top of page

అంతః సౌందర్యం


' Antah soundaryam' written by Kiran Vibhavari

రచన : కిరణ్ విభావరి

యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ పొలిటికల్ సైన్స్ విద్యార్థులంతా ప్రొఫెసర్ విన్సిల్ ప్రసంగాన్ని శ్రద్ధగా వింటూ గ్రూప్ డిస్కషన్ కోసం, ఆయన ఇవ్వబోయే ప్రశ్న కోసం ఆసక్తిగా వేచి ఉన్నారు. "అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతదేశ ఉద్యోగులపై చేసిన వివక్షపూరిత వ్యాఖ్యలను మీరు ఎంతవరకు సమర్ధిస్తారు?" క్లాసులో కొంతమంది భారతీయ విద్యార్థులు కూడా ఉండటం వలన ఆయన ప్రశ్నను వారిని ఉద్దేశించి అడిగారు.

ఇదే అదనుగా చూస్తున్న కొందరు జాతి అహంకారం నిండిన విద్యార్థులు ట్రంప్ వ్యాఖ్యలతో ఏకీభవించారు. వారిలో తెల్లగా నిగ నిగ లాడుతున్న ఒక అమెరికన్ యువకుడు "సర్, మీకు భారతీయుల తెలివి ఎలాంటిదో ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒకసారి మార్కెట్లో బ్రెయిన్ లు అమ్మకానికి పెట్టారు. అమెరికన్, ఇండియన్, చైనీస్ ఇలా వేర్వేరు దేశస్థుల మెదడుల్ని అమ్మకానికి పెట్టగా భారతీయ మెదడుకి మాత్రం అత్యధిక వెల కట్టారు. నా లాంటి విద్యార్థి ఒకరు 'ఇదేమని ' ప్రశ్నించగా 'అయ్యా! ఇవన్నీ వాడిన మెదడులు. కానీ ఈ భారతీయుని మెదడు మాత్రం అస్సలు వాడలేదు. ఏ భారతీయుని మెదడు ఐనా మీకు ఇదే వెలకు దొరుకుతుంది. వారు వారి మెదడును అసలు ఉపయోగించరు కదా!' అని బదులిచ్చాడు షాప్ ఓనర్. కాబట్టి మీరే చెప్పండి. భారతీయులపై ట్రంప్ వ్యాఖ్యలు సరి అయినవా కాదా?'" అని ఎగతాళిగా నవ్వాడు ఆ యువకుడు. అతని నవ్వుకు మిగతా విద్యార్థులు కూడా బల్లలు చరుస్తూ రాగం కలిపారు.

"డియర్ ఫ్రెండ్స్! మా భారతీయులు వారి మెదడుని అంతగా ఉపయోగించనందుకే మీరు మమ్మల్ని చూసి అసూయపడే స్థాయిలో మేము ఉంటే, ఇక పూర్తిగా వినియోగించినట్లయితే ఏ స్థాయిలో ఉంటామో మీరే ఆలోచించుకోండి" హేళనల మధ్య కంచు కంఠం ఖంగుమంది. ఆ యూనివర్సిటీ బెస్ట్ స్టూడెంట్ గా ఎన్నికై, రాయల్ సొసైటీ నుండి ఫెలోషిప్ పొందిన ఏకైక విద్యార్థి అతను. పేరు రవివర్మ కనుమూరి.

" మీకు మా భారతీయుల గొప్పతనం గురించి తెలుసుకోవాలంటే గూగుల్ లో వెతకండి. కట్టలకు కట్టలు పేజీలు వస్తాయి. భారత జాతి ఔన్నత్యాన్ని, సౌందర్యాన్ని తెలుసుకోవాలంటే ఒకసారి మా దేశాన్ని సందర్శించండి. మీ జీవితమే మారిపోతుంది. అప్పుడైనా అహంకారాన్ని వదిలి వివక్షాపూరిత వ్యాఖ్యలను సమర్ధించకుండా ఉండే తెలివి మీకు వస్తుంది" అని చురక అంటించాడు. భారతీయ విద్యార్థుల కరతాళధ్వనులతో క్లాసంతా మారుమ్రోగింది.

లండన్ లోనే పుట్టి పెరిగిన రవికి భారతదేశం అంటే ఎంతో గౌరవం. పరాయి పాలనలో చితికిపోయినా మరో దేశం పైకి దండయాత్ర చెయ్యని దేశ ఔన్నత్యాన్ని తెలుసుకొని భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నాడు.

కక్కొచ్చినా కళ్యాణమొచ్చినా ఆగవు అంటారు పెద్దలు. ఒక ఈడుకి వచ్చాక అడక్కుండానే అన్నీ జరిగిపోతూ వుంటాయి. రవి విషయంలో కూడా అంతే. రవి తండ్రి రాజేంద్ర వర్మ లండన్లో ప్రముఖుల్లో ఒకరు కావడంతో అక్కడే స్థిరపడిన భారతీయ కుటుంబాల నుండి ఎందరో అతనితో సంబంధాలు కలుపుకోవాలని చూస్తున్నారు. వారిలో ఒకరు సింధియా కుటుంబం. లండన్ లోని మొదటి పది మంది ధనవంతులలో ఒకరైన సింధియా కుటుంబం తమతో సంబంధం కలుపుకోవడానికి చూడటంతో రాజేంద్ర సంతోషానికి అవధులు లేకుండా పోయింది. రవి చదివే యూనివర్సిటీలోనే మేఘన సింథియా చదువుతోంది. తొలిచూపులోనే అతనిపై మనసు పారేసుకున్న మేఘన తన మనసులోని మాట పెద్దలకు చెప్పటం, వారు సంబంధం నిశ్చయించుకోవడం చకచకా జరిగిపోయాయి. అందం, తెలివితేటలు, డబ్బు.. అన్నీ ఉన్న మేఘనను కాదనడానికి రవికి ఏ కారణం దొరకలేదు. తండ్రి సంతోషంలోనే తన ఆనందాన్ని వెతుక్కున్నాడు. కానీ అతని మనసులో మాత్రం ఏదో తెలియని లోటు.

మేఘన, రవిల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. భారతీయత ఉట్టిపడే ఆ వేడుకను చూడడానికి అందరూ హాజరయ్యారు. భువి నుండి దివికి దిగివచ్చిన దేవతలా ఉన్న మేఘనను చూసి లండన్ వాసులు నోరెళ్లబెట్టారు. అది మా ఆంధ్రుల వస్త్రధారణ మహిమ అని రవి గర్వంగా చిరునవ్వు చిందించాడు.

బంధుమిత్రుల సందడితో పార్టీ ఆనందంగా ముగిసింది. మేఘనకు వీడ్కోలు చెప్పడానికి వెళ్లిన రవి ఆమె స్థితిని చూసి దిగ్భ్రాంతి చెందాడు. మరునాడు ఆమెతో పెళ్లి రద్దు చేసుకున్నట్లు ఆమెకు మెయిల్ పంపాడు. అది సింథియా కుటుంబంలో ఓ తుఫాను రేపింది.

"వాట్ నాన్సెన్స్ రవి! నిశ్చితార్థం అయ్యాక పెళ్లి రద్దు చేసుకోవడం ఏమిటి? అది కూడా సింథియా వంటి పెద్ద కుటుంబంతో. తమాషాగా ఉందా నీకు ? " రాజేంద్ర విరుచుకుపడ్డాడు.

"తాగిన మత్తులో పరాయి మగవాళ్ళతో అర్ధనగ్నంగా డాన్సులు వేసే స్త్రీతో నన్ను కలిసి జీవించమంటారా డాడీ? " ఆ రోజు తాను చూసిన సన్నివేశాన్ని వివరించాడు రవి.

"ఓస్ అంతేగా! ఆ మాత్రం దానికి పెళ్లి రద్దు చేసుకుంటారా? అదంతా ఈ కాలంలో మామూలే. నువ్వు గొప్పగా చెప్పుకుని తిరిగే భారతదేశంలో కూడా అమ్మాయిలు తాగి తిరుగుతున్నారు. ఆ మాత్రం దానికి ఇంత డబ్బు ఉన్న పిల్లను కాదంటావా?"

"మీకు మామూలు విషయం కావచ్చు డాడీ. కానీ నాకు మాత్రం నా జీవితానికి సంబంధించిన విషయం. నేను ఎట్టి స్థితిలోనూ రాజీ పడను" ఖచ్చితంగా చెప్పాడు రవి.

రాజేంద్ర తన చేతిలోని గ్లాసును కోపంగా నేలకి విసిరాడు.

" భారతదేశ అమ్మాయిలు ఎంత సంస్కారవంతులో అమ్మను చూస్తేనే అర్థం అవుతుంది. మీరు ఎంతగా ఆమెను బాధ పెట్టినా, మీరు కట్టిన తాళికి గౌరవం ఇచ్చి మీతో కాపురం చేస్తోంది. ఆమెను చూస్తేనే చెప్పవచ్చు, భారతీయ స్త్రీలు ఎంతో గొప్ప వారు అని. అదే వేరొక స్త్రీ అయితే ఈపాటికి మీతో విడిపోయి మీ ఆస్తి లో సగం హక్కు కోరేది" రవి ఎదురు చెప్పాడు. అతనితో వాదన అనవసరమని రాజేంద్ర అక్కడి నుండి నిష్క్రమించాడు.

వారి వాదనను వింటున్న తల్లి కృష్ణవేణి అతన్ని ఓదార్చింది. "ఇప్పుడు ఏమంటావు రా! ఆ అమ్మాయి నచ్చలేదు, అంతేగా? మీ నాన్నకు నేను నచ్చచెపుతానులే. నువ్వు కొద్ది రోజులు మన ఊరు వెళ్లి రా. అక్కడ నీకు ఎవరైనా నచ్చవచ్చేమో!? బామ్మకు అన్నీ చెప్తాను. ఆవిడ కూడా నిన్ను చూడాలని కలవరిస్తోంది. ఒకసారి ఇండియాకు వెళ్లి వస్తే నీ మనసు తేలిక పడుతుంది. ఆయన కూడా కొంచెం చల్లబడతాడు" అంటూ నచ్చచెప్పింది కృష్ణవేణి.

ఆమె మాటకు గౌరవం ఇచ్చి ఇండియా బయలుదేరాడు రవి. తన ఊరి గురించి అమ్మ మాటల్లో వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు అతను. సినిమాల్లో చూపించినంత దారుణంగా లేదు పల్లెటూరు. ‘భారతీయ అందాన్ని అర్థం పట్టేలా ఇటువంటి కోనసీమ కాకుండా ముంబై లోని మురికివాడల్ని, పేదరికాన్ని, కలుషిత వనరుల్ని చూపిస్తూ భారతదేశం అంటే ఓ పేద దేశంగా ఎందుకు చూపిస్తారో!’ అని ఆలోచిస్తూ నడిచాడు రవి .

ఊరిలో ఎవరిని అడిగినా బామ్మ ఇంటి అడ్రస్ చెబుతారని అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి, తాటి ముంజలతో రైలుబండి ఆట ఆడుతున్న ఇద్దరు పిల్లల్ని ఆపి 'శేషారత్నమ్మ గారి ఇల్లు ఎక్కడ' అని ఆరా తీశాడు. ఆ ఇద్దరు భడవలు తమ బండిలో తీసుకువెళతామని తమ వెంట నడవమన్నారు. వారిని చూసి ముచ్చటేసింది రవికి. నవ్వుతూ వారి వెనకే నడిచాడు.

కాళ్ళతోనే ఎటువంటి మిషన్ లేకుండా ఎక్కుతున్న తాటి కార్మికులను చూసి విస్తుపోయాడు. పొలాల్లో సాయంకాలపు పైరుగాలికి అలసి సొలసి రేడియోలో పాటలు వింటూ సేదతీరుతున్న రైతులను చూసి ‘వీళ్లది కదా జీవితం’ అని మనసులోనే అనుకున్నాడు. దారి పొడవునా ఎదురవుతున్న జనాల ఆప్యాయ పలకరింపులకు మురిసిపోతూ శేషారత్నమ్మ ఇల్లు చేరుకున్నాడు.

ఏడు పదులు దాటినా దిట్టంగా ఉన్న శేషారత్నమ్మకు పాదాభివందనం చేశాడు. ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైయ్యింది. "ఈ పేద జనాల గాలి నీకు తగలకూడని మా అందరికీ నిన్ను దూరంగా ఉంచాడు మీ నాన్న. కానీ నిన్ను చూస్తుంటే మీ అమ్మ మా పిల్లగాడిలాగే పెంచింది అన్నమాట. నా ఆయుష్షు కూడా పోసుకొని చల్లగా ఉండు నాయనా" అని దీవించింది.

అతడు వచ్చిన కొద్దిసేపటికే శేషారత్నమ్మ ఇల్లంతా జనాలతో కిటకిటలాడిపోయింది. "నేను ఎవరో తెలుసా? మీ పిన్నినిరా. మీ అమ్మ ఎప్పుడైనా చెప్పిందా మా గురించి?" ఆప్యాయతతో పాటు నోరు తీయబడినది వారు తెచ్చిన మిఠాయిలతో.

అత్తయ్యలు, మామయ్యలు, బాబాయిలు.. ఊరంతా బంధువులే. ఏ కష్టమొచ్చినా మేమున్నామని ఓదార్చడానికి ఎన్ని ఆత్మీయ హృదయాలో. ప్లాస్టిక్ నవ్వులు, పలకరింపుల మధ్య పెరిగిన రవికి వీరిని చూసి కళ్ళు చెమర్చాయి.

"అయ్యో ఆ కన్నీళ్లు ఏంట్రా కారం ఎక్కువ అయ్యిందా ?" బొమ్మిడాల పులుసు వడ్డిస్తున్న అత్తయ్య ఆరా తీసింది .

"అదేం లేదత్తా! చాలా బాగుంది" రుచిని ఆస్వాదిస్తూ చెప్పాడు రవి.

" మా రాజు కూడా ఇంతే. కారం తగిలితే చాలు కళ్ళు నిండుకుంటాయి" ఎవరో మావయ్య రాజేంద్ర పైన చురకేసాడు. అందరి నవ్వులు, ముచ్చట్లు, పిండివంటలతో ఆ రోజు గడిచిపోయింది.

"నువ్వు వచ్చిన పని ఏంటో మీ అమ్మ నాకు చెప్పిందిరా. నీవన్నీ మీ తాత బుద్ధులే. నీకు మంచి పిల్లను ఇచ్చి పెళ్లి చేసే పూచీ నాది. జీవితాంతం తోడుగా ఉండే భార్య అర్ధాంగిగా నీ జీవితంలో సగ భాగంగా నిలవాలంటే గుణవంతురాలు, బుద్ధిమంతురాలుతో పాటు శీలవతిగా ఉండాలి. శీలం అంటే శరీరానికి చెందినది కాదు. పవిత్రమైన మనసుకు చెందినది. కార్యేషు దాసి గా, కరణేషు మంత్రి గా, భోజ్యేషు మాత గా, శయనేషు రంభ గా నిన్ను సేద తీర్చాలి" అని చల్లని పున్నమి వెన్నెలలో మేడ పైన రవిని తన ఒడిలో పడుకోబెట్టుకుని శేషారత్నమ్మ వివరించింది.

"అదిగో! ఎదురుగా ఉన్న ఆ ఇల్లే మీ నాన్న చిన్ననాటి స్నేహితుడైన బంగార్రాజు మామయ్యది. అతని కూతురు- లావణ్య. చూడ చక్కని పిల్ల. చిదిమి దీపం పెట్టుకోవచ్చు. చదువుకున్న పిల్ల కనుక నీకు కూడా ఏ ఇబ్బంది ఉండదు. నువ్వు రేపు వెళ్లి మాట్లాడు. నీకు నచ్చితే సంబంధం ఖాయం చేద్దాం. నేను వాళ్ళతో అన్నీ చెప్పి ఉంచాను" మనుమడి తల నిమురుతూ చెప్పింది శేషారత్నమ్మ. "సరే"నని తలాడించి నిద్రలోకి జారుకున్నాడు రవి.

మరునాడు ఉదయమే బంగార్రాజు ఇంటికి బయలుదేరాడు. ఎందుకో కొంచెం మొహమాటంగా ఉన్నా, తన జీవన సఖిని వెతికే పనిలో పడ్డాడు. తనతో పాటు వనజను తీసుకువెళ్ళాడు. ఆమె అతని పిన్ని కూతురు. లావణ్య మేడమీద తలారపెట్టుకుంటోంది. తెల్లగా నిగ నిగ లాడుతూ పాలరాతి శిల్పంలా ఉంది.

" అదిగో లావణ్య. నీ కాబోయే పెళ్ళాం. చూసుకో.." అంటూ వనజ ముసి ముసిగా నవ్వుతూ లావణ్యను చూపించింది. అతను లావణ్యను చూస్తూ కింద ముగ్గు వేస్తున్న చిన్నారి మీద తూలి పడబోయాడు. ఆమె ఒడిసి పట్టుకోవడంతో నిలకడ చెందాడు. లావణ్య నవ్వుకుంటూ లోపలికి తుర్రుమంది. చిన్నారి కళ్ళల్లో భయంతో కూడిన సిగ్గు చోటుచేసుకుంది.

"చిన్నారీ..." కాంతం అరుపు వినగానే లోపలికి పారిపోయింది. ఆమె అలా కదులుతున్నప్పుడు ఆమె వాలుజడ జఘనమున అందంగా నాట్యం చేస్తోంది. ‘ఆమె ఎవర’ని ఆరా తీశాడు వనజను.

"ఆమెనా.. చిన్నారి. చాలా మంచి పిల్ల. లావణ్య వాళ్ళ చిన్నాన్న కూతురు. ఇది పేరుకే గాని వాళ్ళ ఇంట్లో పనిమనిషి. వాళ్ళ నాన్న తాగుబోతు. వాళ్ళమ్మ చిన్నారి చిన్నప్పుడే చనిపోవడంతో బంగార్రాజు మామయ్య తన ఇంటికి తెచ్చుకొని ఇంటర్ వరకు చదివించాడు. తల్లి తండ్రి ఖాతరు చేయని పిల్లను ఎవరు మాత్రం పట్టించుకుంటారు ?? ఇంత ముద్ద పడేస్తే ఇంట్లో పనిపిల్లలా పనికొస్తుందని తెచ్చుకున్న చిన్నారి, పెళ్ళీడుకి వచ్చేసరికి గుండెల మీద బండలా తయారయిందనీ, నష్ట జాతకురాలనీ నానా మాటలు అంటోంది కాంతమ్మ. 'ఎవరినైనా చూసుకొని లేచి పోవే!' అని ఉచిత సలహాలు ఇస్తూ, చిన్నారి మనసు గాయపరుస్తూ ఉంటుంది" వనజ చెబుతున్న విషయాలు విని బాధపడ్డాడు రవి. పిల్లల్ని కనీపెంచే సామర్ధ్యం లేనప్పుడు పిల్లలను ఎందుకు కంటారు? అని ఆలోచించాడు.

పేపర్ చదువుతున్న బంగార్రాజు వీరిని చూసి ఆహ్వానించాడు. "ఊరిలో ఏ విషయం దాగదు బాబూ! నువ్వు మా లావణ్యని చూడడానికి వచ్చావని తెలుసు. మీ ఇంటి వారికి పిల్లను ఇవ్వడం మాకూ ఇష్టమే. మా పిల్ల విదేశాలు తిరుగుతుంది అంటే అంతకన్నా ఏం భాగ్యం? ఏమే! ఏమంటావు?" తలుపు చాటుగా వీరి మాటలు వింటున్న కాంతమ్మను అడిగాడు.

"నేనేమంటాను? మా లావణ్య నక్కతోక తొక్కిందంటాను" కాంతమ్మ మొహం వెలిగిపోతోంది.

" కానీ నాకు కొంచెం టైం కావాలి. నేను లావణ్యతో మాట్లాడాలి. ఆమె గురించి తెలుసుకోవాలి" రవి సంకోచిస్తూ చెప్పాడు.

" అయ్యో దానికేం! మాట్లాడితేగా తెలిసేది. జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళు. వెళ్లండి, వెళ్లి మాట్లాడుకోండి!" బంగార్రాజు పర్మిషన్ ఇచ్చాడు.

" ఏయ్ చిన్నారి.. బావ గారిని అక్క దగ్గరికి తీసుకు వెళ్ళు" కాంతం కేకకు ఉదుటున వచ్చింది చిన్నారి.

"రండి బావగారు.. అక్క పైన ఉంది." సౌమ్యంగా ఆహ్వానించింది. చిలకలా తియ్యగా ఉంది ఆమె స్వరం. మళ్లీ మళ్లీ వినాలనిపిస్తోంది.

"నీ పేరేంటి?" ఆమెను అడిగాడు.

"హేమలత. అందరూ ముద్దుగా చిన్నారి అంటారు" బదులిచ్చింది ఆమె. ఆమెతో ఇంకా ఏదో మాట్లాడాలని ఉంది కానీ అంతలోనే లావణ్య గది వచ్చేసింది.

"రండి బావగారు అక్క లోపల ఉంది" అంటూ తీసుకువెళ్ళింది.

లావణ్య సిగ్గులు ఒలకబోస్తూ బయటకు వచ్చి లోపలికి ఆహ్వానించింది. అందంగానే ఉంది. కానీ ఆమె అందం మీద ఎందుకో మనసు పోవడం లేదు. మనసులో ఏదో మూల భారంగా ఉంది.

‘టిఫిన్ పట్టుకు వస్తా’నంటూ చిన్నారి డోర్ దగ్గరగా వేసి వెళ్ళిపోయింది. వీళ్లకు ప్రైవసీ ఇవ్వడానికే అని తెలుస్తోంది, కానీ ఆమె వెళ్లిపోతుంటే ఎందుకు అతని మనసు బరువెక్కింది.

" హాయ్" లావణ్య పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు. ఏవేవో మాట్లాడారు కానీ అదేది అతని మస్తిష్కంలో గుర్తులేవు. అన్యమస్కంగా మాట్లాడి చాలనిపించాడు. మెట్లు దిగుతుంటే చూచాయగా కాంతం మాటలు వినిపించాయి.

" మోడ్రన్ అబ్బాయి. పెద్ద వాళ్ళం మేము ఉంటే ఇబ్బందిగా ఫీల్ అవుతాడు అని నిన్ను ఉంచాం. చవట! వాళ్ల మాటలు వినలేదే?"

" అలా ఒకరి మాటలు వినడం తప్పు కదా పెద్దమ్మా!"

"ఏడ్చావు పో..." కాంతం కసురుకుంది.

వీరి మాటలు వింటూ రవి మౌనంగా బంగార్రాజు దగ్గరికి వెళ్లాడు. "టిఫిన్ లు ఎలా ఉన్నాయి అల్లుడు? మా లావణ్య చేసింది" బంగార్రాజు గొప్పలు పోయాడు.

"నేనా" అన్నట్టున్న లావణ్య హావభావాలు రవి చూపు దాటిపోలేదు.

"చాలా కమ్మగా ఉన్నాయి" లావణ్య వెనకే నిలబడి ఉన్న చిన్నారిని చూస్తూ బదులిచ్చాడు. ‘భోజ్యేషు మాత’ అంతర్వాణి ప్రతిధ్వనించింది. మరుసటి రోజు రాత్రి లావణ్య చిన్నారిని వెంటబెట్టుకుని వచ్చింది. ఏవేవో మాట్లాడుకున్నారు. మాటల మధ్యలో “మీ ఊరు చాలా అందంగా ఉంది” అన్నాడు అతను.

"అయితే ఈ అందమైన ఊరును వెన్నెల్లో చూస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది" అని లావణ్య ‘బయటకి వెళ్దాం’ అని బలవంతం పెట్టింది.

"రాత్రిపూట పొలాల వెంట తిరగవద్దు అక్కా! పాములు విష పురుగులు బయటకు వస్తాయి. రేపు పొద్దున్న వెళ్దాం లే" చిన్నారి రిక్వెస్ట్ చేసింది.

"అబ్బ! దీనికి అన్నీ లేని పోని భయాలు బావా! చెడ్డ పిరికిది. నువ్వు రా బావా! నీకు మా ఊరు చూపిస్తా" నంటూ రవిని లాక్కుపోయింది. చేసేదేం లేక వారి వెంట వెళ్ళింది చిన్నారి. పున్నమి గడిచి రెండు రోజులైనా దిట్టంగా పరుచుకున్న వెన్నెల వెలుగులో నడుస్తున్న ఆడపిల్లలను చూసి "మీరు వెన్నెల్లో ఆడపిల్ల చదివారా?" లావణ్యను అడిగాడు.

" మీరు తెలుగు బుక్స్ చదువుతారా,?" ప్రశ్నకు ప్రశ్నే జవాబయ్యింది.

" హా! చాలా చదువుతాను. చలంగారి రచనలంటే చాలా ఇష్టం" హుందాగా చెప్పాడతను.

"అవునా నేను కూడా చాలా పుస్తకాలు చదివా. చలం గారి రచనలంటే నాక్కూడా చాలా ఇష్టం. ఆయన రాసిన వెన్నెల్లో ఆడపిల్ల అంటే ప్రాణం" ఉత్సాహంగా చెప్పుకొస్తున్న లావణ్యను చూసి నవ్వుకున్నాడు.

"అక్కా! వెన్నెల్లో ఆడపిల్ల రాసింది యండమూరి గారు" గుసగుసగా చెబుతున్న చిన్నారి మాటలు ఆ నిశ్శబ్ద నిశాసతిలో స్పష్టంగా వినిపిస్తున్నాయి. రవి గర్వంగా నవ్వాడు.

వీరిలా నడుస్తుంటే దారి మధ్యలో ఎవరో పాముకాటుకు గురై పడి ఉన్నాడు. చిన్నారి పరుగున వెళ్లి అతని కాళ్ళను నోట్లో పెట్టుకొని విషాన్ని ఉమ్మి పడేసి, అతని ప్రాణాలను కాపాడింది. ఈ తంతు ముగిసే సరికి మధ్యరాత్రి దాటింది. చిన్నారి సాహసాన్ని దారంతా పొగుడుతూనే ఉన్నాడు.

అది భరించలేని లావణ్య " ఓసి అంతేగా ..అదేం బ్రహ్మవిద్య కాదు బావా! అది నాకూ తెలుసు. కానీ ఆ పాలేరు గాడి కాళ్ళు ఎవరు నోట్లో పెట్టుకొంటారు.. ఛీ.." లావణ్య అహంకారం లోతెంతో చిన్నారి అంతః సౌందర్యం జాడేంటొ తెలిసివచ్చింది అతనికి. కార్యేషు దాసి కరణేషు మంత్రిగా తనను అలరించగలదు అనే నమ్మకం కలిగింది అతనిలో.

వీళ్ళు ఇంటికి వెళ్లేలోపే పాము కాటు విషయం అందరికీ తెలిసి బయట నుంచొని ఉన్నారు. వీళ్ళు రాగానే కాంతం చిన్నారి మీద నోరు పారేసుకుంది. "అదృష్టం బాగుండి ఏమవ్వలేదు కానీ , ఈ రాత్రిపూట షికారులెందుకే? ఈ చిన్నారే తీసుకెళ్ళి ఉంటాది. దీనికన్నీ గాలి తిరుగుళ్ళు ఎక్కువ" కాంతం అకారణంగా చిన్నారిని తిట్టిపోస్తున్నది. లావణ్య చూస్తూ ఉంది కానీ నోరు మెదపలేదు.

"కానీ అత్తయ్యా.." అని జరిగింది చెప్పబోతున్న రవిని కళ్ళతోనే వద్దని అడ్డుకుంది.

పక్షం రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఈ 15 రోజుల్లో తెలియకుండానే చిన్నారికి చాలా దగ్గరైపోయాడు రవి. ఆమె హావ భావాలు, ఆలోచనలు, మాటలు ఎంతో రమ్యంగా కనిపిస్తున్నాయి.

ఎదురిల్లే కావడంతో బంగార్రాజు ఇంటికి వచ్చి పోయే వాళ్ళను గమనిస్తూనే ఉన్నాడు. ఇప్పటికైనా తొందర పడాలి. తన మనసులోని మాట చిన్నారికి చెప్పెయ్యాలనుకున్నాడు.

ఓ రోజు ఇంటిల్లిపాదీ ఎక్కడికో బయలుదేరారు. కానీ చిన్నారి కనిపించట్లేదు. బహుశా ఆమెను కాపలా పెట్టి వచ్చినట్టు ఉన్నారు. ఇదే మంచి సమయం తన మనసులో మాట బయటపెట్టడానికి.

ధైర్యం చేసి ఇంట్లోకి వెళ్ళాడు. ఎక్కడా ఆమె జాడ లేదు. ఒకవేళ ఆమె ఎక్కడికైనా వెళ్లిందా? వెళితే ఇంటికి గొళ్ళెం వేసి ఉండాలిగా? అంటే ఆమె ఇంట్లోనే ఉండి ఉండాలి. సావిట్లో నీళ్ళ చప్పుడు వస్తుండటంతో అటువైపు వెళ్ళాడు. తలుపు ఓరగా వేసి ఉంది. నూతి దగ్గర ఛాతి మీద నుండి లంగా కట్టుకుని స్నానం చేస్తున్న చిన్నారిని చూసి అతని మనసు లయ తప్పింది.

"శశి వదనే.. శశి వదనే.. స్వర నీలాంబరి నీవా" ఆమెను చూసి తెలియకుండానే పాట పెదవి దాటింది. అతని పాట విని మొహం మీద కుమ్మరించుకుంటున్న నీళ్ళ చెంబును జారవిడిచి కంగారుగా పరుగుపెట్టి జారిపడబోయింది. ఆమెను పట్టుకుంటూ రవి ఆమెపై ఒరిగిపోయాడు. కొన్ని క్షణాలు కాలం నిలిచిపోయింది వారి మధ్య. ఆమె తేరుకుని అతన్ని పక్కకు నెట్టి గోడ చాటున దాక్కుంది.

"అక్కావాళ్ళు ఇంట్లో లేరు బావగారు..."

"తెలుసు"

"తెలుసుండి ఒక అమ్మాయి ఒంటరిగా ఉన్న ఇంట్లోకి రావడం భావ్యం కాదుగా"

"నాది అనుకున్నప్పుడు తప్పొప్పులు కనిపించవు"

"హూ??"

"నువ్వు నా దానివి. నిన్ను నా అర్ధాంగిగా భావించుకున్నాను. నువ్వు ఒప్పుకుంటే జీవితాంతం నీ తోడుగా కలిసివుంటా"

"ఇది తప్పు. మీరు మా అక్కను చూడడానికి వచ్చారు. ఆమె మనసులో ఆశలు పెంచారు."

" నేనెప్పుడూ ఆమెను చేసుకుంటానని మాటివ్వలేదే. మొదటి నుండి నాకు నీ మీదే మనసుంది. నిన్నే పెళ్లి చేసుకుంటాను. లేకుంటే నీ తలపులతో బ్రహ్మచారిగా మిగిలిపోతాను" రవి స్థిరంగా చెప్పాడు.

అటువైపు మౌనం రాజ్యమేలింది.

"మౌనం అంగీకారం అనుకోవచ్చా??" సునిశితంగా అడిగాడు.

"పెద్దల అంగీకారమే నా అభిప్రాయం" అంటూ వెళ్ళిపోయింది.

ఆ మాట చాలు అతనికి. వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. వెంటనే బామ్మతో తన మనసులో మాట చెప్పాడు. మనమడు మనసెరిగిన ఆ పెద్దావిడ ఎంతో సంతోషించింది.

" కానీ కాంతం ఒప్పుకుంటుంది లేదో!? నా ప్రయత్నం నేను చేస్తా" అని ఇరుపెద్దలతో మాట్లాడి ఒప్పించింది.

"అంతా నాదే తప్పు. ఈడొచ్చిన పిల్లను మా పిల్లతో పంపకుండా ఉండాల్సింది..దరిద్రపుది! నా కూతుర్ని చూడ్డానికి వచ్చినోడిని లేపుకు పోయింది." కాంతం రాగాలు తీసింది.

పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అని అంటారు. ఎక్కడో విదేశంలో పెరిగిన యువకుడికి మన దేశపు తెలుగు పిల్లతో ఘనంగా పెళ్లి జరిగింది.

అతడు ఎంతగానో ఎదురు చూసిన రాత్రి రానే వచ్చింది. సుగుణ సౌందర్యంతో దేవతలా అతని ముందు నిల్చింది చిన్నారి. ఆమె సుతిమెత్తని భుజస్కందాలను అదిమిపట్టి తన పక్కన కూర్చోపెట్టుకున్నాడు. సిగ్గులొలికే ఆమె మోమును తనివితీరా వీక్షించాడు. వాలిన కనురెప్పల చాటునుండి ఎన్నో ఊసులాడాలన్న ఆమె కోరికను గుర్తించి , "ఏమైనా అడగాలని ఉందా??" అని ప్రేమగా అడిగాడు.

"అంత అందమైన అక్కను కాదని నన్నెందుకు చేసుకున్నారు?"

"నువ్వు అందంగా లేవని ఎవరన్నారు?"

"నేను నల్లగా ఉంటాను."

"హా హా..."అతను గట్టిగా నవ్వాడు.

"ఛాయ లేకుంటే అందంగా లేనట్టా ? అశాశ్వతమైన బాహ్య సౌందర్యం కన్నా స్థిరమైన అంతః సౌందర్యం నీ సొంతం. చదువు కన్నా వివేకం గొప్పది. అందం కన్నా అర్పించే మనసు గొప్పది. నన్ను అర్ధం చేసుకుని జీవితాంతం నా తోడుగా నిలిచే నేస్తాన్ని కోరుకున్నా. కార్యేషు దాసిగా కరణేషు మంత్రిగా భోజ్యేషు మాత గా శయనేషు రంభగా నా సహధర్మచారణిగా నీవే నా సరిజోడువని గుర్తించాను. నువ్వు చేసిన పనులు, ఇన్ని రోజులు నీతో గడిపిన సమయం, నీ వ్యక్తిత్వాన్ని నాకు తెలిపింది. ఇదంతా నీ స్వయంకృతమే.. "అంటూ ప్రేమగా ఆమెను అక్కున చేర్చుకున్నాడు. వీరి విరహ తాపాన్ని భరించలేని నిషాపతి మబ్బుల మాటున దాక్కున్నాడు.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : కిరణ్ విభావరి


నేను ఇప్పటి వరకూ 32 కథలూ, 4 కవితలూ రాశాను. నేను రాసిన నాలుగు కవితలే అయినా అన్నిటికీ విశిష్టమైన బహుమతులు అందుకున్నాను. NATA, NATS, జాషువా కవితా పురస్కారాన్ని అందుకున్నాను. కథల పోటీలలో కూడా తెలుగు తల్లి కెనడా అవార్డ్, స్వేరో టైమ్స్ పత్రిక వారి పోటీలో ప్రథమ బహుమతి, mom'spresso వెబ్సైట్ లో అత్యుత్తమ బ్లాగర్ గా, ఇంకా మరెన్నో పోటీల్లో బహుమతులు పొందుకున్నాను. నా కథలు ప్రముఖ పత్రికల్లో ప్రచురితం అయ్యి, ఎందరో పాఠకుల మన్ననలు పొందాయి. ముఖ్యంగా నేను రాసిన కాఫీ పెట్టవు కథ social media లో వైరల్ అయ్యి, ప్రముఖ FM radio లో, అల్ ఇండియా రేడియో లో ప్రసారం అయ్యింది.





144 views1 comment
bottom of page