top of page

నిర్దోషులు నీరాజనాలు

గమనిక : ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సంక్రాంతి 2021 కథల పోటీలో ప్రత్యేక బహుమతి గెలుచుకుంది. ఎంపికలో పాఠకుల అభిప్రాయం కూడా పరిగణనలోకి తీసుకున్నాం.

'Nirdoshulu Neerajanalu' written by Dr. Kanupuru Srinivasulu Reddy

రచన : డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి

“ తాతయ్య దగ్గరకు వెల్దామమ్మా !”గంట సేపటినుంచి అంకిత, ఆదర్శ్ నానా గొడవ చేస్తున్నారు.

పిల్లలిద్దరి వైపు చిరుకోపంతో చూసింది స్ఫూర్తి. ముద్దొచ్చారేగానీ, కోపం రాలేదు.

“ వెల్దామమ్మా! తాతయ్యకు పనులుంటాయికదా! ఇబ్బంది పెట్టినట్లు

అవుతుంది. సాయంకాలం వెళదాం.” అనునయిస్తూన్నట్లుగా చెప్పింది స్ఫూర్తి.

“ అయిపోయింది… అయిపోయింది సాయంత్రం!! అక్కవచ్చేసిందిగా!” అంటూ

వాళ్ళమ్మ చేతులు పట్టుకుని ఎగరడం మొదలు పెట్టాడు, ఇంకా మాటలు సరిగా రాని

బుడతడు ఆదర్శ్ . నవ్వుకుంది స్పూర్తి . వాళ్ళ అక్క స్కూలుకు వెళితే ఉదయం, వస్తే

సాయంకాలం...వాడి లెక్క.

పదే పదే అడుగుతూ గొడవ చేస్తున్న వాళ్ళతో ,” సరే సరే...నాన్నను రానివ్వండి.”అంది.

అడ్దుగా వచ్చి కోపంగా చూస్తూ నిలబడ్డాడు ఆదర్శ్ . చిరుకోపంతో చూసి ప్రక్కకు నెట్టింది.

“ప్లీజ్..ప్లీజ్.” అంటూ కాళ్ళు గట్టిగా పట్టేసాడు.

“మనం వెళ్లిపోదామమ్మా ! నాన్నను అక్కడికే రమ్మని ఫోను చెయ్యి.” అంటూ బ్రతిమలాడసాగింది అంకిత.

“ నాన్న స్నేహితులు వస్తారట , చూసుకొని...!

“వాళ్ళని రావద్దని చెప్పు ...ముందు తాత.” అని మద్యలోనే అడ్డు తగిలింది అంకిత.

అప్పటి వరకు కాళ్ళు వదలని ఆదర్శ్ వదిలి,” తలుపులు వేసేస్తా.”అంటూ వాకిలి వైపు పరుగు తీసాడు.

“మీ నాన్న వస్తాడురా ! తలుపులు వెయ్యకు.” చిరుకోపంతో వారిస్తూ అంది స్ఫూర్తి.

“ముందు తాతయ్య దగ్గరకు వెళ్ళాలి. తరువాతనే నాన్న.” ఇద్దరు కూడా పలుక్కునట్లు అన్నారు.

ఆశ్చర్యంగా వాళ్ళవైపు చూసి విస్తుపోతూ,” నాన్న కంటే తాతయ్యే ముఖ్యమా మీకు?” అడిగింది.

ఏ మాత్రం బయపడకుండా,” అవును. నువ్వు కూడా వద్దు.” ఆన్నాడు వీరుడి పోజుపెట్టి ఆదర్శ్ . ఆ నిలుచున్న తీరుచూసి, మమతల మందలింపు, మనసును చిరునవ్వుతో నింపింది. పెల్లుబికిన మురిపెం, కోపాన్ని ఆహ్లాదంగా మార్చింది. ఎంత ముద్దుగా ఉన్నాడో!? అంటూ చిరునవ్వు పలకరించింది స్ఫూర్తి పెదవుల్ని.

ఇద్దరూ కూడ పలుక్కున్నట్లు, నేరుగా దేవుడి గది దగ్గరకు వెళ్లి చేతులు జోడించి, కళ్ళు మూసుకొని కాస్సేపు ప్రార్ధన చేసి తిరిగొచ్చి. వాళ్ళమ్మ వైపు లెక్కలేనట్లు చూసి,

" చెప్పేసాం..చెప్పేసాం. దేవుడు వచ్చి,నిన్ను ఏంచేస్తాడో చూస్తుండు..” ధీమాగా కూర్చున్నారు.

అది చూసి ఆశ్చర్యాన్ని అదుపు చేసుకుంటూ చిరునవ్వుతో ,” నేను మీ అమ్మనురా!” అంది.

“అయితేనేం. తాతయ్య కంటేనా? నీకు దెబ్బలు తప్పవు.” మూతి ముడుచుకొని ముద్దుగా, నిరసనగా, ఎదురుగా నిలుచున్నారు. ముక్కు మీద వేలేసుకుని ఏదో అనబోయేలోగా, వేణు తలుపులు తీసుకొని లోపలి వచ్చి, భార్యా పిల్లల్ని చూసి,” ఏవిటి యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. చాలా భీకరపోరాట జరిగిపోయిందా, జరగబోతుందా? ” అంటూ బుడతడ్ని ఎత్తుకోబోయాడు. ఆదర్శ్ దూరంగా జరిగి అలిగినట్లు కోపంగా వాళ్ళ అమ్మ వైపు తండ్రి వైపు చూసాడు.

“చూడండి వీళ్ళు ఎంత పెద్దవారయిపోయారో ! మనిద్దరం వద్దంట...వాళ్ళ తాతయ్యే కావాలంట. ప్రాణం తీస్తున్నారు.”

“వెళదాం!” అని ఇద్దరినీ దగ్గరకు తీసుకున్నాడు. ఆ మాటతో ఎగిరి గంతేసి తండ్రికి ముద్దులు పెట్టేసారు. వాళ్ళను దూరంగా తీస్తూ," కాస్సేపయిన తరువాత.” హెచ్చరించినట్లు అన్నాడు.

దూరంగా వెళ్ళిపోయి అలిగి,” కాదు. ఇప్పుడే వెళ్ళాలి ” అని చిందులు వెయ్యడం మొదలెట్టారు.

“ మీరు మంచిగా ఉంటేనే సాయంకాలం. లేకుంటే అదీ లేదు.” అంటూ లేచి వెళ్లి సోఫాలో కూర్చున్నాడు. ఇంతలో స్పూర్తి కాఫీ తీసుకొని వచ్చి, ఇచ్చి పిల్లలు ముఖాలు ముడుచుకు

కూర్చోనుండటం గమనించి,

”తీసుకు వెళతానన్నారు కదా! తాతయ్య ఏంచెప్పాడు...పెద్దల మాటలు వినమని కదా!! పని అయిపోగానే నేనూ వస్తాను.” అంది స్పూర్తి .

ఆ మాటతో పిల్లలిద్దరూ ఒకరి మఖాలు ఒకరు చూసుకుని ఏదో గుర్తొచ్చినట్లు లేచొచ్చి, తండ్రి చేతులు పట్టుకొని, “ క్షమించండి నాన్నా! అలాగే మీరు చెప్పినట్లు వెళదాం.” అన్నారు.

ఆశ్చర్యంగా భార్య వైపు చూసాడు . స్పూర్తి నా బిడ్డలు అన్నట్లుగా గుండెల మీద చెయ్యి వేసుకుంది.

“ ఇదెవరు చెప్పారు, అమ్మనా!”

“ కాదు.తాతయ్య!! ఎవరి మనసు కష్ట పెట్టినా కమ..కమ అడగాలి అని.” సందేశ్ కు ఆ పదం సరిగ్గా రాలేదు, అంకిత సరిచేసింది, క్షమాపణ అని..

ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న వాళ్ళను చూసి మురిసిపోతూ,” క్షమించేసాను.

వెళ్లి ఆడుకొండి. అమ్మ పని కాగానే వెళదాం.” ఆన్నాడు వేణు ముద్దులు పెట్టి పంపించాడు.

స్ఫూర్తి వాళ్ళు వెళ్ళిన వైపే చూసి భర్త ను చూస్తూ,” వీళ్ళు తాతయ్య తాతయ్య అని మరీ పిచ్చిగా తపన పడి పోతున్నారు..” అంది.

“నీకు లేదా ? నన్ను కూడా మరిచి పోయి మా నాన్న... బాబాయికి ఇది ఇష్టం, అది తీసుకెళదాం, అని ప్రాణాలు తీస్తున్నావు కదా.”

“ ఆ పిచ్చి పట్టించింది ఎవరంట.?”

“ఇలా అని తెలిసివుంటే చెయ్యకనే ఉందును. ఇప్పుడు నా నెత్తికి తెచ్చు కున్నాను. నాకోసం ఎప్పుడైనా అంత తపించావా?” కవ్విస్తున్నట్లు చూసాడు వేణు.

“మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే!! పూర్తిగా లోబరుచుకొని మీ ప్రేమ సంకెళ్ళతో బంధించి బానిసను చేసుకున్నారు కదా! మీ హృదయ సంగీతంతోనే కదా నా మనసు నాట్యమాడుతుంది.” భావగర్భితంగా వయ్యారంగా నిలుచుంది స్ఫూర్తి,

చారడేసి కళ్ళను రెపరెపలాడిస్తూ. “ పరవాలేదు.కవిత్వం పొంగుతుంది.” చిరుగాలి మదిలో ప్రణయ తుంపరులు కురిపించింది వేణుకు.

“ ప్రేమ పొంగితే కవిత్వం జీవన రాగమౌతుంది .”

ఆ మాటలకు, చూపులకు, హృదయం చిలిపిగా కవ్వించింది. గబుక్కున పట్టుకొని ఆశ్చర్యంగా,” ఎక్కడ నేర్చావు నెరజాణా.” అంటూ దగ్గరకు తీసుకున్నాడు వేణు . వదిలించుకుంటూ ,”సాంగత్యం.” అంటూ చిలిపిగా నవ్వి లోపలికి వెళ్ళింది స్ఫూర్తి.

ఉరకలు వేస్తున్నమనసు ఆమెను వెంటాడినా, ఆగు అని అడ్డుతగిలింది పిల్లల ఆలోచన.

'ఆదిలోనే కట్టడి చెయ్యక పోతే... ఆయన దూరం అయితే...ఛీ ఏవిటిది?

అపశకునం.! 'స్పూర్తితో ఈ విషయం మాట్లాడాలని పిలిచాడు.

నవ్వుతూ, చేతులు తుడుచుకుంటూ వచ్చి” ఏవిటి చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరా?” కొంటెతనాన్ని కలిపి అంది.

“అంత మత్తు చల్లావు మరి!”

భర్త ముఖంలో మత్తుగాని, వలపుగాని కనిపించలేదు. చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు, కంటి చూపు కనుబొమలు చెపుతున్నాయి. దగ్గరగా వచ్చి కూర్చొని, చేతులు వడిలోకి తీసుకుని, "అంత పెద్ద సమస్య ఏవిటండి.అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు?.”అంది.

“పిల్లలకు మరీ ఆయన ద్యాసే ఎక్కువ అయిపోయింది!”

“ఇంకా మంచిదే కదండీ, ఈ కాలపు పిల్లలు ఎలా ఉన్నారు? ఈ నవీన నడి మంత్రపు సిరి తల్లులు, మూడు నెలలనుంచే సెల్ ఫోన్లు, వెస్ట్రన్ మ్యూజిక్ పెట్టి, మెడకు తగిలించి, తమ పనులు చేసుకుంటున్నారు. ఆ పిల్లలు, అతిగా, ఓవర్ యాక్టీవ్ గా తయారవుతున్నారు. బిడ్డ సేల్ఫోనుతో ఆటలాడితే, తల్లి మురిసి ముక్కలవుతుంది. టీవిలో చూసి, కోతి డాన్సులు వేస్తే పగలబడి ముద్దులు కురిపిస్తుంది.. పిల్లలు, దానికి బానిసలవుతున్న సంగతి ,ప్రక్కకు నెట్టేస్తున్నారు. అదొక గొప్పగా, పదిమందితో చెప్పుకుని గర్వంతో ఉబ్బిపోతున్నారు. ముందుంది ముసళ్ళ పండుగ, చూపిస్తారు పోరంబోకులై నరకం, అనే సంగతి మరిచి పోతున్నారు. మన

పిల్లలు వాటి జోలికే పోరు.అయన మాట వేద వాక్కు.ఆయన కనుసన్నలలో, మంచి వ్యక్తిత్వంతో పెరిగి ప్రయోజకులవుతారు. అంతకంటే ఏ తల్లిదండ్రి కోరుకునేది ఏముంటుందండి.” భయపడవద్దు అన్నట్లు అతని చేతుల్ని చేతిలోకి తీసుకుని, మెల్లగా, అనునయంగా నిమురుతూ అంది.

ఇంకా ఆలోచిస్తున్న వేణును చూసి,” ఇంత మంచి జరగబోతుంటే అలా ఉంటారెందుకు?” అంటూ నొసట ముద్దు పెట్టుకుని వెనక్కు తిరిగింది. చటుక్కున చెయ్యి పట్టుకున్నాడు వేణు.

“చేతిలో చెయ్యేసి మరీ చెప్పారుగా జన్మ జన్మలకు వదలనని ! మరిచిపోలేదు.”అంది కొంటేతనం కళ్ళల్లో నింపుకొని.

“సరసాల చలి మంటలు తరువాత వేసుకుందాం. పిల్లలు ఒక్క వారం ఆయనదగ్గరకు వెళ్లలేకపోతే, ఎంత దిగులు పడిపోతున్నారో గమనించావు కదా!”

“నిజమేనండి ఇది ఏనాటి బంధమో? ఆయన తప్ప, లోకం తగల పడుతున్నా తెలియడం లేదు. మనిద్దరికీ తల్లిదండ్రులు లేరని, చలువనేచ్చే ఆత్మీయ పందిర్లు లేవని ఎంతో భాదపడే దాన్ని? దేవుడి దయ; ఆ పిల్లల అదృష్టమో, మన పూర్వ జన్మ సుకృతమో, నిష్కల్మషంగా వాత్సల్యానురాగాలను అందిచే మహానుభావుడు దొరికాడు. జీవితానికి పరిపూర్ణత లబించినట్లు అనిపిస్తుంది.” మైమరచి చెపుతున్న ఆమె మాటలు వింటూ అడ్డుచెప్పలేక పోయాడు.

ఈ నానమ్మ, తాతయ్యలు రెండు తరాలకు అమూల్యమైన ఆత్మీయ అనురాగాల అనుబంధపు వారధులు. తమ బాధలను అసంతృప్తులను,నిస్సహాయతను, పూర్తిగా మరచిపోయి, చిన్న పిల్లలై పోయి, వాళ్ళతో కలిసి పోయి, తమ అనుభవాన్ని, వెలకట్టలేని వాత్సల్యాన్ని వాళ్ళకిచ్చి, చిరు ఆటుపోట్లకు అండగా నిలిచి, ఓదార్చి, ఆత్మ విశ్వాసాన్ని కలిగించి, ఉత్తమ వ్యక్తిత్వానికి పునాదులు వేసి, వాళ్ళ భవిష్యత్తు, సంతోషమే తమ చివరి కోరికగా, మరణాన్ని మనసారా ఆహ్వానిస్తారు. దేవుళ్ళు ఎక్కడో మరో రూపంలో ఉండరు. వీళ్ళే నిజమైన భగవంతులు అనుకున్నాడు వేణు.

ఆయనొక విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు. శ్రీనివాసరావు; శీనయ్య ; పిల్లలకు శీనతాత. ఇరవై సంవత్సరాల క్రితమే భార్యను పోగొట్టుకున్నాడు. ఇద్దరు మగ పిల్లలు. తనే తల్లితండ్రయి వాళ్ళను ఎంతో ఉన్నతంగా పెంచాడు. వాళ్ళుకూడా బుద్దిగా మంచి చదువులు చదువుకున్నారు. సాంప్రదాయ కుటుంబాల నుంచి పిల్లల్ని తెచ్చి, వాళ్ళ ఇష్ట ప్రకారమే పెండ్లి చేసాడు. అందరి దృష్టిలో శీనయ్య గొప్ప వ్యక్తి,అదృష్టవంతుడు ,ఆయనలాగా మరెవ్వరు ఉండరని కీర్తి తెచ్చుకున్నాడు. స్ఫూర్తి, వేణు ఆయన పూర్వ విద్యార్ధులు. ఎంత దూరంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులలో ఉన్నా, ఒక్క రోజు కూడా మాష్టార్ని చూడకుండా ఉండే వాళ్ళు కాదు. స్పూర్తికి, వేణుకు తల్లిదండ్రులు లేరని, తనే పెద్దయి పెండ్లి చేయించాడు శీనయ్య. వాళ్ళ ఉద్యోగాలుకూడా అదే ఊర్లో దొరకడం ఒక వరం అయ్యింది.

వీళ్ళిద్దరంటే శీనయ్యకు ఎంతో ఇష్టం. కన్న బిడ్డలకంటే ఎక్కువ చొరవ. ఎనలేని గౌరవం భక్తి. విడదీయలేని బంధాలే వాళ్ళవి. శీనయ్యకు మనవళ్ళు, మనమరాళ్ళు పుట్టారు. ఆ సంతోషాన్నంతా, స్ఫూర్తి వేణులతో పంచుకొని పరవశించి పోయేవాడు .అలాగే వీళ్ళకు పిల్లలు పుట్టినప్పుడు కూడా అంతే సంబర పడిపోయాడు. ఆనంద ,ఆప్యాయతల శాంతి నివాసంలో, ఉన్నంట్లుండి ముసలం పుట్టింది.

అనుకోని విధంగా కొడుకులిద్దరూ వేరుపోయారు. స్ఫూర్తికి వేణుకు మతిబోయినంత పని అయ్యింది. తెలిసిన వెంటనే ఆయన దగ్గరకు వెళ్ళారు. నవ్వుతూ ఆహ్వానించాడు.

“రెక్కలోచ్చాయి వెళ్లి పోయారు. వాళ్ళ భవిష్యత్తు నాతో ఇక లేదనుకున్నారు. ఇది సహజం.సృష్టి తీర్పు.ఆమోదించాల్సిందే! మార్పులను ఆహ్వానించి మన్నించడమే ఈ వయస్సులో ఉత్తమ నిర్ణయం. నాకు బాధగాని కోపంగాని లేదు. పెన్షన్ వస్తుంది. గూడుంది. అన్నిటికన్నా మీరున్నారు." అంటూ బాధగా నవ్వలేదు, నమ్మకంగా అన్నాడు.

ఆ మాటలు విని కన్నీళ్లు పెట్టుకుంది స్ఫూర్తి . తమతో ఉండమని ఎంతో బ్రతిమలాడారు స్ఫూర్తి, వేణు! చాలా సున్నితంగా తిరస్కరించాడు

“అందరి మంచికోరుకోబట్టే ఇంత అభివృద్దిలోకి వచ్చారు. మీరు నా ఆశలు, నా ప్రాణ, మాన, రక్షణ కవచాలు. వాళ్ళు లేని లోటు తీర్చే అశ్వనీ దేవతలు. భార్య దూరమైనప్పుడే ఒంటరిని!! వీళ్ళు ఎంత? నన్నుదూరం చేసినా వాళ్ళను అవమానించలేను. అన్నీ మన మంచి కోసమే!!” స్పూర్తి , వేణు ఆశ్చర్య పోతూ, ఒకర్నొకరు చూసుకున్నారు. ఇంత ఉదాత్తులు, మనో ధైర్యం గల వ్యక్తులు ఉంటారా అనిపించింది.

ఈ పరిస్థితుల్లో పిల్లలు మరీ దగ్గరయ్యారు. తీరిక దొరికినప్పుడల్లా వెళ్ళడం, పిల్లలు నిదుర సమయానికి ఇంటికి రావడం. ఒక్కోసారి శీనయ్యే వెళ్ళే వాడు. చాలా సేపు పిల్లలతో గడిపి, ప్రొద్దుపోయి బయలుదేరేవాడు. భోజనం చేయమంటే వంట మనిషి ఉంది కదా, చేసిందంతా పారేయ్యాల్సి వస్తుందని నచ్చచెప్పేవాడు. మనసులో బాధగా ఉన్నా, స్ఫూర్తి బలవంతం చేయలేక పోయేది. పిల్లల దగ్గర వీడ్కోలు తీసుకొన్నతరువాత వేణు తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపి వచ్చేవాడు. రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. చాలా మార్పులు చోటుచేసుకున్నాయి.

శీనయ్యకు వంట మనిషి నిలిచిపోయింది. స్ఫూర్తి, వేణు వచ్చి భోంచేసి వెళ్ళమని లేదా రోజూ పంపుతామని చాలా నచ్చ చెప్పేవాళ్ళు. నేను చేసిపెడతాను మీకు, రండి నా దగ్గరకు, అని మొండికేసేవాడు. ఏదో ఒక పనిలేకపోతే సోమరితనంతోపాటు, నిరాశ నిస్పృహలు బలితీసుకుంటాయని నచ్చ చెప్పేవాడు. మరీ బలంతం చెయ్యడం ఎందుకని, వీళ్ళు వెళ్లి నప్పుడే ఒక వారం రోజులకు కూరలు, పండ్లు, తీసుకెళ్ళి ఇచ్చేవారు. అదీ స్ఫూర్తి కన్నీరు పెట్టుకుంటే, వొప్పుకున్నాడు. స్ఫూర్తి, వేణు ఆయనకు వొంటరితనం గుర్తు రాకూడదని, ఎప్పుడు ఫోనులో మాట్లాడుతుండేవారు. ఈ మధ్య ఆ ఫోనుకూడా చెడిపోయిందని, మాటలు, పరామర్శలు , నిలిచిపోయాయి. గంటలు తరబడి నేను...నేను అని కొట్లాడుకుంటూ మాట్లాడే పిల్లలకు మరీ పిచ్చి పట్టినట్లు అయిపోయింది. స్పూర్తికి విసుగు, అసంతృప్తి ఎక్కువయ్యింది. ఎంతో

పోగొట్టుకున్నట్లుగా బాధపడేది. వేణుతో చెప్పి త్వరగా సరి చేయించమంది. వెళ్లి చూస్తే ఫోనే లేదు. ఏమయ్యింది అని అడిగితే, ఒక్కడికెందుకు అంత ఖర్చుఅని తనే తీసెయ్యమని చెప్పానని అన్నాడు. కానీ వేణుకు తెలుసు అది ఎవరు చేయించారో?

అదేవిటి ఇప్పుడేకదా ఉండాలి అని చెప్పినా, మర్యాదగా కాదన్నాడు. స్ఫూర్తితో చెప్పితే, మాకు అవసరం. ఆయనకు లేకపోవచ్చు కనీసం సేల్ల్ఫోను అయినా తీసి ఇవ్వకపోయారా అని కోప్పడింది. రోజూ ఆయన్ని గురించి బాధపడటం చూసి," ఎందుకలా, మీ బాబాయికి అంత పట్టుదల ? వెళ్లి ఎవరి దగ్గరో ఒకరి దగ్గర ఉండొచ్చుకదా.” అనే వాడు వేణు.

“ లేదండి! బిడ్డలకు; ముఖ్యంగా మనవళ్ళు మనమరాళ్ళకు దూరంగా ఉండలేడు. చూస్తున్నారుగా ఒక రూము నిండా బొమ్మలు, చిన్న పిల్లల పుస్తకాలు ఎన్ని ఉన్నాయో? ఏదో జరిగే ఉంటుంది. కొడళ్లే దానికి కారణం అయి ఉంటారు.” అని వాళ్ళను ఓపిక ఉన్నంత వరకు శాపనార్ధాలు పెట్టే కన్నీళ్లు పెట్టుకునేది స్ఫూర్తి.

“వాళ్ళే దొరికారు నీకు. ఏన్ని ఉన్నా ఇంత ఆత్మాభిమానం , మొండితనం, ఆయన కుంటే ఎలా? వయస్సు!! ఎవరి మీదనో ఒకరి మీద ఆధారపడక తప్పదు!! తగ్గాలికదా! ఈ వయస్సులో ఆయనకు మాట మంతికి మనుషులు ఎంతో అవసరం.”

“ఆయన ఆ బిడ్డలకోసం ఎన్నిబాధల్నిఅవమానాల్ని ఎదుర్కోనుంటాడు? భాద్యత, బంధం !! బిడ్డల్ని కనడం తప్పా? ఎన్ని ఎదురు దెబ్బలు, రంపపు కోతలు భరించి, వాళ్ళ భవిష్యత్తే తన ప్రాణంగా పెంచడం పొరపాటా? ఎం తప్పు చేసాడని ఈ శిక్ష ? నిర్దోషులకు నీరాజనాలు అర్పించి పూజ చెయ్యాల్సింది పోయి ఇలా దూరంచేస్తే వాళ్ళు బాగు పడతారా?” అని అందరిని ఇష్టం వచ్చినట్లు సమయం దొరికినప్పుడల్లా శాపనార్ధాలు పెట్టేది స్ఫూర్తి .

వేణు లోపలికొచ్చి స్ఫూర్తి ఎక్కడో చూస్తూ ఆలోచిస్తూ ఉండటం గమనించి,“ ఇదేవిటి, ఇంకా ఇలాగే ఉన్నావు? ఆ కన్నీళ్లు ఏవిటి ? మీ బాబాయిని గురించేనా! మనం ఉన్నంతవరకు ఆయన ఒంటరి వాడు కాదు.ఎక్కువగా ఆలోచించవద్దని ఎన్ని సార్లు చెప్పాను. లే..లే వెళదాం.” అంటూ గుడ్డలు మార్చుకోవడానికి లోపలిక్ వెళ్ళాడు.

మార్చుకుని వచ్చే సరికి ముగ్గురు ఎదురుగా నిలబడి ఉన్నారు.” కాఫీ కూడా పూర్తిగా తాగలేదు.” అంటూ నసిగాడు వేణు.

“పరవాలేదు. చల్లారిపోయి ఉంటుంది. అక్కడకెళ్ళిన తరువాత వేడి వేడిగా పెట్టిస్తాను.ఇద్దరూ తాగుదురుగాని.” అంది చెతురుతలో మన్నింపు కలిపి స్ఫూర్తి.

భార్య ప్రసన్నంగా ఉండటం చూసి నిట్టూర్పు వదిలి, పిల్లల వైపు చూసాడు.

బుడతడి చేతిలో గుఱ్ఱం బొమ్మ, అంకిత చేతిలో కుక్క బొమ్మ ఉన్నాయి.

“అవెందుకు ఆయన దగ్గర బోలెడు బొమ్మలుంటే?” అన్నాడు వేణు.

“తాతయ్య నడిచి రాలేదుగా ; గుఱ్ఱం ఎక్కి స్పీడుగా మనింటికి వస్తాడు.” అని నీలుగుతూ చెప్పాడు బుడతడు.

అంకిత వైపు ప్రశ్నార్ధకంగా చూసాడు.” తాతయ్య వంటరిగా ఉంటాడుగా! నా బుల్దాగ్ తాతయ్యకు కాపలా కాస్తుంది. చెడ్డ వాళ్ళను తరిమి కొడుతుంది.” చాలా నమ్మకంగా, గొప్పగా చెప్పింది.

ఆశ్చర్యంగా భార్య వైపు చూసి,”మరి నువ్వేం ఎత్తుకున్నావు.” అడిగాడు.

తడుముకోకుండా ,” ఆంజనేయ స్వామీ.” అంది.

“ఆయనకే తిండి లేకుండా చస్తుంటే వీటన్నింటికి ఎక్కడ నుంచి తెచ్చి పెడతాడు.” అడిగాడు.

“ అదేనండి మీరయితే ...?” అని కొంటగా చూసి నవ్వింది స్ఫూర్తి .

వేణుకు అర్ధమయ్యి మతిపోయి,” చివరకు కోతిని చేసారన్న మాట.” మురిపెంలో

నిరసన కలిపి ముసిముసిగా నవుకుంటూ అన్నాడు.

“ అయ్యయ్యో ! స్వామిని అంతమాట అనకూడదు. చెంపలేసుకోండి.” అని,

“మరి మీరేం మూట తీసుకొస్తున్నారు.” ఉడికిస్తున్నట్లు అడిగింది

“ మోసుకెలుతున్నాగా!!” అంటూ ఎక్కిరిస్తూ చూసాడు వేణు.

“ ఏమండి ! మిమ్మల్ని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నానండి” అంది సిగ్గుపడుతున్నట్లు స్ఫూర్తి.

“అదెందుకు అంత పెద్ద బాణం?”

“ఎం లేదండి.మరే..మరే... మీ పీసనారి బుద్ధి చూపించక పండ్లు పలహారాలు కాస్త ఉదారంగా కొంటారని.!!”

“పర్సుతేలేదు.”.

“మంగళ సూత్రాన్ని ఇస్తానులెండి!

ఆ కొంటేతనానికి, మనసులో కలిగిన గుబులుకు, విస్తుపోయినట్లు చూస్తూ,”నన్ను తాకట్టు పెడతావా? ఇంకా నయం. నిన్ను కుదవపెట్టమని చెప్పలేదు. ఆ మంగళ సూత్రాన్ని కప్పుకో, కాటి కాపర్లకు కనిపిస్తుందేమో?”అని పైట చెరుగు రెండు వైపులు వచ్చేటట్లు కప్పాడు.

“అబ్బ! వొళ్ళు జలదరించిందండి. నన్ను వొకరికి ధారబొయ్యరని నమ్మకం కుదిరిండండి.!!”

“నాకు నమ్మకం లేదు.ఎప్పుడో కొట్టేసాడు; మీ బాబాయి.”

“అంత కుళ్ళెందుకండి.ఆయన పదిలంగా పువ్వుల్లోపెట్టి మీ చేతుల్లో పెడుతారని పూర్తి నమ్మకం ఉంది. మనం సుఖంగా ఉండటానికి ఉన్నదే గాకుండా ప్రాణంతో సహా ఇచ్చేస్తాడు.”

“అది తప్ప ఆయన దగ్గర ఏముంది? ఆత్మహత్య చేసుకున్న ఆత్మీయ అనురాగాలు, పాతాళంలోకి తొక్కి వేయబడ్డ వాత్సల్యఅనుభంధాలు. ఈ కాలంలో ఎందుకూ పనికిరాని వస్తువులు.”

“వాటిని స్వచ్చంధ మరణానుంచి రక్షించడానికేగా మేం శ్రమిస్తున్నది. నేను, పిల్లలు, అమృతాన్ని నింపుతాం ఆయన హృదయంలో. వజ్రాయుధం కూడా ఛేదించలేని రక్షణ వలయాన్ని నిర్మిస్తాం. !!”

“మరి నాకో ?”

“ఆణిముత్యాలిస్తాం.. రంగు పూసి .”

“రాళ్ళు రప్పలు నాకు; అమృతం ఆయనకన్న మాట.”

“కాస్ట్లీ కదండి. అర్హతున్నవాళ్ళకే...?’ వేణు ముఖంలో చిరుకోపం చూసి,” లేదు లేదు అమృత వారధులు మీరే కదండీ. మీరిచ్చిన వరాలతోనేకదా మేం మోహినీ రూపులమయ్యింది.”

అలాగే చూస్తుండిపోయాడు వేణు.

“ఏవిటి అలా చూస్తున్నారు?”

ఈ లోకంలోకి వచ్చినట్లు తల విధిలించుకుంటూ,”ఏంలేదు; నువ్వు నా భార్యవేనా లేక నిజంగా మోహినీ రూపిణివా?” అడిగాడు.

“ స్వాతి చినుకు ఆలుచిప్పలో పడితే ఆణి ముత్యమే అవుతుందండి.”

ఆ చతురకు తట్టుకోలేనట్లు తల అడ్డంగా తిప్పుతూ,”,పద ..పద ఆలుచిప్పను వలిచి ఆణిముత్యం సొంతం చేసుకోడానికి చాలా ప్రోద్ధుంది. గురువు దగ్గరికెళ్ళి

సహృదయ శోభనం చేసుకుందాం !!.” అంటూ ఆమెను తోసుకుంటూ ముందుకు

నడిచాడు. మరులుపోతూ వేణు చెయ్య పట్టుకొని నడచింది స్ఫూర్తి .

***

ఆటో ఆగి ఆగగానే పిల్లలు ఎగిరి దూకి ఇంట్లోకి దూరారు. అపూర్వ దిగింది కానీ అనుమానంగా ఇంటివైపు చూస్తూ నిలబడింది. ఆమెను చూసి,” ఏవిటి అలా చూస్తున్నావు.” అని అడిగాడు వేణు . “ ఈ సమయానికి నాన్నగారు మడత కుర్చీలో కూర్చుని పేపరు చదువుకుంటూనో, పూల చెట్లల్లో తిరుగుతూ, స్వచ్చమైన చిరునవ్వుతో, ఆదరంతో , మనకు చేయి ఊపేవాడు. పిల్లల్ని అమాంతంగా ఎత్తుకొని ముద్దులతో ముంచేసేవాడు. అలాంటిది ఈ రోజు..?” అంటూ అనుమానంగా వేణు వైపు చూసింది.

“అన్నీ అనుమానాలే నీకు” అంటూ ముందుకు కదిలాడు. ఈ లోగా పిల్లల కేరింతలు, ఆయన నవ్వులు వినిపించేసరికి మనసు కుదుట పరుచుకొని, తెచ్చిన పండ్లు ఎత్తుకొని లోపలి అడుగు పెట్టింది స్ఫూర్తి.

వీళ్ళను చూడగానే శీనయ్య ముఖం సంతోషంతో వెలిగిపోయింది .” చూడమ్మా! నీ బిడ్డలు నాకేం ఇచ్చారో.” అంటూ గుఱ్ఱం, కుక్క బొమ్మలను చూపించి,”ఆణిముత్యాలకు స్వచ్చమైన రత్నాలే పుడుతారు.”అంటూ వాళ్ళను కౌగిలిలోకి తీసుకొని ముద్దులలో మునిగి పోయాడు..వేణు, పిల్లల్ని ఆయన్ని చూస్తూ నిలిచిపోయాడు.

స్ఫూర్తి తెచ్చినవి ఎత్తుకొని వంటింటి వైపు నడిచింది. పిల్లల ఆటల్ని, పెద్దాయన ఆనందోత్సాహాన్ని చూస్తూ ఉన్న వేణు, భార్య పిలుపుతో ఉలిక్కిపడ్డాడు. వంటింటి వైపు చూసాడు. కనిపించక పోయేసరికి తనే వెళ్ళాడు. భాదను ఆపుకోలేక,దిగులుతో కుంచించుకుపోయిన ముఖంతో, ఏ క్షణం లోనయినా దుమకడానికి సిద్దంగా ఉన్న కన్నీటితో నిలుచోనున్న స్పూర్తిని చూసి, ఆత్రుతగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. మాట్లాడక కన్నీళ్ళు కారుస్తూ తననే చూస్తున్న భార్య చేతులు పట్టుకొని,” ఏవిటి ..ఎం జరిగింది? “ ఆత్రుతగా అడిగాడు

కాళీ గిన్నేలు, ఫ్రీడ్జే వైపు చూపించింది. వెళ్లి చూస్తే అన్నీ కాళీగా ఉన్నాయి. ఆలోచిస్తూ స్ఫూర్తి వైపు చూసాడు.

“ఈ రోజు అసలు భోంచేసినట్లు లేదండి. ఎప్పటినుంచి వండలేదో,ఇంట్లో ఒక వస్తువు కూడా లేదు? ఏం తింటూన్నారో ?” అంటూ కన్నీళ్లు తుడుచుకోవడం చూసి,”

'ఏదో తినే ఉంటాడులే, లేకుంటే ఈ వయస్సులో తట్టుకోగలడా?” అంటూ

సముదాయించబోయాడు వేణు.

“లేదండి చాలా రోజులునుంచి ఏ వస్తువు కొన్నట్లు లేదు. మనం తీసుకు వెలదామండి.ఆయన్ని నేను పోగొట్టుకోలేను. ” అంటూ దీనాతి ధీనంగా వేణు వైపు చూసింది.

“ఆయన వస్తానంటే మనకేం అభ్యంతరం లేదు. కానీ ఈ వయస్సులో ఆయనకు

ఆరోగ్యం ఎలా ఉంటుందో ? ఆయన కోరికలు, అభిరుచులు, మనం తీర్చగలమా,

సమర్ధించ గలమా?”ఆన్నాడు అనునయంగా వేణు.

“ఇప్పుడేం తీరుతున్నాయి ? ఈ వయస్సులో ఆయనకు కావాల్సింది ,పంచభక్ష పరమాన్నాలు కాదండి .ఆప్యాయంగా ఒక పలకరింపు. మేము ఉన్నామని .నమ్మకం. మనవళ్ళు, మనుమరాళ్ళ ఆట పాటలు. అవే ఈ చివరి దశలో శివ. శ్రీరామ జపాలు, తపస్సులు. చాలా చిన్న కోరికలు. అయినా ఆయన ఇబ్బంది పెట్టడని నమ్మకం ఉంది . ఇచ్చినా, నా తండ్రి అనుకున్నప్పుడు ఎలాంటిది బరువుకాదు.”

ఇంతలో శీనయ్య ,” చూడమ్మా వీళ్ళు ! నాకోసం అన్నం వొండుతున్నారంట, గుత్తి వంకాయ; పప్పు చారు; మునక్కాయ పాలుపోసి చుక్కుడుకాయ; ఉలవ చారు, వడియాలు, పెరుగు!!.ఇవన్నే గాక మినప గారెలు, అల్లం పచ్చడి చేస్తున్నారట. ఆవు నేయి వేసుకుని కాస్త కూడా మిగల్చక నేను ఒక్కడినే తినాలంట.” స్ఫూర్తి కళ్ళు తుడుచుకోవడం గమనించి ఆత్రుతగా దగ్గరకు వస్తూ ,” ఏం జరిగింది.? ఎందుకమ్మా కన్నీళ్లు ? అబ్బాయి ...? తమాషా చేసుంటాడు. నువ్వంటే ఎంత ప్రాణమో, ప్రేమో?” అనునయంగా చెప్పాడు.

“ఆయన అన్నాడని కాదు. మీకు ప్రేమ లేదని ” అని చాలా నిష్టూరంగా నిందిస్తున్నట్లు గట్టిగా అంది.

“నాకా! ఈ కట్టెలో శ్వాస ఉన్నంతవరకు దాన్ని ఎవ్వరూ చేరపలేరు: మాయదు!!.”

“ అందుకేనా పస్తులుంటున్నారు. మమ్మల్ని ముందుగా తగల పెట్టడానికా?’

ఆత్రుతగా దగ్గరకు వచ్చి,” అంత మాట అనకమ్మా? ఏం జరిగింది ?అంత

బాధపడుతున్నావు?” లాలింపుగా అడిగాడు.

“ బాధకాదు ,గుండెపగిలి చస్తున్నాను. ఎందుకు మా మీద అంత అసహ్యం ?

ఎందుకంత పరాయిగా చూస్తారు?”

“ ఎవరు నేనా ?” అయోమయంగా అర్ధంగానట్లు వేణు వైపు చూసాడు.శీనయ్య

“అవును మీరే !! మా దగ్గరకూడా మొహమాటాలు, దాపరికాలు ఉంటే, మేము ఏం అవుతాము? మీకు మా మీద ఏం ఉంది.? అంత అవమానిస్తుంటే మీ ప్రేమకోసం, ఆప్యాయత అనురాగాలకోసం, మీ దగ్గర అడుక్కు తినడమెందుకు?” అంటూ భాదను

అనుచుకోలేక కన్నీళ్లు జల్లున రాయాలి స్పూర్తికి.

శీనయ్య దగ్గరగా వస్తూ ,”అంత మాట అనకమ్మా! నేను బ్రతికున్నది....!!”మాట పూర్తి చెయ్యలేకపోయాడు.

“అబద్దం.పచ్చి అబద్దం.!!అదే నిజమైతే ఇంట్లో ఏమీ లేవని ఎందుకు చెప్పలేదు? ఈ రోజు ఎందుకు బొంచేయలేదు?” తన బాధనంతా కోపంలో చూపించింది స్ఫూర్తి .

శీనయ్య ఇబ్బందిగా చూసి , తలదించుకుని,” తెచ్చుకుందాం అనుకున్నాను.

ఏదో బద్ధకం, మీరు పిల్లలు రాలేదని ఆకలి కాలేదు.” అన్నాడు స్ఫూర్తి కళ్ళల్లోకి చూడ లేక.

“ లేదు...లేదు !! మీరు మభ్య పెడుతున్నారు. మేం మీకు అక్కర లేదు. ఎందుకు యిలా అవమానిస్తారు ; రావద్దనే చెప్పవచ్చుగా? బ్రతికి ఉన్నందుకు మీకు మీరే

శిక్షించుకుంటున్నారా? వాళ్ళను కన్నందుకు ప్రాయచ్చిత్తం చేసుకుంటున్నారా?”

నిలదీసినట్లు చాలా పరుషంగా అంది స్ఫూర్తి.

“ మీరు ఉన్నారని బ్రతకాలనుకుంటున్నాను.” నెమ్మదిగా అంటూ తలెత్తి స్ఫూర్తి కళ్ళల్లోని కోపానికి, బాధకు, తల దించుకున్నాడు.

“ ఎలా ఇలా తిండి తిప్పలు మానేసి మమ్మల్ని అనాధల్ని చేసా? “

శీనయ్య మారు మాట్లాడలేక పోయాడు.

“ మీరు మమ్మల్నిగురించి ఆలోచిస్తే కదా; మీకు ప్రేమ ఉంటే కదా!. ఆ చిన్ని బిడ్డలు, తాము తినే ప్రతి దానీలో కాస్త తీసి, తాతయ్యకు అని, నా చేత రాయించుకొని, చిన్న చిన్న డబ్బాల్లో వేసి, దాచి పెడతారు.వచ్చి చూడండి ఎన్ని ఉన్నాయో? ఆ ప్రేమను, గౌరవాన్ని, గంగలో ముంచాలని చూస్తున్నారు.”

ఆ మాటల్లోని నిఘూడతను, ఆప్యాయతను గ్రహించి, తట్టుకోలేక పోయాడు. శీనయ్య వణకడం, కాళ్ళు తడబడటం గమనించి, వేణు, స్ఫూర్తి అదాట్టుగా వెళ్లి పట్టుకుని, మంచం మీద కూర్చో పెట్టారు. మంచినీళ్ళు తాగిస్తున్న స్ఫూర్తి ఆయన కన్నీళ్లు చూసి చలించి పొయింది.

“ నన్ను క్షమించండి మిమ్మల్ని బాధ పెట్టాను.మాకు కన్నీళ్లు కరువైయ్యే పరిస్టితి తీసుకురాకండి.మీరు కన్నీరు కారిస్తే మేము భరించలేము.” అంటూ తుడిచింది స్ఫూర్తి.

“ మీరు వచ్చి కన్నీళ్లు తుడుస్తానంటే రోజు కారుస్తాను.”

“అందుకేనా మేము రావాల్సింది; సంతోష పెట్టడానికి కాదా.” అంటూ విసురుగా లేచింది స్ఫూర్తి.

“అమ్మా..అమ్మా లేదులే! కూర్చో!” చేతులు పట్టుకున్నాడు శీనయ్య. స్ఫూర్తి కళ్ళల్లోకి నిదానించి చూసి ,లేచి దూరంగా తన ముఖం కనిపించనీయక వెనక్కు తిరిగి, చాలా సేపు మాట్లాడక నిలుచున్నాడు. ఆ మౌనాన్ని, నిశ్శబ్దాన్ని, భరించలేక పోయింది స్ఫూర్తి.

మెల్లగా వచ్చి మంచం మీద కూర్చుంటూ, వీళ్ళను చూడకనే,” ప్రతి నెలా ఇద్దరిలో ఎవరో ఒకరు సామాను తెచ్చి ఇచ్చే వాళ్ళు. ఈ నెల మరిచి పోయినట్లు ఉంది. పాపం! ఎన్ని పనులో వాళ్లకు? ఉన్న కాస్త డబ్బుతో, మొన్నటి వరకు గడిపేశాను. రోజు ఎదురు చూస్తూనే ఉన్నాను, వస్తారని !! ఫోను లేదు. మీకు చేద్దామంటే? సెల్ ఫోను తెచ్చి ఇస్తానన్నారు. అదీ తెచ్చి ఇవ్వలేదు. నేనూ అడగలేదు. నా ఏ.టి.ఎం కార్డు ఆరు నెలల క్రితం అడిగారు,ఎందుకు అని అడగ లేదు. ఇచ్చాను. తెచ్చి ఇస్తారు ఈ రోజో రేపో దానికెందుకని...!” అప్రయత్నంగా స్ఫూర్తి, దారుణం అని తల పట్టుకుని కూర్చునేసింది.

చెపుతున్నది ఆపి, స్ఫూర్తి వైపు భయంగా చూసి, శీనయ్య తలదించుకొని,” బిడ్డను హాస్పిటల్లో అర్జంటుగా చేర్చాలి అంటేను....! వెళ్లి చూడాలని తపన పడిపోయాను. హాస్పిటలు లోపలికి ఎవ్వర్నీరానివ్వరు; మేమే వచ్చి చెపుతూ ఉంటాము అంటే చేసేది ఎం లేక ,ఆ బిడ్డ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తూ ఉండిపోయాను. ఆత్రుతతో అల్లాడిపోయాను. పది రోజుల తరువాత వచ్చిబాగుంది అని చెప్పారు. వస్తానన్నాను. ఇప్పుడు కాదు కాస్త కోలుకోనీ , అని చెప్పి వెళ్ళిపోయారు . అంతే కార్డు తేలేదు, నేను అడగలేదు. వెళ్లి చూద్దాం అంటే వాళ్ళు ఎక్కడ కాపురం ఉంటున్నారో కూడా తెలియదు. ఈ రోజు మీరు వస్తారని ఎదురు చూస్తూ పడుకుండి పోయాను. ఇవన్ని సహజమే !!” అంటూ నవ్వాడు శీనయ్య.

“ ఏది సహజం; ? తండ్రిని దిక్కులేని వాడుగా , అంటరానివాడుగా దూరం చెయ్యడమా? మీరు నేర్పించిన సంస్కారమా అది.” విపరీతమైన కోపంతో అసహ్యంగా అంది స్ఫూర్తి .

“ పాపం అమాయకులమ్మా నా బిడ్డలు. కాకపోతే కాస్త మైకంలో ఉన్నారు,

తెలుసుకుంటారు!!” అన్నాడు తల ఎత్తకనే శీనయ్య.

“ఎప్పుడు..ఎప్పుడు... మీరు చచ్చిన తరువాతనా? కన్న తండ్రి మీదనే కక్ష సాధింపా? ఏం తప్పు చేసారని? తల్లి లేని బిడ్డలని కళ్ళల్లో వత్తులు వేసుకుని ,ఎలాంటి కష్టం తెలియనివ్వకుండా పెంచారే మీకా వాళ్ళు ఈ విధంగా చేసెది. ఇప్పుడే వెళతాను. వీధిలోకి లాగి మరీ అడుగుతాను.” నిప్పులు చెరిగాయి స్ఫూర్తి కళ్ళు. అంత కోపాన్ని ఎప్పుడు చూడలేదు వేణు.

దగ్గరికి వెళ్లి ,”ఓర్చుకో!! మాన, మర్యాదలు మరిచి, భాద్యతారహితంగా ప్రవర్తించే వాళ్ళతో తగువు వేసుకుంటే, మన పరువే పోతుంది. కార్డు మార్పించడం చాలా తేలిక. మనమే వచ్చి ఆయనకు కావాల్సినవి తెచ్చిపెడదాం. ఎందుకు ఆ వెధవల్ని గురించి బాధపడటం. కనిపిస్తే నేనే మాట్లాడి తీసుకువస్తాను. ఓర్చుకో!!.” అంటూ సముదాయించాడు స్పూర్తిని వేణు.

స్ఫూర్తి స్తిమిత పడలేక పోయింది. ” ఎంత ఘాతకులండి. ఈ వయస్సులో పూజించాల్సిన మహాను భావుడ్ని, ఇంత క్రూరంగా చూడటం. ఆ దరిద్రులతో వద్దు. మనం తీసుకు వెళ్లాల్సిందే!! ఆయన ఇలా ఉన్నాడని తెలిసి నేను సంతోషంగా ఉండలేనండి .” అంటూ వేణు చేతులు పట్టుకొని ఏడవసాగింది స్ఫూర్తి.

“ అలాగే, తీసుకు వెళదాం.ఆయన్ని అడుగు.” అంటూ చాలా సముదాయించిన తరువాత నెమ్మదించింది. స్ఫూర్తి కన్నీళ్ళు తుడుచుకుంటూ ఆయన వైపు వేడికోలుగా చూసింది. వాళ్ళ

మాటలు వింటూ శీనయ్య తల దించుకునే ఉన్నాడు.. దగ్గరకు వెళ్లి ,” బాబాయి !! నా మాట కాదనకండి .వాళ్ళు సిగ్గుతో చావాలి.రండి!!.అన్నీ తరువాత వచ్చి తీసుకెళ్ళదాం.” అంటూ తొందర చేసింది.

మౌనంగా కదలక కూర్చొనున్న శీనయ్యను చూసి,” వస్తారా రారా.? ఇంకా ఏవిటి మీరు ఆలోచించేది” నిలదీసినట్లు అడిగింది.

అప్పటికి సమాధానం లేకపోతే విపరీతమైన కోపం వచ్చి,” పదండి వెళదాం. ఆయన నన్ను పిల్లల్ని జన్మలో చూడలేరు..ఈ ఇంటితో ఇక మనకేం సంబంధం లేదు. మీకూ మాకూ ఋణం తీరిపోయింది. ” అంటూ వేణు వైపు చూసి వాకిలి వైపు త్వర త్వరగా అడుగులు వేసింది.

శీనయ్య మెల్లగా తలెత్తి చూసి,” ఆగమ్మా! ఆగు. మిమ్మల్ని చూడకుండా నేను బ్రతకలేను. వృద్హాప్యం తిరిగి రాని పెట్టుబడే కదా ? ఈ నాడు అన్నీఆదాయ వ్యయాల మీదనే కదా బంధం ,అనుబంధం బ్రతికున్నది. భార్యా భర్తలు అనే పదంకూడా నియమ ,నిబంధనలతోనే కదా నిలిచి ఉన్నది. డబ్బు లేకపోతే ఆత్మీయ అనురాగాలు అక్కడ చిగురించవు. ఇలాంటి సమాజంలో, ఆధునిక మనోరణ్యంలో బాధ్యతను ఆశించడం చాలా తెలివి తక్కువ. పుట్టించాం, పెంచాం .సుఖాల్ని ధారపోసాం, మమ్మల్ని చూసుకోవడం మీ బాధ్యత అనడం చాలా అధర్మం. సృష్టికి, బాధ్యతను , అనుభందాన్ని భరించాల్సిన అవసరంలేదు. కాలం మారింది .దానికి అణుగుణంగా ఆలోచించకపోతే రోజుకు కోటాను కోట్లు వృద్ధులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి

ఉంటుంది.”

“ అదే మేలుకదా ఈ నరకానికంటే ? రాత్రి పగలు మారాయా? భూమి ఆకాశం మారిందా?ఆ రోజు మీకులేవా ఆదాయవ్యయాలు ,కష్టాలు, డబ్బు అవసరాలు; మరి మీరు విషంతాగి వాళ్ళకు అమృతం పోసి ఎందుకు పెంచారు?పుట్టి నప్పుడే రాబోయే కాలంలో వీళ్ళు అమ్మానాన్నలకు చిప్ప కూడు కూడా పెట్టరు అని గొంతు పిసికి చంపేసి ఉండొచ్చుగా!ఈ భాద్యతను తీసుకోలేని పిరికిపందలను, నపుంసకులను, పెంచడం ఎందుకు.?”అంది ఆవేశాన్ని అణుచుకోలేక పోతూ స్ఫూర్తి.

మరీ సెంటిమెంట్లుతో ఎమోషనల్ అయి పోతుందని వేణు కల్పించుకున్నాడు ,” స్ఫూర్తి !!ఏవిటి నువ్వు మాటలాడటం? ఆయన్ని ఎలా తప్పు పడుతావు. కాల ప్రభావం అని చెప్పాడుగా!!” అన్నాడు.

“అంటే, కాలం ఇదికూడా చెపుతుందా ?వృద్దాప్యంలో అవమానాలతో, నిరాదరణతో జీవించాలని, వృద్దాశ్రమాలలో నరకానికి తర్ఫీదు పొందాలని, ఆప్యాయత ,అనురాగాలకు అడుక్కు తినాలని, పలకరించే దిక్కు లేకుండా, చీదరించుకోబడి ఒక మూల మగ్గుతూ పడిఉండాలని, నువ్వు పుట్టించిన వాళ్ళే నిర్ణయిస్తారని కూడా కాలం చెపుతుందా? వయసయిపోయింది, వయసాయి పోయింది , దేనికి? మాటకా, మంచికా, అనుభవానికా? కాళ్ళూ చేతులు బాగున్నప్పుడు, సంపాదిస్తుంటే అన్నీ బాగున్నాయి. వాళ్ళున్నారని నమ్మకంతో విశ్రాంతికోసం కాస్త నిలిస్తే, వేస్ట్ ప్రోడక్ట్, దండుగ.!! ఏవిటి దండుగ? వాళ్ళను పుట్టించడమా..పెంచడమా?”

వేణుకు ఆవిడ ఆవేశం నచ్చలేదు.కాని భార్య మాట్లాడే మాటల్లో ఏదీ తప్పు కాదు.

“ నిజంగా విధి, రాత, కాలమే మీ పరిస్తితికి కారణం అయి ఉంటే వాటిని ముక్కలు ముక్కలుగా నరికి తగల పెడతాను.మంచికి విలువ ఇవ్వని కాలం ఎందుకు.? ఋజువు చేసి చూపిస్తాను. మనిషి అనుకుంటే కాలన్ని ఏవిటి; దేన్నయినా మట్టి కరపించవచ్చు. నాతో తీసుకెలతాను. రానంటే ఇక్కడే నిరాహార దీక్ష చేసి, చస్తాను. మిమ్మల్ని చావ నివ్వను.” ఆవేశంతో వణికిపోయింది స్ఫూర్తి.

ఇంత నిర్మొహమాటంగా నిక్కచ్చిగా మాట్లాడుతుంటే ,ఎందుకో భయం వేసింది వేణుకు!!.

శీనయ్య వైపు చూసాడు. అస్థిమితంగా కూర్చున్న ఆయన కల్లల్లోనుంచి కుండపోతలగా కురవడానికి సిద్ధంగా ఉన్నాయి కన్నీళ్లు, బాధతో నలిగిన ముఖంలో పెదవులపై విరబూసిన చిరునవ్వు వేణును పిచ్చి వాడ్ని చేసాయి. స్ఫూర్తి ఆత్రుతగా ఆయన దగ్గరకు రాబోయింది. రావద్దు అన్నట్లు చేతితో సైగ చేస్తూ, ముఖాన్ని చేతుల్లో దాచుకున్నాడు. వేణు స్ఫూర్తి అలాగే చూస్తుండి పోయారు

ఎందుకలా మాట్లాడావు అన్నట్లు స్ఫూర్తి వైపు చూసి తల కొట్టుకున్నాడు. స్పూర్తికి ఏం చెయ్యాలో తోచలేదు.

మెల్లగా స్ఫూర్తి, ఆయన దగ్గరకు వెళ్లి, ముఖాన్ని పైకెత్తి ,”మీ కన్నీళ్లు ఇక నేను చూడ కూడదు.అలా జరిగితే మీరు నన్ను ప్రాణాలతో చూల్లేరు.” నిర్మొహమాటంగా అంది.

గబుక్కున నోరు మూస్తూ,” అంత మాట అనకమ్మ! నా తల్లి !!ఇలాంటి దేవతను పెట్టుకుని, ఎలా కన్నీళ్ళు కారుస్తాను. కానీ కాలాన్ని మనం అదుపులో తీసుకోలేము.ఆ విశ్వ శక్తికి దాసోహమనవలసిందే !! అయినా స్వచ్చమైన ప్రేమ చేతిలో అది ఓడిపోక తప్పదు. ఆది శక్తివి నువ్వు, పోరాటమే మానవుని కర్తవ్యం అని గుండెలు తట్టుకుంటూ ఎదురు నిలిస్తే ఎలాంటి శక్తీ అయినా దురదృష్ఠమైనా మానవులకు భయపడి తీరుతుంది అనే, మహా మంత్రాన్ని భోధించావు తల్లి . నీ కాళ్ళు పట్టుకుని ముక్తి పొందాలని ఉంది. కానీ నీ ఆయుష్హు తగ్గించ కూడదు. అందుకని చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ప్రస్తుతం నన్ను వదిలెయ్యండి.” ఆవేదనను దాచుకుంటూ అన్నాడు శీనయ్య.

నమస్కరిస్తున్న ఆయన చేతుల్ని గక్కున వచ్చి పట్టుకుంది.”ఆ మాట అనకండి. మాతో వచ్చి ఉండండి . మీ బిడ్డలు ఏమీ అనుకోరు. నా జీవితాన్ని పునీతం చేసుకోనివ్వండి.” అంటూ స్ఫూర్తి కన్నీళ్లు పెట్టుకుంది.

శీనయ్య ఎలాంటి సమాధానం ఇవ్వక ముఖం చాటు చేసి తల దించుకున్నాడు. స్ఫూర్తి చాలా నిరుత్సాహపడిపోయి, పుట్టెడు దిగులుతో వేణు వైపు చూసింది. వేణుకు ఎం చెయ్యాలో తోచ లేదు. వీళ్ళిద్దరికీ ఏమయినా పిచ్చి పట్టిందా అనిపించింది. “వస్తాడులే! మరీ బలవంతం చేయకు!!”.అంటూ స్పూర్తిని లేవదీశాడు.

శీనయ్యను వదలక ,” నా మాటలు తేలిగ్గా తీసుకోకండి. నెల రోజులు మేము మీ దగ్గరకురాం. అప్పుడు మమ్మల్ని చూడకుండా మీరు ఎలా బాగుంటారో , మేము ఎలా ఉంటామో చూద్దాం? మేము బాగుండమని ఖచ్చితంగా తెలుసు, ముప్పైయవ రోజు వస్తాను మీరు రానంటే నిజంగా మీ ముందే చస్తాను.బెదిరిస్తున్నాను అని అనుకోకండి , మీరు బాధపడుతూంటే మా జీవితాల్లో సుఖముండదు. నా పట్టుదల మీకు తెలుసు. నా ప్రేమ గౌరవం కూడా మీకు తెలుసు. బిడ్డల్ని, నన్ను చంపుతారో, బ్రతికిస్తారో ఆలోచించుకోండి .” అని విసురుగా లేచి అంది.

ఆమాటల్లోని పటుత్వానికి నిజాయితీకి చలించిపోయాడు శీనయ్య. అయోమయంగా చూసాడు వేణు వైపు..

“ ఏవిటా మాటలు ? ఏం అయ్యింది ఈ రోజు నీకు ?” అసహనంగా అన్నాడు స్పూర్తిని చూసి వేణు.

“ అది అంతే మీరు వెళ్ళి సామాను తీసుకు రండి!!.” నిరామయంగా చూస్తుండిపోయాడు శీనయ్య.

వేణు బజారుకెళ్ళి వస్తువులు తెచ్చాడు.స్పూర్తిని ఒకటి రెండుసార్లు పలకరించబోయాడు శీనయ్య. కోపంతో అది ఇది సర్దుతూ జవాబు చెప్పలేదు స్ఫూర్తి.

అన్నీ సర్దేసరికి పిల్లలు తూగుతున్నారు వాళ్ళ తాతయ్య మీద పడుకొని. వేణు తీసుకున్నాడు. తెచ్చిన టిఫిన్ టేబులు మీదపెట్టి, పాలు కాసి తాగమనికూడా చెప్పక కోపంగా శీనయ్య వైపు చూసి దిగులుగా బయలు దేరింది స్ఫూర్తి .

ఆటో కదిలిన తరువాత వేణు అన్నాడు,” ఎందుకు ఆయన్ని ప్రాణాలు తీస్తావు.?”

“ ఆయన తీసుకుంటే బాగుండదని.”

మరేం మాట్లాడ లేదు.ఇంటికి వచ్చి సోఫాలోనే కూర్చుండి పోయింది . వేణునే వెళ్లి పిల్లల్ని పడుకొబెట్టి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్న స్పూర్హి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు.

చాలాసేపు ఆమెను చూస్తూనే ఉన్నాడు. ఆమె పలకరించ లేదు.ఇక లాభం లేదని దగ్గరకు తీసుకుంటూ,” ఎందుకు అంతగా పట్టించుకుంటావు. ఎక్కువగా ఆలోచించకు.?”అన్నాడు.

అంతే !ఒక్కా సారిగా వేణుని చుట్టేసి అదుపు చేసుకోలేక ఏడవసాగింది. వేణు ఎంత సముదాయించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎంత సేపు,” బాబాయి దిక్కులేకుండా చనిపోతాడండి. మనం తీసుకొచ్చుకుందాం.” అని అడ్డు ఆపు లేకుండా ఏడుస్తూనే ఉంది.

ఆమెను, వీపు మీద, అనునయంగా, నిమురుతూ,“ అలాగే ..అలాగే.” అంటూ చాలా సేపు ఉండిపోయాడు. ఎప్పటికో ఆమె నెమ్మతించిందని నమ్మకం కుదిరిన తరువాత, మెల్లగా ఆమె ముఖాన్ని పైకెత్తి కళ్ళలోకి చూసి ,”ఏవిటి ఈ పిచ్చి ! నెల రోజులు గడువు పెట్టావుగా, ఈ లోగా ఆయన విషయం నా దగ్గర ఎత్తకూడదు. చూద్దాం మీ మీద ఎంత మమకారముందో?” అన్నాడు.

ఆ మాటతో తన బలహీనతను దాచిపెట్టి “ అందులో అనుమానం లేదు. ఈలోగా, ఆయనకు, ఏమయినా జరిగితే ?” భర్త కళ్ళల్లోకి చూస్తూ.”మీరు వెళ్లి రోజు పలకరించిరండి.” ప్రాదేయపడుతునట్లు అడిగింది.

“మళ్ళీ అదేవిటి పరిక్షపెట్టి, జవాబు పత్రం ఇచ్చినట్లు,.మనం ఎవ్వరం కనిపించకుండా ఉంటేకదా, ఆయన ఏవిటో ? మన అవసరం ఏవిటో తెలిసేది.?”

***

ఆ నెల రోజులు భరించలేని నిత్య నరకాలుగా గడిచాయి స్పూర్తికి. పిల్లలు మరీ ప్రాణాలు తీసేశారు. వేణు కలిగించుకుంటూ .” మీరు ఇలా చేస్తే తాతయ్య మన ఇంటికి రారు. “ అని బెదిరించి సముదాయించే వాడు. వేణుకు విసుగనిపించలేదు. కానీ స్ఫూర్తి రాను రాను అన్నీ పోగొట్టుకున్నట్లు ప్రవర్తించ సాగింది.ఎక్కడో చూస్తూ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండటం చూసి భయంవేసింది !! పదే పదే ఉత్సాహపరచాల్సి వచ్చేది.

ఈ నెల రోజుల్లో, ఒక గది ప్రత్యేకంగా అన్ని సదుపాయాలు అందు బాటులో ఉండేటట్లు అమర్చారు. పిల్లల యక్ష ప్రశ్నలు ,భయాలు ఆత్రుతలు; వాళ్ళ తాతయ్యకు ఏది అవసరమో ఆలోచించి తరిచి తరిచి అమర్చారు.ఆ రోజు రానే వచ్చింది.

వేణు ఇంటికి రాగానే మామిడాకు తోరణాలు, వాకిట వెల్కం అనే ముగ్గు ,బ్యానరు చూసి ఆశ్చర్యంగా కూర్చోనేసాడు. బుడతడు, అంకిత చుట్టుపక్కల దొరికిన పిచ్చి పూలన్నీ తెచ్చి బోకేలాగా కట్టి వాకిట ముందు నిలుచుని గర్వంగా చూసారు వేణుని.

కూర్చున్న వేణు దగ్గరకు స్ఫూర్తి ఆత్రుతగా వచ్చి,” ఆ బాత్రూంలో గోడలకు పట్టుకు లేచెందుకు రైలింగ్స్ పెట్టిస్తే బాగుంటుందండి .ఒక్క సారి లేచి వచ్చి చూడరా .” అంటూ బలవంతంగా లాక్కుపోయింది స్ఫూర్తి .

“ఎందుకీ హడావిడి; ఆయన మనింట్లో మనిషే కదా!ఇంత ఆర్భాటం ఎందుకు?’

“ నన్ను మిమ్మల్నుంచి కాపాడే దేవుడు కదండి! ”

“అంత రాక్షసుడ్నా! నరకం చూపిస్తున్నా నేను?” ఆ వ్యంగానికి చిన్నబోయినట్లు అన్నాడు వేణు.

“వంట చెయ్యాలికదండి.” అంది ప్రక్కకు తిరిగి నవ్వుతూ

అర్ధం చేసుకుని “ చివరికి ఆ పోర్ట్ ఫోలియో ఇచ్చావన్నమాట. నువ్వు చాలా అతి చేస్తున్నావు. ఒకవేళ ఆయన రాకపోతే?”

వెనక్కు తిరిగి భయంగా చూస్తూ, శిలలా నిలిచిపోయింది.

వేణు హడావిడిగా దగ్గరకు వెళ్ళి గట్టిగా కదిలిస్తేనేగాని ఈ లోకంలోకి రాలేదు.

జాలి కోపం విసుగు మూడు పెన వేసుకున్నాయి వేణుని. తలపట్టుకు కూర్చోనేసి.,”ఇలా అయిపోతే ఎలా?ఆయన పరిస్థితి కూడా మనం ఆలోచిచాలికదా !

ఆయన పిల్లల్ని పెట్టుకొని మన దగ్గరకు....!?”

“మీరిక మాట్లాడకండి.గుండెలు నిలిచిపోయేటట్లున్నాయి. పిల్లలుండి ప్రయోజనం ఏవిటి?మంచి చెడు మాట్లాడుకునే మనిషిలేక, నిరాస నిస్పృహలతో కుమిలిపోతూ, చావు ఎప్పుడువస్తుందా అని ఎదురుచూడటమా వృద్దాప్యానికి అర్ధం.? కర్కోటపు గాడిదలు. ఎలా పుట్టారో ఆయన కడుపున?” చీదరించుకుంటూ రుసరుసలాడింది.

మౌనంగా వింటూ, ఆలోచనగా చూస్తుండిపోయాడు వేణు.

అది చూసి ,”ఇంకా ఏవిటి: అలాగే కూర్చుండిపోయారు? లేవండి! త్వరగా వెళ్ళండి .ప్రోద్దుపోతుంది..”అని హడావిడి చేసేసింది. వేణుకు తప్పలేదు.

***

స్ఫూర్తి పిల్లలకి మంచి బట్టలు వేసింది.తనూ స్నానం చేసి దిష్టికి స్వాగతించడానికి పూలు పసుపునీళ్లు కర్పూరం ఉన్నాయా లేవా అని మరి మరి చూసుకుంది.

పిల్లలు మరీ ఆత్రుతగా ఉన్నారు. ఏ ఆటో వీధిలో వస్తున్నా,” తాతయ్య వస్తున్నాడు...తాతయ్య.” అంటూ లేచి వాళ్ళమ్మను కుదుపుతూ ,దగ్గరకు రాగానే అది కాదని తెలిసి నిరాశ చెందుతున్నారు నిముషాలు గంటలుగా గడుస్తున్నాయి. ఎందుకో ఆలస్యాన్ని భరించలేకపోతుంది.,ప్రొద్దుకృంగి పోతున్నట్లు అనిపించి ఆత్రుత పెరిగి పోతుంది స్పూర్తికి.

అప్పుడు కనిపించాడు వేణు ఒంటరిగా!!ఆయన ఆటోలో వస్తుంటారని నిక్కి నిక్కి చూసింది. ఎక్కడా కనిపించలేదు.గుండెల్లో నిరాశ నిండుకుంది. ఈ లోగా వేణు దగ్గరగా వచ్చాడు.

ముగ్గురూ పరుగెత్తుకుంటూ దగ్గరకు వెళ్లి ,” తాతయ్య ఎక్కడ నాన్నగారు, ఆటోలో వస్తున్నాడా? మరి మీరెందుకు...!” ప్రశ్నలతో వేణుని విసిగించేసారు.

“అబ్బా ! అంతా ఇక్కడేనా !! లోపలి పదండి.” అంటూ తొలగతోసుకుని లోపలి నడిచాడు.

కూర్చునేలోగా,” ఏమయ్యిందండి ! ఎందుకు రాలేదు.?” అంటూ .ఆతృతను భరించలేక నిలదీసింది స్ఫూర్తి.

ఆమె వైపు పిల్లలవైపు చూసాడు. నిరాశతో కళ్ళల్లో నీరు ఉబుకుతున్నట్లు

అనిపించింది. ఎలా చెప్పాలో ఏమని చెప్పాలో అర్ధంకాలేదు వేణుకి.

“స్తిమితంగా కూర్చుంటున్నారేమండి! ఏం జరిగింది ?ఎందుకు రాలేదు.?”

చేతులు పట్టుకుని కుదుపుతూ తట్టుకోలేనట్లు అడిగింది స్ఫూర్తి .

“ ఆయన ఇంట్లో లేరు. తాళం వేసుంది.” విసుగుతో ఒక్క అరుపు అరిచాడు వేణు.

ఒక్క ఉదుటున వీధిలోకి దూకబోతున్న స్పూర్తిని పట్టుకున్నాడు.

“వదలండి..వదలండి! ఆయన అబద్ధం చెప్పడు .మోసం చెయ్యడు. నేను వెళ్లి

చుట్టు ప్రక్కల....”

“అంతా అయ్యింది. అందుకే ఇంత ఆలస్యం. ఎవ్వరికి తెలియదన్నారు. బహుశా వాళ్ళ పిల్లలు తీసుకెళ్ళి ఉంటారేమోనని వాళ్లకు కూడా ఫోను చేసాను. జవాబు లేదు. మళ్ళీ కాస్సేపు తరువాత చేద్దాం. ఆత్రుతపడకు.ఎక్కడికి వెళతారు? వస్తారు.”

కుప్ప కూలిపోయింది. పిల్లలు కూడా వచ్చి తల్లిని కౌగలించుకుని ఏడవటం మొదలుపెట్టారు.

ఈ అతి చేష్టలకు వేణుకు చాలా విసుగు కోపం వచ్చాయి.” ఎందుకలా అయి పోతారు కొంప మునిగినట్లు.వస్తారులే కనుక్కుందాం.అవన్నీ తీసి లోపలుంచి ,కాస్త కాఫీ యివ్వు.”

ఎంతకీ కదలక, అంతా పోగొట్టుకున్నట్లు, ఎక్కడో చూస్తున్న, భార్యను చూసి విసుగ్గా లేస్తూ ,”పిచ్చి..పిచ్చి,!! ముదిరిపోయింది. నేనే పెట్టుకుంటాను.” అప్పటికి కదలక పోయేసరికి, లోపలి కెళ్ళి కాఫీ కలుపుకొని వచ్చి కూర్చున్నాడు. అప్పటికి అలాగే ఉన్న పిల్లల్ని భార్యను చూసి,” వస్తాడు.ఎక్కడకీ వెళ్లరు. మిమ్మల్ని వదిలి.!! లే! అలా ఉండకూడదు.” అనునయిస్తూ వాళ్ళను దగ్గరకు తీసుకున్నాడు.

” ఏవండి; వాళ్లకు మళ్ళీ ఫోను చెయ్యండి.” అని బ్రతిమలాడినట్లు అడిగింది స్ఫూర్తి. జాలిగా ఆమె వైపు చూస్తూ నెంబరు చేసి ఆమె చేతికే ఇచ్చాడు. ఒకసారికాదు పది సార్లు , ఇక చాలు అనేంత వరకు చేసి జవాబు లేక పోయేసరికి దిగులుగా వేణు వైపు చూసింది.

“దిగులు పడకు. మళ్ళీ సాయంకాలం వెళ్లి కనుక్కుంటాను.”

“ ఇప్పుడే వెళదాం.” అందరూ ఒకేసారి లేచారు.

“నా మాట విను.సాయంకాలం కాస్త పనుంది.వచ్చేటప్పుడు చూస్తాను.లేకుంటే రేపు..!.”

మాట పూర్తి కానివ్వలేదు,” నాకు షాపింగు ఉందండీ.నేనే వెళ్లి కనుక్కుంటాను.” అంది పిల్లల్ని పురమాయిస్తూ స్ఫూర్తి.

వేణు నిస్సహాంగా కోపంగా చూసి ,”సరే ! మీ ఇష్టం.” ఆమాటతో పిల్లలు ఎగిరి గంతులేస్తూ వీధిలోకి పరుగులు తీసారు.స్ఫూర్తి అనుసరించింది.

వేణు చేసేది లేక టివి ఆన్ చేసుకున్నాడు. చూస్తూ చూస్తూ మధ్యలో మళ్ళీ కాఫీ పెట్టుకుందామని లేచాడు. అప్పుడు తెలిసింది చాలా పొద్దుపోయిందని. లైట్లు వేస్తూ ఇంకారాలేదేమా , అని వీధి వైపు చూసాడు. ఎవరిదో ఏడుపు వినిపించింది. ఆత్రుతగా బయటకొచ్చి చూసాడు. స్ఫూర్తి,

ఆమె వడిలో పిల్లలు ముడుక్కుని పడుకొని ఉన్నారు. పరిస్థితి అర్ధమైంది.

“ఏవిటిది; ఎప్పుడొచ్చారు; బయట కూర్చోనున్నారేవిటి.? లేలే..లోపలికి రండి.!!” అని గట్టిగానే అన్నాడు.

కదల్లేదు.కోపంగా చూసాడు. అయినా పిల్లలు తలెత్తి మాత్రామే చూసారు.

“వస్తారా ..రా రా? కొంపమునిగినట్లు ఏవిటీ చేష్టలు; ఆయన చచ్చినట్లు?”

“ అలా అనకండి.మా ప్రాణాలుపోతాయి.”అంటూ ఒక్క అరుపు అరిచి పిల్లల్ని తీసుకుని నేరుగా రూములోకి వెళ్లి తలుపులు వేసుకుంది.

ఈ పిచ్చి ఏవిటో మరీ విసుగు పుట్టించింది. లోపలికి వెళ్లి ,”ఎందుకు ఇలా అయిపోతున్నావు. నిన్ను చూసి పిల్లలు మరీ దిగులుపడిపోతున్నారు. రేపు, వాళ్ళ పిల్లల ఇంటికి వెళ్లి కనుక్కుంటాను .ఎక్కడికి వెళ్లుండరులే, వస్తాడు..పిల్లలకు ఆకలవుతుందేమో !.ఏదయినా చెయ్యాలికదా!” చెప్పాడు.

స్ఫూర్తి మాట్లాడలేదు.మెల్లగా తలతిప్పి వేణుని చూసి,” ప్లీజ్ ! ఈ రోజుకు నన్ను వదిలెయ్యండి.అన్ని ఉన్నాయి మీరు పిల్లలు తినేయ్యండి.” అంటూ ప్రక్కకు తిరిగి పడుకుంది.

విధి లేక పిల్లల్ని వెళ్ళికదిపాడు. వాళ్ళు అదేమాట అన్నారు. స్ఫూర్తి వైపు చూసి ,” చూడు మీరందరూ పస్తులుంటే నేను ఉండలేనా? అయినా, దీనికెందుకు యింత రాద్దాంతం చేస్తున్నావు.” అన్నాడు కాస్త కోపంగా విసుక్కుంటూ వేణు .

“ ఒక వేళ ఇక్కడకు రావడం ఇష్టం లేదో , మరేదో జరగరానిది....!నన్ను మోసం చేసారు.” మాట్లాడలేకపోయింది.

“తెలివి తక్కువగా అతిగా ఆలోచించకు.అలాంటివి ఏమీ జరిగుండవు. పిల్లల్ని గురించి ఆలోచించు. నువ్వు యిలా ఉంటే మరీ దిగులు పెట్టుకుంటారు. లే! వాళ్ళను సముదాయించు. రండి; అందరం భోంచేస్తాము.” అంటూ బలవంతంగా అందరిని కదిలించేసరికి అలిసిపోయాడు.

మరసటి రోజు వెళ్ళాడు. ఏవిషయం తెలియలేదు. కొడుకుల ఇండ్లకు వెళ్లి కనుక్కుంటే సింగపూరు టూరుకు వెళ్లి ఉన్నారని తెలిసింది. మరి ఈయన ఏమయినట్లు? వేణుకు కూడా ఆత్రుత హెచ్చింది.చెపుదామా వద్దా అని చాలా ఆలోచించి .చెప్పకపోవడమే మంచిదని మానుకున్నాడు. అందరూ దిగులు పడిపోయారు. దేనీకైనా బయటకు వెళ్ళి తిరిగివస్తే ,”కనిపించారా? ఏమయినా తెలిసిందా ?అక్కడకనుక్కున్నారా?వాళ్ళను అడిగారా? వీళ్ళ దగ్గరకు వెళ్ళారా? ఎక్కడికి వెళ్లి ఉంటారు?” ఈ ప్రశ్నలతో ఊపిరి ఆడనిచ్చేవారుకాదు.

రోజులు గడిచేకొలది వాళ్ళు మరీ దిగాలుపడి తిండితిప్పలు మానేసారు. ప్రపంచం తల్లక్రిండలు అయినట్లు, ఇంకేముంది జీవితం అన్నట్లు ముఖాలు పెట్టుకుని ,ఎక్కడో చూస్తూ,ఎదో ఆలోచిస్తూ ఉన్న వాళ్ళను చూసేసరికి జాలి, విసుగు, కోపం ఎక్కువ కాసాగాయి వేణుకి. ఎంత నచ్చ చెప్పినా బ్రతిమలాడినా ప్రయోజనం లేకుండా పోయేది.

వెంటనే ఒకరికి మార్చి ఒకరు జ్వరాల బారిన పడ్డారు . వేణు పని మరీ కష్టం అయిపోయింది. మామూలు జ్వరమే తగ్గిపోతుంది అనుకున్నది, ఎన్ని మందులు ఇచ్చినా, ఎంతమంది, డాక్టర్లకు చూపించినా, ఎక్కువయ్యిందే కాని తగ్గలేదు. దీంతో, పిల్లలకు స్కూలు, స్పూర్తికి తనకు ఆఫీసు ఉందని మరిచిపోయాడు వేణు. డాక్టర్ల దగ్గరకు వాళ్ళను తీసుకెళ్ళడం, సలైన్లు పెట్టించడం, బలవతంగా, ఏదయినా తినిపించడంలో నెలరోజులు గడిచిపోయిన సంగతి గుర్తురాలేదు వేణుకి. నానాటికి దిగజారిపోతున్న, వాళ్ళ పరిస్తుతుల్ని చూసి,పిచ్చి పట్టి పోయింది వేణు. ఎవరు చెప్పినా, దాన్ని గుడ్డిగా చేయిస్తున్నాడు. చివరకు, ముడుపులు, మంత్రాలు, దిష్టిలు, వంటివి కూడా చేయించాడు. ఏమాత్రం తగ్గలేదు; మార్పులేదు. ఆలోచించి ఆలోచించి, తలనొప్పి, బాధ, ఎక్కువయ్యాయే గాని మార్గం కనిపించలేదు. ఆయన పిల్లలు వచ్చిఉంటారని యింటికి వెళ్లి.పరిస్థితి చెప్పి అడిగితే 'మాకేం తెలుసు,కనుక్కుంటాము' అని అంటీ అంటనట్లు సమాధానం చెప్పారు. చాలా కోపం వచ్చింది. మనుషులుగా బ్రతకండి అని ఒక్క అరుపు అరిచి విరక్తితో అసహ్యంతో తిరిగి వచ్చేసాడు. ఎక్కడలేని దిగులు ముంచుకొచ్చి వీళ్ళు ఏమవుతారోనని భయం వేసింది.వాళ్లకు బ్రతిమలాడి, భంగపడి,కోప్పడి, బలవంతాన జావా తాగించి అలిసిపోయి సోఫాలో కూర్చున్నాడు.

ఎవరో తలుపు కొట్టినట్లు అనిపించి మామూలేకదా అని కదలలేదు.ఇలా జరిగి నప్పుడల్లా పిల్లలు స్ఫూర్తి కదిలి తలుపు వైపు చూసి, దిగులుతో, నిరాశతో, మరీ కుంచించుకు పోయేవారు.

మళ్ళీ తట్టారు.ఈ సారి ఆధర్స్ గబుక్కున లేచి,” తాతయ్య” అంటూ లేవబోయి పడ్డాడు.గబ్బుకున వెళ్లి పట్టుకుని మంచం మీద పడుకోబెట్టుతూ,” తాతయ్య కాదు ఏం కాదు...పడుకో.”అని గదమాయించి దుప్పటి కప్పేలోగా మళ్ళీ తట్టారు.

“అవును తాతయ్యే .అది మాకు చెప్పాడు.ఎవరైనా ఇంటికి వెళితే వాళ్ళను తొందర చెయ్యకూడదు మూడుసార్లు తట్టి మళ్ళీ కాస్త టైమిచ్చి పిలవాలన్నాడు.” అంటూ ఈసారి అంకిత లేవబోయింది.

“లేవకు .పడుకో .నేనుఛూస్తాను.” అని వెళ్లి తలుపు తీసి అలాగే నిలిచిపోయాడు వేణు.

ఎలాంటి శబ్దం రాకపోయేసరికి స్ఫూర్తి లేవలేక తిరగిచూసింది.ఎవ్వరుకనిపించలేదు.?పిల్లల వైపు చూసింది.లేవడానికి ప్రయత్నిస్తున్నారు.


“ఏం లోపలికి రానివ్వవా?” అనేమాట విని దూకి శీనయ్య చేతుల్లో వాలిపోయారు పిల్లలు.. వాళ్ళు పెడుతున్న ముద్దులతో ,తిరిగి శీనయ్యముద్దులు పెడుతున్న శబ్దం, అపురూపమైన దివ్య సంగీతంగా వినిపించి, మూగవాడే అయ్యాడు వేణు..ఆత్మీయ వాత్సల్యాలలో ఇన్ని సునిశిత రాగాలు దాగి ఉంటాయని, అదొక దివ్య ఔషుదమని, అప్పుడే తెలిసింది. ఆనిష్కల్మష ప్రేమకు జోహార్లు అర్పించాడు. కారిపోతున్న కన్నీళ్ళలో వయోతారతమ్యాల దివ్వానుభూతి పులకరింపు కలిగించింది . ఈ పూర్వజన్మ అనుబంధ ప్రతిరూపాలయిన , మనవళ్ళు మనుమరాళ్ళ, చిరుముద్దుల కౌగిళిలో, చివరి శ్వాస వదలాలని, ఎన్ని కష్టాలకైనా అవమానాలకైనా ఓర్చుకుని, పసిడి మొగ్గల సుఘంధ సౌరభాలకోసం, తమ జీవితాల్ని పోడిగించు కోవాలనుకుంటారు, ఈ చివరి గడియ మోక్ష ప్రాప్తికోసం కాదు . ఏనాటిదో ఈ బంధం యుగయుగాల దివ్యాను బంధం.వృద్ధులకు వరం.!!

“ఇదేవిటి బిడ్డల వొళ్ళు కాలిపోతుంది. జ్వరముంది. ఏం చేస్తున్నావు.? ఎలా తగ్గిపొయిఉన్నారొ చూడు!!” నిలుపులేకుండా నిలదీశాడు శీనయ్య ,వేణు వైపు ఆత్రుతగా చూస్తూ.

“అది మీరు ఇచ్చిన వరమే ! మీ వలెనే, మీ అమ్మాయి కూడా రేపోమాపో అన్నట్లుంది .” పిల్లల్ని తీసుకొని ఆదుర్దాగా స్ఫూర్తి దగ్గరకు వచ్చి చూసి నోట మాటరాక నిలిచిపోయాడు. స్ఫూర్తి ఆయన్ని చూసి కోపంగా బాధతో ప్రక్కకు తిరిగి పడుకుంది. మెల్లగా దగ్గర కూర్చొని పిల్లల్ని కౌగిలిలో ఉంచుకొని,” ఏవిటిది నా తల్లి? ఎంత చిక్కి పోయి ఉన్నావో చూడు.”అంటూ అనునయంగా ప్రేమతో దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నించాడు శీనయ్య .

అంతే ఒక్కసారిగా సివంగిలాగా లేచింది.,”మీరెవ్వరు అది అడగటానికి; మీరెవ్వరు ఇక్కడకు రావడానికి ;మీకుమాకు ఏం సంబంధం ఉంది? వెళ్ళండి !! మీ ముఖం నీను చూడలేకున్నాను.ఇన్ని అబద్దాలు చెప్తారా? ఇంతమోసం చేస్తారా? మామీద ఏ మాత్రం ప్రేమ వాత్సల్యం ఉంటే మమ్మల్ని దిక్కులేకుండా వదిలేస్తారా? వెళ్ళండి ! ఈ వయస్సులో ఇన్ని మోసాలు చేసే వాళ్ళంటే నాకు పరం అసహ్యం. ఇకనెప్పటికీ రాకండి.చస్తే కూడా రాకూడదు.” అని ఆయాసంతో రొప్పుతూ ముఖం దిండులో దాచుకొని ఏడుస్తూ ఉండిపోయింది.

శీనయ్య ముఖంలో నెత్తురు చుక్కలేదు. అలాగే నిలిచిపోయి ఎప్పటికో వేణు వైపు చూసి వెలితిగా నవ్వాడు.

వేణు క్షమాపూర్వకంగా ఆయన వైపు చూసాడు.పిల్లలు తాత వడిలో చేరారు. శీనయ్య స్ఫూర్తి చేతులు మళ్ళీ తన చేతుల్లోకి తీసుకోడానికి ప్రయత్నించాడు.రెండు మూడుసార్లు విసిరికొట్టింది.

చివరకు,”తల్లి! నువ్వు ఎంత కటిన శిక్ష వేసినా భరించడానికి సిద్దంగా ఉన్నాను.నన్ను అపార్దం చేసుకోకు. నా పరిస్తితులు అర్ధం చేసుకో.” అన్నాడు చాలా ప్రాదేయపడుతూ.

అంతే, అరుచుకున్నారు... వాదించుకున్నారు... క్షమాపణలు చెప్పించుకున్నారు.ప్రమాణాలు చేయించుకున్నారు. అలిసిపోయి చివరకు, ఆయన వడిలో దాగి, ఇన్నినాళ్ళ మానసిక వ్యధను శ్రమను మరిచిపోయి మైమరచి ఘాఢ నిద్రలోకి జారుకున్నారు. మెల్లగా వాళ్ళనందరిని ప్రక్కకు పడుకుబెట్టి ఆలోచిస్తూ వేణు దగ్గరకు వచ్చాడు శీనయ్య.

“మరీ ఇంత జబ్బున పడ్డారేమిటి?" చాలా ఆత్రుతగా ఆవేదన చెందుతూ అడిగాడు.

“మీ చలవ!!.” నిష్టూరంగా అన్నాడు వేణు .

“నేనా?!”

“అవును. వాళ్ళ ప్రాణాలు మీ ప్రేమ చేతుల్లో ఉన్నాయి ” అని శీనయ్య కళ్ళల్లోకి చూసాడు వేణు.

ఆ చూపులను భరించలేక ఆలోచిస్తూ తల దించుకున్నాడు. గాఢంగా నిట్టూర్పు వదిలి,” సరే! పిల్లలు చాలా నీరసంగా ఉన్నారు. ఏదయినా చేస్తాను.ఇంట్లో పండ్లు ఉన్నాయా? కాస్త రసం తీసి ముందుగా తాగించాలి. తరువాత డాక్టర్ దగ్గరకు తీసుకెళదాం.” అని వేణు వైపు చూసాడు.

“ఏమీ వద్దు.!?అన్నాడు వేణు నర్మగర్భితంగా .

“ ఎందుకని?” విస్తుపోతూ అనుమానంగా వేణు వైపు చూసి అడిగాడు.

“శక్తీ ,భక్తి, ముక్తి అన్నీ మీరే!! ఇక ఏమందులు వద్దు! పండ్ల రసాలు వద్దు.చ్చూస్తుండండి రేపటిలోగా ఎలా గంతులేస్తారో .!”

శీనయ్య వేణు కళ్ళలోకి చూడలేక చూసి,” క్షమించు!!.ఇలా అవుతారని అనుకోలేదు. నా పరిస్టితులు కూడా అలాగే ఏడ్చాయి.” అంటూ తప్పు చేసినట్లు. అన్నాడు .

“ వాళ్ళు తీసుకెళ్లారా? రానివ్వలేదా?”అనుమానంగా చూస్తూ అడిగాడు.

“కాదు!!.” అని కళ్ళు దించుకుని అవమానాన్ని అభిమానంలో దాచుకుని మొహమాటంగా అన్నాడు.

“మరి?”

“తరువాత చెపుతాను.” అంటూ వంటింటి లోకి లేచి వెళ్ళాడు శీనయ్య . వేణు కూడా వెంట నడిచాడు. ఆయనకు ఏం జరిగిందో, ఇన్నిరోజులు ఎక్కడున్నాడో తెలుసుకోవాలని ఉంది . మరీ మరీ అడిగితే బాగుండదేమోనని వెనకాడాడు. శీనయ్య చేస్తున్నంత సేపు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్డటం గమనించాడు.

అప్పడప్పుడు ఘాఢ నిట్టూర్పులు వదులుతుండటం కూడా గమనించాడు. బత్తాయి రసం తీస్తున్న ఆయనతో, ” మీ అమ్మాయి మీ కోసం కారుకొనింది.” ఆ మాటతో నిజమా అన్నట్లు వేణు వైపు చూసాడు. ” ఎప్పుడో వచ్చేసి ఉండాలి. మీరు రాలేదని కాన్సిల్ చేసింది. మీరు వచ్చారుకదా రేపే డెలివరీ తీసుకుంటాను.” అన్నాడు. కళ్ళు తుడుచుకుంటూ ఈ లోకంలోకి వచ్చి లేని నవ్వు తెచ్చుకుంటూ,” నాకు కాదు. నా చిన్నారులకు. !!” వేణు ఆయనకు జ్యూస్ పోసి ఇచ్చాడు. వద్దని దూరం చేసాడు శీనయ్య.

“మీరుకూడా వాళ్ళకంటే అద్వానంగా ఉన్నారు. తీసుకోండి.” బలవంతం చేసాడు.

“ ఆకలి అలవాటైన, అలగని మనసున్న సిగ్గులేని జాతి మాది. పస్తులున్నా పడి పోని వృద్ద జాతి మాది. ఎదురుదెబ్బలు ఎన్ని తిన్నా చావని శక్తీ మాది. తిట్లు, శాపనార్ధాలు ఆశీర్వాదాలుగా మన్నించి మరణిస్తూ ప్రొద్దుపుచ్చడం మా విధి.” అంటూ హాల్లోకి వచ్చి లోకాన్ని మరిచి నిదురపోతున్న స్పూర్తిని, పిల్లల్ని చూసి,” కాస్సేపు పడుకోనివ్వు.పాపం. ఎలా పడుకోనున్నారో చూడు.” అంటూ తృప్తితో కన్నీళ్లు తుడుచుకుంటూ సోఫాలో కూర్చున్నాడు శీనయ్య.

వేణు ఎదురుగా వచ్చి కూర్చున్నాడు. నిశ్శబ్దం!! చాలా సేపు మౌనంగా ఉండలేక పోయాడు వేణు.

“నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు .” అడిగాడు వేణు.

ఉలిక్కిపడి వేణు వైపు ,” ఆ..ఆ ఏవిటి?” అంటూ చూసాడు.

“ ఇన్ని రోజులు ఎక్కడకి వెళ్ళారు? కనీసం ఎక్కడున్నారో చెప్పడానికి కూడా తీరిక లేదా? ఇక రెండో రోజులు మీరు రాకపోతే వీళ్ళను నేను పోగొట్టుకోనుండే వాడిని.”

ఆ మాటల్లో అణుచుకోనున్న ఆవేదనంతా బయటపడి కళ్ళు చమర్చాయి వేణుకు..

“అంతమాట అనకు.నా ప్రాణం ఇప్పుడే పోతుంది.” అదుపు చేసుకోవాలని వేణు చేయి పట్టుకున్నాడు.

“మరి చెప్పండి. ఏం జరిగింది?”

ఇద్దరి మద్య మళ్ళీ నిశ్శబ్డం. చివరకు ఒకటి రెండు సార్లు వేణు వైపు చూసి."నేను చెప్పేవి అమ్మాయికి ఎలాంటి పరిస్టితుల్లోను చెప్పనని మాట ఇస్తావా?’ ఆగి ప్రాధేయపూర్వకంగా వేణు కళ్ళల్లోకి చూసాడు.

సరే అన్నట్లు తలూపాడు వేణు.

వెంటనే చెప్పలేక చాలా సేపు ఎక్కడో చూస్తూ ఉండిపోయాడు. .చివరకు," ఇండ్లు అమ్మేసారు.” అని నవ్వాడు శీనయ్య.

నోట మాట రాలేదు .విస్తుపోయి చూసాడు వేణు.ఆయన ముఖంలో బాధ కనిపించలేదు.

“మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళారు కదా! అది చాలు!!” అన్నాడు తన అనుమానాన్ని దూరంచేసి వేణు.

“లేదు. నన్ను వృద్దాశ్రంమంలో చేర్చారు. ఊరికి చాలా దూరం!!. చెప్పి పంపాలని ఎంతో ప్రయత్నం చేసాను. డబ్బులిస్తేనే అక్కడుండేవాళ్ళు కదులుతారు. మేం బయటకు రావడానికి లేదు.” మాటల్లో భాద వినిపించినా చాలా తేలిగ్గా తీసుకున్నట్లు నవ్వాడు.

ఒక్కసారిగా వేణు కుంచించుకు పోతున్నట్లు ఉలిక్కిపడి ఆశ్చర్యంగా చూస్తూ,“ వృద్దాశ్రమామా!?” అంటూ ఆగిపోయి విస్తుపోతూ,” డబ్బు కాస్త కూడా ఇవ్వలేదా?

అదేవిటి జైలా. రానివ్వక పోవడం ఏవిటి?” అని అసహ్యించుకున్నట్లు కోపగించుకున్నాడు.

“అవి వాళ్ళ రూల్సు. మనోవేదనతో, జీవితం మీద విరక్తితో విసిగిపోయిన వాళ్ళు, పారిపోతారు లేదా ఆత్మహత్య చేసుకుంటారని ఇరవై నాలుగు గంటలు కాపలా కాస్తుంటారు. నెలకోసారి మాకు కావల్సినివి మేం కొనుక్కోవచ్చు. అందుకని తీసుకు వచ్చారు. అది వీలు చూసుకుని యిలా వచ్చాను. ఒక గంట లోపల వెళ్లి పోవాలి, లేకుంటే పోలీసు రిపోర్ట్ ఇస్తారు. వీళ్ళను ఈ పరిస్టితుల్లో వదిలి వెళ్ళలేను.ఎం జరుగు తుందో జరగనీ.”అంటూ గాఢనిట్టూర్పు వదిలాడు.

“మరీ ఘోరంగా ఉంది. విడ్డూరంకూడా!!” నమ్మలేనట్లు తల అడ్డంగా తిప్పుతూ అన్నాడు.

“ నా జీవితమే విడ్డూరం.” అంటూ నవ్వి,” ఇది తెలుసా ! ఏదో ఫ్లాట్ కొనుక్కోవాలంట. నన్ను తీసుకు వెళతారేమో....?’ అంటూ ఆపి వేణు వైపు చూసాడు. కోపంతో గబుక్కున లేచాడు నోటికి వచ్చినట్లు వాళ్ళను తిట్టుతూ వేణు.

“ కూర్చో! కోపం తెచ్చుకోకు.వాళ్ళ సొత్తు అది..” అన్నాడు స్థిమితంగా శీనయ్య.

“ మీరెవరు ? వాళ్ళ సోత్తుకాదా! వాళ్ళు సంపాదించిందా? బాధ్యత వద్దు.ఆస్తి

మాత్రం కావాలా? నీచులయి పోయారు. మరీ ఇంత దారుణమా? బాధ్యతను, బంధాన్ని డబ్బుతో వ్యభిచారం చేసే వాళ్ళు. తిండి తింటున్నారా లేక పే...?”

“తిట్టకు వాళ్ళ అవసరాలు ఎన్నో?”

ఆశ్చర్యపోతూ,” వాళ్ళ మీద కోపం లేదా? మీ పెంపకం అంత దారుణం అనుకోను!?” అన్నాడు.

“కాదు... కాదు!! వాళ్ళను చూసి, వీళ్ళవి విని , భార్యల బోధతో నేర్చుకున్నవి. నవనాగరికత సూక్తులు. మానవ సంబంధాలలో కలియుగ వ్యాపార విన్యాసాలు..” అంటూ నవ్వి,” మా తరం వేరు, మీ తరం మనోభావాలు వేరు. మేమూ వాటిని నమ్ముకుంటే మాకు భవిష్యత్తేఉండదు అనే భయం. ఆత్మవిశ్వాసం లేదు.”

“నేటి సమాజం, యువత ఆలోచన , అంత నికృష్టంగా, కుచ్చితపు బుద్దులతో, కరుడుగట్టిన స్వార్ధ పూరితమై పోయింది. రేపు మనమూ దీనికి బలికావాలి అనే నగ్న సత్యాన్ని డబ్బు వ్యామోహంతో పాతాళంలోకి తోక్కేసారు. ఛీ..వీళ్ళ పుట్టుకలెందుకు?”

ఎదో శబ్దం వినిపించి లోపలి చూసాడు శీనయ్య, వేణు అదిగమనించి మాటలు

నిలిపేసాడు. స్ఫూర్తి లేచి ప్రక్కకు తిరిగి పడుకోవటం చూసి,” విని ఉంటుందా” అని

రహస్యంగా అడిగాడు వేణుని. ఏమో అన్నట్లు చేతులు తిప్పాడు వేణు.

ఇంతలో పిల్లలు కదిలి దగ్గరకు రావడానికి ప్రయత్నించారు. హడావిడిగా లేస్తూ,” రావద్దు..లేవోద్దు .నేనే వస్తాను.” వేణు వైపు తిరిగి “,అమ్మాయికి చెప్పొద్దు.” అంటూ పండ్లరసం తీసుకొని దగ్గరకు వెళ్ళాడు. “రావద్దు. తేవద్దు ”అని గట్టిగా కసురుకొంది.

వేణు వచ్చి బ్రతిమలాడి ఇప్పించాడు.

***

ఆయన రాకతో నరకంగా ఉన్న ఇల్లు కొద్ది రోజుల్లోనే స్వర్గంగా తయారైంది. ప్రపంచంలోని ఆనందం,ప్రశాంతత అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నట్లు అనిపించింది వేణుకు. స్ఫూర్తి , వేణు, దేన్నీ గురించో చాలా సార్లు దీర్ఘంగా మాట్లాడుకోవటం గమనించాడు శీనయ్య.

మరుసటి రోజు నుంచే కొత్త కారు తీసుకు రమ్మని పిల్లలు పోరు పెట్టసాగారు. ఆరోగ్యం కొంచెం స్టిమిత పడనీ అని ఎంత చెప్పినా వినేటట్లు లేరు. వారం నెట్టేసాడు. తప్పదన్నట్లు వెళ్లి తీసుకొచ్చాడు. పిల్లలు టెంకాయ కొట్టమని, దిష్టి , పూలమాల, బలవంతంగా ఆయన చేత్తోనే వేయించారు ఆ ప్రేమకు అభిమానానికి కళ్ళల్లో నీరు తిరగడం గమనించాడు వేణు. స్ఫూర్తి దీన్నంతా గమనిస్తుందేగాని ముభావంగా ఎక్కడో ఆలోచిస్తూ, శీనయ్య ప్రశ్నిస్తే జవాబు చెప్పక కోపంగా చూస్తూ, తిరుగు తున్నట్లు అనిపించింది వేణుకు. శీనయ్యకు ఆమెకు తను వేణు మాట్లాడిన సంగతి అంతా విని అలా ప్రవర్తిస్తుందని అర్ధమైపోయింది. భయం వేసింది. ఆమెను మామూలుగా చెయ్యాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కోపం, అలక, తగ్గినట్లు అనిపించడం లేదు.ఇది ఇబ్బందిగా అనిపించింది శీనయ్యకు.

మరుసటి రోజు కొత్త కారులో .తాతయ్యే ముందుగా ఎక్కాలని పట్టు పట్టారు పిల్లలు. అమ్మ డ్రైవ్ చేస్తే ఎక్కుతానన్నాడు శీనయ్య . కదలక నిలుచోనున్న స్పూర్తితో, ” మీ నాన్నకు నా మీద నమ్మకంలేనట్లుంది కానీయ్!”అని తాళాలు ఇచ్చాడు వేణు.

తీసుకోక అలాగే నిలుచోనున్న స్పూర్తితో,” నీ కోపం తరువాత తీర్చుకుందువులే! పద.”అంటూ కూర్చోబెట్టాడు వేణు.

పిల్లలు, మాట్లాడుతూనే ఉన్నారు. ఎన్నెన్నో ప్లానులు వేస్తున్నారు.” తాతయ్యను రోజూ పార్కుకు, జూకి, తీసుకెళ్ళాలమ్మా! తాతయ్య వస్తావుకదా .” అని కుదిపెస్తూ బ్రతిమలాడుతున్నారు.

“నేను ఎన్ని రోజులుంటాను..” ఆ మాట సగంలో ఉండగానే షడన్ బ్రేకు వేసింది స్ఫూర్తి. అందరూ అదిరి పడ్డారు

శీనయ్య వైపు కాల్సుకు తినేటట్లు చూస్తూ,” మరొక మాట మాట్లాడారంటే కారుతో సహా నదిలో తోసేస్తా.అందరం చస్తాము. మీరు ఇక్కడనుంచి కదిలారంటే మా శవాల మీదనే నడిచిపోవాలి.” అంటూ స్పీడుగా కారు మళ్ళించింది.

భయపడిపోయిన శీనయ్య, వేణు వైపు చూసాడు. నిశ్శహుడ్ని అన్నట్లు పెదవి విరిచాడు. కారు దిగి స్ఫూర్తి విసురుగా లోపలిక్ వెళ్లి పోయింది. శీనయ్య భయంగా వేణు వైపు చూసి లోపలికొచ్చి సోఫాలో కూర్చున్నాడు. పిల్లలు, వేణు, కారు దగ్గర ఉండిపోయారు. స్ఫూర్తి అతనివైపు కోపంగా చూసి పలకరించకనే కాఫీ తీసుకొచ్చి పెట్టి, దూరంగా ఎడ ముఖతో కూర్చుంది. ఇంతలో వేణు వచ్చి వాళ్ళిద్దరిని గమనిస్తూ కూర్చున్నాడు.

శీనయ్య వేణు వైపు ఏం చెయ్యమంటావు అన్నట్లు చూసాడు. వేణు చేతులెత్తి ఆకాశంలోకి చూసాడు. చివరకు ఉండబట్టలేక,” క్షమించమ్మా! అపార్ధం చేసుకోకు. నేను ఉండను అన్నది...!”

“విషం తెచ్చి మా చేత తిని పించి, వెళ్ళండి.” ఎక్కడలేని కోపంతో విసురుగా అంది స్ఫూర్తి.

ఆ మాటల్లోని దృఢత్వానికి వణికి పోయాడు శీనయ్య. ఏం మాట్లాడాలో అర్ధంగాకాక వేణు వైపు నిస్సహంగా చూసాడు. వేణు దగ్గరగా జరిగి, ఆయన్ని చూస్తూ, ” మీరు ఇక్కడనుంచి ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. మా నిర్ణయ్యాన్ని కాదంటే ఇప్పుడు జరిగిందానికంటే ఎక్కువ ఘోరాలు జరుగుతాయి. అందుకే మీరు మా దగ్గరే ఉండేటట్లు , మీ బిడ్డలు ప్రశ్నించ లేనట్లు మిమ్మల్ని మేము దత్తత తీసుకోవడానికి నిర్ణయానికి వచ్చాము.” చెప్పాడు వేణు.

“దత్తత. నన్నా!? నాకు పిల్లలు...? అయినా పిల్లలు లేనివాళ్ళు అనాధుల్ని....!”అంటూ అయోమయంగా చూసాడు ఇద్దరి వైపు.

అప్పుడు తిరుక్కుంది “ మాట్లాడకండి. ఎవరు మీ బిడ్డలు? ఎక్కడ మీరు కన్న వాళ్ళు?మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు.కన్న బిడ్డల్ని పెట్టుకుని వృద్దాశ్రమంలో ఉన్న అవమానంకంటే ఇది పెద్ద అవమానంకాదు నీ బిడ్డలనబడే అనాధులకు, త్రాష్టులకు !!. మీరే అనేవారు, మనకెన్ని బాధలున్నా ఎదుటి వాళ్ళను సంతోష పెట్టడమే జీవిత సాపల్యం అని, ఆ అదృష్టం మాకు ఇవ్వండి మీరు దిక్కులేని వారనికాదు.మీ అనుభవం,ఆత్మీయత వాత్సల్యాలు నాకూ నా బిడ్డలకు కావాలి.!! అలాకాదని మీరు ఒక్కడగు వేసినా...? ” దగ్గరకు రాకుండా నిష్టూరంగా బెదిరించింది స్ఫూర్తి.

ఆలోచనగా వేణు వైపు చూసాడు. ఎలాంటి భావమూ కనిపించలేదు. వాళ్ళ అభిమానానికి, ఆత్మీయతకు శీనయ్య కళ్ళల్లో కన్నీరు వరదలై పారసాగింది. ఎటూ తేల్చుకోలేని సందిగ్ధం అతని ముఖంలో ముడిపడి ముద్ర వేసింది

“ శ్రమని మీరు అనుకోకండి. మీ బిడ్డలకు మీరు ముడ్డి కడగ లేదా? జబ్బులోస్తే హాస్పిటల్లో తిండి తిప్పలు లేకుండా పడి ఉండలేదా?ఇప్పుడు మీరు మేము బాగుకావడానికి తీసుకున్న శ్రమ మీ వయస్సుకు, శక్తికి మించినపనే అయినా ఎలా చెయ్యగలిగారు? బంధంలోని బాధ్యత, ప్రేమ అర్ధం తెలిస్తే, ఎవరికీ ఎవ్వరూ బరువు కారు, అసహ్యం, అనవసరం అనిపించదు. మీకు సేవ చెయ్యడం పూర్వ జన్మసుకృతం. ఆ భాగ్యం మాకు కలిగించండి. ”అని లేచి దగ్గరకు వచ్చి కూర్చుని ఆయన చేతుల్ని తన ముఖానికి అడ్డుకుంది స్ఫూర్తి .

ఆత్మీయతకు అంకితమైపోయి పరవశించి వణికి పోయాడు. ఈ లోకాన్ని మరిచిపోయి మాట్లాడక ఆమెనే చూస్తున్న శీనయ్య తో ,“ మేము మిమ్మల్ని ఉద్దరిస్తున్నామని అనుకోవడంలేదు. దేవుడ్ని మా ఇంట కొలువుండమని ప్రార్ధిస్తున్నాము. మీకు మొహమాటంగా ఉంటే మీ పెన్షన్ డబ్బులు... అవి మీరు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. కుటుంబంలో ఒకరయినప్పుడు, మా ఆరోగ్య ఇన్సూరెన్సుమీకూ వర్తిస్తుంది. మీరు మాకు భారం కారు. ” అని చేతులు పట్టుకొని,” నాకు తండ్రి భిక్ష పెట్టండి.మమ్మల్ని అనాధల్ని చెయ్యొద్దు. మీకు బిడ్డగా ఉండే అదృష్టాన్ని కలిగించండి. మరీ నచ్చకపోతే మీరు ఎప్పుడైనా వెళ్లి పోవచ్చు.ఆ రోజు మేము ఉండం.”’అంటూ దోసిలి చాచింది స్ఫూర్తి

ఆ ప్రేమకు ,అభ్యర్ధనకు, ఆనందంతో తల మునకలైపోతూ మాట్లాడలేక పోయాడు. సంతోషించను కూడా లేక పోయాడు.. తన కోసం తన తోడు కోసం ఒకరున్నారు అని అనుకోగానే హృదయం నిండిపోయి మూగ పోయింది. ఎంతో శక్తీ తనలో చొరబడినట్లు అనిపించింది. నా జీవితం నాకుటుంబం అనే ఆశతో ప్రపంచం తొలి చిగురులు వేస్తున్నట్లు అనిపించింది. నిరాస నిస్పృహలు పారిపోయాయి. ప్రకృతి అంతా వసంతోచ్సవం జరుపుకుంటున్నట్లు అనిపించింది. ఏం చెప్పాలో తెలియక, ఆమెనే చూస్తున్న శీనయ్య, స్ఫూర్తి కళ్ళల్లో నుంచి జల్లున రాలిన కన్నీళ్లను క్రింద పడనివ్వక తన దోసిట్లోకి తీసుకున్నాడు .

********

రచయిత ఇతర రచనలు : నీ చల్లని చూపులో ....!

రచయిత పరిచయం : డా.కనుపూరు శ్రీనివాసులు రెడ్డి..

నమస్తే !

నా కధ ప్రచురణకు నోచుకున్నందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు నా గురించి గొప్పగా ఏమీ లేదు. సాహిత్యం అంటే మక్కువ. ప్రయోగాలు చెయ్యాలని అభిలాష.

చాలా సంవత్సరాల ముందు కధలు రాసేవాడిని. అన్నీ కూడా ఆంధ్రప్రభ, ఆంద్ర జ్యోతిలలో ప్రచురితమైనవి. కొన్ని కారణాల వలన సాహిత్యానికి దూరం అయినాను. 2010 నుండి నవలలు, భావకవితలు రాయడం మొదలుపెట్టాను..మరో హృదయం-మరో ఉదయం{నవల} ,గీతాంజలి అనువాదం, నీకోసం అనే భావకవిత్యం, చీకటిలో మలివెలుగు {నవల} ప్రచురించడం జరిగింది.





155 views0 comments
bottom of page