top of page

అమ్మ (పాత్ర.. యాత్ర)


'Amma Pathra Yathra' New Telugu Story

Written By Ch. C. S. Sarma

'అమ్మ పాత్ర.. యాత్ర' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


కాలింగ్‌బెల్‌ మ్రోగింది..

సత్యానంద్‌ సోఫానుంచి లేచిద్వారాన్ని సమీపించి తలుపు తెరిచాడు.

ఎదురుగా బలరామ్‌!..


‘‘రా బలరామ్‌!.. ’’ చిరునవ్వుతో ఆహ్వానించాడు సత్యానంద్‌.

బలరామ్‌ మౌనంగా లోనికి నడిచాడు. తలవంచుకొని నిలబడ్డాడు.

‘‘కూర్చోరా!.. ’’ చెప్పాడు సత్యానంద్‌.

బలరామ్‌ సోఫాలో కూర్చున్నాడు.


‘‘వూరికి వెళ్లివచ్చాను. మీ అమ్మ నీక్షేమ సమాచారాన్ని గురించి చాలాసార్లు అడిగిందిరా!.. ’’ చిరునవ్వుతో చెప్పాడు సత్యానంద్‌.

‘‘అమ్మ బాగుందా!.. ’’

‘‘ఆ.. ’’

‘‘నాన్న?.. ’’

‘‘వారు నాకు కనబడలేదు. ఏదోపనిమీద విశాఖపట్నం వెళ్లాడట.. ఆయన రాజకీయం నీకు తెలిసిందేగా!.. ’’


‘‘ఆ.. ’’

‘‘అమ్మ నాగురించి ఏమడిగింది?.. ’’

‘‘ఏమడుగుతుందని నీవు ఊహిస్తున్నావో అదే అడిగింది!.. ’’ వ్యంగ్యంగా నవ్వాడు సత్యానంద్‌.

‘‘నేను తప్పుచేశానని అన్నదా?.. ’’

‘‘నీవు చేసింది తప్పా.. ఒప్పా!.. నీ ఉద్దేశ్యం ఏమిటి?.. ’’


బలరామ్‌ మౌనంగా తలదించుకొన్నాడు.. క్షణం తర్వాత..

‘‘నీవుద్దేశ్యం?.. ’’ క్లుప్తంగా అడిగాడు బలరామ్‌.. తన లవ్‌మ్యారేజి విషయంలో అతని భావాన్ని తెలుసుకోవాలని.


‘‘నీవు పెద్ద తప్పు చేశావు. చేయకముందు నాతో చెప్పివుంటే నిన్ను ఆపేవాణ్ణి. నన్ను పరాయివాడిగా.. నీకు అపకారం చేసేవాడిలా భావించి.. నీకైనీవు నిర్ణయం తీసుకొన్నావు. వెర్రి ఆవేశంతో ఊబిలో పడిపోయావు. ప్రతి యువతీ యువకులు.. స్వజనాన్ని.. స్వదేశాన్ని.. స్వధర్మాన్ని.. గౌరవించాలి.. అభిమానించాలి.. ఆదరించాలి.. ప్రేమించాలి. మనం అద్వైతవాదులం.. మన సనాతన ధర్మ పరమార్ధం అదే. కారణం.. ఇందున లేనిదంటూ ఈసృష్టిలో వేరేఏమీలేదు. తాత తండ్రుల గత చరిత్రలను తలచుకొంటే అది సత్యమా!.. అసత్యమా!.. అనే విషయం ప్రతి ఒక్కరికీ అర్థం అవుతుంది. ప్రశాంత చిత్తంతో ఆలోచించాలి. అంతే.. యదార్థం బోధపడుతుంది..


నీవు ఆపని చేయలేదు. జీవిత గమనాన్ని సాగించేదానికి రెండు మార్గాలు వున్నాయి. ఒకటి.. ఇలాగే బ్రతకాలనుకోవటం.. విచక్షణా జ్ఞాన సంపన్నులు తమ జీవితాలను మొదటి మార్గంలో సాగిస్తారు. తాము ఆనందంగా వుంటూ ఎదుటి వారికి తల్లిదండ్రులకు సాటివారికి ఆనందాన్ని పంచుతారు. వారే అసలు సిసలైన మానవులు. రెండవ వర్గం మానవ రూపంలో వున్న దానవులు. ఈ రెండు వర్గాల మధ్యన ఎపుడూ సంఘర్షణే!.. యుగయుగాలుగా ఈ తత్వ.. వర్గ బేధాలతో ఒకరిపట్ల ఒకరికి పగ.. ద్వేషం పెరిగిపోతూవుంది. ఈ తత్వానికి విరుద్ధమైనది ఒక తల్లిమనసు. ప్రతి తల్లీ తమ బిడ్డలకోసం.. తన జీవిత కాలంలో జీవితాంతం తర్వాత కూడ పరితపిస్తుంది. అమ్మకు సాటి అమ్మేరా!!!..


దానికి సాక్షి.. మా అమ్మగారి నిర్యాణం.. అపుడు నా వయస్సు పదకొండు.. ఫస్ట్‌ఫారమ్‌ చదువుతున్నాను. మా వూరికి ఎనిమిదికిలోమీటర్ల దూరంలో వున్న బుచ్చిరెడ్డిపాలెం హైస్కూల్లో చదువుతున్న రోజులు. వూర్లో బ్రాహ్మణ ఇంట్లో ఆ ఇంటి అబ్బాయికి ఉపనయనం జరిగింది. మాత గాయత్రి మంత్రోపదేశం.. యజ్ఞోపవీత ధారణ.. చేసే హోమాలను చూసేవారందరికి మంచి జరుగుతుందనే పెద్దలమాటననుసరించి ఆ ఉపనైనాన్ని చూసేందుకు వూరికినాన్నగారు పిలువగా వచ్చాను మా మేనత్తతో కలసి.


మరుదినం బుచ్చిరెడ్డిపాళెం ప్రయాణం. బయలుదేరేముందు అమ్మ నా భుజాలు పట్టుకొని దగ్గరకు తీసుకొని నా ముఖంలోకి చూస్తూ..

‘‘నాన్నా!.. సాటి వారందరితో స్నేహంగా వుండాలి. బాగా చాదవాలి. మీ గురువులను గౌరవించాలి. మంచి మార్కులతో పాస్‌ కావాలి. అందరిచేతా వాడు మంచివాడనిపించుకోవాలి. గుర్తుంచుకో నాన్న!.. ’’ ఎంతో ప్రీతిగా చెప్పింది.


నాకు అమ్మను విడిపోవడం ఇష్టంలేదు. ఎందుకంటే మా అమ్మంటే నాకు ప్రాణం.. కానీ వెళ్లక తప్పదు చదువుకోవాలిగా!..


కన్నీళ్లతో తల ఆడిరచాను. అది డిశంబర్‌ నెల. నా కన్నీళ్లను తన పవిటతో తుడిచి అమ్మ.. ‘‘ ఇంకెంత మూడు నెలలు. పరీక్షలు అయిపోయి శలవులు ఇస్తారుగా.. పరీక్షలుముగిసిన మరుదినమే నాన్న అక్కడికి వచ్చి నిన్ను తీసుకొని మన ఇంటికి వస్తారుగా.. నాన్నా!.. ఏడవకు.. ధైర్యంగా వుండి. బాగాచదువుకో.. సరేనా!.. ’’ ఎంతో అనునయంగాచెప్పింది అమ్మ.

ఆ క్షణంలో ఆమె కళ్లు ఎర్రగా కన్నీటి జీరలతో మెరిసాయి. నన్ను నేను సమ్మాళించుకొని..

‘‘అలాగే అమ్మా!.. ’’ అన్నాను..


నాన్నగారితో.. బి. ఆర్‌. పాళెం చేరాను. నాన్న తిరిగి వూరికి వెళ్లిపోయారు. ఆ సమయంలో మా అమ్మగారు గర్భవతి.

రెండునెలలు గడిచాయి. నెల తర్వాత పరీక్షలు.. ఓ రోజు వుదయం ఎనిమిది గంటల ప్రాంతంలో మా పాలేరు బుచ్చన్న వచ్చాడు.


‘‘ఏం బుచ్చన్నా వచ్చావు?.. ’’ అడిగింది అత్తయ్య.

‘‘అవునమ్మా!.. అన్నయ్య పంపారు. వదినమ్మను హాస్పిటల్లో చేర్చారు. అన్నా మిమ్మల్నిపిలుచుకు రమ్మన్నారమ్మా!.. బయలుదేరండి.. ’’ అన్నాడు బుచ్చన్న.

అత్తయ్య ఆశ్చర్యపోయింది. నా ముఖంలోకి చూచింది. వెంటనే బుచ్చన్న ముఖంలోకి చూచి..

‘‘బుచ్చన్నా!.. అంతా బాగున్నారుగా!.. ’’ సందేహంతో అడిగింది అత్తయ్య.

‘‘ఆ.. ఆ.. అంతా బాగున్నారమ్మ!.. మీరు బయలుదేరండమ్మా!.. ’’ అనునయంగా చెప్పాడు బుచ్చన్న.


అత్తయ్య మనస్సులో ఏదో అనుమానం..

నావైపు చూచి.. ‘‘సత్యా!.. నాన్నా!.. పద వూరికి వెళదాం.. ’’ అంది.


ఆ ఎనిమిది కిలోమీటర్ల మార్గాన మంచి రోడ్డు లేదు. అడ్డదారి కాలువ గట్లు.. చుట్టూ పచ్చని పైరుపొలాలు. ముగ్గురం మా వూరికి బయలుదేరాము.

నా మనస్సున ఎంతో ఆనందం.. అమ్మా నాన్నలను చూడబోతున్నందుకు..

ఎనిమిదిన్నరకు బయలుదేరిన మేము మా వూరికి పదిన్నరకు చేరాము. వూరి చుట్టూ పొలాలు. గ్రామాన్నుంచి తూర్పువైపునకు బండ్లబాట. వీధిన తూర్పున మొదటి ఇల్లుమాది. వీది చివర మా పెదనన్నాగారిల్లు.


‘‘అమ్మా!.. పెద్దన్నయ్య ఇంటికి వెళ్లి ముఖం కడుక్కొని మంచినీళ్లుత్రాగి మనింటికి వెళదామా అమ్మా!.. ఎంతో అనునయంగా అడిగాడు బుచ్చన్న.


‘‘అరే బుచ్చన్నా!.. ఇంకా ఎందుకురా నన్ను మభ్యపెడతావ్‌!.. ’’ భోరున ఏడ్చింది అత్తయ్య.

బండ్లబాటపై బండిలో చింత మొద్దులను వేసుకొని ఇరువురు కాడిని పట్టుకొని మందుకు సాగిపోతూ వున్నారు. ఆ దృశ్యాన్ని అత్తయ్య చూచింది. ఆమె ఏడ్పు రెట్టింపు అయింది.

నాకు ఏమీ అర్ధం కాలేదు. బుచ్చన్నను అత్తను మార్చిమార్చి చూచాను. అత్తయ్య ఏడుస్తున్న కారణంగా నాకూ ఏడుపు వొచ్చింది.. ‘అమ్మా’ అంటూ నేనూ ఏడ్వసాగాను.


ఆ స్థితిలోనే ఇంటి ఆవరణంలో ప్రవేశించాము. ఇంటిముందు బంధువులందరూ.. వూరిజనం.. వున్నారు.. అందరి ముఖాల్లోనూ విచారం.. అత్తయ్య నేను ఇంట్లో ప్రవేశించాము ఏడుస్తూనే..

అమ్మ.. మా అమ్మ.. వెల్లికిలా దక్షిణం వైపు తల పెట్టుకొని నట్టింట పడుకొని వుంది. తలవైపున దీపం.. అలాఎందుకు పడుకొందో నాకు అర్ధం కాలేదు.. కళ్లు పెద్దవి చేసి అమ్మ ముఖంలోకి చూచాను.


‘‘నాన్న.. నన్ను దగ్గరకు తీసుకొని.. ఏడుస్తూ.. ‘‘నాన్నా!.. అమ్మ చచ్చిపోయింది.. ’’ గద్గద స్వరంతో చెప్పి నన్ను చుట్టుకొని భోరున ఏడ్చాడు.

మా తాతయ్య.. ధర్మారావుగారు.. మా నాన్నగారి వీపుపై చేయివేసి.. ‘‘అయ్యా!.. సమ్మాళించుకోవాలి.. అబ్బాయి వచ్చాడుగా!.. ఇక జరుపవలసినదాన్ని.. జరిపించాలయ్యా!.. ఏడవకు.. ఏడవకు.. ’’


తాను ఏడుస్తూ నాన్నగారిని సముదాయించారు తాతయ్యగారు. అందరూ అమ్మ చుట్టూ చేరి ఏడుస్తున్నారు. ఏడుస్తున్న నా కళ్లకు అందరి ముఖాలు రెండుగా కనిపించాయి. ఆ స్థితిలో ఎంతసేపు ఉన్నామో చెప్పలేను.


తాతయ్య ధర్మారావుగారు.. తన పైపంచతో కన్నీళ్లు తుడుచుకొని మెల్లగా లేచారు. బయటికి నడిచారు. కొద్దినిముషాల తర్వాత ముగ్గురు వ్యక్తులతో లోని వచ్చారు..


అందరూ ఏడుస్తునే వున్నారు నాలాగే.. తాతయ్య.. ఆముగ్గురు వ్యక్తులు అమ్మను తమ చేతుల్లోకి తీసుకొన్నారు. వరండాలోకి తీసుకెళ్లారు. కుర్చీలో కూర్చోబెట్టారు.. స్నానం చేయించారు.. పసుపు.. కుంకుమ.. పూలు పెట్టారు. నాన్న అమ్మ పక్కన నిలబడి భోరున ఏడుస్తున్నాడు..

ఆ నలుగురే అమ్మను పాడెపై పడుకోబెట్టారు. క్రొత్తచీరను కప్పారు. తడిసిన బియ్యం పంతులుగారు అందరి చేతికీ అందించారు. వారంతా ఏడుస్తూ ఆ బియ్యాన్ని అమ్మ నోటిపై వుంచారు. తాతయ్య నాచేతా ఆ పని చేయించారు.


పాడెకు నాలుగవైపులా నలుగురు నిలబడి అమ్మ శయ్యను తమ భుజాలపై ఎత్తుకొన్నారు. అందరూ భోరున ఏడ్చారు. నాన్న చేతికి తాతయ్య అగ్నివున్న ముంతను అందించారు. భోరున ఏడుస్తూ నాన్నగారు దాన్ని అందుకొన్నారు. వారివీపు చుట్టూ చేతిని వేసి తాతయ్యగారు నాన్నను ముందుకు నడిపించారు. అమ్మ పల్లకి నలుగురి వాహకులతో స్మశానం వైపునకు బయలుదేరింది. అందరూ బంధువులు.. హితులు కన్నీటితో వెనకాల.. ముందు తాతయ్య నాన్నలు.. వారి మధ్యన నేనూ..


అమ్మ మృతదేహం స్మశానాన్ని చేరింది. నలుగురు పాడెను క్రిందకు దించారు.

కాటికాపరులు బండిలో తెచ్చిన సమిధలు, పిడకలను అమ్మపై పేర్చారు. తాతయ్యగారి సాయంతో నాన్నగారు రోదిస్తూ అమ్మకు తలకొరివిపెట్టారు. కట్టెలపై కిరోసిన చల్లినందున భగ్గున మంట లేచింది. అమ్మ తనువు కట్టెల మంట వలన కనుమరుగైయింది. అందరూ విచార వదనాలతో ఇంటివైపునకు నడిచారు. ఆవుల మద్యన దూడలా నేను తాతయ్య నాన్నల మధ్యన నడిచాను. మా అమ్మగారి నిర్యాణం.. ఆ రీతిగా జరిగింది. అమ్మ చచ్చిపోయిందని ఆమెను తలచుకొని.. ఎన్నో రాత్రులు ఏడ్చి ఏడ్చి నిద్రపోయేవాడిని.


పదిరోజులు మా ఇంటి సభ్యులమధ్యన ఎంతో భారంగా జరిగిపోయాయి. నాన్న నిత్య కర్మను ఆచరించారు.


శాస్త్ర సాంప్రదాయాలప్రకారం.. పదవరోజు కర్మకాండప్రారంభంఅయింది. నాన్నగారికి.. తాతయ్య గారికి.. దాయాదులందరికీ.. నాకు తలనీలాలను తీసేశారు.

రేవులో జరగాల్సిన అమ్మ అంత్యక్రియా కర్మకాండ యధావిధిగా జరిగింది. అది పిండప్రదాన సమయం. తాతయ్యగారు పిండాల అరిటాకును నాన్నగారి చేతుల్లో వుంచి ఆ ప్రాంతంలో ఉన్న తాటిచెట్ల చుట్టూ తిరిగారు. చెట్లపై చాలా కాకులు వున్నాయి. కానీ ఒక్క కాకికూడ చెట్టుదిగి మొదట్లో పెట్టిన పిండాలను ముట్టలేదు. సనాతన దర్మాలను నమ్మే తాతయ్యగారు నాన్నగారు భోరు ఏడ్చారు.


‘‘ఆమె మనస్సులో తన కొడుకు చేతులమీదుగా జరగవలసిన ఈ క్రియ జరగడంలేదని కొరతేమోరా.. ’’ ‘‘ఒరేయ్‌!.. ఒరేయ్‌!.. సుబ్బారాయుడు!.. సత్యాకు స్నానం చేయించి తీసుకురారా!.. ’’ అన్నారు తాతయ్యగారు.. గద్గద స్వరంతో.. సుబ్బారాయుడుగారు మా అమ్మగారి చిన్నాన్నగారి కొడుకు. నాకు మామయ్య.


అక్కడ వున్న దిగుడు భావిలో నన్ను ఎత్తుకొని పోయి మామయ్యనాకు తలస్నానం చేయించి.. నడుముకు టవల్‌ను చుట్టి.. తాతయ్య నాన్నల దగ్గరకు తీసుకొని వచ్చాడు. ఆ పిండాల ఆకును తాతయ్యగారు నా చేతులలో వుంచి నా వీపుపై చేయివేసి ముందుకు నడిపించారు.


చెట్టుమీది కాకులు ఎగిరి క్రిందకు దూకాయి. తాతయ్య నాచేత పిండాల ఆకునుచెట్టు మొదట్లో పెట్టించారు. కాకులు ఆకుచుట్టూ చేరి పిండాలను ఆరగించాయి. అంత దు:ఖంలోను ఆ క్షణంలో తాతయ్యా నాన్నల విషాదవదనాల్లో.. అనందం.. తాతయ్యగారు నాన్న భుజంపై చేయివేసి..

‘‘రామ!.. నాయనా!.. అదయ్యా ఆ అమ్మ కోరిక.. ’’ విరక్తిగా నవ్వారు. వారి కళ్లల్లో కన్నీరు..


నాన్నగారు అశ్రునయనాలతో నా వైపు చూస్తూ నవ్వారు. తర్వాత రెండు రోజులు.. శేషక్రతువులు యధావిధిగా ఇంట్లో జరిగాయి. అమ్మ పేర గోదానం.. భూదానాలను తాతయ్యగారు జరిపించారు.

పదమూడవరోజు రాత్రి ఆదరింపు.. అమ్మ అన్నదమ్ములు మా నాన్నకు నాకు అక్కకు తమ్ముడికి చెల్లికి వస్త్రాలు ఇచ్చారు. పురోహితులు.. అమ్మ అంతిమకార్య నిర్వాహకుడు.. ఆ సాయంత్రం అందరి మధ్యన కూర్చుండి.. జరిగిన కార్యక్రమాలను గురించి పొగిడి.. అందరూ ఇలాగే కలసి మెలసి వుండాలని.. చిన్నవారిని జాగ్రత్తగా పెంచి పెద్ద చేయాలని.. మంగళ ఆశీర్వాదాలతో మా అందరి తలలపై అక్షింతలను చల్లారు. అందరం వారికి నమస్కరించాము.


మరుదినం వచ్చిన బంధువులందరూ వెళ్లిపోయారు. అక్క సునంద దిగులుగా మౌనంగా వుండేది. తమ్ముడు రఘునందన.. చెల్లి అపర్ణ.. వారు నన్ను.. అప్పుడప్పుడు.. ‘అన్నయ్యా!.. అమ్మ.. ఇకలేదుగా!.. ’ ఎంతో విచారంగా అడిగేవారు.


‘అవును.. అమ్మ చాలామంచిది. అందువల్లనే ఆ దేవుడు అమ్మను తన దగ్గరకు పిలుచుకొన్నాడు.. ’ ఓదార్పుగా చెప్పేవాడిని. నా తమ్ముణ్ణి చెల్లెలిని నా హృదయానికి హత్తుకునేవాణ్ణి. అమ్మ జీవితం అలా ముగిసిపోయింది. ఆమెతో గడపిన రోజులు.. అమ్మ మాటలు జీవితాంతం మరువలేనివి.


ఆ తర్వాత.. నాన్నగారు తాతయ్యగారు నాయనమ్మ మమ్మల్ని పూర్వం కంటే ఎంతో ప్రేమాభిమానాలతోచూచుకొనేవారు. మమ్మల్ని ఏనాడూ ఏ విషయంలోనూ నొప్పించలేదు. చిన్ననాడు మా అమ్మతో గడపిన ఆరోజులు ఇకపై.. తిరిగిరావు. మేము నలుగురం అత్త, నానమ్మ తాతయ్యల అండదండలతో పెరిగి పెద్దవారమైనాము. జీవితాంతం వరకు మా అమ్మగారి పెంపకం మరువలేనిది.


నా తల్లి జీవితం అలా ముగిసిపోయింది.. నిన్నే తలచుకుంటూ ఏడుస్తున్న నీ తల్లి కధకు ముగింపు ఎలా వుంటుందో!.. ’’ విచారంగా చెప్పాడు సత్యానంద్‌.

ఆ క్షణంలో బలరామ్‌ కళ్లల్లో బాధాపూరిత కన్నీరు..

‘‘ఏడుస్తున్నావా!.. ’’


‘ఆ.. రేయ్‌!.. అమ్మను చూడాలని వుందిరా!.. నాతో వస్తావా!.. ’’ దీనంగా అడిగాడు బలరామ్‌..

‘‘నిజంగానా!.. ’’

‘‘అవునురా!.. ’’

‘‘ఎపుడు పోదాం?.. ’’

‘‘ఇపుడే.. బయలుదేరుతావా!.. ’’

‘‘సరే!.. పద.. ’’

ఇరువురూ.. తలుపులు బిగించి గ్రామానికి సత్య కార్లో బయలుదేరారు.

*****

విజయవాడ నుండి నెల్లూరుకు వారి ప్రయాణం. బయలుదేరిన సమయం వుదయం తొమ్మిది గంటలు.. ఐదుగంటల ప్రయాణం..

సత్యానంద్‌కారు నడుపుతున్నాడు.. ప్రక్కన కూర్చొని వున్న బలరామ్‌ మనస్సున తుఫాన్‌.. కారణం.. తాను ఎంతగానో ప్రేమించి ఎవరికీ చెప్పకుండా వివాహం చేసుకొన్న ప్రేయసి.. తనముందు ఆమె స్నేహితునితో తను పుట్టిన (ఆమె) రోజున తాగి రాత్రి చేసిన వికృత నాట్యం.. చుంబనం.. పరిష్వంగం.. బలరామ్‌కు పిచ్చిపట్టింది. నిలదీసి అడిగాడు. ‘నీకు నా ప్రవర్తన నచ్చకపోతే విడాకులు ఇవ్వు.. ’ హేళనగా నవ్వుతూ అంది భార్యగా మారిన ప్రేయసి.. బలరామ్‌కు తానుచేసిన తప్పు అర్ధం అయింది. తల్లీ తండ్రి మిత్రుడు గుర్తుకు వచ్చారు. తన మదిలోని బాధను స్నేహితునికి చెప్పాడు. మోసపోయానని భోరున ఏడ్చాడు. సత్యానంద్‌ మిత్రుడిని ఓదార్చాడు.


కారు పెన్నా బ్రిడ్జిని దాటి చెట్టుగుంట రోడ్డును సమీపించింది.

ఎదురుగా.. బలరామ్‌ తండ్రి.. ప్రక్కన బంధుమిత్రులు.. వెనుక బలరామ్‌ తల్లి శవం.. పూలు చల్లుతున్నారు. చేతిలో అగ్నిఘటంతో.. కన్నీటితో బలరామ్‌ తండ్రి కాంతయ్య ముందు..

సత్యానంద్‌ ఆ దృశ్యాన్ని చూచాడు. ‘‘రేయ్‌ బలరామ్‌!.. అమ్మ చచ్చిపోయిందిరా!.. ’’ కారును ప్రక్కన ఆపి బలరామ్‌ ముఖంలోకి దీనంగా చూచాడు.


కారుదిగి.. బలరామ్‌.. ‘అమ్మా!.. అమ్మా!.. ’’ ఏడుస్తూ తండ్రి వైపుకు నడచాడు. సత్యానంద్‌ విచారంగా వారితో కలిసిపోయాడు.

*****

//సమాప్తి//

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.


28 views0 comments

Comments


bottom of page