top of page

బహుమతి


'Bahumathi' - New Telugu Story Written By Pudipeddi Venkata Sudha Ramana

'బహుమతి' తెలుగు కథ

రచన, కథా పఠనం: పూడిపెద్ది వెంకట సుధారమణ

ఉదయం అలారం కొట్టగానే లేచాడు సందీప్. గడియారంలో ఏడు గంటలు చూపిస్తోంది టైము.

బద్ధకంగానే లేచి, ఒళ్ళు విరుచుకుంటూ, ‘అబ్బ, అప్పుడే ఏడయిపోయింది బాబోయ్, లంచ్ కి వెళ్ళాలి కదా’ అనుకుంటూ లేచి స్నానాల గదిలోకి పరిగెత్తాడు.


గబ గబా స్నానాది కార్యక్రమాలు ముగించుకొని, ట్రిమ్ముగా తయారై బయలుదేరాడు స్నేహితుని పెళ్ళి రిసెప్షనుకి.


"హెల్లో, అప్పుడే అందరూ వచ్చేసారే, అయితే నేనే ఆలస్యంగా వచ్చ్చానా, క్షమించాలి" అంటూ రిసెప్షన్ హాల్లోకి ప్రవేశించాడు సందీప్.


"ఏరా, నువ్వు ఇంత లేటుగా రావడం బావులేదురా” అన్నారు స్నేహితులు.


"నన్ను క్షమించమని అన్నాక కూడా మీరిలా అనడం బావులేదురా, అయినా లంచ్ కి ఇంకా చాలా టైము ఉందిలేరా” అన్నడు సందీప్ నవ్వుతూ.


"ఓహో! మరెలా అనాలిరా, ఆలస్యంగా వచ్చినందుకు హారతులు పట్టాలా" అన్నాడు జీవన్.

"అంతొద్దుగాని, రోజూ తొమ్మిందిటికి లేచి, ఆదరా బాదరా డిపార్టుమెంటుకి పరిగెత్తే నేను ఇవాళ ఏడింటికే లేచి తయారు అయ్యేనురా, అందుకు మీరందరూ నన్ను అభినందించాలి " అన్నాడు సందీప్.


"అబ్బో, చాల్లే సంబడం, పద పద.. వేదిక మీదకి, మనవాడ్ని ఆశీర్వదించాలి కదా, పెళ్ళికొడుకు గారు ఇప్పటికే ఓ వంద సార్లు అడిగేడురా నీకోసం" అన్నాడు సత్యం.


"ఒరేయ్, మాటలు చాలించి పదండిరా, ఆలస్యమైందే చాలక ఇంకా ఈ మీటింగులు, చాటింగులు ఏమిటి, పదండి పదండి" అంటూ తొందర పెట్టేడు కేశవ్.


అందరూ వేదిక యెక్కేసారు, “కంగ్రాట్యులేషన్స్ రా! రాజేష్, మా అందరికంటే ముందుగా డేరింగ్ స్టెప్ వేసినందుకు” అంటూ ఒక్కొక్కరు వాళ్ళు తెచ్చిన గిఫ్టులు అందించారు.


"ఒరేయ్ పెళ్ళికొడుకు గారు, ఈ గిఫ్ట్ నీకోసం ప్రత్యేకంగా. చూడగానే నీ పెదవులపై చిరునవ్వు. నీ ముఖంలో ఆనందం గారంటీరా“ అన్నాడు సందీప్.


"థాంక్స్ రా, అయినా నువ్వేంట్రా ఇంత ఆలస్యంగా వచ్చేవు".


"ఒరేయ్, లేటుగా వచ్చినా, లేటెస్టు గిఫ్టుతో వచ్చా" అన్నాడు సందీప్.


“ఒరేయ్, ఇందాకటి నుండి ఊరిస్తున్నావు ఆ గిఫ్టు చూపించి, ఏముంది అందులో అంత గొప్పగా " అన్నాడు కేశవ్.


"అది కేవలం మన రాజేష్ కోసమే కొన్నాను. ఎందుకంటే మన బ్యాచ్ లో ముందుగా పెళ్లి చేసుకున్నది వాడే కదా, అందుకని గిఫ్టు” అన్నాడు సందీప్.


"కొంటే కొన్నావుగాని, అందులో ఏముందో చెప్పరా బాబు, సస్పెన్స్ తో చంపక" అన్నాడు గౌతమ్.


"రాజేష్ చూసాక చెప్తాడులేరా, అంత తొందరెందుకు". అన్నాడు సందీప్.


"తొందరెందుకూ అంటావేన్టిరా, ఒరేయ్, అక్కడ రాజేష్ గాడి ముఖం చూడరా బాబూ, అందులో ఏముందో తెలియక, అదే ఆలోచిస్తూ, వచ్చిన వాళ్ళని సరిగ్గా పలకరించడం కూడా మరచిపోయి పిచ్చి చూపులు చూస్తున్నాడు" అన్నాడు గౌతం.


"అందులో ఏముందో చెప్పను గాని, అది ఎవరికైనా నచ్చుతుందిరా, ఎవరికైనా చూడగానే పెదాలపై చిరు నవ్వు, ముఖం లో ఆనందం గారంటీ. ఇప్పుడు నువ్వే చెప్పుకో అదేంటో " అన్నాడు సందీప్.


"ఏంట్రా అంత అందమైనదా అది" అన్నాడు గౌతం.


"చూసే కళ్ళను బట్టి, మనసును బట్టి ఉంటుంది ఏదైనా, కానీ ఇది నిజంగా అందమైనదే, నూటికి నూరు శాతం, కావాలంటే నువ్వు కూడా చూడొచ్చు, ‘ రాజేష్ చూసాక’ " అన్నాడు సందీప్.


సందీప్ చెప్పింది విన్నాక అందరూ ఆలోచనలో పడ్డారు, అందరి ఆలోచన ఒక్కటే, ఏమై ఉంటుంది అని. ఎవ్వరి ఊహకి అందటం లేదు. చేసేదేం లేక, రాజేష్ ఆ గిఫ్టు ఎప్పుడు ఓపెన్ చేస్తాడా అని చూస్తున్నారు.


రాజేష్ ఇంక ఉండబట్టలేక మెల్లిగా ఆ గిఫ్త్ పేకట్టు అందుకొని, ఓపెన్ చెయ్యబోతుంటే, పెళ్ళికూతురు రమ్య కళ్ళతోనే వారించింది వద్దని. ఇంతలో ఇది గమనించిన రాజేష్ తండ్రి రావుగారు ఆ గిఫ్టు తీసుకొని దూరంగా పెట్టేసారు. ఇక చేసేదేమిలేక ఊరుకున్నాడు రాజేష్. అంతవరకు ఆ గిఫ్టు వైపే ఆత్రంగా చూస్తున్నవారంతా ఉసూరుమని కూర్చుండిపోయారు.

రిసెప్షన్ అయిపొయింది, అందరి భోజనాలు కూడా అయిపోయాయి, కానీ ఒక్కరు కూడా వెళ్లిపోవటానికి తొందర పడటం లేదు. అందరి దృష్టి ఆ గిఫ్టు మీదే వుంది.


ఎవరికీ వారే మనసులో అనుకుంటున్నారు గాని, ఎవరు బయటపడటం లేదు. రాజేష్ కూడా అది గమనించాడు, నిజానికి తన పరిస్థితి అలాగే వుంది. రాజేష్ భార్య రమ్యకి అస్సలు యేమీ అర్థం కాలేదు, ఎందుకంటే ఆ గిఫ్టు గురించి సందీప్ ఏఁ చెప్పాడో వినలేదు. అందరి వైపు ప్రస్నార్ధకంగా చూసింది.


అందరినీ ఓరకంట చూస్తూ, ముసిముసి నవ్వ్వులు చిందిస్తున్నాడు సందీప్.

అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్న తరుణం వచ్చింది. వీళ్లందరి అవస్థ చూడలేక, రాజేష్ నాన్నగారు ఆ గిఫ్టు తెచ్చి, నానా, రాజేష్.. సందీప్ తెచ్చిన ఈ గిఫ్ట్ ఓపెన్ చేసి చూడు బాబూ" అన్నారు.


"అలాగే నాన్నగారు" అంటూ, ఆ గిఫ్ట్ ప్యాక్ అందుకున్నాడు రాజేష్. అందరూ అటే చూస్తున్నారు.

గిఫ్ట్ పేపర్ని గభాలున చించేసి జాగ్రత్తగా ఆ గిఫ్టు ని పైకి తీసి చూసాడు. అందరూ రాజేష్ ముఖం వంక చూస్తున్నారు.


రాజేష్ పెదవులపై చిరునవ్వు, ముఖంలో ఆనందం స్పష్టంగా కనబడింది అందరికీ. సందీప్ చెప్పినట్టే జరిగింది. అందరి ముఖల్లో ఆశ్చర్యం, ఆనందం కలగలిపి వచ్చేసాయి. ఇప్పుడు అందరికీ అదేంటో చూడాలనే ఆతృత ఎక్కవయిపోయింది. నేనంటే నేను అని రాజేష్ చుట్టూ మూగేసారు. కానీ రాజేష్ మున్ముందుగా తన తండ్రికిచ్ఛేడు చూడమని. ఆతని పెదవులపై చిరునవ్వు, ముఖంలో ఆనందం చూసారు అందరూ.


ఇప్పుడు అందరిలో ఆత్రం ఇంకా ఎక్కువైపోయింది, అదేమిటో చూడాలని, ఒక్కొక్కరు తీసుకొని చూస్తున్నారు, అందరిదీ అదే ఫీలింగ్. ఇదంతా చూస్తున్న కొత్త పెళ్లి కూతురు రమ్యకి కూడా అదేమిటో చూడాలనిపించింది, కానీ అడగలేక, ఆ గిఫ్టు ఏమై ఉంటుందని ఆలోచిస్తూ అటూ ఇటూ అసహనంగా తిరుగుతోన్ది.


ఆమె పరిస్థితిని గమనించిన సందీప్ ఆ గిఫ్టుని తెచ్చి రమ్య చేతిలో పెట్టాడు. అది చూసిన రమ్య ఆనందం పట్టలేక పోయింది. ‘చక్కటి టేకు వుడ్డు ఫ్రేములో పొందికగా బిగించబడిన ‘అద్దం’ లో తనని తాను చూసుకొని మురిసిపోయింది. అది గిఫ్ట్ అన్న విషయం కూడా మరచిపోయి ముంగురులు సరిచేసుకుంటూ, మేకప్ దిద్దుకుంటూ తనని తాను మైమరచిపోయింది. అందరూ రమ్యా.. అంటూ గట్టిగా పిలిచాక ఈ లోకం లోకి వచ్చి చుట్టూ చూసి సిగ్గు పడిపోయింది.


“ఇలా అద్దం గిఫ్టుగా ఇవ్వడం యెప్పుడూ యెక్కడా చూడలేదు సందీప్ గారు, ఇదే మొదటిసారి, అంతే కాదు అసలు ఊహించలేదు కూడా, థాంక్స్ అండీ” అంది రమ్య సిగ్గుపడుతూ.


“ఇలా యెవ్వరూ ఊహించలేని పనులు చేయడం మా వాడికే చెల్లుతుంది లెండి. ఇలా వెరైటీ పనులు చేయడములో వీడి తర్వాతే యెవరైనా, అయినా ఒరేయ్ సందీప్.. నీకిలాంటి ఆలోచనలు ఎలా వస్తాయిరా “ అన్నాడు కేశవ్.


ఏమో అన్నట్లుగా భుజాలు ఎగరేస్తున్న సందీప్ చుట్టూ చేరి స్నేహితులంతా ఆనందంగా “సందీప్ ది గ్రేట్ ” అంటూ కరతాళధ్వనులు చేసారు. ఆ హాలంతా చప్పట్లతో మారుమ్రోగిపోయింది.


సమాప్తం.

*****

పూడిపెద్ది వెంకట సుధారమణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఇక్కడ క్లిక్ చేయండి.

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

https://www.manatelugukathalu.com/profile/sudha

నా పేరు వెంకట సుధా రమణ పూడిపెద్ది. నేను రాంభట్ల వారింట పుట్టి, పూడిపెద్ది వారింట మెట్టాను. నేను ఎప్పటినుంచో కథలు, కథానికలు రాస్తున్నా, ఈ మధ్యనే వాటిని పత్రికలకి పంపడం ప్రారంభించాను. నేను ఇంకా ఓనమాలు దిద్దుతున్నాను రచనావిభాగంలో.


నా అక్షర ప్రయాణానికి అడుగులు పడిన మా ఇంటి నేపధ్యం.. Dr . రాంభట్ల నృసింహ శర్మ (ప్రముఖ కవి ) నాకు స్వయంగా అన్నయ్య మరియు Dr . రాంభట్ల వెంకట రాయ శర్మ ( పద్యకవి. రచయిత ) నాకు స్వయానా మేనల్లుడు, అలాగే, మెట్టినింటి నేపధ్యం ఏంటంటే, శ్రీశ్రీ గారు,పూడిపెద్ది లక్ష్మణ మూర్తి గారు (పూలమూర్తి గారు ) (శ్రీశ్రీగారికి స్వయానా తమ్ముడు), ఆరుద్రగారు, మొదలగు ప్రముఖులు నాకు తాతగార్లు. ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఉగాది వసంత పూడిపెద్ది నాకు స్వయానా పిన్ని.


ఓనామాలతో ప్రారంభమైన నా ఈ అక్షర ప్రయాణం, సుదూరయానంగా మారాలని ఆశిస్తున్నాను.


జన్నస్థలం: కుప్పిలి, శ్రీకాకుళం జిల్లా

జననీ జనకులు: వెంకట రత్నం, బాలకృష్ణ శర్మ.

విద్యార్హతలు : ఎం. ఏ తెలుగు, ఎం. ఏ పాలిటిక్స్, బి. ఈ డీ

వృత్తి : ఉపాధ్యాయిని గా 15 సంవత్సరాలు.

ప్రస్తుతం: గృహ నిర్వహణ

భర్త : వెంకటరామ్, రిటైర్డ్ ఆఫీసర్, హెచ్. పి.సి ఎల్

సంతానం : అబ్బాయి డాక్టర్, ( స్వంత హాస్పిటల్ )

అమ్మాయి సాఫ్టవేర్ ఇంజనీర్, U. S. A

అభిరుచులు : సాహిత్యం పై మక్కువ, పుస్తక పఠనం, కథలు వ్రాయటం.

అభిలాష : నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలని,

వీలైనప్పుడు దైవ దర్శనం, బంధు దర్శనం చేసుకోవడం.

చిరునామా : విశాఖపట్నం
165 views20 comments
bottom of page