తస్సాదియ్య.. తాపేశ్వరం కాజాలు
- Nallabati Raghavendra Rao
- Mar 31
- 9 min read
#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #ThassadiyyaThapeswaramKajalu, #తస్సాదియ్యతాపేశ్వరంకాజాలు, #TeluguStories, #తెలుగుకథలు

Thassadiyya Thapeswaram Kajalu - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 31/03/2025
తస్సాదియ్య తాపేశ్వరం కాజాలు - తెలుగు కథ
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
''ఏవండీ మనం చికెన్ కర్రీ వండుకున్నాం కదా అని పక్క పోర్షన్ లో ఉంటున్న మా కొలీగ్ వెంకటలక్ష్మి ‘కొంచెం కర్రీ పెట్టవా’ అంటూ వచ్చింది పెద్దగిన్నె పట్టు కొని.'' ప్రభాకర్ దగ్గరకు వచ్చి అంది అతని భార్య సరళ.
''మనకే సరిపోదు కదా.. నువ్వు ఇచ్చేసావా?''
కంగారుగా ప్రశ్నించాడు ప్రభాకర్.
''ఏం చెప్పాలో ఆ మాత్రం నాకు తెలియదా. బెండ కాయ కూర వండుకున్నామని చెప్పా''''
''అలా ఎందుకు అబద్ధం ఆడావు. సరే ఆ బెండకాయ కూర కొంచెం ఇమ్మంటే అప్పుడు ఏం చేస్తావ్. ''
''మీ మొఖం. అబద్దం ఆడటం నాకు రాదా ఏమిటి.
అదో పెద్ద కళ. సందర్భాన్ని బట్టి సరిగ్గా అతుక్కునేలా ఏం చెప్పాలో అది చెప్పాలి. దానికి బెండకాయ అంటే అసలు పడదు. అందుకని అలా చెప్పాను. మీరు అయితే పప్పులో కాలు వేస్తారు'''
''అబద్ధం ఆడడం కూడా ఓ గొప్ప బ్రహ్మవిద్య అంటావా?''
''మీకేం తెలుసు.. అబద్ధం ఆడడంలో ఏ మాత్రం పప్పులో కాలేసినా.. తేడా వచ్చినా.. జీవితం నాశనం అయిపోతుంది..''
''ఓ ప్రతిదీ ఓ పెద్ద కళ, ఆర్ట్, బ్రహ్మ విద్య అంటావు.
మాకు కూడా ఆ విద్యులన్ని వచ్చు లేవోయ్''
“ఒకసారి మీ ఫ్రెండ్ కి అబద్దం చెప్పి బుక్ పోయారు కద. మీకు అస్సలు అబద్ధం ఆడటం రాదు. మీలాంటి వారు బ్రతకడం కష్టమండి బాబు. '' సరళ భర్త వైపు చూసి చిలిపిగా అంది.
''ఏదో నువ్వే పెద్ద గొప్ప ఆర్టిస్టులా మాట్లాడతావ్ ఏంటి.
ఈసారి చూడు అబద్ధం ఆడి నీ చేత శభాష్ అనిపించు కుంటాను. '' ప్రభాకర్ భార్య వైపు చూస్తూ మీసం తిప్పుకున్నాడు.
ఆమె వెకిలిగా చిలిపిగా పిచ్చిగా నవ్వేసింది.
***
'' ఏమండీ కాపీ తీసుకోండి''
కుర్చీలో కూర్చుని వార్తలు వింటున్న ప్రభాకరానికి కప్పుతో ఫిల్టర్ కాఫీ అందిస్తూ ప్రేమగా అంది భార్య సరళ. అడిగితేనే కానీ కాఫీ ఇవ్వని సరళ ఈరోజు ఎందుకు ఇలా అందిస్తుంది.. అన్నటువంటి అనుమానం ప్రభా కరం బుర్రలో మెరిసింది. బహుశా ఏదో చిన్న సైజు కోరిక అయ్యి ఉంటుంది అనుకున్నాడు ప్రభాకరం మనసు లోపలి పొరలలో.
''సాయంత్రం ఆఫీసు నుండి ఈరోజు త్వరగా వచ్చేయండి. ''
ప్రభాకరం కప్పులో కాఫీ పూర్తి కాలేదు కానీ సరళ గొంతులో మాటలు మాత్రం పూర్తయ్యాయి.
''ఏంటి విషయం?'' ముభావంగా అడిగాడు ప్రభాకరం.
“మీరు ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండి మర్చిపోయినట్టున్నారు మనిద్దరికీ ఫేవరెట్ మహేంద్ర కొత్త సినిమా రిలీజ్ కదా. చాలా కష్టపడి ప్రపంచ దేశాలు అన్నీ తిరిగి ఐదు సంవత్సరాలు తీశారట ఆ సినిమా. ఈరోజు ఫస్ట్ షో చూస్తే ఆ మజాయే వేరు. అభిమానుల అల్లరితో హాలంతా కోలాహలంగా ఉంటుంది. మనం అలా చాలాసార్లు వెళ్ళాము కదా. ఆ సరదా చూడాలంటే నాకు ఎంత సరదాయో మీకు తెలుసు కదా. మన వీధిలో చాలామంది వెళ్తున్నారట.
ప్లీజ్ మనము వెళ్దాం త్వరగా వచ్చేయండి. మనిద్దరం కలిసి సినిమాకు వెళ్లి చాలా రోజులు అయింది కదా''
భర్త మీద పడుతున్నట్టుగా అంది సరళ.
''సరేలే. వీధిలో వాళ్లు అందరూ వెళ్లి క్షేమంగా సినిమా చూసి రావాలి కదా. వాళ్ళందరూ వచ్చాక తలనొప్పి టాబ్లెట్లు కొనుక్కోవలసిన పనిలేదు మేము కొను క్కోలేదు అని కచ్చితంగా వాళ్లు అందరూ చెప్పాక అప్పుడు వెళ్దాం. ఆ హీరో మన ఇద్దరికీ ఫేవరెట్ అయినప్పటికీ డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టకూడదు కదా. గొప్ప సినిమా అయితే ఎలాగూ ఒక నెల రోజులు ఆడుతుంది.
అయినా సంవత్సరం నిండని ఈ పసికందుతో నీకు బయట తిరగాలి అని ఎలా అనిపిస్తుంది. సినిమాలు షికార్లు లేకుండా ఉండలేవా?”
అంటూ భార్య వైపు కొరకరా చూస్తూ చిన్న సైజు వార్నింగ్ లాంటిది ఇచ్చినట్టు ఇచ్చి.. తన ఆఫీసు బ్యాగు పట్టుకొని చరచరా బయటకు వెళ్ళిపోయాడు ప్రభాకర్
సరళకు తన ఒంటిమీద ఎవరో ఆసిడ్ లాంటి వాటర్, బకెట్ తో తెచ్చి మీద పోసేస్తాను అంటూ బెదిరించినట్లు అనిపించింది.
‘ధర్మం నీతి నిజాయితీ.. ఇప్పుడే కాదు సీతాదేవి కాలం నుండి కూడా లేవు.. చి చి ఆడవాళ్ల బ్రతుకులు ఇంతే నా? ధైర్యం సాహసం తుంగలో తొక్కేయడమేనా?’ అనుకుంటూ సరళ ఒక నిర్ణయానికి వచ్చినట్టు వంటింట్లోకి వెళ్లిపోయింది.
మళ్లీ వంటింట్లోంచి బయటకు వచ్చి వీధిలోనికి వెళ్లి భర్త వెళ్లిపోయినట్లు నిర్ణయించుకుని లోపలకు వచ్చి
తలుపు గడియ పెద్ద సౌండ్ వచ్చేలా పెట్టి మంచం పై వాలిపోయింది నిస్సత్తువగా.
సాయంత్రం ఐదు గంటలకు భర్త నుండి ఫోన్ వచ్చింది.
సెల్ ఆన్ చేసి అవతల నుండి తన భర్త ఏమి చెబు తాడు వినకుండ.. తను గలగల ఇలా మాట్లాడేయడం మొదలెట్టింది
''ఏమండీ.. టాయిలెట్ ఐపోయి నన్ను బాబుని థియేటర్ దగ్గరికి వచ్చేయమని ఫోన్ చేస్తున్నారు కదూ. మీ మంచితనం గురించి నాకు బాగా తెలుసు. ఇదిగో ఐదు నిమిషాలలో టాయిలెట్ అయిపోయి బాబు నేను ఆటో ఎక్కి థియేటర్ దగ్గరికి వచ్చేస్తాం. మీరు రెడీగా అక్కడే ఉండండి'' అనేసింది చాలా కంగారుగా.
''ఉదయం చెప్పాను కదా పసికoదుతో నువ్వు బయట తిరగకూడదని. ఒకసారి చెబితే నీకు అర్థం కాదా సరళ.. ఇంకో 6 నెలలు గడిచాక అప్పుడు ఇద్దరం కలిసి వెళ్దాం”
“సరే! నీకు ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ఈరోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాదు నుంచి మా పెద్ద ఆఫీసర్ గారు వస్తున్నారు. ఎకౌంట్స్ అన్ని కంప్యూటర్ మీద తనిఖీ చేస్తారట. ఆఫీసు మొత్తం మీద కంప్యూటర్ బాగా ఆపరేట్ చేయగలి గింది నేనొక్కడినే కదా.. నీకు తెలుసు కదా ఆ విషయం.
సో.. మా బాసు నన్ను రాత్రి 9 గంటల వరకు ఉండ మన్నారు. బ్రతిమలాడాడు. పెద్ద ఆఫీసర్ గారిని పంపించేసి నేను రాత్రి తొమ్మిదిన్నర కల్లా ఇంటికి వస్తాను. కొంచెం టైం ఎక్కువైనా కంగారు పడకు. నువ్వు భోజనం చేసేసి బాబుని పడుకోబెట్టి ఉండు. పువ్వులు పట్టుకొని వస్తానులే '' అంటూ భార్య చెప్పే సమాధానం కోసం ఎదురు చూడకుండా సెల్ ఆఫ్ చేశాడు ప్రభాకరం.
ఫ్యాను కింద మడత కుర్చీలో కూర్చుని కాసేపు తదేకంగా ఆలోచించింది సరళ.
న్యాయం ధర్మం నీతి నిజాయితీ ఎప్పుడు గెలిచాయి కనుక.. అనుకుంటూ బాబు లేచే లోపల టాయిలెట్ అయిపోయింది సరళ.
సాయంత్రం 6 గంటలు అయ్యింది. బాబుని ఎత్తుకొని తలుపుకు తాళం వేసింది సరళ. పక్క పోర్షన్లోకి వెళ్లి తన కొలీగ్ వెంకటలక్ష్మికి బాబుని అప్ప చెప్పింది.
''ఆయన రాత్రి10 గంటలకు కానీ రారట. చెకింగ్ కోసం ఎవరో పెద్ద ఆఫీసర్ వస్తున్నాడట. బాబుకి అర్జంటుగా టాబ్లెట్స్ తేవాలి. హనుమాన్ జంక్షన్లో మెడికల్ షాప్ ఉంది కదా.. అక్కడే అవి దొరుకుతాయి. ఎవర్నైనా పంపించి తెప్పించడం నాకు ఇష్టం లేదు. అవి అక్కడే దొరుకుతాయి కనుక వెళ్లాలి.. కొంచెం దూరమైనా తప్పదు. ఇదిగో వెంకటలక్ష్మి.. బాబుని జాగ్రత్తగా చూసుకో.. ఆయనకు ఫోన్ చేసి వచ్చేటప్పుడు తెమ్మందాము అంటే ఆయన ఆ దారిలో రారు కదా. ఆల్ రౌండ్ తిరిగి రావాలి అంటే ఆయనకు బాధ. ఈ పూటకు ఆ టాబ్లెట్లు వేయకపోతే బాబుకి కుదరదు. నేను ఉన్నాయి అనుకున్నాను. కొంచెం దూరం కనుక గంట వెళ్లడం గంట రావడం మొత్తం మీద తొమ్మిదికి వచ్చేస్తాను.
ఆయన వచ్చేలోపులోనే వచ్చేస్తాను నువ్వు కంగారు పడకు. '' అంటూ గబ గబా వెళ్ళిపోయింది.
ఆటో ఎక్కి సినిమా రోడ్డుకు వెళ్లి తన అభిమాన హీరో నటించిన కొత్త సినిమా టికెట్ తీసుకుని లోపలకు వెళ్లి తన నెంబర్ సీట్లో కూర్చోవాలి అనుకుని ఆటో దిగుతుండగా కొంచెం దూరంలో పాన్ షాప్ దగ్గర బండి స్టాండ్ చేసి ప్రభాకర్ కనిపించాడు.
సరళ కంగారు పడి మొఖం పక్కకు తిప్పుకోవాలి అనేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ప్రభాకర్ సరళ చూపులు కలపక తప్పలేదు.
ప్రభాకర్ సరళ దగ్గరికి వచ్చాడు కోపంగా గబగబా.
''ఏమిటి ఇలా వచ్చావు బాబు ఏడి ?'' కంగారుగా అడిగాడు.
''బాబుని మా కొలీగ్ వెంకటలక్ష్మికి కి అప్పచెప్పి కంగారుగా వచ్చేసాను. ఇప్పుడు బాబుకి వేయవలసిన ట్యాబ్లెట్లు అయిపోయాయి. నేను చూసుకోలేదు. ''
తడబడుతూ అంది సరళ.
''బాబుకి వెయ్యవలసిన టాబ్లెట్లు ఏమీ లేవు కదా.''
''బాబు ఎప్పుడైనా నవ్వకపోతే వెయ్యమని డాక్టర్ గారు నాకు చెప్పారు మీకు తెలియదు. '' మరింత కంగారుపడుతూ చెప్పింది.
''మనకు దగ్గరలో చాలా పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి కదా. అయినా ఇక్కడ వరకు ఎందుకు వచ్చావు.. అందులోని ఒంటరిగా'' ప్రశ్నించాడు ప్రభాకర్ చాలా కోపంగా.
''సరే. మందుల చీటీ ఇలా ఇయ్యి. నేను తీసుకుంటాను మెడిసిన్.'' అన్నాడు.
సరళ తన పరుసు చాలాసేపు వెతికి
''అయ్యో.. కంగారులో మందుల చీటీ పర్సులో పెట్టుకోవడం.. తేవడం మర్చిపోయాను. అయినా అవి మన దగ్గర షాపులు వాళ్ళు అమ్మరని మొన్న తెలిసింది. '' అంది బిక్క మొఖం వేసి..
''అవును మీ పెద్ద ఆఫీసర్ గారు రాలేదా?'' మళ్లీ వెంటనే ప్రశ్నించింది.
''రాలేదు. ఏంటి ఇప్పుడు''
''సర్పవరం జంక్షన్ మీద నుండి అయితే ఒక కిలోమీటర్ కదా మన ఇల్లు. అలాగే కదా ఎప్పుడు వస్తారు. ఈ సినిమా రోడ్డు నుండి అయితే ఆరు కిలోమీటర్లు ఇలా ఎందుకు వచ్చారు?'' ప్రశ్నించింది సరళ.
''ఏమిటలా ప్రశ్నిస్తావు.. సినిమా చూడ్డానికి వచ్చాను అనుకున్నావా.. మా బాస్ కి తాపేశ్వరం కాజాలు కావాలట. అవి ఈ సెంటర్లోనే దొరుకుతాయి అని వచ్చాను''
''అయితే కొనం. మనకు కూడా కొనండి ఒక కేజీ. ''
''ఎందుకులే.. కొందామనే వచ్చాను కానీ కాజాలు అన్నీ తినేసి డబ్బులు మాత్రం ఇవ్వడు. అందుకని ఇప్పుడు కొనను. వెళ్లిపోదాం నడు. '' అంటూ బండి స్టార్ట్ చేయబోయాడు.
''అదిగో తాపేశ్వరం కాజాల షాపు. మీరు చెప్పినట్టు ఇక్కడ తప్పించి ఎక్కడా లేదు ఈ షాపు మన టౌన్ లో.
ఎలాగూ వచ్చాము కదా.. నాకు కూడా తినాలని ఉంది. నేను కూడా తిని సంవత్సరం దాటింది కదా. ఒక కేజీ కొనండి. ప్లీజ్.. ''భర్తను బ్రతిమలాడింది సరళ.
''చాలా కాస్ట్లీ అవి. కేజీ 400 రూపాయలు. ఇప్పుడు వద్దు వెళ్ళి పోదాం నడు అనవసరపు ఖర్చు. '' అన్నాడు ప్రభాకరం.
సరళ ఒప్పుకోలేదు. ''నేను బంగారం అడిగానా చీర అడిగానా.. సినిమాకు కూడా తీసుకెళ్లనన్నారు. ఒక కేజీ కాజలు కొనలేరా? బిడ్డను కనడం కొత్త జన్మ లాంటిది అన్నారు. అలాంటి కొత్త జన్మ ఎత్తి చిన్ని కోరిక కోరితే తీర్చరా?'' విసవిసలాడుతూ భర్తతో అంది.
''సరే ఒక పావు కేజీ కొంటాను. ''
''మూడో నాలుగో వస్తాయి. వద్దు వెళ్ళిపోదాం వచ్చేయండి. '' భర్త నుండి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్లిపోతూ అంది.
సరళ ముఖం చూసి ఇక తప్పదన్నట్టు 400 రూపాయలు ఇచ్చి ఒక కేజీ కాజాలు కొన్నాడు ప్రభాకర్.
భార్యకు తెలియకుండా సినిమా చూడటానికి వచ్చి తప్పించుకోవడం కోసం మళ్లీ చిన్ని అబద్ధం ఆడి ఇరుక్కుపోయాను అని తల మీద బాదుకుంటూ 4 వందల రూపాయలతో ఒక కేజీ కాజాలు కొనక తప్పలేదు ప్రభాకరానికి.
బండి స్పీడుగా తమ ఏరియా వైపు వెళుతుంది. వాళ్ళు ఉండే ప్రసన్న నగర్ వెళ్ళాలి అంటే నాలుగు కిలోమీటర్ల వెళ్లాలి.
''పసిబిడ్డను ఎవరికో ఇచ్చేసి ఇలా రావడం కరెక్ట్ కాదు సరళ.'' భార్యను వెనుకగా కూర్చోబెట్టుకొని బండి నడుపుతూ అన్నాడు ప్రభాకర్.
''ఉదయం వెళ్లారు. రోజు లాగా సాయంత్రం ఐదు గంట లకు ఇంటికి వచ్చేయొచ్చు కదా. ఎవరికో తాపేశ్వరం కాజాలు ఇష్టము తెమ్మంటే తాపేశ్వరం వెళ్ళిపోతారా. అమెరికా అప్పడాలు ఇష్టము అని చెబితే అమెరికా వెళ్లి తెచ్చి ఇచ్చేస్తారా'''
''నువ్వు నిజంగా మెడిసిన్ కోసం రాలేదు. సినిమా చూడ్డానికి వచ్చావు''
''ఏం కాదు మెడిసిన్ కోసమే వచ్చాను. మీరే సినిమా చూడటానికి వచ్చారు''
''నాకు చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావన్న
మాట.”
''అలాంటి అలవాట్లు లేవు మా ఇంట్లో ఎవరికి. పెళ్ళాం బిడ్డల్ని వదిలేసి సింగిల్ గా సినిమాకు షికార్లకు తిరిగే అలవాటు మీకే ఉంది. ''
''ఒక మాట చెబుతాను విను. లేకపోతే నాకు కుదరదు. ఇంకెప్పుడునాకు చెప్పకుండా ఇలా బయటికి రావద్దు”
''బాసు.. తాపేశ్వరం కాజాలు.. కాకినాడ కరకజ్జం..
అంటూ మీరు కూడా అబద్ధాలు చెప్పకండి ''
''చెబితే నమ్మవేంటి.. మా బాసు కాజాల కోసమే నేను నిజంగా వచ్చాను ఆ సెంటర్ కి”
''నేను కూడా బాబు మందుల కోసమే వచ్చాను ఈ సెంటర్ కి. నేను చెప్తే మీరు నమ్మరు ఏంటి''
''సరే ఇల్లు దగ్గర పడుతుంది. మన స్ట్రీట్ లోకి ఎంటర్ అయ్యాం. ఇక నువ్వు మాట్లాడకు. నేను కూడా మాట్లాడను”
''అలాగే మీరు మాట్లాడకండి నేను కూడా మాట్లాడను.''
''ముందు నువ్వు మాట్లాడటం ఆపు. లిఫ్ట్ ఎక్కబో తున్నాం కద''
''నేను మాట్లాడడం మానేశాను మీరే ఇంకా మాట్లాడు తున్నారు”
''కొంచెం ఆగు. బాబుని ఎత్తుకొని మీ కొలీగ్ బయట ఉంది.”
''అలాగే.. దారిలో బండి వెనుక కూర్చుని సువాసన మధురంగా ఉండటంతో నాలుగు కాజాలు తినేసాను. ఈ మిగిలినవి మా కొలీగ్ కు ఇచ్చేస్తాను. పాపం ఇంత సేపు బాబుని జాగ్రత్తగా చూసింది కదా. రేపు వచ్చేటప్పుడు ఆ దారిలోంచి వస్తు మీ ప్రియమైన భార్యామణి కోసం మరో కేజీ తాపేశ్వరం కాజా తెండి. జాగ్రత్తగా దాచుకుని తింటాను.''
పక్కాగా అబద్దం ఆడటం తెలియని ప్రభాకర్ మాట్లాడలేక పోయాడు.
నిజమే అబద్ధం ఆడటం ఒక గొప్ప కళ. కచ్చితంగా చెప్పాలంటే బ్రహ్మవిద్య!
ఈ వేళ ఒక కేజీకి తాపేశ్వరం కాజా 400 రూపాయలు
మళ్లీ రేపు ఒక కేజీ తాపేశ్వరం కాజా 400 రూపాయలు వెరసి మొత్తం 800 రూపాయలు.. ఫటాఫట్.
అబద్ధం ఆడి అడ్డంగా బుక్ అయిపోయినందుకు నెత్తి మీద బాదుకుంటూ.. పక్కింటి వెంకటలక్ష్మి దగ్గర నుండి బాబుని అందుకొని, ఎత్తుకొని లోపలికి నడిచాడు ప్రభాకర్.
****
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు
Comments