top of page

చేజారని స్వర్గం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.

Video link

'Chejarani Swargam' written by Parimala Kalyan

రచన : పరిమళ కళ్యాణ్


జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న వ్యక్తి అతను.

ఇక జీవితాన్నే చాలించాలనుకున్నాడు. సరిగ్గా ఆ సమయానికి స్నేహితుడు అతని దగ్గరకు వచ్చాడు. అతని కష్టాలు వివరించాడు. తరువాత ఏమైందనేది యువ రచయిత్రి పరిమళ కళ్యాణ్ గారు రచించిన ఈ కథలో తెలుస్తుంది.


"ఛీ వెధవ జీవితం, డబ్బున్నంత వరకూ రారాజులా బతికాను, చేతినిండా పనివాళ్ళు,

ఇంటినిండా నౌకర్లు, అందరికీ నా మాట వేదం. కానీ ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు,

అందుకే నా మాట వినేవాడు కూడా లేడు. లోకం పోకడ మారిపోయింది. నీతిగా నిజాయితీగా

ఉండేవాడు ఒక్కడూ లేడు. ఛీ!" అని మరోసారి నా అసహనాన్ని వ్యక్తం చేసాను. లోకాన్ని,

సమాజాన్ని నిందించాను కానీ నా తప్పిదాన్ని ఒప్పుకోవటానికి మాత్రం నాకు అహం అడ్డు

వచ్చింది.

ఇక బ్రతకడం అనవసరం అనుకుని నిద్ర మాత్రలు సిద్ధంగా పెట్టుకున్నాను. అది కాకపోతే

మరొకటి అనుకుని ఒక పెద్ద తాడు కూడా దగ్గర పెట్టుకున్నాను. ఏ క్షణంలోనైనా చనిపోదాం

అని బాగా అనిపిస్తే ఫ్యాన్ కి తాడు కట్టి, నా మెడకు బిగించుకోవాలని

నిశ్చయించేసుకున్నాను.

అవును నేనిక జీవించటం అనవసరం. పెళ్ళాం, బిడ్డలు దగ్గరలేని జీవితం వృధానే కదా!

దానికన్నా చావటం మేలు. కానీ నాకు ఆ కారణం కన్నా బలమైన కారణం మరొకటి ఉంది,

ఎవరి దగ్గరైనా చేయి చాచటం నాకు చాలా చిన్నతనంగా అనిపించింది. అందుకే ఫ్యాన్ కు

తాడు కట్టుకుందాం అని లేచాను.

కిటికీలు వేసాను, తలుపులు బిగించాను, తాడు పైకి వేసి ముడి వేస్తుండగా,,, ఎవరో దబదబ

తలుపులు కొడుతున్న శబ్దం. "ఛా, ప్రశాంతంగా చావనైనా చావనివ్వరూ! అయినా ఈ టైంలో

ఎవరో?" అనుకుంటూ తాడు పక్కన పడేసి, వెళ్లి తలుపు తీసాను.

గుమ్మంలో నా స్నేహితుడు రాజారావు. వాణ్ణి చూడగానే ఎందుకో కంగారుగా ఉన్నట్టు

అనిపించాడు. "లోపలకు రా రాజా, ఏంటి ఈ టైం లో ఇలా?" అంటూ అతణ్ణి లోపలకి

పిలిచాను.

పరుగు పరుగున వచ్చాడేమో ఆయాసపడుతున్నాడు. శీతాకాలం లో కూడా చెమటలు

కక్కుతున్నాడు. విషయం సీరియస్ అని అర్ధం చేసుకున్నాను. లోపల కుర్చీలో కూర్చోపెట్టి

మంచి నీళ్ళ గ్లాస్ అందించాను. గడగడా తాగేసాడు. నెమ్మదిగా అడిగాను "ఏమైందిరా?" అని.

అంతే ఘొల్లుమన్నాడు.

"ఏం చెప్పమంటావు రా, ఈ వయసులో ఇంతకన్నా కష్టం ఏముంటుంది రా?" అన్నాడు.

"అసలేం జరిగిందో చెప్పు?" అన్నాను కాస్త అసహనం కూడిన గొంతుతో.

చెప్పటం మొదలుపెట్టాడు "నీకు తెలుసు కదా, నా కొడుకు విహార్ ఈ మధ్యనే అమెరికాలో

ఉద్యోగం సంపాదించాడు..."

ఏదో చెప్పేంతలో..


"హ.. వాడు అమెరికాలో సెటిల్ అయితే నీ కష్టాలు తీరిపోతాయని, అప్పులన్ని తీర్చేయొచ్చు

అనుకున్నావు కదరా!" అన్నాను.

"అవును రా, అది వట్టి కలే, అది జరిగే పని కాదని తేలిపోయింది రా! విహార్ చదువుకోసం

అమెరికా వెళ్ళటం కోసం ఎడ్యుకేషనల్ లోన్ పెట్టాను కదా, ఇంటిని తాకట్టు పెట్టి. ఇప్పుడు

వాడు అమెరికా పోయి, నీ లోన్ తో నాకు సంబంధం లేదు, నువ్వే కట్టుకో, నాకు నీ ఆస్తి వద్దు,

నీ అప్పులు వద్దు అనేసాడు రా.

బాంక్ వాళ్ళు వచ్చి లోన్ కట్టమని, లేదంటే ఇల్లు ఖాళీ చెయ్యమని జప్తు చేస్తామని గట్టిగా

వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. 15లక్షల అప్పు, ఎక్కడినుంచి తీర్చాలి. 15ఏళ్ళు కష్టపడి పైసా పైసా

కూడబెట్టి, చెమటోడ్చి కట్టుకున్న ఇల్లు రా అది. అది అమ్మేస్తే నేనూ నా భార్యా రోడ్డున

పడతాం. నాకు పెన్షన్ కూడా రాదు. ఈ వయసులో నేను నా భార్యా ఎలారా బతికేది?" అంటూ

భోరున ఏడ్చాడు.

"అదేంట్రా రాజా, నీ కొడుకు అలా అనటమేమిటి? వాడికి తెలీదా ఈ విషయం, నువ్వెంత

కష్టపడి పెంచావు, ఎంత కష్టపడి సంపాదించావు అన్నది. వాడలా చేతులెత్తేస్తే ఎలా రా

మరి?" అన్నాను కాస్త ఆవేశంగా.

"అదేరా నా బాధ. ఎందుకలా అన్నాడో? నా పెంపకంలోనే ఏదో లోపం ఉందేమో రా! నా గతి

ఇంతే అనుకుంటాను. అది నీతో చెప్పుకుందామని ఇలా వచ్చాను." అన్నాడు.

"పోనీలేరా, ఆలోచిద్దాం ఇంకేదైనా మార్గం ఉందేమో?" అంటూ ఉండగానే, కళ్ళు పెద్దవి చేసి,


గది మధ్యలో పడేసిన తాడు వంక, నా వంక మార్చి మార్చి చూసాడు. స్నేహితుడు కదా

కనిపెట్టేసాడు అనుకున్నాను.


"ఏంట్రా విస్సు ఇదంతా, నువ్వేనా ఇలా? ఏమైందిరా?" అన్నాడు బాధగా.

"అది ఏమని చెప్పమంటావు రా, అంతా నా చేతులారా నేనే చేసుకున్నా! ఆస్తి, ఇల్లు, పొలం

అన్నీ తాకట్టు పెట్టి, వద్దన్నా వినకుండా వ్యాపారంలో దిగాను. జమున చెవుతూనే ఉంది

మనకి ఈ వ్యాపారాలు వద్దండి అని, వింటే కదా, ఒకసారి కాదు రెండుసార్లు కాదు, ఎన్ని

నష్టాలు వచ్చినా, నిలబడ్డాను. ఆస్తంతా పోయినా, భార్య నా కొడుకుని తీసుకుని

వెళ్ళిపోయినా బాధ పడ్డాను కానీ ఇంత దిగజారిపోలేదు. కానీ ఇది నమ్మకద్రోహం.

భరించరాని నేరం. నా వాళ్ళు అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేశారు. నా వ్యాపారంలో

వాళ్ళని నమ్మి భాగస్వాములని చేసాను, లాభాలన్నీ వాళ్ళు తీసుకుని నష్టాలకు మాత్రం

నన్నే బాధ్యుణ్ణి చేశారు. నన్ను నిట్ట నిలువునా అన్యాయం చేసారు.

కంపెనీలో నా వాటాని కూడా లాగేసుకున్నారు. నా అన్నవాడు ఎవడూ లేడు నాకు. అప్పులు

తప్ప ఇంకేం మిగలలేదు. ఇంకెందుకురా ఈ జన్మ, వృధా నే కదా!" చెప్పక తప్పలేదు నా

గురించి.

"ఏమిట్రా మనకీ కష్టాలు, అప్పుల బాధలు అందుకే అంటారు అందని దానికి అర్రులు

చాచటం మంచిది కాదని. అయినా మనం మాత్రం ఆకాశానికి నిచ్చెన వేస్తూనే ఉంటాం. అది

అందక జారి కిందపడి దెబ్బలు తగిలించుకుంటూ ఉంటాం. అయినా పడి లేస్తూ ఉంటాం.

ఇది మనుషులకు అలవాటు అయిపోయింది. ఈ అప్పుల తిప్పలు తీరేదెప్పుడో?"

అనుకుంటూ తల పట్టుకొని కూర్చున్నాడు రాజారావు.

మళ్ళీ ఏదో గుర్తొచ్చిన వాడిలా, "అయినా దానికోసం ప్రాణత్యాగం చెయ్యాల్సిన అవసరం

ఏముంది రా. తాడో పేడో తేల్చుకుంటే సరి కదా!" అన్నాడు నాతో.

"ఏమో రా, అది జరిగేపని లా లేదు. అవును ఒరేయ్ రాజా, నాకొక అనుమానం ఉంది రా! మీ

విహార్ పేరు మీదే కదా లోన్ తీసుకున్నది, అందులోనూ వాడు విదేశాల్లో ఉద్యోగం కూడా

సంపాదించాడు. అలాంటప్పుడు వాడు లోన్ కట్టడానికి ఎందుకురా ఒప్పుకోలేదు. అయినా

బాంక్ వాళ్ళు వాడినే పట్టుకుంటారు కానీ నీ ఇంటిని ఎందుకు జప్తు చేస్తారురా?" నా

సందేహాన్ని వెలిబుచ్చాను.

"అదీ అదీ.." అంటూ వాడు తడబడుతూ ఉండటం చూసి, "నిజం చెప్పరా ఏంటి సంగతి?"

అనడిగాను గట్టిగా, నా స్నేహితుడే కదా అన్న భావనతో.


"నీ గురించే రా, నువ్వు మెడికల్ షాపులో నిద్ర మాత్రలు తీసుకోవటం మా పని వాడు సత్తి

చూసాడట. నాకు వచ్చి చెప్పాడు. నువ్వు ఏ అఘాయిత్యం చేసుకుంటావో అని భయపడి

పరుగున ఇలా నీ దగ్గరకి వచ్చాను విషయం తెలియగానే.

నీ కోసమే వచ్చాను అంటే నువ్వెలా ఫీల్ అవుతావో అని, నా ఇబ్బందిని చెప్పుకుంటే కాస్త

కుదుటపడతావని అలా చెప్పాను. నిజానికి విహార్ లోన్ కట్టడం ఎప్పుడూ మానలేదు, అది

వాడికే ఇబ్బంది అవుతుంది కూడా."


"ఆర్ని, నా గురించి ఇంత అబద్ధం చెప్పావా? నీ కొడుకు మీద నిందలు వేశాం కదరా పాపం."

అన్నాన్నేను.


"పాపం ఏమీ లేదురా, వాడే ఈ సలహా ఇచ్చాడు. విస్సు మావయ్యని ఎలా ఓదార్చాలో నాకు

అర్ధం కావట్లేదురా అని నేను వాణ్ణి అడిగితే.. అరేయ్ విస్సూ, నీకు ఇంకో విషయం చెప్పాలి.

జమున కలిసింది మొన్న!" అంటూ నా అభిప్రాయం తెలుసుకోవటం అన్నట్టు ఆపాడు తన

మాటల్ని.

*********

జమున, ఆ పేరు వినగానే గతంలోకి అసంకల్పితంగా వెళ్ళిపోయాను. కాలేజి రోజుల్లో

ప్రేమించి, ఇష్టపడి, వెంటపడి మరీ తనని ఒప్పించి పెళ్ళి చేసుకున్నాను. కొన్నాళ్ళు మా

సంసారం బాగానే సాగింది. మా ప్రేమకి ప్రతిరూపంగా మాకొక బాబు పుట్టాడు. విమల్ అని

పేరు పెట్టుకున్నాం. వాడి ఆటపాటల్లోనే కొన్నాళ్ళు గడిచిపోయింది. అప్పటికి ఊర్లో ఉన్న

ఫ్యాక్టరీలోనే పని చేస్తున్నాను. ఫ్యాక్టరీలో యాజమాన్యానికి, వర్కర్ యూనియన్లకి ఏదో తగాదా

వచ్చి, ఫేక్టరీ మూసేవరకూ వెళ్ళింది ఆ గొడవ. చివరికి చాలా మంది ఉద్యోగాలు కూడా

పోగొట్టుకున్నారు.


నా ఉద్యోగానికి భరోసా ఉంది, అయినా కూడా ఇక అక్కడ నేను పని చెయ్యలేక మానేసాను.

అప్పుడే నా బుర్రలో వ్యాపారం చెయ్యాలనే ఆలోచన తట్టింది. జమున వద్దంది. నా

స్నేహితులు నలుగురిని అడిగాను రాజారావు, ప్రభాకర్ అనే ఇంకో స్నేహితుడు మాత్రం

వద్దన్నారు. మరో ఇద్దరు మాత్రం వ్యాపారం చెయ్యాలని ఆశగా, నాతో వ్యాపారం చెయ్యటానికి

సుముఖంగా ఉన్నట్టు అనిపించింది.


ఇక ఆలోచించకుండా ముగ్గురం కలిసి ఇంకో ఇద్దర్ని కలుపుకుని వ్యాపారం ఆరంభించాము.

కొన్నాళ్ళు బాగానే నడిచింది. కొన్ని నష్టాలు, ఆపై కొన్ని లాభాలను చవిచూసాము. వ్యాపారం

మత్తు బాగా తలకెక్కింది నాకు. అంతే ఆ ధ్యాసలో పడి ఇంటిని దూరం చేసుకున్నాను. నేను

తనతో, పిల్లవాడితో సమయం గడపటం లేదని, వ్యాపారంలో బాగా మునిగిపోయానని

బాధపడింది జమున. నన్ను ఆపలేక, తను వెళ్ళిపోయింది. పదిహేడేళ్ళు తను నన్ను విడిచి

వెళ్ళిపోయి. కొన్నాళ్ళు బాధపడినా వ్యాపారంలో పడి వాళ్ళ గురించీ మర్చిపోయాను నేను.

కానీ ఇప్పుడు ఇన్నేళ్ళకి మళ్ళీ తన గురించి తెలిసింది. ఆలోచిస్తూ ఉండిపోయాను.


"ఒరేయ్ విస్సూ, ఏంట్రా ఆలోచన తన గురించేనా?" అంటూ కదిపాడు రాజా.

మళ్ళీ తనే, "నీ కొడుకు విమల్ కూడా మా వాడితో పాటే అదే కంపెనీలో ఉద్యోగంలో

చేరాడట. నీ గురించి తెలిసీ చాలా బాధపడింది జమున. నిన్ను వదిలి వెళ్లి, తప్పు చేశానెమో

అని ఏడ్చింది. తనని ఓదార్చి, మా ఇంటికి తీసుకుని వచ్చాను.

ఇప్పుడు నీకు తన తోడు అవసరం. నువ్వు రమ్మంటే ఇంటికి వస్తుంది. నీ సమస్య గురించీ

కూడా ఆలోచిద్దాం. ఏమంటావు?" అసలు విషయం చెప్పాడు రాజా.

"ఏమిటి జమున మీ ఇంట్లో ఉందా?" ఆతృతగా అడిగాను.

"అవును రా, మాతోనే ఉంది." అన్నాడు.

వెంటనే మరో ఆలోచన లేకుండా తనని కలవాలని, తనతో మాట్లాడాలని అనిపించింది.

"ఒరేయ్ రాజా, నేను చేసిన తప్పు నాకు తెలిసొచ్చింది రా, ఇప్పుడే తనని కలిసి క్షమార్పణ

చెప్పాలి. తనని నా కొడుకుని అలా మధ్యలో వదిలేసినందుకు... నా కంపెనీ సంగతి తర్వాత

చూద్దాం. ముందు జమునని కలవాలి పదరా!" అంటూ తొందర పెట్టాను. ఇప్పటికైనా కళ్ళు

తెరుచుకున్నానన్న భావనతో...

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం :

నా పేరు పరిమళ. పరిమళ కళ్యాణ్ పేరుతో కథలు, కవితలు రాస్తూ ఉంటాను. ఇప్పటివరకూ ప్రతిలిపి, మొమ్స్ప్రెస్సో లాంటి సోషల్ ఆప్స్ లో, ఫేస్బుక్ గ్రూప్స్ లోనూ అనేక కథలు రాసాను. తపస్విమనోహరం అనే కొత్త వెబ్ మ్యాగజైన్ కి కూడా కథలు అందిస్తున్నాను. ఈ మధ్యనే పత్రికలకి కథలు పంపటం మొదలు పెట్టాను. నా కథల్లో ఒకటి స్నేహ వార పత్రికలోను, భూమిక మరియు మాలిక వెబ్ పత్రికల్లో ఒక్కొక్క కథ ప్రచురితం అయ్యాయి. కథలే కాకుండా కవితలు, పేరడీ పాటలు కూడా రాస్తూ ఉంటాను. హస్యానందం పత్రికలో పేరడీ పాటల పోటీలో నా పాట బహుమతి గెలుచుకుంది. అలాగే ఆడియో కథలు కూడా చేస్తూ ఉంటాను. అలాగే నాకు దొరికిన కథలు అన్నీ చదువుతూ ఉంటాను.


71 views0 comments

Comments


bottom of page