top of page

తృప్తికి అర్థం'Thrupthiki Artham' - New Telugu Story Written By Yasoda Pulugurtha 

Published In manatelugukathalu.com On 31/12/2023

'తృప్తికి అర్థం' తెలుగు కథ

రచన: యశోద పులుగుర్త 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్కోడలు అపర్ణ మాటలకు ప్రమీల మనస్సు చివుక్కుమంది ఒక్క క్షణం. 

అంతలోనే తనకు తాను సర్ది చెప్పుకుంది. అపర్ణ ఏమందని తను అంతగా బాధపడాలి?

"అత్తయ్యా మీరు కాస్త పెందరాళే లేవగలరా? నాకు ప్రొద్దుటే హడావుడి అయిపోతోంది. టిఫిన్లు,  వంట,  పిల్లలను స్కూల్ కి తయారు చేయడం నేను ఆఫీస్ కు తయారవ్వడం తో ఎక్కడవక్కడ అలాగే వదిలేసి ఆఫీస్ కు పరుగెత్తాల్సి వస్తోంది. మీ అబ్బాయి కనీసం కాఫీ కూడా కలుపుకోలేరు. కలిపి ఇచ్చిన వేడి కాఫీ ని అక్కడా ఇక్కడా పెట్టేసి మరచిపోతారు. ఒక్కోసారి మరల వేడి చేసి ఇవ్వ మంటారు. మొన్ననొకసారి డ్రస్సెంగి టేబిల్ మీద అలాగే ఉండిపోయింది కాఫీ. 

మీరు పెందరాళే లేచి నాకు కాస్త సాయం చేస్తే హడావుడి పడకుండా అన్నీ సర్దుకుని ఆఫీస్ కు వెళ్లగలను. 


నిజమే తను ఉదయం ఏడున్నర దాటితే కానీ నిద్ర లేవలేదు. రాత్రుళ్లు సరిగా నిద్ర పట్టదు,  స్లీపింగ్ పిల్ వేసుకున్నా కూడా. తెల్ల వారుఝామున ఏ మూడో నాలుగుకో నిద్ర పడుతుంది. లేచేసరికి ఏడున్నర దాటిపోతుంది. 


తను కూడా సెక్రటేరియట్ ఆఫీస్ లో పని చేసి రిటైర్ అయింది. ఈ ఉరుకుల పరుగుల జీవితం తనకు తెలియంది కాదు. ఇద్దరు పిల్లలు అత్తగారి తో ఇంట్లో అన్నీ చేసుకుని ఆఫీస్ కు పరుగెత్తేది. ఇద్దరూ మగపిల్లలే తనకు. అత్తగారు లేవలేని మనిషి. భర్త ఏ. జీ ఆఫీస్ లో అకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేస్తుండడం వలన తరచుగా ఆడిటింగ్ టూర్లు ఉండేవి. కానీ టూర్లు లేనప్పుడు వీలైనంతవరకు పనిలో తనకు సాయం చేసే భర్త సుధాకర్ గుర్తొచ్చే సరికి ప్రమీల మనస్సు దుఖంతో నిండిపోయింది. ఎంత గొప్పవారికైనా గానీ తమ జీవిత భాగస్వామిని కోల్పోతే జీవితం నిస్సారంగానే ఉంటుంది. భర్త గానీ భార్య గానీ తనతో ఉన్నంతవరకే తనకి కుటుంబంలో విలువ,  గౌరవం ఉంటాయేమో అనిపిస్తుంది. అంతవరకు తనతో కలసి జీవించిన వ్యక్తి చనిపోతే తను ఒృటరి అయిపోయాననే భావన హఠాత్తుగా మనసునంతా ఆవహిస్తుంది. 


తనదీ భర్త సుధాకర్ దీ ఒకటే మాట,  ఒకే దృక్పధంతో ముఫై అయిదు సంవత్సరాలు కలసి జీవించారు. ఇద్దరూ ఉద్యోగస్తులు అయిన మూలాన ఆర్ధిక పరమైన సమస్యలు లేవు. పిల్లలు వినోద్,  వికాస్ లను క్రమ శిక్షణతో పెంచి మంచి విద్యాబుధ్దులతో ప్రయోజకులను చేసారు. అత్తగారు కేన్సర్ పేషెంట్. ఆవిడ కోసం రెండు సంవత్సరాల సర్వీస్ ఇంకా ఉండగానే వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకుని ఆవిడకు ఎంతో సేవచేసింది. కన్నతల్లిలా సేవ చేస్తున్నావు ప్రమీలా,  ఏమిస్తే నీ రుణం తీరుతుందమ్మా అంటూ తన రెండు చేతులూ పట్టుకుని శుష్కించి పోయిన దేహంతో తన వైపే బేలగా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న అత్తగారి ముఖం ఇప్పటకీ కన కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది. 


చిన్నవాడు వికాస్ యు. ఎస్ వెళ్లి చదువుకుంటానంటే అలాగేనని పంపించారు. వినోద్ యు. ఎస్ వెళ్లడానికి ఎక్కువ ఆసక్తి చూపలేదు. ఇంజనీరింగ్ పూర్తి అవడంతోనే కేంపస్ సెలక్షన్ లో మంచి ఉద్యోగం వచ్చింది. అలాగే వికాస్ కూడా అమెరికాలో చదువు అయిన వెంటనే మంచి ఉద్యోగం వచ్చింది. ఇద్దరబ్బాయిలకూ రెండేళ్ల వ్యత్యాసంలో పెళ్లిళ్లు కూడా జరిపించారు. వినోద్ భార్య అపర్ణ కూడా ఉద్యోగస్థురాలే. స్టేట్ బేంక్ లో పనిచేస్తోంది. పెళ్లైన రెండు సంవత్సరాలకే వినోద్ కి అబ్బాయి పుట్టాడు. తరువాత రెండు సంవత్సరాలకు ఒక కూతురు. వికాస్ కి రెండేళ్ల కూతురు ప్రస్తుతం. 


పిల్లలు స్థిరపడ్డారు. భర్త సుధాకర్ రిటైర్ అయి అప్పటికి మూడు సంవత్సరాలు అయిపోయాయి. హాయిగా ఆనందంగా జీవితం గడుపుతున్న సమయంలో అనుకోకుండా సుధాకర్ హార్ట్ ఎటాక్ తో మరణించడంతో తను చాలా కృంగిపోయింది. ఒకరికొకరు తోడూ నీడగా ఉండే తమ దాంపత్య జీవనంలో ఎదురైన అనుకోని అపశృతి తన ఆరోగ్యం పై చాలా ప్రభావం చూపింది. బ. పి,  సుగర్,  రాత్రి సరిగా నిద్ర పట్టకపోవడం లాంటి లక్షణాలు తనని వేధిస్తున్నాయి. 


భర్త సంవత్సరికాలు పూర్తి అయిపోగానే వినోద్ “అమ్మా ఒంటరిగా ఎలా ఉంటావ్? పై భాగం ఎలాగా అద్దెకిచ్చేసారు. కింద మీరుంటున్న భాగం కూడా అద్దెకిచ్చెయ్యకూడదా? సామానంతా రెండు గదుల్లోకి సర్దుకుని మా దగ్గరకు వచ్చేయమ్మా అని బలవంతం చేయడంతో తను వినోద్ తో బెంగుళూర్ వచ్చేసింది. తల్లితండ్రులు తమ పిల్లల దగ్గరకు వెళ్లకుండా మరెక్కడ ఉంటారు? అందులో భర్త బ్రతికి ఉంటే అది వేరే సంగతి. జీవిత భాగస్వామిని కోల్పోయిన వారు పిల్లలతో ఉండడం ధర్మం అని భావిస్తుంది ప్రమీల. చాలామంది పిల్లలతో కలసి జీవించలేం,  స్వతంత్రంగా ఉంటేనే మంచిదని సమస్యలు రావని భావిస్తారు. ఆత్మాభిమానం ఒక్కసారి దెబ్బతింటే అది కోలుకోవడం చాలా కష్టం. 


తొమ్మిది గంటలకు బేంక్ కి వెళ్లిపోవాలి,  ఈ లోపల అన్ని పనులు పూర్తి చేసుకోవాలని తెలిసినపుడు ఏడు గంటలకు గానీ లేవదు అపర్ణ. ఒక గంట ముందు లేస్తే ఈ హడావుడి ఉండదుకదా అని అనుకుంటుంది తను. 


ప్రమీల ఉద్యోగం చేస్తున్నపుడు తెల్లనారుఝామున నాలుగు గంటలకే లేచి వంటపని పూర్తి చేసుకుని పిల్లలకు కావలసినవన్నీ రెడీ చేసుకుని భర్తకూ తనకూ కేరియర్స్ సర్దుకొని అత్తగారికి అన్నీ అందుబాటులో ఉంచి మరీ ఆఫీస్ కు బయలదేరేది. నాలుగు గంటలకే లేచినా కొన్ని చిన్న చిన్న పనులు హడావుడిలో మరచిపోయేది. పాలు తోడు పెట్టడంలాంటి చిన్న చిన్న పనులు. ఆఫీస్ లో గుర్తుకొచ్చి అత్తగారికి ఫోన్ చేసి చెప్పేది. ఆవిడకు ఓపిక ఉన్నంత కాలం పనిమనిషి వస్తే దగ్గరుండి పనులు చేయించడం,  పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్లకు ప్రమీల రెడీగా తయారు చేసి ఉంచిన స్నాక్స్ లాంటివి పెట్టడం చేసేది. ఆ చిన్న చిన్న పనులు తనకు ఎంతో వెసులుబాటుగా ఉండేవి. నిజమే తను కొంచెం పెందరాళే లేచి కోడలికి సహాయపడాలని దృఢంగా సంకల్పించుకుంది. 


మరునాడు పొద్దుటే ఆరుగంటలకు లేచిపోయింది. అపర్ణ ఇంకా లేవలేదు. ఫిల్టర్ లో కాఫీ డికాషన్ తీసి ఉంచింది. పాలు కాచి పెట్టింది. తను కాఫీ తాగి స్నానం చేయడానికి వెళ్లింది. తన స్నానం అయి దేవుడి దగ్గర దీపం పెట్టడం కూడా అయింది. అయినా అపర్ణ లేవలేదు. ఫ్రిజ్ లో నున్న ఆకుకూర,  బీన్స్ తీసి కట్ చేస్తుండగా అపర్ణ లేచి వంటింట్లోకి వచ్చింది. 'సారీ లేట్ అయింది అత్తయ్యా అనగానే ఫరవాలేదులే అపర్ణా,  కట్ చేయడం అయిపోయింది,  కుక్కర్ పెట్టే ఏర్పాట్లు చేయి'. ఇడ్లీ లోకి లోకి కొబ్బరి పచ్చడి చేస్తానంటూ అక్కడనుండి లేచింది. 


ఇలా వారం రోజులు ప్రమీల ప్రొద్దుటే లేచి పనులు మొదలు పెట్టడంతో అపర్ణ కు హాయిగా ఉంది. జరిగితే జ్వరమంత సుఖం లేదన్న సామెతను అపర్ణ చాలా చక్కగా వాడుకుంది. ప్రొద్దుటే వంటింటి పనంతా ప్రమీల మీద పడింది. అయ్యో అత్తగారు తన కంటే ముందే లేచి వంటింట్లో పని చేస్తున్నారేనన్న ఒకలాంటి మొహమాటం గానీ బిడియం గానీ అపర్ణ ముఖంలో కనబడేది కాదు. 


ప్రమీల సాహిత్యాభిలాషి. అత్తగారు పరమపదించిన తరువాత తీరుబాటు దొరికింది. ఉద్యోగ విరమణ కూడా అయిందేమో ఖాళీ సమయంలో రచనా వ్యాపంకంలోకి తలదూర్చింది. పైగా భర్త కూడా ప్రోత్సహించడంతో ఆమె రచనా వ్యాపకం కొత్త పుంతలు తొక్కింది. సోషల్ మీడియాలోని అనేక సాహిత్యగ్రూప్ లలో సభ్యత్వం తీసుకుని చక్కని కథలు,  కవితలు వ్రాయడం మొదలు పెట్టింది. కొన్ని ప్రముఖ వారపత్రికలకు,  మాసపత్రికలకు కథలు వ్రాసి పంపించేది. ఇలా ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎందరో మిత్రులను ఏర్పరచుకుంది. భర్త చనిపోయిన తరువాత మానసికంగా నలిగిపోవడంతో వాటినన్నిటినీ దూరం పెట్టేసింది. దేని మీద ఆసక్తి చూపించలేకపోతోంది. 


అపర్ణ అత్తగారి సహాయాన్ని పూర్తిగా వాడుకుంటోంది. ప్రొద్దుటా,  రాత్రీ వంటింటి పని ప్రమీల మీదే పడింది మొత్తం. ప్రమీల తను ఉద్యోగం లో ఉండగా ఇంటి పనితో ఎంత హడావుడి పడేదో ప్రస్తుతం కొడుకింట్లో కూడా అలాగే ఉంది తన పరిస్తితి. 


ఒకరోజు అమెరికా నుండి వికాస్ ఫోన్ చేసాడు ప్రమీలకు. 'అమ్మా మా అత్తగారు ప్రణవి డెలివరీకి రాలేనన్నారు. ఆవిడ చెల్లెలి కూతురు పెళ్లి కుదిరిందట. సరిగా ప్రణవి కి డెలివరీ అయ్యే నెలలోనే పెళ్లి ముహూర్తంట. నీవు అమెరికా వెళ్లిపోతే ఎలాగ,  నాకు సహాయానికి ఉండవా అంటూ ఆవిడ చెల్లెలు ఒకటే ప్రాధేయపడుతోందిట. మీ అత్తగారిని నీ డెలివరీ సమయానికి పిలిపించుకోండి ఆ తరువాత నేను వస్తానని ప్రణవి కి చెప్పారుట. ఏమంటావమ్మా,  వస్తావు కదూ? 


ప్రమీల తెల్లబోయిందో క్షణం. అంతక ముందు వాడికి కూతురు పుట్టినప్పుడు కూడా ప్రణవి డెలివరీ కి తనూ,  భర్త సుధాకర్ కలసి వెళ్లారు. అప్పుడు కూడా అంతే ఆవిడ. తనకు మోకాళ్ల నొప్పులతో బాధనపడుతున్నానని డాక్టర్ నాలుగైదు నెలల వరకు మందులిచ్చి వాడమన్నారని అవసరమైతే సర్జరీ చేయించుకోవలసిన అవసరం రావచ్చని చెపితే అయ్యో పాపం అనుకుంటూ తామిద్దరూ కోడలి పురుటికి అమెరికా పరుగెత్తారు. ఆరు నెలల అయిపోతుండగా వియ్యపురాలు,  వియ్యంకుడూ మెల్లిగా వచ్చారు. ఆవిడలో ఆ మోకాళ్ల నొప్పుల చిహ్నాలే కనపడలేదు తనకు. 


ఆ ఆరునెలలూ పురుటి పసికందుని చూసుకోవడం,  ఇంట్లో బండ చాకిరీతో తను అలసిపోయింది. అప్పుడు భర్త తనకు సహాయంగా ఉన్నమూలాన కొంతవరకు తట్టుకోగలిగింది. ప్రణవి మరీ సుకుమారస్తురాలు. పాప రాత్రిళ్లు ఏడుస్తుంటే వికాస్ పాపను తన పక్కన పడుకోపెట్టేవాడు. పాపకు స్నానం చేయించాకా కూడా అందుకుని ఒళ్లు తుడవడం,  బట్టలు మార్చడం లాంటి పనులు కూడా ప్రణవి చేసేది కాదు. పాప డైపర్లు తడిపేసినా ఎప్పటికో గానీ మార్చేది కాదు. తనే ఊరుకోలేకపోయేది. తడికి పాపకి ఎక్కడ రేషస్ వస్తాయోనన్మ ఆరాటంతో పాపకు డైపర్లు మారుస్తూ ఉండేది. పత్యపు వంటలు వండడం,  లాండ్రీ,  ఇల్లు సర్డం అంతా తనే చేసేది. భర్త ఇల్లంతా వేక్యూమ్ చేసేవాడు. ఆ అమ్మాయి తాగిన కాఫీ కప్పును కూడా తనే తీయవలసి వచ్చేది. పోనీలే మొదటి డెలివరీ,  చిన్నతనం అనుకుంటూ తనే సరిపెట్టుకునేది. 


ఇప్పుడు రెండో డెలివరీ కి కూడా వికాస్ తననే రమ్మనమంటున్నాడు. ఏం అత్తగారికి చెప్పలేడా,  తన పరిస్తితి తెలియదా వాడికి? 


అయినా వియ్యపురాలు మాత్రం? కూతురి డెలివరీ కంటే ముఖ్యమా చెల్లెలి కూతురి పెళ్లి?


తను రిటైర్ అయి,  ఒంటరిగా ఉన్నాననే కదా ఈ అలుసు?


వికాస్ కి తెలియకనా,  తన ఆరోగ్య పరిస్తితి. 

తన కొడుకు,  కోడలే. తన కుటుంబమే. సాయం చోయడానికి తనది వెనుకాడే స్వభావం కాదు. 

తన ఇద్దరాడపడుచుల పురుళ్లూ పుణ్యాలన్నింటికీ తను చేదోడువాదోడుగా ఉంది. అత్తగారు ఆరోగ్యవంతురాలు కాదు. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే ఆడపడుచుల పురుళ్లకు శెలవు పెట్టి మరీ చూసుకుంది. 


ఇప్పటికీ ఇద్దరాడపడుచులకూ తనంటే ఎంతో గౌరవం ప్రేమ. వదినా మా దగ్గర కూడా కొంత కాలం వచ్చి ఉండమని ప్రాధేయపడతారు. 


మనసులో దృఢంగా నిర్ణయించుకుని మరునాడు వికాస్ కి ఫోన్ చేసి చెప్పింది. 

"సారీ విక్కీ,  రాలేనురా,  ఒంటరిగా అంత దూరం ప్రయాణించే ఓపిక నాలో లేదు,  ఆరోగ్యం సహకరించడం లేదు". 


ఎవరు ఏమనుకున్నా ఫరవాలేదు ఎందుకంటే తను కావాలని తప్పించుకోవడం లేదు. వాస్తవాన్ని చెప్పింది. 


ఒకరోజు హైద్రాబాద్ లో ప్రమీల ఇంట్లో మేడమీద భాగం లో ఉంటున్న మోహనరావు గారు ఫోన్ చేసి తనకు చెన్నై ట్రాన్స్ ఫర్ అయిందని ఒక నెలరోజుల్లో ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పారు. పైన మేడమీద ఉంటున్న కుటుంబం ఎంతో మంచివాళ్లు. ఆయన బేంక్ ఉద్యోగి. ఆయన భార్య కూడా చాలా మంచిది. తను అక్కడ ఉండగా తనతో ఎంతో కలివిడిగా ఉంటూ ఎన్నో కబుర్లు చెప్పేది. ఎంతో సహృదయంతో ఇల్లంతా తను చూసుకుంటానని ప్రమీలను వినోద్ దగ్గరకు ప్రోత్సహించి మరీ పంపారు. అటువంటి కుటుంబం తమ ఇంటిని ఖాళీ చేస్తున్నారని తెలిసి బాధ పడింది. 

ఆరోజు ఆదివారం వినోద్ ఖాళీగా ఉన్న సమయం చూసి చెప్పింది. "విన్నూ,  హైద్రాబాద్ వెడ్తానురా,  మేడమీద ఉంటున్న ఆ మోహన్ రావు గారు ఖాళీ చేస్తున్నారు కదా. దగ్గరుండి మళ్లీ ఎవరైనా మంచివాళ్లకి ఇల్లు అద్దెకివ్వాలి కదా". 


"అమ్మా నీ వెళ్లనవసరం లేదు. "ఏ బ్రోకరేజ్ సంస్తకైనా అప్పచెప్పామనుకో వాళ్లే చూస్తారు అన్నీ. అంతదూరం నీవు వెళ్లి చూడడం కష్టం అమ్మా. పోనీ వీలు చూసుకుని నేను వెళ్లి వస్తాను అంటూ ఆపేయబోయాడు". 


"లేదు విన్నూ,  నేను వెళ్లి అక్కడ కొంత కాలం ఉండాలని ఉంది. కొంచెం మార్పు కావాలనిపిస్తోంది రా విన్నూ". 


"అమ్మా ఇక్కడ ఉండడం నీకేమైనా ఇబ్బందిగా ఉందా"?


"అయ్యో అదేమిటి విన్నూ అలా అంటావ్? ఇక్కడ నాకే ఇబ్బందీ లేదురా". 


వినోద్ తల్లి ఇష్టాన్ని కాదనలేక పోయాడు. అతనికి తెలుసు. తండ్రి చనిపోయాకా తల్లి మానసికంగా ఎంత కృంగిపోయిందోనని. తల్లి కి ఇక్కడ వంటింట్లో చాకిరీ ఎక్కువైందని కూడా గ్రహించాడు. 


అపర్ణ కు ఎన్నో సార్లు చెప్పి చూసాడు అమ్మను కష్టపెట్టద్దని. 

అలా అన్నందుకు అపర్ణకు బుస్సున కోపం వచ్చేసింది. "ఉద్యోగం మానేయనా పోనీ,  మీ కందరికీ చక్కగా సేవ చేసిపెడ్తా"నంటూ ఎగిరి పడింది. 


ఒకసారి ఇలాగే ఏదో పిల్లల పెంపకం విషయంలో మాటా మాటా వచ్చి ఉద్యోగం మానేస్తానంటే సరే మానేయమన్నాడు. 


ప్రతీ చిన్న విషయానికి ఉద్యోగం ఉద్యోగం అంటూ బెదిరిస్తుంది. 

పోనీ మానేసిందా అంటే అదీ లేదు. తనకు ఆర్ధికంగా ఒకరి మీద ఆధారపడడం ఇష్టం లేదుట. అది ఎవరైనా కానీ అంటూ ఖరాఖండీగా చెప్పేసింది. తనకు గొడవలు పడడం,  తెగేదాకా లాగడం ఇష్టం ఉండదు. మౌనం వహించాడు. తల్లితో చెప్పాడు,  "అమ్మా అక్కడ నీవు కొద్దికాలం గడపిన తరువాత ఇక్కడకు వచ్చేయాలి". 

అలాగే వస్తానురా విన్నూ. మీరు కూడా పిల్లల వేసవి శెలవులకు రండి. కింద భాగం మొత్తం అంతా అదివరకటి లాగ ఉంచేస్తాను. నీవు వచ్చినా,  వికాస్ వచ్చినా సౌకర్యంగా ఉంటుంది ఉండడానికి. 

చూద్దాములే అమ్మా,  నీవు జాగ్రత్త. అక్కడే ఉండిపోవాలని అనుకోవద్దని మరీ మరీ చెప్పాడు. 

అపర్ణ కయితే అత్తగారు అలా వెళ్లిపోవడం నచ్చడం లేదు. ఇప్పుడు ఆవిడ అన్నీ చేసిపెడుతుంటే సుఖంగా ఉంది. ఆవిడ వెళ్లిపోతే ఎంత కష్టం తనకు? ఆవిడ వెళ్లిపోతాననగానే వినోద్ ఆవిడను బలవంతంగానైనా ఆపకపోవడం తనకు నచ్చలేదు. 

ప్రమీల అపర్ణను పిలిచి చెప్పింది. "హైద్రాబాద్ వెడుతున్నాను అపర్ణా,  పనుందంటూ". 

"అదేమిటి అత్తయ్యా,  ఇంత అర్ధాంతరంగా వెడుతున్నారు"?

అవును అపర్ణా,  సొంత ఇంటి మీద మనసు లాగుతోంది. ఆ ఇంటిమీద ఉన్న నలభై ఏళ్ల మమకారం ఎక్కడకు పోతుంది? కొంత కాలం అక్కడ ఉండాలనిపిస్తోంది. 


మీరు ప్రణవి పురిటికి అమెరికా రాలేనని చెప్పారుట. నాలుగురోజుల క్రితం నేనే ప్రణవి ఎలా ఉందో తెలుసుకుందామని ఫోన్ చేస్తే ప్రణవి బాధ పడ్తూ చెప్పింది. హైద్రాబాద్ వెళ్లే కంటే వికాస్ దగ్గరకు వెడితే పాపం ప్రణవికి సహాయంగా ఉంటారు కదా? మీకూ కాలక్షేపం కూడానూ. 


"ఓ,  తోటికోడళ్లిద్దరూ మాట్లాడుకున్నారన్నమాట,  మనసులో అనుకుంది ప్రమీల". 


అయినా అపర్ణ ఏమిటి,  తనకు సలహా ఇస్తోంది? తను కేవలం కోడళ్లిద్దరకూ సహాయపడడానికే ఉందా? 


తనకి కాలక్షేపమా? తనకు పనిలేక ఖాళాగా ఉంటూ సమయం గడుపుతోందా?


అపర్ణకి ఏమి తెలుసు తన గురించి? ఏదో ఆషామాషీగా ఉద్యోగం చేసిందిలే,  ఇప్పుడు ఖాళీగా ఉందని అనుకుంటోంది. 


బాధ్యత కల కోడలైతే,  తనమీద ప్రేమాభిమానాలే ఉంటే తనే ప్రణవికి గట్టిగా చెప్పాలి. అదేమిటి ప్రణవీ అత్తయ్యగారు అంత దూరం ఒంటరిగా ఎలా రాగలరు? ఆవిడ ఆరోగ్యం కూడా సరిగా ఉండడం లేదు,  మీ అమ్మగారినే పిలిపించుకొమ్మని. 


ఈ విషయంలో ప్రణవినే సపోర్ట్ చేస్తూ తనని నిలదీసి అడగడం ఏమంత భావ్యం?


మనసులో నుండి తన్నుకొస్తున్న అసహనాన్ని బలవంతంగా కంట్రోలు చేసుకుంటూ "చూడు అపర్ణా,  నాకు ఆరోగ్యం సరిగాలేక అంత దూరం రాలేనన్నాను. నిజానికి నేను జీవితంలో చాలా అలసిపోయానమ్మా". 


నా మనసు,  శరీరం విశ్రాంతిని కోరుకుంటోంది. నేను ఉద్యోగం చేసేటప్పుడు అన్నీ నేనే చేసుకునేదాన్ని. ఎవరి సహాయం నాకు లేదు. అయినా నా ఇంటిని,  నా పిల్లలను చూసుకోవడం నా బాధ్యత అవుతుంది కానీ,  మరొకరు నా బాధ్యతను పంచుకోవాలని గానీ,  నాకు పనుల్లో ఎవరైనా సహాయపడాలని గానీ నేను ఆశించలేదు. కష్టమో,  సుఖమో నా సంసారాన్ని,  బాధ్యతలనీ నేనే మోయాలని భావించాను. వినోద్ బామ్మ అనారోగ్యవంతురాలు. నా భర్తను కన్న తల్లిగా ఆవిడను జాగ్రత్తగా చూసుకోవాలని అనుక్షణం తాపత్రయపడ్డాను. నా చేతిలోనే ఆవిడ కన్ను మూసారు. 


నా బాధ్యతలను నేను సరిగా నిర్వహించాననే తృప్తి నాకు మిగిలింది. 


డిపెండెన్సీ ను నేను ఇష్టపడను. మనకు చేతనైనంతవరకు మనమే చేసుకోవాలి. దానికోసం కష్టపడాలి తప్పదు. అప్పుడే మనకు తృప్తి దొరుకుతుంది. తృప్తికి అర్ధం అదే. 


ప్రణవి గురించి ఎక్కువ ఆలోచించకు అపర్ణా. ఆ అమ్మాయికి తల్లి ఉంది. నేను వెళ్లి సహాయపడకపోయినా ప్రణవి ప్రసవం ఆగి పోదు. వాళ్లే ఏదైనా ఏర్పాటు చేసుకోగలరు. 


ప్రమీల మాటల్లోని దృఢత్వానికి అపర్ణ ముఖం మాడిపోయింది. 

***

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :  

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
89 views1 comment
bottom of page