'Akali Danam' - New Telugu Story Written By Allu Sairam
Published In manatelugukathalu.com On 21/02/2024
'ఆకలి దానం' తెలుగు కథ
రచన: అల్లు సాయిరాం
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
రోజురోజుకీ విజృంభిస్తున్న చలికి తొందరగానే శీతాకాలపు సూర్యుడు డ్యూటీ దిగే పనిలో పడమటి దిక్కున చేరుకున్నాడు. సంతోష్ తన ఫ్రెండ్ సప్తగిరిని కలవడానికి బయలుదేరి బస్టాండుకి వచ్చాడు. ఎవేవో బస్సులు వస్తున్నాయి కానీ, తనకి కావాల్సిన బస్సు మాత్రం రావట్లేదు. ఖాళీగా ఉండే బదులు, బస్సు టికెట్టుకి తన దగ్గర చిల్లర ఉందో లేదోనని అని పర్సు తీసి చూస్తే ఒక ఐదొందల రూపాయిల నోటు, ఒక పది రూపాయిల నోటు ఉన్నాయి. బస్సుకైనా, ఆటోకైనా ఒక వైపు టికెట్టుకి పది రూపాయిలు అవుతుంది. మరి, తిరిగి వచ్చేటప్పుడైనా, పది రూపాయిల టికెట్టుకి ఐదొందల రుపాయిల నోటు బస్ కండక్టర్ కి యిస్తే, చిల్లర లేదని, బస్సు దించిన దించేస్తాడు. అదేదో, యిప్పుడే చిల్లర మార్చుకుంటే మంచిది అని బస్టాండ్ చుట్టూ ఉన్న షాప్స్ చూస్తున్నాడు.
మళ్లీ అంతలోనే అమితమైన జ్ఞానోదయం కలిగి "ఆఁ షాపు వాళ్లు మాత్రం ఐదొందలకి చిల్లర వూరికేనే యిస్తారేంటీ! వాళ్ల దగ్గర ఏదోక వస్తువు కొంటే గానీ, చిల్లర యివ్వరు గదా!" అని వాస్తవం గుర్తొచ్చి, ఆ ప్రయత్నం మానుకున్నాడు.
పక్కనున్న ఫాస్ట్-ఫుడ్స్ సెంటర్లలో తయారుచేస్తున్న ఫుడ్ ఐటమ్స్ మసాలాల ఘాటుతో ఘుమఘుమలు వచ్చి, సంతోష్ ముక్కుని తాకాయి. పనిలో పడి తాను మధ్యాహ్నం సగం సగం తిన్నానని గుర్తొచ్చి, అంతవరకు లేని ఆకలి, కొత్తగా పుట్టుకొచ్చి, ఏదైనా తిందామా అనిపించింది. పనిలో పనిగా, ఐదొందలకి చిల్లర కుడా వస్తుందని పెద్ద ఆలోచనతో రెండడుగులు అటువైపు వేశాడు. మళ్ళీ అంతలోనే, టైం నాలుగున్నర అవుతుంది. ఇప్పుడెందుకు! అటు మధ్యాహ్నానికి కాక, ఇటు రాత్రికి కాక! పోనీ, తిరిగి వచ్చేటప్పుడు రాత్రికి తీసుకుని వెళ్దామా అని మరో ఆలోచన.
అయినా ఎందుకులే! ఒక చికెన్ ఫ్రైడ్-రైస్ డెబ్బై, ఎనభై రూపాయిలు అంటాడు. ఎటు మన కడుపుకి చాలదు. ఆకలి తీరదు! అదే డెబ్బై రుపాయిలకి మరో పదో, ఇరవై రూపాయిలు కలిపితే, అరకేజీ చికెన్ వస్తుంది. రేపు ఆదివారం చికెన్ తెచ్చుకొని ఎంచక్కా తినవచ్చు. అసలు, ఆ బస్సు వచ్చేస్తే, యి గొడవే లేదు అని నిట్టూరుస్తూ చేతి వాచ్ చూసుకుంటున్నాడు.
చాలాసేపు నిరీక్షణ తర్వాత బస్సు వస్తుంది. "హమ్మయ్య!" అనుకుని వచ్చిన బస్సులో కాలుపెట్టి ఎక్కబోతున్న సంతోష్ దగ్గరికి, ఒక పెద్దాయన వచ్చి "బాబు..బాబు! చాలా ఆకలిగా ఉంది. రెండు రోజుల నుంచి ఏం తినలేదు! ఏదైనా.." అని చాలా దీనంగా అడిగాడు.
అభినవ దానవీరశూరకర్ణులందరికీ ర్యాంకులు యిస్తే, మెరిట్ లిస్టులో కాకపోయినా, వెయిటింగ్ లిస్టులో సంతోష్ పేరు కచ్చితంగా ఉంటుంది. తన స్నేహితులకి, తెలిసినవాళ్ళకి, అవసరానికి వందల నుంచి వేల రూపాయిల వరకు సాయం చేశాడు. సంతోష్ కి దయాగుణం ఎంతుందో, ఎదుటివారికి తను యిచ్చిన డబ్బులు తిరిగి అడగడానికి కుడా చచ్చేంత మొహమాటం!
దీనంగా అడుగుతున్న పెద్దాయన వైపు బస్సు ఎక్కకుండా జాలిగా చూస్తున్న సంతోష్ వైపు బస్సు కండక్టర్ కోపంగా చూస్తూ "ఎంతసేపు ఎక్కుతావు? బస్సు ఎక్కుతావా? దిగిపోతావా?” అని అడిగాడు.
చాలాసేపు ఎదురుచూసిన తర్వాత వచ్చిన బస్సు ఎక్కుతూ పెద్దాయనని చూస్తుంటే ఏదోక సాయం చేద్దామని సంతోష్ మనసు తెగ కొట్టేస్తుంది. టక్కున, తనకే తెలియకుండా పర్సులో ఉన్న పది రూపాయిల నోటు మీదకి తన చేయి వెళ్ళిపోయింది. తీసిచ్చేస్తే బస్సు చార్జీకి చిల్లర ఉండదని తెలిసినా, ధైర్యంచేసి, పది రూపాయిల నోటు ఆ పెద్దాయనకి యివ్వబోతుంటే, పెద్దాయన అందుకోకుండా "ఊఁ తినడానికి ఏదైనా యిప్పిస్తే బాగుంటుంది!" అని మరింత దీనంగా మొహం పెట్టి అడిగేసరికి, సంతోష్ కి ఏం చేయాలో తోచక బస్సు డోర్ పట్టుకుని ఆలోచిస్తూ ఉండిపోయాడు.
ఒక పక్క డ్రైవర్ కొడుతున్న బస్సు హారన్, కండక్టర్ కేకలుకి బస్సు ఎక్కిపోదామనిపించినా, ఆ పెద్దాయన ఆకలి మాటలు కొట్టలేక, అలా ఆకలితో వదిలేసి వెళ్లలేక, చివరికి బస్సు దిగిపోయాడు సంతోష్. కండక్టర్ కోపంగా సంతోష్ వైపు కోపంగా చూస్తూ “యిదేదో ముందే దిగిపోవచ్చు కదా! అనవసరంగా టైం వేస్ట్! రైట్..రైట్!" అని డ్రైవర్ కి బస్సు నడపమని విజిల్ వూది సైగ చేశాడు.
“ఆ పెద్దాయన ఆకలి అంటున్నాడా! ఆయనకి తినడానికి ఏదోకటి యిప్పించేసి, వచ్చేస్తాం గదా! రెండు నిమిషాలు బస్సు ఆపితే అరిగిపోతాడా! ఓఁ అంతలా అరిచేస్తున్నాడు! సరేలే! ఈ టైంలో టిఫిన్లు ఎక్కడైనా, ఏమైనా రెడీ అయ్యాయా!” అని చుట్టూ ఉన్న షాప్స్ చూస్తున్న సంతోష్ ని గమనిస్తున్న పెద్దాయన ఫాస్ట్-ఫుడ్స్ సెంటర్ వైపు నడుస్తూ, సంతోష్ ని కుడా రమ్మన్నాడు. సంతోష్ అక్కడికి వెళ్ళి ఆ షాపు వారితో "టిఫిన్ ఏమైనా రెడీ అయ్యిందా?" అని అడిగాడు.
అక్కడ పరోటాలు చేస్తున్న వ్యక్తి, పెద్దాయన పక్కన నిల్చున్న సంతోష్ ని పైనుంచి కిందికి ఎగాదిగా చూస్తూ "ఏం కావాలి?" అని అడిగాడు.
బస్టాండ్ వైపు ఒక కన్నుతో, పెద్దాయన వైపు మరో కన్నుతో చూస్తూ "మీరు ఏం తింటారండీ?" అని కంగారుగా అడిగాడు సంతోష్.
పెద్దాయన నోటితో చెప్పకుండా, చేత్తో చూపిస్తుంటే, చూసి సంతోష్ "ఓహో! పరోటా తింటారా! అన్న! ఒక రెండు పరోటాలు తినడానికి యిచ్చేయండి! ఎంత అవుతుంది అన్న?" అని గబగబా పెద్దాయనకి తినడానికి యిప్పించేసి, షాపువారికి డబ్బులు యిచ్చేసి, మళ్లీ మరో బస్సు వచ్చేలోగా తిరిగి వెళ్ళిపోవాలనే గాభరాలో అడిగాడు.
పెద్దాయన ఎర్రగా కళ్ళెర చేస్తూ "అవి కాదు!" అని షాపు లోపల ఉన్న ఐటైమ్స్ వైపు చెయ్యి మరింత సూటిగా చూపించాడు.
"మరింకేం కావాలి? దోశ, ఇడ్లీ, చపాతి!" అంటూ సంతోష్ మెనూకార్డు చదువుతుంటే "నాకు అది కావాలి!" అని చూపించాడు పెద్దాయన కూసింత అసహనంగా.
ఆ షాపు ఓనర్, పరోటాలు చేసే వ్యక్తి "ఈ పెద్దాయనకి ఈరోజు ఎవడో బాగా దొరికిపోయినట్టున్నాడురా!" అన్నట్టుగా సంతోష్ వైపు జాలిగా చూస్తున్నారు.
పెద్దాయన ముఖంలో, మాటల్లో ఊహించని మార్పులకి సంతోష్ ఆశ్చర్యపోతూ "మనకి ఎందుకురా, యి బాధ! ఆయన ఏమడిగితే, అది యిప్పించేసి వెళ్లిపోవడం బెటర్!" అని పెద్దాయన చేయి చూపించిన దగ్గర చూస్తే తందూరి చికెన్ ఉంది. అది చూసి "తందూరి చికెన్. ఆఁ!!" అని నోరు తెరిచాడు. పెద్దాయన అవునన్నట్లుగా తల వుపాడు. షాపు ఓనర్, పరోటాలు చేసే వ్యక్తి లోలోపల నవ్వుకుంటున్నారు. సంతోష్ కి నవ్వాలో, ఏడవాలో అర్ధం కాలేదు.
"పెద్దాయన! రెండు రోజుల్నుంచి ఏం తినలేదంటున్నావు! ఇప్పుడు, యింత మసాలా ఫుడ్ తినడం అంత అవసరమా! అంత మంచిది కాదు. వేరే టిఫిన్ ఏదైనా తీసుకో!" అని చెప్తున్న సంతోష్ వైపు పెద్దాయన చూస్తూ “నీ ఉచిత ఆరోగ్య సలహాలు చాలులే బాబు!” అని మనసులో అనుకుంటున్నట్టుగా ముఖం పెట్టుకొని "నాకు అదే కావాలి!" అని గట్టిగా దబాయించి అడిగాడు.
ఒక్కొక్క మాట మాటకి పెద్దాయనలో వస్తున్న మార్పులకు, సంతోష్ ఆశ్చర్యపోతూ "సరిపోయింది!" ఎరక్కపోయి వచ్చి యిరుక్కుపోయామన్నట్టుగా ముఖం పెట్టాడు. అప్పుడు, ఆ షాపు ఓనర్, పరోటాలు చేసే వ్యక్తి చూసే చూపులు అర్ధమయ్యాయి.
"అది కాదు పెద్దాయన!" అని సంతోష్ ఏదో చెప్పబోతుండగా "చూడు బాబు! నువ్వు యిప్పిస్తే, అది యిప్పించు! తింటాను. లేకపోతే, ఏది వద్దు!!" అని తెగేసి చెప్పాడు పెద్దాయన.
ఒక్క క్షణం సంతోష్ కి అక్కడ ఏం జరుగుతుందో, తాను ఏం చేస్తున్నాడో అర్ధం కాక, మరి ఏం చేయలేక, పెద్దాయన్ని ఏం అడగలేక, ఆ షాపు ఓనర్ ని చూసి "అది ఎంత అన్నా?" అని అడిగాడు.
"130 రూపాయిలు! " అని షాపు ఓనర్ చాలా ప్రశాంతంగా చెప్పిన మాటలకి, సంతోష్ గూబ గుయ్యమంది. సరేలే! నిండా మునిగాక చలి ఎందుకలే అని, గట్టిగా ఊపిరి తీసుకుని "మీకు అదే కదా కావాలి! కచ్చితంగా తింటారు కదా!!" అని చివరాఖరిగా అడిగాడు సంతోష్.
అదే కావాలన్నట్టుగా తల వుపాడు పెద్దాయన. సంతోష్ కి ఓపిక నశించిపోయి "అదే కావాలంట! యిచ్చేయండన్నా!" అని అంటూ పర్సులో ఐదొందల నోటు తీసి షాపు ఓనర్ కి యిచ్చాడు.
మిగిలిన చిల్లర తీసుకున్నాక, అక్కడ ఒక్క క్షణం ఉంటే ఒట్టు! కనీసం వెనక్కి తిరిగి చూడకుండా గబగబా బస్టాండుకి వచ్చేస్తున్న సంతోష్ బుర్రలో, పోయిన డబ్బులు గురించి ఏం ఆలోచనల్లేవు. ఎందుకంటే, యితరులకి ఖర్చు పెట్టాలంటే మొహమాటంగా ఎంతైనా పెట్టేస్తాడు. తనకి తాను ఖర్చు పెట్టాలంటే మాత్రం, వంద లెక్కలేస్తాడు. అదంతా సరే! తనకి అర్ధం కానిది ఏంటంటే, యిప్పుడు ఏదో మాయలా జరిగినదాన్ని ఏమంటారని!
"ఎక్కిన బస్సు దిగి మరి, పెద్ద పోటిగాడులా వెళ్లావు. ఏమి వచ్చింది? 500 రూపాయిలకి 370 రూపాయిల చిల్లర వచ్చింది. అయినా, అంతా రుణం రా! రుణం!! ముందు, నాకు తినాలనిపించినప్పుడు, ఓ ఫైనాన్స్ మినిష్టర్ లా పెద్ద లెక్కలేయడమేంటీ! లేకలేక వచ్చిన బస్సు సరిగ్గా ఎక్కుతున్నప్పుడు ఎవరో పెద్దాయన వచ్చి ఆకలి అని అడగడమేంటీ! చేతిలో చిల్లర లేకపోయినా దానం చేసేయడానికి నేను ముందు పడడమేంటీ! ఇరవై, ముప్పై రూపాయిల్లో అవుతుంది అనుకుంటే నూట ముప్పై రుపాయిలు అవ్వడమేంటీ!
యిది దానం అనాలో, రుణం అనాలో అర్ధం కావట్లేదురా. మనకి, ఆ షాపు ఓనర్ కి ఏదో జన్మలో రుణం ఉండి ఉంటుందిరా! ముందు మనకి తినాలనిపించినప్పుడే, ఆలోచించకుండా తినేస్తే పోయేది! ఆ తర్వాత ఆ పెద్దాయన వచ్చాడు. ఇదంతా జరిగింది. ఆ పెద్దాయనకైతే మాత్రం ఖచ్చితంగా ముందు జన్మలో చాలా రుణం ఉండి ఉంటానురా. లేకపోతే, ఏదో హక్కు ఉన్నట్టుగా, అంత గట్టిగా ఆ అడగడమేంది సామి!" అని పోయిన నూట ముప్పై రుపాయిలకి సరిపడా, తనకి తాను సర్ది చెప్పుకుంటూ, బస్టాండులో కూర్చున్నాడు సంతోష్.
యిదంతా మొదటి నుంచి గమనిస్తున్న ఆ బస్టాండులో కూర్చున్న ఒక వ్యక్తి "బాబు! నువ్వు వెళ్ళాల్సిన ఆఖరి బస్సు యిప్పుడే వెళ్ళిపోయింది" అన్నాడు పుండుమీద కారంచల్లినట్లుగా.
అంతే! అప్పటికే ఓపిక చచ్చిపోయి ఉన్న సంతోష్ "చఁ! మీటింగు లేదు. గుడ్డు లేదు!! " అని తన యింటి ముఖం పట్టాడు. ఎన్ని దానాలు చేసినా, సంతోష్ కి ఈ " ఆ కలి దానం" తన జీవితంలో మరిచిపోలేని అనుభవంగా గుర్తుండిపోయింది.
***
అల్లు సాయిరాం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: పేరు అల్లు సాయిరాం
హాబీలు: కథా రచన, లఘు చిత్ర రూపకల్పన
ఇప్పటివరకు పది కథల దాకా ప్రచురితమయ్యాయి.
ఐదు బహుమతులు గెలుచుకున్నాను.
Comments