'Chinna Prapanchapu Chinthalu' - New Telugu Story Written By Pandranki Subramani
'చిన్న ప్రపంచపు చింతలు' తెలుగు కథ
రచన: పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఇంటి ముంగిట బైక్ నిలిపి, గుమ్మం దగ్గర బూట్సూ సాక్సూ విప్పి, హాలులోకి చూసాడు రాఘవ. వదిన, ఇద్దరు ముగ్గురు ఇరుగు పొరుగులతో నవ్వు ముఖంతో ఊసులాడుతూ, టీవీలో వస్తూన్న సీరియల్ విశేషాలు వివరిస్తూ, కాఫీ తాగుతూ కూర్చుంది. పనిగత్తె సుందరమ్మ, వాళ్ళు అడిగిందల్లా ఉరుకులు పరుగులతో అందచేస్తూ, హాలు మూలన నిల్చుంది; వాళ్ళ కబుర్లు వింటూ- తదుపరి ఆదేశాల కోసం యెదురు చూస్తూ--
అతడి కళ్ళు నిదానంగా వెతికాయి. వాసు ఉనికి అక్కడ లేదు. లోపలకు ప్రవేశిస్తూనే అడిగాడు- “వాసు కనిపించడేం వదినా?“ అని. ఆ మాటకు ఇటు తిరిగి చూసి బదులిచ్చింది వైదేహి- “ఏమోనయ్యా! నెట్ వద్ద వీధి కుర్రాళ్ళతో క్రికెట్ ప్రాక్టీసు చేస్తుంటాడేమో-- ”
“లేడు వదినా! నేనటు నుండి డ్రైవ్ చేస్తూనే వచ్చాను. మరింకెక్కడకి వెళ్ళుంటాడు? నీకు తెలియదా వదినా! ”
“మరీ చోద్యం గాని, వాడేమి చిన్నపిల్లాడా వెతికి పట్టుకు రావడానికి. ఎవడో క్లాస్ మేటు బర్త్ డేకి వెళ్ళుంటాడు“
“ఔను. వాసు అటువంటి సంబరానికే వెళ్లుంటాడు. మరైతే గిప్ట్ ప్యాకెట్ ఏదైనా తీసుకెళ్ళాడా వదినా?” ఆ ప్రశ్నకు బదులి వ్వకుండా వైదేహి అటు ముఖం తిప్పుకుని టీవీ సీరియల్ సంభాషణలో పడిపోయింది.
ఓపారి కనుబొమలెగరేసి చూసి తిన్నగా తన గది వేపు నడిచాడు. తీరా గదిలోకి ప్రవేశించి, అక్కడి దృశ్యం చూసి నివ్వెరపాటుకి లోనయాడు. వాసు తన గదిలో తన పకడకపైన, ముడుచు క్కూర్చున్నాడు.
“అదేంవిట్రా వాసూ! నీకోసం వీధి అంతా వెతికి వస్తున్నాను. నువ్వేమో యిక్కడిలా కొంగ జపం చేస్తూకూర్చున్నావు! కొత్త క్యాంపస్ బాక్స్ కావాలన్నావుగా- ఇదిగో! “ అంటూ అందించాడు రాఘవ.
ముభావంగా, బాబాయి ని కొత్తగా చూస్తున్నట్లు చూసి, క్యాంపస్ బ్యాక్సుని అందుకున్నాడు. రాఘవ కు ఎక్కడో ఏదో తగిలినట్లనిపించింది. ఎందుకంటే- కొత్త క్యాంపస్ బాక్సుని అందుకున్న ఆనందం యేకోశానా వాసు ముఖాన కనిపించలేదు. కళ్ళల్లో కాంతి అన్నదే లేదు.
“ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఒంట్లోగాని బాగా లేదా! ”
మౌనమే తానై తలగడ క్రిందనుంచి ప్రోగ్రెస్ కార్డు తీసి అందించాడు. సబ్జక్ట్ వైస్ మార్కుల వివరాలు చూసి రాఘవ పెదవి విరిచాడు. మార్కులు బాగా తగ్గాయి. ముఖ్యంగా వాడికి ఇష్టమైన మ్యాథ్స్ లో కూడా స్కోర్ చేయలేక పోయాడు.
“ఏమైందిరా వాసూ! ఈ మధ్య మరీ దిగజారిపోతున్నావు. గ్రేడేషన్ లో పోయావనుకుంటే స్పోర్ట్స్ లో కూడా వెనుక బడి పోతున్నావు. మొన్ననేమో నా జూనియర్ కొలీగ్ మిస్టర్ మురుగన్ చెప్పాడు— వాళ్ళ అబ్బాయిని స్కూలులో దిగబెట్టడానికి వచ్చినప్పుడు నిన్ను చూసాడట. అందరూ కేరింతలు కొడ్తూ ఊసులాడుకుంటుంటే నువ్వొక్కడివీ చెట్టు క్రింద మౌనమునిలా చప్తా పైన కూర్చున్నావట-- అదీను ఒంటరిగా-- బ్రిలియంట్ స్టూడెంటుకి ఉండాల్సిన లక్షణాలు కావు ఇవి- ప్రోబ్లమ్స్ ఏవైనా ఉంటే ఇంట్లోవాళ్ళకు చెప్పాలి కదా! “
అంతే- ఆ ఒక్కమాటతో ఫెళ్ళున విరిగి కరిగిన మేఘంలా ఏడుస్తూ లేచి బాబాయిని కౌగలించుకున్నాడు వాసు- “సారీ బాబాయ్! ” అంటూ--
రాఘవ వెంటనే స్పందించలేదు. వాసు తలను నిమురుతూ ఉండిపో యాడు. పిమ్మట వాణ్ణి పొదవి పట్టుకుని పడక పైకి తీసుకు వెళ్ళి కూర్చుండ బెట్టాడు. ”ఇప్పుడు చెప్పు ఆది నుంచి అంతం వరకూ— నీ సమస్య యేమిటి? నువ్వెదుర్కూంటూన్న డ్రాబ్యాక్స్ యేమిటి? అన్నీ చెప్పు-- “
“నన్ను ఈ స్కూలుకి పంపించకండి బాబాయ్! నన్ను అందరూ టార్చర్ చేస్తున్నట్లుంది”
“ఓకే-- ఆ విషయం నిదానంగా ఆలోచిద్దాం. ఐ ప్రోమిస్. ఇప్పుడు స్కూలులో జరిగిందంతా చెప్పు దాపరికం లేకుండా-- “
వాసు వెంటనే బదులివ్వలేదు. బాబాయి ముఖంలోకి కాసేపు తేరిపార చూసి చెప్పనారంభించాడు- “ఇద్దరు బల్లీయింగ్ కుర్రాళ్లు ఉన్నా రు. ఏది తీసుకు వెళ్ళినా లాక్కుంటున్నారు. చివరకు నేను రిసేస్ లో తినడానికి తీసుకెళ్ళిన దానిని కూడా లాక్కుని తినేస్తుంటారు. నా క్యాంపస్ బాక్సుని కూడా వాళ్ళే నాకు తెలియకుండా కొట్టేసుంటారు”
“అర్థమైంది. అటువంటి బుల్స్ ఒకరిద్దరు స్కూలు క్యాంపస్ లోనే కాదు- అన్ని చోట్లా యెదో ఒక రూపంలో ఎక్కడో ఒక చోట యెదురవుతూనే ఉంటారు. అలాగని నువ్వు తాకితే ముడుచుకుపోయే తాలిపాలి ఆకులా ఒదిగి పోతే కుదరదు కదా! అప్పుడు నువ్వేమి చేసావు?”
“ఒకసారి కాదు. మూడు సార్లు చెప్పాను క్లాసు టీచర్ తో-- చెప్పినప్పుడల్లా ఆ ఇద్దరు బుల్స్ వద్దా దెబ్బలు తిన్నాను. కాని టీచర్ గమనించలేదు. తరవాత మ్యాథ్య్ టీచరుకి కూడా చెప్పాను. ఏమీ జరగలేదు- మిస్ లు యేమంటారంటే నీ ఫ్రెండ్సేకదా— సర్దుకుపోకూడదా అని నచ్చచెప్తుంటారు”
“ఇంత వరకూ నీ యాక్షన్ బాగానే ఉంది. నీ వరకు చేయాల్సింది నువ్వు చేసి ముగించావు. ఆ తరవాత-- “
ఆ ప్రశ్నకు అర్థం కానట్టు చూసాడు వాసు.
“అంటే— నీగోడు గురించి అమ్మానాన్నలకు చెప్పావా అని?”
తలూపాడు వాసు.
“ఏమన్నారు వాళ్ళు?”
“నామాటవింటే కదా! అసలు నన్ను చెప్పనిస్తేనే కదా! ”
అలాగా- అన్నట్టు తలూపుతూ ఊరకుండిపోయాడు రాఘవ.
మూడవ రోజు సాయంత్రం. హాలులో భార్యా భర్తలిద్దరూ ఏవో కుటుంబ వ్యవహారాల గురించి మాట్లాడుకుంటున్నారు. రాఘవ వాళ్ళకెదురుగా కూర్చుని ఒక వేపు దినపత్రిక చదువుతూ మరొక వేపు అన్నా వదినలను గమనిస్తూ ఉన్నాడు. అప్పుడక్కడకు వాసు నిశ్శబ్దంగా ప్రవేశించి ప్రోగ్రెస్ కార్డుని సుదర్శనానికి అందిచ్చాడు. “క్వార్టర్లీ ఎగ్జామ్ ప్రోగ్రెస్ కార్డా! ”అంటూ కార్డు వివరాలు చూసి ముఖం చిట్లించాడు సుదర్శనం.
“ఇవేం మార్కులురా అత్తెసరు మార్కులు! అసలు నువ్వు స్కూలుకి వెళ్తున్నావా లేక మరెక్కడికైనా వెళ్లి డుమ్మాకొట్టి వస్తున్నావా?” అని హుంకరిస్తూ భార్య వేపు తిరిగి- “వీణ్ణి వెంటనే స్పెషల్ ట్యూషన్ క్లాసుకి పంపించు. క్రికెట్ ఆటలూ- పరుగు పోటీలు ఆపు చేయించు. వీడి మూమెంట్స్ పైన చూపుంచు”
అప్పుడు రాఘవ కలుగ చేసుకున్నాడు- “ఇప్పుడు నేనొకటి చెప్పాలిరా అన్నయ్యా! ”
“తర్వాత చెప్దువు గాని— ఇప్పుడు వీడి ఆకతాయి వ్యవహారం గమనించాలి”
“కాదురా అన్నయ్యా! నేనిప్పుడే చెప్పాలి”
ఇక తప్పదన్నట్టు- ఇక చెప్పు- అన్నట్టు తలాడించాడు సుదర్శనం.
“నన్నడిగితే స్పెష ల్ ట్యూషన్ క్లాసులకి వెళ్ళాల్సింది వాసు కాదు. నువ్వూనూ—వదినానూ—హౌ టు గ్రూమ్ గుడ్ చిల్డ్రన్- ప్రేమాబాయి సాంస్కృతిక వ్యవస్థ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడుపుతూంది. మీరిద్దరూ తక్షణం అందులో చేరాలి”
ఆ మాటతో భార్యా భర్తలిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కొన్ని క్షణాల తరవాత వైదేహి తేరుకుని అంది- “అవేం మాటలు మరదీ! వాడు సరిగ్గా చదవకుండా తక్కువ మార్కులు తెచ్చుకుంటే- మమ్మల్ని ట్యూషన్ క్లాసుకి వెళ్ళమనడం దేనికి?”
“కారణం ఉంది వదినా! బలమైన కారణమే ఉంది. ఈనాడు వాసు పరిస్థితి ఇంతగా దిగజారిపోయిందంటే- స్కూలు వాతావరణమే కాదు- ఇంట్లోని వాతావరణం కూడాను కొంత కారణం- ముఖ్యంగా మీ వైఖరి కారణం. ఈనాడు వాడు సరిగ్గా చదవకుండా మార్కులు కోల్పోతున్నాడని మీరిద్దరూ వాపోతున్నారు. పోకడ ఇలానే సాగితే మీరొకరోజు వాసుని సహితం కోల్పోయే పరిస్థితి రావచ్చు”
ఆ చివరి మాటతో ఇద్దరూ జర్కింగ్ కి లోనయారు. కోపంతో బుసకొట్టినంత పని చేసారు. మూకదాడి చేసారు. “అంటే- మేం వాడి ఆలనా పాలనా చూడటం లేదంటావు! ”
“చూడటం లేదని నేననడం లేదురా అన్నయ్యా! చూడవలసిన రీతిలో చూడటం లేదంటాను. ఈ ఒక్క పాయింటూ నిరూపిస్తాను. మొన్నొక రోజు ఇంటికి వస్తూనే అడిగాను- వాసు కనిపించడేమని. వాడెక్కెడెక్కడికో వెళ్ళాడని ఏవోవో కారణాలు వదిన చెప్పింది. అసలు వాడి ఉనికే నీకు తెలియకుండా పోయింది. వాడి ఉనికి ఎవరికైనా తెలియకుండా పోవచ్చు. కాని నీకు మాత్రం తెలియకుండా ఉండకూడదు వదినా!
ఇంతకూ అప్పుడు వాడెక్కడున్నాడో తెలుసా? నా గదిలో- ఉండేలు దెబ్బకు మెలికలు తిరిగిన పావురంలా ముడుచుక్కూర్చున్నాడు- అన్యమనస్కకంగా ఏవేవో ఆలోచనల్లో పడుతూ—“
భార్యాభర్తలిద్దరూ మరొక సారి జర్కింగ్ కి లోనయారు. చూపులు తిప్పుతూ నిశ్సబ్దంగా ఉండిపోయారు. “ఎందుకలా జరిగిందంటే-- మీరిద్దరూ వాడి ఉనికి గురించి పట్టించుకోవడమే లేదు. చిన్నప్రాణం. వాడెప్పుడైనా ఏదైనా చెప్పడానికి వస్తే, మీ పనుల్లో మీరు పడిపోయి వాణ్ణి గసిరి నెట్టేసేవారు. వాణ్ణి ఏకదళ వృక్షంగా చేసేసేవారు. సమస్యలనేవి మన బోటి పెద్దవాళ్ళకే కాదు- చిన్నపిల్లలకూ ఉంటాయి—ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు. అసలు పాయింటు ఇది కాదు.
అసలైనది మరొకటి ఉంది. కొన్ని రోజులుగా వాసు మానసిక వ్యాకులతకు లోనవుతున్నాడు. కొన్నాళ్లకు ఇది మానసిక క్రుంగు బాటుకి దారితీయవచ్చు. దీని గురించి మీరెప్పుడైనా ఆలోచించా రా! ” అని వాసుకి ఇంటా బైటా ఎదురవుతూన్న ఇక్కట్ల గురించి వివరించాడు.
అంతా విన్న తరవాత భార్యభర్తలిద్దరూ నోరు తెరి చి అడిగారు- “వాసు భోజనం కూడా సరిగ్గా చేయడం లేదా! ”
“విషయం భోజనం చేయక పోవడం కాదు. వాణ్ణి తిననియ్యకుండా ఇద్దరు బుల్స్ కుర్రాళ్లు లాక్కుంటున్నారు. అంతేనా— అక్కడ వాడి స్కుల్ బ్యాగునుండి పెన్సిల్సూ కలర్ బాక్సులూ ఎగిరి పోతున్నాయి. మీరేమో ఇక్కడ అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా వాణ్ణి అశ్రధ్ధగా ఉన్నాడని ఆడిపోసుకునేవారు. వాడి గోడు అక్కడా వినేవారు లేరు. ఇక్కడా వినేవారు లేరు. వాడిక యేంచేస్తాడు? కృంగి కృశించి పోవలసిందే— దేనికీ పనికి రాకుండా పోవలసిందే--
మీరిక కంగారు పడనవసరం లేదు. రెండు రోజులు సెలవు పెట్టి వాసు స్కూలుకి వెళ్లి అన్నీ సర్దుబాటు చేసాను. ఆ బుల్ కుర్రాళ్ళను అదుపులో పెట్టలేకపోతే నేనే ఆ పని చేసి ముగిస్తానని వాసు క్లాసు టీచరుకి హెచ్చరించి వచ్చాను. అంతటితో ఊరుకోలేదు. అప్పటికీ క్లాసు వాతావరణం బాగుపడక పోతే- జిల్లా విద్యాధికారికి పిర్యాదు చేసి వాసుని మరొక స్కూలుకి మార్చవలసి వస్తుందని కూడా గట్టిగా చెప్పాను. ఇకపైన వారానికి ఒకసారి నువూ- మరొక వారానికి వదినా వాసు స్కూలుకి వెళ్లి వాడితో కాసేపు గడిపి వస్తారు. టీచర్సుతో వాసు చదువు గురించి మాట్లాడి వస్తారు.
బడినుండి ఇంటికి వచ్చిన వెంటనే మీరుగా ఎదురు వెళ్లి స్కూలు వివరాలు వాసు నుండి అడిగి తెలుసు కుంటారు. వాడితో వాడి సమస్యల్ని చర్చిస్తారు. ఆత్మ విశ్వాసం పెంపొందించడానికి నిన్ననే వాసుని యోగా క్లాసులో చేర్పించాను. ఇక చివరి మాటగా నీకొక మాట చెప్పాలి వదినా! చెప్పేదా?”
“చెప్పు మరదీ! ” అపరాధ భావం చోటు చేసుకున్న మనసుతో- జేవురించిన ముఖంతో అడిగిందామె.
“రోజులో ఒక గంట సమయం నీది కాదని ఊహించుకుని- వాసుని ఎక్కడికో స్పెషల్ ట్యూషన్లకని పంపించకుండా నువ్వే వాడికి పాఠాలు చెప్పు. అన్నయ్యను పెళ్లి చేసుకోక ముందు నువ్వు జిల్లా పరిషత్తు బడిలో టీచరుగా ఉద్యోగం చేసేదానివు కదా! ఇప్పుడా అనుభవాన్ని వాసు కోసం ఉపయోగించు వదినా! పిల్లలకు మొదటి గురువు తల్లే అన్నది మరచిపోకు వదినా! “
వైదేహి అలాగే అన్నట్టు తలూపుతో వాసుని అక్కున చేర్చుకుంది కన్నీరు నింపుకుని.
***
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
Comments