'Antharmukham' New Telugu Story
Written By Indira Veldi
రచన: ఇందిర వెల్ది
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
నేను వృద్ధాశ్రమంలో చేరి రేపటికి మూడు సంవత్సరాలవుతుంది. నా పేరు ఎల్లయ్య బాబు. రెవెన్యూ డివిజనల్ అధికారిగా పని చేసి రిటైర్డ్ అయ్యాను.
నాకు ఇద్దరమ్మాయిలు. ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేశాను.
నా భార్య నాలుగు సంవత్సరాల క్రితం గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ తో చనిపోయింది. నాకూ బిపి, షుగర్. పైగా ఎయిడ్స్ తో బాధపడుతూ ఒంటరిగా ఉంటే కష్టమని తలచి ఇదిగో ఈ ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ అయ్యాను. నా పిల్లలు అప్పుడప్పుడూ వచ్చి చూసి వెళుతుంటారు.
ఎప్పుడు పోతానో తెల్వదు. ఇంత కాలం బ్రతికానంటే కారణం? నేను ప్రతిరోజూ ఎక్సర్ సైజులు, యోగా చేయబట్టేనేమో!
నాకు వ్యక్తిగత సహాయకునిగా గిరిధర్ ను నియమించారు ఆశ్రమం వాళ్ళు. అతడు ఏ పనైనా పద్ధతిగా చేస్తాడు.
చాలా తెలివిగలవాడు.
ఆశ్రమంలోని ప్రతి మొక్కను, చెట్టునూ వర్ణించి చెబుతాడు, ఏవి ఎప్పుడు పూస్తాయో, ఎప్పుడు వాడుతాయో వివరిస్తాడు. కానీ ప్రతి రోజూ రాత్రి తన గదిలోకి వెళ్ళి గొల్లుమని అరగంటైనా ఏడుస్తాడు. ఆ సమయంలో ఎవ్వరు ఆగబట్టినా ఆగడు. ఇదే నేను వచ్చినప్పటి నుండి గమనిస్తున్న విషయం. ఈ వేళ నేనూ, తనూ కలిసి ఉదయాన్నే దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్ళాము. చాలా ముభావంగా కనిపించాడు. ఇవ్వాళ తన పెళ్ళి రోజట. ఏమనుకున్నాడో ఏమో కానీ నేను అడగకముందే తన కథ చెప్పడం ప్రారంభించాడు. తన తల్లిదండ్రులకు తాము పదిమంది సంతానమట. తనే ఆఖరివాడట.
పెద్ద వాళ్ళందరూ తలో పని చేసుకుని బ్రతుకుతున్నారట.
తనేమో! మొక్కల పెంపకాన్నే వృత్తిగా పెట్టుకుని నర్సరీ నడుపుతుండేవాడట. అతని భార్య కూడా ఇంటర్ చదివిందట. చాలా తెలివికలదట. తనకు కాస్త ఎక్కువగా డబ్బు, నగలు, బంగళాలు, వాహనాల మీద మోజట. ఏదో భగవంతుని దయ వలన ఏదో ప్రభుత్వ శాఖలో అటెండర్ గా ఆమెకు ఉద్యోగం వచ్చిందట.
గిరిధర్ ఏమీ అందగాడు, ఆజానుబాహుడు కాదు, కురచనైన, చిన్న దేహం. పైగా ఇరవైనాలుగు గంటలూ పనిలోనే ఉండి సరిగ్గా తినేవాడు కాదట, ఫలితంగా కృషించిన శరీరంతో ఉంటాడు. మొత్తానికి తన కష్టం వలన ఓ ఇల్లు కట్టుకోగలిగాడు. ఇక అటెండర్ గా చేరిన అతని భార్య ఆఫీసులో హోదా, దర్పంతో వెలిగిపోతున్న అధికారులకు కొందరికి అన్నీ సమర్పించుకుని ఆనందం పొందటం మొదలు పెట్టిందట.
అంతటితో ఆగితే బాగుండేది. రాజును చూసిన కళ్ళతో మొగున్ని చూసి మొత్తుకున్నట్లుగా డాబు, దర్పంతో వెలిగిపోయే అధికారులను చూసిన కళ్ళతో మట్టి పిసుక్కుంటూ, మాసిన బట్టలతో కనిపించే మొగుడు, మొగునిగా కనిపించలేదట ఆమెకు.
సంసారం చేయడం పూర్తిగా మానేసిందట. భర్త బట్టలు ఉతకడం, భర్తకు అన్నం పెట్టడం, ఆలనాపాలనా చూడటం పూర్తిగా మానేసిందట. పిల్లలూ తనవైపే, ఎందుకంటే?
వాళ్ళకు కావలసిన బట్టలు, నగలు, సైకిల్, స్కూటీ ఇతర అవసరాలు ఏవైనా ఉదయం కావాలని చెబితే సాయంత్రానికి తెచ్చేదట. సమాజాన్ని అర్థం చేసుకునే వయసు రాని పిల్లలు తల్లి ఏది చెబితే దానికే వంత పాడేవారట. కన్నతండ్రినే పురుగులా చూసేవారట.
గిరిధర్ ఇక తన గోడును తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్ళకు చెబుదామంటే? తల్లిదండ్రులు వయోభారంతో వృద్ధులైపోయారట, ఆ మధ్యే పోయారట కూడానూ. ఇక అన్నదమ్ములు, ఎవరి సంసారాలు వారివి. గిరిధర్ రోదన అరణ్య రోదనే! గిరిధర్ భార్య శైలజ సమాజసేవ ఒక్క అధికారి నుండి, అనేక అధికారులకు మారిందట.
ఎవరైనా చూస్తారేమో ఏదైనా అనుకుంటారేమో అనే భయాన్ని పూర్తిగా వదిలిందట. తనను చూసి సిగ్గు, బిడియాలే సిగ్గు పడేంతగా హృదయాన్ని విశాలం చేసుకుందట. ఇక గిరిధర్ తో అవసరం లేదనుకుని నిర్ణయించుకున్నదేమో, ఓ అశుభ ముహుర్తాన గిరిధర్ కు అన్నంలో విషం కలిపిందట. అది తిని కక్కుకుంటున్న గిరిధర్ ను ఎదురింటి వేంకటేశ్వర రావు ధర్మాసుపత్రిలో చేర్పిస్తే, చావు తప్పి కన్ను లొట్టబోయినంత పనైందట గిరిధర్ కు. మొదట శైలజ దుర్మార్గాలన్నీ బయట పెడదామనుకున్నాడట గిరిధర్.
అలాచేస్తే! ఎంత దుర్మార్గులు అయినా, తన రక్తం పంచుకుపుట్టిన బిడ్డలు కదా, వాళ్ళ జీవితాలు ఆగమవుతాయని తలచి, భవ బంధాల మీద మోజు విడిచి, సన్యాసి వేషం ధరించి, ఇదిగో వృద్ధుల ఆశ్రమంలో బతుకు వెళ్ళదీస్తున్నాడు. అతని జీవిత కథను విన్నాక నా ముఖం మీద నేనే ఉమ్మేసుకున్నాను. కానీ నా మనసు నా మాట వినదు.
ఎందుకంటే. . ఎందుకంటే. . నేన మగ శైలజను, అంతే. పేరుకే పెద్ద అధికారిని. సమాజంలో హోదా, గౌరవం అన్నీ పొందాను కానీ నా వ్యక్తిగత జీవితం శైలజకంటే నాలుగురెట్లు ఎక్కువ చెడుతో కూడుకున్నదే. ఎర్రగా, బుర్రగా ఏ స్త్రీ అయినా కనిపిస్తే ఆమె శీలాన్ని దోచుకోవడమో లేదా ఆమె నాతో సంసారం చేస్తున్నట్లుగా ఊహించుకోవడమో నాకు అలవాటు. నా మనసులో పడిన ఆడదాన్ని మసి చేస్తే కానీ నాకు నిద్ర పట్టదు.
నా కోరిక తీరే దాకా కళ్ళు దాగిన, ముళ్ళు గుచ్చుకున్న, తాటి కాయ మీద పడ్డ నక్కలాగో లేక ఏ కోతిలాగో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాను. అప్పుడు నాకు అడ్డువచ్చిన నా భార్యా, బావమరదులు, అత్త, మామలు ఎవరినైనా ఎదురిస్తాను. వాళ్ళకు రకరకాల కట్టు కథలు చెబుతాను. నా పెళ్ళాన్ని నన్ను అనవసరంగా అనుమానిస్తుందని వాళ్ళవాళ్ళతోనే తిట్టించగల సమర్థుడిని నేను.
ఒక రకంగా నేనో కామున్ని. నాకు స్త్రీల మనోభావాలు వారి ప్రేమతో పనిలేదు. కేవలం నా కామవాంఛ తీరితే చాలును. వేశ్యలయితే పరవాలేదు. డబ్బుకు అమ్ముడు పోయే వాళ్ళైతే పరవాలేదు కానీ నన్ను నిష్కల్మషంగా ప్రేమించిన, గౌరవించిన ఒక్కరిద్దరి సంగతేమిటి? హా వాళ్ళ కర్మకు నేను బాధ్యున్ని కాను. అయినా నాకు హృదయముంటే కదా నేను కేవలం మగ శరీరాన్ని తొడుక్కున్న పురుషున్ని నా ఇగో సాటిస్ఫై అయితే చాలు.
మాది బెజవాడ దగ్గర దుర్గాపురం అనే పల్లెటూరు. ఎల్లమ్మ ఉత్సవ సమయాల్లో పుట్టానని నా పేరు ఎల్లయ్య బాబు అని పెట్టారట. అందరి జీవితాల్లో కనబడే జీవిత లక్ష్యం, కనపడని వ్యక్తిగత ఇష్టాలు, అభిరుచులూ ఉంటాయి. కనబడే నా జీవిత లక్ష్యం పెద్ద అధికారిగా గుర్తింపు పొందాలని.
లెక్కలుంటయ్, నియమాలుంటాయ్.
నాకు దగ్గరగా జరిగే స్త్రీలు ఎరుపు/తెలుపు/పసుపు రంగులో మాత్రమే ఉండాలి. ఒడ్డూ, పొడుగూ బాగుండాలి. మొగున్ని వదిలేసిన లేదా మొగుడొదిలేసిన వాళ్ళకు, మొగుడుపోయిన వాళ్ళను దగ్గరకు రానివ్వను.
వాళ్ళు పట్టుకున్నరంటే వదలరు అందుకని. అయినా మళ్ళీ ఆ బాధలెవరు పడతారు? చిన్నిళ్ళు అస్సలు ఇష్టం లేదు కానీ నా యోగంలో ఉందని జ్యోతీష్యుడు చెప్పాడు కూడా. ఎందుకని అడిగితే? లగ్నాధిపతి లగ్నంలో ఉంటే చిన్నిళ్ళు ఖాయమట.
మరి అది జరుగుతుందో లేదో చూడాలి. ఇప్పటి వరకు మా ఆశ్రమంలో ఉన్న స్త్రీలందరూ 55+ వాళ్ళే. అయినా నా వయసెంతనీ జస్ట్ అరవైమూడే. ఎప్పుడూ మరొకరితో పక్కలదొక్కేనేను, పక్కన పడుండే పెళ్ళాం లేక ఈ హై క్లాస్ ఆశ్రమాన్ని ఆశ్రయించాను గానీ.
ఒకసారెమైందంటే నా ఆఫీసుకు బాలికా, స్త్రీ సంక్షేమ శాఖలో పనిచేసే అధికారిణి వచ్చింది. నాకంటే అయిదారేళ్ళు పెద్దది. కానీ దబ్బపండులా ఉంది. ఏదో ఒక రకంగా మచ్చిక చేసుకున్నాను కొంతకాలం పాటు కథ బాగానే నడిచింది. ఈ లోగా నాకు మరో ఊరికి బదిలీ అయింది. పాపం దబ్బపండు, ఐ మిస్ యూ రా అని మెసేజ్ చేసింది. అదిగో అది నా పెళ్ళాం కంట పడింది. ఇక నన్ను, నా బోండాం రాచి రంపాన పెట్టింది.
ఒకరోజు నాకు ఒళ్ళు మండి నేనన్నాను. కాకికి నలుపు రంగేసినట్లుండే నన్ను అబ్బాస్ అని పిలుస్తావ్ గదే, ఇంతకీ నీ మొగున్ని నేనా, ఆ అబ్బాస్ గాడా అని? ఆ దెబ్బకు నా బోండాం వారం రోజులు పనులన్నింటికీ సెలవు ప్రకటించింది. నా ఇగో కూడా హర్టయ్యింది. కొంపదీసి దీని ఊహలలో అబ్బాస్ గాడున్నాడా ఏమిటి? ఉన్నా చెబుతుందా అది? ఎంతైనా లైసెన్స్ ఉన్న ఆలి కదా దానితో సర్దుకు పోవలసిందే. హమ్మో! నా బోండాం కూడా నా లాగే నేను ఇతర స్త్రీలతో గడిపినట్లు తను ఇతర పురుషులను ఊహించుకుంటేనో?
కనపడే విషయాలను గమనించడమే కష్టం ఇక కనపడని దాని మనసులో ఏముందో తెలుసుకోవడం కష్టమే. ఇక తను చాయ్ లు, టిఫిన్లు పిల్లలతో పంపించింది. నేనసలే మొండివాన్ని. బయట బోలెడు ఇన్లు(Inns), ఇల్లాళ్ళు. పిల్లలతో పంపిస్తే తినడం మానేశాను. ఒకరోజు బోండాం గోలను భరించలేక స్త్రీ, శిశు సంక్షేమ ఆంటీని, దాని బట్టతల తెల్ల వెంట్రుకల మొగున్ని చూపించాను. నా "గున్న" ఇగో సాటిస్ఫై అయింది. అయినా నా అదృష్టం కాకపోతే మరేంటి? నా దబ్బపండు వీరమాచనేని ఆహారనియమాలు పాటించి, చిక్కి శల్యమై పీచు పీకేసిన మామిడి టెంకెలా మారింది. హమ్మో! థ్యాంక్ గాడ్. నువ్వు మా వంటి మన్మథుల పాలిట ఇంద్రునివే సుమా!
ఎర్రగ, బుర్రగ ఉన్న డాటా ఎంట్రీ ఆపరేటర్లు, జూనియర్ అసిస్టెంట్లు, వంట చేసే ఆడాళ్ళు, టీ అందించేవాళ్ళు, అపార్ట్మెంట్లో ఒకరిద్దరు అటుపక్క ఇటుపక్క ఆంటీలు, ఆఖరికి పని మనుషులతో సహా ఇప్పటి వరకు నా లెక్క అర్ధ శతకానికి అతి దగ్గరగా జరిగింది. అందుకే నా పెళ్ళాం చాలా ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. తను ఊరికి వెళితే పని మనుషులకూ, పనికి సెలవు ప్రకటిస్తుంది. ఓ సారి ఓ సంవత్సరమైనా ఒక్క తెల్ల హంసా కనపడలేదు.
అయ్యబాబోయ్! భగవంతుడు దయామయుడు ఒక్కసారే మూడు హంసలు, తమ అందచందాలతో హింసించాయి నన్ను వరసగా. ఒకటి నా పెళ్ళాం స్నేహితురాలు. కరోనా కష్ట కాలంలో, వాహనాల మీద పెట్టిన కట్టడి ఈ డాంబర్ పోక్స్ అధికారికి వరంగా మారింది. నా ఏసీ తుఫాన్ జీప్ లో పెళ్ళాం చెలిని (చెల్లిని కాదు స్నేహితురాలిని) ప్రేయసిగా మార్చుకుని విశాఖపట్టణం నుండి విజయవాడకు ఎన్నిసార్లు దించానో? అదిగో నా కొంపకు మళ్ళీ నిప్పంటుకుంది. పెచె(పెళ్ళాం చెలి)కి చిలక్కి చెప్పినట్లు చెప్పాను. ఇంటికొచ్చాక ఫోన్ చెయ్యకే అని, వింటుందా తను? ప్రేమోన్మాదంలో మునిగిపోయిందాయే?
ఫోన్ చేసి ఎప్పుడొస్తావంది?
పాము చెవుల నా పెళ్ళాం పసిగట్టింది. నా ఫోన్ బర్రున లాక్కుని నా దోస్త్ నీకెందుకు ఫోన్ చేసిందంది? ఇక్కడ సౌండ్ పోయింది, పెదవులు కదులుతున్నాయంతే! బలవంతంగా ధైర్యం తెచ్చుకుని దాని మొగుడు ఉద్యోగం గురించి అట అని కట్టుకథ అల్లేశాను. కానీ బోండాం ముఖం బోర్లించా నమ్మి చస్తుందా దొంగమున్న? దాని స్నేహితురాలు తెల్ల హంసను సర్ఫ్ ఎక్సెల్, ఏరియల్ తో చెడామడా ఉతికి మరింత తెల్లగా దాని బుగ్గలు పాలుపోయేలా చేసి ఆరేసింది. దాని నంబర్ డిలీట్ చేసింది మా ఇద్దరి ఫోన్లలో.
దాని పుణ్యం బతికిపోయాను, ఇక ఆరాలు అధికంగా తియ్యలేదు లేకుంటే పీజీ చేసిన తిక్కల నా పెళ్ళానికే తెలివుంటే? ఏ ఉద్యోగో, వ్యాపారో కాకపోనూ! ఆ రకంగా బతికిపోయాను.
రెండవ తెల్ల హంస నా పదవ తరగతి క్లాస్మేట్ విజయవాడలో, నేను పెద్దగా కష్ట పడకుండానే, నా అధికారం హోదా చూసిందేమో? విష్ణుమూర్తి నక్షత్రంలో పుట్టిన ఈ ఇంద్రునికి తులసిగా మారిపోయింది. హమ్మయ్య! హాయిగా గాళ్ళో తేలినట్లయింది.
అర్థం కాలేదా? స్త్రీలను ఉబ్బిచ్చో లేదా డబ్బిచ్చో వశం చేసుకోవాలని మా అమ్మమ్మ ఆశాలు చెబితే చిన్నప్పుడు ఎప్పుడో విన్నట్లు గుర్తు. మొత్తానికి ఉబ్బిచ్చి ఉబలాటం తీర్చుకున్నాను. పాపం పిచ్చి తులసిని ఆ తర్వాత విసిరికొట్టాను,
తర్వాత తన నంబర్ షిఫ్ట్ ప్లస్ డిలీట్ చేశాను. ఆ తర్వాత తను కనపడినా తెల్వనట్లు ముఖం తిప్పుకుని వెళ్ళి పోయింది పాపం పిచ్చి తులసి ఒకటవది. ఇక మిగిలింది మూడవ తెల్ల హంస మమత. అది మహా మేథావి.
బహుముఖ ప్రజ్ఞాశాలి.
దానిని వశ పంచుకోవడం అంత తేలిక కాదు.
పైగా అది నాకు లా చదివే రోజులలో క్లాస్మేట్.
దానిని లొంగ దీసుకోవడం నాకు కత్తి మీద సాములా మారింది. నాతో ఎంతో క్లోజుగా, ప్రాణానికి ప్రాణమైన స్నేహితురాలిగా ప్రవర్తిస్తుంది. కానీ తన హద్దులలో తానుంటుంది.
తనది చాలా బోల్డ్ నేచర్. మగవాళ్ళు, ఆడవాళ్ళు అని చూడకుండా మంచి మనుషులు, చెడ్డమనుషులుగా మాత్రమే మనుషులను విభజించి చూస్తుంది. మేకతోలు కప్పుకున్న నా పులిరాజు ముఖం దానికి తెలియదు. నన్ను సర్వ శుభలక్షణ శోభితునిగా భావించింది. నన్ను తన గొప్ప స్నేహితునిగా భావించేది.
అందరితో మాట్లాడినట్లే నాతోనూ ఫ్రీగా మాట్లాడేది, సమయానికి నా కారు అందుబాటులో లేకపోతే తన కారులో లిఫ్ట్ కూడా ఇచ్చింది కూడాను. మమత తన జీవితం, ఆశలు, ఆశయాలను గురించి గంటలు గంటలు ఉపన్యాసాలు చెబుతుంది, తప్పితే నా ఆశ తీర్చదు. పైగా నా వేషాలు తెలిస్తే ఎక్కడ కట్ చేస్తుందోనన్న భయం. ఇక నా భార్యకూ మమత అంటే ఏ మూలో భయముంది,
ఎందుకంటే సమస్త విషయాలలో నా భార్యకన్నా బెటర్గా ఉన్న మమత ప్రేమలో నేను పడిపోతానేమోనని పెళ్ళాంమేడం భయం.
వాస్తవానికి నా జీవితంలోకి ప్రవేశించిన స్త్రీలందరిలో అనేక విషయాలలో మమత గొప్పగా ఉంటుంది. స్త్రీలోలున్నయిన నేను, నా బోండాంతో సుఖ సంతోషాలను పంచుకుంది తక్కువే. నా పెళ్ళాం నా తల్లినీ అక్కచెల్లెళ్ళను ఎప్పుడూ మనస్పూర్తిగా గౌరవించలేదు కేవలం నా భయానికే ప్రేమున్నట్లు నటిస్తుంది తప్పితే. పైగా బోండానికి డబ్బు, నగలు, బట్టలు పేద్ద డ్యూప్లెక్స్ ఇల్లు పిచ్చి.
ఇక మమతను చూశాక నాకు ఇటువంటి భార్య ఉంటే బాగుండును అని మొదటిసారి అనిపించింది. మమత నా ప్రక్కన మామూలుగా అందరి స్నేహితులు, బంధువుల పక్కన కూర్చున్నట్లే కూర్చున్నా, తన పక్కన నేను కూర్చున్నప్పుడు స్వర్గంలో తేలిపోతున్న భావన కలిగేది నాకు. తను నాతో కలిసున్నంత సేపు నేను చాలా ఆనందంగా ఉండేవాన్ని. కానీ నా భార్యకు మా ఇద్దరి స్నేహం ఎప్పటిలాగే నచ్చలేదు. నిప్పులు చెరిగింది.
మా ఇద్దరి మధ్య ఏమీ లేకున్నా, నా పెళ్ళాం టార్చర్ భరించలేక, మమతను దూరం చేసుకున్నాను, ఒక సందర్భంలో మమతే నేనంటే పడి చస్తుందని, నేను తనతో మాట్లాడకున్నా నా వెంట పడుతుందని అబద్ధాలు చెప్పి, నాతో తన అభిరుచికి సంబంధించిన పని గురించి చర్చించడానికి వస్తే మాట్లాడకుండా అవమానించి పంపాను, ఎట్లాగూ పని వర్కవుట్ కాదని తెలుస్తుంది కదా, ఇంకా ఎందుకు దాని నీతి వాక్యాలు వినడం అని.
ఇంత తిరుగుబోతుకూ నిజమైన స్నేహితురాలు మమత.
మమత దృష్టిలో కూడా నేను చాలా మంచివానిగానే ముద్రితమై ఉన్నాను ఆనాటి వరకు, ఇక మమత నా గురించి ఏమనుకుందో ఇక ఇప్పటి వరకు నాకు తెలియదు, ఎందుకంటే మమతతో మాట్లాడింది అదే ఆఖరి రోజు.
మమత నన్ను బ్రతిమిలాడింది నువ్వు ఎలాంటివానివో తెలియక నీతో స్నేహం చేశాను. మనం ఎక్కడైనా పొరపాటున కలుసుకుంటే మాట్లాడమని లేకుంటే ఇతరులు వీరిద్దరి మధ్య ఏం జరిగిందో అని అపార్థం చేసుకుంటారని.
అయినా నేను మనిషిని అయితే గదా? నాకు తిక్క రేగిందంటే? నేను ఉమెనైజర్ ను కాదు నువ్వే మగవాళ్ళంటే పడి చచ్చేదానివి అని నిరూపించగల సమర్థుడిని అని.
ఈ జన్మలో ఈ ఉమెనైజర్ కు తీరని ఒకే ఒక కోరిక మమతతో పొందు. నేను అన్ని విషయాలలో మంచివాన్నే, తప్పు నాది కాదు, నా జన్మకుండలిలో గ్రహాల ప్రభావమనుకోనా?
నా మగ స్నేహితులైతే నన్ను అమితంగా గౌరవిస్తారు, నా విశ్వరూపం వాళ్ళకు ఎప్పటికీ తెలియదన్న నా ధీమా! ఏది ఏమైనా నా అంతర్ముఖంలో, ఎవరూ లేని ఏకాంతంలో నా తప్పొప్పులు నన్ను సూదుళ్ళా గుచ్చుతూనే ఉన్నాయి అదీ ఈ మధ్య కాలంలోనే. అయినా నేను మగవాన్ని. సమాజం నన్ను ఏమీ అనదనే అహంకారం. నా ద్వార జీవితాన్ని కోల్పోయిన ఏ స్త్రీ నా గురించి బయట చెప్పదనే ధైర్యం. ఒకవేళ సాహసించి చెబితే దానిని లం. . . ను చేస్తాను. దాని బతుకును కుక్కలు చింపిన విస్తరిని చేస్తాను ఖబడ్దార్ ఎన్నో పువ్వులను నయానో, భయానో నలిపేసిన ఈ విశ్రాంత అధికారికి. ఈ రెండు మూడు రోజుల్నుండి మాత్రం గిరిధర్ అమాయకత్వం, నిస్సహాయత, నిజాయితీని, ధర్మ గుణాన్ని చూసి అతని రెండు పాదాలూ కన్నీటితో కడగాలని అనిపిస్తుంది కానీ. సమాజంలో నా హోదా, దర్పం నాకు అడ్డు వస్తున్నాయి.
అది గాకుండా నేను మగ శైలజను అని తెలిస్తే నా ప్రియమైన స్నేహితుడు/సహాయకుడు గిరిధర్ నన్ను వదలివెళ్ళిపోతాడని భయం. ఈ లోకంలో నేను క్షమించమని అడిగే అర్హత గలవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఒకటి మమత నన్ను నిజమైన ప్రాణ స్నేహితునిగా మనః పూర్తిగా నమ్మింది, గౌరవించింది, నాతో స్నేహం కలకాలం కొనసాగాలనుకుంది ఇద్దరు మిత్రులు సినిమాలో చిరంజీవి, సాక్షి శివానంద్ లాగ.
కానీ నేను తన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను కాబట్టి. రెండవ వ్యక్తి గిరిధర్ నా అంత చదువు, ఉద్యోగం, హోదా ఏదీ లేకున్నా నా కంటే గొప్ప సంస్కారి కాబట్టి.
మమత ఒక మాట అనేది ఎప్పుడూ! దేవున్ని నమ్మే వ్యక్తులందరూ చచ్చాక, స్వర్గానికో, నరకానికో పోతారు. అక్కడ న్యాయమూర్తి ఒకరికొకరు తెలిసిన వాళ్ళందర్నీ ఒక్క దగ్గర వరసలో నిలబెట్టి, మనం మనుషులుగా బ్రతికున్నప్పుడు చేసిన మంచి, చెడు పనులను అడుగుతాడని, అప్పుడు నిజాలు మాత్రమే చెప్పాలని. లేదంటే మాట్లాడేవారి వెనకాల 70 mm స్క్రీన్ మీద వారి జీవితం గిర్రున తిరుగుతూ చూపించబడుతుందని.
దేవున్ని నమ్మే నన్ను ఈ ఎల్లయ్యబాబును, ఏ ఎల్లమో, సాయిబాబో రక్షించకపోతారంటారా అనే సందేహం. అందుకే ఎప్పటినుంచో ఎల్లమ్మను, సాయిబాబాను ఎడ తెగక కాకాపడుతున్నాను కానీ ఈ మొసలికి అధిపతి శని దేవుడు ఖర్మలకు తగిన ఫలితం ఇస్తాడట. ఇప్పటికే ఎయిడ్స్ వచ్చి, ఏ అంగాలను, అవయవాలను చూసి ఎగిసిపడ్డానో అవి చీము కారుతూ, నెత్తురోడుతూ సలపరం పెడుతుంటే? సల్పర్ కలిసిన ఎన్సామైసిన్ ను పూసుకోలేక చస్తున్నా.
అవును నేను చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కావు.
నా పాపాలకు నిష్కృతి లేదు. నేను ఎలాంటి వాన్నో నాతో పరిచయమైన స్త్రీలను కూడా నా అంత నీచంగానే ఊహించుకోవడం నేను చేసిన పెద్ద పొరపాటు. నాకు ఈ మధ్యే కొత్త భయం కూడా పట్టుకుంది. ఉద్యోగం చేస్తున్న నా ఆడ పిల్లలిద్దరికీ నా వంటి స్త్రీ లోలుడు ఎదురైతే నా పరిస్థితి ఏమిటి? వాళ్ళను ఎవరు రక్షిస్తారు? సెక్స్ ఒక్కటే నిజమైన జీవిత లక్ష్యంగా బ్రతికిన నేను పురుషులతో బాగానే ఉన్నాను కానీ స్త్రీల జీవితాలతో మాత్రం నీచంగా ఆడుకున్నాను.
ఎవరి శాపనార్థం తగిలిందో? ఎయిడ్స్ బారిన పడ్డాను. పెళ్ళాం చచ్చింది, బిడ్డల మొగుళ్ళు చిన్న వయస్సులోనే చచ్చారు. నా కథ చదివిన మీరెవరూ నాలాగ స్త్రీలను హింసించకండి. పతివ్రత అయిన సీతే కాదు, అయిదుగురు మగలతో సంసారం చేసిన ద్రౌపదీ పతివ్రతే. స్త్రీల మనసును ప్రేమించకుండా, గౌరవించకుండా కేవలం స్త్రీలను ఆటబొమ్మలుగా భావిస్తూ శరీరాలతో ఆడుకున్న నేను నిజంగా రావణున్నే.
ఇదే నా అంతర్ముఖం, నాలోకి నేను తొంగి చూసుకున్న నా గతం.
సమాప్తం
ఇందిర వెల్ది గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Twitter Link
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
ఇందిర.వెల్ది, రాష్ట్ర పన్నుల అధికారి, హైదరాబాదు, తెలంగాణా రాష్ట్రం.
3000 వచన కవితలు, 29 కథలు,35 పాటలు, 15 పద్యాలు వ్రాయడం జరిగింది.
Comentarios