top of page

రహస్యం


'Rahasyam' New Telugu Story Written By Padmavathi Divakarla

'రహస్యం' తెలుగు కథ

రచన: పద్మావతి దివాకర్ల

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)తన గదిలో వాలుకుర్చీలో కూర్చొని భాగవతం చదువుకుంటున్న రాఘవరావు దగ్గరకి ఆరేళ్ళ మనవడు అభిషేక్ వచ్చాడు.


"తాతా! అమ్మ పిలుస్తోంది, భోజనానికి రా!" అని చెప్పి వచ్చినంత వేగంగా వెళ్ళబోయాడు.


చదువుతున్న పుస్తకంలోంచి తలెత్తి చూసాడు రాఘవరావు. "ఏమిటన్నావు అభీ! ఏది, దగ్గరకు వచ్చి మళ్ళీ చెప్పు నాన్నా, నాకేమీ సరిగ్గా వినబడదు కదా!" అని అడిగాడు.


ఇక తప్పదన్నట్లు దగ్గరకు వచ్చాడు అభిషేక్. "తాతా! మరే! అమ్మ భోజనానికి రమ్మంది!" అని బిగ్గరగా చెప్పి క్షణంలో తుర్రుమన్నాడు.


రాఘవరావు చిన్నగా నవ్వుకుంటూ లేచి పుస్తకం టీపాయ్పై పెట్టి హాల్లోకి వచ్చాడు. డైనింగ్ టేబుల్పై అన్నీ అమర్చి ఉన్నాయి. కుర్చీ లాక్కుని కూర్చున్నాడు రాఘవరావు. కోడలు అనిత అతనికి కూరలు, అన్నం వడ్డించింది.


"తినండి మావగారూ!" అంది మంచినీళ్ళ గ్లాసులో పోస్తూ.


రాఘవరావు తలెత్తి చూసాడు కోడలివైపు, "ఏదో చెప్తున్నావు, ఏమిటి?" అని అడిగాడు.


"ఏమీ లేదు మావగారూ! భోజనం త్వరగా చేసి మాత్ర వేసుకొండి." అంది అనిత కాస్త బిగ్గరగా రాఘవరావుకి వినిపించేలా.


అర్ధమైందన్నట్లు తల ఆడించాడు రాఘవరావు. 'ఇతని చెవుడుతో వేగలేకపోతున్నా.' చిన్నగా గొణుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళింది అనిత. బోజనం పూర్తి చేసి, చెయ్యి కడుక్కొని మాత్ర వేసుకున్నాడు రాఘవరావు. మనవడు అభిషేక్ ఐపాడ్లో కార్టూన్లు చూసుకుంటున్నాడు. కోడలు అనిత వంటింట్లో బిజీగా ఉంది. మనవడితో మాటలు కలపాలని చూసాడు కానీ, తనని పట్టించుకోకపోవడంతో నిట్టూర్చుతూ తన గదిలోకి వెళ్ళి వాలుకుర్చీలో విశ్రాంతిగా వాలాడు.


రాఘవరావు రిటైరై పదిహేనేళ్ళు దాటాయి. రెండేళ్ళ క్రితం భార్య గతించినప్పటి నుండి ఒంటరివాడయ్యాడు. అతనితో మాట్లాడేవారే కరువయ్యారు. మధ్యాహ్నం కొద్దిగా కునుకు తీసాడు రాఘవరావు. సాయంకాలం ఆరు గంటలకి కొడుకు సతీష్ ఆఫీసునుండి వచ్చాడు. సతీష్ తన గదికి వస్తాడేమోనని చాలా సేపు ఎదురుచూసిన రాఘవరావు ఇక ఉండబట్టలేక హాల్లోకి వెళ్ళాడు.


హాల్లో తీరుబాటుగా సోఫాలో కూర్చొని సతీష్ టివిలో వార్తలు వింటున్నాడు. రాఘవరావు కూడా సోఫాలో కూర్చొని ఓ పొడిదగ్గు దగ్గాడు.


టివిలో లీనమైన సతీష్ అప్పుడు తండ్రిని చూసి చిన్నగా నవ్వి, "ఏం నాన్నగారూ! దగ్గు ఇంకా తగ్గలేదా?" అని అడిగాడు.


"ఏదో చెప్తున్నావు, ఏమిటి?" అని ప్రశ్నార్థకంగా మొహం పెట్టాడు రాఘవరావు కొడుక్కి దగ్గారగా జరిగి.


మళ్ళీ అడగడానికి విసుగేసింది సతీష్కి. "అదే నాన్నా! ఇంకా దగ్గు తగ్గలేదా అని అడుగుతున్నాను." కాస్త గట్టిగా చెప్పాడు సతీష్ తన విసుగుని పైకి కనపడనీయకుండా.


"తగ్గిందిరా! పూర్తిగా తగ్గింది." అని జవాబిచ్చాడు రాఘవరావు.


"మీకోసం హియరింగ్ ఎయిడ్ కొంటాను వాడండి, మీకు సరిగ్గా వినిపించడంలేదు అన్నా నా మాట వినరు కదా!" అన్నాడు సతీష్.


"ఆఁ... ఏమిటిన్నావు? వినపడలేదు." రాఘవరావు కొడుకుని అడిగాడు.


మళ్ళీ చెప్పిందే చెప్పడం ఇష్టంలేక, "ఏం లేదు నాన్నగారూ!" అన్నాడు మళ్ళీ టివివైపు దృష్టి సారించి.


రాఘవరావు కూడా టివివైపు చూసాడు. తండ్రికి వినికిడి సమస్య ఉందని, డాక్టర్ వద్దకు తీసుకెళ్తానన్నా, హియరింగ్ ఎయిడ్ వాడాలన్నా రాఘవరావు ఒప్పుకోకపోవడంతో సతీష్కి తండ్రిపైన కొద్దిగా కోపం ఉంది. ప్రతీసారి బిగ్గరగా చెప్పవలసి వస్తోందని చిరాగ్గా ఉంది సతీష్కి.


ఆ మరుసటి రోజు సాయంకాలం రాఘవరావుని అతని స్నేహితుడు చలపతి చూడటానికి వచ్చాడు. ఇద్దరూ కాస్సేపు లోకాభిరామాయణం ముచ్చటించుకున్నారు. తమ చిన్నప్పటి విషయాలు, ఉద్యోగంలో ఎదురైన ఒడిదొడుకులు వాళ్ళ మాటల్లో దొర్లాయి.


"ఒరే రాఘవా! ఒకటడుగుతాను, ఏమనుకోకు! కేవలం నా సందేహం తీర్చుకోవడం కోసం అడుగుతున్నాను. నీకు వినికిడి సమస్య లేదని నాకు బాగా తెలుసు. అసలు ఆ సమస్యే ఉంటే మనం ఇలా మాట్లాడుకోగలమా? మరి, నువ్వేంటీ నీ కొడుకు, కోడలు, మనవడితో మాట్లాడు తున్నప్పుడు వినపడలేదని అనడం మళ్ళీ మళ్ళీ అడగటం ఎందుకో నాకేమాత్రం అర్ధం కావడం లేదురా!" అన్నాడు చలపతి రాఘవరావు వైపు చూస్తూ.


రాఘవరావు చిన్నగా నవ్వుతూ, "అదా! అదో పరమ రహస్యం!" అన్నాడు.


"నాకూ ఆ రహస్యం ఏదో చెప్పు, వింటాను." అన్నాడు చలపతి కుతూహలంగా.


“ఏం లేదురా చలపతీ! మనం ముసలాళ్ళమైపోయాము కదా! మనతో ఎవరికైనా మాట్లాడటానికి ఏముంటాయి చెప్పు? ఎంత సొంతవాళ్ళైనా మనల్ని తప్పించుకు తిరుగుతారు కదా! మరి వాళ్ళని మాటల్లో పెట్టి మరి కాస్తా మాట్లాడలన్న ఆశ, కోరిక మనకి మాత్రం ఉండదా? అందుకే వినపడనట్లు నటించి వాళ్ళ చేత మళ్ళిమళ్ళీ చెప్పించుకుంటాను, వాళ్ళు చిరాకు పడినా సరే! తెలిసిందా?" అని తన రహస్యం బయటపెట్టాడు రాఘవరావు.


"ఆఁ...ఏమిటన్నావు? వినపడలేదు మళ్ళీ చెప్పు!" అన్నాడు చలపతి తల ఒగ్గి.


"పోరా!...నా ట్రిక్ నా మీదే ప్రయోగిస్తున్నావా?" నవ్వాడు రాఘవరావు.


అతని నవ్వుతో శృతి కలిపాడు చలపతి.

***

పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.


45 views0 comments

Comentários


bottom of page