అల్పంపచుడు

'Alpampachudu' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally
'అల్పంపచుడు' తెలుగు కథ
రచన: సుదర్శన రావు పోచంపల్లి
అప్పులోణ్ణి, చెప్పులు లేనివాణ్ణి వెంట తీసుక పోగూడదనేది ఒక సామెత. అట్లనే..
తృణాయ లఘుతర తూలః
తులాయ యాచకః
వాయునాంకిం ననీతోతౌ
మామయా యాచయే దితి.
అంటే
ప్రపంచములో తేలికైనది గడ్డిపోచ.
దానికంటే తేలికైనది పత్తి.
పత్తికంటె తేలికైనది వాయువు.
వాయువు కంటె తేలికైనది యాచకుడు.
అదే పిసినారి భావానికి మూలం
గాలి, గడ్డిపోచ, పత్తిని వెంట తీసుక పోయినా యాచకుడిని తీసుకపోరు. కారణం యాచకుడు తనను ఏమి అడుగుతాడో అని.
అదే మనస్తత్వము గల పిసినారి భరద్వాజ త్రోవలో కొడుకు గాని భార్య గాని ఏమి కొనియ్యమని అడుగుతారో అని ఎక్కడికన్న పోయేటప్పుడు వెంట తీసుకపోడు.
భరద్వాజకు భార్య గుణశీల, కొడుకు చేతన్ తో కలుపుకొని ముగ్గురే వాళ్ళ కుటుంబము. ఆస్తిపాస్తులు వచ్చే తరానికి సరిపోను ఉన్నా కడుపునిండ తృప్తిగా తిని ఎరుగడు.
ఎవరి ఇంటిలోన ఏదేని వేడుక జరిగినా పోవడానికి జంకుతాడు. కారణం కట్నము పెట్టవలసి వస్తుందని. పదిసార్లు వారింట్ల తిన్నా తనూ ఏదో నోమో వ్రతమో చేసి పిలువ వలసి వస్తుందను సందేహముతొ ఉంటాడు. ఏదో వంకబెట్టి తప్పించుకుంటాడు.
అతనిని ఊరివారందరు దృఢముష్టి అని పిలుస్తారు. దృఢముష్టి అంటె గట్టిగా పిడికిలి బిగించే వాడు అని అర్థము. అంటె ఎవ్వరికి ఏమి ఈయడానికి మనసొప్పనివాడు.
ఎంత పిసినారి అంటె
ఉదకము త్రాగడు సరిగను
వదలడు ముల్లెను ఎవరును వచ్చిన గానిన్
సదనము నందున వ్యయమన
పదిలము పడుచును ధనముయె ప్రాణము అనుచున్
సన్నవి బియ్యము వాడడు
ఎన్నడు దొడ్డువె సరియను ఎరుగగ నుండన్
అన్నము నందున కూరలు
ఎన్నడు ఒప్పడు అధికము ఎవరును రాగన్
మొక్కలు బెంచను ఎరువులు
చక్కగ వేయడు ఎపుడును చాలని కొంచెం
మిక్కిలి పిసినా రగుటన
చక్కగ నీరును వదులడు చచ్చిన గానీ
భరద్వాజ్ ఎంత పిసినారంటె భార్య గుణశీలను నుదుట కుంకుమ బొట్టు కూడా చాలా చిన్నగా పెటుకొమ్మంటాడు. ఎందుకంటె ప్రమాణము చిన్నగా ఉంటె కుంకుమ చాలా రోజులు వస్తుందని అతని ఆలోచన. గుణశీలకు మాత్రము అంత అందమైన ముఖము మీద {పిపీలికా చుంబతే చంద్రబింబం}చీమ ముద్దుపెట్టుకుంటున్నదన్నటుంటది.
ఇంట్లో రేడియోలు, టీ. వీ. లు సెల్ ఫోన్లు వద్దంటడు.
తండ్రి పిసినారి తనము భరించ లేక కొడుకు
చేతన్ ఇంట్లోనుండి వెడలి పోతాడు. దానికి తల్లి గుణశీల దుఃఖించుచుంటది. అయినా భరద్వాజ్ చలించడు. పోతేపోనీ రోజూ రెండుపూటల తిండి మిగులుతది అంటాడు.
తైల సంస్కారము లేని జుట్టు. మాసిన గడ్డము. చౌకారము{సబ్బు}లేని స్నానము ఇటువంటి లక్షణాలతో బ్రతుకుతుంటాడు. గుణశీల అనుకుంటది నరకము అంటే ఇదేనేమో అని.
ఇట్లా కొంత కాలము భరించగా గుణశీలకు విసుగొచ్చి ముక్కుమీద కొట్టనిది కోపము రాదు అను సామెత ప్రకారము బొట్టు, గాజులు తొలగించి పాత చీర ధరిస్తుంది. కొడుకు పారిపోయిన ఏడ్పు ఎలాగూ ఉన్నది కనుక.
భరద్వాజ్ అది చూచి ఖిన్నుడౌతాడు. తను చనిపోతె పరిస్థితి ఇట్లనే ఉండవచ్చు అని మనసుకు స్ఫురిస్తుంది.
పిసినారి తనము నాదని
కసురగ వినకను మదినిడి కళ్ళాలనగన్
కొసకీ విధమగు రూపము
పొసగక పాయెను మదికిని పోకిరి తనమున్
భార్య నా పిసినారి తనము కసురుచు చెప్పినా దుర్మార్గపు పోకడచే విననైతిని తుదకీ గతి పట్టె అని వాపోతాడు భరద్వాజ్.
తన మనసే తనకు జుగుప్స కలిగించి పరివర్తనా భావం తో కుమారుని వెదుక బోతాడు భరద్వాజ్.
వారం రోజులు నిద్రాహారాలు మాని ఒక హోటల్ లో పని చేయుచున్న కొడుకును చూసి దుఃఖిస్తాడు భరద్వాజ్.
“నా అవివేకము వలన మీ అమ్మకా పరిస్థితి నీకీ దుర్గతి పట్టడానికి కారకు డైనందులకు చింతిస్తున్నాను. ఇక నీ ఇష్ట మొచ్చిన తీరు మెలుగు నాయనా. మన కుటుంబానికి నీవైనా గౌరవము వచ్చేటట్టు వ్యవహరించు” అంటాడు.
కొడుకు చేతన్ ను తీసుకవచ్చి భార్య గుణశీలకు చూపుతాడు భరద్వాజ్. “నన్ను క్షమించు గుణశీలా! నేటినుండి నీ అజమాయిషి లోనే కుటుంబ వ్యవహారము నడుస్తుంది” అని భార్య చేతిలో చేయి కలుపుతాడు, త్రొవలో తాను తెచ్చిన పూలు, గాజులు, కుంకుమ. పట్టుబట్టలు అందిస్తూ, కన్నీరు కారుస్తూ భరద్వాజ్.
ఇక ఇంటికి సున్నము వేయించి వ్రతము చేస్తున్నాము రమ్మని ఇంటింటికీ తిరిగి మరీ మరి రమ్మని చెబుతాడు భరద్వాజ.
ఆ వ్రతము రోజు వారందరికి పంచభక్ష పరమాన్నాలు వడ్డించి అందరికి కానుకలిచ్చి పంపుతాడు.
ఇతని పిసినారితనము పోయినందుకు అందరు హర్షిస్తారు.
భరద్వాజ్ దృఢముష్టి అను పేరు కూడా తొలగి పోతుంది.
ఉన్న ఆస్తితొ ఇంటిలోని ముగ్గురు నిత్యకల్యాణం పచ్చ తోరణంగా బ్రతుకసాగారు.
సమాప్తం.
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
https://www.manatelugukathalu.com/profile/psr
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.