top of page

ఉషోదయం


కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.Youtube Video link

'Ushodayam' New Telugu Story


Written By Lakshmi Sarma B"ఒరేయ్ చింటూ… లేవరా బారెడు పొద్దుక్కిపోయింది, త్వరగా లేచి స్కూల్‌కు తయారవ్వండి”, కొడుకు దుప్పటి లాగేస్తూ అంది ఉష.


"అబ్బా.. అమ్మా! నన్నిప్పుడే లేపకు. ముందు అక్కను లేపు. అది గంటసేపు బాత్రూంలోనుండి రానేరాదు. అది వచ్చాక నన్నులేపు, "అంటూ దుప్పటి నిండా కప్పుకుని పడుకున్నాడు.


నిజమేలే ఇద్దరిని ఒకేసారి లేపితే అదివెళ్ళి బాత్రూంలో కూర్చుందంటే ఓ పట్టానరాదు.

వీడు అరుస్తుంటాడు ఎంతసేపు అని. రెండు బాత్రూంలున్నా ఒకటి అత్తయ్య రూంలో

ఉంటుంది. అందులోకి వెళ్ళండిరా అంటే ఎవరూ వెళ్ళరు. పెద్దావిడ కదా! ఎప్పుడు అర్జంటు అంటుందో తెలియదు.


వీళ్ళేమో లోపలకు వెళ్ళారంటే అరచి గీ పెట్టినరారు.


"చిన్నీ… స్కూల్‌కు టైం అవుతుంది. లేచి త్వరగా తయారవు, ఆటో వచ్చి ఇంటిముందు హారన్

కొడుతున్నా తెమలరు, రోజు మీరిద్దరు లేటు చేస్తున్నారని ఆటో అతను గొడవపడుతున్నాడు. ఇంకా చిన్నపిల్లలా చెప్పు, "కూతురిని లేపి కూర్చోబెట్టింది.


"అమ్మా అప్పుడే తెల్లారిందా… ఇంకా నిద్రవస్తుంది కాసేపు పడుకుంటాను మా అమ్మవు కదా, "అంది బతిమాలుతూ.


"చాలు చాలు నీ వేషాలు కానీ… హోం వర్క్ చాలా ఉంది అన్నావు. తొందరగా లేపితే చేసుకుంటా అన్నావు కదా! లే.. లేచి త్వరగా స్నానం కానిచ్చుకొనిరా, "రెక్కపుచ్చుకుని

మంచం మీదనుండి కిందకు దింపింది చిన్నిని. హోం వర్క్ గుర్తుచెయ్యగానే పరుగెత్తినట్టే వెళ్ళిపోయింది బాత్రూంలోకి. చిన్ని హడావుడి చూసి నవ్వుకుంది ఉష. లేడికి లేచిందే పరుగు అనుకుంది. కూతురు కొడుకు లేచి తయారై వచ్చేసరికి స్కూల్ టైం అయింది.


"ఓరేయ్ పిల్లలు రండిరా… ఆటో వచ్చేస్తుంది, "కేకవేస్తూనే పిల్లలకు టిఫిన్ ప్లేట్‌లో పెట్టుకుని వచ్చి ఇద్దరికి పెట్టసాగింది.


"ఏమిటే ఉషా… నువ్వు మరీ పాడుచేస్తున్నావు పిల్లలను, వాళ్ళు ఇంకా నీ కళ్ళకు పాలు తాగే పసిపిల్లనుకుంటున్నావు, కాస్తా వాళ్ళకు వాళ్ళ పనులు చేసుకోవడం నేర్పించవే, "అంది ఉష అత్తగారు సుశీలమ్మ పిల్లలను కోపంగా చూస్తూ.


"అదేంటత్తయ్యా అలా అంటారు… వాళ్ళు చిన్నపిల్లలే కదా! పాపం వాళ్ళకు ఎంతింత హోమ్ వర్క్ లు ఇస్తున్నారో చూసారా? అయినా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటునే

ఉన్నారు, స్కూల్‌కు టైం అయిపోతుందని తినిపిస్తున్నాను అంతే కదత్తయ్యా, "అంది.


"ఏమో తల్లి … మా కాలంలో ఈ వయసు వచ్చేసరికి అన్ని పనులు నేర్చుకునేవాళ్ళం, కాస్తా మంచిచెడు పనిపాట వాళ్ళకు వచ్చేలా చూడు , ప్రతీది నువ్వే చేస్తున్నావు వాళ్ళకు అలానే అలవాటు అవుతుంది , ఏదో పెద్దదాన్ని చూస్తూ ఊరుకోలేను నీ మంచికోసమే చెబుతున్నా, "అంటూ గొణుగుతూ లోపలకు వెళ్ళిపోయింది.


"మీ కాలంలో అంటే ఇంగ్లీషు చదువులు లేవు, ఇంతగా పిల్లలను రుద్దేవాళ్ళు కాదు, ఇక పని అంటారా ! అప్పట్లో చిన్నతనంలో పెళ్ళి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయేవాళ్ళు. అందుకని పని రావాలని అన్ని పనులు చేయించేవాళ్ళు.


ఇప్పుడంతా చదువు ఉద్యోగాల కోసమే. బాధ్యతలు మీద పడినాక అన్ని పనులు అలవాటు అవుతాయి లేండత్తయ్యా, "అత్తయ్యకు వినిపించేలా అంది.


"హలో ఉషా … వంటయిందా? నాతోపాటుగా రవి, వినోద్ భోజనానికి వస్తున్నారు, కాసిన్ని పాపడాలు ఇంకా చల్లమిరపకాయలు వేయించుపెట్టు, మేము అరగటంలో వస్తాము, "ఫోన్ చేసి చెప్పాడు ఉష భర్త ప్రభాకర్.


"అదేంటండి ఇప్పుడు చెబితే ఎలాగండి… వంట ఎప్పుడో చేసాను, ఇప్పటికిప్పుడు వాళ్ళు వస్తున్నారంటే వంటంత మళ్ళీ చెయ్యాలి, ఆ ముక్క కాస్త ముందే చెబితే

మీ సొమ్మేం పోయింది, "అంది కోపంగా.


"ఏమిటి… ముందు చెపితే తప్పా భోజనం పెట్టవా ఏంటి? ఇంకా మేము రావడానికి అరగంట పడుతుంది. ఈలోగా చకచకా చేసేయ్, వాళ్ళు వస్తానని అన్నప్పుడు రావద్దని

చెప్పమంటావా?, "కస్సున లేస్తూ ఫోన్ కట్ చేసాడు.


దబాయింపులు తెలుసు కానీ ఇప్పటికిప్పుడు వంటచెయ్యడం ఎలాగా అని మాత్రం ఆలోచించరు. మగాళ్ళమనే జులూం. ఆడదంటే అలుసు ఈ మగాళ్ళకి"అనుకుంటూ గబగబా ఫ్రీజ్ ఓపెన్ చేసి కావలసిన కూరగాయలు చకచకా తరుగుకొని అన్నం పప్పు చారు కూరచేసింది. ఈ లోపలరానే వచ్చేసాడు ప్రభాకర్ స్నేహితులతో.


వస్తూనే, "ఉషా … మేము వచ్చేసాము. తొందరగా వడ్డించు, త్వరగా తిని మేము సినిమాకు వెళతాము, "అన్నాడు కాళ్ళు కడుగుకొని వస్తూ.


అలాగేనండి … పాపడాలు, చల్లమిరపకాయలు వేయిస్తున్నాను. అవికాగానే వడ్డిస్తాను, ”


"ఏంటి.. ఎప్పుడనగా చెప్పాను.. ఇంకా అవలేదా? తెలివుందా అసలు నీకు , మేము సినిమాకు వెళ్ళాలని తొందరపడుతుంటే తీరికగా చేస్తున్నావా, "అంటూ గయ్యిమని లేచాడు ప్రభాకర్ ఉషమీదకు.


“అయ్యో అదేంటండీ … నాకు ఇందాకనే చెప్పారుగా, అప్పటినుండి చేస్తూనే ఉన్నాను నేనేమన్నా కూర్చున్నా ననుకున్నారా, "ఉక్రోషం పొడుచుకొచ్చింది ఉషకు. ముందు చెప్పకుండా తీసుకరావడమే కాకుండా వాళ్ళ ముందు అలా అనేసరికి తట్టుకోలేకపోయింది.


"నోరు బాగానే లేస్తుంది. ఎవరున్నారు ఏంటో చూసేదిలేదా, "కళ్ళెర్ర చేస్తూ అన్నాడు.


"చాలా బాగున్నాయి చెల్లమ్మా, నెలకొకసారైనా నీ చేతి వంట తినాలని ఉంటుంది, ఈ రోజు కచ్చితంగా అనుకున్నాను నీ చేతివంట తిని ఎన్నాళ్ళయిందని. అప్పుడే మనవాడు చెప్పాడు మనం సినిమాకు వెళదాము. సినిమా థియేటర్ మా ఇంటికి దగ్గరకాబట్టి, మా ఇంట్లో తిని వెళదామన్నాడు, "చెప్పాడు రవి నవ్వుతూ.


"అవును ఉషగారు చాలా బాగున్నాయి మీ వంటలు. కాకపోతే మా వలన మీరు ఇబ్బంది పడ్డారు. ఏమి అనుకోకండి, "అన్నాడు ప్రభాకర్ వైపు చూస్తూ.


ఉషకు ప్రభాకర్‌కు అర్థమైంది వీళ్ళు అనుకున్నమాటలు వాళ్ళు విన్నారని.


"అయ్యో అదేం లేదండి మీరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది, "వడ్డిస్తూ భర్తవైపు చూస్తూ అన్నది.


“నువ్వు కూడా తినమ్మా మాతోపాటుగా, చాలా టైం అయింది కదా మళ్ళీ ఒక్కదానివైపోతావు, "అన్నాడు వినోద్.

చూడండి! మీకంటే వాళ్ళు నూరుపాళ్ళు నయం.

నన్ను తినమని అడుగుతున్నారు. మీరు ఎప్పుడూ అడగరు.

ఎంతసేపు కమ్మగపుల్లగా చేసిపెడుతుంటే తినడమే కానీ! ఇంకా చేసిన దానికి వంకలు పెడుతూ మనిషిని హేళన

చేయ్యడం తెలుసు. పిల్లలు అంతే.. మీరు అంతే.


సమయానికి అన్ని సమకూర్చడం, అడిగిందల్లా చేసిపెడుతుంటే ఎవ్వరికి ఏమి అర్ధంకాదు. అత్తయ్య అందుకే అంటుంటారు

‘వాళ్ళకు ప్రతీది నువ్వు చేసిపెడుతుంటే వాళ్ళకు ఎప్పుడు తెలుస్తుంది’ అని’ అని మనసులో అనుకుంటూ గుర్రుగా చూసింది భర్తవైపు. ఇదేం పట్టించుకోని ప్రభాకర్ చలోక్తులు విసురుతూ నవ్వుకుంటూ తినేసారు.


చిన్నిది పదవతరగతి పరీక్షలు అయిపోయాయి. చింటూ ఎనిమిది పరీక్షలు రాసాడు

సెలవులొచ్చాయి. ఎండకాలం అందరు కలిసి తిరుపతికి వెళ్ళివచ్చారు. బాగానే ఎంజాయ్ చేసామని మురిసిపోయారు.


అవునుమరి. అన్ని సక్రమంగా నడిపించే మనిషి ఉన్నాక ఎంజాయ్ ఎందుకు చెయ్యరు. పాపం ఉషకు మాత్రం తిప్పలు తప్పలేదు అక్కడకు వెళ్ళినా. ఇంటికి వచ్చినప్పటినుండి బట్టలన్నీ ఉతికి ఆరెయడం ఇల్లంతా సర్ధుకోవడంతో క్షణం తీరికలేకుండాపోయింది. ఉన్నట్టుండి వర్షం దంచికొడుతుంది. ఎండాకాలం అయినా ఏమిటో అకాల వర్షాలు అనుకుంటూ.


"ఒరేయ్ పిల్లలు వర్షం పడుతుంది. గబగబా వెళ్ళి బట్టలన్నీ తీసుకరండి, వర్షానికి తడిచిపోతాయి లక్షణంగా ఆరిపోయాయి, "పిల్లలతో అంది.


"అబ్బా పో అమ్మా… మంచి సినిమా చూస్తున్నాము నువ్వే వెళ్ళి తెచ్చుకో , "అన్నారు పిల్లలిద్దరు.


"ఏమండి మీరన్న వెళ్లండి నేనంత తొందరగా వెళ్ళలేను, "అంది భర్తవైపు తిరిగి.


"ఉషా… పోతేపోని వెధవ బట్టలు రేపు ఆరాక తెచ్చుకోవచ్చుగానీ, వేడివేడిగా మిరపకాయ బజ్జీలు వేయ్యి, వర్షం పడుతున్నప్పుడు తింటే బలే మజాగా ఉంటాయి, ”

ఇటు వైపు తిరగకుండానే టీవీలో మునిగిపోయి చెప్పాడు ప్రభాకర్. నేను చెప్పానా

నీకు అన్నట్టుగా చూసింది ఉష అత్తగారు.


"ఛీ ఛీ… మీకు చెప్పే బదులు చేసుకున్నది నయం, "అంటూ పరుగు పరుగున వెళ్ళింది మిద్దెపైనకు. వర్షం బాగా పడుతుంది గబగబా బట్టలన్నీ తీసుకొని కిందకు దిగుతుంది. ఒక్కసారిగా ఉరుము మెరుపు వచ్చేసరికి కళ్ళు మూసుకపోయినట్టుగా అయ్యాయి ఉషకు.

మిద్దెకు ప్రహరీగోడా లేదు చూసుకోకుండా అటువైపు కాలు వేసింది. అంతే దబ్బుమన్న శబ్దంతో కిందపడిపోయింది.


"ఒరేయ్ ప్రభా … కోడలు పైనకు వెళ్లింది ఏదో శబ్దం వచ్చిందిరా వెళ్ళి చూసిరారా, ”


"ఆ ఏం లేదమ్మా … ఎవరిదో గోడ కూలినట్టుంది అంతే , "అన్నాడు. లేస్తే సినీమా ఎక్కడ

మిస్ అవుతానో అని. వీళ్ళకు తిక్క కుదర్చడానికి అన్నట్టుగా కరంట్ పోయింది. పెద్దావిడకు కంగారుగా ఉంది ఉష రాలేదని.


"ఒరేయ్ అది ఇంకా రాలేదు బయటకు వెళ్ళి చూడరా కరంట్ కూడా పోయింది, అందరు మొద్దుల్లా కూర్చొని దాన్ని పంపించారు నాకెందుకో భయంగా ఉంది , "కొడుకును పిల్లలను

గట్టిగా కసురుకుంటూ గట్టిగా అంది. అప్పుడుగానీ తెలివిరాలేదు ప్రభాకర్‌కు నిజమే సుమా

ఇంతసేపయిందేమిటి పైనకు వెళ్ళి. అనుకుంటూ గొడుగు టార్చి లైట్ తీసుకుని మిద్దె పైనకు వెళ్ళి చూసాడు కనిపించలేదు. కిందకు వెళ్ళి రూంలో బట్టలు వేస్తుందేమో నేను చూసుకోకుండా అనవసరంగా పైనకు వచ్చాను అనుకుంటూ కిందకు దిగబోతుండగా మూలుగు వినిపిస్తుంటే కిందకు చూసాడు. ఒక్కసారిగా మతిపోయినట్టయింది.

"ఉషా … ఏమయింది, "గొల్లుమంటూ గొడుగు కిందపడేసి పరుగున కిందకు దిగాడు.

తండ్రి అరుపువిని బయటకు వచ్చారు కొడుకు కూతురు ఏమయిందోనని.


"నాన్నా… ఏమయింది … ఎక్కడున్నారు అమ్మ ఏది , "అడుగుతూ కిందపడివున్న తల్లిని చూసి పెడబొబ్బలు పెట్టారు. ఇరుగుపొరుగు వచ్చారు వర్షం శాంతించింది. పెద్దావిడకు నోటమాట రాక కంటికి ధారగా ఏడుస్తూ కూర్చుంది. జరుగవలసిన కార్యక్రమం అంతా జరిపించారు వచ్చేవాళ్ళందరు వచ్చివెళ్ళిపోతున్నారు. పదిరోజుల తరువాత ఒంటరిగా మిగిలిపోయారు ప్రభాకర్ , పిల్లలు. పెద్దావిడను రెండో కొడుకు తీసుకపోయాడు.


ఉషోదాయానికి ముందే లేచి ఇంటిపనులన్ని చక్కగా చేసుకుని పిల్లలకు భర్తకు ఏ లోటు రాకుండా చూసుకునేది. ఇప్పుడు ఆ ఇంట్లో ఉషోదయం కావడంలేదు. ఎవరికి ఏం పని చేయ్యాలో తోచడంలేదు. పొయ్యి వెలిగించి టీ తాగుదామన్నా టీ చెయ్యడమే రాదు, ఉష చేతికందిస్తే కూర్చోని పేపరు చదువుతూ తాగడమే తెలుసు. ఏ రోజు కూడా ఉషలేని రోజు

లేదు వాళ్ళకు. ఎనిమిదవతున్నా లేవని కొడుకును కూతురిని బలవంతంగా లేపి కూర్చోపెట్టాడు. అలవాటులేని పని కష్టంగా అనిపించసాగింది.


"అమ్మా … హర్లిక్స్ పాలు కావాలి, "బెడ్ మీదనుండి కిందకు దిగకుండానే కేకవేసాడు చింటూ.


"చింటూ… అమ్మ ఎక్కడుందనుకున్నావు, అమ్మ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది,

ఇక మనకు అన్ని నాన్ననే లే లేచి ముఖం కడుక్కుని రా , "అంది ఆరిందలా.


"చిన్ని… మనం చాలా తప్పు చేసాంరా, అమ్మ ఉన్నప్పుడు ఒక్కపనిలో కూడా అమ్మకు సహాయం చెయ్యలేదు, అన్ని పనులు తానై చేస్తుంటే మనకెందుకులే అని చూస్తూ ఊరుకున్నాము, మనిషి ఉన్నప్పుడు విలువ తెలుసుకోలేము, ఇప్పుడర్థమౌతుంది మనమేం పోగొట్టుకున్నామో ఎంత అమూల్యమైన మనిషిని వదులుకున్నామో తెలుస్తుంది, "తలపట్టుకుని కూర్చొని కళ్ళు కన్నీళ్లు కారుతుండగా అన్నాడు.


"నాన్న … మీరే అలా బాధపడుతుంటే మమ్మల్ని ఓదార్చే వాళ్ళెవరు చెప్పండి, "అంటూ

కొడుకు కూతురు వచ్చి తండ్రిని గట్టిగా కౌగిలించుకున్నారు.


"లేదురా … మీ అమ్మలేని లోటు నాకు బాగా కనిపిస్తుంది, తను ఉన్నన్నీ రోజులు ఏనాడు పాపమనలేదు, తిన్నావా పన్నావా అని అడిగినా రోజులేదు, తనకు ఒంట్లో బాగాలేకున్నా నిమిషం కూడా కూర్చోకుండా మనకోసం కష్టపడే మనిషిరా మీ అమ్మా, మీరేమో చిన్నపిల్లలు మీకు చదువు తప్పా ఇంకోపని చేసి ఎరుగరు, నాకా చేయించుకోవటమే గానీ ఇటున్న పుల్ల అటు పెట్టిన పాపానపోలేదు, చూడండి మీ అమ్మ ఉంటే ఇల్లు ఇలా ఉండేదా? సింకునిండా గిన్నెలు… ఎక్కడపడితే అక్కడ బట్టలు ఇవన్ని తను చేసుకునేది, ఆకలితో మాడుతున్నాము ఎలా చేసుకోవాలో తెలియటం లేదు, తనొక్కతి ఇంతమందిని చూసుకుంటే మనం హాయిగా ఉన్నాము, ఇంతమందిమి ఉన్నా తను లేని వెలితి నాకు బాగా తెలుస్తుంది, ఎటు చూసినా తనే నవ్వుతూ కనిపిస్తుంది, నా ఉషలేని ఉషోదయాన్ని చూడలేకపోతున్నాను, "బాధపడుతూ పిల్లలను దగ్గరకు తీసుకున్నాడు ప్రభాకర్. అభం శుభం తెలియని పిల్లలిద్దరు తండ్రిని ఒడిలో గువ్వలుగా ఒదిగిపోయారు. నా ఉష లేకుండా ఇంతభారం నేను మోయగలనా పిల్లలను చూస్తూ అనుకున్నాడు బాధగా.******** ******** సమాప్తం ********* *********


B. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత్రి పరిచయం : B.లక్ష్మి శర్మ (త్రిగుళ్ళ)

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్


47 views2 comments

2 comentarios


Kp J • 16 hours ago

Intrsting story

Me gusta

uma rani • 6 hours ago

nice story moral now a days it's going on same to same

Me gusta
bottom of page