు కమండలంలోని జలం తీసుకుని శ్రీలక్ష్మి మీద చల్లి, శాశ్వత స్వర్గలోక ప్రాప్తిరస్తు అని దీవించారు.


“మా ఆవిడ ని వదిలి వుండలేను, నేను చేసిన పుణ్యం అయిపోగానే వెళ్ళిపోవాలి స్వామి, నా మీద కూడా కటాక్షం చూపించండి గురువుగారు” అన్నాడు శేఖర్.


నువ్వు వచ్చిన దగ్గర నుంచి నన్ను అనేక కథలు చెప్పి నవ్వించావు అని కమండలం లోనుండి జలం తీస్తోవుంటే, “గురువుగారు, నీళ్లు కొద్దిగానే జల్లండి, నాకు నెత్తిమీద నీళ్లు పడితే జలుబు చేస్తుంది” అన్నాడు శేఖర్ తలవంచుతూ. 


“మళ్ళీ నవ్వించేశావు” అంటూ జలం చల్లి “శాశ్వత స్వర్గలోక ప్రాప్తిరస్తు” అని దీవించారు. అంతే గురువుగారి కుర్చీనుంచి మాయం అయ్యిపోయారు 


“గురువుగారు గురువుగారు” అంటూ కంగారుగా పిలుస్తున్న శేఖర్ దగ్గరికి నవ్వుతు వచ్చిన నారద ముని, “యింకా ఎక్కడ గురువుగారు, తను చేసిన తపస్సు ఫలితం వలన ఇంద్రుడు కి గురువుగారు గా పదవి వచ్చింది. యిప్పుడు తన తపస్సు ఫలం ఉపయోగించి మీకు శాశ్వతంగా యిక్కడ ఉండేడట్లు దీవించారు. దానితో ఆయన తపస్ ఫలితం అయిపొయింది, భూలోకం లో కి వెళ్లిపోయారు, మళ్ళీ ఒక యుగం తపస్ చెయ్యాలి నారాయణా” అన్నాడు నారద ముని.


“అయ్యో మా వల్ల గురువుగారు మళ్ళీ భూలోకంలో కి వెళ్లిపోయారా నారాయణా నారాయణ” అన్నాడు చెంపలు వేసుకుంటో శేఖర్.


“ఏమిటి కళ్ళు తెరవగానే వాట్సాప్ మెసేజ్ లు చూసుకునే మీరు, నారాయణా నారాయణ అంటూ కలవరింతలు, లేవండి, తొమ్మిది గంటలు అయ్యింది” అంటున్న భార్య గొంతు విని, ఉలిక్కిపడి లేచి, ‘అమ్మయ్యా ఇదంతా కల అన్నమాట. గురుద్రోహం చేసాను అని భయపడ్డాను’ అనుకుని లేచి స్నానం పూర్తి చేసుకుని పట్టుపంచె కట్టుకుని పూజా గదిలోకి ప్రవేశించాడు.


 అప్పటికే దీపారాధన చేసి పువ్వులతో అలంకరణ చేసి పూజ చేసుకుని శ్రీలక్ష్మి వెళ్లినట్టుంది, దీపారాధన కాంతులతో వేంకటేశ్వరస్వామి మెరిసిపోతున్నాడు, శివుడి మీద పాలు పోసి, నుదుటిన విభూతి రాసుకుని రుద్రాక్ష మాలతో కళ్ళుమూసుకొని జపం చేసుకువడం మొదలెట్టాడు. మొహం కడుకోవడానికి వెళ్లిన భర్త యింకా రాలేదేమిటి అనుకుంటూ మేడమీద గదికి వచ్చి చూసిన శ్రీలక్ష్మి పూజాగదిలో కఠోర జపం లో వున్న భర్తని చూసి, బాగానే వుంది ఏమిచేసినా అతే అనుకుంటూ వచ్చేసింది.


మొహం నిండా విభూతి నుదట కుంకం బొట్టుతో మెట్లు దిగుతు “ఏమో అనుకున్నాను.. పూజామందిరం లో వున్న ప్రశాంతత ఎక్కడా దొరకదు లక్ష్మి, యిన్నాళ్ళు కబుర్లతో కాలక్షేపం చేసేసాను, ఈ రోజు నుంచి నాది నీ దారే” అంటూ రాత్రి వచ్చిన కల గురించి వివరించి చెప్పాడు.


“నీ పని నువ్వు చెయ్యి. ఫలితం గురించి నీకు బాధ్యత లేదు, అది నేను చూసుకుంటా” అన్న భగవాన్ శ్రీకృష్ణపరమాత్మ ని నమ్మి ఎవ్వరికీ అపకారం చేయకుండా మన జీవితం గడపాలి అంతే” అంది శ్రీలక్ష్మి.

 శుభం

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.












100 views3 comments

3 comentarios


Jee

2 hours ago

Chala bagundi Babai

Me gusta

Sai Praveena jeedigunta

4 days ago

Good one

Me gusta

Adilaxmi Jeedigunta

5 hours ago

Bagundi

Me gusta
bottom of page