top of page
Writer's pictureNeeraja Prabhala

ఆనంద మధురానుభూతి

విజయదశమి 2023 కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన కథ

'Ananada Madhuranubhuthi - New Telugu Story Written By Neeraja Hari Prabhala

'ఆనంద మధురానుభూతి' తెలుగు కథ

రచన,కథా పఠనం: నీరజ హరి ప్రభల

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)



ప్రతి రోజూ సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారిని తలుచుకొంటూ, వారి కృతుల అర్ధం తెలుసుకొంటున్న నా జీవితం ధన్యం. ఇదే ఆలోచనలలో ఉన్న నేను నిన్న రాత్రి స్వప్నంలో సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారిని దర్శించాను. ఆ స్వప్నంలో శ్రీత్యాగరాజ స్వామి వారి దినచర్యను గమనిస్తూ ఉన్నాను.. ఉదయం నుండి రాత్రి నిద్రపోయే దాకా శ్రీత్యాగరాజ స్వామివారు శ్రీరాముని ఏ కీర్తనలతో కొలిచేవారో నాకు తెలుసు.


ఆ ఆనందమధురానుభూతిని మీకోసం...


"తెలతెలవారింది లే, నీరజా! కిటికీ లోంచి భానుకిరణాలు నీమీద పడుతున్నా ఏమిటా మొద్దునిద్ర." అని ఎవరో పిలుస్తున్నట్లు అయి కనులు తెరుద్దామన్నా కనురెప్పలు ఎంతసేపటికీ తెరిపినపడట్లేదు. అదొక అందమైన అద్భుతమైన భక్తి సాగరంలో విహరిస్తూ అలౌకికమైన ఆనందానుభూతిని ఆస్వాదిస్తున్నాను. నిన్న రాత్రి నాకొక స్వప్నం వచ్చినది. అందులో అద్భుతమైన సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి దివ్యమోహన తేజము నా కనులముందు సాక్షాత్కరించింది. నేను స్వప్నంలో ప్రత్యక్షంగా చూచి తరించిన అలౌకిక ఆనందానుభూతిని ఈరోజు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. అది ఎంత చెప్పినా తనివితీరదు. అనుభవించి తీరాలి. అయినా చెప్పటానికి ప్రయత్నిస్తాను.


"ఆహా! ఏమి నా భాగ్యం!. ఎంత మహత్తరమైన తేజస్సు! సూర్యచంద్రులకు సరిసమానమైన ఆ కళను చూసి తరించాలే కానీ మాటలతో వర్ణించనలవి కాదు".


ఆ మహానుభావుడు తన దివ్యతేజస్సుతో ప్రాతఃకాలముననే నిదుర లేచి కాలకృత్యాలను తీర్చుకుని తన శిష్యులను వెంటనిడుకొని పవిత్రమైన కావేరి నదిలో స్నానం చేసి జపతపాదులను పూర్తి కావించి ఇంటికి రాగా భార్య కమలమ్మ ఎదురేగి అర్ఘపాద్యాదులతో ఆయన పాదములను కడిగి ఆ ఉదకమును తన శిరస్సుపై చల్లుకుంది.


మెత్తటి బట్టతో సుతారంగా భర్త పాదములను తుడిచి వాటిని భక్తితో కనులకద్దుకుని కొంచెం ప్రక్కగా జరిగి భర్తకు దారి ఇవ్వగా చిరునవ్వుతో శ్రీ త్యాగరాజ స్వామివారు లోపలికి వెళ్లి తాను నిత్యమూ పూజించే శ్రీరామచంద్రుని మందిరము ముందు ఆసనముపై కూర్చొని ఆ మందిరము తలుపులను తెరిచి తన రెండు చేతులూ జోడించి "మేలుకోవయ్యా! మమ్మేలుకో రామా! మేలైన సీతా సమేత నా భాగ్యమా!" అని భక్తితో గానం చేస్తూ తన శ్రీరాముని నిద్ర లేపుతున్నారు.


వెంటనే భక్తవశుడైన శ్రీరామచంద్రమూర్తి నవ్వుతూ నిద్ర లేచి "నీవు వచ్చి లేపితే గానీ నాకు తృప్తి ఉండదు. ఇంక నీ పూజ మొదలుపెట్టు" అని అన్నట్లుగా ఆయన చూపులు ఉన్నాయి. త్యాగరాజస్వామి వారు షోడశోపచారాలతో భక్తిగా పూజ మొదలుపెట్టగానే కమలమ్మ గారు ఒక వెండిగిన్నెలో ఆవుపాలను తీసుకొచ్చి అక్కడ పెట్టగా "ఆరగింపవే…" అంటూ ఆ పాలను భక్తితో రామచంద్రమూర్తికి నివేదించగా శ్రీరాముడు దాన్ని ప్రేమగా తీసుకున్నాడు.


వెంటనే త్యాగరాజస్వామి రామునితో "నేను ఇప్పుడే ఉంఛవృత్తికి వెళ్లి నీ పూజకు, నివేదనకు కావల్సిన ఫలములను, ద్రవ్యాలను తీసుకువస్తాను. అంత దాకా నీవు మా సీతమ్మతో సరదాగా ముచ్చటిస్తూ హాయిగా విశ్రాంతి తీసుకో రామా! " అని చెప్పి బయటకు వచ్చారు. తన శిష్యులకు చూపులతో సైగ చేయగానే వాళ్లు వచ్చి "పిలిచారా స్వామీ! " అని చేతులుకట్టుకుని నిలబడ్డారు.


వాళ్లందించిన తంబూర, జోలెను అందుకుని స్వామి బయటికి నడవగా శిష్యులు ఆయనను అనుసరించసాగారు. సమీపముననే ఉన్న నేనుకూడా వాళ్లను అనుసరించి నడువసాగాను. స్వామివారు నన్ను చూచి దగ్గరకు పిలిచి నా శిరస్సుపై తన చేతిని వేసి "నీకు పాటలు రాలేదని బాధపడవద్దు. ఇక్కడ శుధ్ధమైన మనసు, అచంచలమైన భక్తి ప్రధానం. నీకు వచ్చినవి నీవు నా రామునిమీద పాడు. నీ జన్మ ధన్యమవుతుంది" అని ప్రేమగా ఆజ్ణాపించారు.


ఇంక నా ఆనందానికి అవధులు లేవు. అప్రయత్నంగా వెంటనే నాకు వచ్చిన కొన్ని కీర్తనలను నేను భక్తితో గానం చేయగా వాటిల్లో స్వామి కొన్ని చోట్ల సరిచేశారు. "ఆహా! ఏమి నా భాగ్యము. ఈరోజు నాజన్మ ధన్యమైంది. స్వామిని గురింంచి తెలుసుకుని పూజించడం మాత్రమే తెలుసు కానీ ఈరోజున ఆ స్వామి సమక్షంలో, ఆయన సన్నిధానంలో ఆయన్ని చూస్తూ గానం చేసే మహద్భాగ్యము, సువర్ణావకాశం నాకు లభించినదని" సంతోషపడుతున్నాను.


తర్వాత శ్రీత్యాగరాజస్వామివారు కొన్ని కృతులను ఆలపించసాగేరు. శిష్యులు కూడా తమగొంతు జతకలిపి పాడుతున్నారు. దారిలో ప్రతి ఇంటి ముందు ఆగి భక్తి పారవశ్యంతో గానంచేస్తున్న రాముని కీర్తనలను వింటూ పసిపిల్లలనుంచి నిండు ముదుసలి వరకు మాజన్మ తరించినదని అనుకుని అంతులేని ఆనందానుభూతిని పొందుచున్నారు. పశుపక్ష్యాదులు సైతం తమ పనిని మానేసి ఆ అమృతగానాన్ని చెవులు రిక్కించి వింటున్నాయి.


కొందరు నడివయస్కులు, పిల్లలు స్వామి వారి బృందాన్ని అనుసరించి నడుస్తూ వారిగానంతో శృతి కలుపుతూ, లయ తప్పకుండా తాళం వేస్తూ, చిడతలను వాయిస్తూ నడుస్తున్నారు. కొందరు వయోభారంచేత నడవలేక ఇంటిమందున్న ఎత్తైన అరుగులమీద కూర్చుని నోటితో పాడుచూ, చేతితో శృతితప్పకుండా తాళం వేస్తున్నారు. ఇలా కొన్ని వీధులను సంచరించినాక ఈ పూట తన రామునికి నివేదనకు ఫలాలు, ద్రవ్యం సమకూరింది.


ఇంక ఆలశ్యమైతే ఆయనకు ఆకలినశిస్తుంది, అపరాధం చేసిన పాపము వస్తుందని రామ సంకీర్తనను ఆపకుండా వేగముగా తన శిష్యులతో ఇంటికి నడిచారు శ్రీ త్యాగరాజస్వామి వారు.


"ఇదంతా నిత్యమూ జరుగుచున్నదే అయినా ఈ తిరువయ్యూరు పుణ్యభూమి ఈ స్వామిని కని ఎంత పుణ్యము చేసుకున్నదో, నిత్యమూ ఆయన గానాన్ని వింటున్న ఇక్కడి ప్రజలు ఎంత భాగ్యశాలురు. ఎంత అదృష్ట వంతులు. ఇదంతా ప్రత్యక్షంగా చూస్తున్న నేను ఎంతో అదృష్టవంతురాలిని" అని అనుకుంటూ నెమ్మదిగా వాళ్లను అనుసరిస్తున్నాను. ఇంతలో స్వామివారి ఇల్లు సమీపించింది. శ్రీ త్యాగరాజస్వామివారితో పాటు శిష్యుబృందాన్ని అనుసరిస్తూ నేనూ ఇంటిలోనికి వెళ్లాను.


కమలమ్మ ఎదురొచ్చి స్వామి పాదాలను కంచుచెంబు నీళ్లతో పళ్లెరములో కడుగగా స్వామి లోపలికి వచ్చారు. ఆవిడ ఒక మ‌రచెంబుతో నీటిని తెచ్చి ఇవ్వగా స్వామి దాన్ని అందుకుని ఆ నీటిని సేవించారు. వెంటనే లేచి పునఃస్నానం కావించి పట్టుబట్ట కట్టుకొని రాముని మందిరం వద్దకు వచ్చి యధావిధిగా పునఃపూజను ప్రారంభించారు. కమలమ్మ చేసిన పంచభక్ష్యాలతో, తెచ్చిన ఫలములతో స్వామికి మహానివేదన చేసి 'విడెము సేయావే... " అని తాంబూలమును సమర్పించారు.


ఆతరువాత "ఉయ్యాల లూగవయ్య... " అని సీతాసమేత శ్రీరామునికి త్యాగరాజస్వామి దంపతులు ఉయ్యాల లూపి బయటకి వచ్చారు. కమలమ్మ అరటి ఆకులో రుచికరమైన భోజనం వడ్డించగా తాను భోజనం చేసి లేచి కొంత సమయం నిద్రకు ఉపక్రమించారు.

కొంచెం సేపయినాక నిద్ర నుంచి లేచి కొన్ని కీర్తనలను శిష్యులకు నేర్పి సాయంసంధ్యాసమయంలో ప్రదోష కాలమున స్వామి సేవకు అన్నిటినీ సిధ్ధం చేసుకున్నారు. శిష్యగణం, ఊరిలోని ప్రజలు ఈరోజు స్వామి క్రొత్తగా ఏ కీర్తనను గానంచేస్తారో, ఇంకా ఏమేమి క్రొత్త రాగాలతో ఆయన రాగరంజితంగా రాముని కీర్తిస్తుంటే వినాలనే కుతూహలంగా ఎదురుచూస్తున్నారు.


ఆ శుభ సమయం ఆసన్నమైంది.


ఊర్లోని ప్రజలందరు "ఈ రోజు ఏమేమి ఉత్సవం చేస్తారో? ఏమేమి క్రొత్త కీర్తనలను గానం చేస్తారో ? " అని చిన్నగా ముచ్చటించుకుంటూ వచ్చి స్వామికి సమీపంలో కూర్చుని కీర్తనలను వినేందుకు ఎప్పుడెప్పుడా! అని ఎదురు చూస్తున్నారు. శిష్యులు తంబురా పట్టుకుని శ్రుతి సరిచేస్తున్నారు. మరి కొంతమంది స్వామి ఆలపించిన కీర్తనలను వ్రాసేందుకు తాళ పత్రాలను, ఘంటాన్ని సిధ్ధం చేసుకున్నారు.


త్యాగరాజ స్వామి కూర్చుని రాముని అందాలను వర్ణిస్తూ "మోహన రామ ! ముఖజిత సోమ... !" అంటూ ప్రారంభించి "అలకలలల్లలాడగగని, మనసా ఎటులోర్తునే, అనుపమగుణాంబుధీయని నిన్ను, ఆడమోడిగలదే రామయ్య మాట, అన్యాయము సేయకురా, అపరాధములనోర్వ సమయము, ఇంత భాగ్యమని నిర్ణయింప బ్రహ్మేంద్రా, ఇంత సౌఖ్యమని నే చెప్పజాల, రార సీతామణి మనోహర, సేతులార శృంగార, శోభిల్లు సప్త స్వర, నిధి చాల సుఖమా, మోక్షము గలదా, మనసు స్వాధీన మైన, సుగుణములే చెప్పుకొంటి, హెచ్చరికగా రార హే రామచంద్రా" మొదలగు అనేక కీర్తనలను భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందుతూ శ్రావ్యంగా గానం చేస్తున్నారు. వాటిన్నిటినీ శ్రధ్ధగా వింటున్న మాకందరికీ అలా ఎంత సమయం గడిచిందో తెలీలేదు.


చూస్తూ ఉండగానే బయటి వాతావరణం చీకట్లు అలుముకున్నాయి. మృదుమధురంగా స్వామి ఆలపిస్తున్న కీర్తనలను చంద్రుడు నక్షత్రతారాగణంతో విని ఆనందిస్తున్నాడు. త్యాగరాజస్వామి రామునికి మరలా యధావిధిగా భక్తితో పూజ చేసి నైవేద్యమును పెట్టి 'విడెము సేయావే' అని తాంబూలమును సమర్పించారు.


తర్వాత "పతికి హారతీరే " అని స్వామి దంపతులు హారతులిచ్చి, తెల్లగా మెరుస్తున్న మెత్తని పట్టు వస్త్రాన్ని పాన్పుగా అమర్చి దానిమీద మల్లెలు, జాజులు, విరజాజులు మొ….పరిమళ పుష్పములను శోభాయమానంగా అందంగా అలంకరించి సీతారాములను అక్కడికి ఆహ్వానించారు.

భక్తపరవశుడైన రాముడు సీతాసమేతుడై చిరునవ్వు లొలికిస్తూ వచ్చి కూర్చున్నాడు.


"పూలపాన్పు మీద బాగా పూర్ణ పవ్వళించు….

పూలపాన్పు మీద బాగా పూర్ణ పవ్వళించు

నీల ఘనశ్యామ హరే నిరుపమ రామయ్య

మల్లెపూలపాన్పు మీద బాగా పూర్ణ పవ్వళించు…."


అంటూ శ్రీత్యాగరాజస్వామి కీర్తించగా సీతారాములు ఆనందంతో ఒకరినొకరు ప్రేమగా చూసుకున్నారు. ఇంక ఆ దంపతులకు ఏకాంతాన్ని కల్పించాలనే ఉద్దేశ్యంతో నెమ్మదిగా బయటకు వచ్చి తమ గదిలోకి వెళ్లగా కమలమ్మ నవ్వుతూ భర్తను అనుసరించింది.


అందరూ తమతమ ఇళ్లకు వెళ్లి తాము చూసిన దృశ్యాన్ని, వినిన కీర్తనలను మనసులో మననం చేసుకుంటూ రేపటి రోజు కోసం ఎదురు చూస్తూ నిదురపోయారు.


శ్రీ త్యాగరాజస్వామి వారి దివ్యమోహన రూపాన్ని, ఆ దివ్యతేజస్సును, ఆసుందర సుమనోహర దృశ్యాన్ని వీక్షించిన నేను ఎంత అదృష్టవంతురాలిని, "కనుగొంటినీ! శ్రీత్యాగరాజస్వామిని కనుగొంటినీ!, శ్రీస్వామి సన్నిధిలో గానం చేసే అదృష్టాన్ని, భాగ్యాన్ని పొందిన నా జన్మ ధన్యము" అనుకుని కనులను తెరవకుండా కాసేపు అలాగే ఉండి అలౌకికమైన ఆనంద మధురానుభూతిని పొందాను. కాసేపటికి కనులు తెరిచి స్వప్నావస్థ నుండి జాగ్రదావస్ధలోకి వాస్తవజగతిన అడుగిడి "అయ్యో! ఇది స్వప్నమా ! ఇది వాస్తవమైతే ఎంత బాగుండునో కదా!" అని అనుకుంటూ లేచాను.


'శ్రీ త్యాగరాజస్వామివారి దయ ఉంటే నా కల నిజమవుతుంది. మరలా నేను శ్రీ త్యాగరాజస్వామి వారిని దర్శించి తరించి నా జన్మను సార్థకం చేసుకుంటాను అనే ఆశతో వేయికళ్లతో ఎదురుచూస్తున్నాను'


నాకల నిజమవ్వాలని సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి ఆశీస్సులు మనందరికీ లభించాలని ఆస్వామిని మనసారా కోరుకుంటున్నాను. 🙏🙏

.. సమాప్తం.

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు



"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏




106 views0 comments

コメント


bottom of page