top of page

తిక్క కుదిరింది


'Thikka Kudirindi' New Telugu Story(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

కృష్ణమూర్తి, వాణి పెళ్లి జరిగి నలభై సంవత్సరాలు అయ్యింది. పెళ్లి అయిన అయిదు ఏండ్లు బాగానే వున్నాడు. ఆతరువాత నుంచి ఏమైందో కాని, భార్య మీద ప్రతీ దానికి చిరాకు పడటం, తిట్టడం మొదలుపెట్టాడు.

“ఎందుకండి నన్ను ఆలా ఆడిపోసుకుంటారు, వేళ పట్టున అన్నీ వండి పెడుతున్నా నన్నే తిడుతున్నారు. ఒకసారి డాక్టర్ కి చూపించుకోండి” అంది.

“నువ్వు నోరుమూసుకుని పడివుంటే, ఏ డాక్టర్ అక్కర్లేదు. ప్రతీ విషయం లోను నేను వున్నానని వస్తావు” అని అవమాన పరిచేవాడు.

యింటికి చుట్టాలు వస్తే భయం తో వణికిపోతుంది, భర్త వాళ్ళందరి ముందు అవమానం చేస్తాడేమో అని.

కొడుకు, కూతురు కి చెప్పుకుని బాధపడింది.

“మా చిన్నప్పుటి నుంచి చూస్తున్నాము నాన్నని. ఆయన నిన్నే కాదు,మమ్మల్ని కూడా ఎంత మాట పడితే అంత మాట అంటాడు. పెళ్లి అయినా కూడా మాకు సలహాలు యిస్తాడు. ఆ విధంగా చేయకపోతే తిట్టడం..

నువ్వు కొన్నాళ్ళు నా దగ్గరికి వచ్చి వుండు అమ్మా, నీ విలువ అప్పుడు తెలుస్తుంది” అన్నాడు కొడుకు.

“లాభం లేదురా అబ్బాయి, మీ నాన్నకి రాని వంట లేదు.కావలిసినవి చేసుకుని హాయిగా వుంటాను, నువ్వు నీ కొడుకు దగ్గరికి వెళ్ళు, నాకు భయం లేదని మొదలెట్టారు” అంది.

“అలాగే అంటాడు కాని, నువ్వు లేనిదే నాన్న వుండలేడమ్మా, ఒక పది రోజులు నా దగ్గర వుండు” అన్నాడు కొడుకు.

“సరే, అలాగే వస్తాలే” అని ఫోన్ కట్ చేసింది.

“ఏమిటి నీ కొడుకు తో నా మీద కంప్లైంట్ చేస్తున్నావ్? ఒక పిల్లాడు పుట్టినా, యింతవరకు నాలుగు రూపాయలు దాచుకోవడం తెలియదు” అని చేతి సంచితో బయటకు వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి.

రోజులన్నీ మనవి కాదు అన్నట్టుగా, ఉదయం లేవగానే బుగ్గ పట్టుకుని మూలుగు తో వచ్చి కుర్చీలో కూర్చున్నాడు కృష్ణమూర్తి.

భర్త అడిగే లోపే కాఫీ యివ్వడం మంచిది, లేదంటే మళ్ళీ ఏదోకటి అనకమానడని కాఫీ కప్పు తీసుకుని వచ్చి భర్త చేతికి యిచ్చింది.

రాత్రి నుంచి పన్ను నొప్పి, దవడ వాచిపోయింది. నువ్వు హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నావు. మంచి లక్షణం ఒక్కటి లేదు, కాఫీ అక్కరలేదు తీసుకు పో” అన్నాడు.

“బాగుంది వరుస, మీకు పన్ను నొప్పి వచ్చింది అని నాకేమి తెలుసు? తిట్టడానికి వచ్చే నోరు నన్ను లేపి చెప్పితే లవంగం యిచ్చేదానిని కదా” అంది.

పెళ్ళాం మాటలకు కోపం వచ్చి ఏదో అనబోయి నోరు కదపలేక కోపం గా చూసాడు. యిదే మంచి అవకాశం అని “నిన్న ఎవరికితోనైనా గొడవ పడ్డారా, సడన్ గా పన్ను నొప్పి, దవడ వాపు ఎందుకు వచ్చాయి?” అంది వాణి.

ఈ దెప్పిపొడుపులని సహించలేక, పంటి నొప్పి మర్చిపోయి, “నోరుమూయి” అని అరిచి బుగ్గ పట్టుకుని పచారులు చేయడం మొదలుపెట్టాడు.

కాసేపు ఆగి, “యిక్కడ డెంటల్ హాస్పిటల్ ఎక్కడ వుంది?” అన్నాడు భార్య తో కృష్ణమూర్తి.

“రోజంతా యింట్లో వుండే దానిని నాకేమి తెలుసు, ఆలా రోడ్డు మీదకి వెళ్లి చూడండి” అంది వాణి.

“నీకేమి తెలియదు. పల్లెటూరు మొద్దు వి” అంటూ డాక్టర్ ని కలవడానికి బయలుదేరాడు.

ఇంటికి దగ్గరలోనే ఒక డెంటల్ క్లినిక్ వుంది. త్వరగా వెళ్లి టెస్టింగ్ చైర్ లో కూర్చున్నాడు. ఇంతలో నర్స్ వచ్చి “బయట కూర్చోండి, యింకా మీకంటే ముందు వచ్చిన వాళ్ళు వున్నారు” అంది.

‘ఏడ్చినట్టు వుంది’ అనుకుని పేషెంట్స్ రూమ్ లోకి వచ్చాడు. నలుగురు బుగ్గలు పట్టుకుని, నొప్పి బరించలేక జుట్టు పీక్కుంటో కనిపించారు. కృష్ణమూర్తి వాళ్ళపక్కన కూర్చొని, ఒకడిని ఆడిగాడు, ‘జుట్టు పీక్కుంటే నొప్పి తగ్గుతుందా’ అని.

అతను ఒకసారి కృష్ణమూర్తి వంక అసహ్యంగా చూసి, అక్కడనుండి లేచి వేరే కూర్చున్నాడు.

డాక్టర్ గారు వచ్చినట్టు వున్నారు, ఒక్కొక్కరిని పిలుస్తున్నారు. లోపల నుంచి మూలుగుతున్న సౌండ్స్ వస్తున్నాయి.

చివరకి కృష్ణమూర్తి వెళ్లి తన బాధ చెప్పుకున్నాడు. ఎక్సరే తీసి “రెండు పళ్ళు కుళ్ళిపోయాయి, రోజూ బ్రష్ చేసుకోరా?” అన్నాడు.

“సరే.. రెండు రోజులు ఆంటిబయోటిక్ మందులు వాడి రండి, పన్ను తీసివేస్తాను” అన్నాడు.

అయిదు వందలు చదివించుకుని వచ్చి, మందులు కొనుక్కుని ఇంటికి వచ్చాడు కృష్ణమూర్తి.

ఏమైంది అని భార్య అడగకపోవటంతో, తనే చెప్పాడు “మూడు రోజుల తరువాత రెండు పళ్ళు తీస్తానని అన్నాడు”

“మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళారుగా” అంది వాణి.

“ఆ.. మన రోడ్డు చివర సాయి డెంటల్ క్లినిక్ కి వెళ్లాను. డాక్టర్ మనవాడేట, నర్స్ చెప్పింది, నీకు కూడా రెండు పళ్లు పీకించినా” అన్నాడు కృష్ణమూర్తి.

జావ తాగి పడుకున్నాడు కృష్ణమూర్తి. వాణి తలుపు దగ్గరగా వేసుకొని సాయి డెంటల్ క్లినిక్ కి వెళ్లి డాక్టర్ గారిని కలిసి, భర్త రోజూ తనని పెట్టే బాధలు వివరించి, ఆయన నోరు విప్పితే తిట్లు తిట్టకుండా ఏదైనా సహాయం చేయండి అని బ్రతిమాలు కుంది.

ఆ ఇల్లాలు పడుతున్న బాధని అర్ధం చేసుకున్న డాక్టర్ గారు నేను ఆయన లో మార్పు తెస్తాను, మీరు ఓపిక పట్టండి అని చెప్పి పంపించాడు.

మూడు రోజులు మందు వాడి హాస్పిటల్ కి బయలుదేరాడు కృష్ణమూర్తి.

“కొద్దిగా కాఫీ తాగి వెళ్ళండి, నీరసం రాకుండా వుంటుంది” అన్న భార్య వంక కోపంగా చూసి, “పన్ను పీకేడప్పుడు డాక్టర్ గారికి నా నోట్లో నుంచి కాఫీ వాసన వస్తే నన్ను నాలుగు చివాట్లు పెట్టాలని నీ ఉద్దేశ్యమా, అక్కర్లేదు” అని బయటకి వెళ్ళాడు.

ముందుగానే వెళ్లడంతో తనే మొదటి పేషెంట్. తనని చూడగానే నర్స్, డాక్టర్ గారు నవ్వుతూ ‘రండి’ అని ఆహ్వానించారు. పర్వాలేదు అనుకుని వెళ్లి టెస్టింగ్ చైర్ లో వాలి పడుకున్నాడు.

డాక్టర్ వచ్చి కాటన్ తీసుకుని “మూర్తి గారూ! నోరుమూయండి” అన్నాడు. ఆ మాటకి ఒక్కసారిగా ఉలిక్కిపడి, ‘యింతవరకు నన్ను నోరుమూసుకోండి అన్నవాళ్ళు లేరు’ అనుకున్నాడు కృష్ణమూర్తి.

డాక్టర్ పెదాలు బాగా తుడిచి, “నోరు తెరవండి లేజర్ తో పరీక్ష చేస్తాను” అన్నాడు ఒక పెద్ద లైట్ లాంటిది పట్టుకుని.

“అదేమిటి.. మొన్న టెస్ట్ చేసి రెండు పళ్ళు తీస్తే చాలు అన్నారు గా, మళ్ళీ ఈ టెస్ట్ ఎందుకు” అన్నాడు.

“పాడైపోయిన పళ్ళు వలన ఎముక, బుగ్గలోని నరం, నాలుకలోని నరాలు దెబ్బ తినవచ్చు. అందుకనే ఈ టెస్ట్. మీరు నేను నోరుమూయి అన్నప్పుడు మూసుకోవడం, తెరవండి అన్నప్పుడు తెరవడం చేస్తే చాలు” అన్నాడు డాక్టర్.

“మీరు మాటికి మాటికి నోరుమూయి అనే బదులు వేరే పదం వాడచ్చు కదా డాక్టర్” అన్నాడు.

“అయ్యో.. మిమ్మల్ని తిట్టడం లేదండి, మా డెంటిస్ట్ వాడే పదలే వాడాను. ఒకళ్ళని తిట్టడానికి నేను పిచ్చిక్కే లేనుగా” అన్నాడు. ఈ మాట ఎందుకో ఎక్కడో తగిలింది కృష్ణమూర్తి కి.

కాసేపు టెస్ట్ చేసి, “అనుమానించిదే జరిగింది. మీరు పళ్ళ విషయం లో అశ్రద్ధ చూపడంతో దవడ లోని రెండు నరాలు, చెవిలో ఒక నరం పాడై పోయాయి, అదృష్టవంతులు, పంటికింద ఎముక పాడవలేదు” అన్నాడు డాక్టర్.

“నేను ఉదయం, సాయంత్రం రెండుసార్లు బ్రష్ చేసుకుంటాను, నాకు పాడవటం ఏమిటి డాక్టర్? మా చుట్టం ఒకడు బ్రష్ అరిగిపోతుంది అని, వారం కి ఒకసారి బ్రష్ చేసుకుని, మిగిలిన రోజులు నీళ్లు పుక్కిలించుతాడు. వాడు బాగానే వున్నాడు” అన్నాడు అనుమానం గా.

“ప్రాబ్లెమ్ రావడానికి ఎన్నో కారణాలు వుంటాయి. సహజం గా కోపంతో మాట్లాడే వాళ్ళకి ఈ జబ్బు వస్తుంది. దీనికి మందు, ఏదైనా తినటానికి, ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి తప్పా ఒక ఏడాది అయినా నోరు తెరవకూడదు. అప్పుడు కొంతమంది కి నరాలు బాగుపడి మాములుగా మాట్లాడుకోవడం, ఎవరినైనా తిట్టడం లాంటివి చేయవచ్చు” అని, నోట్లో పాడైన రెండు పళ్ళు పీకేసి కుట్లు కుట్టి, “యిహ లేచి యిటు రండి, నోరుమూసుకుని.. సారి.. నోరు తెరవకండి” అన్నాడు.

నోరుమూయి అన్నమాట యింత బాధ పెడుతుందా, మరి నేను నా భార్య ని రోజుకి ఎన్నిసార్లో ఈ మాట అనేవాడిని, పాపం ఎంత బాధ పడిందో అనుకుంటూ డాక్టర్ గారికి ఎదురుగా కూర్చున్నాడు.

“ఒక వారం తరువాత మీకు తీసేసిన పళ్ళని కట్టాలి. ఒకటి స్టీల్ పళ్ళు, ఏనామిల్ పళ్ళు, బాగా డబ్బు వుంటే బంగారం పళ్ళు కట్టించుకుంటారు. మీకు ఏవి కావాలో చెప్పితే వాటిని తెప్పిస్తా” అన్నాడు డెంటిస్ట్.

“అన్నిటికంటే చవక పళ్ళు ఏవి” అన్నాడు సైగలతో కృష్ణమూర్తి.

“స్టీల్ వి అయితే యిరవై వేలు అవుతాయి” అన్నాడు.

కాయితం తీసుకుని ‘ఎలాగో నోరు ఎక్కువ తెరవకూడదు అన్నారు, మాట్లాడకూడదు అన్నారు. యింకా ఏ పళ్ళు అయితే ఏమిటి, స్టీల్ వి పెట్టించుకుంటాను’ అని రాసాడు.

కృష్ణమూర్తి ని చూడగానే జాలేసింది డాక్టర్ కి. కాని అతని భార్య చెప్పిన మాటలు కూడా గుర్తుకు వచ్చి, “సరే.. యిప్పుడు పదిహేను వేలు ఇవ్వండి. పళ్ళు తీసినందుకు అయిదు వేలు, పళ్ళు ఆర్డర్ యివ్వడానికి పదివేలు అడ్వాన్స్” అన్నాడు.

వణుకుతున్న చేతులతో గూగుల్ పే చేసి బయటకి వచ్చి ఒక్క నిమిషం రోడ్డు మీద ఆగి, ‘ఎందుకైనా మంచిది.. ఈ దవడ నరాలు పాడవడం గురించి సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే మంచిది’ అని అదే రోడ్లో వున్న ‘పళ్ళు రిపేర్’ అన్న క్లినిక్ వైపు నడిచాడు.

యిటువంటి అనుమానపు మనుషులని చాలా మందిని చూసిన డాక్టర్ గారు తన క్లినిక్ నుండి కృష్ణమూర్తి పక్కన వున్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్లడం చూసి నవ్వుకుని, ఆ డెంటిస్ట్ తన స్నేహితుడు అవడంతో జరిగిన విషయం ఫోన్ చేసి చెప్పాడు.

కృష్ణమూర్తి క్లినిక్ లోకి అడుగుపెట్టేసరికి పదిమంది వరకు మూలుగుతో కనిపించారు. వీళ్ళ దుంపలు తెగ, ఒక్కడు సరిగ్గా పళ్ళు మెయింటైన్ చేసుకోవడం లేదనుకుంటా అనుకుంటు, నర్స్ కి తన పేరు రాసిచ్చి కుర్చీలో కూర్చున్నాడు. పన్ను ఎక్కడ పీకించుకున్నారని అడిగితే ఏమి చెప్పాలో కూడా అలోచించి రెడీగా వున్నాడు.

అదేమిటో కూర్చున్న రెండు నిముషాలులోనే డాక్టర్ గారు తనని పిలవడం తో లేచి డాక్టర్ గారి రూమ్ లోకి వెళ్ళాడు. పన్ను నొప్పితో తనకంటే ముందు వచ్చినవాళ్ళు నోరు కదపలేక తెల్లబోయి చూసారు.

డాక్టర్ అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పిన తరువాత, నోరు పరీక్ష చేసి, “అదేమిటి.. ఆరు పళ్ళు పాడైతే, రెండు పళ్ళు తీసాడు, బుగ్గలు రెండు కూడా నరాలు ఉబ్బి పాడయిపోయాయి. మిగిలిన నాలుగు పళ్ళు పీకమంటారా” అన్నాడు ఈ కొత్త డాక్టర్.


‘నీ మొహం మండా, అక్కడ రెండు పళ్ళు అంటే నువ్వు ఆరు పళ్లకి పెట్టావా ఎసరు’ అనుకుని, “ఈ రోజే రెండు పళ్ళు తీయించుకున్నాను, నొప్పిగా వుంది. వారం రోజులలో వస్తాను” అని చెప్పి బయటకు వచ్చాడు.


నర్స్ నవ్వుతూ, “ఐదు వందలు ఇవ్వండి డాక్టర్ గారి ఫీజు, పది రోజులలోపు వస్తే మళ్ళీ ఫీజు ఉండద”ని చెప్పి, అయిదు వందలు ఊడ్చేసింది.

మొత్తానికి మూలుగుకుంటూ ఇంటికి చేరి, టేబుల్ మీద వున్న పేపర్ మీద ‘కొన్నాళ్ళు నేను మాట్లాడకూడదుట, అందుకనే నీ కిష్టమైనవి వండు, తినటానికి నోరు తెరుస్తా’ అని రాసి చూపించాడు భార్య కి.

“అయ్యో ఏమైంది మీ నోటికి? పన్ను తీయించుకున్న మా తమ్ముడు రెండో రోజే చెగోడీలు తిన్నాడు” అంది.

‘విసిగించకు’ అని అరవబోయి, డాక్టర్ చెప్పింది గుర్తు వచ్చి, నుదుటి మీద గీత చూపించి రూంలోకి వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి.

ప్రశాంతం


జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


Podcast Link


Twitter Linkమనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.30 views0 comments
bottom of page