తప్పు చేస్తే శిక్ష తప్పదు
- Dr. C S G Krishnamacharyulu
- Feb 17
- 5 min read
#CSGKrishnamacharyulu, #CSGకృష్ణమాచార్యులు, #తప్పుచేస్తేశిక్షతప్పదు, #TappuChestheSikshaTappadu, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Tappu Chesthe Siksha Tappadu - New Telugu Story Written By - Dr. C. S. G. Krishnamacharyulu Published in manatelugukathalu.com on 17/02/2025
తప్పు చేస్తే శిక్ష తప్పదు - తెలుగు కథ
రచన: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
కమ్యూనిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ గది ముందు చాలా హడావుడిగా వుంది. ప్రిన్సిపాలు గారి పిలుపుకై యెదురు చూస్తున్న వారిని తోసుకుంటూ, ఒకే రంగు చొక్కా వేసుకున్న వ్యక్తులు కొందరు ఆక్కడకు వచ్చారు. వారిలో ఒకడు, అటెండరుని ప్రక్కకు తోసి లోపలికి వెళ్ళాడు. బయటే వుండిపోయిన అతని అనుచరులలో ఒకడు, " అధికార పార్టీ నాయకుడు. రమణ అన్న. తప్పులనీ, అన్యాయాల్నీ సహించడు. ” అని గట్ఠిగా అందరూ వినేలా అటెండరుతో చెప్పాడు.
ఈ రోజు సమాజంలో అధికారానికి పరమావధి సేవ, సంక్షేమం, అభివృద్ధి కాదని అవినీతి, ఆక్రమణ, అణచివేత అని, దాని లక్షణాలు అహంకారం, పొగరు, నిర్లక్ష్యం అని చిన్నపిల్లవాడికి కూడా తెలిసిపోయింది. ఆ వ్యక్తులని చూసి అక్కడున్న కొందరు “ఎన్నికలముందు ఓట్లకోసం అడుక్కుతినే వీళ్ళు, గెలవగానే, తమకు యెదురే లేదన్నట్లు ఫోజ్ పెడుతున్నారు. దిక్కు మాలిన సంత” అని తిట్టుకున్నారు.
అయిదు నిమిషాల తర్వాత,ఒక వ్యక్తి కొన్నికట్టల కాగితాలతో ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్ళాడు. వెళ్ళే ముందు అతను ఆ పార్టీ వ్యక్తులను పట్టించుకోకుండా, మిగిలిన వారితో, "ఒక్క పది నిమిషాలు. మేడం అందర్నీ పిలుస్తారు! వేచి వుండండి" అని మర్యాదగా చెప్పి లోపలికి వెళ్ళాడు. అందరిలో ఒక వుత్కంఠ. ఏమవు తోంది?
ఆ రాజకీయ నాయకుడి కార్యకర్తలు కూడా, మారిన వాతావరణాన్ని పసిగట్టారు. గొప్పలు చెప్పడం ఆపి మౌనంగా ఒక ప్రక్క గోడనానుకుని నిలబడ్డారు. ఆ ప్రదేశమంతటా, గుండు సూది క్రింద పడితే వినపడేంత నిశ్శబ్దం అలముకుంది. ఇప్పుడు లోపలి వారి మాటలు బయటికి వినబడుతున్నాయి.
" రమణా, నా పేరు సుబ్బయ్య. ఈ కాలేజిలో ఫిజికల్ డైరెక్టరుగా గత ఇరవై సంవత్సరాలుగా పని చేస్తున్నాను. మన పార్టీ ఎంపీ గారికి దగ్గర మనిషిని. నువ్విలా రావడం బాగోలేదు."
“మన కులం ఆడబిడ్డకి అన్యాయం జరుగుతోందని, తెలిసి వచ్చాను.”
"నువ్వు చెప్పేది, మీనా మేడం గురించే కదా! నీ సహాయానికి అర్హత లేని మనిషి ఆమె. ఆమె కట్టు కథలు విని నువ్వు ఆవేశంగా పరుగెత్తుకొచ్చావు. ఇది నాయకుని లక్షణం కాదు. నిజానిజాలు విచారించాకే ఇలాంటి చోటుకు రావాలి. మనం న్యాయంవైపు నిలబడితే, ప్రజలు గెలిపిస్తారు. లేకపోతే వుమ్మేస్తారు."
“తెలుసుకునే వచ్చాను. ఆ అమ్మాయి రిసెర్చ్ ప్రాజెక్టు పూర్తి చేసి, ఆ ఖర్చు వివరాలు బిల్లులతో సహా గ్రాంట్ యిచ్చిన సంస్థకు పంపింది. మధ్యలో వీళ్ళ పెత్తనమెందుకు? ఆ బిల్లుల కాపీ యివ్వమని వీళ్ళు ఆమెను వేధిస్తున్నారు. ఇది న్యాయమేనా?"
"పూర్తిగా న్యాయమే. గ్రాంట్ యిచ్చిన సంస్థ పేరు యు.జి.సి. అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని ఢిల్లీలో వుంది. అది కాలేజీల్లో అధ్యాపకులకు రిసెర్చ్ ప్రాజెక్ట్స్ శాంక్షన్ చేసి గ్రాంటు నిస్తుంది. దానికోసం దరఖాస్తు కాలేజి ద్వారానే పెట్టాలి. అలాగే ప్రాజెక్టు పూర్తయిన రిపోర్టుని, ఖర్చు చేసిన డబ్బు తాలుకు బిల్లులతో సహా, కాలేజి ద్వారానే పంపించాలి. మీనా మేడం, బిల్లుల కాపీలు జత చేయని రిపోర్టుని ప్రిన్సిపల్ మేడం లేనప్పుడు, ఇంచార్జ్ ద్వారా పంపించారు. మేడం వచ్చాక, బిల్లుల గురించి అడిగారు."
“అలా ఎవ్వరూ చెయ్యడం లేదని, తన మీద కక్ష కట్టి, వేధిస్తున్నారని చెప్పింది."
"అది అబద్ధం .ఈ ఫైలు తెరిచి చూడు. రిసెర్చ్ ప్రాజెక్టు చేసిన వారి రిపోర్టులు, బిల్లుల కాపీలు."
"మరి ఆవిడ అబద్ధమే చెప్పిందా?"
"ముమ్మాటికీ. ఆవిడ అవినీతికి పాల్పడి అది కప్పి పుచ్చుకోవడానికి మరో తప్పు చేసింది. ప్రిన్సిపాల్ మీద అన్ని గ్రూపుల్లో కులపక్షపాతి, నియంత, అవినీతిపరురాలు, లంచమడుగుతోందని దుష్ప్రచారం చేసింది. తన తప్పు దాచి పెట్టి,కులం ప్రస్తావన చేసి మిమల్ని ఇక్కడికి పంపించింది”
సుబ్బయ్య మాటలకు రమణ అడ్డుపడి యిలా అన్నాడు.
"మేము కులం గురించి రాలేదు. కష్టాల్లో ఒక ఆడబిడ్డ వుంది. బాధతో ఏదో గ్రూపుల్లో పెట్టింది. అదంతా వదిలి, ఆమెకు కాస్త సహాయం చెయ్యండని కోరుతున్నాం."
"అదెలా కుదురుతుంది, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది. మేడం ఆవిడపై ఎటువంటి ఒత్తిడి తేలేదు. ఆవిడ గర్భవతి. తొందరచేయకండి. ఆవిడకు నచ్చ చెప్పి,బిల్లుల కాపీలు తీసుకోండి అని చెప్పారు. మేము ఊరుకున్నా మీనా మేడం వూరుకోలేదు. ఇప్పుడు వ్యవహారం వీసీ దాకా పోయింది. నా జీవితకాలంలో, మన వీసి (వైస్ చాన్సెలర్) లాంటి నాయకుడిని, నేను చూడలేదు. రెండేళ్ళ క్రితం 70 వ రాంకులో వున్న ఈ యూనివర్సిటీని 30 వ రాంకుకు తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఆయన లక్ష్యం, ఒక యేడాదిలో పదో రాంకుకి యెదగడం. మీరంతా మన కులం అమ్మాయి అని వచ్చారు. నిజానికి ఆవిడది, వీసీ గారిది ఒకే కులం. అయినా ఆయన ఈవిడ తప్పుని క్షమించలేదు. మెమో యివ్వ బోతున్నారు. వెళ్ళి ఆయనకు క్షమాపణ చెప్పి, ఆ మెమో రాకుండా చూసుకో."
"అలాగే, మరి బిల్లుల సంగతేంటి? పొరబాటున అన్నీ యు.జి. సి .కి పంపించేసిందయ్యె.” రమణ గొంతులో దర్పం మాయమైంది.
"పొరబాటు కాదు. కావాలనే చేసింది. ఆ బిల్లుల కాపీ మాకిస్తే, ఆవిడ అవినీతి నలుగురికి తెలిసిపోతుందని, ఆవిడ బాధ.”
“తప్పో ఒప్పో దీనికి పరిష్కారమేమిటీ?”
“ఒక సారి ఢిల్లీలోని యు.జి.సి ఆఫీసుకు వెడితే మీ సమస్య పరిష్కారమవుతుంది. అది చాలా తేలికైన పని. ఢిల్లీలో ఎవరైనా సహాయం చేస్తారేమో ఆలోచించు. ఈలోగా, బయట విద్యార్ధుల తండ్రులు వున్నారు. వాళ్ళు కూడా మన ఓటర్లేకదా. వాళ్ళ సమస్యలు గమనించు”. అని అతనికి బదులిచ్చి, సుబ్బయ్య బయట వేచి వున్న వారిని లోనికి రమ్మని పిలిచాడు. వాళ్ళు పరమానందంతో లోనికి వచ్చి, ప్రిన్సిపాలుకి నమస్కరించి నిలబడ్డారు.
సుబ్బయ్య ప్రిన్సిపాలుకి చెప్పాడు.
"మేడం, వీరు కాలేజ్ ఫీజులు కట్టని విద్యార్ధుల తండ్రులు. మొత్తం పది మంది పిల్లలని పరీక్షకు అనుమతించమని చెప్పాము".
ప్రిన్సిపాల్ మేడం, తండ్రుల నిలా హెచ్చరించారు," ఏమయ్యా! మీ పిల్లలు ఫీజు బకాయి పడ్డారు. మీరు రేపు సాయంత్రంలోపు ఫీజులు కడితేనే, వాళ్ళని పరీక్షకు అనుమతిస్తాము"
"ఒక్క రోజులో అంటే , ఎక్కడ నుంచి తెస్తాం తల్లీ. మీరే దయ వుంచాలి . ఒక వారం గడువివ్వండి. ఎలాగోలా కట్టేస్తాము.”
"అలాగంటే యెలా? ప్రభుత్వం డబ్బు యిస్తోంది కదా !"
“ప్రభుత్వం ఫీజు నేరుగా కాలేజికి పంపిస్తే ఈ గొడవుండదమ్మా! పిల్లాడి ఖాతాలో వేస్తున్నారు. అది పడిందో లేదో. వాడు దాన్నేం చేసాడో, మాకు వాడు చెప్పలేదు. మాకెలా తెలుస్తుందమ్మా!" అని ఆ తండ్రులు దీన వదనంతో బదులిచ్చారు.
ఇంతలో సుబ్బయ్య కలగ చేసుకుని వారి పిల్లల నిర్వాకం బయట పెట్టాడు.
"మీ వాళ్ళు గంజాయికి, తాగుడికి తగలేసారు. నిన్న ఆ మూలనున్న చెట్టుక్రింద, మజా చేస్తూంటే, పోలీసులు పట్టుకు పోయారు. మన ప్రిన్సిపాల్ మేడం, పరీక్షల పేరు చెప్పి వాళ్ళని విడిపించారు. ఇంకో సారి దొరికారో, ఇంక వారుండేది శ్రీకృష్ణ జన్మ స్థానంలోనే." సుబ్బయ్య మాటలతో ఆ తండ్రులు హతాశులయ్యారు.
"ఏం చెయ్యాలో తెలీయడంలేదు. నాలుగు దెబ్బలు వేసి భయపెట్టే వయసు కాదు. చెప్తే వినడు. దిక్కు తోచకుండా వుంది." అని ప్రిన్సిపాల్ మేడంతో మొరపెట్టుకున్నారు.
ప్రిన్సిపాల్ మేడం వారి కష్టాన్ని అర్ధం చేసుకుని వారికి కొంత సమయమివ్వడానికి సుముఖత చూపుతూ యిలా చెప్పారు.
"బాధ పడకండి. పరీక్షలు వ్రాయనిస్తాను. పరీక్షలై పోయేలోగా, ఫీజు కట్టేయండి. కట్టక పోతే, రిజల్టు రాదు."
ఆమె మాటలతో మనసు తేలిక పడగా,"కట్టేస్తామమ్మా! దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి" అంటూ వాళ్ళు ప్రిన్సిపాలుకు, సుబ్బయ్యకు నమస్కరించి వెళ్ళిపోయారు.
ప్రిన్సిపాల్ మేడం రమణ వైపు చూస్తూ, "చూసారుగా. మీరు ప్రభుత్వానికి చెప్పండి. ఫీజు డబ్బులు నేరుగా కాలేజి వారికిమ్మని. అలా చేస్తే, తల్లిదండ్రులకు యే చింతా వుండదు. అలాగే మీ యువజన సంఘం ద్వారా మన స్టూడెంట్సులో మాదకద్రవ్యాల వాడకం తగ్గించేందుకు ప్రోగ్రాములు చేపట్టండి. మేము పూర్తి సహకారం అందిస్తాము," అంది.
ఆమె మాటలు విని సుబ్బయ్య మనసులో నవ్వుకున్నాడు. రమణ కంగారు పడ్డాడు. జులుం చేయడానికివచ్చి, తప్పు చేసానా అని మధనపడ్డాడు. త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిదని భావించి, అతడు ఆసంతృప్తితో లేచాడు." సరే! మేడం గారు.కాస్త మా అమ్మాయిని కనిపెట్టి వుండండి. తప్పులు మన్నించండి" అని ప్రిన్సిపాలుకు చెప్పి బయటికి నడిచాడు.
@@@
“రమణా సర్! యేమైంది? మేడం ఒప్పుకున్నారా ?" మీనా ఆత్రంగా అడిగింది.
రమణ ప్రశాంతంగా ఆమెనే చూస్తూ , “యూనివర్సిటీ నీకు మెమో యిస్తోందని తెలిసి దాన్ని వెనక్కు తీసుకునేలా చేసాను. ఢిల్లీ వెళ్ళి ఆ బిల్లుల కాపీలు తెచ్చుకో. మీ ప్రిన్సిపల్ మేడంకి సారీ చెప్పు. ఇంతకన్నానేను చేసేదేమీ లేదు" అని చెప్పాడు.
మీనా కన్న కలలు కల్లలయ్యాయి. ప్రిన్సిపాల్ మీద కోపం వున్న వారు ఆమెకు అండగా నిలబడి, ఆమెను రెచ్చగొట్టారు. వాళ్ల మాటలకు ఎక్కడలేని ధైర్యం తెచ్చుకుని ఆమె ప్రిన్సిపాలుని యెదిరించింది. సాటి స్త్రీ అని కూడా చూడకుండా ఆమె పై దుష్ప్రచారం చేసింది. మీనా తిరుగుబాటు ధోరణిని పట్టించుకోకుండా, ప్రిన్సిపల్, ఆమె తప్పులు క్షమిస్తూ వచ్చింది. పైగా, గర్భవతియని ప్రత్యేక శ్రద్ధ చూపించింది. జరిగినదంతా తలుచుకుని, మీనా కన్నీళ్ళ పర్యంతమైంది.
ఆమెకు ఒక విషయం అర్ధమైంది. అవినీతికి పాల్పడడం తను చేసిన తప్పు. ఆ తప్పు ఇంకొక తప్పుకు దారి తీసి, కడకు దోషిగా నిలబెట్టింది. అవినీతి వాన, చిరు జల్లులు కురిపించి, ఆటాడుకుందామని పిలిస్తే, ఉత్సుకతతో మనం పరిగెత్తకూడదు. అది మెల్లగా పెనుతుఫానుగా మారి విసిరిపారేస్తే, విచారించడం తప్ప యేమీ చేయలేము. ఆ విపత్కర పరిస్థితిలో కులం గొడుగులు గాని, రాజకీయ పడవలు గాని అక్కరకు రావు.
@@@@@
C..S.G . కృష్ణమాచార్యులు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో. నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు ప్రచురించాయి.
ఈ మధ్యనే నాకిష్టమైన తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను. ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది, చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ- వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).
Comments