top of page

సంఘం శరణం గచ్ఛామి


'Sangham Saranam Gacchami' written by Dr. Kanupuru Srinivasulu Reddy

రచన : డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి

ఒక రోజు పరంధాముడు తరువాత పరంధామయ్య . కాలం పరుగులు తీసే కొలది, డబ్బుకూడే కొలది, పరువు పలుకుబడితోపాటు బాబు కలిసి, పరం బాబు అయ్యాడు. కానీ ఎక్కడో మంచి చెడులు ఆలోచించే గుణం కాస్త నిలిచింది. ఆ రోజు పదిగంటలకే ఇంటికి వచ్చాడు.

ఉదాత్తమ్మ ఆశ్చర్యానికి అంతులేదు. భర్త రాత్రి పన్నెండు ఆ ప్రాంతంలో, ఒక్కగానొక్క కూతురు పదకొండుకు పైన రావడం ఆనవాయితీ. కూర్చుని ఏదో ఆలోచనలో ఉన్నాడు.

పదమూడేళ్ళ అమ్మాయి, తాడు బొంగరం లేని ఒక గొట్టం గాడితో తిరగొద్దు అని మందలించిన దానికి, ఇద్దరూ కలిసి తండ్రినే పెట్రోలు పోసి తగల పెట్టేసారంట.

మరీ ఘాతకం, అమానుషత్వం! ఆ తండ్రి ఎంత ప్రాణప్రదంగా పెంచి ఉంటాడో ? ఇంత క్రూరంగా కూడా ఉంటారా బిడ్డలు! పేపర్లో చూసి ఒకటే ఆలోచనతో తలపగిలి పోతుంది పరంబాబుకు .

ఉదాత్తమ్మ పరిశీలనగా చూస్తూ,”భోజనం చేస్తారా ?” అని అడిగింది.

తలెత్తికూడా చూడలేదు. అలాఉండటం చాలా అరుదు. ఏముంది ఆ వంద కోట్ల కాoట్రాక్టు వేరే వాళ్లకు పోయిoదనో, పోతుoదేమోనని ఈ ఆలోచనుంటుంది. భార్యను గురించి, ఒక్కగానొక్క కూతుర్ని గురించి మాత్రం ఉండదని నమ్మకంగా తెలుసు. డబ్బు లేనప్పుడు, వస్తున్నపుడు నచ్చింది గాని, వచ్చిన తరువాత ప్రవర్తనలు, పద్దతులు మారి పోతుంటే నచ్చడంలేదు. మనశ్శాంతి అంతకన్నా లేదు. అయినా తను ఏo చెయ్యగలదు ?

కూతురికి డబ్బుతో వచ్చిన అహంకారం, విచ్చలవిడితనం ఉదాత్తమ్మను చాలా కలవరపరుస్తూ ఉంది. ఎన్నో సార్లు చెప్పిచూసింది. ప్రయోజనం లేకుండా పోయింది.


తనకు మించి పోయిందని వదిలెయ్యలేక పోయింది. ఒక్కగానొక్క బిడ్డ, తమ గారాల ముద్దు బిడ్డ. పరంబాబు ప్రాణం. ఈ విషయం భర్తతో గట్టిగా చెప్పాలని చాలా రోజులనుంచి అనుకుంటూ ప్రయత్నిస్తూ ఉంది. కానీ అతను ఎప్పుడూ మాట్లాడే పరిస్థితుల్లో ఇంటికి రాడు.

ఈ అవకాశం కోసం ఎన్నో నెలల నుంచి కాచుకోనుంది. ఈ రోజు ఎలాగయినా చెప్పి తీరాలి అనే భోజనానికి పిలిచింది..

చూసి చూసి మాట్లాడక పోయే సరికి లాభం లేదని తనే అంది” ఏవండి అమ్మాయి సంగతి....!”

ఆ మాటతో ఉలిక్కిపడ్డట్టు తలెత్తి చూసాడు. ”ఏవయ్యింది.?” ఆశ్చర్యంగా చూస్తూ అనుమానంగా అడిగాడు పరంబాబు.

“దాని ప్రవర్తన ఏo బాగాలేదండి. రాత్రి మీరు రాబోయే ముందు వస్తుంది. ఒక్కో రోజు తింటుంది, అదీ బలవంతం చేస్తే. లేకుంటే నేరుగా పైకి వెళ్లి పోతుంది.


అడిగితే నామీద కస్సుమంటుంది. దగ్గరకెళితే వాసన. ఏo తాగివస్తుందో ఏమో?నాకు చాలా భయంగా ఉందండి . రేపు ఏదయినా జరగరానిది జరిగితే ..!” బాధతో మాట్లాడ లేక పోయింది.

గుండె ఝల్లుమన్నా “ఎందుకంత భయపడుతావు. మన బిడ్డ తప్పులు చెయ్యదు.” అన్నాడు.

“అంటే ఏవిటండి మీ ఉద్దేశం. నేను చెప్పేది అబద్దమంటారా? ఎలా చెడిపోయినా చూస్తూ ఉండమంటారా ? ఏవిటి మీ నమ్మకం?”చిరాకుతో కోపంగా అడిగింది .


“అదికాదు నా ఉద్దేశం .అలా ఏం జరగదు మన బిడ్డకు.”


“అనకండి. చేతి నిండా డబ్బు. విపరీతమైన ఆకర్షణలు, విచ్చలవిడితనం,అడ్డు చెప్పలేని తల్లిదండ్రులు, పాత అంతా రోత, కొత్త అంతా ఆధునికం అనే పిచ్చినమ్మకం, పుట్టింది అనుభవించడానికే అనే నవ నాగరికత అభిప్రాయ ఆశయాల సాంఘిక కుసంస్కారం. ఇవే ఎదుగుదలకు నిదర్శనం అని మురిసి పోయే గాడిదల నినాదం. ఇంకేం కావాలి బురదగుంటల్లో పడటానికి ?”


బిడ్డ భవిషత్తు బంగారు బాటగా తీర్చిదిద్దాలని పరంబాబు జీవిత ఆశయం. కానీ భార్య మాటలు, తన స్నేహితులు, పేపర్లో చెప్పిన విషయాలు ఆలోచనలో ముంచాయి. ‘నా బిడ్డ కూడా అలా అయితే....ఏం జరుగుతుందో....!?’ భయంవేసింది.వణుకు పుట్టింది.

కానీ భార్య వైపు ధైర్యంగా ఉన్నట్లు చూసి“ దాన్నేం అనకు, చిన్నపిల్ల. చెపితే అర్ధం చేసుకుంటుంది. మరీ గట్టిగా మాట్లాడితే అడ్డం తిరుగుతుంది. చస్తాను అంటుంది.


పిచ్చి పిచ్చి పనులు చేసి మనకు గాకుండా పోతుంది. వయసు అలాంటిది. జాగ్రత్తగా దారిలోకి తెచ్చుకోవాలి !!” ప్రవర్తనను అంత తేలిగ్గా తీసుకోలేని భార్య సంగతి తెలిసి నమ్మకం కలిగేటట్లు అన్నాడు.


“లేదండీ! ఈ కాలం మగపిల్లలకంటే ఆడపిల్లల ప్రవర్తనే విడ్డూరంగా ఉంది. ఎవ్వరికీ భయపడటంలేదు. దేన్నీ లెక్క చెయ్యడం లేదు.


మరీ ఈ సెల్ ఫోన్లు నాశనం చేస్తున్నాయి. ఇరవై నాలుగు గంటలు చెవికి అతుక్కునే ఉంటాయి. రాస్తూనే ఉంటారు, చదువుతూనే ఉంటారు మెసేజ్లు.


ఆ ఇంటరెస్టు చదువు మీద పెడితే బంగారు భవిష్యత్తును గుప్పెట్లో పెట్టుకోగలరు. దాని వలన ఎన్ని మానసిక జబ్బులు, చెడు బుద్ధులు,అలవాట్లు వస్తాయో వాళ్ళు ఆలోచించడమే లేదు.


బానిసలయి పోయారు. వ్యక్తిత్వాన్ని ఆ దరిద్రపు ఫోన్లకు ఉంపుడుగత్తెలు, వ్యభిచారులు అయిపోయారు. మంచిగా చెపితే వింటుందని నేను అనుకోవడం లేదు.


గట్టిగా వార్నింగు ఇవ్వండి. దాన్ని మనకు దక్కేటట్లు చూడండి”అని కన్నీళ్లు తుడుచుకుంది. “అలా చేస్తే చస్తుంది” నిరసనగా, భయంగా చూస్తూ అన్నాడు పరంబాబు.


“అది ఉండి ఉద్దరిస్తుందని నాకు నమ్మకం లేదు” మొహమాటం లేకుండా అంది.


“ఏవిటా దరిద్రపు మాటలు?”


“మీకు అలాగే అనిపిస్తాయి. అది కడుపులో గడ్డలు పెంచుకుని మన కడుపుల్లో నిప్పులు పోస్తుంది. ఈ దరిద్రపు మాటలు పదిమంది చేత అనిపించుకోవద్దు అంటున్నాను.”


“అలా ఎప్పటికీ జరగదు. చూస్తూ ఉండు.”


“షికారుకెళ్ళి పదిమంది చేత రేప్ చేయించు కొచ్చినా చూస్తూ ఉండమంటారా, ఏ గొట్టంగాడో లేపుకు పోయి రెడ్ లైట్ ఏరియాలో తేలినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటారా?


డ్రగ్స్ కు అలవాటుపడి వీధిలో పడిఉన్నా పరవాలేదంటారా ? అది మన బిడ్డ , ఆధునిక నాగరికతకు మారు పేరు అని చంకలు తట్టుకుందామా? చస్తే పీడా వదిలి పోతుంది. ఒక ఏడుపు ఏడ్చి నీళ్ళు చల్లుకుంటే సరిపోతుంది.”


“ఛీ..నువ్వు దాని తల్లివా, శత్రువ్వా ?”


“కాబట్టే ఆ గుండె పగుళ్ళు నేను భరించలేనని, ముందుగా మీ దగ్గర డాన్సు చేస్తూ ఏడుస్తున్నాను. భర్తను సరే భరించాను. బిడ్డను కూడా చెడిపోయిన దాన్నిచేసి బ్రతికి ఉండటం నావల్ల కాదు.


అంతా తమ పోలికే అని మురిసి పోయే వారుకదా. నిజమే నూటికి నూరు పాళ్ళు మీ జీన్సే. కాకపోతే మీరు మగ, అది ఆడ! అదే తేడా!!” తన అసంతృప్తిని కోపాన్ని అంతా చూపించింది.

పరంబాబు అవమానాన్ని దిగమింగుకోలేక, బాధను అణుచుకోలేక, నిజాన్ని భరించలేక కాల్చుకు తినేటట్లు చూసాడు భార్యను.


“ఇటు చూడకండి, అటు చూడండి. ఏమైనా ప్రయోజం ఉంటుందేమో” అంటూ లోపలికి వెళ్ళిపోయింది ఉదాత్తమ్మ.


అట్లాగే తలపట్టుకుని కూలబడిపోయాడు పరంబాబు. భార్య మాటలు తగలరాని చోటే తగిలాయి.బాధ్యతను మరిచి పోయావు అని ముఖం మీద కొట్టి చెప్పింది.


ఆమె మాటలు నమ్మితీరాలి. ఏ తల్లీ తన బిడ్డ మీద ఇన్ని అపవాదులు వెయ్యదు. క్షమించలేని, అదుపు చెయ్యలేని నిదర్శనమేదో ఉండాలి. ఏదో ఒకటి గట్టిగా చెయ్యాలి. ఎలా?


ఆ బిడ్డంటే ప్రాణమే? ఆ బిడ్డ పైఅంతస్తులో ఉండాలని, పెద్ద పెద్ద చదువులు చదవాలని, ఆమెకు జీవితంలో ఎలాంటి సమస్యలు రాకూడదని, ఎన్నో విధాలుగా కక్కుర్తితో సంపాదించి కూడబెట్టాడు.


యింకా యింకా అనే కక్కుర్తి చావలేదు. అది ఇలా దారి తీస్తుందని ఎప్పుడు ఆలోచించ లేదు. ఇప్పుడు ఆ బిడ్డ భవిష్యత్తును ఎలా సరిదిద్దాలి అనే విషమ పరిక్ష ఎదురయ్యింది. బిడ్డ సత్ప్రవర్తనా...డబ్బా అనే సమస్యకు పరిష్కారం వెదకడం అవసరం అయింది.


వ్యక్తిత్వాన్ని, సుగుణాలను డబ్బుతో కొనగాలడా? ఇంతకు ముందు తనకు మించిందా అనే ధీమా ఉండేది. ఇప్పుడు ఎలా?


“కూతురు వచ్చేంతవరకు భోజనానికి రారా? మీరు తిన్నట్లే ! ఆలోచిస్తున్నారా! మంచిదే ! ఆచరణలో పెట్టండి. ఒక కోటి రూపాయలన్నా మిగులుతాయి. కడుపులు తీయించడానికైనా ఉంటుంది.”


ఆమె వ్యంగ్యానికి చిరాకు వేసింది. ఏవిటి ఈ మనిషి ఈ రోజు ఇలా చంపుతుంది అనుకున్నాడు. అయినా ఏమీ అనలేక తనలో తనే తిట్టుకున్నాడు.


తన బిడ్డ తను చెప్పినట్లు వింటుందని గట్టి నమ్మకం ఉంది. వ్యాపారంలోఎంతో మందిని దారికి తీసుకొచ్చాడు. ఇదొక లెక్క కాదనిపించింది.


అప్పుడు చూసాడు ఉజ్వల పాడుకుంటూ లోపలికి రావడం. కూతుర్ని చూసి అన్నీ మరిచిపోయాడు.


ఎక్కడనుంచి వచ్చింది ఈ దర్పం,సొగసు,ఆ ఠీవి అని గర్వంగా భార్య వైపు చూసాడు. ఆమె పట్టించుకోలేదు. కూతుర్నే గమనిస్తుంది.


వస్తూనే తండ్రిని చూసి ఆశ్చర్యపోతూ, ”హాయ్! సర్ ప్రైజ్. గ్లాడ్, నిన్ను చూసాను. ఎన్ని నెలలైంది ? థాంక్స్ ఫార్ హేవేన్స్” అంటూ మిద్దిపైకి వెళ్ళబోయింది.


“రామ్మా! నీకోసమే ముందుగా వచ్చాను రా!! ఇట్లా వచ్చి కూర్చో” అని పిలిచాడు, చాలా ప్రేమగా పరంబాబు.


“ఓహ్! చాలా టైర్డ్ గా ఉంది డాడీ. ఉదయం మాట్లాడుకుందాం” అంటూ పిలుస్తున్నా నిలవక పైకి వెళ్ళిపోయింది.

కూతురు వెళ్ళిన వైపే చాలా సేపు చూసి, గాఢ నిట్టూర్పు వదిలి భార్యవైపు చూసాడు. ఇది వరకున్నట్లే కోపంగా చూసింది.


తల దించుకుని, ” వెళ్లి పిలువు, మీనాన్న కూడా భోజనం చెయ్యలేదు రమ్మని” అన్నాడు.

“మీ పిచ్చి అది రాదు.ఎవరు తినకపోతే దానికేం? ” అని, కాదనడం ఎందుకని వెళ్లి, పిలిచి, పిలిచి, తలుపు తీయక పోతే నిరాశతో తిరిగి వస్తూ, మెట్ల మీద పడి ఉన్న ఒక హ్యాండ్ బ్యాగును చూసి, వొళ్ళు తెలిసుంటే కదా, అనుకుంటూ బాధను కప్పిపుచ్చుకుంటూ తీసుకొచ్చి భర్తకు ఇచ్చింది. దాన్ని తీసుకొని భార్యతో "చూడొచ్చా” అన్నాడు.


“ మీ బిడ్డదయితే ?” అంది.


ఈ రోజు మాటలతో నమిలేస్తుంది ఈ మనిషి, అని అనుకుంటూ బ్యాగ్ తెరిచాడు.ఏదో మేకప్ సామాన్లు క్రెడిట్, డెబిట్ కార్డులు, ప్రోగ్రస్ రిపోర్ట్.


సిగిరెట్ పేకెట్, మరేదో కొన్ని ప్లేయింగ్ కార్డ్స్ ముక్కలు. అన్నింటి మీద సెక్స్ ఫోటోలు. చెమటలు పట్టి పోయాయి. భార్య చూస్తుందేమోనని లోపలే దాచేసాడు.


తెల్లని పొడి అడుగులో కనిపించింది. ముఖానికి పూసుకోనేది ఉంటుందని వదిలేయ్యబోయి, చేతికి అద్దుకొని నలిపి వాసన చూసి, ఆశ్చర్యంతో రాయిలాగా అయిపోయాడు.


నమ్మలేక పోయాడు. మాట్లాడలేక పోయాడు. గుండె పగులుతూ ఉంటే, అలాగే దిగులుపడి లేవలేక పోయాడు. తట్టుకోలేక వణికి పోయాడు.


బయటకు కనిపించనీయక మనసులో కుమిలి కుమిలి ఏడ్చాడు. ఉదాత్తమ్మకు భర్త అలా ఎందుకు అయిపోయాడో తెలుసు. అందులో ఏముంటాయో కూడా తెలుసు. అడగలేదు.


ఎంత పిలిచినా పలకకపోగా విసుక్కున్నాడుగాని కదలల్లేదు. చూసి చూసి, పాలు తెచ్చి అక్కడ ఉంచి వెళ్లి పడుకుంది ఉదాత్తమ్మ.


అట్లాగే రాత్రంతా నిదుర పట్టక ఆలోచిస్తూ ఉండిపోయాడు పరంబాబు .


ఉదాత్తమ్మ ఉదయం లేచి భర్త సోఫాలోనే కూర్చొని ఉండటంచూసి, కాఫీ పెట్టి దగ్గరకు వచ్చి ఇస్తూ ”ఎందుకు అంతగా ఆలోచిస్తారు? చెయ్యల్సింది ఏవిటో వెనకా ముందు చూడకుండా నిర్ణయం తీసుకోండి.


ప్రేమను ప్రక్కనపెట్టి , బాధ్యతను గుర్తుపెట్టుకుని చెయ్యండి. ఇరవై ఒకటో శతాబ్దం, ఎటు ఎదగాలో తెలియక ఎదుగుతున్న భారత దేశపు పౌరురాలు సంగతి తరువాత, అది మన బిడ్డ. గుర్తుందా !!” అంది.

ఏం మాట్లాడక తను చూసింది చెప్పక, బ్యాగ్ లోని ఒక సర్టిఫికేట్ లాంటిది ఇచ్చాడు. మిగిలినవి చూపలేదు.


ఆమె తీసుకొని చూసి, నిస్పృహతో అతని వైపు చూస్తూ, “ఇందుకూ నేను ఏడ్చింది. అది చదవడం లేదు. అసలు కాలేజి వెళుతుందో లేదో? యింకా ఏమేమో చేస్తుందని నా అనుమానం. డబ్బు ఏమాత్రం వాడుతుంది” అని అడిగింది.


“ఒక్క నెలలో అయిదు లక్షలు ఖర్చు పెట్టింది” అంటూ పిచ్చిగా చూసాడు భార్య వైపు.


“ఉంచుకుని ఏం చేస్తామండి? పాపం, ఖర్చు చెయ్యనీ. మీరు కూడపెట్టింది అందుకేగా! ఒక్కగానొక్క బిడ్డ. పాపం! అనుభవించనీ! నాకు లేని అదృష్టం దానికైనా ఉండనీ!”


”నీ మాటలతో నన్ను చంపకు. నెత్తురు కారుతుంటే మిరప్పొడి చల్లకు. .”


“నాది కాదు ఆ పని మీ కూతురుది.” అంటూ లేచి వెళ్ళబోయింది.


“ఎక్కడికి? వెళ్లి దాన్ని పిలువు”


“ఉదయాన్నే నా ముఖం చూస్తే మీకు మల్లె దానికి అచ్చిరాదు. అయినా ఇప్పుడెక్కడ? ఉదయం పదిగంటలు దాటాలి.


ఈ లోగా మీరు స్నానం చేసి కాస్త టిఫిన్ చేయండి. దానికోసం నామంగళసూత్రాన్ని ఎందుకు బలి చెయ్యాలి.”


“ఇలా మాట్లాడుతావని తెలిసుంటే ఇప్పుడు వచ్చి ఉండే వాడిని కాదు.”


“ అప్పుడు బూడిదనే చూసుండే వాళ్ళు.”


వెర్రిగా ఆమెను చూస్తూ, “నేను నీకేం ద్రోహం చేసాను. ఎందుకు అలా మాట్లాడుతావు.ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియక చస్తున్నాను?.”


“అందుకే డబ్బు కాదు... సంతోషాన్ని ఇచ్చేది మరొకటుంది. అది మీకొంప, మీ భార్యా బిడ్డలు అని ఇప్పటికైనా తెలుసుకుంటే కాస్త మనశ్శాంతి అయినా దక్కుతుంది,.”

“ఇప్పుడేo చెయ్యమంటావు?” బ్రతిమలాడినట్లు అడిగాడు.

ఆ మాటతో కాస్త ప్రసన్నత కలిగింది,ఇప్పటికైనా తను ఒక భాగస్వామి అని గుర్తించినందుకు.


“ముందు దానికి డబ్బు అందకుండా చెయ్యండి లేదా ఖర్చు పెట్టేది తగ్గించేటట్లు చూడండి. గొడవ చేసినా పరవాలేదు.


రాబోయే పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటే, దానికి తగ్గట్టుగా డబ్బు ఇస్తానని చెప్పండి. సాయoకాలం ట్యూషన్ పెడతానని గట్టిగా చెప్పండి. బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఉండేటట్లు చెయ్యండి.”


భార్యను ఆశ్చర్యం గా చూస్తుండి పోయాడు.


“ఏవిటి అలా చూస్తున్నారు.”


“నీలో ఇంత ఆలోచన, చాకచక్యం ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు.”


“ఇప్పటికైనా తెలుసుకున్నారు. బిడ్డను ఎలా దారికి తీసుకు రావాలో ఆలోచించండి. నాకు గండపెండేరం రాత్రికి తొడుగుదురు గాని” అంటూ లేచి వెళ్ళింది.ఆమె ముఖంలో సరసం కనిపించలేదు.

ఆశ్చర్యపోతూ,ఎవరెవరికో చాలా సేపు ఫోన్లు చేస్తూ భార్య వచ్చి కూర్చుంది కూడా గమనించలేదు.


“మమ్మీ!” అరుపుకు ఇద్దరూ అదిరి పడ్డారు.


“నా హ్యాండ్ బ్యాగ్ చూశావా?” అని అక్కడ నుంచే అరిచింది కూతురు ఉజ్వల.


ఒకర్నొకరు చూసుకుని లెక్క చేయక మౌనంగా ఉండి పోయారు. తలుపులు పగిలి పోయేటంత విసురుగా కొట్టి క్రిందకు రాకనే మళ్ళీ అరిచింది.


“నిన్నేఅడుగుతున్నది. వినిపిచడం లేదా?” వెలుపలికి వచ్చి చూసి తండ్రి ప్రక్కన తన హ్యాండ్ బ్యాగ్ ఉండటం గమనించి అక్కడనుంచి దూకినట్లు ఒక్క క్షణంలో వచ్చి బ్యాగ్ తీసుకుని తెరిచి ఉండటం గమనించి తల్లి వైపు తిరిగి, ”ఎవరు తీసారు దీన్ని?” అంటూ నిలదీసినట్లు కోపంగా అరిచింది.


“ఎందుకువే అంతలా అరుస్తావు. మరీ లెక్క లేకుండా పోయింది. తండ్రి అలుసు, పొగరు పట్టి పోయింది”అంటూ చీదరించుకుంది ఉదాత్తమ్మ.

“ఏం తీస్తే. ఏమున్నాయి అందులో?“ అప్పటివరకు మౌనంగా తల వంచుకుని కూర్చున్న పరంబాబు తలెత్తి ఉజ్వలను చూసి, ఆశ్చర్యంతో మూగవాడు అయ్యాడు.


ఏవిటిది రాత్రి చూసిన దర్పం, ఆ ఠీవి సొగసు ఎక్కడ ? ఈ వయస్సుకే కళ్ళ క్రింద నల్లని చారలు, గుంటలు చర్మం ముడతలుపడి, వికారంగా తల విరబోసుకుని దయ్యం లాగా భయంకరంగా ఉంది.


తన బిడ్డేనా అని అనుమానం వచ్చింది. ఒక్క సారిగా గుండెల్లో అదిమినట్లనిపించింది. పిచ్చిగా భార్యవైపుచూసాడు.

ఇందుకా నేను ఇంత కష్టపడి అడ్డమైన గడ్డి తిని సంపాదిస్తున్నది. ఇందుకా సంసార జీవితాన్ని నాశనం చేసుకుంది. ఇందుకా రాత్రిళ్ళు నిదురపోక ఆ బిడ్డ భవిష్యత్తును కలలు కంటూ ఇంత తపన పడుతున్నది? తల తిరిగి పోతున్నట్లు అనిపించింది పరంబాబుకు.


తండ్రి వైపు విసుగ్గా చూసి, తల్లితో,” నిన్నెవరు తాకమన్నారు నావస్తువుల్ని?” కోపంగా అంది.


“ఏముంది, అమ్మ నిన్ను లేపడానికి వస్తే మెట్ల మీద పడి ఉందని తెచ్చింది”


“నా పర్సనల్ వస్తువుల్ని తాకకూడదు, చూడకూడదు. కంట్రీ బ్రూట్, అది మానర్సు కాదు..”అంది చాలా చిరాకుగా కోపంతో.


ఆమాటకు చాలా కోపం వచ్చింది.ఈ బిడ్డ ఏ బ్రూటుకు పుట్టిందో మరిచిపోయినట్లుంది. భర్త వైపు చూసింది ఉదాత్తమ్మ.


“అదేవిటి మేమెవ్వరం?” అడిగాడు కోపాన్ని, బాధను అణుచుకుంటూ పరంబాబు.


తండ్రి కోపాన్ని గుర్తించి,” అదేవిటి డాడీ మీరు కూడా ఫూలిష్గా! కొన్ని విషయాలు నాకు పర్సనల్ అవుతాయి. వాటిలో ఎవ్వరు కలగచేసుకున్నా నాకు ఇష్టం ఉండదు. ఐ కాంట్ టాలరేట్ సచ్ థింగ్స్” కుండబద్దలు కొట్టినట్లు అంది.


“అంటే మేము నీ పర్సనల్ కాదా? అందులో మేము చేరమా?” అడిగాడు కోపాన్ని అణుచుకుంటు పరంబాబు.


ఏం మాట్లాడాలో తెలియక ఆలోచిస్తూ తండ్రిని, తల్లిని మార్చి మార్చి చూసింది ఉజ్వల విసుగ్గా” ఎందుకు మీరు కూడా తెలివితక్కువగా మాట్లాడుతున్నారు. అమ్మ సరే ఓల్డ్ ఫ్యాషండ్.ఈ కాలపు పద్దతులు తెలియవు” అంది.


ఆ మాటకు భార్య వైపు చూసి ” ఇంకా ఎప్పుడు నేర్చుకుంటావు ఊరంతా తిరిగి సగం రాత్రి వచ్చేది. మైకంలో వొళ్ళు తేలియకుండా వచ్చేది. మేకప్పులు, బాయ్ ఫ్రెండ్స్ తో షికార్లు, పబ్బులకెళ్ళి డాన్సులు చేసేది.


అల్ట్రా మాడరన్ గా ఎదిగేది?. బిడ్డ చెపుతుంది నేర్చుకో! నేనూ తెలివి తక్కువ వాడిని కాబట్టి నీకు అవసరం అని తెలుసుకోలేక పోయాను. బిడ్డ మాటలతో ఇప్పుడే జ్ఞానోదయం అయ్యింది” అని కూతురు వైపు చూసాడు.


తండ్రికి కోపం వచ్చిందని గ్రహించింది వెంటనే “ అది కాదు డాడీ. నేను అడల్ట్...!నాకు కొన్ని లిబర్టీస్ పర్సనల్ ...! ” అని నసుగుతూ అయిష్టంగా అంది ఉజ్వల.


“ నీకు పదమూడు సంవత్సరాలు, చదువుతున్నది జూనియర్ కాలేజి. అప్పుడే అడల్టు అయిపోయావా? మేం బ్రతికి ఉన్నంత కాలం నువ్వు చిన్నదానివే.


చదివి ఉద్యోగం చేసి, పెండ్లి అయినప్పుడు నువ్వు నిజమని నమ్మినప్పుడు నీ జీవితం నీది. పర్సనల్ అన్నావే అంటే తల్లి దండ్రుల దగ్గరకూడా దాపరికాలు ఉంటాయా? ఇదికూడానా?” అంటూ ప్రోగ్రెస్ కార్డు ఇచ్చాడు.


దాన్ని చూడగానే చెమటలు పోసిపోయాయి, ఉజ్వలకు. కూర్చుని ఏం మాట్లాడలేదు.


“నీ బంగారు భవష్యత్తు కోసం ఏవైనా చెయ్యడానికి సిద్దంగా ఉన్నాము. నీచేత చదువు చెప్పించుకోడానికి కాదు. అదీ చెడిపోతున్న పనికిమాలిన పదమూడేళ్ళ తిరుగు బోతు దగ్గర !!! ” అన్నాడు ఆమెను సూటిగా చూస్తూ పరంబాబు.


“నేనేం చెడిపోలేదు. మొన్న మనసు బాగాలేక పరిక్షలు సరిగా రాయలేదు.”


భార్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ” నువ్వు ఏమయినా కష్ట పెట్టావా? తిట్టావా ఇంటికి త్వరగా రావడం లేదని, డబ్బులకు ఇబ్బంది పెట్టావా?” అని ఉజ్వలను చూసి, “వీధిలో ఎవరైనా ఏదైనా అని ఉంటె మాకు ఉంటే మాకు సంబంధం లేదు. ఎందుకు ఇవన్నీ, రేపటినుంచి ఇంట్లోనే ఉండు, చదువు వద్దు. జీవితాన్ని చట్టుబండలు చేసుకోవద్దు. పాపం ఎన్ని కష్టాలో?” గట్టిగా అన్నాడు.


“వాట్?” నమ్మలేనట్లు చూస్తూ కోపంగా అడిగింది ఉజ్వల.


“అవును.నువ్వు చదువు కోకుండా ఊరిమీద తిరుగుతూ, డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ లెక్కలేకుండా, మీ అమ్మను పనిమనిషిగా చూస్తూ, నీ పర్సనల్ మావి కాదని, ఈ వయస్సులోనే మాట్లాడం నేర్చుకునేందుకు, మర్యాద తెలియని చదువు చదవాల్సిన అవసరం లేదు.


రేపటి నుంచి ప్రైవేటు ఇంట్లోనే పెట్టిస్తున్నాను. నీకు ఏం కావాల్సిఉన్నా మీ అమ్మ ఇష్టంతోనే జరుగుతుంది” నిర్మొహమాటంగా ఉజ్వల కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ చెప్పాడు.


తన కళ్ళల్లోకి చూడలేక, తలొంచుకుని కోపంతో రగిలి పోతున్న ఉజ్వలను చూసి "అర్ధం అయ్యిందా ? అర్ధం చేసుకో. మమ్మల్ని చంపకు, భవిష్యత్తును బజారులో పెట్టకు.


మామీద ఏ మాత్రం గౌరవం ఉన్నా, నీకున్న ప్రేమ నిజమైతే, మేం నీ తల్లిదండ్రులం, నీ భవిషత్తు కోసమే మేము బ్రతికి ఉన్నామని నమ్మకం ఉంటే తప్పక నీ పద్ధతులు మార్చుకుంటావు” దృఢంగా నిశ్చయంగా కూతురు వైపు చూస్తూ చెప్పాడు.


అంతే, విసురుగా లేచి ఏడుస్తూ చేతిలోనివి విసిరి కొట్టి, పరుగుమీద పైకి వెళ్ళిపోయింది.


ఉదాత్తమ్మ ఆత్రుతగా ” ఏవండి అదేమన్నా చేసుకుంటుందేమో?” అంది మేడపైకి చూస్తూ.


‘నువ్వేగా చెప్పావు కర్మకాండలు చేస్తానని. ఏమయినా చేసుకొనీ గట్టిగా చెప్పండి అని”


“అన్నాను” తటపటాయిస్తూ”పెంకి పిల్లండి. తొందర ఎక్కువ ఏమైనా ..?” భయంగా భర్తను చూస్తూ అంది.


ఆమె ప్రేమను,తపనను చూసి, తల్లిమనసు, పాశం చావదు అని అసంతృప్తిని దిగమింగుకుంటూ ,”నాకు లేదా ?” నేరుగా ఆమె కళ్ళల్లోకి చూసి అన్నాడు.

“పోనీండి, దాని ఇష్ట ప్రకారమే వదిలెయ్యండి. మన అదృష్టం బాగుంటే మారుతుంది” అంటూ కన్నీళ్ళు తుడుచుకుంది.


అది చూసి దగ్గరకు తీసుకొని,” ఈ మొహమాటం, మమకారం వలనే పిల్లలు చెడిపోతున్నది.


”ధృతరాష్ట్రుడు దుర్యోధనుని మీద మమకారం వలనే కురువంశం సర్వనాశనం అయ్యింది .


పిచ్చిదానా, జీవితాన్ని అమితంగా ప్రేమించే వాళ్ళు ఇలాంటి తల్లిదండ్రుల్ని,ఇంత డబ్బుని కాదని పిచ్చి పనులు చెయ్యలేరు. వెళ్లి పిలిచిరా!!” అన్నాడు.


వెళ్ళొచ్చి “తలుపులు వేసుకోనుందండి. కిటికిలోనుంచి చూస్తే ముసుగేసుకుని పడుకోనుంది. పిలవాలంటే భయంగాఉంది” అంది.


ఎడతెరిపిలేని ఆలోచనలు. మరీ ఈ “పదో తరగతి ప్రేమ” “ముద్దు ఇవ్వవా” “అక్కడ చూపించవా” “బావా రెచ్చిపో” ఇంకా ఎన్నో, యువతను తప్పు దారిన ఆలోచింపచేసే దరిద్రపు సినిమాలు తీసి, తల్లిదండ్రుల్ని ముంచటం.


లేచిపో, రెచ్చి పోవటాలను హీరోయిజంగా,త్యాగంగా చూపించి ఎంతమంది చిన్నారుల భవిష్యత్తును తప్పుదోవను పట్టిస్తున్నారో, జీవితాలను సర్వనాశనం చేస్తున్నారో అని ఆలోచించడమే లేదు ఈ క్రియేటివ్ మేధో సపంన్నులు.


అడుక్కోవడం,కడుపుతెచ్చుకోవడం, ఉరేసుకోవడం,ఉమ్మేయించుకోవడం, కొంపలు సర్వనాశనం కావటం చూపించరు, దాచిపెట్టేస్తారు.


ఎలాంటి సంస్కారం, ఎలాంటి క్రియేటివిటీ, ఏవిటీ సందేశం? సామాజిక బాధ్యత లేదా? యువతలో కలిగే వికృతపు ఆలోచనలన్నీ సబబు, ఆచరించదగినవి అని ఉద్భోధ చెయ్యడం ఏవిటి? డబ్బుకోసం ఏవిటి ఈ కక్కుర్తి.? ఇన్ని దరిద్రపు ఆకర్షణల నుంచి ఎలా కాపాడాలి ఈ బలహీనులను, బానిసత్వపు వ్యక్తిత్వమున్న యువతను.


ఏం చెయ్యాలి, ఎలా మార్చాలి? ఇదేనా భావ స్వాతంత్రం? పెట్రోలు పోయకనే తగలబడే వయస్సులో, ఉచితంగా అగ్గిపుల్లలు ఇవ్వడం ఏవిటి? కనీసం సంస్కరించక పోయినా చెడపకుండా ఉండే బాధ్యత వాళ్ళ మీద ఉంది. అది మరిచి పోతే వాళ్ళ క్రియేటివిటి మరుగు దొడ్లే! వాళ్ళ పుట్టుకను వాళ్ళే ప్రశ్నించుకోవాలి.

ఉజ్వల రూపం కళ్ళ ముందు నిలిచింది. ఆ బిడ్డను అంత భయంకరంగా చూసిన తరువాత భార్య బాధ పడటంలో, మాట్లాడటంలో తప్పు లేదు అనిపించింది.


నొసలు గట్టిగా నొక్కుకున్నాడు. తల చాలానొప్పిగా , పగిలి పోతుందేమో అనిపించింది. ఉదాత్తమ్మ వంటింటిలో పనులు పురమాయించి, మిద్దిమీద గది వైపు చూస్తూ భర్త దగ్గరకు వచ్చి, ఏంచేద్దాం అన్నట్లు అతన్ని చూసింది.


“చాలా సేపు అయ్యింది”అన్నాడు. భార్య వెనకాడుతుంటే పరవాలేదు వెళ్ళు అన్నట్లు ప్రోత్సహించాడు.


“అరుస్తుందేమోనండి”తప్పదా అన్నట్లు గా లేచి మెట్లు ఎక్కింది.


రూమ్ లోకి అడుగు పెట్టి పిలవగానే శివంగిలా లేచింది” నువ్వే, నువ్వే నామీద లేనిపోనివన్నిచెప్పి నాన్నను నా మీదకు ఉసిగొలిపావు.నీవల్లనే ఇదంతా!ఛీఛీ.


నీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది..పో ..పో వెళ్ళిపో నా దగ్గరకు రావద్దు” అంటూగొడవ గొడవగా అరుస్తూ చేతికి దొరికింది విసిరేయ సాగింది. వెనకన్నే వచ్చిన పరంబాబు అడ్డు నిలిచి పట్టుకున్నాడు.


“మీరు రావద్దు.ఐ హేట్ యు. ఐ హేట్ యు. గెట్ అవుట్ ఫ్రం మై రూమ్“ అంటూ మళ్ళీ విసిరేసింది. ఒక్క అరుపు అరిచాడు పరంబాబు.


దాంతో పడుకొనిపోయి పెద్దగా ఏడవటం మొదలు పెట్టింది. ఓదార్చడానికి భార్య ముందడుగు వేస్తె ఆపేసాడు.


ఉజ్వల ఏడ్చి ఏడ్చి ఉన్నట్లుండి పైకిలేచి,“నేనేం తప్పు చెయ్య,లేదు నన్ను నమ్మండి!!వాళ్ళు..వాళ్ళు,నా కార్డులు వాడుకుంటారు.


మాలో అరమరికలు ఉండవు.ప్రాణం ఇస్తారు ..!” ఇంకా ఏదో చెప్పబోయి చెప్పక, మధ్యలోనే ఆపేసింది భయంగా చూస్తూ.


వాళ్ళిద్దరూ నమ్మలేనట్లుగా తననే చూస్తుండటం ఎదుర్కోలేక పోయి, దిండుకింద తల దూర్చి మళ్ళీ ఏడవసాగింది.


“నాకు ఆమాత్రం స్వతంత్రం లేదా? అన్నీ మిమ్మల్ని అడిగి చెయ్యాలంటే నేనేమిటి? మీరు కన్నందుకు మీ మాటే వినాలా?” ఏడుస్తూనే అడిగింది ఉజ్వల.

ఉదాత్తమ్మకు కోపంతో కన్నీళ్లు పొంగుకొచ్చాయి. ఆమాటలు విని నిలబడలేక పోయింది. పరంబాబు పరిస్థితి కూడా అలాగే ఉంది. కాని త్వరగా సర్దుకున్నాడు.


“ కన్నామని, సరైన భవిష్యత్తు నీకివ్వాలని, ‘మన’ అనే మమకారం, ప్రేమ ఉండి ఏడ్చింది కాబట్టి ఇప్పుడు తప్పుడు సినిమాను ఒప్పుకుని భరించి చప్పట్లు తట్టుతున్నాము!!


మాకున్న నమ్మకాన్ని,పెంచుకున్న మమకారాన్ని, అవమానించి దుర్వినియోగం చేసుకోవడం కాదు స్వతంత్రం అంటే.


భవిష్యత్తును సరైన మార్గంలో పదిలపరుచుకోవడం. గొప్ప వ్యక్తి త్వానికి పునాదులు వేసుకోవడం.!! అవే కన్నబిడ్డగా నువ్వు ఇచ్చే బహుమతులు?


ఈ వయసే నీ జీవితంలో అతి విలువైనది, అతి ప్రమాదకరమైనది కూడా.! ఆలోచన ఉండదు ఆవేశం తప్ప. ఆ రెంటికి కాపలా కాసే బాధ్యత మాది. మేము నీకు రెండు కళ్లు. ఒక కన్నుపోతే మరో కన్ను ఉండదు. ఒకేసారి తగలబడి పోతాయి.అది ఆడ పిల్లల తల్లితండ్రులకు విధి నిర్ణయించిన శిక్ష.”


అని గట్టిగా గాలి పీల్చి తనలోని అసంతృప్తిని తరిమేసి “ నువ్వు ఎవరో మాకు తెలుసు. జీవితంలో అతి ముఖ్యమైన క్లిష్ట సంధిలో,ధర్మ కాటాలో ఉన్నావు. ఆలోచించు. మా మీద నీకు ఏ మాత్రం ప్రేమ ఉన్నా, గౌరవం ఉన్నా మేము చెప్పినట్లు నువ్వు వింటావు, అర్దo చేసుకుంటావు. అలా కాదనుకుంటే నువ్వు ఇంట్లోనుంచి వెళ్లిపోవచ్చు.”


ఉదాత్తమ్మ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. తిరుక్కుని మాట్లాడుతుందేమో అని కూతురు వైపు భయంగా చూసింది. ఏం మాట్లాడ లేదు. ఏడుస్తున్నట్లు తెలుస్తుంది.


ఉజ్వలను దగ్గరకు తీసుకుని,” నువ్వు చాలా తెలిగల దానవు, మంచి దానివి. పొరపాటున నువ్వు చిన్న చిన్న తప్పులు చేసిఉన్నా సరిదిద్దుకోగల శక్తి నీకుంది !


నీ పట్టుదల,ఆత్మ విశ్వాసం మాకు తెలుసు.మా బిడ్డవు నువ్వు!! మీ అమ్మ ఎంతగా నీ గురించి ఆలోచిస్తుందో తెలిస్తే, ఆమె కాళ్ళకు రోజూ దండం పెట్టి కళ్ళకు అద్దుకుంటావు.


ఈ అలవాట్లు ఒక్క సారి తగులుకుంటే వదిలించుకోవడం ఇంపాజిబుల్. జీవితం సర్వనాశనమైపోతుంది.. నీ జీవితంతో పాటు మా జీవితాలు అంతటితో అంతమౌతాయి.


మేము చావడం నీకు ఇష్టమా? అదే నీకిష్టమైతే చెప్పు. ఇప్పుడే చచ్చి నీకు అడ్డు లేకుండా పోతాము. నువ్వు మా బిడ్డగా కోరుకుంటున్నది అదేనా? నువ్వు ఇచ్చే బహుమతి అదేనా? ”


ఒక్క సారిగా తండ్రిని కౌగలించుకుని బోరున ఏడుస్తూ,”తప్పు అయిపోయింది నాన్న. నన్ను క్షమించండి. మీ మాట వింటాను. మీకు అప్రదిష్ట తీసుకు రాను. నేను బాగా చదువుకొని మీ కలలు నిజం చేస్తాను” అంటూ తల్లిని కౌగలించుకుని ఏడుపు ఆపుకోలేక పోయింది.


ఉదాత్తమ్మ, పరంబాబు అది చూసి కదిలి పోయారు. కన్నీళ్ళు ఆగలేదు.ఒక్కసారిగా ఉదాత్తమ్మ ఉజ్వలను తనలో దాచుకుంది.


తల్లి కూతుళ్ళు ముద్దులు పెట్టుకున్నారు. ఒకరి కన్నీళ్లు ఒకరు తుడుచుకున్నారు. తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, కౌగిలిలో ఒకటయ్యారు.

మధురానుభూతితో తను తాను మరిచిపోయాడు పరంబాబు. గడిచి పోతున్నాయి నిముషాలు, గంటలు కాని వాళ్లిద్దరూ ఆలోకం నుంచి మరో లోకంలోకి రాలేక పోతున్నారు. కన్నీటి ప్రవాహoలో నుంచి ఆనంద సముద్రంలో పూర్తిగా మునిగిపోయారు. ఇలా ఉండాలి జీవితం అనుకున్నాడు పరంబాబు.


“సరే ఇక చాలు డ్రామాలు . పద టిఫిన్ చేస్తాము”అన్నాడు వాళ్ళు ఎప్పటికి కదలరని.


“మేము మనసులో మలినంలేకుండా శుభ్రపరుచుకుంటే అది డ్రామా ! మనసులో పెట్టుకుని మగ్గుతుంటే దాన్ని ఏమంటారు ?” అడిగింది ఉదాత్తమ్మ.


“కుతంత్రం, మొహమాటం. మనో వేదన.”


“ఆత్మీయ అనురాగ బంధాలలో కుతంత్రం, మొహమాటం ఉంటే అది స్వచ్ఛమైనది ఎలా అవుతుంది”అంది ఉజ్వల.

ఆశ్చర్యంగా భార్యను చూసి ఉజ్వలను దగ్గరకు తీసుకుని నొసట ముద్దు పెడుతూ,

“నా తల్లి వజ్రాలగని .నా నమ్మకం వమ్ముకాదు.” అన్నాడు.


ఉజ్వల తండ్రిని కౌగలించుకుని”ఐ లవ్వూ డాడ్”అని పొంగుకొస్తున్న కన్నీటిని తుడిచింది.


“చాల్లే సినిమా!. పదండి” అంటూ లేచింది ఉదాత్తమ్మ .


“మమ్మీకి కుళ్ళు డాడీ.”అంటూ తండ్రిని పొదివి పట్టుకుని లేపింది ఉజ్వల.


“కరెక్టుగా కనుక్కున్నావమ్మా!” అని ఉజ్వల చెవిలో ఏదో గుస గుసలాడాడు. ఉజ్వల కూడా ఓరకంట తల్లిని గమనిస్తూ ఏదో చెప్పింది.


“ఇట్లా నామీద చెప్పే, తక్కువగా మాట్లాడే, దానికి లోకువై పోయాను” కాస్త నొచ్చుకున్నట్లు అంది భర్త వైపు చూసి.


“ సారీ మమ్మీ! క్షమించమన్నానుగా! యు ఆర్ ది బెస్ట్! డాడీ నువ్వు చాలా

బ్యూటిఫుల్ గా ఉంటావన్నాడు” అంది తండ్రి వైపు కొంటెగా చూస్తూ ఉజ్వల.


బుగ్గలు ఎరుపెక్కాయి ఉదాత్తమ్మకు. పరంబాబు ”నేను ఆ మాట..!“ అని ఉదాత్తమ్మ ముఖంలో రంగులు మారడం చూసి”నా బిడ్డ” అని మాట మార్చాడు.


“పాపం డాడీ, అమ్మ ఫస్టు. మాట మారిస్తే ఎలా? అలా అనకు”


“అంటాడు.అంటాడు.ఇలా మార్చేకదా నన్ను కాళ్ళావేళ్ళాపడి పెండ్ల్లి చేసుకుంది”


“నిజమా, కాళ్ళు పట్టుకున్నావా డాడీ?”


“లేదమ్మా! చేయి పట్టుకున్నా”


ఇలా సరసాలు ఆడుకుంటూ ఉదాత్తమ్మను కవ్విస్తూ, ఆట పట్టిస్తూ, ఆమె దీటుగా సమాధానం ఇస్తుంటే, తండ్రి కూతురు ఒక్కటవుతూ జీవితంలో మరుపురాని రోజుగా ఆ దినం గడిచిపోయింది.


ఇంతకంటే అదృష్టం ఏముంటుంది?” ఎందుకు ఈ డబ్బు, దర్పం అని సిగ్గుపడ్డాడు పరంబాబు. ఇలాంటి ఆనందమే తను బ్రతికినంతకాలం ఉండాలని ఆ దేవుడ్ని వేడుకుంది ఉదాత్తమ్మ.

ఆ రోజునుంచి పరంబాబు కూతుర్ని కౌన్సులింగుకు తీసుకెళ్ళాడు. మెడిటేషన్,యోగా చేయిస్తున్నాడు. చాలా అయిష్టంగానే తప్పదన్నట్లు చేస్తుంది. మనస్పూర్తిగా ఇష్టపడి చేస్తేనేగాని ప్రయోజనం ఉండదు. అలా చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది అని. ఎంతో చెప్పి, దారిలోకి కాస్త తీసుకు వచ్చాడు.

ఉజ్వల కాలేజికి వెళ్లి, తిరిగి వచ్చే సమయానికంటే ముందే ఇంటికి వచ్చేస్తున్నాడు పరంబాబు .


ప్రతి రోజు ఉజ్వల ముభావంగా రావడం గమనించింది ఉదాత్తమ్మ. కాని వచ్చిన వెంటనే తండ్రి కూతురు కూర్చొని హాయిగా మాట్లాడుకోవడం, తల్లి దగ్గర ముదిగారం కారుస్తూ తనకు కావాల్సినివన్ని చేయించుకోవడం మామూలు అయిపోవడం జరుగుతుంది.


పరంబాబు తన జీవితానికి ఈ వరం చాలు అని తృప్తిగా మనసులో నిర్ణయించుకున్నాడు. ఇదే తన జీవితంలో సాధించిన ఘన విజయంగా భావించుకున్నాడు, భద్రపరుచుకున్నాడు.


ఆ కౌన్సులర్ చివరిలో అన్నమాట “అమ్మాయికి హర్మోన్స్ చాలా ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. వయసు పెరిగేకొద్ది తగ్గుతాయి. అయినా వాచ్ చేస్తూ ఉండాలి.


మంచి వ్యక్తిత్వవికాసం, తాత్విక ఙ్ఞానము కలిగించే వివేకానంద స్వామి పుస్తకాలు, భగవద్గీత, యోగవాశిష్టము, వశిష్ట మహర్షి శ్రీరామునికి చెప్పిన చదువు, వ్యక్తిత్వాన్నిఎలా వృద్ది చేసుకోవాలి,గుణాలు ఎలా పటిష్టం చేసుకోవాలి, వ్యామోహాలను, వ్యసనాలను ఎలా దూరంగా ఉంచాలి అని బోధించిన గ్రంధాలు చదివితే, యువత ప్రవర్తనలో, ఆలోచనలో చాలా మార్పులు తెస్తాయి.


అవి తప్పని సరిగా చదివించండి. చాలా ఉపయోగం ఉంటుంది. కాని నేటి యువత, పెద్దలు, ప్రభుత్వం అందరూ వాటిని చదువుల్లో తప్పని సరి చెయ్యాల్సింది పోయి, వెలివేశారు. అందుకే అనుభవిస్తున్నాము. వాటి గొప్పతనం తెలిస్తే నన్ను మీరు మరోలా అనుకోరు”


విని, అవి ఈ కాలం లో చెప్పినా, వ్యక్తిత్వాన్ని గురించి ఎవరు ఆలోచిస్తున్నారు. ఎవరు చదువుతారు? రోజులు గడిచేకొద్దీ కౌన్సిలింగుతో, కూతురు ప్రవర్తనలో చాలా మార్పు కనిపించింది.

ఆ రోజు మరీ దిగులుగా వచ్చి ముభావంగా కూర్చుంది ఉజ్వల. చాలాసేపు అది ఇది మాట్లాడుతున్నా చాలా ముక్తసరిగా పొడి పొడిగా సమాధానం ఇచ్చింది. ఏదో ఉందని కూతుర్ని అలాగే కాస్సేపు చూసి ”ఎందుకు అలా ఉన్నావమ్మా, ఏం జరిగింది?”అని అడిగాడు. జవాబు లేదు. మళ్ళీ మళ్ళీ అడిగాడు.


“ఏం జరగలేదు డాడీ. ఏంలేదు. మనసు ఏదోలా ఉంది” అంది. బాధను అణుచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. ఆత్రుత ఎక్కువయ్యింది.


అప్పుడే వచ్చి వాళ్ళిద్దర్నీ గమనిస్తూ నిలుచున్న ఉదాత్తమ్మ వైపు చూసాడు.


ఆమె కూడా అర్ధంగానట్లు ఇతని కళ్ళల్లోకి చూసింది. ఉజ్వలను దగ్గరగా తీసుకున్నాడు.


అంతే తండ్రిని పట్టుకుని ఆపుకోలేనంతగా ఏడుస్తూ ”చూడు డాడీ వాళ్ళు నా ఫ్రెండ్సు నన్ను తప్పించుకు దూరంగా వెళ్లి పోతున్నారు. నేను పీనాసి దాన్ని అంట, కల్చర్ తెలియదంట, వాళ్ళతో పబ్ లకు రావడం లేదంట, రియల్ స్నేహితురాల్ని కాదంట” అంటూ ఒడిలో తల దాచుకుంది.


ఆమె తలను ఎత్తి కళ్ళనీళ్ళు తుడుస్తూ” ఎన్నికష్ట్టాలలోనైనా తోడు ఉండే వాళ్ళు స్నేహితులు. నీడబ్బు, సోషల్ స్టేటస్ చూసి నీతో తిరిగేవాళ్ళు ఎప్పటికి స్నేహితులు కాలేరు. వాళ్ళు అవకాశ వాదులు. వాళ్ళను గురించి ఇంతగా భాదపడటం పిచ్చి, తెలివి తక్కువతనం! నీచులని మరిచిపో!” అన్నాడు.


“ఎలా డాడీ! ఇంతవరకు మా ప్రాణం ఇస్తామని ప్రామిస్సులు చేసిన వాళ్ళు, యిప్పుడు ఇలా చెయ్యడం తట్టుకోలేక పోతున్నాను. వాళ్ళు నన్ను తక్కువగా, అంటరానిదానిగా చూడడం నేను సహించలేక పోతున్నాను”


“వాళ్ళు చాలా తక్కువ బుద్దులున్న వారమ్మా! శని వదిలింది అనుకోక భాధ పడతావు ఎందుకు? అలాంటి వాళ్ళు చాలా ప్రమాదం. ఆపదలోగాని , కష్టాలలో గాని, గడ్డు పరిస్థితుల్లోనైనా కంటికీ రెప్పలా తోడుండే నీ కోసం నిలబడే వాళ్ళే నిజమైన స్నేహితులు.


వీళ్ళను గురించి మాట్లాడటం సిగ్గు చేటు, అసహ్యం వేస్తుంది.!” అంది చీదరించుకుంటూ ఉదాత్తమ్మ.


వాళ్ళు నిజమైన స్నేహితులు కాదు అని చెప్పి వప్పించడానికి, తృప్తి పరచడానికి చాలా శ్రమపడాల్సి వచ్చింది తల్లితండ్రులకిద్దరికి. ఇకనెప్పుడు అలాంటి వాళ్ళతో స్నేహం చెయ్యనని మాట ఇచ్చింది.. ఆరోజు నుంచి సంతోషంగా గడిచి పోసాగాయి రోజులు.


చదువు ఎలా చెయ్యాలి? ఇలాంటి కాలేజీ వాతావరణంలో ఉంటె మళ్ళీ తప్పు దోవనపడే అవకాశం చాలా ఎక్కువ. ఆ ఆకర్షణను ఎదురించడం చాలా కష్టం.


ఇంకెక్కడైనా మంచి వ్యకిత్త్వ వికాసాన్ని, మంచి చెడులు ఆలోచింప చేసే ఆత్మవిశ్వాసాన్ని, కష్టాలను, ప్రలోభాలను తిరస్కరించే ధైర్యాన్ని కనువిప్పును కలిగించే పాఠాలు చెప్పే కాలేజీలో చేర్చాలి.


మతపరంగా ఉండకూడదు. అయినా ఏ మతం అయితే ఏవిటి మానసిక ఉన్నతిని ప్రబొధించేవి. ఆలోచిస్తూనే ఉన్నాడు.


ఈలోగా మంచివాడ్ని ట్యూషన్ టీచరుగా పెట్టాలని. చివరకు తనకు బాగా తెలిసి,తను వృద్దిలోకి తీసుకొచ్చి, తానంటే గౌరవం భయం ఉన్న తెలివిగలవాడు, సంస్కార వంతుడు అని నమ్మకం కుదిరిన, ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఖాళీగా ఉన్న జగత్ గురు అనే అబ్బాయిని ఏర్పరిచాడు.


ఎలాగైనా ఆ అమ్మాయిని దారికి తీసుకు రమ్మని ఉజ్వల విషయాలన్నీ చెప్పి దీనంగా అడిగాడు.తప్పక ఆ అమ్మాయి ఆలోచనా విధానం మార్చడానికి ప్రయత్నిస్తానని, చదువు మీద మనసు మళ్ళేటట్లు చేస్తానని,అలాగయినా మీ ఋణం కాస్తయినా తీర్చుకుంటానని మాట ఇచ్చాడు, జగత్ గురు.


ముందు నాకొద్దు నాకొద్దు అంటున్న ఉజ్వల జగత్ ను చూడగానే ఒప్పుకుంది. ట్యూషన్ మాస్టారు ఇలా సినిమా హీరోలా ఉంటాడని కలలో కూడా అనుకోలేదు.


ఈ మాటలేకదా తన స్నేహితులు ప్రొద్దస్తమానం మాట్లాడేది. బూతు బొమ్మలేకదా చూసేది. అదేకదా చదువు. అతన్ని చూడగానే తెలియని అభిమానం, పూర్వ జన్మ బంధం ఉన్నట్లు అనిపించింది.


అతని రూపు మాటలుచదువు చెప్పే విధానం నచ్చి, దాసోహం అయిపోయింది.

అతని పరిచయంతో చాలా సంతోషంగా ఉండటం గమనించారు పరంబాబు, ఉదాత్తమ్మ.


ఉజ్వలను చూసి ఈ అమ్మాయికి పదమూడేళ్లా , పదహారేళ్ళ పడుచు పిల్లగా కళ్ళు చెదిరిపోయేటట్లు, ఎక్కడలేని సొగసుతో వరూధినిలా మెరిసిపోతుంది అనుకున్నాడు జగత్. భాష మీద మక్కువతో డిగ్రీలో తెలుగే చదివాడు. అమిత చురుకైన వాడు కావడం మూలంగా అన్నింటిలోను ప్రావీణ్యత సాధించగలిగాడు.అందుకే పరంబాబు చేరదీసాడు.


వారం రోజుల్లోనే ఈ అమ్మాయికి చదువు మీద మనసు లేదు. మరేదో కావాలని తెలుసుకున్నాడు. భయం వేసింది. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఉజ్వలను మంచిగా మాటలతో చదువు మీదకు మళ్ళించాడు.


కానీ ఉజ్వల చొరవ చాలా ఇబ్బంది కలిగించేది. చదువుకు ఇక్కడ చాలా డిస్ట్రబెన్సు గా ఉందని ఉజ్వల తండ్రితో చెప్పి హల్లోనుంచి కార్నర్ గదిలోకి మార్చింది.


ఆ రోజునుంచి తన అందాన్ని గురించి, అవయవాల గురించి తెలిసి తెలియనట్లు వర్ణిస్తూ, రెచ్చగొట్టినట్లు చెపుతూ యిబ్బంది పెట్టేది. తన అందాన్ని,అంగ సౌష్టవాన్ని బాహాటంగా చూపించుకోవడానికి ప్రయత్నించేది.


చాలా కష్టంగా,ఎబ్బెట్టుగా ఉండేది జగత్ కు. ఇన్ని విషయాలు ఈ వయసులో ఎలా తెలుసా అని ఆశ్చర్య పోయేవాడు. చివరకు కోప్పడ్డాడు, రానని బెదిరించాడు. నీ ముఖం జన్మలో చూడనన్నాడు. అప్పటికి కాస్త తగ్గింది.


మూడు నెలలు గడిచిపోయాయి తన ప్రవర్తనలో మార్పు రాకపోయినా చదువును అశ్రద్ద చేసేదికాదు. పరీక్షలు చాలా బాగా రాసింది. మంచి మార్కులు వచ్చాయి. పరంబాబు, ఉదాత్తమ్మ చాలా సంతోషించారు.


ఆమె ఏకసంథాగ్రాహి. ఎంత కష్టమైనదైనా అతి తేలిగ్గా నేర్చుకుంటుంది. చదువులో ఎంత ఎత్తుకైనా వెళుతుందని అభిప్రాయ పడ్డాడు జగత్.


కానీ విపరీతమైన మానసిక చాపల్యం, భయంలేని ప్రవర్తన, మాట, ఆధునిక ఆకర్షణలు మీద పిచ్చి, ఆమె జీవితాన్ని నాశనం చేస్తాయేమోనని అనిపించింది.


ఆమె ప్రవర్తనతో నరకం అనుభవిస్తున్నట్లు, బోనులో పడ్డ ఎలుకలాగా చాలా ఇబ్బందిగా అనిపించేది జగత్తుకు.


ఉజ్వలకు జగత్ రావడం కాస్త ఆలస్యమైనా నిలవలేక, ఫోనుల మీద ఫోనులు. వచ్చిన వెంటనే సంజాయిషీలు చెప్పమనేది. లేదా తనే స్కూటీ వేసుకుని తను ఉన్న దగ్గరకు రావడం మరీ యిబ్బందిగా అనిపించేది జగత్ కు.


ఉజ్వలను అక్కడికి రావద్దని చాలా గట్టిగా చెప్పాడు..

“మరి నేను నిన్ను చూడకుండా ఉండలేకున్నాను. పిచ్చి పట్టి పోతుందే”


“తరాలు అంతరాల తారతమ్యాలు లెక్క చెయ్యని వయసు నీది. ఇలాంటి ఆలోచన ప్రవర్తన నీ తల్లిదండ్రుల ఆశలన్ని తగల పెడుతుంది.


ఈ సంఘం నిన్ను చాలా తక్కువగా చూస్తుంది . నీ తల్లిదండ్రులకు చాలా అప్రతిష్ట తెస్తుంది. నా తోబుట్టువులా చెపుతున్నాను. ఇలాంటి పిచ్చి చేష్టలు చెయ్యకు.”


“నీతులు వినడానికి కాదు నిన్ను ప్రేమిస్తున్నది. ఆరాధిస్తున్నది.!” అవమానంతో కోపంతో కళ్ళు ఎరుపెక్కాయి ఉజ్వలకు.


ఆ పిచ్చి మాటలకు“దీన్ని ప్రేమ అనరు, కామం అంటారు.మద పిచ్చి అంటారు. ఆరాధన కాదు, మగ పురుగులకోసం కక్కుర్తి, అడుక్కుతినడం అంటారు!!


చిన్నదానివి, అన్ని ఉన్నదానివి. క్షణికమైన తప్పుడు కోరికలు దూరం చెయ్యి.లేకుంటే జీవితం సర్వనాశనం అవుతుందని తెలుసుకో” కోపాన్ని అణుచుకోలేక గట్టిగా అరిచాడు.


“హూ కేర్స్ . నా జీవితాన్ని ఎలా నడుపుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వుంటే నాకు ఏది కనిపించదు. నీ దగ్గర ఉన్నప్పుడు నాలో ప్రణయ ప్రకంపనలు అణచుకోలేక పోతున్నాను.


నన్నుకాదనకు, అవమానించకు. నీకు ఏం కావాల్సి ఉన్నా ఇస్తాను. నా ప్రాణం కూడా” అని పై పైకి వస్తున్న ఉజ్వలను దూరంగా తోశాడు జగత్.


అంతే ఒక్కసారిగా పిచ్చిపట్టినట్లు అరుస్తూ తలంతా చెరుపుకుని, రవిక చింపుకుని ఏడుస్తూ “నన్ను ఇంత అవమానిస్తావా,చూడునిన్ను ఏం చేస్తానో” అంటూ విషం చిమ్మింది.


జగత్తుకు భయంవేసింది.ఒక్క క్షణం ఏం చెయ్యాలో పాలుపోలేదు. అయినా మనసు ఎదురు తిరగమంది.


“ఏం చేస్తావో చెయ్యి. రేప్ చేశాడని పదిమందికి తెలిస్తే, మరు క్షణంలో నీ తల్లి తండ్రులు ఉరేసుకుని చస్తారు.


నిన్ను పేపర్లో వేసి దేశమంతా అగుడు చేస్తారు. నీకు పెళ్లి కాదు. వ్యభిచారిగా బ్రతకాల్సిందే. బ్రతుకు కుక్కలు చింపిన విస్తరి అవుతుంది.


నీ డబ్బు కొంతకాలమే అడ్డుకుంటుంది. తరువాత అందరూ నీపై ఉమ్మేస్తారు. సిగ్గు లేకుండా అంత నీచంగా బ్రతికాలనుకుంటే చెయ్యి.


వెళుతున్నాను. నీ ముఖం ఎన్ని జన్మలకైనా చూడను అసహ్యం వేస్తుంది. మీ కులపోడిని కాక పోయినా నా వ్యక్తిత్వం మీద నాకు ప్రగాఢ నమ్మకం ఉంది.


వెళ్ళు... వెళ్ళు. వెళ్లి చెప్పు” అంటూ కోపంగా అరిచాడు జగత్.


అంతా మరిచి పోయినట్లు లేచి వచ్చి“ నీ కులం సంగతి కాదు, నీ మగతనాన్ని గురించి.” చేతులు పట్టుకుంది.


దూరంగా తోసి, “యు అర్ ఏ సెక్సు మానియాక్” చీదరించుకుని నిలవక వడివడిగా వెలుపలికి వచ్చేసాడు.

ఎదురుగా ఉదాత్తమ్మ!! భయం వేసింది. ఆమె ముఖంలోకి అయోమయంగా చూసి విసురుగా వెళ్ళిపోయాడు.


ఉదాత్తమ్మ వెళ్తున్న అతని వాలకం చూసి అనుమానంగా రూములోకి చూసింది. తల విరబోసుకుని కుప్పలా కూలి పోయి ఉన్న ఉజ్వలను గమనించి, ఏదో జరగరానిదే జరిగుంటుందని తలపు రాగానే గుండె అదిమివేస్తుంటే నిస్సత్తువగా నేల మీద కూర్చునేసింది. చెమటలు పట్టాయి.


కూతురు లేచి విసురుగా బయటకెళ్ళి, స్కూటీని స్టార్టు చేసిన శబ్దంతో ఈ లోకంలోకి వచ్చి, బయటకు పరుగెత్తి, ”ఉజ్వల ఎక్కడికి? పొద్దు పోయింది. వాన వస్తుంది ఆగు.” అని అరుస్తున్నా లెక్క చెయ్యక స్పీడుగా పిచ్చిగా వెళ్లిపోయింది.


ఏం చెయ్యాలో తోచలేదు . తల పగిలిపోతూ ఉంది. మనసులో అదుపుచెసుకోలేని అలజడి. ప్రపంచం కనుమరుగైపోయింది.


ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? శరీరమంతా వణికి పోతుంది. కళ్ళల్లో నీరు జడివానలా కారి పోతున్నాయి. భర్తకు ఫోను చెయ్యాలని బలవంతంగా తీసుకుంది.


కానీ బాధ్యత మీద, బంధం మీద కనీసపు విలువలేని కూతురు అవసరమా అనే ఆలోచన...? చెరిపించుకోనీ కుక్కల చేత, తెచ్చుకొనీ కడుపు, నా బిడ్డగా వస్తేనే ఈ ఇంటిలో, హృదయంలో చోటు.


లేకుంటే శవాన్ని తెచ్చుకుంటా! కన్నీటి చుక్కలు వ్యక్తిత్వం లేని వెధవల కోసం దండుగ చెయ్యను.


ఫోను దూరంగా పారేసింది. డబ్బు ఉందని సాంఘిక నియమాల్ని, సమాజ సంప్రదాయాల్ని చులకన చేసినా అధిగమించినా, ఎంతటి వారైనా తిరుగులేని శిక్ష అనుభవించాల్సిందే!


నా పెంపకంలో ఎక్కడ లోపం? నా జీవితంలో ఎందుకీ అపశ్రుతి.? గుండెలు బ్రద్దలవుతుంటే, కన్నీరు వరదలా ప్రవహిస్తుంటే ఏదో అలికిడికి తిరిగి చూసింది.


మొక్కై వంగనిది మానై వొంగుతుందా? నైతిక పతనం, నడిమంత్రపు సిరి, భగ భగ మంట. అందులో ఎగిరి దూకుతున్న నవ నాగరిక యువత.

***సమాప్తం***

రచయిత ఇతర రచనలు :


రచయిత పరిచయం : డా.కనుపూరు శ్రీనివాసులు రెడ్డి..

నమస్తే !

నా కధ ప్రచురణకు నోచుకున్నందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు నా గురించి గొప్పగా ఏమీ లేదు. సాహిత్యం అంటే మక్కువ. ప్రయోగాలు చెయ్యాలని అభిలాష.

చాలా సంవత్సరాల ముందు కధలు రాసేవాడిని. అన్నీ కూడా ఆంధ్రప్రభ, ఆంద్ర జ్యోతిలలో ప్రచురితమైనవి. కొన్ని కారణాల వలన సాహిత్యానికి దూరం అయినాను. 2010 నుండి నవలలు, భావకవితలు రాయడం మొదలుపెట్టాను..మరో హృదయం-మరో ఉదయం{నవల} ,గీతాంజలి అనువాదం, నీకోసం అనే భావకవిత్యం, చీకటిలో మలివెలుగు {నవల} ప్రచురించడం జరిగింది.


168 views0 comments

ความคิดเห็น


bottom of page