top of page

స్నిగ్ధ


'Snigdha' - New Telugu Story Written By Parupalli Ajay Kumar

'స్నిగ్ధ' తెలుగు కథ

రచన: పారుపల్లి అజయ్ కుమార్

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

"చిన్నూ"


తండ్రి పిలుపుకు లోపలగది లో పేపర్ చదువుతున్న స్నిగ్ద పేపర్ మూసి "ఏమిటి నాన్నా ?" అంటూ ముందు గదిలోకి వచ్చింది.


తల్లితండ్రీ సోఫాలో కూర్చొని వున్నారు.


"ఇలారా కూర్చో నీతో మాట్లాడాలి."


తండ్రి మాటలకు స్నిగ్ధ ప్రక్కనే వున్న కుర్చీలో కూర్చొంది.


"నువ్వు చదవాలనుకొన్నది చదివావు. కోరుకున్న ఉద్యోగం వచ్చింది. ఇక నీకు పెళ్ళి అయితే మాకు నిశ్చింతగా వుంటుంది. నువ్వు ఎవరినైనా ప్రేమించి వుంటే లేదా నీకు నచ్చినవారు కానీ ఎవరైనా వుంటే చెప్పు. లేదంటే పెళ్ళి సంబంధాలూ మమ్ములను చూడమంటే చూస్తాం."


తండ్రి మాటలకు స్నిగ్ధ తల్లితండ్రుల వైపు సూటిగా చూసింది.


"నీకు తెలియదా నాన్నా. మీకు చెప్పకుండా నేను ఏ పనీ చేయనని. నేను ఎవరినీ ప్రేమించలేదు. ఎవరినీ ఇష్టపడలేదు. అటువంటిది ఏదైనా వుంటే మీకు ఎప్పుడో చెప్పేదాన్ని కదా. కాలేజీలో, యూనివర్సిటీ లో ఇద్దరు ముగ్గురు నావెంట తిరిగారు. కానీ నేను వారికి ఎటువంటి అవకాశమూ ఇవ్వలేదు. మీరు సంబంధాలు చూడండి. కానీ నాకు అతను, అతని భావాలు, ఆలోచనలు నచ్చితేనే అడుగు ముందుకి వేయండి.


కొంతమంది మనుషులు తమ స్వార్ధానికి ఏర్పాటు చేసుకున్న ఈ కుల మతాలపై నాకు విశ్వాసం లేదు. కులం కన్నా గుణమే ప్రధానం అని నేను నమ్ముతున్నా. నాకు నచ్చని మనిషిని చేసుకోమని మీరు బలవంతం చేయవద్దు. నచ్చిన మనిషి ఏ కులం వాడైనా మీరు అభ్యంతరం చెప్పకూడదు."


కొద్దిగా నవ్వుతూనే దృఢంగా అంది స్నిగ్ధ.


"అదేమిటే అలా అంటావ్. నీకు నచ్చనిది మేము ఎందుకు బలవంత పెడతాం. నీకు ఊహ వచ్చాక నీకు నచ్చనిది ఈ యింట్లో ఏమైనా చేసామా? నువ్వు అడగటం, మీ నాన్న ఊ అనటం ఇదేగా ఇన్నాళ్లు జరిగింది. పెళ్లిచేసుకునేది నువ్వు, కాపురం చేసేదీ నువ్వే. నీకు నచ్చకుండా ఎలా చేస్తాం. అయినా అరగంట పెళ్ళిచూపుల్లో ఏం తెలుస్తుంది? అబ్బాయి అందచందాలు, ఉద్యోగం, ఆస్తిపాస్తులు కుటుంబ వివరాలు ఇవేగా చూడగలం. తెలిసిన వారిద్వారా చుట్టు ప్రక్కల ఆచూకీ తీస్తే మరికొన్ని వివరాలు తెలుస్తాయి. అంతేగానీ అతని భావాలు, ఆలోచనలు నీకెలా తెలుస్తాయి." తల్లి అడిగింది.


"పెళ్లి చూపుల్లో మాట్లాడుకోవటం ఉంటుంది కదా. అతను నాగురించి అడగొచ్చు. నేను అతని గురించి అడగవచ్చు కదా. నేనడిగే ప్రశ్నలకు అతను చెప్పే సమాధానాలను బట్టి కొంతవరకు అవగాహనకు రావచ్చు. నచ్చితే రెండు మూడు సార్లు అతన్ని పార్కులోనో, ట్యాంక్ బండ్ మీదో కలుసుకుంటే పూర్తి అవగాహనకు రావచ్చు. వృత్తిరీత్యా అధ్యాపకురాలిని కావటం చేత ముఖం చూసి ఆలోచనలను పసిగట్టే నేర్పు వచ్చింది. చిన్నప్పటి నుండి నన్ను స్వేచ్ఛగా పెరగనిచ్చారు. మీరిచ్చిన స్వేచ్ఛను నేనేనాడు దుర్వినియోగ పరచలేదు. పెళ్లి చేసుకునేది నేను కాబట్టి నాకు నచ్చిన వాడిని చేసుకునే స్వేచ్ఛ నాకుంది కదా" స్థిరంగా అంది.


"నువ్వు మనఃపూర్తిగా ఇష్టపడిన సంబంధమే చేస్తాం. సరేనా. ఇంతకీ అబ్బాయిని ఏం అడుగుతావు ? మరీ బెదిరిపోయేలా చేయకు"


తండ్రి నవ్వూతూ అన్నాడు.


"సస్పెన్స్. పెళ్ళి చూపుల రోజు మీరే చూస్తారుగా."


స్నిగ్ధ లేచి తన గదిలోకి వెళ్లింది.*******************************


స్నిగ్ధ పేరుకు తగ్గట్టుగానే మనోహరమైన సౌదర్యం తనది.


తండ్రి భాస్కర్ జిల్లా పరిషత్ హైస్కూలు ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. తల్లి శ్యామల బి. ఎ. చదివినా ఉద్యోగం చెయ్యటం ఇష్టంలేక గృహిణిగానే ఉండిపోయింది.


ఒక్కగానొక్క కూతురు స్నిగ్ధ ను అల్లారుముద్దుగా, స్వేచ్చాపూరిత వాతావరణంలో పెంచారు. స్వయం నిర్ణయాలు తీసుకునే దిశగా ఆమెను ప్రోత్సాహించేవారు. అందరిలా డాక్టర్లు, ఇంజనీర్లు అనికాకుండా అధ్యాపక వృత్తివైపు మొగ్గు చూపింది.M. sc ; P. hd చేసి కాలేజ్ సర్వీస్ కమీషన్ పరీక్ష రాసి, ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయి జానియర్ కాలేజ్ లో ప్రభుత్వ అధ్యాపకురాలిగా జాబ్ చేస్తున్నది.


భాస్కర్ అభ్యుదయవాది. మహిళల హక్కుల గురించి, చట్టాల గురించి, సమాజం లో స్త్రీ ఎన్నిరకాలుగా దోపిడీకి గురవుతుందో, మహిళలు చైతన్యవంతులైతేనే సమాజ గమనం చక్కగా వుంటుంది అని కూతురికి చెప్పేవాడు. తండ్రి భావాలను, ఆశయాలను అమితంగా ఇష్టపడేది. తండ్రి ఆమె దృష్టిలో ఒక హీరో.*********************************


ఇంటిముందు కారు ఆగగానే భాస్కర్ కారు దగ్గరికి వెళ్ళి అందులో నుంచి దిగిన వారిని ఆహ్వానించి లోపలికి తీసుకు వచ్చాడు.


పెళ్లి కొడుకు మోహన్, అతని తండ్రి, తల్లి, అక్క నలుగురినీ భార్యకు, కూతురికి పరిచయం చేసాడు.


శ్యామల అందరికీ కాఫీ, ఫలహారాలు అందచేసింది.


స్నిగ్ధ మోహన్ ను పరికించి చూసింది. అందగాడే అనుకుంది మనసులో. భాస్కర్, మోహన్ తండ్రి కాసేపు పిచ్చాపాటి కబుర్లు మాట్లాడుకున్నారు.


కాఫీలు త్రాగాక భాస్కర్ మోహన్ తో


"బాబూ అమ్మాయితో ఏమన్నా మాట్లాడుతావా ?" అన్నాడు.


స్నిగ్ధ వేపు తిరిగి "నీ రూం కు తీసుకెళ్ళు" అన్నాడు.


"వద్దు నాన్నా. ఇక్కడే మీముందే మాట్లాడుకుంటాం. ఇందులో రహస్యాలు ఏముంటాయి ? ఇరువురు ఒకరి గురించి మరొకరు తెలుసుకోవటమేకదా కావలసింది." అని మోహన్ వైపు తిరిగి "మోహన్ గారూ! ముందు మీరు అడగండి. తరువాత నేను" అంది.


మోహన్ ఉద్యోగం గురించి, ట్రాన్ఫర్ గురించి రెండు, మూడు ప్రశ్నలు వేసాడు.


"ట్రాన్ఫర్ విషయం మన చేతులలో లేనిది. అయినా ఈ మధ్యనే సాధారణ బదిలీలు జరిగాయి. మరలా ఇప్పట్లో వుండక పోవచ్చు. ప్రభుత్వం ట్రాన్ఫర్ పై ఉన్న బాన్ ను తొలగించి ట్రాన్సఫర్లకు జీవో జారీచేస్తే అప్పుడు అవకాశం ఉంటుంది." అంది స్నిగ్ధ.


వింటున్న మోహన్ నాన్న “ప్రభుత్వం లో ఎవరినయినా నాయకుణ్ణి పట్టుకొని ప్రయత్నిస్తే పని జరగవచ్చు” అన్నాడు.


"నాకు అలా చేయించుకోవడం ఇష్టముండదండి" స్నిగ్ధ నవ్వుతూనే అంది.


ఎవరూ ఏమనలేదు.


"నేను మిమ్ములను కొన్ని విషయాల గురించి అడగవచ్చా?" స్నిగ్ధ మాటలకు తల ఊపాడు మోహన్.


"మీకు వంట వచ్చా ?"


స్నిగ్ధ ప్రశ్నకు శ్రోతలు ఒక్క క్షణం తెల్లబోయారు.


మోహన్ అమ్మగారు ముఖంగంటుపెట్టుకొని


"అదేమిటమ్మాయ్ అలా అడుగుతున్నావ్? నీకు వంటచేయటం రాదా ? వంట విషయాలు ఆడవాళ్లే చూసుకోవాలి. మగవాళ్లు వంటచేయటం ఏమిటి ? మరీ విచిత్రంగా అడుగుతున్నావ్ ?" అంది.


స్నిగ్ధ చిన్నగా నవ్వూతూ "నాకు వంట వచ్చు ఆంటీ. అన్ని రకాల పిండివంటలు వచ్చు. వెజ్, నాన్ వెజ్ అన్నిరకాలు చేయగలను. మా అమ్మ నాకు అన్నీ నేర్పింది. అయినా మగవాళ్లు వంట చేయకూడదని ఎక్కడా లేదే. పురాణాల్లో చదువలేదా? నలభీమపాకం అని అంటారే గానీ ద్రౌపదీ పాకం, దమయంతీ పాకం అని రాయలేదు కదా. ఇప్పుడు కూడా ఏ హోటల్స్ లో చూసినా వంట చేసేది మగవారే కదా. ఫైవ్ స్టార్ హోటల్స్ లో చెఫ్ ఉద్యోగం చేసేది మగవాళ్లే కదా." అని మోహన్ వైపు తిరిగి "ఇంతకూ మీరేమి చెప్పలేదు. మీకు వంట వచ్చా ?" అంది.


"రాదు" అన్నాడు మోహన్ ముఖం చిన్నబుచ్చుకుంటూ.


"కనీసం కాఫీ కలపటం, టీ పెట్టటం.." అంటూ అర్ధోక్తిలో ఆగింది.


"మగవాళ్లు టీలు పెట్టటం, వంటలు చేయటం మా ఇంటా వంటా లేవు." అంది మోహన్ అమ్మగారు కోపంతో."అది కాదు ఆంటీ. నాకు ఎప్పుడైనా బాగాలేకపోయినా, బద్దకంతో లేవలేకపోయినా కనీసం కాఫీ కలిపి ఇవ్వటం, చేతనైనంతలో వంట చేయటం తప్పుకాదు. ఈ రోజుల్లో భార్యా భర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే పనులు కూడా చెరిసగం పంచుకోవాలి కదా.


సరే మీకు వంటరాదు. మరో విషయం. నా వుద్యోగరీత్యా నేను ఎంతో మంది మగవారితో మాట్లాడవలసి ఉంటుంది. మనింటికి మీరు లేని సమయంలో మీ స్నేహితులో, నాకు పరిచయమున్న వారో వస్తే కుర్చోబెట్టి కాఫీ ఇచ్చి నవ్వుతూ పలకరించాల్సి వస్తుంది. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు ? ఎందుకంటే ఈ మధ్యనే పెళ్లి అయిన నా ఫ్రెండ్ మొగుడు వట్టి అనుమాన పిశాచం అట. మొగవారితో మాట్లాడినా సహించలేని మనస్తత్వం అతనిది. అందుకే అడుగుతున్నా. మీ మనసు, మీ ఆలోచనలు నాకు తెలియాలి కదా" అంది మోహన్ నే సూటిగా చూస్తూ.


మోహన్ ఏం అనాలో తోచక తెల్లబోయి చూస్తున్నాడు.


శ్యామల కొద్దిగా ఇబ్బందిగా కదిలింది.


మోహన్ తల్లి, తండ్రి, అక్క స్నిగ్ధకేసి కోపంగా చూసారు.


ఈలోపుగానే స్నిగ్ధ మరో ప్రశ్న సంధించింది."వృద్ధాప్యంలో మీ అమ్మా, నాన్న ఎక్కడ వుంటారు?"


"నా పెళ్ళి అయిన దగ్గరినుండి మా అమ్మా, నాన్న నా దగ్గరే ఉంటారు."


మోహన్ కొంచెం కటువుగా అన్నాడు.


మోహన్ మన పెళ్లి అనకుండా నా పెళ్ళి అని అనటం గమనించింది స్నిగ్ధ.


"మరి నా తల్లి తండ్రులు ?" స్నిగ్ధ ప్రశ్నకు సమాధానం రాలేదు.


శ్యామల ఏదో అనబోతుండగా స్నిగ్ధ "నువ్వు కాసేపు ఆగమ్మా. నన్ను చెప్పనీ. చూడండి మోహన్ గారూ, మీ తల్లితండ్రుల బాధ్యత మీదయినట్లే, నా తల్లితండ్రుల బాధ్యత నాదే కదా. వారికి నేను ఒక్కత్తినే సంతానం. వారి బాగోగులు చూసుకో వలసింది నేనే కదా. వారికి చేతనైనంతకాలం వారు నా దగ్గరికి రమ్మన్నా రారు. చేతకాన్నప్పుడు నా ఇంటి లోనే కదా వారు ఉండవలసింది. వారిని దగ్గరుంచుకొని శ్రద్దగా సేవ చేయాలి కదా."


స్నిగ్ధ మాటలు పూర్తి కాకుండానే వచ్చిన నలుగురూ లేచి నిలుచున్నారు.


"చూడండి భాస్కర్ గారూ, అమ్మాయి అందమైంది, చదువుకొంది, మంచి ఉద్యోగం చేస్తున్నది అని చెపితే వచ్చాము. కానీ మీ అమ్మాయిని మేము భరించలేము. మేమే కాదు ఇలా తిక్క తిక్కగా మాట్లాడితే ఎవరూ మీ అమ్మాయిని చేసుకోరు. వస్తాం" అంటూ మోహన్ తండ్రి బయటకు నడిచాడు.


మిగిలిన ముగ్గురూ అతన్ని అనుసరించారు.


భాస్కర్ ఇదంతా చూస్తూ మౌనంగా ఉండిపోయాడు.


కానీ శ్యామల ఊరుకోలేదు.


"చిన్నూ అలా మాట్లాడితే ఎలా?వెళ్లిన వాళ్లు కోపంతో నిన్ను గురించి అవాకులు, చవాకులు పేలితే నీ మీద చెడు ప్రచారం జరుగుతుంది. నిన్నే కాదు ఇలా పెంచారని మమ్ములను కూడా అంటారు. అసలు పెళ్లి అంటేనే కొంత రాజీ పడాలి. ఊహలు వేరు. యదార్ధం వేరు. అది తెలుసుకో ముందు. అయినా అల్లుడింట్లో మేమెందుకు ఉంటాం. ఎప్పుడో జరిగేది లేనిది ఇప్పుడే తేల్చుకోవాల్సిన అవసరం వుందా? వంట రాకపోతే అవసరమైనప్పుడు హోటల్లో తెచ్చిపెడతాడు. నువ్వు అడిగిన వాటన్నిటికీ సరే అని చెప్పి పెళ్లి అయిన తరువాత నాకు రాదు, నేను చెయ్యను అంటే ఏం చేస్తావు ?"


తల్లి అడిగిన దానికి చిరునవ్వుతోనే సమాధానం చెప్పింది.


"అమ్మా నేను ఈ కాలపు మహిళను. పెళ్లి కోసం నేనేమీ తొందరపడటం లేదు. ముందే చెప్పాగా నాకు నచ్చిన వాడు దొరికితేనే పెళ్లి. నా చిన్నపుడు నీకు వంట్లో బాగులేనప్పుడు నాన్న పనులన్నీ చేయలేదా ? వంట చేసి నీకూ నాకూ తినిపించలేదా ? ఇన్నాళ్ల మీ కాపురం లో నాన్న నిన్నెప్పుడూ పల్లెత్తు మాట అనడం నేను వినలేదు. నీ మాటలకు, అభిప్రాయాలకు ఎప్పుడూ విలువ ఇచ్చేవాడు. నాన్నే నా హీరో. నాన్న లాంటి వారు అరుదే. కానీ అసలు లేకుండా పోరు. నా భర్త నాకు భర్తగానే కాదు అవసరమయితే నాన్నలా కూడా ఉండాలి. అయినా ఎందుకింత కంగారు ? ఇది మొదటి పెళ్ళి చూపులే కదా." అంటూ తండ్రివైపు తిరిగి


"నాన్నా నేను మాట్లాడింది నా మనసులోని భావాల కనుగుణంగానే. నేను అడిగిన ప్రశ్నల్లో తప్పేం లేదని నాకనిపిస్తుంది. మీ పెంపకంలో పెరిగినదానిని. నా పెళ్ళి అయినప్పుడే అవుతుంది. ఈసారి మా అమ్మాయి అభిప్రాయాలు ఇవీ అని సంబంధాలు తెచ్చే మధ్యవర్తులకు స్పష్టంగా చెప్పు. అవి నచ్చినవాళ్ళే చూడటానికి వస్తారు. ఇలా రావటం చూడటం కూడా నాకు ఎబ్బెట్టుగానే వుంది. మాట్రిమోనియల్ లో మన అభిప్రాయాలు స్పష్టంగా రాసిఇస్తే సరి. ఆ పని చేయి నాన్నా బాగుంటుంది." అంటూ లేచింది స్నిగ్ధ.


శ్యామల ఏదో అనబోతుంటే భాస్కర్ వద్దని సైగ చేసాడు.


********************************


లంచ్ టైంలో స్నిగ్ధ, సుప్రియ ఒకేచోట కూర్చొని లంచ్ బాక్స్ లు విప్పారు. సుప్రియ మూడునెలల క్రితమే ఈ కాలేజీ లో చేరింది. ఇంకా పెళ్లి కాలేదు. తండ్రి లేడు. తల్లీ, అన్నయ్య ఉన్నారు. ఇద్దరూ ఒకే వయసు గలవారు అవటం చేత ఇద్దరికీ స్నేహం కుదిరింది. వారిద్దరూ స్నేహంగా ఉండటం కొందరికి నచ్ఛలేదు. కారణం సుప్రియ కులం.


ఉద్యోగానికి కావలసిన తెలివితేటలు ఆమెకు లేవని, లోయర్ కాస్ట్ కాబట్టే ఉద్యోగం వచ్చిందని స్నిగ్ధ చెవులు కొరికారు కొందరు. స్నిగ్ధ వారి మాటలు పట్టించుకోలేదు. నిర్మలమైన సుప్రియ మనసు తెలుసుకుని ఆమెతో చెలిమి చేసింది. వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడుకునేవారు. వీరిద్దరినీ మిగిలిన వారు ఎడంగా ఉంచినా వీరు పట్టించుకొలేదు.


సుప్రియ బాక్స్ లో ఉన్న గుత్తి వంకాయను స్నిగ్ధ తీసుకుని కొద్దిగా కొరికి


"వావ్ భలే రుచిగా వుంది. మీ అమ్మగారు కూరలూ బాగా చేస్తారు." అంది.


"గుత్తివంకాయ కూర మా అమ్మ చేయలేదు. మా అన్నయ్య చేసాడు." సుప్రియ అంది.


"నిజమా, చాలా బాగా చేసాడు." మెచ్చుకోలుగా అంది.


"అదిసరే, మొన్న నీ పెళ్లిచూపులు అన్నావ్. ఏమైంది ? నిన్న ఆదివారం ఫోన్ చేద్దామనుకున్నాను కానీ అమ్మ, అన్నయ్య తో కలసి షాపింగ్ కు వెళ్ళాను. వచ్చేసరికి చీకటిపడింది. ఈ రోజు ఎలాగూ కలుస్తావు కదా అని ఫోన్ చేయలేదు. ఇంతకీ కాయా? పండా ?"


స్నిగ్ధ పెళ్ళి చూపుల ప్రహసనాన్ని మొత్తం చెప్పింది.


"నాన్న ఏమనలేదు కానీ అమ్మ ఇలా అడిగితే వొచ్చే సంబంధాలు కూడా రాకుండా పోతాయని బాధపడుతున్నది. అందుకే మాట్రిమోనియల్ లో నాభావాలు పూర్తిగా తెలిసేలా నమోదు చేసి రమ్మని నాన్నకు చెప్పాను. ఈ మగవారు మనను ఓ మెట్టు క్రిందనే ఉండేలా చూస్తారెందుకు? వారు బజారుకు ఇష్టమైనప్పుడు వెళతారు వస్తారు. అదేపని మనం చేయకూడదంటారు. వారి ఫ్రెండ్స్ వస్తే మనం కాఫీలు ఇచ్చి మర్యాద చేయాలి. అదే మన ఫ్రెండ్స్ ఎప్పుడైనా వస్తే మనం సరదాగా మాట్లాడుకుంటుంటే మగవారిని కాఫీ చేసి తీసుకు రమ్మంటే తీసుకొస్తారా ?


ఉద్యోగాలు చేసే స్త్రీలయినా స్వతంత్రంగా ఒక పాతిక వేలు భర్తకు చెప్పకుండా ఖర్చు పెట్టగలదా ? నచ్చిన చీర, మెచ్చిన నగ కొనుక్కోవాలన్న మొగుడిని అర్ధించాల్సిందే. మగ వారు మాత్రం బజారులో తమకు నచ్చిన గుడ్డలు కానీ, వస్తువులుకానీ భార్యకు చెప్పకుండా కొనుక్కుని రావచ్చు. ఇదెక్కడి న్యాయం చెప్పు ? ఆఖరికి దిక్కూ మొక్కూ లేని వారిని చూసి జాలిపడి పది రూపాయలు దానం కూడా చేయలేని స్థితిలో ఉన్నారు చాలామంది ఆడవారు. లక్షల రూపాయలు సంపాదించినా ఒక్క రూపాయి ఖర్చు కోసం మొగున్ని అడగాల్సిందే. ఇటువంటివన్నీ నాకు సరిపడవు. ఎవరికోసమో నన్ను నేనుమార్చుకోలేను. నేను నేనుగా ఉండటమే నాకిష్టం."


భోజనాలు ముగిసాయి.


"సాయంత్రం ఆరింటికి మా ఇంటికి రావాలి నువ్వు"బాక్స్ మూస్తూ అంది సుప్రియ.


"ఎందుకు ? ఏమన్నా విశేషం వుందా ?"


"ఈ రోజు నా పుట్టిన రోజు. నాన్న పోయాక పుట్టిన రోజు చేసుకోవటం మానేసాను. నిన్న అన్నయ్య బలవంతంతో షాపింగ్ కు వెళ్ళాను. డైమండ్ నెక్లెస్ తీసుకున్నాడు అన్నయ్య. సాయంత్రం కేక్ కటింగ్ వుంది. పెద్దగా ఎవరినీ పిలవటం లేదు. అమ్మ, అన్నయ్య, ఇంటి ప్రక్కన వాళ్లు, నువ్వు అంతే. ఆర్భాటాలేమీ లేవు. అమ్మకూడా నిన్ను ఎన్నోసార్లు తీసుకు రమ్మంది. సమయం, సందర్భం కలిసాయి. అందుకే నిన్ను పిలుస్తున్నాను. తప్పక వస్తావుగా"


వస్తానన్నట్లుగా తలూపింది స్నిగ్ధ.********************************


సాయంత్రం గిఫ్ట్ కొనుక్కుని సుప్రియ ఇంటికి వెళ్లింది స్నిగ్ధ.


సుప్రియ సంబరంగా ఎదురొచ్చి స్నిగ్ధను లోపలికి తీసుకెళ్లింది.


"మా అమ్మ లక్ష్మి, అన్నయ్య అవినాష్ తను స్నిగ్ధ"అంటూ పరస్పర పరిచయాలు చేసింది.


అవినాష్ ఆరడగుల ఎత్తుతో అందంగా, బలిష్టంగా ఉన్నాడు. చామనచాయ మనిషి అయినా ముఖం చెదిరిపోని చిరునవ్వుతో ఆకర్షణీయంగా ఉన్నాడు. స్నిగ్ధను తన రూంలోనికి తీసుకెళ్ళింది సుప్రియ. డైమండ్ నెక్లస్ చూపించింది.


"చాలా బాగుంది. పెట్టుకో"అంది స్నిగ్ధ.


సుప్రియ నెక్లస్ ను తీసి మెడలో అలంకరించుకుంది.


"ఏమైనా పని చేయాలా ?"అడిగింది స్నిగ్ధ.


"ఏం అవసరం లేదు. అన్నీ అన్నయ్యే చూసుకుంటాడు. అన్నయ్యకు రాని పనంటూ లేదు. నాన్న వున్నంతకాలం అమ్మే అన్ని పనులు చేసేది. నాన్న పోయాక అమ్మ బెంగతో మంచం పట్టింది. అప్పటికి నా పీజీ పూర్తికాలేదు. అన్నయ్య జాబ్ చేస్తున్నాడు. ఇంటిపనులకోసం ఒకమనిషిని పెట్టినా వంట పనంతా అన్నయ్య చేసేవాడు. అమ్మకు ఇప్పుడు కాస్త నయమయినా పనులేమీ చేయవద్దని చెప్పాడు.


జాబ్ లో చేరాక నేను వంట చేస్తానని అన్నయ్యతో దెబ్బలాడాను. చివరికి ఒక అంగీకారానికి వచ్చాము. మూడు రోజులు నేను వంటచేస్తే, అన్నయ్య మూడు రోజులు చేస్తాడు. ఆదివారం అమ్మ, నేను, అన్నయ్య కలసి వంటచేస్తాము. అన్నయ్య మగవాడైనా ఆ భేషజాలకు పోడు. పని అంటే పనే. ఇది ఆడవాళ్లు చేసేది, ఇది మగవాళ్లు చేసేది అని మనకు మనమే గీతలు గీసుకున్నాం అంటాడు. పనికి లింగభేదం లేదని కబుర్లు చెపుతాడు."


సుప్రియ మాటలకు ఆలోచనలో పడింది స్నిగ్ధ. అక్కడ ఉన్నంతసేపు అవినాష్ ను అతను చేస్తున్న పనులను చూస్తుండిపోయింది.


కాలేజీలో సుప్రియ తన అన్న గురించి అపుడపుడు మాటల సందర్భంలో చెపుతుంటే కొద్దిగా ఎక్కువచేసి చెపుతుంది అనిపించేది. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆ మాటలు నిజమే అనిపిస్తున్నాయి. ముఖం మీద చెరగని చిరునవ్వుతో పనులన్నీ చకచకా చేస్తున్నాడు. వచ్చిన అతిధులను ఆహ్వానించి కూర్చోపెట్టాడు. వారి కి కూల్ డ్రింక్స్ ఇచ్చాడు. బల్ల మీద కేక్ సర్ది సుప్రియను పిలిచాడు. అతనికి తల్లి మీద ఉన్న ప్రేమ, చెల్లెలిపై చూపే అనురాగం అతని కళ్ళల్లో ప్రతిఫలించటం గమనించింది.


పార్టీ అయ్యాక ఇంటికి బయలు దేరుతుంటే నేను డ్రాప్ చేస్తానంటూ అవినాష్ బైక్ తీసాడు.


ఇంటి దగ్గర దిగబెట్టాక అతని సెల్ నంబర్ అడిగి తీసుకుంది స్నిగ్ధ.


********************************


కాలేజ్ వదిలాక చిన్న పని వుందని సుప్రియతో చెప్పి ఆటో ఎక్కింది స్నిగ్ధ.


అంతకుముందే అవినాష్ కు ఫొన్ చేసి ఆఫీస్ అయ్యాక టాంక్ బండ్ దగ్గరికి రమ్మని కొద్దిగా మాట్లాడవలసి వుందని చెప్పింది.


గుర్తుగా శ్రీ శ్రీ విగ్రహం దగ్గర ఉంటానని అన్నది.


స్నిగ్ధ చేరుకున్న పది నిమిషాలకు అవినాష్ వచ్చాడు.


ఇద్దరూ హుస్సేన్ సాగర్లో వున్న బుద్ధ విగ్రహాన్ని చూస్తూ ఖాళీగా ఉన్న బెంచ్ పై కూర్చున్నారు.


స్నిగ్ధ ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నది.


"ఎందుకు రమ్మన్నారు ? ఏం మాట్లాడాలి? సుప్రియ ఏమైనా.."అంటూ ఆగాడు అవినాష్.


"సుప్రియ గురించి కాదు"


"మరి దేని గురించి ?"


స్నిగ్ధ తన గురించి, తండ్రి గురించి, తల్లి గురించి, తను పెరిగిన వాతావరణం, తన భావాలు, ఆలోచనలూ అన్నింటిని అవినాష్ ముందు విప్పి చెప్పింది.


రెండు రోజుల క్రితం జరిగిన పెళ్ళి చూపుల విషయం కూడా చెప్పింది.


"నాకు మిమ్ములను చూడగానే నాకు తెలియకుండానే నాలో ఏవో ఊహలు మొలకెత్తాయి. మీరు మీ అమ్మగారిపై, సుప్రియపై చూపే ప్రేమానురాగాలకు ముగ్ధురాలినయ్యాను. మొదటి చూపుల ప్రేమలపై నమ్మకం లేని నేను మిమ్ములను చూడగానే మీతో ప్రేమలోపడిపోయాను. ఈ లోకం లో మగవారు ఆడవారికి ప్రపోజ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు నేను మిమ్ములను అడుగుతుతున్నాను. నన్ను పెళ్ళి చేసుకోగలరా ?


నేను నా ఊహల్లో వెతుకుతున్న మనిషి మీరేనని అనిపించింది. మనం కలుసుకున్నది ఒక్కసారే అయినా మీగురించి నాకు బాగా తెలుసు అనిపిస్తోంది. కారణం విడమరచి చెప్పలేక పోతున్నాను. ఒక మంచి కొడుకుగా, ఒక మంచి అన్నగా ఉన్న మీరు ఒక మంచి భర్తగా కూడా ఉంటారని అనుకుంటున్నాను. నాకు మా నాన్నే హీరో. మా నాన్న లాంటి వ్యక్తే నా భర్త కావాలని నా ఆశ."అవినాష్ రెండు నిమిషాలు ఏం మాట్లాడ లేకపోయాడు.కొద్దిగా తేరుకొని"మీకు సుప్రియ చెప్పిందో లేదో తెలియదు. మా కాస్ట్.." అంటుండగానేస్నిగ్ధ అడ్డుపడుతూ "నాకు తెలుసు. నాకీ కులమతాల మీద నమ్మకం లేదు. మా నాన్నకి, అమ్మకీ అంతే. ఈ కులాల అడ్డుగోడలు మనం కట్టుకొన్నవే. మనం కూల్చివేస్తే కూలిపోతాయి. మీరు అన్నీ ఆలోచించుకోండి. మీ అమ్మగారితో, సుప్రియతో చర్చించండి. ఈ వారం రోజులు ఆలోచించుకోండి. నన్ను నన్నుగా ఇష్టపడితే, నేను మీకు నచ్చితే.. ఆదివారం మా ఇంటికి రండి. అమ్మను, సుప్రియను కూడా తీసుకుని రండి.


మీరు రాకపొతే మీకు ఇష్టం లేదని అనుకుంటాను. ఇక ఈ విషయం ఆరోజుతో మర్చిపోతాను. నాకు కలిగిన ఇష్టాన్ని, ప్రేమను మీముందు వ్యక్త పరిచాను. ఇలా చెప్పినందుకు నన్ను వేరే విధంగా ఊహించే కుసంస్కారం మీలో లేదనే భావనతోనే ఇదంతా చెప్పాను. ఆదివారం కోసం యెదురు చూస్తుంటా. ఉంటాను"


అని స్నిగ్ధ ఖాళీగా పోతున్న ఆటోను ఎక్కి వెళ్ళిపోయింది.


అవినాష్ కు కళ్ల ముందున్న వెలుతురు మాయమైనట్లు అనిపించింది.


********************************


ఆదివారం తలస్నానం చేసి కుర్చీలో కూర్చొని జుట్టు ఆరబెట్టుకుంటున్నది స్నిగ్ధ.


తల్లి సాంబ్రాణి పొగ ను జుట్టుకు పట్టేలా ఊదుతున్నది.


కాలింగ్ బెల్ మ్రోగింది.


భాస్కర్ వెళ్ళి తలుపు తెరిచాడు.


స్నిగ్ధ ఒక్క ఉదుటున లేచి వెళ్లింది.


అవినాష్, సుప్రియ, వాళ్ళ అమ్మ నవ్వు ముఖాలతో లోపలికి వస్తూ కనిపించారు.


-----------------------------------------------

పారుపల్లి అజయ్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు పారుపల్లి అజయ్ కుమార్ ...

పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుడుని ...

ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ వాసిని ...

సాహిత్యం అంటే ఇష్టం .... కథలు,

నవలలు చదవటం మరీ ఇష్టం ...

పదవీ విరమణ తరువాత నా సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మం లో

"పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట - చావా రామారావు మినీ రీడింగ్ హాల్ " పేరిట ఒక చిన్న లైబ్రరీని మా ఇంటి క్రింది భాగం లో నిర్వహిస్తున్నాను ..

షుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి .

నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు ..

రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు ...

ఉచిత లైబ్రరీ ....

మంచినీరు ,కుర్చీలు ,రైటింగ్ ప్యాడ్స్ ,వైఫై ,కరెంటు అంతా ఉచితమే ...

ఉదయం 6 A M నుండి రాత్రి 10 P M దాకా ఉంటారు ...మనసున్న

మనిషిగా నాకు చేతనైన సాయం నిరుద్యోగ మిత్రులకు చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి.103 views2 comments

2 Comments


@murali7009 • 18 hours ago (edited)

చక్కని ఇతివృత్తాన్ని ఎంచుకొని కథను అందంగా మలిచారు. స్నిగ్ధ పాత్ర ప్రేరణాత్మకంగా వుంది. అజయ్ సర్ కి అభినందనలు. మంచి voice తో కథను స్పష్టంగా వినిపించిన సీతారాం కుమార్ గారికి అభినందనలు..

Like
Replying to

@user-ui9wc4xj3c • 16 minutes ago

ధన్యవాదాలు మీకు

Like
bottom of page