top of page

తెగని ఆలోచనలు


Thegani Alochanalu written by Gattu Radhika Mohan

రచన : గట్టు రాధికా మోహన్


మనిషన్నాక ఆలోచనలు వస్తుంటాయి… పోతుంటాయి.కానీ ఆ ఆలోచనలే అప్పుడప్పుడు జీవితాలను తలక్రిందులుగా చేసి అల్లకల్లోలం కూడా సృష్టిస్తాయి.సాయి ఫోన్ కాల్ తోనే నిద్రలేచాను. సాయి, బాబాయి కొడుకు.హైద్రాబాద్ లో బీటెక్ ఫైనలీయర్ చదువుతున్నాడు.

మేము,బాబాయ్ వాళ్ళు ఒక్క ఊర్లోనే ఉంటాము. నాన్నతో బాబాయికి జరిగిన గొడవల వల్ల బాబాయ్ మాతో కూడా మాట్లాడట్లేదు.నేను చాలా సార్లు ప్రయత్నించాను బాబాయ్ తో మాట్లాడటానికి,కానీ పట్టించుకోనట్టు మొఖం తిప్పుకొని అక్కడి నుండి వెళ్లిపోయేవాడు.

పిన్ని,సాయి మాత్రం మనసులో ఎలాంటి కోపతాపాలు లేకుండా కలిసినప్పుడు కలుపుకుపోయేవాళ్లు. నాన్నకి నేనొక్కదాన్ని…

బాబాయికి సాయి ఒక్కడే...తోడబుట్టిన అక్కా, తమ్ముళ్ల లాగ ఇద్దరం ఉంటాము. "సాయి! గుడ్ మార్నింగ్… ఇంతపొద్దున్నే కాల్ చేశావేంట్రా…!?” అని కళ్లు నలుచుకుంటు నిద్రలేస్తు బెడ్ మీద కూర్చున్నాను. సాయి గొంతులో నాకు వణుకు,భయం...వినిపించాయి. బొంగురు గొంతుతో…"అక్కా! అమ్మకు బాగలేదట…

నాన్న టెన్షన్ పడుతున్నాడు. నువ్వు,బావ వెంటనే హాస్పిటల్ కి వెళ్లండి. నేను వెంటనే స్టార్ట్ అవుతాను" అని ఏ హాస్పిటలో చెప్పి ఫోన్ పెట్టేశాడు. సాయి మాటలకు నా నిద్రమబ్బంతా విచ్చుకపోయింది. వెంటనే పవన్ ని కూడా నిద్రలేపి హడావుడిగా బైక్ మీద ఇద్దరం హాస్పిటల్ కి వెళ్లాము.


పిన్ని జీవశ్చవంలా బెడ్ మీద పడుకొనివుంది. బాబాయ్ పిన్ని బెడ్ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని, పిన్ని అరచేతుల్లో రాపిడి చేస్తున్నాడు. ఎప్పుడూ గలగల నవ్వుతూ,

అందరినీ నవ్విస్తుండే పిన్నిని అలా చూసి తట్టుకోలేకపోయాను. పవన్ బాబాయ్ ని పట్టుకొని "ఏం జరిగింది మామయ్య అత్తమ్మకి...ఇలాంటి సందర్భంలో కూడా మాకు ఫోన్ చేసి చెప్పరా..." అని గుక్కతిప్పుకోకుండ అడుగుతూనే ఉన్నాడు. అప్పటి వరకు మౌనంగా ఉన్న బాబాయ్ పవన్ మాటలకి బోరున ఏడ్చాడు. ఎప్పుడూ ఎంతో ధైర్యంగా ఉండే బాబాయ్ అలా ఏడుస్తుంటే ఉండబట్టలేక బాబాయ్ వెనకనుండి భుజం మీద చెయ్యి వేసాను. వెంటనే నా వైపు తిరిగి నా చెయ్యిని తన చేతుల్లోకి తీసుకుని నిలబడి "అంతా నా వల్లనే జరిగింది ప్రీతి...మీ పిన్నికి ఈ పరిస్థితి పట్టడానికి నేనే కారణం" అని బోరున ఏడ్వసాగాడు.


బాబాయ్ అనే మాటల్లో తప్పేమిలేదు.

ఇప్పటికైనా తన తప్పును బాబాయ్ ఒప్పుకున్నాడనిపించింది. కానీ నేనిప్పుడు తన తప్పును నిలదీయడానికి రాలేదనుకొని "ఊరుకో బాబాయ్...పిన్నికి ఏమైందో చెప్పు బాబాయ్…" అని బాబాయ్ కండ్ల నీళ్లను నా కొంగుతో తూడుస్తు అడిగాను. పవన్ కూడా "చెప్పండి మామాయ్య…ఎంతో యాక్టీవ్ గ ఉండే అత్తమ్మ ఇలా ఎలా అయ్యిందో అర్థం కావట్లేదు" అంటు బాబాయ్ ని నెమ్మదిగా కుర్చీలో కూర్చోబెడుతు అడిగాడు.


బాబాయ్ నెమ్మదిగా తన దుఃఖాన్ని అదుపులోకి తెచ్చుకొని "నిన్న పొద్దున ఇద్దరం టిఫిన్ చేస్తుండగ సడెన్ గ చైర్ మీది నుండి పక్కకి పడిపోయింది. పడిపోతు పడిపోతూనే…నోట్లో నుండి నురగగక్కింది మాట కూడా సరిగా రాలేదు. నాకేం చెయ్యాలో తోచక ఇంట్లో రెంట్ కి ఉన్న అబ్బాయిని నాతోపాటు రమ్మని,కార్లో హాస్పిటల్ కి తీసుకొచ్చాను…అంత పొద్దున్నే డాక్టర్లు ఎవ్వరూ అందుబాటులో లేరు. వాళ్ళు వచ్చాక చెక్ చేసి,సిటీస్కాన్ చేస్తే తెలిసింది హై బీపీ వల్ల బ్రెయిన్ లో ఓవర్ బ్లీడింగ్ అయ్యిందని…" అని చెప్తుండగానే పవన్ మధ్యలోనె కల్పించుకొని "మామయ్య మరిప్పుడు అత్తమ్మ కండీషన్ ఎలా ఉందంటున్నారు డాక్టర్లు…" అని అడిగాడు.

బాబాయ్ నా వైపు చూస్తు "బ్రతకడం కష్టమంటున్నారు" అని మళ్లీ బోరున ఏడ్వసాగాడు. బాబాయ్ చెప్పిన మాటలు వినగానే నాకు గుండెల మీద పెద్ద బండరాయినేసినట్టనిపించింది. పవన్ అయితే నోరు తెరిచి షాక్ లో అలాగే ఉండిపోయాడు.


పిన్నికి హెల్త్ పరంగ ఇంతకుముందెన్నడు చిన్న నొప్పి కానీ… బాధ కానీ తెలియదు.

ఎప్పుడు చూసిన ఏదో ఒక పని చేసుకుంటు...చుట్టుపక్కల వాళ్లను పలకరిస్తు హాయిగ నవ్వుతూ ఉండే పిన్నికి బీపి ఎప్పుడొచ్చింది…? ఎందుకొచ్చింది…?? అనే అనుమానం నాకు మనసులో మెదులుతుంది. ఎంతో మానసిక వేదనకు గురైతే తప్పా…ఇలా జరుగదనిపించింది. ఇంతకుముందు పిన్ని నాతో చాలా విషయాలు షేర్ చేసుకునేది. రెండేండ్ల నుండి బాబాయ్ మాతో మాట్లాడక పోవడం వల్ల నేను కూడా పిన్నిని ఎక్కువ కలువలేకపోయాను. క్రమక్రమంగ మా మనసుల మధ్య కొంత దూరం పెరిగిందనే చెప్పొచ్చు.


పవన్ షాక్ నుండి నెమ్మదిగా తేరుకొని "అత్తమ్మకు ఇంతకుముందేమైన బీపి ఉందా మామయ్య…టాబ్లెట్ వేసుకునేదా ? లేదా ?? " అని నాకొచ్చిన అనుమానాన్ని అడిగాడు. పవన్ మాటలకు సమాధానంగా బాబాయ్ "లేదు పవన్...మీ అత్తమ్మ ఇంతకుముందెన్నడు హెల్త్ పరంగ ఎలాంటి ప్రాబ్లంను ఫేస్ చేయలేదు...కానీ...కానీ…"

అని అంటుండగా...నేను వెంటనే.. "ఏమైంది బాబాయ్…ఏం జరిగింది...ఎంతో మానసిక వేదనకు లోనైతే తప్పా...ఇంత ఘోరం జరుగదు…" అని నా మనసులోని మాటను ఉండబట్టలేక అనేసాను.


నిజం చెప్పాలంటే పిన్నిది చాలా బ్రాడ్ మైండ్. పిన్ని గుణమే సాయికి కూడా వచ్చింది. బాబాయ్ ఎప్పుడూ ఏదో ఒక విషయం మందేసి నసుగుతు ఉంటాడు. చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో పెట్టి చూస్తు గట్టిగట్టిగ అరుస్తుంటాడు. బాబాయ్ ని భరిస్తున్నందుకు పిన్నికి రెండు చేతులను జోడించి మొక్కాలనిపిస్తుంది. పిన్నికి ఉన్న ఓపికనే బాబాయ్ ని భరించడానికి ఒక కారణమని కూడా చెప్పొచ్చు.


నేనన్నది నిజమే అన్నట్టు బాబాయ్ మౌనంగా తన కండ్లతో చెప్పాడు. పవన్ "ఏమైందో చెప్పండి మామయ్య…" అనేసరికి బాబాయ్ నెమ్మదిగా మౌనం నుండి బయటికొచ్చి …"ప్రీతీ! సాయికి యూఎస్ లో ఎంఎస్ చెయ్యాలనేది వానికి చిన్నప్పటి నుండి ఉన్న డ్రీం అని తెలిసిందే కదా…వాన్ని పంపించడానికి సేవ్ చేసిన ఎమౌంట్ ని పిన్ని వాళ్ల తమ్ముడు ఫ్లాట్ కొనుక్కునేటప్పుడు తక్కువ పడ్డాయి ఆరునెలల్లోనే ఒక ప్లాట్ అమ్మి ఇస్తానంటే ఇచ్చాను…కానీ వాడు,వాని ప్లాట్ అమ్ముడుపోవట్లేదని ఏడాది నుండి సతాయిస్తున్నాడు. ఒక నెల క్రితం వాడే మామీదికి రివర్స్ అయ్యి మీకు ఇచ్చేదే లేదు ప్రూఫ్ చూపెట్టమన్నాడు…" బాబాయ్ మాటల్లో జోక్యం చేసుకుంటు పవన్ "ప్రూఫ్ ఏమి రాసుకోలేదా మామయ్య…" అని అనుమానంతో అడిగాడు. బాబాయ్ తలదించుకొని "వాడు మీ అత్తమ్మ సొంత తమ్ముడే కదా! అని...ఆర్నెల్ల కే ఇస్తానన్నాడు కదా అని కాగితం రాసుకోకుండానే ఇచ్చాను పవన్...అప్పటికీ మీ అత్తమ్మ అన్నది ఓ కాగితం రాసుకోకుండ ఇంత డబ్బు ఇవ్వడం కరెక్ట్ కాదని...నేనే పొగరుగ మీ అత్తమ్మ మాటను వినిపించుకోలేదు." అని తన తప్పును ఒప్పుకున్న బాబాయ్ తెలివితక్కువ తనానికి ఏం మాట్లాడాలో నాకర్థం కాలేదు. డబ్బుల విషయంలో ఎంత జాగ్రత్తగా వుండాలో మా అందరికీ చెప్పే బాబాయ్ మన అనుకున్న వాళ్లను నమ్ముకొని ఇలా మోసపోవడం ఆశ్చర్యమనిపించింది.


పవన్ కి కూడా బాబాయ్ తెలివితక్కువ తనానికి కోపమొచ్చి "మీరు జాగ్రత్త తీసుకోకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది మామయ్య… ప్రతీ విషయాన్ని ఒకటికి పదిసార్లు ఆలోచించే మీరు ఇలా మోసపోయారంటే నమ్మలేకపోతున్నాను" అన్నాడు. బాబాయ్ ని ఈ విషయంలో మరింత ఇబ్బంది పెట్టడం ఇష్డంలేక "పిన్నికి ఈ విషయానికి ఏం సంబంధం లేదు కద బాబాయ్…ఈ విషయంలో పిన్నిని నువ్వేమైన అన్నావా …?" అని అనేలోపే బాబాయ్ అందుకొని…"మీ పిన్నిని నేనేమి అనలేదమ్మ...ఈ మిస్టేక్ అంత నా వల్లనే జరిగింది. నిజం చెప్పాలంటే మీ పిన్నికి,వాళ్ల తమ్ముడికి డబ్బులివ్వడమే ఇష్టం లేదు. అవి సాయి చదువుల కోసం దాచిన డబ్బులు. సాయికి పాస్‌పోర్ట్ కూడా వచ్చింది. ఆర్నెల్లలో వీసా కూడా వస్తుంది. వాడు చేసిన మోసాన్ని మనసులో నుండి తీసెయ్యలేక పోయింది. ఇటు సాయి లైఫ్… అటు తమ్ముడు చేసిన మోసం...ఈ రెండు విషయాల మీద ఆలోచిస్తు నెలరోజుల నుండి సరిగ తినలేదు...నిద్రపోలేదు…" అని చెప్పుకుంటు బాబాయ్ ఏడుస్తున్నాడు.


బాబాయ్ ఏడుస్తుంటే...నాకు ఏడుపాగలేదు...కానీ బాబాయ్ ఉన్న మొండి వైఖరినే పిన్నికి ఈ పరిస్థితి వచ్చిందని క్లియర్ గ నాకర్థమైంది. ఎప్పుడూ తన మాటనే నెగ్గిచ్చుకునేవాడు. పిన్నినెప్పుడూ ఒక చులకన భావంతో చూసేవాడు. పిన్నికున్న ఓపికను చేతగానితనంగా చూపిస్తు నవ్వేవాడు. కానీ ...ఈ విషయంలో పాపం పిన్ని ఎంత వేదనకు గురయ్యిందో అర్థమైంది. నాతో అంతో...ఇంతో షేర్ చేసుకునేది. ఈ బాబాయ్ వల్లనే మా మధ్య మాటలు కూడా తగ్గిపోయాయి. బాధలు చెప్పుకుంటే తగ్గుతాయంటారు. కానీ పిన్నికి చెప్పుకోడానికి ఎవరూ లేకుండా పోయారు. తోడబుట్టిన ఒక్కగానొక్క తమ్ముడు నమ్మించి మోసం చేశాడు.

బాబాయ్ ఏమో పిన్నిని ఎన్నడూ అర్థం చేసుకున్నది లేదు...ఇటు నేనూ దూరమయ్యాను...తన బాధను చెప్పుకోడానికి ఎవ్వరూ లేకపోవడమే ఈ ఉపద్రవానికి కారణమనిపించింది.


బెడ్ మీద అలా పిన్ని పరిస్థితిని చూసుకుంటు పవన్ బాబాయ్ తో…"అత్తమ్మ కి మీరెప్పుడు బీపి ని చెక్ చేయించలేదా మామయ్య ...చెక్ చేయిస్తే ఇంత జరిగేది కాదేమో...నలభై వయసు దాటాక తప్పకుండా హెల్త్ మీద దృష్టి పెట్టాలి. అప్పుడప్పుడు టోటల్ బాడీ చెకప్ కూడా చేయించుకుంటుండాలి…" అని చెప్తుండగా ...బాబాయ్ వెంటనే "లేదు పవన్...ఆమె ఎప్పుడూ యాక్టీవ్ గ కండ్ల ముందు తిరుగుతుంటే నాకెప్పుడూ ఆ ఆలోచనే రాలేదు. ఏదైన చిన్నహెల్త్ ప్రాబ్లం వచ్చినా బాగుండేమో... డాక్టర్ దగ్గరికి వెళ్లితే ఈ బీపి బయటపడునేమో...ఎన్నడూ ఏ ప్రాబ్లం తెలియదామెకు…" అన్నాడు.

బాబాయ్ చెప్పింది కూడా నాకు నిజమే అనిపించింది.


ఆడవాళ్లెప్పుడూ బాధలను తమ మనసులతో యుద్ధం చేస్తుంటారు. బయటకు మాత్రం చెక్కుచెదరని నవ్వును అతుకుపెట్టుకుంటారు. ఎందుకంటే బాధలను చెప్పుకుంటే పదిమందిలో ఎక్కడ చులకనైపోతామేమోననే భయం ఉంటుంది. ఇప్పుడు నాకు పిన్ని ఒక ప్రత్యక్ష ఉదాహరణగా కనబడుతుంది. ఆలోచనలు అందరికీ వస్తుంటాయి… కానీ వాటికి ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. లేదంటే ఆ ఆలోచనలతో నిరంతరం యుద్ధం చేస్తే...ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఎంతో సున్నితమైన మెదడు ఇలా పగిలిపోక

తప్పదేమోననిపించింది.


ఇప్పుడు కోమాలో ఉన్న పిన్ని ఏ క్షణంలో ప్రాణాలను విడుస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఒక మనిషి విలువ దూరమైపోతున్నప్పుడే తెలుస్తుంటుంది.

బాబాయ్ కి కూడా అంతే...పిన్ని బాగున్నప్పుడు తనని పట్టించుకోని బాబాయ్… తన మెంటల్ స్ట్రెస్ కి కారణమై ఈ స్టేజిని తీసుకొచ్చిన బాబాయ్ ఇప్పుడు తన వల్లనే ఇదంత జరిగిందని పశ్చాత్తాప పడితే ఏమొస్తుంది. పిన్నిని బాబాయ్ ఒక భార్యగా కాకున్నా...కనీసం "నాతోటి సాటి మనిషనుకొని…" ఆమె మాటకు విలువిస్తే బాగుండేది.


ఇంట్లో దీపం వెలిగించే పిన్నికి,ఇప్పుడు పిన్ని తలాపున దీపం పెట్టబోయే క్షణాలు దగ్గర పడుతుంటే బాబాయ్ మనసులో పశ్చాత్తాపం ఏరులా పారుతుంది.


*********


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి



రచయిత్రి పరిచయం :

నా పేరు గట్టు రాధిక మోహన్.వృత్తి రీత్యా గణిత ఉపాధ్యాయురాలిని అయినప్పటికీ ప్రవృత్తి అయిన సాహిత్యమంటే ఎంతో మక్కువ.నేను కవితలు,కథలు,సమీక్షలు,లిరిక్స్,స్క్రీన్ ప్లే రాస్తుంటాను. నా మొదటి కవిత్వ సంపుటి "ఆమె తప్పిపోయింది". మరియు " సచ్చిన ఎకరం భూమి అమ్మను" అనే షార్ట్ ఫిల్మ్ వచ్చాయి.కొన్ని లిరిక్స్ త్వరలో వీడియో పాటల రూపంలో రాబోతున్నాయి. నా కథను ప్రచురించినందుకు ధన్యవాదాలు ...🙏👼



85 views0 comments
bottom of page