'Adoka thupthi' - New Telugu Story Written By Penumaka Vasantha
Published In manatelugukathalu.com On 16/11/2023
'అదొక తుప్తి' తెలుగు కథ
రచన: పెనుమాక వసంత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"అమ్మగారు! మాపటేల సినిమాకి పోదామన్నాడు, మా మామ. అందుకని మద్దెన్నం బేగొత్తాను. అంట్లు దొడ్లో వేసుంచండి. మీరు పండుకున్నా, లేపకుండా తోమెళ్తాను" అంది రంగి.
"అలాగే కానీ! నేనెక్కడ నిద్ర పోతాను, నీ పని నువ్వొచ్చి చేసుకెళ్లు" అంది మాలతి.
నిద్రరాక, ఏదో సినిమా టివిలో చూస్తున్న మాలతికి. దొడ్లో గిన్నెలు తోమిన, సౌండ్, వినిపించింది. రంగి వచ్చినట్లుంది, నేను లేచి టీ పెట్టుకుతాగి ఆ గిన్నెలు కూడా వేయాలనుకుంటూ, లేచి వంటగదిలోకి వెళ్ళింది. "ఇదిగో, ఇవికూడా, తోమ”ని టీ, గిన్నెలు వేసింది.
"అమ్మగారు, సన్నజాజులు, కనకాంబరాలు, కోసుకోనా, సందేలా, సినిమాకు, పోతూ పెట్టుకోవా”లంది రంగి.
"అట్లాగే, నాకూ పూజకు నాలుగు పువ్వులు, ఈ గిన్నెలో వేసుంచ”నీ, గిన్నె ఇచ్చింది మాలతి.
"ఇంతకు ఏ సినిమాకు పోతున్నారు. కొత్త సినిమాను, హాల్లోకి రానియ్యరు కదే! భలే, వెళ్ళి చూసొస్తారు, మీపని, బావుందే!"
నవ్వుతూ "ఏదో కొత్త సినిమా, బో అంటా!"
"బో, బో కాదే! బ్రో" నవ్వుతూ అన్నది మాలతి
"నాకు నోరు తిరిగిసావదు, కానీ ఆ సినిమానే. వారానికి ఒక సినిమా సూస్తెనే మా మామకు తుప్తి. అదొక్కటే, కదమ్మగారు! మాకు కాలచేపం. మా ఇంట్లో, టివి కూడా లేదు. అసలు చూడటానికి, మాకు టైం యాడుంది. మా మామ, రెక్కలుముక్కలు, సేసుకుని, కూలీ పనులకు, పోయొత్తాడు. నేను నాల్గిల్లు, పాచిపని సేత్తాను. మాకు సినిమాకు పోవటమే, పెద్ద పండగ. మా మామకు, తాగుడ లవాటులేదు. ఆటోకు డబ్బులయితాయని, సైకిల్ మీద పోతాము. ఆటోకయ్యే, డబ్బులతో, సమోసాలు, కూల్డింక్, కొనుక్కొంటాము. ఇంటికెళ్ళి, ఏమొండుతావే!? రంగి, అంటూ మామ ఓటెల్ కు తీసుకెళితే, తినేసి, ఇంటికి వచ్చి, ఇక తొంగోటమే" అంది రంగి
'మా కన్నా, మీరే, నయం, రంగి. మా ఆయన్ని, సినిమాకు, తీసుకెళ్ళమంటే! ఎందుకు టీవీల్లో, బోలెడన్ని సినిమాలు. నాకు కుదరదు, అరుగుల మీద కూర్చునే.. నీ ఫ్రెండ్స్ ఉంటారుగా! వాళ్లతో వెళ్ళు అంటాడు. పక్కనున్న సిటీకి, ఆయన బండి మీద కూర్చుని, సినిమాకు వెళ్ళటం నాకు ఎంత సరదానో! ఆకోరిక తీరనేలేదు. ఆతర్వాత పెరిగిన ఊబకాయంతో, బండ్లు ఎక్కలేక, అసలు సినిమాలే మానేసాననుకుంది' మనసులో మాలతి.
ఆ సాయంత్రం, మాలతి, బయట, అరుగుమీద కూర్చుని రంగి కోసిచ్చిన పులు, మాల, కడుతూవుంటే, పక్కింటి, కోమల, వచ్చి కూర్చుంది. అపుడే, రంగి, వాళ్ల మామ సైకిల్ మీద వెనుక కూర్చుని, ఒళ్ళో పిల్లను, పెట్టుకుని సినిమాకు, వెళ్ళటం, చూసింది మాలతి.
మాలతి, ఫ్రెండ్ కోమల "ఈ రంగి, చూడవే! కొత్త సినిమా రానియ్యదుగా! టింగురంగా! అంటూ పోవటమే, దాని పని. మొగుడు ఇదేమి చెపితే, అదే వింటాడనీ! రంగి అత్త, మా ఇంట్లో పాచిపని చేస్తుందిగా.. అది చెప్పింది. సినిమాలకు, షికార్లకు తిరుగుతారు, నాల్గు డబ్బులు, వెనకేసుకోకుండా, ఇట్టా తగలేత్తన్నారు. అసలే ఆడపిల్ల పుట్టింది. దాన్ని ఒకయ్య సేతిలో, పెట్టాలా! సేపితే వినరని, రంగి అత్త సత్తెమ్మ మొత్తుకుంటుందే" అన్నది కోమల.
సత్తెమ్మ, మాటలకేమి గానీ! రంగిని, సింగడు, ప్రేమించి, పెళ్లి, చేసుకున్నాడు. సత్తెమ్మకు, దీన్ని సింగడు, పెళ్లి చేసుకోవటం, ఇష్టం లేదు, వాళ్ల అన్న కూతురును చేసుకుందామనుకుంది. కానీ సింగడు, వాళ్ల నాన్న చెల్లెలు, కూతురు ఈ రంగిని, ఇష్టపడ్డాడు. ఈ వూళ్లోనే, వుంటారుగా. ఇదివరకు, ఈ రంగి, తల్లి, మా ఇంట్లో పనులుచేసేది.
సత్తెమ్మకు, అన్న కూతురును చేసుకుంటే, ఎక్కువ కట్నం వస్తుందని, ఈ రంగిని, చేసుకోవద్దంది. సింగడు, గొడవ చేసి రంగిని పెళ్లి చేసుకున్నాడు. తనమాట, వినకుండా, చేసుకున్నాడని, ఈ, రంగి అంటే పడదు.
ఏమాటకు, ఆమాట, చెప్పుకోవాలి, రంగిని చాలా బాగా చూసుకుంటాడు, సింగడు. కూలిపనులకు, వద్దూ! పిల్లను చూసుకుంటూ, ఆసాముల ఇంట్లొ, పనిచేయమంటే మా ఇంట్లో, చేస్తుంది. సింగడు మీద కోపానికి, అన్న కూతురిని, రెండో కొడుకుకు చేసుకుంది. ఆ పిల్లకు, పట్నం నుండి వచ్చానని, తెగ పొగరు. కూలికెళ్ళదు, ఇళ్ళల్లో పనిచేయదు. దానికి, కూర్చోబెట్టి పెడుతుంది, ఈ సత్తెమ్మ. ఆపిల్ల, మొగుడ్ని ఆటో తోలి, రోజుకు ఐదువందలిస్తెనే, నేను నీకు, కూడు, పెడతాను అందిట.. ఆరోజుకు, మొగుడు, డబ్బులియ్యకపోతే, ఈ సత్తెమ్మ ఇవ్వాలిట, లేదంటే, కాపురం చేయనని గొడవట.
మొన్న సత్తెమ్మ లేవకపోతే, ఈ రంగి, వెళ్ళి తనింటికి తెచ్చి హాస్పిటల్లో, చూపించి ఓపికొచ్చిన తర్వాత, ఇంటికి, పంపింది.
మీ అత్త, నిన్ను, తిడుతుంది కదే! ఎట్లా చూసావు!, మీ అత్తనంటే", మా మామయ్య, మొహం చూసి, మా అత్తను, సూసుకున్నా. మా పెళ్ళి జరగటానికి, మామయ్య, కారణం. మాయమ్మ కూడా, మా అన్నను, బాగా సూసుకోవాలంటది. మా అత్త లేచి తిరిగితే, మామయ్యకు, గంజి కాసి పోత్తదని సూసానంది. అంత మంచి మనసు రంగిది. అయినాసరే! సత్తెమ్మకు ఈ రంగి అంటే, గిట్టదు. ఎపుడూ! దీనిమీద సాడీలు, చెప్పటమే పని.
సినిమాలకు వెళ్తారు, తప్పేముంది, ఎంజాయ్ చేస్తున్నారు. మనమిప్పుడు, ఏమి చేస్తున్నాము. ఖాళీగా కూర్చుని, ఇదిగో, ఇలా పోయేవాళ్ళని చూసి కుళ్లిపోవటమేగా. ఇవాళ ఏమి సుఖపడ్డామా! అనేదే లెక్క. కాలంనాడు డబ్బులు కూడబెట్టేసరికి మనకు వయసయిపోతుంది. ఆతర్వాత, ఆడబ్బులు, పిల్లల చేతిలో పెట్టీ! కళ్ళుమూసుకోవటమే, మనపని.
మనిద్దరికీ! కార్లు ఉన్నాయి, వాటికి, కవర్లు, వేసి, కప్పటమేగా! పిల్లలొస్తే, వాళ్ళు కవరు, తీసి వాడటమే. ఏనాడైనా! మనం మనవూరు వొదిలి, సిటీకి, మన భర్తలతో సినిమాకు, వెళ్ళామా. ! అరుగులమీద కూర్చుని, ఇలా, ప్రతివాళ్ళ మీద చెప్పుకోవటానికి, అలవాటు పడకుండా.. దానిలో ఎంతవరకు, నిజం ఉందో! ఆలోచించాలి కోమల"అంది మాలతి
"నిజమే! మాలతి, మనం ఇలాంటి వాళ్ళను చూసి తృప్తిపడితే, వచ్చే జన్మలోనైనా, ఇలాంటి చిన్న చిన్న సరదాలను తీర్చుకుంటే, చాలే" అంది కోమల.
"వచ్చే జన్మకు, మనం, మనుషులుగా, పుడతామో! లేదో. !? ఈ జన్మలోనే అన్నీ తీర్చుకోవాలి. డబ్బుంటే సుఖపడతామనేది అబద్దం. దేనిమీద సినిమాకు వెళ్ళామని కాదు. ఆరోజును ఎంత గొప్పగా, సంతోషంగా గడిపామనేది ముఖ్యం.
పుడితే, గొప్పవాళ్ళింట్లో పుట్టాలి, లేదా, పేద వాళ్ళగా పుట్టాలి. ఈ మద్యతరగతి, కుటుంబాల్లో అసలు పుట్టకూడదు. డబ్బున్నవాళ్ళు, మార్కెట్లోకి, ఏ చీరవచ్చినా! ఫర్నిచర్ వచ్చినా! వాళ్లకు కావాల్సినట్లుగా, కొనుక్కుంటారు. ఆనందముగా, ఉంటారు
పేద వాళ్లయితే! ఏరోజు డబ్బులు, ఆరోజు, ఖర్చుపెట్టుకుని, సంతోషంగా వుంటారు. రంగి, సంక్రాంతికి, షాపింగ్ మాల్ లో కొత్తరకం చీరలు, వచ్చాయని కొనుక్కుని, పండక్కి కట్టుకుని, పనికి, వస్తుంది.
ఏంటి, రంగి! కొత్త, చీరలో, కళకళలాడుతున్నావంటే.. !" "ఏడాదికి, నాలుగుసార్లు, పుట్టినరోజు, పెళ్లిరోజు, సంక్రాంతి, దసరాకేగా!, అమ్మగారు, చీరలు, కొనుక్కునేది. మీలాగా, ఖరీదుగల, చీరలు, కొనకపోయినా! ఏవో, మార్కెట్ లో వచ్చే, కొత్త, సినిమా, సీరలు, కొనుక్కుంటాను. ఇది, సమంత, సీరంటా, బాగుందా!" అని చూపించింది.
"మేమేక్కడా, కొంటామే, నీలాగా! ఎపుడన్నా కొందామనేసరికి, ఏదొక ఖర్చు వస్తుంది. లేదా, పిల్లలు, ఇంటికి వస్తారు, వాళ్లకు కొందాములే, అనుకుని, మేము, కొనుక్కోమన్నాను. "
"అట్లాఎట్లమ్మ గారు! ఏ వయసులో, ముచ్చట, ఆ వయసులో, జరగాలి. ఇపుడు, డబ్బులు, దాసుకుని, తరవాత, కొందాములే అనుకుంటే, ఇంతలో ముసలోళ్లము అయితాము. అపుడు, ఈ సీరలు వేసుకున్నా, ఒకటే, లేకపోయినా, ఒకటేగా, అమ్మగారు.. ! మీకివన్ని, తెలవనివి గావులే" అంటూ, నాకు, జీవితసారం చెప్పింది.
"నేను, ఇంట్లో వుండేదాన్ని, నువ్వు, నాల్గిళ్లు, తిరుగుతావు. నేనే, నీదగ్గర చాలా నేర్చుకోవాలంటే" "సాల్లే, వూరుకోండమ్మగారని" నవ్వుతుంది రంగి
మెళ్ళో, యెంటే!? ఆ హారం అంటే, ఏవో గిల్ట్ నగలమ్మ గారు. ఇవి వేసుకుని, మా, ఫంక్షన్లకు, వెళితేనే, మాకిలువ. బంగారమువి ఎటూ! కొనుక్కోలేముగా, ! ఇలా సీరలకు, మాచింగ్, ఈగిల్ట్ నగలు, పెట్టుకుంటే, అదొక తుప్తి. " అంది రంగి.
"మనం, ఎవరన్నా!, పెట్టిన చీరలు, లేకపోతే ఎన్నో ఏళ్ళనుండి, ఉన్నవి, కడుతుంటాము. నేను, నా పుట్టిన, రోజు, పెళ్లిరోజు, ఎపుడో, !మరచిపోయాను. పిల్లలు, చిన్నగా, వున్నప్పుడు నా బర్త్ డే ను గుర్తు చేసేవారు. ఇపుడు వాళ్లున్న బిజీ లైఫ్ లో గుర్తు చేయటం, మానివేసారు.
మన నగలు, ఎపుడూ!, బ్యాంక్, లోనే, వుంటాయి. ఎపుడైనా, విడిపించుకొస్తే, పండగకి పెట్టుకుందామనే, లోపు, ఏదొక ఖర్చుకు, మళ్ళీ బ్యాంకులోకి వెళ్తాయి. గిల్ట్ నగలు, చూస్తూచూస్తూ, కొనుక్కొలేము. నా కాసులపేరు, ఇన్నేళ్ళలో నేను, పెట్టుకుంది, వేళ్ళమీద, లెక్కపెట్టవచ్చు.
"మనకన్నా, ఈరంగి, చక్కగా, సంతోషముగా, జీవితాన్ని గడుపుతుంది. మనం, మన గతాన్ని, తలుచుకోకుండా! మనమిప్పుడు, ఆరోగ్యాన్ని, చూసుకుంటూ ఈరోజు, చక్కగా, ఉన్నామా.. లేదాని! చూసుకోవటమే, మనం చేయాల్సింది. ఉన్నదానితో ఆనందంగా జీవించటంలోనే, ఉంది సంతృప్తి కోమలా!" అంది మాలతి. "అవునే! మా బాగా చెప్పావంటూ!" తలాడించింది కోమల.
***
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్. మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.
కథ కాలానుగుణ్యంగా ఉన్నది-అభినందనలు.