వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)
'Vandematharam' - New Telugu Story Written By Gannavarapu Narasimha Murthy
Published In manatelugukathalu.com On 03/01/2024
'వందేమాతరం' తెలుగు కథ
రచన: గన్నవరపు నరసింహ మూర్తి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"ఏంట్రా! నీ కొడుకు గాంధీని మిలట్రీకి పంపిస్తావా? నీకేం పిచ్చా! మిలట్రీ కెళ్ళినవాళ్ళు తిరిగి రారంటారు.. తెలిసే ఈ పని చేస్తునావా?" అని తిలక్‌ని ప్రశ్నించాడు అతని స్నేహితుడు కామేశం.
"తెలిసే పంపిస్తునానురా .. నేను పొట్టిగా ఉండడం వల్ల మిలట్రీకి ఎంపిక కాలేదు కానీ లేకపోతే ఈపాటికి యుద్ధంలో పాల్గొని ఆ పాకిస్తాన్ వాళ్ళను సరిహద్దు నుంచి తరిమికొట్టేవాడిని. కానీ నాకా అదృష్టం దక్కలేదు. నేను ఎంపిక కాలేదని తెలిసిన రోజు నుంచి ఈ రోజు దాకా నేను బాధపడని క్షణం లేదు. ఎంతో అదృష్ట ఉంటే గాని సైన్యంలో పనిచేసి దేశానికి సేవ చేసే అవకాశం కలగదు. నాకా అదృష్టం ఎలాగు దక్కలేదు. కనీసం నా కొడుక్కైనా దేశానికి సేవ చేసే అదృష్టం దక్కితే అంత కన్నా గొప్ప విషయం నాకింకేమీ ఉండదు. అందుకే వాణ్ణి మిలట్రీ సెలక్షన్‌కి పంపిస్తున్నాను. అందులో వాడు ఎంపిక అయ్యేటట్లు చూడమని మన భరత మాతని వేడుకుంటున్నాను" అన్నాడు తిలక్ ఆవేశంగా...
దేశం అంటే చాలు తిలక్ దేశభక్తితో ఊగిపోతాడు. ఆవేశంతో ప్రసంగిస్తాడు. అతని నరనరాన దేశభక్తి పొంగుతుంటుంది.
తిలక్‌ది మొదట్నుంచీ దేశభక్తుల కుటుంబం. అతని తాత పేరు సుభాష్ చంద్ర... అతను గాంధీ పిలుపు మేరకు బ్రిటిష్ ప్రభుత్వంలోని ఉద్యోగాన్ని మానేసి క్విట్ ఇండియా ఉద్యమంలో చేరిపోయాడు. అలా చేరినవాడు స్వాతంత్రం వచ్చేదాకా గాంధీ గారితో కలసి ఉద్యమాలు చేసాడు. అతని కొడుకు సీతారామ్... అప్పట్లో బ్రిటిష్ వారికి ఎదురొడ్డి పోరాడిన అల్లూరి సీతారామరాజు పేరు కొడుక్కి పెట్టుకున్నాడు సుభాష్ చంద్ర. సుభాష్ చంద్రకు 55 ఏళ్ళ వయసుప్పుడు సీతారామ్‌కి కొడుకు పుడితే మనవడికి స్వాతంత్ర సమరయోధుడైన బాలగంగాధర్ తిలక్ పేరు పెట్టాడు సుభాష్ చంద్ర...
ఏ ముహుర్తాన సుభాష్ చంద్ర అతనికి తిలక్ అన్న పేరు పెట్టాడో కానీ చిన్నప్పట్నుంచే తిలక్‌కి దేశమంటే గొప్పభక్తి... దేశభక్తిని తన తాత నుంచి వారసత్వంగా తీసుకున్న తిలక్ డిగ్రీ చదివిన తరువాత మిలట్రీలో చేరదామని సెలక్షన్‌కి వెళితే సైన్యానికి ఎంపిక కాకుండా అతని పొట్టితనం అడ్డు పడింది.
ఆరోజు అతను చాలా విచారించాడు. దేశానికి సేవ చేసే తన తాత వారసత్వాన్ని సైనికుడి రూపంలో కొనసాగించాలనే కోరిక తీరకపోవటంతో దిగులు చెంది చాలా రోజులు మౌనంగా రోదించాడు.
కానీ అనుకోని వరంలా ఆ సమయంలో అతనికి ఇద్దరు కొడుకులు కలిగారు. వాళ్ళని చూసిన తరువాత తిలక్‌లో మళ్ళీ దేశభక్తి కోరిక చిగురించసాగింది. కొడుకులకు గాంధీ, భరత్ అని పేర్లు పెట్టి వాళ్ళకి చిన్నప్పట్నుంచీ దేశభక్తిని నూరిపోసాడు. వాళ్ళు బాగా చదువుకొని డిగ్రి కొచ్చారు. ఆ సమయంలో నాలుగేళ్ళ నుంచి మిలట్రీలో సెలక్షన్స్ జరగకపోవడం వల్ల కొడుకులను మిలట్రీకి పంపాలనే ఆలోచనకి తాత్కాలికంగా స్వస్తి చెప్పాడు తిలక్... కాని అదృష్టవశాత్తూ పెద్ద కొడుకు గాంధీ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా సైన్యంలో చేరాలనే ప్రకటన వెలువడడంతో తిలక్ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.
వెంటనే పెద్దవాడు గాంధీని తనే స్వయంగా ఆ సెలక్షన్ కోసం విశాఖపట్నం తీసికెళ్ళాడు. అదృష్టవశాత్తూ గాంధీ అందులో ఎంపికయ్యాడు.
ఆ రోజు తిలక్ పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. ఊరందరికీ మిఠాయిలు పంచిపెట్టాడు... వారం తరువాత గాంధీని విశాఖపట్నం తీసికెళ్ళి దగ్గరుండి రైలు ఎక్కించాడు. శిక్షణ పూర్తైన తరువాత గాంధీని కాశ్మీర్ రెజిమెంట్‌కి కేటాయించారు.
గాంధీ సైన్యంలో చేరిన సంవత్సరం తరువాత పాకిస్తాన్ దుశ్చర్యల వల్ల కార్గిల్ యుద్ధం మొదలైంది. తిలక్ తన కొడుకు మొదటిసారిగా దేశం కోసం యుద్ధంలో పాల్గొంటున్నందుకు ఎంతో సంతోషించి పాకిస్తాన్ శత్రు సైనికుల్ని తరిమి తరిమి కొట్టి దేశానికి విజయం తేవాలసిందిగా కోరుతూ కొడుక్కి ఉత్తరం రాసాడు; యుద్ధం ప్రారంభమైన మూడు రోజుల తరువాత గాంధీ పనిచేస్తున్న రెజిమెంట్ టైగర్ హిల్‌ని స్వాధీనం చేసుకుంటున్న సమయంలో జరిగిన ఎదురుకాల్పులో గాంధీ ప్రాణాలు కోల్పోయాడు. దేశం కోసం ప్రాణాలనర్పించిన అమర వీరులను దేశం వేనోళ్ళ కీర్తించింది. అతను చనిపోయిన మర్నాడు అతని పార్థివ దేహాన్ని స్వంత ఊరు తీసుకు వచ్చారు. తిలక్ అచేతనంగా ఉన్న కొడుకుని చూసి కన్నీరు కార్చాడు. దేశం కోసం తన కొడుకు అమరుడైనందుకు గర్వపడ్డాడు...
ఆ యుద్ధంలో భారత్ గెలిచింది. కానీ ఆ విజయంలో తన కొడుకు పాలు పంచుకోనందుకు తిలక్ విచారించాడు.
ఆరునెలల తరువాత మళ్ళీ సైన్యం సెలక్షన్స్ ప్రకటించింది. తిలక్ రెండవ కొడుకు భరత్‌ని కూడా సైన్యంలో చేరమని చెప్పడంతో ఊరి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అతని స్నేహితుడు కామేశం "పెద్ద కొడుకు గాంధీ ఎలాగూ దేశం కోసం తన ప్రాణాలనర్పించాడు. కనీసం ఈ రెండవ కొడుకు భరత్‌నైనా నీ దగ్గర ఉంచుకో.. నీ వృద్ధాప్యంలో పనికొస్తాడు. సైన్యంలో ఉద్యోగమంటే ఎప్పుడేమేతుందో ఎవ్వరూ చెప్పలేరు. కాబట్టి నా మాట విని వాడిని మిలట్రీకి పంపొద్దు" అని చిలక్కి చెప్పినట్లు చెప్పాడు.
అందుకు తిలక్ నిర్వేదంగా "కాముడూ! నేను ఆ రోజు బాధపడింది నా కొడుకు చనిపోయాడని కాదురా... వాడు మన దేశ విజయాన్ని చూడకుండా చనిపోయినందుకు బాధపడ్దాను.
"జాతస్యహి ధృవో మృత్యుహు !
ధృవం జన్మ మృతస్యచ!"
పుట్టిన వాడు గతించక తప్పదు. కానీ దేశమాత కోసం పోరాడి చనిపోతే అంతకన్నా గొప్పపని ఇంకొకటుండదు... ఆనాడు జాతిపిత గాంధీ దేశమాత శృంఖాలాలను విడిపించటానికి పోరాడితే, నా కొడుకు గాంధీ దేశమాతని రక్షించడం కోసం అసువులు బాసేడు. అందుకు నేను గర్వపడ్డాను కానీ ఇసుమంతైనా బాధపడలేదు... ఇప్పుడు నా రెండో కొడుకు భరత్‌ని మళ్ళీ సైన్యంలోకి ఎందుకు పంపిస్తున్నానో తెలుసా? పెద్ద వాడు చూడని విజయాన్ని వీడు చూడాలన్న కోరికతో... తన కోరికను తమ్ముడు భరత్ తీరిస్తే గాంధీ ఆత్మ శాంతిస్తుంది... దేశం కోసం ప్రాణాలర్పిస్తే గర్విస్తాను కానీ భాధపడను.... ఆనాడు వేలాదిమంది ప్రాణత్యాగం చెయ్యబట్టే దేశానికి స్వాతంత్రం వచ్చి మనం ఈనాడు స్వేచ్ఛగా హాయిగా జీవిస్తున్నాము. కొందరు త్యాగం చేస్తేనే మన భరత జాతి తద్వారా మన దేశం గర్వంగా తలఎత్తుకో గలుగుతుంది" అన్నాడు ఆవేశంగా తిలక్.
అతని మాటలకు కామేశం ఆశ్చర్యపోయాడు. అటువంటి గొప్ప వ్యక్తి తనకు స్నేహితుడిగా లభించినందుకు గర్వపడ్డాడు.
ఆ తరువాత భరత్ కూడా సైన్యంలో ఎంపికై లఢక్ రెజిమెంట్‌కి కేటాయించబడ్డాడు. అతను చేరిన సంవత్సరానికి పాకిస్తాన్ మళ్ళీ మనదేశంలో బంకర్లని అక్రమంగా నిర్మించడంతో వాటిని నాశనం చెయ్యడానికి మళ్ళీ యుద్ధం అనివార్యమైంది.
ఈ వార్త తెలిసీ తిలక్ తనన కోరిక తీరబోతున్నందుకు ఆనందపడ్డాడు.
యుద్ధం మొదలైంది. టీవిల్లోనూ, పేపర్లలోనూ యుద్ధ వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ రెండు వందల మంది సైనికులను కోల్పోయినట్లు, భారత్ సైనికులు అతి కొద్దిమందే చనిపోయినట్లు వార్తలు వచ్చేయి. తిలక్ రోజూ భరత్ నుంచి వచ్చే ఫోన్ కోసం ఎదురు చూస్తునాడు. వారం రోజులైంది. పాకిస్తాన్ సైన్యం తోకముడిచిందనీ, పాకిస్తాన్ నిర్మించిన బంకర్ల నన్నింటినీ భారత సైన్యం నాశనం చేసిందనీ, రక్షణ మంత్రి ప్రకటించారు. పాకిస్థాన్ని ఓడించి, దేశానికి విజయాన్ని తెచ్చినందుకు ప్రధానమంత్రి సైన్యాన్ని ప్రశంసించారు.
తిలక్కి భారత్ సైన్యం గెలిచినందుకు ఆనందం కలిగినా కొడుకు భరత్ ఆచూకీ తెలియక పోవడంతో ఆందోళన చెందసాగాడు. అతనికెందుకో కొడుకు విజయంతో తిరిగి వస్తాడనిపిస్తోంది.
ఆ ఆలోచన రాగానే రోజూ అతను ఏటి దగ్గరికి వెళ్ళి అవతలి రేవు నుంచి వచ్చే పడవలను చూస్తూ ఉండేవాడు. ఆ ఊరికి రావాలంటే ఎవరైనా పడవలో ఏరును దాటి రావలసిందే... కొడుకు వెళ్ళినపుడూ కూడా పడవ ఎక్కి అవతలి ఒడ్డుకి వెళ్ళాడు. ఇప్పుడు అదే పడవలో అవతల ఒడ్డు నుంచి ఇవతలి రేవుకి వస్తాడని అతని ఆశ... అలా రోజూ ఉదయాన్న రేవుకొళ్ళి సాయంత్రం దాకా ఎదురు చూస్తూ రాకపోయే సరికి నిరాశతో వెనక్కి వచ్చేవాడు.
వారం గడిచింది. భరత్ రాలేదు. రాను రాను అతనింక రాడేమోనన్న నిరాశ తిలక్‌లో పెరుగుతోంది.
అయినా మొక్కవోని ధైర్యంతో ఆ రోజు కూడా ఏటి రేవు దగ్గరకు వెళ్ళి అవతల ఒడ్డు వైపు చూస్తూ నిలబడ్డాడు. సమయం గడుస్తోంది. ఒక్కొక్కొ పడవ ఇవతలి ఒడ్డుకి తిరిగి వస్తున్నాయి కానీ భరత్ జాడలేదు. అవతల రేవు నుంచి పడవ తెరచాప కనిపించగానే తిలక్ కళ్ళల్లో ఆశ... అది ఒడ్డుకి రాగానే అతని కళ్ళు భరత్ కోసం వెతుకుతునాయి. అతను లేకపోయేసరికి మళ్ళీ నిరాశ...
రాను రాను అతనిలో నిరాశ పెరిగిపోతోంది. ఈ సారి భరత్ రాకపోతే ఏం చెయ్యాలి? అప్పుడు ఊళ్ళో వాళ్ళ సూటీపోటీ మాటలకు తట్టుకొని తను నిలబడగలడా? అప్పుడు తనకి మరణమే శరణ్యం... ఆ సమయంలో అతనికి గురజాడ రాసిన
"దేశమును ప్రేమించు మన్న
మంచి అన్నది పెంచుమన్న"అన్న గేయం గుర్తుకు రాసాగింది.
మిట్ట మధ్యాహ్నం అవుతోంది. సూర్యుడు తూరుపు నుంచి పడమరకి మరలి పోతున్నాడు.. ఇంక కొద్డి గంటల్లో అస్తమించబోతాడు. ఈ రోజు భరత్ రాకపోతే తను కూడా అస్తమించక తప్పదు. అయినా అతనిలో ఎక్కడో ఆశ మిణుకు మిణుకు మంటోంది.
రాను రాను సమయం గడిచిపోతోంది. రెండు గంటలైంది కానీ ఒక్క పడవా రాలేదు. అవతల ఒడ్డు నిర్మానుష్యంగా కనిపిస్తోంది. పడవ రావటం లేదంటే ఎవ్వరూ రేవు దగ్గరకు రాలేదన్న మాట... ఇంకో గంటలో సూర్యాస్తమయం అయిపోతుంది. చీకటి ప్రవేశిస్తుంది. తన జీవితంలో కూడా... ఆలోచిస్తూ అవతల రేవు పైకి చూస్తున్నాడు..
అతని కళ్ళు ఉదయం నుంచి తీక్షణంగా అటు వైపే చూస్తుండటంతో మసక బారాయి.. స్పష్టత లోపిస్తోంది. అయినా అతను దృష్టి మరల్చలేదు....
క్షణాలు భారంగా గడుస్తున్నాయి. "ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి!ఎప్పుడు కోల్పోవద్దురా ఓటమి" అన్న వాక్యాలు గుర్తుకు వచ్చి తిలక్ ధైర్యం తెచ్చుకున్నాడు. ఏట్లో దిగి చల్లటి నీళ్ళతో కళ్ళనీ, ముఖాన్ని కడుకున్నాడు. ఇప్పుడతనికి చల్లగా, హాయిగా, ప్రశాంతంగా ఉంది... అతనిలో ఎక్కడలేని శక్తి వచ్చింది. మళ్ళీ ఒడ్డెక్కి అవతలి రేవు వైపు చూసాడు...
ఒక్కసారిగా అతను ఎలర్టయ్యాడు. దూరం నుంచి గాలికి ఊగుతూ తెరచాప కనిపిస్తోంది. దాని వెనకాల కాషాయి వర్ణం కనిపిస్తోంది. అతను కళ్ళు నులుముకున్నాడు. ఇప్పుడు తెరచాప మరింత స్పష్టంగా కనిపిస్తోంది. కొద్ది నిముషాల తరువాత పడవ ఇటు వైపు వస్తూ కనిపించసాగింది.
తిలక్‌లో ఒక్కసారిగా ఉద్విగ్నత !ఆ పడవ త్వరగా వస్తే బాగుండననిపిస్తోంది. తీరం వెంబడి చల్లటి గాలులు వీస్తున్నాయి. ఆ గాలికి పడవ ఊగుతూ వస్తోంది...
ఇప్పుడది రేవుకి మరింత దగ్గరగా వచ్చింది. గాలికి ఊగుతున్న తెల్లటి తెరచాప, దాని వెనుక మన దేశ జెండా రెపరెపలాడుతూ కనిపిస్తున్నాయి . తిలక్ ఆ జెండాని చూడగానే ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ లేనిది జెండా కనిపిస్తోందేమిటన్న సందేహం కలిగిందతనికి ;రాను రాను పడవ దగ్గర కాసాగింది. ఇప్పుడు మరింత స్పష్టంగా జెండా కనిపిస్తోంది. దాని మధ్యలో రెప రెప లాడుతున్న అశోక చక్రం...
ఒక్కసారిగా రేవులోకి దిగాడు తిలక్. పడవ మరింత దగ్గరకు వచ్చింది. అందులో ముగ్గురే వ్యక్తులు... ఇంతలో అందులోని ఒక వ్యక్తి జెండాని చెత్తో ఎత్తి పట్టుకొని రెండో చేతిని గాల్లోకి ఎత్తాడు. ఇప్పుడతని రూపు భరత్‌లా కనిపిస్తోంది. ఒక్కసారిగా చేతిని కళ్ళ మీద పెట్టి మరింత తీక్షణంగా అటు వైపు చూసాడు. పడమటి సంజె ఎర్రటి కిరణాలు ఆ వ్యక్తి ముఖం పై పడి మరింత స్సష్టంగా కనిపిస్తున్నాడు. రాను రాను పడప దగ్గరైంది. ఆ వ్యక్తి ముఖం ఇప్పుడు స్పష్టంగా కనిపించసాగింది.అతను భరత్!
అంతే.. తిలక్ ఒక్కసారిగా ఏట్లో దిగి పడవ వైపు వడివడిగా అడుగులు వేయసాగేడు.
ఇంతలో ఆ జెండా పట్టుకున్న భరత్ " నాన్నా! నేను వచ్చేసాను.. మేము గెలిచాము" అని గట్టిగా అరిచాడు....
ఆ మాటలు తిలక్ చెవులకు వందేమాతరం గీతంలా వినిపించాయి. పరుగు పరుగున పడవ దగ్గరికి వెళ్ళాడు... అందులోంచి భరత్ ముందుకు వచ్చి జెండాని తిలక్కి అందించాడు. అంతే తిలక్ భరత్‌ని గట్టిగా కౌగలించుకున్నాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి జెండాని ఎత్తి పట్టుకొని రేవు వైపు బయలుదేరారు...
వాళ్ళు రేవు చేరుకునే సరికి జెండాలు పట్టుకొని ఊళ్ళో జనం పరుగు పరుగున వాళ్ళ దగ్గరికి వస్తూ కనిపించారు.
ఆ దృశ్యం చూసిన తిలక్కి కళ్ళల్లో నీళ్ళు చెమ్మగిల్లాయి. భరత్ నోటి వెంట "వందేమాతరం", "జైహింద్" అన్న మాటలు ప్రతిధ్వనించసాగాయి.
(సమాప్తం)
గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.
Comments