top of page

స్వీట్ హోమ్


'Sweet Home' New Telugu Story

Written By Yasoda Pulugurtha

'స్వీట్ హోమ్' తెలుగు కథ

రచన: యశోద పులుగుర్త

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


ఆఫీస్ నుండి వస్తూనే హరికృష్ణ "అమ్మా! ‘సుజితను మంచి రోజు చూసుకుని వచ్చే గురువారం తీసుకు వస్తున్నా’నని మాధవ్ ఫోన్ చేసి చెప్పాడు. నేనూ, వైష్ణవీ వచ్చి తీసుకువెడ్తామని చెప్పినా ‘ఫరవాలేదు బావగారూ, మీకెందుకు శ్రమం’టూ మాట్లాడాడు. వాళ్లకు సదుపాయంగా ఉండేందుకు ఆ మూడో బెడ్ రూమ్ శుభ్రం చేయించమ్మా” అని తల్లితో చెప్పాడు. “ఓ.. అవునా హరీ, తప్పకుండా శుభ్రం చేయిస్తాను. పాపం సుజీ అత్తగారికి సమస్యవచ్చింది కాబట్టి, లేకపోతే దాన్ని పంపేవారా ఏమిటి? ఎంత అపురూపమో మన సుజిత అంటే వారికి” అంది శాంతమ్మ. రెండో పురుడు అక్కడే పోసుకుంటుందని ముందే చెప్పారు సుజిత అత్తగారు. హరికృష్ణ తల్లి శాంతమ్మ మోకాళ్ల నొప్పులతో బాధపడ్తోందని, చేయలేదని తెలిసి మాధవ్ తల్లి, సుజిత అక్కడే పురుడు పోసుకుంటుందని చెప్పింది. కూతురి అత్తగారూ మామగారూ చాలా సహృదయులు. కానీ అనుకోకుండా నెలరోజుల క్రితం మాధవ్ ఫోన్ చేసి వాళ్ల అక్కకి గైనిక్ ప్రాబ్లమ్ వచ్చిన కారణంగా ఆపరేషన్ చేసి యూట్రస్ తీసేయాల్సిన అవసరం పడిందని అక్క తమ దగ్గరకే ఆపరేషన్ చేయించుకోవాలని వస్తోందని, ఈ పరిస్తితిలో సుజితకు తన తల్లి చేయడం కష్టం అవుతుందన్న కారణంగా పురిటికి పుట్టింటికే పంపుతామని చెప్పాడు. సుజితకు తొమ్మిదో నెల వచ్చేసింది. "అన్నీ సవ్యంగా జరిగేటట్లు చూడు దేవుడా” అంటూ హరికృష్ణ తల్లి శాంతమ్మ మనసులో దేవుడిని ప్రార్ధించుకుంది. ఆవిడ అలా ప్రార్ధించుకోడానికి కారణం లేకపోలేదు. కోడలు వైష్ణవి అంటీ ముట్టనట్లుగా ఉంటుంది. అత్తవారివైపు వారి పొడ కిట్టదు. ఇంట్లో ఏ పనికీ సహాయానికి రాదు. కానీ శాంతమ్మ ఏమీ పట్టించుకోదు. చిన్న పిల్ల, ఏదో రోజు కోడలే తెలుసుకుంటుందిలే అని సర్దుకుపోయే స్వభావం ఆవిడది. శాంతమ్మ భర్త రాఘవరావు సెంట్రల్ గవర్న్ మెంట్ డిపార్ట్ మెంట్ లో పని చేసి అయిదేళ్ల క్రితమే రిటైర్ అయ్యారు. హరికృష్ణకు ముందు ఒక అమ్మాయి సునీత, తరువాత సుజిత ఆయన సంతానం. సర్వీస్ లో ఉండగానే కూతుళ్ల పెళ్లిళ్లు చేసేసాడు. కొడుకు సి. ఏ చదివి డెలాయిట్ లిమిటెడ్ లో డైరక్ట్ టాక్స్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నాడు. రెండు సంవత్సరాల క్రితమే హరి కి వైష్ణవి తో వివాహమైంది. అప్పటికే ఎమ్. బి. ఏ చదివిన వైష్ణవి ఒక ఎక్స్ పోర్ట్ బిజినెస్ కంపెనీలో పనిచేస్తోంది. ఆ ఆఫీస్ హైటెక్ సిటీలో ఉంది. ఇంటికి ఆమె ఆఫీస్ దూరం మూలాన మన ఇరువురి ఆఫీస్ లకూ దగ్గరగా సదుపాయంగా ఉండే ఫ్లాట్ కి మారిపోదాం అంటూ హరిని వేధిస్తోంది. తండ్రి ఉద్యోగం లో ఉండగా సదుపాయంగా మూడు వంద గజాలలో ఒక ఇల్లు కట్టించాడు. హరి అదే ఏరియాలో ఉంటున్న మరో ఇద్దరి కొలిగ్స్ తో కలసి కార్ పూలింగ్ చేసుకుని ఆఫీస్ కి వెళ్లి వస్తూ ఉంటాడు. ఇంత సడన్ గా ఇల్లు ఎలా మారిపోగలం వైషూ అనగానే మన ఇరువురి ఆఫీసులకీ దగ్గరగా ఉండేటట్లు హైటెక్ సిటీ లో ఫ్లాట్ కొందామంటూ సలహా ఇచ్చింది. ఫ్లాట్ కొనడం అదీ తరువాత స్తిమితంగా ఆలోచిద్దాం. ఇంత దూరం నుండి నీవు ఆఫీస్ కు వెళ్లలేననుకుంటే ప్రస్తుతానికి జాబ్ మానేయ్, తరువాత వేరే జాబ్ కి ప్రయత్నించుకుందువు గానంటూ సలహా ఇచ్చాడు. జాబ్ రిజైన్ చేసేసింది. రోజులు, నెలలు, సంవత్సరం దాటిపోయింది. భర్తకు ఫ్లాట్ కొనే ఆలోచనలో లేనట్లు, ఆ విషయాన్ని దాదాపు మర్చిపోయినట్లుగా కనిపిస్తున్నాడు. గుర్తు చేద్దామనుకునేంతలో రెండవ ఆడపడుచు రెండో పురిటికి ఇక్కడకే రాబోతోందన్న విషయం విని చిరాకు పడింది. ఇంట్లో పురుళ్లూ, పుణ్యాలూ తప్పించితే మరే పనీపాటా లేదా అనుకుంది. తను పెళ్లై కొత్తగా అత్తారింటికి వచ్చిన ఆరునెలలకు పెద్దాడపడుచు సునీత రెండవ కాన్పుకి వచ్చింది. అక్క వచ్చిందని చెల్లెలు కూడా రావడం తో ఇల్లంతా పిల్లల అల్లర్లు ఏడుపులతో తనకు విసుగొచ్చేసింది. హరి తో ప్రైవసీ లేకుండా పోయింది. తను పడుకుందామని వెళ్లేసరికి తమ బెడ్ రూమ్ మంచంమీద పిల్లలు నిద్రపోతూ ఉండేవారు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా ఆడపడుచులకు అనుకుంటూ చిరాకుపడేది. హరి కి చెపితే పోనీలెద్దూ పసిపిల్లలు. రేపు మనకు పిల్లలు పుడితే పడుకోపెట్టుకోమా అంటూ తేలికగా తీసుకునేవాడు. తనకు ఇంటి పనులు అలవాటులేదు. అత్తగారితో ఆడపడుచులతో పూసుకుంటూ తిరగడం, చేతిలో పనులు అందుకుంటూ చేయడం తన స్వభావానికి విరుధ్దం. ఎన్నో సార్లు హరి చెప్పాడు. "చూడు వైషూ అమ్మకు పాపం మోకాళ్ల నొప్పులు. కాస్త వంట పనిలో అమ్మకు సాయం చేయకూడదా” అంటూ. అందుకనే జాబ్ వంకతో వేరే వెళ్లిపోదామనుకుంటే ఈ మహాశయుడు ఏమీ పట్టకుండా ఉన్నాడు. ‘ఇప్పుడు నీవు జాబ్ చేయకపోతే గడవని స్తితిలో లేము కదా వైషూ, పోనీ దగ్గరలో ఉన్న ఏదైనా కంపెనీకైనా అప్లై చేసుకో’ అని సలహా ఇచ్చాడు. తన ఆలోచన వేరు. జాబ్ వంకతో అత్తగారింటినుండి శాశ్వతంగా వేరు వెళ్లిపోయి హాయిగా హరి తో హేపీ లైఫ్ ఎంజాయ్ చేయాలని. సుజిత, మాధవ్, రెండేళ్ల కొడుకుతో వచ్చారు గురువారం నాడు. భార్యను పుట్టింట్లో వదిలి మాధవ్ వెళ్లిపోయాడు. పురుడు టైమ్ కి వస్తానని చెపుతూ. తొమ్మిదో నెలేమో సుజిత భారంగా కనపడుతోంది. వైష్ణవిని తనే పలకరించింది. ‘హాయ్ వదినా ఎలా ఉన్నా’వని. బాగానే ఉన్నానంటూ ముభావంగా సమాధానం చెప్పి అక్కడనుండి వెళ్లిపోయింది. ఆ రోజు రాత్రి వైష్ణవి తనతో ముభావంగా ఉండడం గమనించాడు హరి. వైష్ణవి స్వభావం ఎలాంటిదో పెళ్లైన అతి కొద్దిరోజులలోనే అర్ధం అయిపోయింది హరికి. ఎన్నో విధాల నచ్చ చెప్పాడు కూడా. ఉమ్మడి కుటుంబాలు ఇలాగే ఉంటాయని సర్దుకుపోవాలని. ఆరోజు ఉదయం ఎనిమిది గంటలకు లేవగానే బ్రష్ చేసుకుని వంటింట్లోకి వచ్చిన వైష్ణవి అత్తగారికి టిఫిన్ తయారు చేయడంలో సహాయపడ్తున్న సుజిత కనపడింది. వైష్ణవిని చూస్తూనే "వదినా.. కాఫీ ఇవ్వనా” అంటూ ఆత్మీయంగా పలకరిస్తూ వేడి వేడి కాఫీ కప్పులో పోసి అందించింది. థాంక్స్ చెపుతూ కాఫీ తాగి, ఖాళీ కప్పుని సింక్ లో పెట్టేసి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుని, న్యూస్ పేపర్ చదవసాగింది. ఈలోగా హరి పిలిచాడు వైష్ణవిని. పేపర్ పట్టుకుని బెడ్ రూమ్ లోకి వెళ్లింది. "చూడు వైషూ, నీ కెరీర్ ని పాడుచేసే వ్యక్తిని కాదు నేను. ఎన్నో సార్లు అన్నావు, చక్కటి జాబ్ ని నేను మానేయమంటే వదులుకున్నానని నీ కెరీర్ పోతోందని. నేనే కారణంగా నాతో ముభావంగా ఉంటున్నావు గత కొద్దిరోజులుగా. నీవు కోరినట్లుగా హైటెక్ సిటీ లో ఫ్లాట్ బుక్ చేయాలనుకుంటున్నాను. నాన్నగారికి చెపితే నీ ఇష్టంరా హరీ అన్నారు. సో, నీ ఇష్టం, నీవు జాబ్ కి అప్లై చేసుకోవచ్చంటూ చెప్పి ఆఫీస్ కు వెళ్లిపోయాడు. వైష్ణవి మనసు ఆనందంతో గంతులేయసాగింది. జాబ్ మాట దేవుడెరుగు. తనూ, హరీ.. తమకంటూ ఒక స్వీట్ హోమ్. ఏ బాదర బందీలు లేని స్వేఛ్చా జీవితం కళ్లముందు కదలాడుతుంటే బుగ్గల్లో సిగ్గులు విరబూస్తున్నాయి. హరితో గడపబోయే తన మురిపాల జీవితం గురించి కలలు కంటూ అలాగే మంచం మీద ఒరిగి నిద్రపోయింది. హఠాత్తుగా "వదినా, ఏమిటీ టిఫిన్ చేయకుండా నిద్రపోతున్నావు? ఒంట్లో బాగానే ఉంది కదా” అంటూ తట్టి లేపుతున్న సుజిత మాటలకు మెలుకువ వచ్చింది. ఏమిటో మాటి మాటికి పూసుకుంటూ వస్తూ ఈ పరామర్శలు ఏమిటో అనుకుంటూ మనసులో విసుక్కుంది. తను ముభావంగా ఉన్నా తనతో ఈ అతి చనువేమిటో అనుకుంటూ "సారీ, రాత్రి సరిగా నిద్రపట్టలేదు. తల కొంచెం భారంగా ఉండి నిద్రపోయా”నంటూ టవల్, బట్టలూ తీసుకుని బాత్ రూమ్ లోకి వెళ్లింది. నాలుగు రోజులు మామూలుగా గడచిపోయాయి. ఆ రోజు వైష్ణవి నిద్ర లేస్తూనే వాష్ బేసిన్ లో వాంతి చేసుకుంది. నీరసంగా అనిపిస్తే తిరిగి మంచంమీద నిస్త్రారణగా వాలిపోయింది. అది చూసిన హరి కంగారు పడ్డాడు. ఏమైంది వైషూ అంటూ కంగారు పడసాగాడు. ఈ హడావుడికి అత్తగారూ, ఆడపడుచూ చుట్టూ మూగారు. అత్తగారు వైష్ణవి ని ఏదో నెమ్మదిగా అడిగింది. సమాధానం విన్న ఆవిడ ముఖం చింకి చేటంత అయింది. "ఒరేయ్ హరీ, నీవు తండ్రివి కాబోతున్నావురా, అమ్మాయిని ఒకసారి డాక్టర్ కస్తూరి దగ్గరకు తీసుకువెళ్లి చూపించుకురా" అంటూ ఆదేశించింది. ఆనందంతో ఆ ఇంట సంబరాలు చోటుచేసుకున్నాయి. అంత హడావుడి, పనుల్లో కూడా శాంతమ్మగారు కోడలిని అపురూపంగా చూసుకోసాగింది. వేవిళ్లతో బాధ పడుతోందని రుచిగా హితవుగా వండి పెట్టి తినిపించేది. సుజితకు సుఖప్రసవం అయి పాపాయి పుట్టడంతో శాంతమ్మగారి ఆనందం వర్ణనాతీతం. ఏడవ నెలలో వైష్ణవిని పుట్టింటివారు వచ్చి తీసుకువెళ్లారు. వైష్ణవి అన్నా వదినా, ఉద్యోగం చేస్తున్న చెల్లెలు, చదువుకుంటున్న తమ్ముడూ, తల్లీ తండ్రీ అందరూ కలిసే ఉంటారు. వదిన శాంభవి డిగ్రీ కాలేజ్ లో కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేస్తోంది. ఇద్దరు పిల్లలు అన్నగారికి. అయిదు సంవత్సరాల పాప, రెండు సంవత్సరాల బాబు. పొద్దుటే అత్తగారికంటే ముందరే లేచి చాలా వరకు పనులు పూర్తి చేసి పిల్లలను తయారు చేసి, పెద్దదాన్ని స్కూల్ కి పంపి తను కాలేజ్ కి వెళ్లిపోతుంది. సాయంత్రం వంటపని తనే చూసుకుంటుంది. వైష్ణవిని చూస్తూ "నీవు అలా కూర్చోవడం కాదు, లేచి అటూ ఇటూ తిరుగుతూ ఉండాలి. వాకింగ్ చేయాలంటూ చెపుతూ, ఏవో చిన్నా చితకా పనులు అప్పగించేది. వైష్ణవి తల్లి సుశీలైతే "ఏమే వైషూ, వంట పనిలో మీ అత్తగారికి సాయం చేస్తూ ఉంటావా, పాపం ఆవిడకు అసలే మోకాళ్ల నొప్పులాయె” అంటూ కూతురి అత్తింటి విశేషాలు తరచి తరచి అడుగుతూ ఉండేది. పెళ్లికాకముందు ఏవైనా పనులు నేర్పిద్దామని చూస్తే చదువు, చదువంటూ తప్పించుకునేదానివి. బిడ్డ పుట్టాకా ఎలా సంభాళించుకుంటావో ఏమో నంటూ పదే పదే అనేసరికి ‘ఎందుకు సంభాళించుకోలేను ఓసి పిచ్చి అమ్మా, మాకంటూ ఒక స్వీట్ హోమ్ తయారవుతోంది అక్కడ. అందులో నేనూ, హరీ, నా బేబీ మాత్రమే ఉంటాం. హాయిగా ఆయాను పెట్టుకునో లేక డే కేర్ లోనో నా బేబీ పెరుగుతుంది, నీవు దిగులు పడనవసరం లేద’నుకోసాగింది. వైష్ణవికి పురిటి రోజులు దగ్గర పడసాగాయి. హరికృష్ణ మధ్యలో వచ్చి చూసి వెడ్తున్నాడు. వదిన తల్లికి ప్రతీపనిలోనూ సహాయపడడం చూస్తోంది వైష్ణవి. నాన్నకు ప్రతీ విషయంలోనూ సలహాలిస్తూ అనేక ప్రాపంచిక విషయాలపై చర్చిస్తూ ఉండడం గమనించింది. చెల్లెలూ తమ్ముడూ వదినా వదినా అంటూ ప్రతీ చిన్న విషయానికి వదినమీదే ఆధారపడడం చూసింది. ఎంతో కలివిడిగా ఉంటూ అందరినీ పలకరిస్తూ తిరగడం చూసింది. రెండురోజుల నుండీ నలతగా ఉంటోంది వైష్ణవికి. ఇవాళో రేపో డెలివరీ అన్నట్లుగా ఉంది. ఆ రోజు ఉదయం సుశీల బాత్ రూమ్ లో స్లిప్ అయి పడిపోవడంతో కుడికాలు ఫ్రాక్చర్ అయింది. అందరూ కంగారు పడిపోయారు. కాలికి పెద్ద బేండేజ్ వేసారు. ఆరువారాలు బెడ్ రెస్ట్ అనేసరికి ఆవిడ తల్లడిల్లిపోయింది. వైష్ణవి పురిటిరోజులు ఎలా గడుస్తాయోనని కళ్లనీళ్లు పెట్టుకుంటుంటే అత్తగారి పక్కనే కూర్చుని ఆవిడను ఓదార్చింది శాంభవి. "అత్తయ్యా నేను లేనా? మీరు దిగులుపడినంత మాత్రాన సమస్య తీరుతుందా"? అంటూ అభిమానంగా కోప్పడింది. సుశీల శాంభవి చేతిని ఆసరాగా పట్టుకుంది. అక్కడే కూర్చుని తల్లివైపు దిగులుగా చూస్తున్న వైష్ణవి మనసులో ఏదో తెలియని అలజడి కెరటాలుగా ఎగిసిపడ్తున్నాయి. తనలో ఏదో తప్పుచేసానన్న పశ్చాత్తాప భావం తనని నిలవనీయడంలేదు. తనకు తెలియకుండానే కళ్లమ్మట నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. తన మనసుకి సంజాయిషీ ఇవ్వలేక నలిగిపోతోంది. ఏం మనిషి తను? అత్తగారు మోకాళ్ల నొప్పులతో కుంటుకుంటూ ఇంటి పనంతా చేసుకుంటున్నా తను పట్టించుకునేదికాదు. బారెడు పొద్దెక్కాకా లేచేది. అయినా అత్తగారు ఆప్యాయంగా కాఫీ చేతికి అందించేవారు. తను ఎలా ప్రవర్తించినా ఒక చిన్నమాటను కూడా తూలనాడేవారు కాదు. చివరకు కడుపుతో ఉన్న ఆడపడుచు చేత కాఫీ, టిఫిన్ అందించుకుంది. వారి ఆప్యాయతా అభిమానాన్ని తేలిక చేసి విసుక్కుంది. తనకంటూ ఒక ప్రైవసీని కోరుకుంటూ భర్తను వేధించింది వేరే ఫ్లాట్ కొనమంటూ, వేరే వెళ్లిపోదామని. ఆ స్వీట్ హోమ్ లో తామే ఉండాలన్న స్వార్ధం. హరి తనకు ఎన్నోసార్లు నచ్చచెప్పాడు. తనను బాధపెట్డం ఇష్టంలేక చివరకు తల్లితండ్రుల నుండి వేరే వెళ్లిపోవడానికి కూడా ఒప్పుకున్నాడు. గుండెలనిండా ఏదో తెలియని బాధ ఆవహించి అక్కడ కూర్చోలేక తన బెడ్ రూమ్ లోకి వెళ్లిపోయింది. దిండులో తలదాచుకుంటూ దుఖించింది. అసలుకే పురిటి భయం లో ఉన్న తను అత్తవారింట తన ప్రవర్తన దుఖంతో వివశురాలిని చేస్తూ తప్పుచేసానన్న భీతిని కలిగిస్తోంది. మరుసటి రోజు తెల్లవారుఝామున వైష్ణవి పండంటి పాపాయికి తల్లి అయింది. పదిహేను రోజులు శెలవు పెట్టిన శాంభవి వైష్ణవిని సొంత చెల్లెలిలా చూసుకుంటూ దగ్గరుండి పురిటి స్నానం చేయించింది. శాంభవిని కౌగలించుకుంటూ అమ్మకంటే ఎక్కువ చూసుకున్నావు వదినా, నేను నీకు ఏమిచ్చి నీ బుుణం తీర్చుకోనంటూ కళ్లనీళ్లు పెట్టుకుంది. "అంత పెద్ద మాటలు ఎందుకు వైషూ, ఇది నా కుటుంబం, ఈ ఇంటిలోని వారందరూ నా వారు అనుకున్నప్పుడు మనకి ఏదీ కష్టం అనిపించదు. సంతోషంగా అనిపిస్తుంది. నీవూ ఓ ఇంటి కోడలివే కదా, నేను నీకు చెప్పాలా” అంటూ వైష్ణవి భుజాన్ని ఆప్యాయంగా తట్టింది. బారసాలకు అత్తగారూ, మామగారూ, భర్తా ఆడపడుచులూ అందరూ వచ్చారు. బెడ్ రూమ్ లో పాపాయిని ముద్దాడుతున్న భర్తతో "హరీ! ఫ్లాట్ బుక్ చేసారు కదా. కేన్సిల్ చేయండి. మనకు ఇప్పుడు ఉంటున్న ఇల్లు చాలు. అదే నా స్వీట్ హోమ్. నా మూర్ఖపు ఆలోచనకు క్షమించండి. నన్ను ప్రేమించే మనుషులు నా చుట్టూ ఉన్నప్పుడు నేను వారినుండి దూరంగా వెళ్లిపోయి ఎక్కడో ఒంటరి ప్రపంచంలో ఉండాలని లే”దంటూ ఆర్తిగా మాట్లాడుతున్న తన వైషూ వైపు ప్రేమగా చూసాడు హరి. ***

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.







50 views0 comments
bottom of page