top of page

అదొక మహానగరం

Writer's picture: Lakshmi Sarma BLakshmi Sarma B

'Adoka Mahanagaram' New Telugu Story



(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

అదొక పేరుమోసిన అగ్రదేశంలోని న్యూయార్క్ మహానగరం. ఏయిర్ ఫోర్ట్ లో దిగి దిగగానే చుట్టూచూసాడు చలపతి. ఎటువెళ్ళాలో ఏంటో తెలియడంలేదు. ఎక్కడచూసినా అమెరికన్లు, చైనావాళ్ళు తప్పితే మనవాళ్ళు అరకొర కూడా లేరు. ఎవరితో మాట్లాడాలన్నా ఇంగ్లీషు ముక్కరాదు. అంతో ఇంతో హింది వస్తుంది కానీ ఇక్కడ ఎవరు మాట్లాడుతారు హింది. అబ్బో ఇంతపెద్దగా ఉంది ఏయిర్ ఫోర్ట్! అసలు బయటకు ఎలా వెళ్ళాలో అర్ధంకావడంలేదు.


వెలసిపోయినా జీన్స్ పాయింట్, దానిమీదకు కొత్తది పాలియస్టర్ షర్ట్, ఎన్నాళ్ళుగానో వాడేసిన బూట్లు, ఒకచేతిలో లెదర్ బ్యాగు పట్టుకుని దిక్కులుచూస్తూ నిలుచున్నాడు. పాపం ఇతని అవస్థను గమనించి దగ్గరగా వచ్చాడు ఒకతను.


"ఏంటండి మీరొక్కరే వచ్చారా మీకూడా ఎవరులేరా? పోని మీరు బయటకు వచ్చాకైనా ఎవరన్నా వస్తారా మిమ్మల్ని తీసుకపోవడానికి, " అడిగాడతను.


అతను తెలుగులో అడిగేసరికి ప్రాణాలు లేచొచ్చాయి చలపతికి. అతనివైపు ఆశ్చర్యంగా చూస్తూ. "మీరు తెలుగువారా… నాకొక సహాయం చేస్తారా, మా స్నేహితుడు ఏయిర్ ఫోర్ట్ బయట ఉన్నాడు, వాడి దగ్గరకు నన్ను తీసుకెళ్ళండి నేనెటువెళ్ళాలో తెలియడంలేదు, ” అన్నాడు దీనంగా ముఖంపెట్టి.


"అలాగే అలాగే… మీకు లగేజి ఏమిలేదా?, " చలపతి చేతులవేపు అనుమానంగా చూస్తూ అడిగాడతను.


"అయ్యబాబోయ్ … సామాను మర్చిపోయానండి, ఇక్కడ దిగాక తీసుకోవాలి అని చెప్పారు. ఎక్కడ ఉందో ఏంటో! అదికూడా చూసిపెట్టండి మీకు పుణ్యం ఉంటుంది, " అన్నాడు.


"సరే ఇలారండి… మీ సూట్ కేసులు మీరు గుర్తుపడతారు కదా, " అడుగుతూ లగేజ్ దగ్గరకు తీసుకవెళ్ళాడు.


"ఆయ్ అండి, " అతని వెనకాలే నడవసాగాడు. అమ్మబాబోయ్ దేవుడి దయవల్ల ఇతను పరిచయం అయ్యాడు. లేకపోతే నా పరిస్థితి ఏలాగుండేదో ఏమో తనలో తానే అనుకుంటూ సూట్ కేసులు వెతకసాగాడు.


"అదిగోనండి అదే అదే నా సూట్ కేసు, " అన్నాడు గట్టిగా. అందరు ఒక్కసారిగా చలపతి వైపు తిరిగిచూసారు.


"చూడండి మీరు కొంచెం చిన్నగా మాట్లాడండి, ఇది ఇండియా కాదు. అటు చూడండి.. అందరు మిమ్మల్ని ఎలా చూస్తున్నారో, " చిన్నగా చెప్పాడు.


అందరివైపు చూసి సిగ్గుతో తలవంచుకున్నాడు చలపతి. మారు మాట్లాడకుండా తన సూట్ కేసులు రాగానే తీసుకున్నాడు. అవి తక్కువ ధరకు తీసుకున్నాడేమో అప్పుడే వీల్స్ విరిగిపోయాయి. ఇబ్బందిపడుతూ అతని వెంబడి బయటకు వచ్చాడు. చలపతి ఎదురు చూస్తున్న తన స్నేహితుడు సాగర్ కనిపించాడు. ఒక్కసారిగా ప్రాణాలు లేచి వచ్చినట్టయింది చలపతికి.

గబగబా వెళ్ళి సాగర్ ను గట్టిగా వాటేసుకున్నాడు.


"ఏయ్ చలం … బాగున్నావా? అబ్బా నువ్వేం మారలేదురా అలాగే ఉన్నావు, నిన్ను గుర్తుపడతానో లేదో అనుకున్నాను, " అంటూ ఆప్యాయంగా పలకరించాడు. చిన్నప్పుడందరు చలపతిని చలం అని పిలిచేవాళ్ళు.


"సాగర్ నువ్వు కూడా ఏం మారలేదు నిన్ను పోల్చుకోవడం ఎలాగాని భయపడ్డాను, ”


"నీకు ఎక్కడ ఇబ్బంది కాలేదు కదా! తిన్నావా వాళ్ళు ఇచ్చిన పుడ్డు, " అడిగాడు


"ఎక్కడ ఇబ్బంది ఏం కాలేదుగానీ! ఇదిగో ఇక్కడ దిగాకనే ఎటు వెళ్ళాలో అర్ధంకాక భయమేసింది, ఎవరిని అడగాలో ఎటువెళ్ళాలో దిక్కుతోచక భయపడుతూ నిలుచున్నాను., ఇదిగో.. ఇతను దేవుడు పంపించినట్టు వచ్చి నన్ను నీ దగ్గరకు తీసుకవచ్చాడు, " చెబుతూ తన పక్కనే ఉన్న అతన్ని పరిచయం చేసాడు.

***

కారులో వెళుతూ న్యూయార్క్ నగరాన్ని రెండుకళ్ళతో తిలకిస్తూ ఊహల్లో తెలిపోసాగాడు.


"అవును చలం… ఇంతకు నువ్వెందుకు అమెరికాకు వచ్చావు, మీ చుట్టాలు ఎవరైనా పిలిచారా? మరి నీకు వీసా అది వాళ్ళే ఇచ్చారా ఎన్ని రోజులుంటున్నావు? మీ వాళ్ళు ఎక్కడుంటారు, " అడిగాడు సాగర్ కారు డ్రైవింగ్ చేస్తూనే.


"ఓ అదా… నాకు ఒకతను హైదరాబాద్ లో పరిచయం అయ్యాడు, అతను అందరికి విదేశాలకు వెళ్ళడానికి వీసాలు ఇప్పిస్తాడట, నేను అమెరికాకు వస్తే చాలా డబ్బులు సంపాదించుకోవచ్చని చెప్పాడు, నా పరిస్థితి అంతా విన్నాక.


సాగర్! నీకు మా ఇంటి పరిస్థితులు తెలుసు కదా, చిన్నప్పుడు మేము ఎన్ని ఇబ్బందులు పడ్డామో.. మా నాన్న చిన్నప్పుడే పోతే ఇద్దరు అక్కలు పెళ్ళి బాధ్యతలు, తమ్ముడి చదువు.. ఇల్లు గడవటమే కష్టమైంది. అప్పులు చేస్తేగాని పెళ్ళిళ్ళు అవలేదు. నా పెళ్ళికి వచ్చిన డబ్బులతో కొంత అప్పు తీర్చగలిగాను. నాకు ఇద్దరు ఆడపిల్లలు. అమ్మా మేము ఎలా బ్రతుకు బండి నడవాలో అర్థంకాలేదు. అప్పుడే హైదరాబాద్ వచ్చాను. ఏదో చిన్న వర్క్ షాపులో పనిచేయడం మొదలుపెట్టాను. అక్కడే పరిచయమయ్యాడు గోపాలం. అతని ద్వారానే ఇక్కడికి రాగలిగాను కానీ ఇంతపెద్ద మహానగరంలో అతన్ని ఎలా పట్టుకోవాలో నాకు కష్టమే సాగర్, " చెప్పడం ఆపాడు చలం.


"సరేగానీ … ఇంతకు ఎంతముట్టచెప్పావేంటి, ఆయన అడ్రస్‌ ఏది ఇటివ్వు చూస్తాను, ”


"అది… అది…” అంటూ నీళ్ళు నమలసాగాడు.


"అదేమిట్రా చెప్పడానికి సందేహిస్తున్నావు, అప్పు చేసి బాగానే ముట్టచెప్పావా చెప్పడానికి మొహమాటపడుతున్నావు, " అడిగాడు అనుమానంగా.


"అబ్బే అదేంలేదు… రెండులక్షల రూపాయలు అడిగాడు, అదికూడా వీసా చేతికివచ్చాక ఇవ్వమన్నాడు, అమ్మదగ్గర నా భార్య దగ్గర ఉన్న నగలు అమ్మాను, ఇల్లు అమ్మేసాను. ఇంకా సరిపోకపోతే వడ్డీకి తెచ్చి ఇచ్చాను, " జరిగింది చెప్పాడు చలం.


"చలం … ఎంతపని చేసావు నువ్వు, అసలే అప్పుల్లో కూరుకొని ఉన్నావంటే నిన్ను ఎవరో బాగానే మోసంచేసారు, ఇక్కడకు రాగానే నీకు స్వాగతం పలికి ఉద్యోగం ఇవ్వడానికి తయారుగా ఉన్నారనుకుంటున్నావా? ఒక్కమాట ఎవరినైనా అడగాలి కదా! నీకు నువ్వే నిర్ణయం తీసుకోవడమేనా? ఈ పని చేసేముందు నీ భార్య పిల్లల గురించి ఆలోచించక్కరలేదా?

వాళ్ళను గాలికొదిలేసి వచ్చావు. తెల్లారి లేచింది మొదలు అప్పులవాళ్ళు పీక్కతింటుంటే వాళ్ళనేం చెయ్యమంటావు? నువ్వు చేసిన వెధవపనికి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారోనని ఒక్కసారి … ఒక్కసారి ఆలోచించి చూడు, " అంటూ ఆవేశంతో గట్టిగా అరిచాడు.


"అదికాదు సాగర్… ఇక్కడకు వచ్చి డబ్బు సంపాదించుకొని అప్పులన్ని తీర్చుదామనుకున్నాను, కానీ, " ఆగిపోయాడు.


"ఊ చెప్పవేం ఆగిపోయావు, చూడు చలం … నీ అదృష్టం బాగుంది కనుక నాకు ఫోన్ చేసావు, లేకపొయ్యింటే అడుక్కోవడానికి కూడా అనుమతి ఉండదు తెలుసా, సరే జరిగిందేదో జరిగిపోయింది ఎలాగు వచ్చావు కదా! నాకు తెలిసిన వాళ్ళదగ్గర పని ఇప్పిస్తాను, కానీ ఎవ్వరికి నువ్వు సంపాదిస్తున్నట్టు తెలియనివ్వకు, నీ విషయాలు ఎవ్వరికి చెప్పకుండా

జాగ్రత్తగా ఉండు, " భుజంమీద చెయ్యివేసి అనునయిస్తూ చెప్పాడు.


సాగర్ చేతులుపట్టుకుని. సాగర్ నీ ఋణం ఎలా తీర్చుకోను, దేవుడిలా నువ్వు దొరకకపోతే నిజంగానే నా భార్యపిల్లలకు అన్యాయం చేసినవాడిని అవుదునేమో.. నాపిల్లల అదృష్టం బాగుంది. నువ్వు చెప్పినట్టుగానే నడుచుకుంటాను, " అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.


రోజులుగడిచిపోతున్నాయి సాగర్ ఇంట్లోనే గరాజ్ లో ఉంటున్నాడు చలం. పనికి వెళ్ళివస్తున్నాడు వీలైనప్పుడల్లా చలంను తీసుకుని న్యూయార్క్ నగరం చూపెడుతున్నాడు. ఆ అందాలు చూస్తుంటే ఏదో మహాలోకంలో ఉన్నట్టనిపించసాగింది చలపతికి ఆ విషయాన్ని ఉత్తరంలో భార్యకు రాస్తున్నాడు. తన డబ్బులన్ని సాగర్ తన అకౌంట్ నుండి చలం భార్యకు పంపుతున్నాడు. అక్కడ చలం భార్య అప్పులు తీర్చుతూ ఇల్లు నడుపుకుంటుంది. సాగర్ భార్య పిల్లలు అందరు చలంతో బాగా కలిసిపోయారు. చూస్తుండగానే రెండుసంవత్సరాలు గడిచిపోయాయి.


చలపతికి ఇంటికి వెళ్ళాలన్న ఆలోచనలేదు. తనకు తెలిసిన వాళ్ళందరు చెప్పారు ఇక్కడే ఉండిపోవచ్చని. మెల్లెగా నీ భార్యపిల్లలను కొంతకాలమాగి పిలిపించుకోవచ్చన్నారు. పరిచయాలు పెరిగాయి సంపాదన పెరిగింది. సాగర్ ను ఇబ్బందిపెట్టడం ఇష్టంలేక వేరే చిన్న రూంలోకి మారాడు. ఇప్పుడన్ని స్వంతంగా తనే చూసుకుంటున్నాడు. చాలా వరకు అప్పులు తీరిపోయాయని

త్వరలోనే మమ్మల్ని కూడా తీసుకవెళ్ళమని పోరు పెట్టసాగింది చలం భార్య పద్మ.


"ఏమండి మీరెప్పుడువస్తారు, మీ అమ్మకు ఒంట్లో అస్సలు బాగుండడంలేదు, మీరొక్కసారివచ్చి ఆమెను చూసిపోతే గానీ ఆమె ప్రాణం కుదుటపడేలాలేదు, " అంది పద్మ ఫోన్ మాట్లాడుతూ.


"అదికాదు పద్మా… అమ్మను హాస్పిటల్ కు తీసుకవెళ్ళు కావాలంటే హాస్పిటల్ లో జాయిన్ చెయ్యి, నేను రాలేను పద్మ… నేను వచ్చానంటే మళ్ళి వెనక్కి రాలేను, ఇంకా కొన్నాళ్ళు కష్టపడ్డామంటే మీరందరు ఇక్కడకు రావచ్చు, అప్పటివరకు కొంచెం ఓపిక పట్టు”, అన్నాడు చలం.


"అబ్బా ఏం ఓపికనో ఏమో అన్ని నేనే చూసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది, ఇప్పుడు అప్పులన్ని తీరిపోయాయి కదా! మీరు సంపాదించింది చాలుగాని ఇంక వచ్చేయండి, ” అన్నది పద్మ.


"అదేమిటి పద్మ… అలా అంటావేంటి? ఇంతకష్టపడి ఇక్కడ చిన్నదో పెద్దదో ఒక ఉద్యోగం సంపాదించుకున్నాను ఇప్పట్లో రాలేను, కొన్నాళ్ళు ఓపికపడితే గ్రీన్ కార్డ్ వస్తుందట. అప్పుడు మనందరం కలిసి ఉండొచ్చు పద్మ, " చెప్పాడు చలపతి.


అలా అలా చూస్తుండగానే పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయి. చలపతి తల్లి కొడుకుమీద బెంగతో కాలంచేసింది. చలపతి రాలేకపోయాడు పద్మనే తన అన్నదమ్ములతో కలిసి కార్యక్రమం చేసాననిపించింది. పిల్లలు ఇంజనీరింగుకు వచ్చారు హైదరాబాద్ లో రెండిళ్ళు కొని ఒకటి అద్దెకు ఇచ్చి ఇంకో ఇంట్లో పిల్లలతో ఉంటుంది పద్మ. భర్తతో పోరుపెడుతూనే కాలం సాగిపోయింది. ఇదిగో వీసా పంపిస్తున్నాను అదిగో పంపిస్తున్నాను అంటుండగానే సంవత్సరాలు గడిపోయాయి. చలం ఇండియాకు రావాలంటే శాశ్వతంగా రావలసిందే. ఎందుకంటే వెళ్ళడానికి వీసా లేదు. అలా వచ్చాడంటే ఇన్నేళ్ళు పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుందని బాధ.


ఇలా ఆలోచనలలో ఉండగానే చలం ఆరోగ్యపరిస్థితి గాడితప్పింది. హాస్పిటల్ కు వెళ్ళి టెస్టు చేయించుకుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చిందన్నారు. ఏంచెయ్యాలో తెలియక ఆయోమయంలో పడ్డాడు. తెలిసిన వాళ్ళందరు ఇక్కడే ట్రీట్మెంట్ బాగుంటుంది. నువ్వు ఇండియా వెళితే ఇన్నాళ్ళు నువ్వు కష్టపడి సంపాదించిందంతా బూడిదలో పోసినా పన్నీరవుతుంది. కష్టమో సుఖమో ఇక్కడే ఉండు మేమందరం మాకు చేతనైనా సహాయం చేస్తాము అనడంతో భార్యకు కూడా చెప్పకుండా దాచాడు. ఎలాగయితేనేం ఎవరెవరి సలహా వల్లనో చలపతికి సీరియస్ గా ఉందని చెప్పి పద్మ పిల్లలకు వీసా వచ్చేలా చేసుకున్నాడు. పద్మ కు పిల్లలకు ఆనందం అంతఇంతకాదు. ఇన్నాళ్ళ తరువాత అందరం కలుసుకోబోతున్నామన్న సంతోషంతో పొంగిపోయారు.


"పద్మా… వీసా వచ్చింది కదా! ఇక నువ్వు పిల్లలు బయలుదేరి రండి, వచ్చేముందు మన ఇంటి బాధ్యతలన్ని మీ అన్నయ్యకు అప్పచెప్పు, మళ్ళి మనం వచ్చేవరకు ఇంటిరెంటులన్ని బ్యాంకులో వెయ్యమను, నెలనెలా వెళ్ళి కిరాయిలు వసూలు చెయ్యమని చెప్పు, మీకు కావలసిన బట్టలు పచ్చళ్ళు అన్ని తీసుకురా, " చెప్పాడు చలపతి. ఒకవైపు సంతోషం ఇన్నాళ్ళకు భార్యపిల్లలను కలుసుకుంటున్నందుకు. మరోవైపు తన ఆరోగ్యం గురించి బాధ తనకు ఏమౌతుందోనని.


“అలాగేనండి … మా అన్నయ్య వచ్చి వెళ్లాడు, వాడికి అన్ని చెప్పాను నేను చూసుకుంటాను నువ్వేమి దిగులుపడకు అన్నాడండి, ఆ అన్నట్టు మీకు చెప్పడం మరిచాను, మనం ఉన్న ఇల్లు కూడా కిరాయికి అడుగుతున్నారు ఒక్క గదిలో సామానంతా పెట్టి ఇచ్చేద్దామనుకున్నాను మీరేమంటారు, " అడిగింది పద్మ.


"బాగానే ఉంటుంది కాకపోతే మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఖాళీ చెయ్యకపోతే ఇబ్బంది అవుతుందేమోనని ఆలోచిస్తున్నాను, " అన్నాడు చలపతి. వాళ్ళు ఇక్కడకు వచ్చాక తన ఆరోగ్యం బాగాలేకపోతే వెళ్ళిపోవలసి వస్తుందేమోనని అనుమానంతో అలా చెప్పాడు.


"అదేంటి అలా అంటున్నారు మనం ఇప్పుడప్పుడే రాలేము అన్నారు కదా! అలా ఖాళీగా ఉంటే ఇల్లు పాడైపోతుంది, అవన్ని మా అన్నయ్య చూసుకుంటారు మీరేం బాధపడకండి, మేము అంతా సర్దుకున్నాము కూడా, " చెప్పింది ఉత్సాహంగా పద్మ.


అనుకున్నట్టుగానే పద్మ పిల్లలను తీసుకుని వచ్చింది. భార్య పిల్లలు వస్తున్నారని డబుల్ బెడ్ రూం ఇల్లు తీసుకున్నాడు. ఏయిర్ పోర్టులో పద్మ పిల్లలను చూడగానే మనసు ఆనందంతో పులకించిపోయింది చలపతికి. పద్మకైతే భర్తను చూడగానే సంతోషం పట్టలేక ఇన్నాళ్ళు దూరంగా ఉన్నందువల్ల ఆగలేకా ఒక్క ఉదుటున వచ్చి భర్తను గాఢంగా కౌగిలించుకుంది. కళ్ళు నుండి జలపాతంలా కన్నీరు కారుతుండగా భర్తను తనివితీరా చూసుకుంటూ పరిసరాలను మరిచిపోయింది. పిల్లలు కూడా గబుక్కున వచ్చి తండ్రిని పట్టుకున్నారు. పదిహేను సంవత్సరాల ఎడబాటుతో అనుభవించిన బాధలన్ని ఒక్క క్షణంలో మటుమాయమైనట్లుగా సంతోషంతో పొంగిపోయారు.


నలుగురు. అందరు కలిసి ఇంటికివచ్చారు. పిల్లలకైతే ఎంతో ఆనందంగా ఉంది. అమెరికా రావడం ఒక ఎత్తైతే కన్నతండ్రిని కలుసుకోవడం మరో ఎత్తు వాళ్ళ దృష్టిలో. వాళ్ళు వచ్చినందుకు కొన్నాళ్ళు సంతోషంగా ఉండని అనుకుని తన విషయం బయటపెట్టలేకపోయాడు చలపతి. చాటుమాటుగా మందులువేసుకోవడం పని ఉందని చెప్పి హాస్పిటల్ కు వెళ్ళిరావడం చేస్తూనే. వాళ్ళను సరదాగా న్యూయార్క్ సిటి అంతా తిప్పుతున్నాడు. మహానగరం చూస్తుంటే పురివిప్పి నాట్యం ఆడిన నెమలిలా సంతోషం అనుభవించారు పద్మా పిల్లలు. మూడునెలలు చూస్తుండగానే గడిచిపోయాయి. పద్మకు పిల్లలకు ఆ ప్రాంతమంతా అలవాటైనట్లుగా అందరితో పరిచయాలు ఏర్పడినాయి. ఒకరోజు ఉదయం లేస్తూనే ప్రక్కన భర్తకనిపించకపోవడంతో లేచి కంగారుపడుతూ హాల్లోకి వచ్చింది పద్మ.


అక్కడ సోఫాలో కూర్చొని దగ్గుతూ అవస్థపడుతున్న భర్తను చూసి.

"ఏమైందండి అంతలా మెలికలు తిరిగిపోతున్నారు, నన్ను లేపకుండా మీరొక్కరే అవస్థపడుతున్నారు, నాకు మొద్దు నిద్రపట్టేసింది ఏమైంది మీకు, " అంటూ అతన్ని లేవనెత్తింది. నోటినిండా రక్తం.. కళ్ళు మూసుకపోతున్నాయి చలపతికి. భయంతో నోటమాట రావడంలేదు పద్మకు.


"పద్మ… పద్మ నాకు నాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, నేనింకా ఎక్కువరోజులు బ్రతకను. పిల్లలు నువ్వు జాగ్రత్తగా ఉండండి, "చలపతి చెబుతుంటే అతని నోటికి చెయ్యి అడ్డంపెట్టి. "ఏమిటండి ఈ మాటలు… మీరు చెబుతున్నది నిజమా? ఇన్నాళ్ళు మాకు చెప్పకుండా ఎందుకు దాచారు, ఇది చూడడానికా మేము ఇంతదూరం వచ్చింది, " అంటూ భర్తను గుండెలకు అదుముకుంటూ బోరుమంది పద్మ. తల్లి గొంతువినగానే పిల్లలిద్దరు పరుగుపరుగున లేచి వచ్చారు.


"పద్మా… నీకు చెప్పాలనిపించింది కానీ! దూరంగా ఉన్న నీకు నా పరిస్థితి తెలియదు నువ్వు రాలేవు, నిన్ను మానసిక క్షోభకు గురిచెయ్యడమెందుకని చెప్పలేదు, దేవుడి దయవలన మీకు వీసా దొరికి ఇక్కడకు వచ్చారు, వచ్చాక చెబుదాములే అనుకున్నా కానీ… వచ్చిన నాలుగురోజులకే మీ సంతోషాన్ని పాడుచెయ్యడం ఇష్టంలేక చెప్పలేకపోయాను, " ఆయాసం రావడంతో చెప్పడం ఆపాడు.


"అయ్యో ఎంతపని చేసారండి… పదండి మనం హాస్పిటల్ కు వెళదాము, ఓరేయ్ తేజా… నాన్నను లేపండిరా హాస్పిటల్ కు తీసుకవెళదాము, " కొడుకుకు చెప్పింది పద్మ.


వస్తున్న దగ్గును ఆపుకుంటూ పద్మ చెయ్యి పట్టుకుని. "పద్మా … నువ్వు తొందరపడి నన్ను హాస్పిటల్ తీసుకపోయినా లాభంలేదు డాక్టర్లు ఎప్పుడో చేతులెత్తేసారు, ఉన్నంతకాలం మందులు వేసుకుంటూ గడపమన్నారు, ఇక అయిపోయింది పద్మ లాభంలేదు, నేను మీకు చాలా అన్యాయం చేసాను అనుకుంటున్నాను, డబ్బుకోసమని మిమ్మల్ని వదిలి ఇంతదూరం వచ్చి నేను సుఖపడిందిలేదు, నేను లేవకపోవడం వలన మీరు పడరాని కష్టాలు పడ్డారు, ఇప్పుడు డబ్బులకు కొదవలేదు అనుకుంటే ఇప్పుడు ఇలా … అ…వుతుందను…కోలేదు, " అంటూనే పద్మ చేతిలో తన చేతిని కిందకు జారవిడిచాడు చలపతి.

గొల్లుమన్నారు పద్మ పిల్లలు. తెలిసిన వాళ్ళకు ఫోన్లు చేసారు పిల్లలు. చాలా మందే వచ్చారు చలపతి చాలా మంచివాడు అందరితో మంచిగా ఉండేవాడు అంటూ అందరు తలొక చెయ్యివేసి కార్యక్రమం ముగించారు.


"రమేశ్ అన్నయ్యా… మేము ఇండియాకు వెళ్ళిపోతాము మాకు టికెట్లు ఏర్పాటు చెయ్యండి, మీరు చేసిన సహాయానికి మీకు రెండుచేతులెత్తి దండం పెడుతున్నాను, "


"అయ్యో అదేమిటండీ … మీరలా అనకండి చలపతి ఆత్మకు శాంతి ఉండదు, తన ప్రాణం పొయ్యే లోపల మిమ్మల్ని ఇక్కడకు తీసుకరావాలని ఎంతగా తపించిపోయాడనుకున్నారు, మీకు అన్ని రక్షణలు చేసి తన దారిన తాను వెళ్ళిపోయాడు పద్మగారు, " బాధపడుతూ చెప్పాడు రమేశ్.


"అంతేకాదు పద్మా… ఇక్కడకు వచ్చాక మీరు దేనికి ఇబ్బందిపడకూడదని, ఇదిగో ఈ ఇల్లు తీసుకున్నాడు త్వరలోనే మీకు గ్రీన్ కార్డ్ కూడా వచ్చేలా చేసుకున్నాడు, తను అనుక్షణం మీ గురించే ఆలోచించేవాడు, మీరు వేరే ఆలోచనలు పెట్టుకోకండి మీకు అండగా మేమున్నాము, " అంది వనజ.


"అవును పద్మగారు… మీ బాబుకు మీ అమ్మాయికి ఉద్యోగంవచ్చే ఏర్పాటు చేస్తాము, మీరు కూడా ఖాళీగా ఉండకుండా చిన్న పిల్లలను చూసుకోవడమో లేకా వంటచేసుకోవడమో ఏదో ఒకటి చూస్తాము, మీరు మాత్రం చలపతి కోరిక కోసమైనా ఇక్కడే ఉండండి, " అంటూ అందరూ ఊరడించారు పద్మను పిల్లలను.


పద్మ నెమ్మదిగా కోలుకుని భర్తకోరిక మేరకు ఏదో వ్యాపకంలో పడిపోయింది. పిల్లలకు చదువుతూనే పార్ట్ టైమ్ ఉద్యోగం దోరికింది. డబ్బుకు కొదవలేదు కానీ మనిషి కరవైనాడు.


తాము అక్కడ ఒంటరిగానే ఉన్నాము ఇంతదూరం పరుగుపెట్టి వచ్చినా ఇక్కడ ఒంటరివాళ్ళమే. దూరపుకొండలు నునుపు అన్నట్టు పదో పరకో ఉన్న చోటసంపాదించుకుని పచ్చిపులుసు ప్రాసాదం తిన్న హాయిగా ఉండేదేమో. ‘ఏం చేస్తాం.. తలరాత ఇలారాసి ఉంది’ అని తనలో తానే బాధపడుతూ పిల్లలను చూసుకుంటూ కాలం వెళ్ళదీస్తుంది పద్మ.


********* ******* ******* ********


లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Twitter Link


Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.




























78 views2 comments

2 Comments


swapna j • 3 days ago

Manchi Katha attayya bagundi

Like

plavanyakumari15
Jan 07, 2023

చాలా బాగుందండి కథ... అంతే డబ్బులేనిదే ఏ పనీ జరగదు, డబ్బు కోసం చూస్కుంటే ఎన్నింటినో వదులుకోవాలి. కనీసం అతను తన పిల్లలకు ఏ ఇబ్బందులు లేకుండా చేసి వెళ్ళడానికి భార్యాభర్తలిద్దరూ త్యాగం చేసారనుకోవాలంతే.

Like
bottom of page