top of page

చేదు నిజం!


'Chedu Nijam' - New Telugu Story Written By D V D Prasad

'చేదు నిజం' తెలుగు కథ

రచన: డి వి డి ప్రసాద్

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

కమలమ్మ మది అల్లకల్లోలంగా ఉంది. ఆలోచనలతో నిద్రపట్టక మంచం మీద దొర్లుతోంది. పదిరోజుల్లో తమ పరిస్థితి అంతా తారుమారైంది. కొడుకు, కోడలు, మనవడితో సుఖంగా కాలం గడుపుతున్న తమకు ఎంతటి విషమ పరీక్ష ఎదురైంది! పదిరోజుల క్రితం వరకూ తమపై అవాజ్యమైన ప్రేమ కనబరచిన ప్రతాప్కి ఉన్నట్లుండి ఏమైంది? కోడలు ప్రమీల కూడా బాగా ఆదరించేది, అభిమానించేది.


ఇంటి చుట్టుపక్కలవాళ్ళందరూ వాళ్ళిద్దరూ అత్తాకోడళ్ళంటే అసలు నమ్మగలిగేవారు కాదు, అలా ఉండేది ఇద్దరిమధ్య అనుబంధం. మూడేళ్ళ మనవడు చింటూ తనని వదిలి ఒక్క క్షణం ఉండలేడే? అలాంటిది అకస్మాత్తుగా వాళ్ళలో ఇంతటి మార్పు ఎలా సంభవించింది? పదిరోజుల క్రితం ఉన్నట్లుండి తమ మకాం ఔట్హౌస్కి మార్చారు. భోజనం కూడా అక్కడికే వచ్చేది. మాట్లాడటం, పలకరించడం అటుంచి అసలు కనపడటమే మానేసారు కోడుకుకోడలు ఇద్దరూనూ.


చింటూని కూడా దూరం పెట్టారు. రోజూ ఆప్యాయంగా తనకి, తన భర్తకీ అన్నీ అమర్చిపెట్టే కోడలు ప్రమీలలో ఇంత మార్పు వచ్చిందంటే నమ్మలేకపోతోందామె. నాలుగు రోజుల క్రితమైతే ప్రతాప్ స్నేహితుడు ప్రసాద్ వచ్చి ఇద్దర్నీ ఈ వృద్ధాశ్రమంలో చేర్చాడు. ఇక్కడకు వస్తున్నప్పుడు కూడా వాళ్ళిద్దరూ కనపడలేదు. మనవడ్ని చూడకుండా తనెలా బ్రతకగలదు?


తన ప్రాణంలో ప్రాణమైన ప్రతాప్ ఇంత కర్కశమైన నిర్ణయం ఎలా తీసుకోగలిగాడు? ప్రమీల ఆ నిర్ణయానికి ఎలా మద్దతు పలికింది? ఇక ఎప్పటికీ తమ బ్రతుకింతేనా! ఇక్కడికొచ్చి నాలుగురోజులైనా ఇంతవరకూ ప్రతాప్ చూడటానికి కూడా రాలేదు. ఆలోచిస్తున్నకొద్దీ ఆమె మెదడు మొద్దుబారిపోతోంది. గుండెలు బరువెక్కుతున్నాయి.


పక్కనే పడుకున్న రామచంద్రయ్య కంటిమీద కూడా కునుకు రావడంలేదు. భార్య కమలమ్మ అసహనంగా పక్కమీద దొర్లడం చూసి, అనునయంగా ఆమెతలపై చేయి వేసి నిమిరాడు. ఆమె ఎంతదాచుకున్నా ఆమె ముఖంలో దుఃఖ వీచికలు, కళ్ళల్లో ఉప్పొంగే కన్నీళ్ళు గమనించాడాయన. భార్య కళ్ళల్లో నీళ్ళు చూసి చలించిపోయాడు. ఆమెని అలాంటి స్థితిలో చూసిన రామచంద్రయ్యకి కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.


"చింటూని చూడాలని ఉందా?" ఆమె వైపు జాలిగా చూస్తూ అడిగాడు.


అవునన్నట్లు తల ఊపిందామె తన కళ్ళఉబికి వస్తున్న నీళ్ళు భర్తకి కళ్ళబడకుండా జాగ్రత్తపడటానికి ప్రయత్నిస్తూ. అయితే ఎంత ప్రయత్నించినా ఆమె దుఃఖం ఆగలేదు. అంతవరకూ అస్థిమితంగా ఉన్న ఆమెలో దుఃఖం కట్టలు తెంచుకుంది. చేతులో ముఖం దాచుకొని రోదించసాగింది.


"మనం ఏం పాపం చేసామండీ, భగవంతుడు మనకీ శిక్ష విధించాడు? అసలు వాళ్ళని చూడకుండా మనము బ్రతికి ఉండగలమా? చింటూని చూడకుండా అసలు బ్రతకగలమా? మననెంతో ప్రేమగా చూసుకునే అబ్బాయి, కోడలు ఇలా చేసారంటే నమ్మలేకుండా ఉన్నాను." అందామె గద్గద స్వరంతో.


"నీకే కాదు నాకూ వాణ్ణి చూడాలని ఉంది. నాకూ అదే ఆశ్చర్యంగా ఉంది కమలా! ప్రతాప్ ఇలాంటి పని చేస్తాడని నేను కలలో కూడా ఊహించనైనా లేదు. కాలం ఎలాంటి వాళ్ళలోనైనా మార్పు తీసుకువస్తుంది. ఊరుకో! మనసు రాయి చేసుకో! జీవితాంతం నీకు నేను, నాకు నువ్వు తోడు అనుకో! మన రాత ఇలాగే ఉందని అనుకో! ఎక్కువ ఆలోచించుకొని ఉన్న రక్తపుపోటు పెంచుకొని ఆరోగ్యం పాడుచేసుకోకు." ఊరడించాడామెని.


అవును మరి! అంతకుమించి ఆయనేమి చేయగలడు? ఆమైతే కళ్ళనీళ్ళు పెట్టుకుంది కాని, గుండెలు బద్దలైనా తను మొగవాడాయే! లోలోపలే కుములిపోవాలి తప్పించి కన్నీళ్ళు పెట్టుకునే అధికారం కూడా లేదు. తనే బేలతనం ప్రవర్తిస్తే, ఆమె గతేం కాను? ఆమెని అనునయించే వాళ్ళు ఎవరు? ఇలా ఆలోచిస్తున్న వాళ్ళకు ఏ తెల్లవారుఝామునో మూగన్నుగా నిద్ర పట్టింది.


కమలమ్మ, రామచంద్రయ్య దంపతులకు ప్రతాప్ ఒక్కడే కొడుకు. రామచంద్రయ్య ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసాడు. ప్రతాప్ ఉద్యోగంలో చేరిన తర్వాత తన అఫీస్లోనే ఉద్యోగం చేస్తున్న ప్రమీలని ప్రేమించాడు. ఆమె తండ్రి చిన్నప్పుడే పోయాడు. తల్లే తన రెక్కల కష్టంతో ఆమెని పెంచి పెద్ద చేసింది. కూతురు చదువు పూర్తిచేసి ఉద్యోగంలో చేరిన కొద్ది రోజుల్లోనే ఆమెకూడా ప్రమీలని ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయింది.


కమలమ్మ, రామచంద్రయ్య దంపతులకి ప్రమీల బాగా నచ్చింది. త్వరలోనే వాళ్ళు కోరుకున్నట్లే వివాహం జరిపించారు. కోడలు తనని సొంతతల్లిలాగే చూసుకోవడంతో చాలా మురిసిపోయింది కమలమ్మ. మనవడు పుట్టాక ఊళ్ళో ఉన్న ఇల్లు అమ్మేసి కొడుకు వద్దకు వచ్చారు దంపతులిద్దరూ. రోజులు ఇలా హాయిగా, సుఖంగా గడిచిపోతున్నాయని అనుకొనేలోగానే ఇదిగో ఈ అపశ్రుతి వాళ్ళ జీవితంలో ప్రవేశించింది. కని, పెంచి పెద్ద చేసిన కొడకు తమని వృద్ధ్రాశ్రమం పాలు చేస్తాడని ఊహించలేకపోయారు పాపం ఆ దంపతులు.


ఆ చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నరు ఆ దంపతులు. అలా ఓ నెలరోజులు భారంగా గడిచిన తర్వాత, ఓ రోజు ప్రతాప్ స్నేహితుడు ప్రసాద్ హఠాత్తుగా వచ్చి, "అంకుల్, అంటీ!...మీరు బయలుదేరండి. ఇంటికి వెళ్దాం." అన్నాడు హడావుడిగా.


"ఏం నాయనా, ఇన్నాళ్ళు ఇక్కడున్నా ఒక్కసారికూడా చూడడానికి రాని ప్రతాప్ ఇప్పుడు హఠాత్తుగా ఇంటికి తిరిగి వచ్చేయమంటున్నాడా? అకస్మాత్తుగా అంత ప్రేమ ఎలా పుట్టుకు వచ్చింది?" అడిగాడు రామచంద్రయ్య వ్యంగ్యంగా.


అతనివైపు చూడలేక మొహం తిప్పేసుకున్నాడు ప్రసాద్, "అంకుల్!...ఇప్పుడు నేను మీకేమీ చెప్పలేను. అక్కడికి వెళ్ళాక మీకు పరిస్థితి అంతా అర్ధం అవుతుంది." అన్నాడు.


"మమ్మల్ని చూడటానికి ముఖం చెల్లక నిన్ను పంపించాడా? అవును...పాపం చింటూ మా గురించి బెంగ పెట్టుకొని ఉంటాడు, అందుకే వాడి కోసమే మమ్మల్ని పిలిపించినట్లు ఉన్నాడు. తన అవసరం తీరాక మమ్మల్ని మళ్ళీ ఇక్కడికి దిగబెట్టేస్తాడు కాబోలు." అన్నాడు రామచంద్రయ్య గద్గద స్వరంతో.


చింటూ ప్రస్తావన రాగానే కమలమ్మ ముఖంలో ఆందోళన కనిపించింది. "ఆఁ...ఏమైంది చింటూకి? బాగానే ఉన్నాడు కదా!..." కంగారుగా అడిగిందామె.


"చింటూ బాగానే ఉన్నాడు. కానీ..." ఏదో అనబోతూ, "పదండి! అక్కడికి వెళ్తే అంతా మీకు తెలుస్తుంది." అని తనే అక్కడ ఉన్న బట్టలు అవీ సర్ది బయటకి దారి తీసాడు.


అతని వెనుకే కంగారుగా కమలమ్మ, నిదానంగా రామచంద్రయ్య నడిచారు. కొడుకు మీద చాలా కోపం వచ్చింది రామచంద్రయ్యకి. తమకి అక్కరలేదన్నప్పుడు వృద్ధాశ్రమంలో దిగవిడిచి అవసరం అనుకున్నప్పుడు రమ్మని కబురు పెడతాడా? ఇదేమైనా ఆటా? వెళ్ళగానే కొడుకు, కోడలు ఇద్దర్నీ నిలదీయాలి. ప్రతాప్ని నిలదీయాలన్న కోపంతో కారు దిగి ఇంటివైపు వడివడిగా అడుగులు వేయసాగాడు రామచంద్రయ్య.


కానీ...ఇంటికి వేళ్ళాడుతున్న తాళం కప్ప కనిపించి ప్రశ్నార్థకంగా చూసాడు ప్రసాద్వైపు. సరిగ్గా అప్పుడే చింటూతో అక్కడికి వచ్చింది ప్రసాద్ భార్య శారద. తాతని, నానమ్మని చూడగానే వాళ్ళని చుట్టుకుపోయాడు చింటూ. మనవణ్ణి చూసి కొన్ని యుగాలైనట్లు అనిపించిదామెకి. కన్నీళ్ళు జలజలరాలగా చింటూని ఎత్తుకుంది కమలమ్మ. ప్రతాప్, కోడలు వస్తారని వాళ్ళు ఎదురు చూడటం గమనించి ప్రసాద్ నేల చూపులు చూసాడు.


"ఏడీ నీ స్నేహితుడు ప్రతాప్?...నాకు భయపడి దాగున్నాడా లేక దాగుడు మూతలు ఆడుతున్నాడా?" అడిగాడు రామచంద్రయ్య ప్రతాప్ని.


కొద్ది సేపు మౌనం తర్వాత, "మీతో దాగుడుమూతలు ఆడటానికి ప్రతాప్ ఏమీ చిన్నపిల్లడు కాడు. ఆ విధే అతనితో దాగుడు మూతలు ఆడింది. మీకు ఎలా చెప్పాలో నాకు నోరు పెగలడం లేదు." దుఃఖంతో గొంతు పూడుకు పోయింది ప్రసాద్కి.


అప్పుడు గమనించాడు రామచంద్రయ్య ప్రసాద్ కళ్ళల్లోంచి జాలువారుతున్న కన్నీటిని. "మా వాడూ, కోడలూ ఏరీ? కనిపించరేమీ!" అడిగాడు రామచంద్రయ్య ఆందోళనగా.


ఇక తనని తాను సంభాళించుకోవడం ప్రసాద్ వల్ల కాలేదు. చేతుల్లో ముఖం దాచుకొని, "ప్రతాప్, ప్రమీల మనకిక లేరు అంకుల్!" రోదిస్తూ అన్నాడు.

ఒక్కసారి పిడుగు పడినట్లు చలించిపోయారు ఆ వృద్ధ దంపతులిద్దరూ. అక్కడే వరండాలో కూలబడిపోయారు. "ఏమైంది వాళ్ళకి?" అతి కష్టంమీద నోరు పెగల్చుకొని అన్నాడు రామచంద్రయ్య.


"అంతా మన దురదృష్టం అంకుల్. ప్రతాప్కి, ప్రమీలకి, చింటూకి కూడా కరోనా సోకింది. అందుకే మీ క్షేమం కోసమే వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టారు, పెద్దవాళ్ళైన మీకు కూడా సోకుతుందేమోనని భయపడ్డాడు. అందుకే చింటూని కూడా మీ వద్దకు రానివ్వలేదు. అన్ని కట్టుబాట్లతో ఉన్న ఆ వృద్ధాశ్రమమే మీకు సరైన రక్షణ కల్పిస్తుందని భావించాడు.


వాళ్ళకి మీరిద్దరంటే ఎంత ప్రేమో మీకు తెలియదా అంకుల్! కరోనా నుంచి కోలుకున్న తర్వాత మిమ్మల్ని స్వయంగా తీసుకువద్దామని అనుకునేలోగానే ఈ ఘోరం జరిగిపోయింది. కరోనా నుండి కోలుకోలేక పోయారు. ఇద్దరూ మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. చింటూ మాత్రం కరోనా బారినుండి తప్పించుకున్నాడు. ఇంత కఠోరమైన నిజం చెప్పడానికి నాకూ చాలా బాధగానే ఉంది అంకుల్. కానీ ఈ చేదు నిజం ఎప్పటికైనా చెప్పక తప్పదు." కంఠం రుద్ధమవగా విలపిస్తూ నమ్మలేని నిజాన్నిబయటపెట్టాడు ప్రసాద్.


మిన్ను విరిగి మీద పడినట్లైంది కమలమ్మ, రామచంద్రయ్య దంపతులకి. వాస్తవం గ్రహించడానికి చాలా సేపు పట్టింది ఇద్దరికీ. దుఃఖంతో మాటలు పెగలలేదు. కొద్దిక్షణాల్లో తేరుకొని చింటూని ఎత్తుకుని గుండెలకి హత్తుకుంది కమలమ్మ కన్నీళ్ళు తుడుచుకొని.


వణుకుతున్న చెయ్య చింటూ తలమీద వేసి నిమరసాగాడు రామచంద్రయ్య. పాపం ఇక ఆ వృద్ధ దంపతులకి చింటూ ఒక్కడే మిగిలాడు వాళ్ళ బాధ్యతని గుర్తు చేస్తూ.

-----------------


దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.

67 views0 comments

Comentarios


bottom of page