top of page

రావుగారి ఇంట్లో


'Ravugari Intlo' New Telugu Story

Written By Dasu Radhika

'రావుగారి ఇంట్లో' తెలుగు కథ

రచన, పఠనం: దాసు రాధిక

(ప్రముఖ రచయిత్రి బిరుదు గ్రహీత)



మొత్తానికి మన రావు గారి ఇంట్లో కూడా మాడ్యులార్ కిచెన్ పెట్టారు.. అందరూ ఎప్పుడో పెట్టుకున్నారు.. ఎయిర్ ఫ్రయర్ లు, డిష్వాషర్లు మధ్య తరగతి ఇండియన్ కిచెన్ మీద దాడి చేస్తున్న ఈ కాలం లో దేవి మరియు రావు గారి ఇల్లు, కొత్త కోడలు వస్తున్న సందర్భంగా ముస్తాబు అయింది.. ఫ్లాట్ అంతా మళ్లీ పునర్నిర్మాణం చేశారు.. సాయి పెళ్లికి ఆరు నెలల క్రితం రెడీ అయి పోయింది పది ఏళ్ల క్రితం కొన్న ఫ్లాట్.. కాకపోతే వండే వంటలు, చేసే పద్ధతుల్లో, కనీసం వాడే పాత్రల లో పెద్ద మార్పు ఏమీ మోహన్ రావు గారి ఇంట్లో రాలేదు.. పప్పు లో పోపు వేసి అల్మారా తలుపు తీసింది ఒక చిన్న గిన్నెలోకి పప్పు ని తీసి పెట్టడం కోసం దేవి.. పొయ్యి కింద ఆపి అల్మారా వంక చూసింది.. దేవి కి పెద్దలందరూ సభ లో కొలువు తీరినట్లు కనిపించారు.. అలమార లో.. పెద్ద మామగారు పెద్ద కాబట్టి పెద్ద గ్లాసు రూపము లో ఠీవి గా తననే చూస్తూ ఉన్నట్లు, ఇటు తన మేనత్త- ఆవిడ తన లాగే గుండ్రం గా ఉండేది- ఆవిడ ని పోలిన రౌండ్ చెంబు- ఆ పక్కనే అమ్మా నాన్న రెండు చిన్న డబ్బాల రూపం దాల్చి, వాళ్ల పక్కన అత్తగారు హుందా గా రెండు కిలోలు కందిపప్పు పట్టే అంత డబ్బా సైజు లో, మామగారు ఆయన సైజు కు తగ్గట్టు మరో చిన్న గ్లాసు గా ఈ రకంగా ఆ తరం వారి తో నిండి పోయింది దేవి మాడ్యులార్ కిచెన్ లోని ఒక ఫుల్ అల్మారా.. పక్కనే ఇంకో అల్మారా ఈ మధ్య నే తిరిగి సర్దుకుంది దేవి.. అతి వేగంగా రక రకాల స్టీలు సామాను అందులో కూడా చేరుతున్నది.. ప్లేట్లు, ఇంకా ఇతర కొత్త కొత్త బౌళ్లు అన్నీ వచ్చాయి.. పెద్ద కుటుంబాల లో పెళ్లిళ్లు, పురుళ్ల తో పాటు పన్నెండో రోజులు కూడా తరచూ వస్తూనే ఉంటాయి.. పోయిన వాళ్ల గుర్తు గా ఇలా వంటిల్లు అల్మారా లోకి వచ్చి రక రకాల సామానులు చేరుతాయి.. ఒక సామాన్య మధ్య తరగతి గృహిణి వంట ఇంట్లో ఇంత కన్నా ఏమి ఉంటాయి.. పెద్ద వంటలకు తన పుట్టింటి వారు- గురజాడ వారి గిన్నెలు, గరిటె లు తీసి వాడుతూ ఉంటుంది - అమ్మ తన పెళ్ళి కి ఇచ్చినవి.. అప్పుడు అదే గొప్ప.. రోజు వారి దానికి అత్తగారి తదనంతరం ఆవిడ తన కిచెన్ లో వాడే సామానులు తోడు కోడళ్లు తిరస్కరిస్తే తను వాడు కుంటూ ఉంది.. స్టీలు మీద మోజు తగ్గి ప్లాస్టిక్ మరియు గాజు, పింగాణి వాటి ని ఫ్యాషన్ కోసం కొనటం కామన్ అయిపోయింది.. కొన్నేళ్లుగా.. అందరి ఇళ్ళల్లో.. మాడ్యులార్ కిచెన్ కూడా.. కాని దేవి ఫ్యాషన్ కు తగ్గట్టు ఎప్పుడూ లేదు.. తన కి కుదర లేదు.. చిన్న చిన్న పేరంటాల లో రిటర్న్ గిఫ్ట్ కింద బోలెడు సామానులు చేరాయి.. దేవీ కి గుర్తు--- తన పెళ్ళి కి ముందు రిక్షా కట్టించుకొని అమ్మా, అమ్మమ్మ ఒక రోజు ఇంట్లో ఉన్న ఇత్తడి, రాగి సామానంతా తీసుకుని వెళ్లి అయిదు వందల రూపాయల కు అతి చవక గా అమ్మే సి ఊపిరి పీల్చుకున్నారు.. అద్దె ఇళ్ళ లో అంత సామాను పెట్టుకునేట్లు ఉండేది కాదు.. ఇప్పుడు మళ్ళీ ఇత్తడి, కంచు, రాగి పాత్రలను ఏకంగా అయిదు తారల హోటళ్లలో షోకు గా పొందు పరుస్తున్నారు.. అలంకరిస్తున్నారు.. ఆరోగ్యానికి మంచిదని వంద రెట్లు డబ్బు ఎక్కువ పెట్టి వాటిని కొని వాడే వాళ్లు ఎందరో.. ఈ కాలంలో.. మొన్న నే దేవి చూసి అనుకుంది తన ఫ్రెండ్ ఇంట్లో.. ఇల్లంతా ఇటువంటి వస్తువుల తో నే అలంకరించినది.. పది ఇంతలు పెట్టి ఆ వస్తువులనే ఇవాళ గొప్ప గా కొని కొంత మంది వాళ్ళ వాళ్ళ ఇళ్ళ లో జాతీయత కోసం ప్రదర్శిస్తున్నారు.. ఇక పోతే స్మారక చిహ్నంగా గా స్టీలు సామాను ఇవ్వటం అనేది ఒక అలవాటు గా మారింది.. అమ్మ వైపు బలగం ఎక్కువ కాబట్టి గురజాడ వైపు వారే దేవి వంట ఇంట్లో అల్మారాలను నింపారు.. ఇంట్లో ఐదుగురు సభ్యులు ఉన్నారు.. కూతురు నీలు, కొడుకు సాయి వాళ్ళ ఇరు వైపు తాత ల కంచాలు పంచుకున్నారు.. కోడలు సరిత పెళ్లి కి వాళ్ల అమ్మ సాయి కీ తన కూ చేయించిన వెండి కంచం లోనే భోజనం చేస్తుంది.. దేవి మొగుడు మోహన్ మటుకు వాళ్ల అమ్మ తిన్న దాదాపు సెంచరీ కొట్ట నున్న కంచం లోనే తింటాడు.. అది ఇంట్లో బంగారం కంటే విలువైంది.. ఆవిడ గ్న్యాపకార్థం గా ఇంట్లో ఉన్న డబ్బా లో మోహన్ కిష్టమైన మురుకులూ, కారప్పూస మాత్రమే నింపి పెడుతుంది దేవి.. ఒక సారి ఆ డబ్బా చేతులో నించి జారి కింద పడి సొట్ట పడింది.. పార్లమెంటు సమావేశాల్లో మన రాజకీయ నేతలు ఎంత రభస చేస్తారో దాని నమూనా కొత్త కోడలు తిలకించింది.. ఆ దెబ్బకు ఎప్పుడూ లేనిది సరిత సాయి కూడా దేవి, మోహన్ ల ను అనుసరించి కిచెన్్ కీచులాట ను బాగా రక్తి కట్టించారు.. మరునాడే దేవి ఆ డబ్బా ను తీసుకుని స్టీలు సామాను కొట్టు కు ఎండ లో వెళ్లి సొట్ట ను తీయించు కొని మోహన్ ఆఫీసు నించి ఇంటికి రాగానే ఒక చేత్తో మంచి నీళ్ళ గ్లాసు ఇంకో చేత్తో అత్తగారిని.. అబ్బా.. సారీ.. ఆ డబ్బా ని అందించి మూతి తిప్పు కుంటూ కిచెన్్ లోకి వెళ్లిపోయింది.. ఇంత లో సాయి వచ్చి "ఇంక ఆపుతారా మీరు ఇద్దరూ " అని తల్లీ తండ్రి వైపు చూస్తూ అన్నాడు.. "అమ్మ కు కాలు బెణికినా సరిత వెళ్తానన్నా కూడా వినలేదు నాన్న.. అలాగే బజారు వెళ్లి వచ్చింది. " మోహన్ మటుకు ఆ డబ్బా ని తన ఒడి లో పెట్టుకుని ఒక గంట శూన్యం లోకి చూస్తూ గడిపేశాడు.. సరిత కు ఆశ్చర్యం వేసింది.. ఏమీ లేని దానికి ఎందుకు ఎంతో ప్రేమగా ఉండే అంకుల్ ఇలా అయిపోయారు.. నీలు ఇంకా "సింగిల్" కాబట్టి ఏ గొడవ చేసుకునే అదృష్టం ఇంకా కలగ లేదు.. తన తాత కంచం ఇంకోళ్లు అడగకపోతే తను హ్యాపీ.. మరునాడు సరిత తల్లి ఫోన్ చేసినప్పుడు ఈ వృత్తాంతం ను పూస గుచ్చినట్లు చెప్పింది సరిత.. బెడ్ రూమ్ లో కి వెళ్ళి రహస్యంగా తల్లి తో మాట్లాడుతూ "ఇలా గిన్నెలు, గ్లాసులు కంచాల కోసం గొడవ చేసుకునే ఇంట్లో నన్ను ఇచ్చి పెళ్లి చేశావు.. ఇంకా పోను పోను ఏమీ జరుగుతుందో.. " తల్లి గట్టిగా అటు నుంచి నవ్వింది.. "ఓష్ ఇంతేనా.. నేను ఇంకా ఏదో అనుకున్నా.. " ఇంతలో సరిత నాన్న వచ్చి " ఇట్ ఈజ్ వెరీ కామన్ సరితా..” అన్నాడు ఫోన్ లో.. “మా ముత్తాత కుర్చీ ఉండేది ఇంట్లో.. అది విరిగే వరకు దాని లో నేనే కూర్చునే వాడిని.. మీరు చిన్న పిల్లలు అప్పుడు.. ఇంకా వంట ఇంట్లో చెప్పనే అక్కర్లేదు.. మన ఇంట్లో స్టీలు సామాను పైన మా బామ్మ పేరు ఉంటుంది.. అందులో చందమామ కంచం నాది, అలాగే ఆకు లాంటి ఆకారం లో ఉన్న కంచం మా నాన్నగారిది.. " ఇలా చెప్పుకుంటూ పోతున్నాడు సరిత కు తండ్రి జగపతి రావు.. ఏంటో కొత్త గా ఉన్నాయి అమ్మా నాన్న మాటలు ఇవాళ తనకు అనుకుంది సరిత.. నిద్దర తూలి పోయింది సరిత కు.. అలాగే పడుకుంది.. సాయి టీవీ లో క్రికెట్ మ్యాచ్ లో మునిగి పోయాడు.. మామూలుగా అయితే సరిత, దేవి కూడా చెరో పక్క కూర్చొని ఎవరి మొగుళ్ల తో పాటు వాళ్లు ఉషారు గా మ్యాచ్ ఎంజాయ్ చేస్తారు కాని కందిపప్పు డబ్బా పుణ్యమా అని ఇంట్లో ఇంకా ప్రశాంత వాతావరణం నెల కొన లేదే.. ఇండియా, పాకిస్తాన్ లాగా చీలి పోయింది.. ఒక వారం రోజులు ఇంట్లో ఖాళి దొరికినప్పుడల్లా దేవి తన కోడలు సరిత కు వంటయింటి గాధలు ఎన్నో ఎన్నెన్నో చెప్పింది.. తనకు తన అత్తగారికీ దాని వల్లే తీవ్రంగా గొడవ అయింది ఒకప్పుడు.. అని చెప్పుకొచ్చింది దేవి.. "మా అమ్మమ్మ గుర్తుగా ఈ పాల కుక్కర్ నేను మా అమ్మను అడిగి తెచ్చుకున్నాను.. మీరు మరిది గారికి వేరే ఇవ్వండి అత్తయ్య " అని అన్నందుకు ఆస్తులు, వాటాల వరకు వెళ్ళి పోయింది.. అప్పుడే మీ అంకుల్.. చేసేది లేక నన్ను తీసుకుని వేరే కాపురం పెట్టారు.. మా అత్తగారు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకో లేదు" అని దేవి అన్న మాటలు సరిత ను ఆశ్చర్య పరిచాయి.. పాల కుక్కర్ కు అర్థం తెలియక పోయినా సరిత మౌనంగా ఉండి పోయింది.. అత్తయ్య ను కదిలిస్తే ఇంకో పది రీళ్ల కధ ను అత్యంత భావుకత్వం తో చెబుతుంది.. రేపు అసలే ఒక ముఖ్య మైన మీటింగ్ ఉంది సరిత కు.. కొంచెం చూసుకోవాలి.. ఆ పై వారంలో సోమవారం నాడు నీహారిక ఇంట్లో కిట్టీ పార్టీ.. సెకండ్ ఫ్లోర్ లో ఉండే ఆడవాళ్లు తడవ కు ఒకళ్ల ఇంట్లో నెలకో సారి కలుస్తారు.. పాట్ లక్ చేస్తారు -- అంటే అందరూ ఒక్కో వంటకం తయారు చేసి తెచ్చి, అందరూ కలిసి అన్నీ కలిపి ఆ పూట కి తింటారు.. సరిత కు సోమవారం వర్క్ కి ఆఫ్.. ఫాస్ట్ గా అయ్యే రవ్వ కేసరి చేసుకుని తీసుకెళ్లింది.. కుసుమ ఆ వేళ పాయసం చేసి తెచ్చింది.. పెద్ధ ఎయిర్ టైట్ ప్లాస్టిక్ డబ్బా లో తీసుకొచ్చింది.. బయలుదేరే ముందు గీత ను అడిగింది కుసుమ-- " లాస్ట్ టైమ్ నేను ఒక స్టీలు కెరీర్ తెచ్చాను.. గుర్తుందా? టైమ్ అయిపోయిందని నెక్స్ట్ టైమ్ ఇస్తానని అన్నావు.. ఇవాళ అది నేను తప్ప కుండా తీసుకుని వెళ్లాలి.. అది మా ఆడపడుచు ది.. " "ఓ అదా.. అది ఎక్కడో పడిపోయింది.. సారీ కుసుమా" అంది గీత.. అప్పటి దాకా అందరూ నవ్వుతూ ఒకళ్ల కోకళ్లు బై చెబుతున్నారు.. ఒక్క సారి గా నిశ్శబ్దం గా నిలబడి పోయారు.. కుసుమ వంక చూస్తూ.. కుసుమ టెన్షన్ లో ఉంది.. " నాకు తెలుసు.. ఇదే అవుతుందని.. ఇతరుల వస్తువు తిరిగి ఇవ్వాలన్న బుద్ధి ఎంత మందికి ఉంటుంది.. తప్పు నాది ".. "ఎందుకు అంత సీరియస్ అవుతావు కుసుమ? అంది గీత "అదేమైనా వెండీ, బంగారమా? డబ్బులు ఇస్తాను.. ఇంకోటి కొనుక్కో.. " అని గీత అంటుండగా కుసుమ అందుకుంది- "అది కుదరదు.. మా ఆడపడుచు కు సెంటిమెంట్.. ఆ కేరీరు తనకు అపురూపం.. వాళ్ళ పెళ్ళి కి వచ్చిన మొట్ట మొదటి కానుక.. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి??? ఆవిడ కు కోపం వస్తుంది.. తరువాత మా ఆయన కు కోపం వస్తుంది.. అయ్యో..” కళ్లు తుడుచుకుంటూ ఇంక తను కిట్టీ పార్టీలకు రాను అని ప్రకటించి విసురు గా వెళ్లి పోయింది కుసుమ.. సరిత కూడా సైలెంట్ గా ఇంటికి వచ్చేసింది.. ఎప్పుడూ బోలెడు కబుర్లు మోసు కొచ్చి అత్తగారు దేవి కి, తన మొగుడు సాయి కి చెబుతుంది.. అలాంటిది సరిత ఈ సారి దీర్ఘాలోచన లో పడి పోయింది.. వంట ఇల్లు, దానికి సంబంధించిన పాత్రలు వల్ల ఇన్ని గోలలా? మధ్య లో కొన్ని ఏళ్ళు అందరూ హాయిగా ఉన్నారా?? డిస్పోసబుల్ - అదే ఒక సారి వాడి పారేసే కిచెన్ ఐటమ్స్- బాగా ఉపయోగ పడ్డాయా?? ఇప్పుడు మళ్ళీ ప్లాస్టిక్ బాన్- ప్లాస్టిక్ నిషేధం- వల్ల స్టీలు సామానులు మళ్ళీ బరి లోకి దిగాయి.. ఒక్క సారి అందరూ ఆరోగ్య సూత్రాల మీద పడ్డారు.. ఆలోచిస్తూ ఉంటే సరిత కు గుర్తు వస్తోంది.. కొన్నాళ్లు రామచంద్రాపురం లో అమ్మా వాళ్లు ఉన్నప్పుడు పక్క పోర్షన్ లో మామ్మ గారు ప్రతి రెండు రోజుల కొక సారి " అమ్మాయి, కాస్త చక్కెర ఇస్తావా ? మళ్లీ ఇస్తాను" అని అమ్మ ఇచ్చిన చక్కెర తో పాటు గిన్నెలు కూడా సర్దుకునేది.. అలా బామ్మ గిన్నెలు చాలా పోయాయి.. అప్పుడు ఇంట్లో గొడవ తో మొదలై ఆ తరువాత ఆ ఇల్లే ఖాళి చేసి ఎక్కువ అద్దె పెట్టి గాంధీ నగర్ కు మారి పోయారు నాన్న, బామ్మ పోరు పడలేక.. "అయ్య బాబోయి.. తన పెళ్లి జరిగి ఆరు నెలలు.. అత్తగారు తనూ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు.. చూస్తుంటే ఈ గిన్నెలు, గరిటెలు ఎప్పుడో తగాదా పెట్టేట్లు ఉన్నాయి వాళ్ళ మధ్య.. " సరిత, సాయి తో అదే మాట చెప్పింది.. "నీకు జాబ్ చేస్తూ ఇవన్నీ ఆలోచించే తీరిక కూడా ఉందా? అయినప్పుడు చూసు కొందాము" అన్నాడు సాయి.. మర్నాడు దేవి వాళ్ల పిన్ని కూతురు వచ్చింది.. రెండు నీళ్ల జగ్గులు తీసుకొచ్చి దేవి కి, సరిత కి ఇచ్చింది.. "ఎందుకండీ రెండు.. అత్తయ్య కిచ్చారు గా.. చాలు" అని సరిత అంటే "లేదమ్మా, రేపు మీరు ఒక వేళ విడి కాపురం పెడితే.. మా మామయ్య ని జగ్గు రూపం లో రోజు అందరూ గుర్తు చేసుకోవాలని ఆయన ఆఖరి కోరిక.. అందుకే ఆయన 12 వ రోజు కు రాని దగ్గర వాళ్లందరికీ ఇలా పంచి పెట్టే బాధ్యత నాకు ఇచ్చారు.. " "జాగ్రత్తగా దాచుకో సరిత" "ఇక వస్తాను దేవి" అని ఆవిడ వెళ్లిపోయింది.. సరిత కేమీ అర్థం కావడం లేదు.. అసలు మూడువంతుల మంది స్విగ్గీ మరియు జొమాటో లో ఫుడ్ తెప్పించు కుంటూ కాలం గడుపుతూ, జస్ట్ షో కోసం అన్నీ వంట ఇంటి పరికరాలు కొని ఐకియా షో రూమ్ లో మోడల్ కిచన్ ఉన్నట్లు పెట్టుకుంటూ ఉన్నారు అందరూ లక్షలు ఖర్చు పెట్టి.. అలాంటిది ఇక తన బెడ్రూమ్ లో స్టీలు జగ్గులు వగైరా చేరితే.. ఛీ ఛీ.. పోనీ కిచెన్ లో పెడదామంటే అంత చోటు లేదు.. సాయి తో గట్టిగా చెప్పి వేరే ఇల్లు తీసుకుని తను అనుకున్నట్లు స్టైల్ గా పెట్టుకోవాలి కిచెన్ ని.. ఒక కొత్త ఆలోచన మొలక వేసింది సరిత మనసు లో.. కింద ఫ్లోర్ రమా గారి ఇంట్లో ఆ పై నెల అయ్యప్ప భజన ఏర్పాటు చేశారు.. ప్రతి ఏడాది ఒక వంద మంది అవుతారు.. ఆ ముందు రోజు ఆవిడ దేవి దగ్గర ఉన్న స్టీల్ సామానులు అడిగి తీసుకెళ్లింది.. శనివారం రాత్రి కార్యక్రమం ముగిసే సరికి రాత్రి 12 అయింది.. ఒక రెండు రోజుల తరువాత రమ ఇంటి నించి ఒక మనిషి దేవి సామాను తెచ్చి ఇచ్చాడు.. ఎక్కడివి అక్కడ తిరిగి అన్నీ సర్దుకుంది.. అల్మారా లో రెండు గ్లాసులు మిస్ అయ్యాయి.. దేవుడా.. "సరిత, నువ్వు ఏమైనా రమ కు ఇచ్చావా ?” అని దేవి అడిగింది.. "ఇల్లు మొత్తం వెతికాను.. ఆ రెండు గ్లాసుల కోసం.." "అత్తయ్యా, నాకు ఇప్పుడు ఒక మీటింగ్ ఉంది నన్ను డిస్టర్బ్ చెయ్యవద్దు".. అన్నది సరిత.. దేవికి చాలా కోపం వచ్చింది.. తాను ఏ రోజూ తన అత్తగారి తో ఇలా మాట్లాడ లేదు.. తన వల్ల ఇంట్లో ఒక పూచిక పుల్ల కూడా పోలేదు.. డిన్నర్ దగ్గర మళ్లీ దేవి సరిత ను ఆ విషయమై కదిలించింది.. నీలు కూడా "అదేమిటీ" అని అడిగే సరికి సరిత తింటూ లేచి వెళ్ళి పోయింది.. దాంతో సాయి ఒక్క అరుపు అరిచాడు "ఏమ్మా.. కట్టుకు పోతావా, దాన్ని అన్నం కూడా తిన్నియ లేదు.. నీకు రేపు పది గ్లాసులు కొని ఇస్తాను".. "నా కెందుకు రా.. నువ్వు ముందు ఇది మా తాత గ్లాసు, ఇది నాది" అనడం మానేయి.. పెద్ద మనిషి బయలుదేరాడు నాకు చెప్పటానికీ.. పోరా" అన్నది దేవి టేబుల్ దగ్గర నుండి లేచి అన్నీ సర్దు కుంటూ.. దేవి మొగుడు తన కిష్టమైన కందిపప్పు డబ్బా తీసుకుని రోజు డిన్నర్ తరువాత కరకర లు నవులుతూ టీ వీ చూస్తూ తల్లి తో గడిపినట్లు ఫీల్ అయి పోయాడు.. అతనికి అక్కడ జరిగేది అసలు పట్టలేదు.. నీలు ఇదంతా చూసి పెళ్లి అంటే చాలా స్ట్రస్సు పడుతోంది.. "అత్త గారు లేని సంబంధం చేసుకుంటే.. బెస్ట్ " తన కి వచ్చిన ఈ ఐడియా తల్లి కి చెప్పింది.. తెలివి తెల్లారినట్లు ఉంది అని దేవి కూతురిని ఒక పక్క తిడుతూ మరో పక్క ముద్దు చేసింది.. అనుకోకుండా మర్నాడు దేవి పెద్ద మామగారి కొడుకు ఫ్యామిలీ వచ్చారు.. భోజనాలు చేసే ముందు బావగారు దేవి ని తన కిష్టమైన గ్లాసు పెట్టకుండా వేరే పెట్టి నందుకు అదేమిటి అని అడిగితే దేవి నిజం చెప్పింది.. రెండు గ్లాసులూ పోయాయని.. బావ గారు తన ని ప్రత్యేకంగా అవమానించినట్లు భావించి భోజనం అయిపోయిన వెంటనే తన కుటుంబము తో ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు.. సరిత దేవి బాధను గ్రహించి " ఐ ఆమ్ సారి అత్తయ్య " అన్నది.. " ఆ రోజు రమ ఆంటీ సెకండ్ టైమ్ వచ్చినప్పుడు నేనే ఇచ్చాను.. మిమ్మల్ని అడగవలసినది".. కొన్నాళ్లు ఇంట్లో వాతావరణం యధా విధి గా ఉంది.. దేవి కి ఒక రోజు పూజ చేసు కుంటూ ఉంటే అత్తగారి ది రెండు నెలల లో తొంభైయ్యో పుట్టినరోజు వస్తోంది అని గుర్తు కొచ్చినది.. తన భర్త కు తన తల్లి పట్ల ఉన్న అనురాగం నలుగురి తో పంచుకోవటానికీ ఇదే మంచి అవకాశం.. ఇంట్లో పూజ, భోజనాలు ఏర్పాటు చేశారు.. ఈ సందర్భంగా 50 డబల్ డెకర్ బాక్సులు తెప్పించి వచ్చిన వాళ్ల కి అత్తగారు సావిత్రమ్మ గారి గుర్తు గా ఇచ్చారు.. ఆ డబ్బాలలో స్వీటు, హాటు పెట్టి మరీ ఇచ్చారు.. ఒక పది డబ్బాలు ఎవరి కైనా ఇవ్వాలని భవిష్యత్తు లో అనిపిస్తే ఉంటాయని ఇంట్లో విడిగా పెట్టారు.. ఆ రోజు రాత్రి దేవి మోహన్ తో అన్నది “ఒక సారి వడ్రంగి ని పిలిపిస్తే ఎక్స్ట్రా అల్మారా చేయిద్దాము.. ఉన్నవి సరి పోవడం లేదు.. ఇంకా మన పెద్ద వాళ్ల వి వరస పెట్టి స్పెషల్ పుట్టినరోజులు వస్తాయి. సరిత నీళ్లోసుకుంటే ఇంకా ఎన్నో వేడుకలు వస్తాయి".. “వాట్ ఈజ్ దిస్ సాయి? ఇన్నాళ్లు ఇలా ఎలా ఉన్నారు?” అని సరిత అంటే దానికి జవాబు గా సాయి తన బాస్ తో మాట్లాడి వేరే సిటీ లో పోస్టింగ్ వేయించు కున్నాడు.. సరిత ఎలాగైనా ఇంటి నుంచే పని చేస్తుంది.. దేవి మోహన్ ల తో వెళ్లే ముందర చెప్పారు.. కొత్త ఊరి లో కొత్త ఇంట్లో వంట ఇంటి పాత్రలు ఎక్కువ అయిపోయాయి.. చేసేది లేక ఇంకో అల్మారా చేయించారు.. ఇక్కడ కూడా పెద్దలందరూ కొలువు తీరారుగా.. అమ్మ పుణ్యమా అని.. !!! "మనం ఏం చేశాము? ఇక్కడ అత్తగారు, అంకుల్ లేరు అన్న మాట తప్ప ఆవిడ కిచెన్ లాగే ఉంది.. దీని కోసమా వేరే ఊరు వచ్చింది? " సరిత ప్రశ్న కు నవ్వుతూ బదులు చెప్పాడు సాయి- సరేలే.. లాస్ట్ మినిట్ అమ్మ తన ప్రేమ ను ఈ కిచెన్ సామాన్ల లో చూపించే సరికి ఏమీ అన లేక పోయాను.. మా బామ్మ నాకు ఇవ్వ మన్న నీళ్ల గంగాళం ఎంత హ్యాపీ గా మా అమ్మ ఇచ్చిందో చూశావు గా.. ఇన్నాళ్లూ దాన్ని వాడ లేదు.. ఎన్ని ఇళ్లు మారారో పాపం అమ్మ, నాన్న.. ఈ స్టీల్ సామాను తో.. వచ్చినందుకు ఒక సంవత్సరం హనీమూన్ లాగా ఎంజాయ్ చేసి తిరిగి వెనక్కి వెళదాము" అన్నాడు సాయి.. ఆరు నెలల తరువాత నీలు పెళ్లి కుదిరింది.. ఇంకో మూడు నెలల తరువాత పెళ్లి.. దేవి ఆ ఉత్సాహాన్ని కొడుకు కోడలి తో పంచుకుంది ఫోన్ లో.. " అత్తయ్య, నీలు కి మీరు వేరే ఏమీ కొన వద్దు.. నా దగ్గర ఉన్న కిచెన్ సామాను మొత్తం మనం ఇచ్చేద్దాము" సరిత మాటలకు దేవి పొంగి పోయింది.. ఎలాగో మేము మళ్లీ వెనక్కి వస్తున్నాము.. మన ఇద్దరికి ఇంట్లో ఉన్న పాత్రలు, సామగ్రి చాలు.. అయినా ఏదో రకంగా చేరుతూనే ఉంటాయి గా ".. హైదరాబాద్ లో ఎప్పుడూ ఎవరో ఒకరు మనల్ని దేనికో దానికి పిలుస్తూనే ఉంటారు గా.. " వచ్చిన అవకాశాన్ని సరిత చక్కగా వాడు కుంది.. విడిగా వచ్చేసి దేవి ని బాధ పెట్టి నందుకు ఇప్పుడు తన మాటల తో సరి దిద్దినది.. "మా బంగారు తల్లి.. త్వరగా వచ్చేయండి.. చాలా మంది మీరు లేక పోయినా మీ పేరు మీద గిఫ్ట్ లు ఇచ్చారు.. అవి కొరియర్ చేద్దాం అనుకున్నా.. " "అమ్మా.. అంత పని చేయద్దు.. " "ఆ పాత్రల తో పాట్లు నీకెందుకు? సరిత వచ్చాక కలిసి చూసుకోండి..” అంటూ సాయి ఫోన్పెట్టేసి పగలు బడి నవ్వుకున్నారు సాయి, సరిత! "ఏ ఊరు వెళ్లినా ఏ ముంది.. పద్థతి మారనప్పుడు.. పేరుకే ఇంట్లో మాడ్యులార్ కిచన్.. రెండు స్టీల్ సామాను కోట్లు పెట్టు కోవచ్చు".. సరిత రుసరుస కు "గుడ్ ఐడియా సరూ" అన్నాడు సాయి.. "ఎవరైనా ఇల్లు మారితే ఫర్నిచర్ ఇంకా రకరకాలు ఉంటాయి.. మనకి స్టీల్ సామానే.. " సరిత మాటలు విని సాయి లాభం లేదనుకొని "సరూ, లే, ఊరికే మూడు పాడి చేసుకోకు.. నీలు పెళ్లి కి నీకు కొత్త డైమండ్ నెక్లెస్ కొంటాను.. ఇప్పుడే వేళదాము".. "నౌ.. దట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఐడియా, ఇప్పుడే వచ్చా టూ మినిట్స్ లో " అని సరిత ఒక లాంగ్ గౌను వేసుకుని తన మొగుడు తో పాటు షాపింగ్ కి రెడీ అయిపోయింది.. అమ్మ లాగే తన పెళ్లాం సరిత కూడా ఎక్కువ సేపు గోడవ చేయదు, సర్దుకు పోతుంది.. తన అదృష్టం అనుకున్నాడు సాయి మనసు లో కారు తీస్తు.. ***********************************

దాసు రాధిక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం

పూర్తి పేరు: శ్రీమతి దాసు రాధిక

వయసు: 52 సం.

నివాసం: బెంగుళూరు ( ప్రస్తుతము)

స్వస్థలం: తెనాలి

చదువు: BA English Litt., B.Ed

వృత్తి: గృహిణి. 1993-1997 హై స్కూల్ టీచర్ గా పని చేసిన అనుభవం.

ప్రవృత్తి: సంగీతం వినటం, పాటలు పాడటం

పాడుతా తీయగా ETV లో రెండో బ్యాచ్ 1997 లో క్వార్టర్ ఫైనలిస్ట్.

స్కూల్, కాలేజి లో పాటలు, నాటకాల( ఇంగ్లీషు, తెలుగు) అనుభవం.

కథలు వ్రాయటం, ఇంగ్లిష్ - తెలుగు భాషా అనువాదాలు.

ఇటీవలే ఛాంపియన్స్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ నుండి , ఆసియన్ వరల్డ్ రికార్డ్స్ వారినుండి సర్టిఫికేట్ లు పొందాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత్రి బిరుదు పొందారు.










145 views0 comments

Comments


bottom of page