top of page
Writer's pictureJagapathi Babu Chinthamekala

తెలుగు కోయిల కూస్తోంది


'Telugu Koyila Kusthondi' New Telugu Story

Written By C. Jagapathi Babu

'తెలుగు కోయిల కూస్తోంది' తెలుగు కథ



ఈ ఆధునిక కాలంలో భార్యను పోగొట్టుకొని, ఎదిగిన కూతుళ్లు ఇద్దరికీ పెళ్లిళ్లు చేసేసి, భార్యతో కలిసి ఎన్నో ఆధునిక పోకడలతో నిర్మించుకున్న ఆ ఇల్లును ఒక బడిగా మార్చి! గుడి కంటే బడే గొప్పదని, ఆంగ్ల భాషను గౌరవించాలని, మర్చిపోతున్న మన మాతృభాషను ఈ తరం పిల్లలు నేర్చుకోవాలని, ప్రేమించాలని, గౌరవించాలని, ప్రచారం చేస్తూ... అదే బడిలో ఒక మూలుగా ఉన్న ఒక చిన్న గదిలో ఉంటూ... తెలుగు భాష నేర్పించడానికి గొంతెత్తి "తెలుగు కోయిల కూస్తోంది" అని ఒంటరి కోయిలై కుస్తున్నాడు రామారావు.


"అలా ఒంటరిగా ఉండే బదులు మాతోపాటు రెక్కలు కట్టుకొని అమెరికా దేశం ఎగిరొచ్చేయొచ్చు కదా నాన్న ఏంచెక్క మాతో కలిసి ఉండొచ్చు, నీ మంచి చెడులను చూసుకుంటాము, మా పిల్లలు మర్చిపోతున్న మన మాతృభాషను నీ ద్వారా అయినా నేర్చుకుంటారు, నీ ప్రేమ అనురాగం, ఆదరభిమానాలు మా అందరి సొంతమవుతాయి" అంటారు విదేశాల్లో సెటిలై, ఉన్నత స్థాయికి ఎదిగిన కూతుళ్లు ఇద్దరు.


ఆ మాటలు రామారావు మనసుకు కాస్త ఊరటను కలిగించినప్పటికీ, ఈ దేశం మీద విడదీయలేనంతగా పెనువేసుకుపోయిన ఆ ప్రేమ, భార్యతో కలిసి ఎంతో ఇష్టంగా ఆధునిక పోకడలను జోడించి నిర్మించుకున్న ఆ ఇల్లును వదిలి వెళ్ళటానికి తన మనసు ససిమేరా అంటే ఒప్పుకోవట్లేదు, ఎప్పటికీ ఒప్పుకోదు కూడా... ఎందుకంటే? ఆ ఇంట్లో అణువణువునా నిండి ఉన్న, తన భార్య జ్ఞాపకాలను తెగతృంచుకొని వదిలి వెళ్లడం అంటే? అది నా ఊపిరి ఈ అనంత వాయువుల్లో కలిసిపోయాకే! అంటాడు.


అంతలా ఇక్కడ ఈ దేశంలో ఏముందని అని అనుకోవచ్చు? ఇక్కడ ఉన్నదల్లా...!!?? కుళ్ళు రాజకీయాలు, కులమత వివక్షత, అంటరానితనం, రైతన్నల ఆకలి కేకలు, లంచగొండితనం, పీల్చి పిప్పి చేసే కోర్ట్ లాయర్లు, స్వదేశీ భాషను తక్కువ చేసి విదేశీ భాషను ప్రోత్సహించడం లాంటివి బోల్డన్ని ఉండొచ్చు ఈ దేశంలో.. కానీ, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న శ్రీరామచంద్రుని ఆ తియ్యటి పలుకులను తను పూర్తిగా ఏకీభవిస్తానని చప్పుడు గాని కొంతవరకు నాది కూడా అలాంటి సిద్ధాంతమే అంటాడు.


తన ముప్పైవ ఏటా భార్య జానకి కవల పిల్లలకు జన్మనిచ్చి అధిక రక్తస్రావం వలన మరణిస్తూ... తనకు రెండు పనులు అప్పగించి వెళ్ళింది. ఒకటి! మరొక పెళ్లి చేసుకుని పిల్లలకు తల్లి లేని లోటు తీర్చమని, అది ఎలాగో నెరవేర్చలేక పోయాడనుకో..! ఎందుకంటే? తన భార్య స్థానంలో మరొకరిని ఊహించుకోవడమే! చాలా బరువుగా, భారంగా, కంపరంగా, చిరాగ్గానూ ఉంటుంది. అయితే ఏమి? పిల్లలకి అమ్మలేని లోటును చాలావరకు భర్తీ చేశాడు. కన్నతల్లిలా లాలించాడు, ఊరించాడు పాలించాడు, ఆడించాడు, మంచి ఉన్నతమైన చదువుతోపాటు విలువలను, మన ఆచార సంప్రదాయాలను, ముఖ్యంగా మన మాతృభాష తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడడం, రాయడం నేర్పించాడు. పెద్దయ్యాక వారికి పెళ్లి చేయాలనుకుంటున్న సమయంలో వారు కోరిన ఒకే ఒక కోరిక ఏమిటంటే? "నాన్న మేము కవలలుగా జన్మించాము. మేము ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలనుకుంటున్నాము! మీరంతాగా పెళ్లి చేయాలనుకుంటే మాలాంటి ఆలోచన ధోరణి ఉన్న కవలలును వెతికి పెళ్లి చేయండి" అని అడిగారు.


అప్పుడు ఎన్నో పెళ్లి చూపుల వేట నిమిత్తం, గత్యంతరం లేక తెలుగు మేట్రిమోనీ ద్వారా ఒక అమెరికా సంబంధాన్ని ఖాయం చేశాడు. గౌతమ్ సిద్దార్థ్, గీతామాధురి పేర్లు ఎంచక్కా కలిసిపోయినట్టు వాళ్ళ కాపురాలు కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ఒకదానికి కొడుకు కూతురు అయితే, మరొకదానికి కవలలుగా ఇద్దరు కొడుకులే జన్మించారు. చీకు చింతా లేకుండా సాగిపోతున్న వారి సంసారాల గురించి తను పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ,


తన భార్య వెళ్తూ వెళ్తూ, "తెలుగు కోయిల కూస్తోంది అనే విద్యా సంస్థను నెలకొల్పి, అన్ని విద్యా బోధనలతో పాటు, మరుగున పడిపోతున్న మాతృభాషకు పూర్వ వైభవం తీసుకురావడం ఆ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం! అదే నా జీవిత ఆశయం కూడా! ఆ విషయం కేసి ఇప్పటికే నీకు ఒకటి రెండు సార్లు చెప్పాను. కానీ, నువ్వు నా మాటలను తప్పుపడుతూ... ఈ కాలంలో పిల్లలు తెలుగు నేర్చుకునేవారు చాలా అరుదుగా కనిపిస్తారు. ఒక బడిలో కాదు కదా! ఇంట్లో! వీధిలో! చివరికి గుడిలో కూడా ఇంగ్లీష్ ముక్కలే మాట్లాడుతున్నారు? వారి తల్లిదండ్రులు కూడా ఆంగ్ల భాషను బాగా ప్రోత్సహిస్తున్నారు? ప్రస్తుతం, భవిష్యత్తులో కూడా ఆంగ్లభాష అన్నపూర్ణ? ఏదో ముక్కుబడిగా మూడు మాటలు మనలాంటివారు తెలుగులో మాట్లాడొచ్చేమో! గాని మాతృభాష మీద మమకారం ఏ రోజో చచ్చిపోయింది? లైట్ తీసుకో! అని అన్న నువ్వే! నేను పోయాక నా ఆశయాన్ని భుజాన వేసుకుని ముందుకు తీసుకెళ్తావని ఆశతో వెళ్లి పోతున్నానని" రెండో మాటగా చెప్పి వెళ్లిన దాన్ని ఆచరణలోకి తీసుకురావడం కాదు కదా అమలు చేయడంలోనే ఇప్పటికే ఎన్నోసార్లు విఫలమయ్యాడు.


తెలుగు వెలుగు రా? మాతృభాష మనలను కన్న మాతృమూర్తి రా? మన భాషను మరిచితే మన కన్నతల్లిని మరిచినట్టే రా? అని ఎంతమంది విద్యార్థులకు చెప్పాడో! వారి తల్లిదండ్రులను కూర్చోబెట్టి వివరించడానికి ఎంత ప్రయత్నించాడో! కానీ గోరాతి ఘోరంగా విఫలమయ్యాడనే చెప్పాలి.


స్వదేశీ భాషను మరిచి విదేశీ భాష వైపు ఒక పట్నం నుంచి పల్లె వరకు యావత్ దేశం పరుగులు పెడుతోంది, ఇష్టంతో మక్కువ చూపుతోంది అంటే నమ్మశక్యంగా లేదు కదా ఇది పచ్చి నిజం! నగ్నసత్యం! అయితే ఏంటి? పిల్లలకు తెలుగు నేర్పడం కోసం ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నాడని కంప్లైంట్స్, ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా తన పట్టు విడవకుండా వీలైనంత తీయటి తెలుగు పదాలను నేర్పించడానికి వాటి అర్థాలేమిటో తెలియజెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు.

రామారావు వయసు ఇప్పుడు ఐదు పదులు దాటిపోయి ఐదు సంవత్సరాలు అవుతోంది. కాకతాళియంగా ఈరోజు తన పెళ్ళి రోజు కూడా! ఇక్కడ దురదృష్టం ఏమిటంటే తన భార్య చావు వేడుక కూడా ఇదే రోజే రావడం చాలా బాధాకరమైన విషయం. తనతో ఆ చివరి క్షణాల్లో గడిపిన ఆ జ్ఞాపకాలు ఎంత లోలోపల దాచుకుందామని ప్రయత్నించినప్పటికీ ఎప్పటికంటే ఈరోజు ఇంకాస్త ఎక్కువగా తన మనసును పట్టి తొలిచేస్తున్నాయి.


రామారావు స్కూలుకు వెళ్లాడు.నర్సరీ నుండి సెవెంత్ క్లాస్ వరకు ఎన్నో విద్యా బోధనలతో పాటు ఆటలు, పాటలు, ముఖ్యంగా అందరూ మర్చిపోతున్న మన మాతృభాషను నేర్పించడం తన దినచర్య. కానీ, పనిమీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు. తన భార్య జ్ఞాపకాలు తనను వెంటాడుతూనే ఉన్నాయి.


ఇలా జ్ఞాపకాల్లో ఉన్న తనకు ఒక మెయిల్ వచ్చింది. యాంత్రికంగా ఓపెన్ చేసి చూశాడు. అది అమెరికా నుంచి తన కూతురు గీత పంపించినది.


మెయిల్ లో మ్యాటర్ ఎలా ఉంది "నాన్న! అమ్మ సంవత్సరీకం ఈరోజే కదా! నువ్వు బాధ పడుతున్నావు కదా! అమ్మ జ్ఞాపకాలను పదేపదే తలుచుకుంటున్నావు కదా! బాధపడకు నాన్న! నువ్విలా బాధపడుతూ ఉంటావని నాకు తెలుసు! అమ్మ సంవత్సరీకానికి నేను చెల్లి రావాలని ఎంతగానో ప్రయత్నం చేసాం. కానీ, కొన్ని కారణాలవల్ల రాలేకపోయాం. మమ్మల్ని క్షమిస్తావు కదూ!. నీ ఆ బాధను కాస్తయినా తగ్గించడానికి ఒక గుడ్ న్యూస్ నాన్న, కుటుంబ సమేతంగా అందరం మన ఊరు వస్తున్నాం. అది ఎప్పుడో తెలుసా! రెండు నెలల తర్వాత వచ్చే ఉగాదికి. ఆ విషయం రెండు రోజులు క్రితమే చెప్పాలనుకున్నాం. కానీ, అమ్మ పోయిన రోజు నువ్వు చాలా బాధపడుతుంటావని, అలాగని మా అందరికీ బాధ లేదని కాదు! ఆ బాధలో ఉన్నప్పుడు చెప్తే కాస్త సంతోషిస్తావని, ఆ బాధను మేము కూడా కాస్తయినా తగ్గించిన వారిమవుతామని ఇప్పుడు చెప్తున్నాను నాన్న అంటూ... రామారావు మనసులో ఆనందపు విత్తనాన్ని మొలకెత్తించింది ఆ మెయిల్ తాలూకు సమాచారం. అప్పుడు తన మొఖం లోని వెలుగు పున్నమినాటి చంద్రునిల కాకపోయినా ఏదో నెలవంకలా ఆనందపు చాయలు అలుముకున్నాయి.


ఇంతలో.. "సార్..! పిల్లల పేరెంట్స్ కొంతమంది మీతో మాట్లాడాలి అంటున్నారు... మీరు పర్మిషన్ ఇస్తే పంపిస్తాను" వినయంగా అడిగాడు అటెండర్...

సరే అన్నట్టు తలాడించాడు రామారావు.


పిల్లల పేరెంట్స్ తో మాట్లాడి పంపేసరికి సుమారు రెండు గంటల సమయమే అయింది. ఇదివరకు తన మొహంలో ఉన్న ఆనందం మొత్తం పోయి గ్రహం పట్టిన చంద్రునిలా అయిపోయింది."తెలుగు మాదిరి అక్కడ ఇంగ్లీష్ విద్య బోధన సరిగ్గా తమ పిల్లలకు అందుబాటులో లేదని, ఉన్నా కూడా టీచర్స్ కావాలనే తెలుగు నేర్పించడం మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్, ఇంగ్లీష్ నేర్పించడం మీద లేదని, దానంతటికీ కారణం నీకు తెలుగు భాష మీద ఉన్న పిచ్చెనని, నెక్స్ట్ ఇయర్ ఇలా అయితే వేరే ఏదైనా స్కూల్ చూసుకోవాల్సి వస్తుందని, కొందరైతే!ఆ స్కూల్ మాన్పించేస్తున్నామని, అంతేకాకుండా! ఇంకొందరైతే! తెలుగు భాష గురించి చాలా నీచంగా మాట్లాడి, చివరిగా మీ టీచర్స్ నుంచి మేము బోలెడంత ఇంగ్లీష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, తెలుగు అయితే కానే కాదు!" రామారావుకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు.


రామారావు కూడా పిల్లల్ని స్కూల్ మాన్పిస్తాము అన్నందుకు పెద్దగా బాధపడలేదు గాని, మాతృభాష తెలుగు గురించి వారు మాట్లాడిన మాటలు ఒక్కో మాట ఒక్కో తూటాలా! ఆయన గుండెల్లో గుచ్చుకున్నాయి. అవి ఎంతగానో! బాధించాయి. వేదించాయి. కన్నీరు కూడా తెప్పించాయి. అయితే ఏ? మాతృభాష మీద మమకారం అందరికీ చచ్చిపోవచ్చు ఏమో! కానీ, అతనికి మాత్రం నిత్య నూతనంగా పెరుగుతూనే ఉంది. తెలుగు నేర్పించడం అన్నది ముందు తన భార్య ఆశయం అయినప్పటికీ, అది రాను రాను తన జీవిత ఆశయంగా రూపాంతరం చెందింది. అది ఏదైనా గాని, అంతంలో నుంచే ఆరంభం మొదలవుతుందని బాగా నమ్ముతూ వస్తున్నాడు.

ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి. అయినా! సరే, ఇంగ్లీష్ క్లాసెస్తో సమానంగా తెలుగు క్లాసెస్ కూడా నడుస్తున్నాయి. ముందు స్కూల్లో చదువుకునే పిల్లల స్ట్రెంత్ బాగానే ఉండేది. కానీ, అది రాను రాను తగ్గుతూ వచ్చింది. బహుశా అది అక్కడ ప్రత్యేకంగా తెలుగు నేర్పించడం మూలంగానే అయి ఉంటాది.

***

శుభకృతు నామ సంవత్సర ఉగాదినాడు రామారావు ఇంటి ముందు ఒక ఆడి కార్ వచ్చి ఆగింది. అందులో రామారావు కూతుళ్లు, అల్లుళ్లు, మనవళ్ళు, మనవరాళ్లు ఉన్నారు.


ఏ తెలుగు భాష అయితే ఇప్పటి తరం పిల్లలకి నేర్పించాలని, తెలుగు పది కాలాలపాటు కాదు తెలుగు వాడు జీవించి ఉన్నంతకాలం జీవించి ఉండాలని, తాపత్రయపడుతున్నాడో! అలాంటి తెలుగు భాష ఆయన మనవళ్ళుకు, మనవరాళ్లుకు మాట్లాడటం కానీ, రాయడం కానీ, ఒక అక్షరం ముక్క కూడా రానే రాదు! ఆ పిల్లలకి పెద్ద తలకాయ నొప్పి ఏదైనా ఉందంటే అది ఇండియా వచ్చినప్పుడు ఆ వచ్చి రాని ఆ తెలుగు మాట్లాడటం! అది కూడా ఇండియా వచ్చే ముందు ఓ రెండు నెలల పాటు తెలుగు ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుంటే ఆ మాత్రం ఉంటాది వారు మాట్లాడే తెలుగు భాషా విధానం. వారి తల్లిదండ్రులకు తెలుగు నేర్పించాలన్న ఆలోచన, వాళ్ల నాన్నకు భయపడో! లేక, మాతృభాష మీద ఉన్న మమకారం వల్లో కాస్తో కూస్తో ఉన్నప్పటికీ, వారు ఉన్న బిజీ కి పిల్లలతో క్షణమైన స్పెండ్ చేయడానికి టైం సరిపోవట్లేదు. పిల్లలు ఎలా అన్న పెద్దవారవని, తెలుగు భాష ఏ గంగలోనైనా మునిగిపోని, ఏ తీరానికైనా కొట్టుకుపోని వారిది మాత్రం ఉరుకులు పరుగులు ప్రపంచం. యాంత్రిక జీవితానికి బాగా అలవాటు పడ్డారు. డాలర్ మాయలో మునిగి తేలుతున్నారు. వారు ఉన్న బిజీని దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని ఒక తెలుగు ఇన్స్టిట్యూట్ లో అన్న జాయిన్ చేసి తెలుగు భాష నేర్పిద్దాం అంటే ఆ పిల్లలు వినను గాక వినరు. తెలుగు భాష! బోరింగ్ అంటారు. రాయడం మాట్లాడడం చాలా కష్టం అంటారు. ఇక వాళ్ళ అమ్మానాన్నలు గట్టిగా ఏదైనా అంటే, నెట్లో చూసి నేర్చుకుంటామని చెప్పి తప్పించుకుపోతారు.


ఒక్క గీత కూతురు అక్షయకు మాత్రం తెలుగు భాష మీద బాగానే పట్టు ఉంది. అలాగని తెలుగు పూర్తిగా మాట్లాడటం, రాయడం అయితే రాదు! ఎప్పుడో ఐదేళ్ల క్రితం ఇండియా వచ్చినప్పుడు ఆ తాతయ్య పెట్టిన స్కూల్ ని, అతను చెప్పే లెక్చరర్స్ ని, తన నానమ్మ కోరిక మేరకు తన తాత ఇలా చేస్తున్నాడని తెలిసిన తర్వాత, ఈ ఐదేళ్లలో భాషను నేర్చుకుంది. తానే అక్కడున్న పిల్లల్లోకెల్లా పెద్దది కూడా. అక్కడున్న నలుగురి పిల్లలకు వయసు దాదాపు 8-12 సంవత్సరాల మధ్య వయసుగల వారు.


అందరూ కార్ లో నుంచి దిగి ఇంటి వైపు కాదు! ఒకప్పుడు ఎప్పుడో ఇల్లు, ఇప్పుడు అంటే? గీతామాధురిలు పెళ్లి తర్వాత, బడిగా రూపుదిద్దుకున్న ఆ ఇంటి వైపు చూడగానే గుడి కంటే గొప్పగా అనిపించింది. గుడిలో కూడా దొరకని ఆ బడిలోని ప్రశాంతత వారందరిని ఆవహించింది. గోడలపై ఉన్న వర్ణమాలకు ప్రాణం వచ్చి లేచి వెళ్లి, మెడలోమాలై వారందరినీ ఆహ్వానించి తీసుకువెళ్ళింది. అలా వారు నడిచెల్తుంటే? పెద్దవారికి కూడా చిన్న పిల్లలు లాగా బడికి వెళ్తున్నట్టు అనిపించింది. పెద్ద చదువులు చదివి అందనంత ఎత్తుకు ఎదిగిన, మేము ఇక్కడ ఇంకేదో నేర్చుకోవాలి! ఒక అమ్మానాన్నల ఆశయానికే కాదు! అమ్మతో సమానమైన అమ్మ భాషను నేడు బ్రతికించుకోవడం కోసం పోరాడాలి. వీలైనంతమంది పిల్లలకు తెలుగు నేర్పించడం కోసం తోడ్పడాలి అన్న అనుభూతికి లోనయ్యారు. వీరికి ఎప్పుడు వచ్చినా కూడా ఇలాగే అనిపిస్తుంటాది. అమెరికా వెళ్ళాక మళ్ళీ అన్ని మర్చిపోతారు.యదా మామూలే. కానీ ఈసారి ఎందుకో! ఎప్పటికంటే కాస్త భిన్నంగా ఫీల్, అవుతున్నారు. గీతా మాధురి లకు ఏదో తప్పు చేశామన్న భావన మనసులో ఏర్పడింది. బహుశా అది మర్చిపోతున్న మాతృభాషను అందరిలో మేల్కొల్పడానికి నాన్న ప్రయత్నిస్తుంటే? తన సొంత బిడ్డలమైన మేము! ఆయన మనవాళ్లు, మనవరాళ్లకు అక్షరం ముక్కు కూడా నేర్పించలేకపోయామే అన్న న్యూనత భావన ఏర్పడింది అనుకుంటా!


ఎన్నో రోజుల తర్వాత అలా పిల్లలందరినీ చూడగానే రామారావు కళ్ళు ఒక్కసారికి చెమ్మగిల్లాయి. కంట్లోని చెమ్మను తడిమేస్తూ... "ఏంటి ఆ నడక పరాయి వాళ్ళ లాగా? త్వరగా రండి?" ఆనందం పట్టలేక పిలిచాడు రామారావు.


"గ్రాండ్ ఫా ఎలా ఉన్నావు?" అంటూ...పిల్లలు పరిగెత్తుకెళ్ళి వాళ్ల తాతయ్యను చుట్టేశారు. అలా పిలుస్తుంటే? ఎవరో తనని సూదులతో గుచ్చినట్టు అనిపించింది. ఒక అక్షయ మాత్రం తెలుగులో "తాతయ్య" అని మాట్లాడే సరికి కాస్త ఆ నొప్పికి ఉపశమనం కలిగింది. మంచి చెడ్డ, ఇద్దరు మధ్య బాగోగులు, కొన్ని కుశల ప్రశ్నల అనంతరం అందరూ కాసేపు రిలాక్స్ అయ్యారు.

గౌతమ్ సిద్దార్థ్ ఎవరెవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. కంపెనీకి సంబంధించిన డీల్స్ అన్ని ఇక్కడి నుంచే లాప్టాప్ ద్వారా టేకోవర్ చేస్తున్నారు.


అక్కడ కనిపించే ప్రతిదీ ఆ పిల్లలకు కొత్తగా ఉండేసరికి వాటిని చూసి ఎంజాయ్ చేయడానికి, ఆడుకోవడానికి తాతయ్య దగ్గర్నుంచి అలా పక్కకు వెళ్లారు.


ఇంతలో గీత మాధురి ఇద్దరు వచ్చి వాళ్ళ నాన్న పక్కన కూర్చున్నారు. అప్పటివరకు పిల్లల ప్రవర్తన, వారు మాట్లాడుతున్న మాట తీరును, క్రమశిక్షణను గమనిస్తూ ఉన్న రామారావు విసిగిపోయి. "ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి, ఒకరికి కూడా తెలుగు భాష సరిగ్గా మాట్లాడటం రాదు! క్రమశిక్షణ అసలే లేదు! ఎంతసేపు లోడ లోడ ఇంగ్లీష్ ముక్కలు ఏవో వాగుతున్నారు" చిరాగ్గా అడిగాడు.


గీత మాధురి ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు. తలదించుకున్నారు. ఇంతకాలం "చిన్న పిల్లలు కదా నాన్న! వయసు పెరిగే కొద్ది తెలుసుకుంటారులే! మన మాతృభాషను మాట్లాడటం, రాయడం నేర్చుకుంటారులే! అవన్నీ మేము దగ్గరుండి చూసుకుంటాంలే" అని ఏదో ఒకటి కారణం చెప్పి తప్పించుకునేవారు. ఈసారి ఎందుకో ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు.

"ఏ మాట్లాడరే? నేను అడిగిన దానికి సమాధానం చెప్పరే? ఇప్పుడున్న ట్రెండ్ మాదిరిగా కేవలం ఒక్క ఆంగ్ల భాష మాత్రం వస్తే చాలు, తెలుగు ఏమైపోయినా పరవాలేదు అనుకుంటున్న అందరిలో మీరు కూడా ఒక్కరా? " అడిగాడు.


"ఇంతకాలం పోనీలే ఏదో చిన్న పిల్లలు కదా అనుకుంటిని. ఇక నాకు ఆ ఓపిక లేదు! ఇంట్లో వాళ్ళనే చక్కదిద్దుకోలేనిది వీడు, ఇక బయట ఏం చక్కదిద్దుతాడు అనరు. తన సొంత మనవళ్లు, మనవరాళ్లు కు తెలుగు భాష మీద పట్టు తీసుకురాలేనివాడు, పట్టుమని పది తెలుగు పదాలు కూడా పలికించలేనివాడు నిశ్శబ్దంగా ఉండాలి గాని, అలా తెలుగు నేర్చుకోండి అని బయట పిల్లలు మీద పడి ఏడవడం ఎందుకు అని అవహేళన చేయరు. నన్ను చూసి నవ్విపోరు."


"నాన్న అంత మాట అనకు. మేమున్న బిజీ వల్ల పిల్లలకు సరైన సమయంలో తెలుగు నేర్పించలేకపోయాం. మన మాతృభాషను ఎప్పటికీ మర్చిపోము నాన్న! ఎవరే కానీ మర్చిపోకూడదు కూడా. నేను చెల్లి ఇప్పుడే ఓ నిర్ణయం తీసుకున్నాం. వారు ఎప్పుడైతే తెలుగు చదవడం, రాయడం నేర్చుకుంటారో అప్పుడే వారందరిని అమెరికా తీసుకెళ్తాం అప్పటివరకు ఇక్కడే ఉంటారు! నీ సమక్షంలోనే పెరుగుతారు, ఏమంటావ్ నాన్న? " అడిగింది గీత.

రామారావు ఏం మాట్లాడలేదు.


"మా పిల్లల విషయంలో మేము చేసిన తప్పును నువ్వు చక్కదిద్దవా నాన్న?" అడిగింది మాధురి. ఇంతలో గౌతమ్ సిద్ధార్థ్ లు కూడా వచ్చి భార్యల మాటలకు వంత పలికి, మామగారిని రిక్వెస్ట్ చేసేసరికి రామారావు శాంతించి ఊకొట్టాడు. వీరు మాట్లాడుకున్నదంతా అక్షయ విండో చాటు నుంచి విన్నది. తనకెందుకో వారందరి మీద కోపం వచ్చింది.


రామారావు కూతుళ్లు, అల్లుళ్ళు ఒక వారం రోజులు పాటు ఉండి అమెరికా ప్రయాణమయ్యారు. ఈ వారం రోజులు ఎలా గడిచిపోయాయే వారికే తెలియదు. ఆ స్కూల్లోని పిల్లలకి లెక్చరర్స్ అయి తెలుగు పాఠాలు ఎన్నో చెప్పారు. వాళ్ల నాన్న చెప్పే పాఠాలు స్టూడెంట్స్ మాదిరి కూర్చొని ఎన్నో విన్నారు. పిల్లలు అయితే వచ్చి నాలుగు రోజులుపాటు అక్కడి వాతావరణాన్ని, పద్ధతులను చూసి బాగానే ఎంజాయ్ చేశారు.కానీ, రెండు రోజులు క్రితం నుంచి బోరింగ్ గా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడు! ఎప్పుడు! అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. తాతయ్యతో కలిసి కొంతకాలం పాటు ఉండాలన్న విషయం తెలిస్తే ఎగిరి దూకడం, కేకలు వేయడం ఖాయం. ఒక్క అక్షయ మాత్రం ఏదో విషయంకేసి చాలా డీప్ గా ఆలోచిస్తూ ఈ వారం రోజులు గడిపేసింది.


అది అమెరికా తిరిగి వెళ్ళడానికి ఆఖరి రోజు. పిల్లలు మీరు మాతో రావట్లేదని, ఇండియాలోనే ఉండాలని, తెలుగు బాగా నేర్చుకోవాలని, ఎలా చెప్పి ఒప్పించాలో వారికి అర్థం కావట్లేదు!. ఒకవేళ చెబితే? పిల్లలనుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని ఆలోచిస్తున్నారు. ఎంతైనా వారు అమెరికా దేశం కల్చర్కు అలవాటు పడ్డవారు కదా! అది ఏదైనా గాని ఎదురు మాట్లాడడంలో వెనకడుగు వేరు. కాబట్టి, ఆలోచించి అడుగులు వేసి, తము చెప్పాలనుకున్న దానిని అమలు చేయాలను కుంటున్నారు.


గీత ఏదైతే అది అయిందని, లాప్టాప్ లో, మొబైల్ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుతూ... బిజీగా ఉన్న పిల్లల్ని పిలిపించి "మీరు కొన్ని రోజులపాటు ఇండియాలోనే ఉండాలి?" చెప్పింది.

"వై..!"అడిగారు ఆశ్చర్యంగా...


"ఇంగ్లీష్ తప్పనిచ్చి, మీకు తెలుగులో మాట్లాడాలని లేదా? అది నేర్చుకోవడం కోసమే, మీ తాతయ్యతో పాటు ఉంచాలనుకుంటున్నాం? చెప్పింది.

"వాట్..!! ఆఫ్ట్రాల్ తెలుగు నేర్చుకోవడం కోసమని, మమ్మల్ని ఇండియాలో వదిలి వెళ్లాలనుకుంటున్నారా?" ముకుమ్మడిగా పిల్లలు అడిగారు.


"అవును!" అంది అప్పుడే మాధురి లోపలికి వస్తూ...

"నో! మామ్ మాకు ఇక్కడ అయితే ఉండాలని లేదు?" తన తల్లి మాధురి చుట్టూచేరి చెప్పారు ట్విన్స్ అయిన విహార్ విహాస్ లు.


"అవును మామ్ మాక్కూడా ఇక్కడ ఉండాలని లేదు?" తన తల్లి చేయి పట్టుకుని ఊపేస్తూ అన్నాడు విరించి. అక్క నువ్వు కూడా రా? వచ్చి మామ్ ను అడుగు అన్నట్టు సైగలు చేసి పిలిచాడు అక్షయను కానీ, తను మాత్రం మౌనంగా ఉంది.

ఇంతలో! గీత అక్షయ కేసి చూస్తూ... "ఏ అక్షయ! నీక్కూడా వీళ్ళలాగే ఉండాలని లేదా? రా.. వచ్చి ఏదో ఒకటి మాట్లాడు" అంది చికాకుగా.


"నాకు మాత్రం ఇక్కడే ఉండాలని ఉందమ్మా" అంది. మిగిలిన ముగ్గురు పిల్లలు ఆశ్చర్యంగా అక్షయ వైపు చూసి, సున్నా చుట్టినట్టు నోరు తెరిచారు. గీత మాధురి లు కూడా తన దగ్గర నుంచి ఆ మాటలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.

"గుడ్ గర్ల్ అంటే నువ్వు కదా?" అంటూ... గౌతమ్ తన కూతురు అక్షయ బుగ్గలు గిల్లి తలను ప్రేమగా నిమిరాడు.


"మీరు ఎంత త్వరగా తెలుగు నేర్చుకుంటే అంత త్వరగా మిమ్మల్ని అమెరికా తీసుకువెళ్తాం. లేదంటే? శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారు?"వార్నింగ్ ఇచ్చాడు గౌతమ్.


ఇంతలో ఏదో పని మీద బయటకు వెళ్లిన రామారావు అల్లుడు సిద్ధార్థ్ అక్కడికి వచ్చారు.

"నా మూలంగా పిల్లల్ని ఎందుకు ఊరికే బాధపడతారు. మీతో పాటు తీసుకెళ్లండి కానీ, ఎంత దూరం వెళ్లిన, ఎంత ఎత్తుకు ఎదిగిన, మన మాతృభాష తెలుగును, మన మూలాలను, మన ఆచార సంప్రదాయాలను మర్చిపోకుండా నేర్పించండి?" చెప్పాడు.


"నాన్న మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యాం? ఇప్పుడు నువ్వు అడ్డు రాకు? పిల్లలు నీతో పాటు ఉంటున్నారు? ఏ ఇబ్బంది వచ్చినా! ఒకే ఒక్క మెయిల్ చేయి చాలు, క్షణాల్లో వచ్చి వాలిపోతాం!" ఆఖరి మాటగా స్ట్రాంగ్ గా చెప్పింది గీత.

ఆ తర్వాత ఎవరు మాట్లాడలేదు!


మరసటి రోజు పిల్లల్ని అక్కడ వదిలి అమెరికా వెళ్ళిపోయారు. రామారావు బాగోగులు దగ్గరుండి చూసుకుంటున్న ఆ ఇంటి పనిమనిషి రాధమ్మ ఆ పిల్లల బాధ్యతను కూడా తీసుకుంది. గత వారం రోజుల క్రిందట వాళ్ల దూరపు చుట్టాలు ఇంట్లో ఎవరిదో పెళ్లి అని చెప్పి వెళ్లిన ఆమె! ఆరోజే తిరిగి వచ్చింది. పిల్లకు తోడుగా రామారావు ఉన్నప్పటికీ అంత ధైర్యంగా ఆ తల్లిదండ్రులు అక్కడ వదిలి వెళ్ళడానికి రాధమ్మ కూడా ఉందన్న ఒకే ఒక కారణంతోనే! ఆ ఇంట్లో చాలాకాలంగా వంట వార్పు లాంటివి చేస్తూ అందరికీ బాగా దగ్గరయింది. అతి చిన్న వయసులోనే తాగుడుకు బానిసైన భర్తను యాక్సిడెంట్లో పోగొట్టుకొని మన మతి లేకుండా తిరుగుతున్న ఆమెను రామారావు చూసి, ఆదరించి ఆశ్రయించాడు. అప్పటినుంచి వారింట్లోనే ఉండిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే? ఆమె గీతా మాధురి లకు తల్లి తర్వాత తల్లి వంటిది. రాధమ్మను పెళ్లి చేసుకో నాన్న అని ఎన్నోసార్లు అడిగారు. రామారావు ససిమేరా అంటే ఒప్పుకోలేదు.

***

ఒక నెలరోజుల పాటు ఆ పిల్లలు అన్యమనస్కంగానే ఉన్న ఆ తర్వాత, అడ్జస్ట్ అయిపోయారు. స్కూల్లో ఉండే పిల్లలందరితోపాటు వారు కూడా చాలా బాగా క్లాసెస్ వింటూ... ఆ సంవత్సరం గడిచిపోయింది. తెలుగు బాగానే మాట్లాడడం, రాయడం నేర్చుకున్నారు.


ఎందుకో తెలియదు గాని,నెక్స్ట్ ఇయర్ కొన్ని అడ్మిషన్స్ పెరిగాయి బహుశా అక్షయ సోషల్ మీడియాలో తెలుగు భాష గొప్పతనం గురించి అనేక ఆర్టికల్స్, పోస్ట్‌లు క్రియేట్ చేసి వాటికి తెలుగు "కోయిల కూస్తోంది రండి"అని క్యాప్షన్స్ ఇచ్చి పోస్ట్ చేసిన మూలంగానే అయి ఉంటాది.

పిల్లలు తెలుగు బాగా రాయడం, మాట్లాడడం నేర్చుకున్నారని నిర్ధారించుకున్న తర్వాత పెద్దలు అమెరికా వచ్చేయమన్నారు. కాదు! దగ్గరుండి తీసుకువెళ్లాలని ప్రయత్నించారు కానీ, వారు ఒప్పుకోలేదు అక్కడే ఉంటామన్నారు.


అప్పుడు వారు కూడా ఇక చేసేదేమీ లేక, "ఎక్కడుంటే ఏంటి? ఆంగ్ల భాషను గౌరవించండి, మన మాతృభాషను ప్రేమించండి" చెప్పి వెళ్ళిపోయారు.

పిల్లలు పెద్దవారయ్య కొద్దీ తెలుగు భాష కోసం ఎంతగానో కృషి చేశారు. ఆ స్కూల్లో చదువుకునే వారి సంఖ్య కూడా అమాంతం పెంచకపోయిన ఏదో రాను రాను పెరుగుతూ వచ్చింది. అందుకుగాను, రామారావు తో పాటు తన మనవళ్లు, మనవరాళ్ళు కూడా ఎంతగానో శ్రమను దాచుకోకుండా పనిచేశారు. చివరికి వారు కూడా కొన్ని చదువుల కోసం ఒక్కగానొక్క సమయంలో ఇండియా వదలాల్సి వచ్చింది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసే పనిలో పడిపోయారు.

***

ఇలా సంవత్సరాలు గడిచాయి. రామారావుకు వయసు మీద పడడంతో తన పరిస్థితి విషమస్థితిలో ఉంది. మాట పడిపోయింది. చూపు మందగించింది. ఒక్క మంచానికే పరిమితమయ్యాడు. స్కూల్ కూడా మూతపడే స్థితికి వచ్చేసింది. రాధమ్మ పరిస్థితి కూడా అంతంత మాత్రమే!. ఏదో! వారి ఉప్పు తిన్న పాపానికి పప్పు కూర చేసి పెడుతోంది. ఓపిక ఉన్న కాటికి ఇంట్లో మనిషిలా దగ్గరుండి రామారావు బాగోగులు చూసుకుంటోంది.


కొన్ని రోజుల్లోనే! రామారావు పరిస్థితి మరింత దిగజారి పోవడంతో! రాధమ్మ ద్వారా ఆ విషయం తెలుసుకున్న కూతుళ్లు, అల్లుళ్లు, మనవరాళ్లు, మనవళ్లు అమెరికా నుంచి హుటాహుటిన తిరిగి వచ్చారు. ఆ తర్వాత, పట్టుమని పది నిమిషాలు కూడా రామారావు ప్రాణం నిలవలేదు. బహుశా వారి రాక కోసమే గుప్పెట్లో ప్రాణాన్ని పెట్టుకుని ఎదురుచూస్తూ గడిపాడనుకుంటా!


పెద్ద కార్యం అయిపోయిన మరుసటి రోజే అందరూ అమెరికా వెళ్లడానికి ప్రయాణమయ్యారు ఒక్క తమ నలుగురు పిల్లలు తప్ప. అది గమనించిన గౌతమ్ "ఏరా మీరు బయలుదేర లేదా?" అడిగాడు.

"నాన్నగారు మేము ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాము" చెప్పాడు విరించి.


"మీ తాతగారే పోయాక ఇక్కడ ఏం పని మీకు?" అంది అప్పుడే లోపలికి వస్తు... వారు మాట్లాడుకున్న మాటలు విన్న గీత. ఇంతలో సిద్ధార్థ్ మాధురీ ఇద్దరు కూడా అక్కడికి వచ్చారు.


"ఆయన లేకపోతే ఏంటి? ఎప్పటికీ అలసిపోని తాతయ్య నానమ్మల ఆశయాలు జీవించే ఉన్నాయి కదా! వాటిని ముందుకు తీసుకువెళ్లాలనుకుంటున్నాం?" అంది అక్షయ.

"అంత పెద్ద చదువులు చదివింది ఇక్కడ ఉండిపోవడానికేనా? అందుకు మేము ఎవరము ఒప్పుకోము?" నలుగురిని ఉద్దేశించి అన్నాడు సిద్ధార్థ్.



"ఆ చదువులేవి, తెలుగు భాష అంత సంతృప్తిని ఇవ్వలేదు నాన్నగారు. ఇక్కడే ఉంటూ మూతపడటానికి సిద్ధంగా ఉన్న స్కూల్ ని రన్ చేయాలనుకుంటున్నాం?" అన్నాడు విహార్.

"అయితే ఏమంటారు ఇప్పుడు? అమెరికా మేము రమ్మంటారు అంతే కదా! అయితే మీరు అమెరికా రాకండి, ఇక్కడే ఉండండి. కానీ, ఇకనుంచి ఎప్పటికే కానీ మేము కూడా ఇండియా రాము" కోపంగా అంది గీత.


"పెద్దమ్మ ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు! చిన్నప్పుడు ఎప్పుడో మాకు తెలుగు సరిగ్గా రాయడం, మాట్లాడడం చేతకాదని, మాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోయినా బలవంతంగా వదిలి వెళ్లారు. అప్పుడు! మీ మీద మాకు చాలా కోపం వచ్చింది. కానీ,ఇప్పుడు మాకు మేము గా ఉంటామంటుంటే వద్దంటున్నందుకు, ఈరోజు మళ్లీ కోపం వస్తోంది. ఆరోజు మాట్లాడిన నువ్వేనా! మీరేనా! ఈ రోజు ఇలా మాట్లాడుతోంది" అన్నాడు విహాస్.


"తెలుగు భాష వద్దు ఆంగ్ల భాష ముద్దు అనే స్థితికి నేటి తరం పిల్లలు అలవాటు పడిపోతున్నారు! వారి తల్లిదండ్రులు కూడా దగ్గరుండి అలవాటు చేస్తున్నారు. భవిష్యత్తు తరాలైతే మరి దారుణంగా దిగజారి పోవన్న గ్యారెంటీ లేదు! అందుకే? మరిచిపోతున్న ఎంతోమందికి మాతృభాష గొప్పతనాన్ని తెలియజేయడానికి, నేర్పించడానికి అవసరమైతే పలికించడానికి, తాతయ్య నానమ్మల ఆశయాలు ఇంతటితో ఆగిపోకుండా ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేయాలనుకుంటున్నాం! అడ్డు రాకండి?" అంది చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంటూ అక్షయ. విహార్, విహాస్, విరించి తనని ఓదార్చడానికి ప్రయత్నించారు.కానీ, వారి వల్ల కాలేదు.


"ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడానికి తప్ప, ఇక అంతకంటే ఇంకేమిటికి ఉపయోగపడుతుంది రా.. ఆ తెలుగు భాష. అటువంటి దానికి మీరు ఇంతలా బాధపడుతున్నారా?" అంది గీత.

"అమ్మ నాన్న అని పిలవడం లో ఉన్న ఆ అనుభూతి మమ్మీ దాడిల్లో ఎక్కడిది! అందుకే? తెలుగు భాష అమ్మ భాష అంట కదా! అలాంటి అమ్మకు ఆపద వస్తే, ఏ బిడ్డ అయితే మాత్రం చూస్తూ ఊరుకుంటాడు. బాధపడకుండా! మదన పడకుండా! ఎలా ఉంటాడు. ఆ ఆపదకు ఎదురెళ్ళకుండా ఎలా ఉంటాడు. చివరికి ఆ ఆపద ఎలాంటిదైనా జయించకుండా ఎలా ఉంటాడమ్మా" అన్నాడు విరించి.


" అయితే, అమెరికా రానుంటారు. ఎలా రారో నేను కూడా చూస్తా!" గీత ఏదో మాట్లాడబోతుండగా... గౌతమ్ మధ్యలో కల్పించుకుని "గీత ఇక చాలు ఆపు. ఇక వారిని ఎక్కువగా విసిగించకు. నాకో విషయం బాగా అర్థమైంది. అదేమిటంటే? తెలుగు భాష లేని నాడు ఆ తెలుగు గడ్డపై మనం ఉన్న లేని దానితో సమానమని. నీకు కూడా ఆ విషయం అర్థమయింటే వెంటనే పిల్లల్ని వదిలేసి అమెరికా వెళ్లడానికి బయలుదేరు" అన్నాడు.


"రేయ్ మీరు కూడా" సిద్ధార్థ్ మాధురి ని ఉద్దేశించి అన్నాడు. అందరూ కోపంగా గదిలోకి వెళ్లిపోయారు. గౌతమ్ ను విరించి అక్షయ విహార్ విహాస్ ముకుమ్మడిగా వాటేసుకుని ఏడ్చేశారు చేశారు.


"ఇట్స్ ఓకే. మీరు చేస్తున్నది నూటికి నూరుపాళ్లు కరెక్ట్" ప్రేమగా అందరి తలలు నిమిరాడు. ఓదార్చాడు.

కాసేపట్లోనే అందరూ లగేజ్ ప్యాక్ చేసుకుని బ్యాగులు పట్టుకొని వచ్చారు. కోపంగా వెళ్లి కారులో కూర్చున్నారు. గౌతమ్ వెళ్లి కూర్చునేసరికి కార్ ముందు కదిలింది.


విరించి, అక్షయ, విహార, విహాస్ లు చూస్తుండగానే కార్ మలుపు తిరుగుతుండగా అకస్మాత్తుగా ఆగిపోయింది. క్షణాల్లోనే రిటర్న్ తీసుకొని యధా స్థానంలోకి వచ్చాగింది. "ఇటు రండి?" అని గట్టిగా గౌతమ్ కేకలేసి పిలిచాడు.


విరించి, అక్షయ, విహార, విహాస్ లు ఆశ్చర్యంగా అయోమయంగా కార్ దగ్గరికి పరిగెత్తుకెళ్ళారు.

ఒక్క అంగులో కార్లో నుంచి దిగి వారి పిల్లల్ని వాటేసుకొని ఏడ్చేశారు.

"ఎవరైనా! మీ పిల్లలు ఇండియాలో ఏం చేస్తున్నారని అడిగితే, మర్చిపోతున్న మన మాతృభాషకు పట్టాభిషేకం చేస్తున్నారని గర్వంగా చెప్పుకుంటాం" అంది గీత.

ఆ మాటలకు విరించి, అక్షయ, విహార, విహాస్ లకు కన్నీళ్లు సుడులు తిరిగాయి. ఆ కన్నీళ్ళను అదుపు చేయడం ఎవరి వల్ల కాలేదు.

***

తెలుగు భాష బ్రతికించుకోవడం కోసం పోరాడుదాం! వీలైనంత తీయటి తెలుగును మన పిల్లలకు, భవిష్యత్ తరాలకు నేర్పించడం కోసం కృషి చేద్దాం!

"తెలుగు భాష లేనినాడు, ఆ తెలుగు గడ్డపై పుట్టిన నీవు ఉన్న లేని దానితో సమానం"

**************శుభం**************

C. జగపతి బాబు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



72 views0 comments

Comments


bottom of page