top of page

అవినాభావ సంబంధం

, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AvinabhavaSambandham, #అవినాభావసంబంధం, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 79


Avinabhava Sambandham - Somanna Gari Kavithalu Part 79 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 26/05/2025

అవినాభావ సంబంధం - సోమన్న గారి కవితలు పార్ట్ 79 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


అవినాభావ సంబంధం

----------------------------------------

నిమ్మళమే లేనిది

ఘోషించే సంద్రం

దానిలా బోలినది

మానవుని హృదయం


ఆటుపోట్లు సహజం

కల్లోల కడలిలో

వాస్తవం ఈ విధం

మానవుని బ్రతుకులో


ఉవ్వెత్తున ఎగిసే

మామూలే కెరటాలు

మానవుని హృదయాన

పుట్టే ఆలోచనలు


మానవ జీవితానికి

పోటెత్తే కడలికి

సంబంధం ఉన్నది

ముమ్మాటికీ నిజమది










సృష్టిలో గొప్పవి

----------------------------------------

నీరెంత తోడినా

సముద్రమే తరుగునా

విద్యనెంత పంచినా

తగ్గుముఖం పట్టునా


చెట్టునే నరికినా

దాతృత్వం మానునా

అపకారం చేసినా

క్షమాగుణం వీడునా


పువ్వులను నలిపినా

పరిమళం దాచునా

సూదులతో గ్రుచ్చినా

కోపంతో రగులునా


సృష్టిలో చూడగా

ఎన్నెన్నో గొప్పవి

మేలులు చేయంగా

గుణంలో మంచివి
















అమ్మ చెప్పిన సత్యాలు

-----------------

అమావాస్య చీకట్లు

కలకాలం ఉండవు

జీవితాన ఇక్కట్లు

కాపురమే చేయవు


చిన్ని చిన్ని కలతలకు

కుమిలి కుమిలి ఏడ్వకు

మంచులా కరుగు కడకు

కనిపించవవి మనకు


కాల గర్భంలోన

కలిసేవేనోయ్!అన్ని

మానవ జీవితాన

ఉపయుక్తమే కొన్ని


నేడన్నది ముఖ్యం

రేపన్నది కానలేం

నీటి బుడగ జీవితం

అక్షరాల సత్యం


మిడిచిపాటు ఎందుకు!

ఎగసి పడే అలలా

తొందరపాటు ఎందుకు!

రాలిపడే పూవులా


వినయం ఆభరణం

బ్రతుకులో కిరీటం

గర్వం అగ్ని కణం

తగలబెట్టు జీవితం











ఉంటేనే విలువ

----------------------------------------

ఆకులు వృక్షంలో

కలువలు సరస్సులో

ఉన్నంత వరకు విలువ

ఊపిరి కాయంలో


చుక్కలు గగనంలో

నవ్వులు వదనంలో

ఉంటేనే అందం

బాలలు సదనంలో


యోచనలు అదుపులో

కాసింత పొదుపులో

ఉంటేనే లాభం

పెద్దల ఆధీనంలో


మహాత్ముల బాటలో

ఆత్మీయ తోటలో

ఉంటేనే క్షేమం

అనురాగపు కోటలో










అద్భుతం అమ్మ

----------------------------------------

అమ్మ మాట తీయదనం

వెన్నెల్లా మెత్తదనం

ఆలకిస్తే మాత్రం

భవిత అగును పూలవనం


అమ్మ మనసు నవనీతం

చూడ ప్రేమ పూరితం

లోకమంతా విదితం

కుటుంబంలో వసంతం


అమ్మ ఉన్న నిండుదనం

గృహంలోన చక్కదనం

ఆమె ప్రేమ చిక్కదనం

మంచు రీతి చల్లదనం


అమ్మలోని గొప్పతనం

చాటాలోయ్!అనుదినం

ఆమె ఇంట మూలధనం

సృష్టిలోన ఘనం ఘనం


-గద్వాల సోమన్న


Comments


bottom of page