తెరవెనుక బొమ్మ

'Theravenuka Bomma' - New Telugu Story Written By Bhagavathula Bharathi
Published In manatelugukathalu.com On 10/11/2023
'తెరవెనుక బొమ్మ' తెలుగు కథ
రచన: భాగవతుల భారతి
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఓ సంఘర్షణ ఆగిపోయి మరోటి మెుదలయ్యే మధ్యలోని ప్రశాంతతకు మరోపేరు స్థబ్దతా?
నిశ్శబ్ధం చైతన్యాన్ని వెక్కిరిస్తుందేమో! రెండూ పరస్పర విరుధ్ధాలే.. అందుకే ఒకదాని తరువాత ఒకటి వచ్చిపోతుంటాయేమో!? కష్టసుఖాల్లా!..
తెరమీది బొమ్మల్లా!ఆలోచిస్తున్నాడతను.
విశాఖపట్నం రామకృష్ణ బీచ్ సందర్శకులతో కళకళలాడుతోంది. రాష్ట్రం నలుమూలలనుండీ, విశాఖ సౌందర్యాన్నీ, అరకు అందాల్నీ, ఓడరేవు, విమానాశ్రయం తిలకించాలని వస్తుంటారు. సినిమాలలో చూపించే సుందర దృశ్యాలన్నీ, భీమిలీ బీచ్ లోనే షూటింగ్ జరుపుకుంటాయ్.
అదే క్రమంలో దివాకర్ అక్కడికి వచ్చాడు.
ఇసుకలో, నడుస్తున్నాడు. సాయంసంథ్యా సమయంలో, లైట్స్ వెలుగులో, పౌర్ణమి రోజున సముద్రం లోంచి వచ్చినట్లుండే చంద్రోదయాన్ని చూడగలగటం చాలా సంతోషం అతనికి. ఆ భాగ్యం అందరికీ కలగదు. చంద్రోదయం అయ్యేసమయానికి మబ్బులు కమ్మేసి, చీకటి పడిపోయి, చంద్రుడు బారెడు పైకి వచ్చాక మబ్బులు వీడతాయ్.
ఇప్పటివరకూ చాలా సార్లు ఆ దృశ్యం మాత్రం చూడలేకపోయాడు. విశాఖపట్నం లో ఏదో డాక్యుమెంటరీ ఫిలిమ్ ఉంటే చేయటానికి వచ్చాడు. దాని ఆలోచన లోనే.. ఇక్కడ ఇలా నడుస్తున్నాడు. చంద్రోదయానికంటే ముందు, అతణ్ణి ఓ దృశ్యం ఆకర్షించింది.
ఇసుకలో, బికినీవేసుకుని, అర్దనగ్నంగా ఓ అమ్మాయి పడుకుని ఉంది. అరకొర బట్టలేసుకున్న ఆఅమ్మాయి శరీరం లైట్లకాంతిలో మెరిసిపోతోంది. నిగనిగలాడే జుట్టు, గాలికిఎగురుతూ, కుందనపు బొమ్మలా ఉంది ఆ అమ్మాయి.
ఆ అమ్మాయి పక్కన ఓ అబ్బాయి పడుకుని ఉన్నాడు. మసక చీకటిలో ఇలాంటిది చూసే అలవాటు లేదేమో! అందరూ అక్కడిదాకావచ్చి సిగ్గో, బిడియమో తల త్రిప్పుకుని వెళ్ళిపోతున్నారు.
కానీ అతను మాత్రం అలాగే ఆమె పక్కనే పడుకుని సముద్రం లో ఉదయించే చంద్రుని చూస్తున్నాడు. దగ్గరగా వెళ్ళి అతణ్ణి తేరిపార చూసి..
"మీరూ! సినీమాటోగ్రాఫర్ లక్ష్మణ్ కదూ!"
"అవును"
"మరి మీరు ఇలా ఈ సముద్రం ఒడ్డున ఆ అమ్మాయితో " అర్దోక్తి తో ఆగిపోయాడతను.
"ఏ అమ్మాయీ? " ఆశ్ఛర్యం గా కళ్ళుపెద్దవిచేసి, అడిగాడు లక్ష్మణ్.
"అదిగో బికినీలో అరకొర బట్టలేసుకున్న ఆఅమ్మాయి తో.. మీరూ.. "
లక్ష్మణ్ మరింత ఆశ్చర్యపోతూ, "తను అమ్మాయికాదే! నేను చేసిన బొమ్మ " అన్నాడు.
"అవునా? నమ్మలేక పోతున్నా, జీవం ఉట్టిపడుతోంది?! "
"ఇదిగో చూడండీ! "అని బొమ్మ మీద చెయ్యి చేయివేసాడు, చలనం లేదు.
"వావ్.. మీరు చెప్పేది నిజమేనా? మీలో ఇంత కళ ఉంచుకుని, మీరింత కళాకారులై ఉండీ, ఇక్కడ ఇలా?.. "
"ఏం చేయమంటారూ!? ఒకరకంగా లేదు ప్రపంచం. ఎవరి జీవితాలు చూసినా అల్లకల్లోలం గానే ఉన్నాయ్. ముఖ్యంగా మా లాంటి కళాకారులు కరోనా ముందటి ప్రపంచం, కరోనా తర్వాతి ప్రపంచం.. ఇలా విభజించి, మాజీవితాలను ఎటూ కాకుండా నెట్టివేయబడ్డాం. సినిమాలు కూడా పెద్దగా ఆడట్లేదుగా .. "
"ఇప్పుడు కరోనా సర్ధుమణిగిందిగా! అన్ని రంగాలూ ఊపందుకుంటున్నాయి. ఏదైనా కొత్త ఆలోచన చేయకపోయారా? "
"అమ్మానాన్నలకు డెల్టా వేరియంట్ వచ్చింది. హాస్పటల్ లో వైద్యం చేయించా. అయినా అమ్మను పోగొట్టుకున్నా. నాన్నను అనారోగ్యంతో మిగుల్చుకుని, ఇంకా వేలల్లో వైద్యంచేయిస్తున్నా. ఈ స్థితిలో, నాఆర్ధిక పరిస్థితి చితికిపోయింది. అందుకే ఇలాంటి బొమ్మలు రోడ్లమీద పెట్టి, వచ్చిన డబ్బుతో నా కుటుంబ మంతా కడుపునింపుకోవాలి. కొత్త కొత్త ఆలోచనలు మాకెలా వస్తాయ్. ఏదో! విశ్రాంతి కోసం ఈరోజు ఇలా బీచ్ లో..”
"అచ్చం అమ్మాయేమో అని భ్రమించేటట్లు బొమ్మ చేయగలిగారంటే, మీరు సామాన్య మైన ఆర్టిస్టులు కాదు. ప్రస్తుతానికి ఇదిగో! ఈ డబ్బులు తీసుకోండి. మీ లాంటి కళాకారులకు ఎంతిచ్చినా తక్కువే. నేను ఓ డాక్యుమెంటరీ తీయాలనుకుంటున్నాను. సినిమాటోగ్రఫీ మీకే అప్పగిస్తాను. అంతేగాక తెలిసిన సినిమా డైరక్టర్ గారు ఒకాయన ఉన్నారు. ఆయనకు మీ గురించి చెబుతాను. పదండి షూటింగ్ ప్లాన్ చేద్దాం. మీది తెరవెనక బొమ్మైతే, నాది తెరమీది బొమ్మ " అన్నాడు నవ్వుతూ.
"రోజూ ఎన్నో రోడ్లు తిరుగుతూ బొమ్మలు చేసి చూపిస్తూ ఉంటాను. దేవుడి బొమ్మలు మెుదలుకుని, ఇలాంటి యువతను ఆకర్షించే బొమ్మల వరకూ.. కుదురుగా లేని నాకు, కునుకూఉండదు.. ప్చ్.. ఈరోజు మీరు పరిచయం అయ్యారు నా అదృష్టం " అంటూ బొమ్మ తీసుకుని దివాకర్ వెంట నడిచాడు లక్ష్మణ్.
"నిరాశ చెందకండి. మంచిరోజులు మళ్ళీ తిరిగివస్తాయ్. మనమంతా మళ్ళీ బిజీ అవుతాము. కానీ మనిషే మనిషికి సాయం చేయాలి. తప్పకుండా సహకరించుకుందాం. దురదృష్టవశాన మానాన్న కూడా డెల్టా వేరియంట్ తోనే పోయారు. ఆ బాధఎలాఉంటుందో నాకు తెలుసు. మీ నాన్నను బ్రతికించుకుందాం పదండి. " అంటూ కొండమీదికి రామానాయుడు స్టూడియో, పరిసరప్రాంతాల్లో, షూటింగ్ ప్లాన్ చేస్తూ, సప్లయర్స్ నుండి, అందర్నీ మాట్లాడాడు..
అందులో షూటింగ్ జరిగేటప్పుడు చుట్టూ ఫ్లడ్ లైట్స్ బిగించే పనికోసం ఓ యాభైై వయసున్న, ఓ వ్యక్తి వచ్చాడు. కానీ ఆహార నియమాలులేవేమో, సరైన ఆహారం లేకనో అరవై వయసున్న వాడిలా కనబడుతున్నాడు. పైగా దగ్గుతున్నాడు.
లక్ష్మణ్ "మీ పేరేంటి? దగ్గుతున్నారూ? దేశంలో కరోనా విలయతాండవం చేసి సర్ధుమణిగింది.. దాని సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడుతున్నవారు ఇంకా ఉన్నారు తెలుసా మీకూ?! అంటే.. నా ఉద్దేశ్యం.. అది కాకపోయి ఉండవచ్చు.. "
"నాపేరు ఓబులేసు, డాక్టర్ కాడ టెస్ట్ చేయించినా!.. కరోనా కాదు, క్షయ ఇప్పుడే మెుదలయిందనీ, మందులు వాడితే తగ్గిపోతుందనీ, చెప్పారు. కానీ పరిస్థితులూ అనుకూలంగా లేవుగా! రెక్కాడితే గానీ డొక్కాడని బ్రతుకులు. ఐనా నా కొడుకు గవర్నమెంట్ స్కాలర్షిప్ తో డాక్టర్ చదువుతున్నాడు. ఇప్పుడు ఆఖరి సంవత్సరం.. "
"ఔనా! వెరీగుడ్.. సూపర్ .. ఇంకా.. " అడిగాడు లక్ష్మణ్.
"డాక్టరీ చదివి నా కొడుకే నాకు ఈ రోగం తగ్గిత్తాడంటా! అన్నీ గవర్నమెంట్ వారే ఇస్తున్నాగానీ, నేనూ ఎంత సంపాదించినా, ఆడి చదువుకే సరిపోతోంది. మా ఆడోళ్ళు కూడా సంపాదించాల్సి వస్తోంది. " అంటూ దగ్గాడు.
ఓబులేసు షూటింగ్ లో చాలాసార్లు దగ్గుతూనే పనిచేస్తున్నట్లు లక్ష్మణ్ గమనించాడు. వారం రోజులపాటు ఏకథాటిగా షూటింగ్ జరిగి, పూర్తయింది. పేకప్ చెప్పేసారు. ఎవరిదారి వారిది.
అనుకున్న దానికంటే ఎక్కువ ఎమౌంట్ ఇచ్చి గౌరవించి, దివాకర్.. "నాన్నకి వైద్యం చేయించూ.. ఆల్ ద బెస్ట్ " అని లక్ష్మణ్ భుజం తట్టాడు.
బయటకు వచ్చి, స్కూటర్ స్టార్ట్ చేస్తుండగా ఫోన్ మ్రోగింది. ఫోన్ తీసి, విషయం విని అక్కడే కూలబడిపోయాడు లక్ష్మణ్.
ఓబులేసు పరుగెత్తుకుంటూ వచ్చి "ఏమయింది బాబూ " అడిగాడు.
"నాన్న పోయాడు " అన్నాడు ఏడుస్తూ.
"అయ్యో!"
పదినిమిషాల తర్వాత తేరుకుని, "ఓబులేసూ! నేను ఏ నాన్నకోసమైతే ఇంత కష్టపడ్డానో ఆ నాన్న ఇక లేడు. కానీ ఓ నాన్నగా, నువ్వు సమాజానికి మంచి డాక్టర్ను ఇవ్వాలని, ఈ పరిస్థితులలోనూ కష్టపడుతున్నావే?! నాకంటే ఈ డబ్బు నీకే ఎక్కువ అవసరం .
ఇదిగో ! ఈలక్షరూపాయలూ ఉంచు. నీ కష్టంలో నేనూ పాలుపంచుకుంటాను. కాబోయే డాక్టర్ కి నాశుభాశీస్సులు అందించు! నాకు ఈ తెరవెనకబొమ్మ చాలు. " అని డబ్బులన్నీ ఓబులేసు చేతుల్లో పోసి, బొమ్మతో వెళ్ళిపోతున్న లక్ష్మణ్ కి, చేతులెత్తి నమస్కారం చేయటం తప్ప ఏంచేయగలడు ఓబులేసు?
@@@@@@@@@@
భాగవతుల భారతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం
ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.
ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో
బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.
https://www.manatelugukathalu.com/profile/bharathi/profile
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.

