top of page

వినాయక రావు వివాహం
'Vinayaka Rao Vivaham' written By Sita Mandalika

రచన : సీత మండలీక

గణేష్ వివాహం అందాల అపరంజి బొమ్మ అరవింద తో కుదిరింది. ఈ మాట వినగానే ప్రతీ ఒక్కరూ ఆశ్చర్య పోయారు. ఉండలేక పోయారు. అరవింద, గణేష్ హై స్కూల్ మొదలు ఇంజనీరింగ్ దాకా క్లాస్ మేట్లు. స్కూల్ లోను, కాలేజీ లోను ఎంతోమంది మొగ పిల్లల మనసుల్లో నిలచిన అందాల అరవింద, తను మాత్రం గణేష్ మనసు దోచుకుంది.

నిజం చెప్పాలంటే, అరవింద తో పెళ్లి జరుగుతున్నదా అని తనే నమ్మలేకపోతున్నాడు గణేష్. దానికి కారణాలున్నాయి. తను అరవిందకు ఒక్క విషయంలో కూడా సరితూగడు. అరవింద సంపన్నుల బిడ్డ. తను, ఒక మధ్య తరగతి కుటుంబీకుడు. నాన్న బ్యాంకు లో క్లర్క్ గా చేరి రిటైర్ కావడానికి సంవత్సరం ముందు మేనేజర్ అయ్యాడు. రూపులో అరవిందతో పోలిస్తే తను ఎక్కడా సరిపోడు. అరవింద ఒక మెరుపు తీగ. మరి తను .... పెరిగిన బొజ్జ, సామాన్యమైన హైట్ … వగైరా వగైరా

గౌరి, శివరామకృష్ణ ల పెళ్లయిన పదేళ్లకు గణేష్ పుట్టేడు. వినాయక చవితి నాడు పుట్టడంతో బామ్మ వినాయక రావు అని పేరు నిశ్చయించింది. స్కూల్ లోను ఇంట్లోనూ అందరూ గణేష్ అని పిలవడంతో గణేష్ అన్న పేరే ఖాయం అయిపొయింది. పుట్టడమే వెయిట్ ఎక్కువ. దానికి సాయం తల్లి గారాబంతో మంచి ఒళ్ళు చేసి ‘అమూల్ బేబీ లా రౌండ్ గా బొజ్జ వేసుకుని తిరిగే వాడు’ అని బామ్మ మురిసిపోతూ ఉండేదిట.

స్కూల్ లో జాయిన్ అయ్యేక అసలు బాధ ఆరంభమయ్యింది గణేష్ కి. అందరూ గణేష్ అని పిలవడం మానేసేరు . ఫుట్ బాల్ అనో బడ్డూ అనో పిలిచే వారు.

చిరు తిళ్ళు మానరా అన్నా వినేవాడు కాదు గణేష్. తక్కువగా తినరా అని అమ్మ అంటే ‘గణేష్ బొజ్జ నిండా తింటాడు గానీ సగం సగం తినడు అమ్మా’ అని జవాబిచ్చేవాడు చిన్న తనం లో. ఈ చిరుతిళ్ళతో ఒళ్ళు బాగానే పెరిగింది గణేష్ కి.

సామాన్యమైన పొడుగు, భారీగా పెరిగిన దేహంతో తన రూపు తనకే చిరాకు అనిపించే పరిస్థితి

వచ్చింది గణేష్ కి . తనలో ఏమి చూసి ఆ అందాల రాసి అరవింద "ఐ లవ్ యు" అంది? తనకే అర్ధం కావడం లేదు . తనకి దేవుడిచ్చిన వరం, తన తెలివితేటలు. ఆ కారణం చేత క్లాస్ టాపర్ గా తను చాలా సార్లు నిలిచేడు. అంత మాత్రాన అరవింద తనమీద మనసు పారేసుకుందంటే నమ్మ బుద్ధి కాలేదు.

ఓ!.. తన పాటంటే అరవింద కి చాలా ఇష్టం. ఒకసారి కాలేజీ ఫంక్షన్ లో పాడినప్పుడు నించుని, ‘ఒన్స్ మోర్’ అంది.. పాట, చదువు చూసి ముచ్చట పడి తనని వరించిందా? అంతా అయోమయం లా ఉంది. తన సమస్య పంచుకునే చెప్పుకోదగ్గ స్నేహితులు ఎవరూ లేరు.

చిన్నతనం నించీ అమ్మ దగ్గర బాగా చనువు గణేష్ కి .అమ్మ మాటంటే గురి. ఆవిడ కోరిక వల్లే సంగీతం నేర్చుకుని చక్కగా పాడడం నేర్చుకున్నాడు.

తన ఆలోచనలన్నీ అమ్మతోనే పంచుకునేవాడు .అలాగే అరవిందని గురించి అమ్మకి చెప్పేడు

కాలేజీ లో చదివినప్పుడు అరవింద ఖరీదైన కార్ లో దిగి రాజ హంసలా నడిచి వస్తుంటే బాయ్స్ అందరూ ఆమెతో మాట్లాడాలని ఉబలాట పడేవారు. తనకి కూడా మనసులో ఎంతో ఇష్టం కానీ ఎదో సంకోచం. మెల్లిగా ఒకసారి కళ్ళెత్తి చూసేవాడు. తనకి ఇంకా గుర్తుంది. ఒకసారి అలా చూస్తే "హలో గణేష్, హౌఅర్యు" అని అరవింద అంటే తను మెలికలు తిరిగి పోతూ "ఐయామ్ ఫైన్. థాంక్ యు" అని జవాబిచ్చేడు .

ఇంజనీరింగ్ తరవాత మంచి కంపెనీ లో జాబ్ వచ్చింది గణేష్ కి. ఒక రోజు హఠాత్తుగా ఇంటి ముందు ఖరీదయిన కార్ ఆగింది. అరవింద, తల్లి, తండ్రి కార్ లో వచ్చేరు. వాళ్ళని ఆహ్వానించి అమ్మా, నాన్నలకి పరిచయం చేసేడు గణేష్. తన కళ్ళతోనే ఇంటిని పరీక్షించింది అరవింద. చిన్న ఇల్లు. అయినా అన్ని హంగులతో పొందిక గా ఉన్న ఇల్లు.

కాఫీలు అల్పాహారాలు అయ్యేక అరవింద తండ్రి రవీంద్ర గారు, తల్లి సూర్యకుమారి వాళ్ళ అమ్మాయి అరవింద ను గణేష్ కి ఇద్దామనుకుంటున్నట్టు తేల్చేరు.

"మనిద్దరి మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయని మీకు తెలుసు కదా" అన్నారు శివరామ కృష్ణ గారు

“ శివ రామకృష్ణ గారూ! మనమధ్య ఉన్న వ్యత్యాసాలు మనం పెట్టుకున్నవి. అవి మనని దూరం చెయ్యవు. అరవింద నాకు ఒక్కగానొక్క పిల్ల. గణేష్ ని ఇష్టపడుతోంది. మాకు అన్నీ నచ్చే ఈ సంబంధం మాట్లాడానికి వచ్చేము. మాకు కూడా ఇంతకన్నా మంచి సంబంధం రాదనుకుంటున్నాము. మీకు నచ్చితే ముందుకి వెళదాము" అని సూర్యకుమారి గారు మాట కలిపేరు.

అరవింద కి గణేష్ కి నచ్చితే మాకేమీ అభ్యంతరం లేదని చెప్పేరు శివరామ కృష్ణ దంపతులు.

ఇదంతా విన్న గణేష్ అరవిందతో మాట్లాడాలని తన గది లోకి తీసుకెళ్ళేడు.

"ఈ పెళ్లిని గురించి నువ్వు బాగా ఆలోచించుకున్నావా అరవిందా? మేము మధ్య తరగతి వాళ్ళం. అన్నిటికన్నా ముఖ్యమయినది అమ్మా నాన్న నాతోటే ఉంటారు. ఆ పైన నారూపు. ఇవీ నా సందేహాలు..." అని తన సంశయాలు తెలిపేడు గణేష్.

"నేను మీతో, అత్తయ్యతో, మామయ్యతో కలిసి ఉంటాను” అని జవాబిచ్చింది అరవింద.

"నన్ను ఏమి చూసి ఇష్ట పడ్డావు?"అని మళ్ళీ ప్రశ్నించేడు గణేష్.

"గణేష్, ఐ లవ్ యు సో మచ్. ఐ వాంట్ టు స్పెండ్ మై లైఫ్ విత్ యు" అని జవాబిచ్చింది అరవింద

“మరి నిన్ను ఎందుకు ఇష్ట పడ్డానో దాని జవాబు అతి త్వరలో మనిద్దరం ఏకాంతం లో ఉన్నప్పుడు చెప్తా”నంటూ అరవింద గణేష్ గుండెలమీద తల పెట్టి గోము గా చెప్పింది.

ఆ తరవాత ఒక నెల లోపే గణేష్ అరవింద ఒకటయ్యారు. స్టార్ హోటల్ లో చాలా హంగామాగా పెళ్లి చేశారు. అందం గా అలంకరించిన గదిలో అప్సరసలా తయారై ఎదురు చూస్తున్న అరవిందను దగ్గరగా తీసుకుని "ఐ లవ్ యు డార్లింగ్" అన్నాడు గణేష్.

"ఇప్పుడేనా చెప్పు నన్ను ఎందుకు ఎన్నుకున్నావో " అని అడిగేడు గణేష్.

ఒక చిరు నవ్వుతో అరవింద చెప్పడం ఆరంభించింది "నువ్వు నన్ను ఏదో ఆకాశంలో తార అనుకుని దూరంగా ఉండే వాడివి.అదే … అందని వస్తువు కోసం అర్రులు చాచ కూడదడనే నైజం. నువ్వు దూరం వెళ్తున్న కొద్దీ దగ్గరికి రావాలనిపించేది.

గణేష్! నువ్వు టాపర్ వి. బాగా పాడతావు, మంచి వాడివి. ఇవే కాక నన్ను ప్రేమిస్తున్నావేమో అని గట్టి నమ్మకం కలిగింది. అందుకే నేను కూడా నీమీద మనసు పారేసుకున్నాను"

"నిజం అరవిందా,పైకి చెప్పడానికి నేను మొహమాట పడ్డాను"

"గణేష్,నా చిన్న తనం నుండీ మా నాన్నే నాకు హీరో. మేము కూడా ముందు సామాన్యులమే. నాన్న ధైర్యంతో, పట్టుదల తో నియమానుసారంగా పని చేసి, బిజినెస్ బాగా వృద్ధి చేసేరు. నాకు తెలియకుండానే నా ఆలోచనలో అలాంటి గుణాలున్న వ్యక్తి నా జీవితంలో కావాలనిపించింది. అంతే గాని మధ్య తరగతి వాళ్ళు అని ఏమీ ఆలోచించ లేదు. మనసా వాచా ప్రేమించిన ఒక మంచి వ్యక్తిని నీలో చూసేను. జీవితాంతం ఇష్ట పడతావనే ధైర్యం నాకు ఉంది.

గణేష్! మనం ఎవరిని ఇష్టపడతామో వారే అందరికన్నా అందగాడు. అందం అంటే నా దృష్టిలో ఆజానుబాహుడు, అందగాడే కాదు. మంచి బుద్ధి, నడవడి ఇవన్నీ ఉన్నాయి కనకనే నువ్వు నావాడివయ్యేవు. నేను నీకు నచ్చేనా?” అని అరవింద అడగగానే, నిన్ను నచ్చని వాళ్ళెవరేనా ఉంటారా అని గదిలో లైట్ ఆర్పేశాడు గణేష్ .


***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

పెండ్లి పిలుపు


రచయిత్రి పరిచయం : సీత మండలీక

నేను హౌస్ మేకర్ ని. కొడుకులిద్దరూ అమెరికాలో పెళ్ళిళ్ళై స్థిరపడిపోయాక, భర్త ఎయిర్ ఇండియా లో రిటైర్ అయ్యేక ఇప్పుడు నాకు కొంచెం సమయం దొరికింది

కధలు చదవడం అలవాటున్నా రాయాలన్న కోరిక ఈ మధ్యనే తీరుతోంది


171 views1 comment
bottom of page