కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Sorry Friend' Written By Nandiraju Padmalatha Jayaram
రచన: నందిరాజు పద్మలతా జయరాం
బస్సెక్కితే వసంత చేసే హడావిడి ఇంతాఅంతా కాదు.
బస్సే తనదైనట్లు ప్రవర్తిస్తుంది.
తాను రోజూ ఒకే సీట్లో కూర్చుంటుంది, అదేదో తాను రిజర్వ్ చేసుకున్నట్లు.
అందరితో సరదాగా, కాస్త దబాయింపుగా మాట్లాడే ఆమెలో మరో చీకటి కోణం కూడా ఉంది.
అదేమిటో తెలుసుకోవాలంటే ప్రముఖ రచయిత్రి నందిరాజు పద్మలతా జయరామ్ గారి 'సారీ! ఫ్రెండ్....' కథ చదవాల్సిందే.
"రండి రండి....ఇక్కడ కూర్చోండి...." తన ప్రక్కన పెట్టుకున్న సంచుల్ని క్రింద పెడుతూ పెద్దగా అరచినట్లు పిలిచింది వసంత.
ఇంకా పూర్తిగా బస్సెక్కని నాకు ఆ గొంతు వింటూనే మహా చీకాకు వచ్చేసింది. అక్కర్లేదన్నట్లుగా చేయి ఊపి మాస్కు సర్దుకుంటూ, హేండిల్ పట్టుకుని మరో వైపు తిరిగి నిల్చున్నాను.
నాకీవిడ అసలు నచ్చదు. అందర్నీ దబాయిస్తూ మాట్లాడుతుంది. ఆర్టీసీ వాళ్ళు మా ఆఫీసు దాకా వేసిన బస్సిది. అలా అని మా ఆఫీసు వాళ్ళే ఎక్కాలని లేదు. ఆ రూట్ లో వెళ్లే వాళ్ళు అందరూ ప్రయాణం చెయ్యొచ్చు. అలవాటు కొద్దీ దీన్ని మేము ఆఫీసు బస్సు అని పిలుస్తూంటాం. బస్సు ని తన సొంత వాహనం అనుకుంటుంది. గత పదేళ్లుగా చూస్తున్నా...ఎప్పుడో తప్ప బస్సులో ఆవిడ లేకపోవడం జరగనే జరగదు. ఏదో ఆఫీసులో అటెండర్ ఉద్యోగం. అదీ పర్మినెంట్ ఉద్యోగం కాదు, పొరుగు సేవల సర్వీస్. వసంత వయసు ఎప్పుడో యాభై దాటి ఉంటుందని నా విశ్వాసం.
ప్రతి రోజూ అన్ని సంచుల్లో ఏం తెస్తుందో తెలియదు. బస్సు ఆగీ ఆగగానే అందరినీ తోసుకుంటూ ఎక్కడం, తాను రోజూ కూర్చునే ఎడమవైపు నాలుగో వరస కిటికీ సీట్లో కూర్చుని సామాను సర్దుకోవడం. ఖర్మ కాలి ఎవరైనా ముందే ఆ సీట్లో కూర్చున్నారో, వాళ్ళు లేచి ఆవిడకి సీట్ ఇచ్చేయ్యాల్సిందే...లేదూ...ఆవిడ అరుపులకి చెవులు దిమ్మెరబోయినట్లయి మిగతా పాసెంజర్లు కలగజేసుకుని మరీ ఆవిడకా సీటు ఇప్పించేస్తారు. సరే...కూర్చున్నాక, కాస్త సెటిల్ అయ్యాక ఇంకో క్రొత్త రకం టార్చర్ మొదలవుతుంది.
. రోజూ బస్సు ఎక్కే వాళ్ళెవరైనా రాకపోతే వాళ్లకి ఫోను చేసి కనుక్కోవడం, వాళ్ళు దారిలో ఉన్నాం అని చెప్తే, వాళ్ళ కోసం బస్సు ఆపించేయడం. బస్సు బయల్దేరాక ఎవరైనా చెయ్యెత్తి ఆపమంటే, డ్రైవర్ కనుక ఆపకపోతే తిట్ల దండకం మొదలు.
"ఏం...రెడ్డీ...ఒక్క నిమిషం ఆపితే నీ సొమ్మేం పోయింది...అసలే ఆర్టీసీ నష్టాల్లో ఉంది...ఓ టికెట్టు వచ్చినా వచ్చినట్లే....పాపం! ఎంత అవసరం మీద వెళ్ళాలో వాళ్ళు, ఆపు....." అంటూ జోరీగలాగా తగులుకుంటుంది.
ప్యాసెంజర్లలో ఎవరైనా టికెట్లు తీసుకోకుండా దిగిపోతున్నా, చిల్లర తెచ్చుకోక పోయినా, మాస్కు పెట్టుకోక పోయినా...వాళ్ళ పని అయిపోయినట్లే...మన వసంతమ్మ తూర్పారబోసేస్తుంది.
మనం నవ్వుకున్నా, విసుక్కున్నా ఆవిడకేమీ పట్టదు.
చెప్పొద్దూ...ఆవిడ చేష్టలకి మగాళ్లు నవ్వుకుంటూంటే, నాకైతే తల కొట్టేసినట్లుంటుంది. సాధ్యమైనంతవరకూ, ఆవిడకి బాగా దూరంగా ఉండి బస్సెక్కీ ఎక్కంగానే ఇయర్ ఫోన్లు తగిలించేసుకుంటాను.
"మైథిలిగారూ....మిమ్మల్నే....ఓసారిటురండి. మీతో పనుంది." పెద్దగా ఆవిడ వెనుకనుంచీ పిలుస్తూంటే చూసాను.
ఆవిడ ప్రక్కన కూర్చున్న పిల్లని లేపి నా సీటు దగ్గరకి పంపి నా కోసం సీటు ఆపిందావిడ.
తప్పలేదు, లేచి ఆవిడ దగ్గరకెళ్ళి నిల్చుంటే, నా చేయి పట్టుకు లాగి మరీ కూలేసి, మాటలు మొదలెట్టింది.
"నిన్ననే తెలిసింది నాకు, మీ తమ్ముడికి సంబంధాలు చూస్తున్నారటగా....మా అమ్మాయికీ చూస్తున్నాం..." అంటూ మొదలెట్టి వివరాలన్నీ బస్సులో వాళ్లందరికీ వినిపించేలా చెప్పింది వసంత.
" అవన్నీ మా నాన్నగారు చూస్తారండీ...ఆయన్ని అడిగి చెప్తానండి." అని తప్పించుకున్నానప్పటికి.
మొదటి నుంచీ నాకు మొహమాటం, సిగ్గు ఎక్కువ. స్వంత విషయాలు ఎవరికీ తెలియడం నాకు ఇష్టం ఉండదు.
***
"వసంతగారికి హార్ట్ ప్రాబ్లెమ్ వచ్చిందట. మీకు తెలుసా!" నా బస్ మేట్ రాధిక అడిగింది.
"అవునా...వారం పదిరోజుల్నించీ ప్రపంచం ప్రశాంతంగా ఉందే అనుకుంటున్నా...ఎలా ఉందట ఇప్పుడు?" చెప్పద్దూ...ఆవిడ లేకపోతే మా బస్సు బోసి పోయింది.
"నిన్ననే చూసొచ్చాం. బాగా బలహీనంగా ఉంది. స్టెంట్ వేయాలంటే ఖర్చు. పేదవాళ్ళు కదా...ఆలోచిస్తున్నారు." బాధనిపించింది నాకు.
సాయంత్రం ఆఫీసు బస్సు దిగి నేనూ, మరో నలుగురం కలిసి వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ వెళ్లాం.
" అమ్మ లోపల పడుకుంది " చెప్పింది ఆ అమ్మాయి. పాతికేళ్ళుండొచ్చు. మాట, మనిషి అదో రకంగా ఉంది.
"అమ్మకి బావుండట్లేదండీ....ఆరోగ్య శ్రీ లో ట్రీట్మెంట్ కి వీలవుతుందేమో అని ప్రయత్నిస్తున్నాం." వసంతగారి మరో అమ్మాయి కాబోలు చెప్పింది. ఈ అమ్మాయికి కూడా ఇరవై దాటే ఉంటుంది వయసు.
ఎప్పుడూ ఆవిడ నోరు మూసుకుంటే బావుంటుందనుకునే దాన్ని, ఇప్పుడు నీరసంగా, మౌనంగా ఉన్న వసంతని చూస్తే, నాకేమిటో గా అన్పించింది. పళ్ళు. కొంత డబ్బు ఇచ్చి ఇంటికి వస్తుంటే, దార్లో చెప్పింది రాధిక.
" మొత్తం కుటుంబాన్ని ఆవిడే లాక్కొస్తూంది. పేద కుటుంబం కావడంతో రెండో పెళ్లి వాడికిచ్చి చేశారట పెళ్లి. చూసారుగా....ఇద్దరాడపిల్లల్లో పెద్దది వయసుకు తగ్గట్లు ఎదగలేదు. భర్త ఏ ఉద్యోగమూ సరిగ్గా చేయడు. డబ్బులు కనిపిస్తే చాలు పట్టుకుపోయి జల్సా చేసి ఎప్పటికో తిరిగొస్తాడు. ఇంట్లో ఉన్న నాలుగు రోజులూ భార్యని వేధించడం, ఎదిగిన ఆడపిల్లలు. అందులోనూ మతి సరిగ్గా లేని పిల్లని కన్నందుకు వసంతని, పిల్లల్ని వేధించి పెద్దగా అరవడం చేస్తాడు. రెండో అమ్మాయిని పదో క్లాస్ దాకా చదివించి, ఇంకా చదివించే స్థోమత లేక సూపర్ మార్కెట్ లో ఉద్యోగం లో పెట్టింది. వసంతకి ఎవరో ఇప్పించిన ఈ ఉద్యోగం లో వచ్చే డబ్బు సరిపోక, మా ఆఫీసులో ఆడవాళ్ళ చీరలకి ఫాల్స్ , జాకెట్లు కుట్టడం, క్రొత్త డిజైన్లు తనకి రావు కనుక కమీషన్ తీస్కుని వేరే వాళ్ళతో కుట్టించి ఇవ్వడం చేసి సంపాదిస్తూంటుంది. పచ్చళ్ళు, స్వగృహ స్వీట్లు తయారు చేయించి అమ్మడం కూడా చేసి సంపాదిస్తోంది. ఈ మధ్య ఆవిడకి మెనో పాజ్ సమస్య ...దానికి తోడు ఇప్పుడిది. ఆవిడ ఫ్రస్ట్రేషన్ మా అందరికీ తెలుసు. పాపం వసంత! "
రాధిక మాటల్నే మననం చేసుకుంటూ ఇంటికొచ్చిన నాకు చాలా గిల్టీ గా అన్పిస్తోంది. 'సారీ ఫ్రెండ్' అని చాలా సార్లు అనుకుంటూనే ఉన్నాను.
పొరుగు సేవల పేరుతో ఇలాంటి వాళ్ళ చేత చాకిరీ చేయించుకుంటున్న ప్రభుత్వం, పై ఆదాయం కోసం వెంపర్లాడే పర్మినెంట్ ఉద్యోగులకి లక్షల్లో జీతాలు, అలవెన్సులూ, శెలవులూ, వైద్య సౌకర్యాలు ఇస్తోంది. దశాబ్దాల తరబడి వయసును, శక్తిని అంకితం చేస్తున్న వీళ్ళకి రోజు కూలీకి వెళ్తే వచ్చేంత కూడా ఇవ్వడం లేదు.
.......
వసంతా...ఇదిగో లక్ష. మన బస్సులోని వాళ్ళందరం పోగు చేసి తెచ్చాం. ట్రీట్మెంట్ కి వాడుకోండి. చూడండి, మైథిలీ మేడం వాళ్ళాయనకి తెలిసిన ఒకేషనల్ కాలేజీ ఉందట. ఉచితంగా చేర్పిస్తానన్నారావిడ. అందులో చేర్పిద్దాం మీ చిన్నమ్మాయిని. డిప్లొమా అయ్యాక ఉద్యోగం కూడా ఇప్పిస్తారట." పదిహేను మందిమి కలిసి వచ్చేసరికి ఆశ్చర్యంలో మునిగిపోయిన వసంత తో చెప్పింది రాధిక. ఆవిడ కళ్ళ నిండా నీళ్లతో నా వైపు చూసి దండం పెట్టింది.
"ఏంటా వెళ్లిపోవడం? కాసిని టీ అయినా ఇవ్వలేని వాళ్ళం అనుకున్నారా మేము...?ఏమే....చిన్నారీ....వెళ్లి ఓ పాల ప్యాకెట్ కొనుక్కురా...త్వరగా...." వసంత గొంతు కయ్యిమంది.
అందరితో పాటు నా ముఖం లోనూ నవ్వు విరిసింది.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.
Comments