top of page
Writer's pictureKotthapalli Udayababu

వాడే గెలిచాడు!



'Vade Gelichadu' - New Telugu Story Written By Kotthapalli Udayababu 

Published In manatelugukathalu.com On 11/01/2024 

'వాడే గెలిచాడు' తెలుగు కథ

రచన : కొత్తపల్లి ఉదయబాబు 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


నేను సరిగ్గా లోపలికి అడుగు పెట్టేసరికి ధన్వంతరి కోపంతో కోడలిని డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో అంటున్నాడు. తెరవేసి ఉండడంవల్ల నా రాక వాళ్ళు గమనించలేదు. నేను నిశ్శబ్దంగా సోఫాలో కూర్చున్నాను. 


"నా ఖర్మకాలి మీ అత్తగారు చచ్చిపోయిందిగాని.. 70 సంవత్సరాలు నా అడుగులకు మడుగులొత్తి చాకిరీచేసి నానీడలా బ్రతికి చాకిరీ చేసిపెట్టిందమ్మా. ఈవేళ మీ పంచన పడిఉండి బతకడం కోసం తినాల్సివస్తోంది. ఏ జన్మలో ఏ మహాపాపం చేసుకున్నానో.. జీవితపు చివరిదశలో ఇటు స్వంతఇల్లు లేకుండా అటు భార్య లేకుండా బతుకుతున్నాను. ఆనపకాయ పెసరపప్పు వండావు బానే ఉంది. కమ్మని కూరలోకి పుల్లటి వంకాయ పచ్చిపులుసు కాంబినేషన్ లేకపోతే నేను తినలేను అని కూడా నీకు తెలుసు. తెలిసీ మెంతి మజ్జిగ పెట్టావ్. సరే. పెరుగు పోసేయ్. " అన్నాడు ధన్వంతరి. 


నాకు వాళ్ళిద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కనిపిస్తూనే ఉన్నారు. ధన్వంతరి మాటలకి కోడలు కళ్లనీళ్ల పర్యంతమై మౌనంగా కళ్ళు తుడుచుకుని "ఆ మెంతిమజ్జిగ పోసుకోండి మావయ్య గారు.. కడుపు నిండాలి కదా!" అంది రుద్దమైన కంఠంతో. 


" అక్కర్లేదమ్మ కడుపు నిండిపోయింది. పెరుగు పోసేయ్. " అన్నాడు శాసిస్తున్నట్టుగా. 


మరోమార్గంలేక పెరుగు పోసేసి ఆమె వంటింట్లోకి వెళ్లిపోయింది కొంగుతో కళ్ళుతుడుచుకుని. 


ధన్వంతరి భోజనంచేసి వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుని హాల్లోకి వస్తూనే నన్ను చూసి "ఎంత సేపయిందిరా గన్నయ్య.. నువ్వు వచ్చి? " అని అడిగాడు సోఫాలో నా పక్కన కూర్చుంటూ. 


"నీకు అభ్యంతరం లేకపోతే నీతో పది నిమిషాలు మాట్లాడాలి. కింద సెల్లార్ లోకి వెళ్లి అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం వస్తావా?" అన్నాను. 


"అదేమిటో ఇక్కడే చెప్పొచ్చుగా?" అన్నాడు

ధన్వంతరి. 


"నీకు ఇష్టం లేకపోతే అవసరం లేదు. నేను వెళ్ళొస్తాను. " లేవబోయాను. 


"సరే వెళ్దాం పద" అన్నాడు ఝాన్కారంగా. 


ఇద్దరం లిఫ్ట్ లో సెల్లార్ లోకి వచ్చాము. 


మాలాంటి వృద్ధులు అక్కడ విశ్రాంతి తీసుకోవడంకోసం వేయబడి ఉన్న ఫైబర్ కుర్చీల్లో స్థిరంగా కూర్చున్నాం. 


" చెప్పరా ఏం చెప్పదలుచుకున్నావో? " అడిగాడు ధన్వంతరి. 


నేను మొదలు పెట్టాను. 


*******


దాదాపు రెండునెలల తర్వాత నేను సురభి వృద్ధాశ్రమంలో తొలిసారి అడుగుపెట్టాను. 


కేవలం 25 మంది వృద్ధులతో దాదాపు సంవత్సరం క్రితం ప్రారంభించబడిన ఆ వృద్ధాశ్రమం గేటుదాటి లోపలికి అడుగుపెడుతూనే కనిపిస్తున్న పచ్చని చక్కని వాతావరణానికి మనసు పులికించిపోయింది. ఒకపక్క చిన్న చిన్న అందమైన మడులలోని ఎదుగుతున్న ఆకుకూరల మొక్కలన్నీ గలగల కబుర్లు చెప్పుకుంటూ నన్ను ఆహ్వానిస్తున్నట్టుగా అనిపించింది. 


మరోపక్క పాదులన్నీ పందిళ్ళ పైకి ఎగబాకి, పువ్వులతో పిందెలతో కాయలతో అలరారుతున్నాయి. ప్రహరీగేటుకి రెండు పక్కల దైవపూజకు పనికివచ్చే పూలమొక్కలన్నీ కూడా చక్కగా కుదుళ్ళలో కూర్చున్నట్టుగా నిలబడి రేపటికి విరబూయడంకోసం అన్నట్టు మొగ్గలతో నిండి ఉన్నాయి. 


నేను ఆఫీసురూంలోకి అడుగుపెడుతూనే "ఎవరు కావాలండి? " అన్న ప్రశ్నకు తలెత్తాను. 


అడిగింది ఎవరో కాదు ధన్వంతరి. 


"ఓర్నీ నువ్వా ఇన్నాళ్ళకి కనిపించానేమిట్రా? "అడిగాడు ధన్వంతరి. 


"ముందు నువ్వు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాను అని చెప్పరా. " అన్నాను ధన్వంతరి చేతులు పట్టుకొని. 


ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడదలచుకుంటే ఒక్క క్షణం ఇక్కడ ఉండొద్దు. వెళ్ళిపో. నన్ను నిష్టూరంగా మాట్లాడి నా కొడుకు ఇంట్లోంచి ఇక్కడికి గెంటేసింది నువ్వు. ఇక్కడ నా బ్రతుకు నేను ప్రశాంతంగా బతుకుతుంటే వచ్చి క్షమాపణ అడుగుతున్నావా.. సిగ్గులేదు? అలాంటి మాటలు మాట్లాడను అంటే ఇక్కడ ఉండు. కాసేపు కబుర్లు చెప్పుకుందాం. లేదా నీ దారిన వెళ్లిపోవచ్చు. " అన్నాడు నా చేతులు విదిలించుకొని. 


వాడి కోపం, నిటారుతనం, ముక్కుసూటితనం తెలిసిన నేను మాట్లాడకుండా వాడి ముందు కుర్చీలో కూలబడ్డాను. 


"రెండో మనవడు మంచి ఉద్యోగంలో స్థిరపడలేదురా. చాలీచాలని జీతంతో లాక్కొస్తున్నాడు. పైగా ప్రేమపెళ్లి చేసుకున్నాడు. మొదట ఒక అమ్మాయి. ఇప్పుడు మళ్లీ రెండోసారి అమ్మాయికి నెలలు నిండాయి. అమ్మాయికి కొంచెం పొదుపు తక్కువ. వాడికి నేనంటే చాలా అభిమానం. దాంతో వాడి దగ్గర ఉండి వాడికి డబ్బు సాయంచేసినట్టు ఉంటుందని వెళ్లాను. ఈసారి అబ్బాయి పుట్టాడు. పురిటి నీళ్లయ్యాక నిన్ననే తిరిగివచ్చేసాను. "


దానికి ధన్వంతరి చాలా తేలిగ్గా నవ్వేస్తూ.. 

వచ్చేనెలలో మా ఆశ్రమం ప్రథమ వార్షికోత్సవంరా. దానికి చక్కటి నాటికను వేయిస్తున్నాను మా వాళ్ళ చేత. రిహార్సల్స్ చేస్తున్నాం. వీలైతే సరదాగా వచ్చి చూడు. " అని నా సమాధానంకోసం చూడకుండా విశాలమైన హాల్లోకి నడిచాడు ధన్వంతరి. 


"ఏంటి ఇక్కడ కూడా మొదలెట్టేసావా?.. ఈ వయసులో వాళ్ళని సుఖంగా ఉండనివ్వకుండా నీ పైత్యాలన్నీ వాళ్ళమీద రుద్దితే వాళ్లు భరించగలరా? "


ఆ ప్రశ్న నన్ను అడగాల్సింది కాదు. వాళ్ళని అడిగి సమాధానం తెలుసుకో " అన్న ధన్వంతరి " డియర్ ఫ్రెండ్స్ అంతా సిద్ధంగా ఉన్నారా? " అని ఆ హాలుచుట్టూ ఉన్న గదులలోకి వినిపించేలా అరిచాడు. 

అక్కడ ఉన్న ఒక కుర్చీలో కూలబడ్డాను నేను. 


వెంటనే ఇద్దరు స్త్రీమూర్తులు, నలుగురు మగవాళ్ళు.. మొత్తం పదిమందిదాకా తమ తమ గదుల్లోంచి నాటకం తాలూకు తమ పోర్షన్ల పేపర్లతో కాబోలు బయటికి వచ్చారు. 


"మేమంతా రెడీ అన్నయ్య గారు" అన్నారు. 


" అమ్మ! అందరికీ పోర్షన్లు వచ్చేసాయి కదా. అందరమూ కూర్చుని సిటింగ్ రిహార్సల్స్ వేద్దాము. ఆ తర్వాత ఓపిక ఉంటే నిలబడి మొదటి భాగం నటిద్దాం. సరేనా? " అన్నాడు ధన్వంతరి. 


పనిచేసే అమ్మాయిచేత కుర్చీలు చుట్టూరా వేయించి వాటిలో వారందరినీ కూర్చోమని చెప్పి నాటకంలోని మొదటి దృశ్యంలోని సంభాషణల్ని వారందరి చేత స్పష్టంగా, భావయుక్తంగా పలికించాడు ధన్వంతరి. 70, 90 వయసుల మధ్యఉన్న ఆరుగురు పాత్రధారులు అతను ఏ విధంగా చెప్పాడో అలాగే, ఏమాత్రం అలసటకులోను కాకుండా పలికినతీరు నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. 

ధన్వంతరి ప్రదర్శిస్తున్న అంకితభావం చూస్తే నాకు ఒళ్ళు గగుర్పొడిచింది. కళ్ళు అక్కడ జరిగే దృశ్యాన్ని యాదృచ్ఛికంగా చూస్తున్నా నాఆలోచనలు ఒక్కసారి గతంలోకిమళ్లాయి. 


*****


ధన్వంతరి, నేను ఆంధ్రాలోని రాజోలు అనే ఒకే ఊరికి చెందినవాళ్ళు. నేను ఉదయంపూట పుడితే, సాయంత్రం వాడు పుట్టాడు. పైగా మా ఇద్దరిమధ్య తాత ముత్తాతల సంబంధాలు ఉన్నాయి. ఆవిధంగా మేమిద్దరం బంధువులం. డిగ్రీవరకు కలిసి చదువుకున్నాం. వాడు పోస్ట్మాస్టర్ గా, నేను తెలుగు ఉపాధ్యాయుడిగా సర్వీసులు పూర్తిచేసి 38 సంవత్సరాలు అయింది. 


ధన్వంతరి భార్య పద్మ.. మా తాతగారి మనవరాలే. చదువుకున్నది ఐదో తరగతి అయినా నిజమైన భారతీయ గృహిణికి ప్రతిరూపంగా ఉండేది ఆమె. ధన్వంతరి నాన్నమ్మది నిప్పు కడిగే ఆచారం. అదే ఆచారపు బాటలో ధన్వంతరి తల్లి, భార్య కూడా నడిచారు. బామ్మ పెంపకంలో పెరిగిన ధన్వంతరి క్రమశిక్షణకు మారుపేరు. ఏ విషయంలోనూ 30 సెకండ్ల మించి ఆలస్యం కావడం అతనికి ఇష్టం ఉండేది కాదు. దాంతో చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు మనిషి మీదకు విసిరేసేవాడు ధన్వంతరి అని చెప్పుకునేవారు. అటువంటి భర్తతో 70 సంవత్సరాలు కాపురం చేయగలిగిందంటే ఆమె ఎంతటి ఉత్తమ భారత స్త్రీయో మనకు అర్థంఅవుతుంది. 


ముని మనవలనుకూడా ఎత్తిన ఆమె గుండెపోటుతో 84 ఏళ్ళ వయసులో మరణించింది. అతని ఇద్దరు కొడుకులు, కోడళ్ళు అదే క్రమశిక్షణని అతనిపట్ల పాటిస్తూ సేవచేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇతనికోసం తమ జీవితంలో సుఖసంతోషాలని వాళ్ళు కోల్పోయారనే చెప్పాలి. 

ఒక తీర్థయాత్ర కానీ, పుణ్యక్షేత్ర దర్శనంగానీ, కనీసం పండుగనాడు గుడికి కూడా వెళ్లలేనంత అదుపులో పెట్టాడు ధన్వంతరి కోడళ్ళని. 


నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఒక రెండుసార్లు వాళ్ళు తమబాధ నాతో మొరపెట్టుకున్నారు. భోజనంలో పదార్థాలన్నీ కాంబినేషన్స్ తో ఉండాలి. ఏమాత్రం పదార్థాల రుచి, అన్నం పదును తగ్గకూడదు. పండుగనాడు పిండి వంటల్లో రకరకాలు ఉండాలి. గారెలు వండితే వాటితోపాటు పెరుగు ఆవడలు, కొత్తిమీర గారె, అల్లం గారె, 

కారంగారె, వాటిలోకి మళ్ళీ బెల్లంపొడుము.. వేడివేడి బూరెల్లోకి, కరిగించిన నెయ్యి.. యిలా. 


అనపకాయ పెసరపప్పులోకి మ్యాచింగ్ పులుసు చేయలేదని కోడల్ని విసుక్కున్ననాడు కింద సెల్లార్ లోకి తీసుకువెళ్లి 'నేనేం మాట్లాడినా వినాలి తప్ప ఒక్క సమాధానం కూడా చెప్పకూడదు' అని ముందుగా మాట తీసుకుని కొడుకు కోడళ్ళ పట్ల అతని ప్రవర్తనని కడిగికడిగి పారేసాను. 


" ఒరేయ్.. ధన. 96 ఏళ్ళు వచ్చినా నీ సుఖం కోసం నువ్వు బతకడం కాదురా.. నీ కొడుకుల్ని కోడళ్ళని వాళ్ళకోసం వాళ్ళని స్వేచ్ఛగా బ్రతకని. నీకు ఓపిక ఉంటే వాళ్లకి అలా బ్రతికే శ్రమ నీవల్ల తప్పించు. అంతేగాని క్రమశిక్షణ పేరుతో వాళ్లని నరకయాతనపెట్టి, వాళ్ళ జీవితానందాన్ని నాశనం చేసే హక్కు నీకు లేదు. ' పెన్షన్ వాళ్లకి ఇచ్చే తింటున్నానుగా' అని నువ్వు అనొచ్చు. నీ పెన్షన్ అంతా ఇచ్చినా, కేవలం నీసుఖంకోసం బతికే నిన్ను ఇంకొకరు అయితే ఏ మాత్రం ఆదరించరు. నీకు సిగ్గు, శరం, మానం అభిమానం ఏమాత్రం ఉన్న తక్షణం ఇంట్లోంచి వెళ్లిపోయి ఏదైనా వృద్ధాశ్రమంలో చేరి నీ పిల్లలు సుఖంగా బ్రతుకే బతుకు కల్పించు. వాళ్ళమానాన వాళ్ళని బ్రతకనివ్వు. అది చేతకాకపోతే చచ్చిపో " అని వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు తాను. ఆ మాటలు ధన్వంతరి మీద ఎలా పనిచేసాయోగానీ ఇవాళ వృద్ధాశ్రమంలో బ్రతుకుతున్నాడు.. అదీ తాను బ్రతుకుతూ తనకిష్టమైన కళలో పదిమందిని బతికిస్తూ. 


చుట్టుపక్కల మిగతా వృద్ధుల కరతాళధ్వనులతో ఈ లోకంలోకి వచ్చిన నేను నిశ్శబ్దంగా బయటికి వచ్చేసాను. 


*******


"96 ఏళ్ల వయసులో తాను నివసిస్తున్న వృద్ధాశ్రమంలోని వృద్ధుఅందరికి మార్గదర్శిగా, పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్న ధన్వంతరి మాస్టారు " అన్న మకుటంతో ధన్వంతరి ఉంటున్న వృద్ధాశ్రమం యొక్క కార్యకలాపాలు, విధి విధానాలు రాష్ట్రంలోని ప్రతి వృద్ధాశ్రమానికి ఆదర్శమని అందుకు కారణభూతుడైన ధన్వంతరిగారికి రాజకీయ నాయకులు, సాంఘిక సేవా తత్పరులు, పలు స్వచ్ఛంద సంస్థలు.. ప్రశంసల వర్షం కురిపించిన వార్తాపత్రిక మీద రాలిన నా ఆనందభాష్పాలను చేత్తో తడుముతూ

"నువ్వే గెలిచావురా ధనా" అనుకున్నాను సగర్వంగా!


సమాప్తం

కొత్తపల్లి ఉదయబాబు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం 


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు : కొత్తపల్లి ఉదయబాబు పుట్టిన తేదీ : 01/07/1957 విద్యార్హతలు : M.Sc., M.Ed., M.phil (maths) నిర్వహించిన వృత్తి : ప్రధానోపాధ్యాయులు


తల్లి తండ్రులు : శ్రీ కొత్తపల్లి గంగాధర్ శర్మ, విశ్రాంత హెడ్ పోస్ట్-మాస్టర్ స్వర్గీయ శ్రీమతి సుబ్బలక్ష్మి. భార్య : శ్రీమతి సూర్యకుమారి కుమార్తె : చి. సౌ. గుడాల సుబ్బ లక్ష్మి సంతోషిత , M.B.A. w/o లక్ష్మికాంత్ – లాయర్ మనుమరాలు : చి. లక్ష్మి పూర్ణ సాధ్వి కుమారుడు : చి. హనుమ గంగాధర్ శర్మ , సాఫ్ట్-వేర్, h/o చి.సౌ.తేజశ్రీ మనుమలు : చిరంజీవులు గహన్ ముకుంద, ఋషిక్ వశిష్ట.

*వృత్తి పరంగా :

*జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల పోటీలలో వివిధ అంశాలలో బహుమతులు, క్విజ్,సాంకేశృతిక కార్యక్రమాల నిర్వహణ, న్యాయ నిర్ణేతగా వ్యవహిరించిన అనుభవం.

*పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2002 లో తొలిసారిగా ఐదుగురు విద్యార్థులకు నూటికి నూరు మార్కులు రావడం ఆ సందర్భంగా అరకాసు ఉంగరం బహుమతిగా అందుకోవడం ఒక చక్కని ప్రోత్సాహం, ఉత్సాహం. అలా మొత్తం సర్వీసులో నూటికి నూరు మార్కులు దాదాపు తొంభై మందికి పైగా విద్యార్థులు పొందగలగడం వృత్తిపరంగా సంతృప్తిని కలిగించిన విషయం.

*జిల్లా స్థాయిలో అధికారికంగా నిర్వహించిన భౌతిక శాస్త్ర,గణిత శాస్త్ర సదస్సులకు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించడం.

*జిల్లా ఉమ్మడి పరీక్షల సంస్థకు అయిదు సంవత్సరాలపాటు ఎక్కువమంది విద్యార్హులు గణితంలో ఉత్తీరర్ణతాశాతం పొందదానికి అవసరమైన విజయ సూచిక, విజయ సోపానాలు... పుస్తకాలను ప్రభుత్వం తరపున రూపొందించుటలో ''గణిత ప్రవీణుడు''గా వ్యవహరించడం.

*ఆకాశవాణిలో కథానికలు, నాటికల ప్రసారం,అవగాహనా సదస్సులలో పాల్గొనడం, రేడియో నాటక కళాకారునిగా మూడు సంవత్సరాలు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పాల్గొనడం..మొదలైనవి


ప్రవృత్తి పరంగా :

*కథా రచయితగా రచనలు :

1. అందమైన తీగకు...! - 25 కధల మాలిక (2003) 2. చిగురు పిట్టలు* - నానీల సంపుటి (2007) 3. ఉదయబాబు మాస్టారి' కధానికలు - ఉదయకిరణాలు (2015) 4. అమ్మతనం సాక్షిగా... కవితా సంపుటి (2015) 5. నాన్నకో బహుమతి - 16 కథల సమాహారం (2019-.) జీ.వి.ఆర్. కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన కథాసంపుటుల పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన కథల సంపుటి) 6. ఆయన మా నాన్నగారు ( దీర్ఘ కవిత - త్వరలో )

నవలలు : 1 . లేడీ సింగర్ (2 భాగాలు )

                  2 . మనసు చేసిన న్యాయం(ప్రతిలిపి వారు మార్చి 2202 లో నిర్వహించిన ధారావాహికల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందినది)

ప్రేరణ : నాన్నగారు...ఆయన నాటక రచయిత,దర్శకుడు,ఉత్తమ నటుడు(18 నాటక పరిషత్తులలో)

  *సామాజిక సేవ : రక్తదాన కార్యక్రమం లో, లయన్స్ క్లబ్ వారి కార్యక్రమాలలో విరివిగ పాల్గొనడం .

తెలుగు సాహిత్యానికి సేవ : తెలుగు సాహితీ సమాఖ్య లో కార్యకర్తగా, సంయుక్త కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా తెలుగు సాహిత్యానికి విశేష కృషి , జిల్లా స్థాయిలో ర్యాలీల నిర్వహణ ...అష్టావధానం, త్రీభాషా శతావధానం లలో పృచ్చకునిగా 46 సంవత్సరాలపాటు ప్రతీ నెల సాహితీ స్రష్టల ప్రసంగాలు...విద్యార్హులకు వివిధములైన పోటీల నిర్వహణ,

పత్రికా రంగం లో : వ్యంగ్య చిత్రకళ లో పలు కార్టూన్లు వేయడం. :*1999 - జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు - పశ్చిమ గోదావరి జిల్లా*

 2000 - యువసాహితీ సహస్రాబ్ది అవార్డు - ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్య 2011 - సోమేపల్లి సాహితీ పురస్కారం 2016 - గోదావరి మాత అవార్డు - ఉంగుటూరు ఎం.ఎల్.ఎ, శ్రీ గన్ని వీరంజనేయులుగారి చే- గణపవరం - పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎం.ఎల్.ఎ. శ్రీ వి.వెంకట శివరామరాజు గారి చే ''ఉగాది పురస్కారం*

పాలకొల్లు - కళాలయ సంస్థవారిచే " కధాభారతి" బిరుదు ప్రదానం.

*జన విజ్ఞానవేదిక - భీమవరం వారిచే " ఉగాది పురస్కారం" ....సుమారు నూటికి పైగా సన్మానాలు సత్కారాలు...ఇంకా ఎన్నో..

Youtube :1. తెలుగు కథను ప్రపంచ వ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం "Mastaru Kadhalu 'in' Telugu " ఛానెల్ ద్వారా నా కథలతో పాటు దాదాపు 25 మంది రచయితల కథలు (ఈనాటికి 420 కధల ఆడియో వీడియోలు)చదివి వీడియోలుగా మలుస్తూ ఉచిత సేవగా అందించడం జరుగుతోంది.

2.KUBDevotionalWorld అనే ఛానల్ ద్వారా శ్రీ భగవద్గీత 700 శ్లోకాలను ప్రతీరోజు 5 శ్లోకాలను భావాలతో సహా వీడియోలుగా చదివి అందించడం జరుగుతోంది.

3. UDAYABABUMathsBasics యు ట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు గణితంలో మౌలిక భావనల బోధన

ప్రస్తుత నివాసం : 2010 లో సికింద్రాబాద్ సైనిక్ పురి లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఇప్పటికీ కధా రచయితగా, బాలల కథారచయితగా కొనసాగడం.

చివరగా నా అభిప్రాయం :

ఇప్పటికీ నా కవితా ప్రస్తానం, కధా సాహితీ సేద్యం కొనసాగుతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం లో చెట్టు నాకు ఆదర్శం.

కవిగా రచయితగా తమ సాహితీ ప్రస్తానం కొనసాగిన్చాదలుచుకున్న యువత అంతా పాత సాహిత్యాన్ని బాగా చదవాలి. 'వెయ్యి పేజీలు చదివి ఒక్క పేజీ రాయి' అన్న ఒక మహాకవి వాక్యాలు స్పూర్తిగా తీసుకుని నిన్నటి రచన కన్నా, నేటిది, నేటి రచన కన్నా రేపటిది మరింత మెరుగుపరచుకుని ఈ రంగం లో తమకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పరచుకోవాలని, ఆ దిశగా వారి సాహితీ ప్రస్తానం కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ...సాహిత్యాభినందనలు.

కొత్తపల్లి ఉదయబాబు

సికింద్రాబాద్








42 views1 comment

1 Comment


Dr Rao S Vummethala

1 hour ago

👏👏👍👍👌👌🌷🙏

Like
bottom of page