top of page

దేశమును ప్రేమించుమన్నా


'Desamunu Preminchumanna' New Telugu Story Written By

Gannavarapu Narasimha Murthy

'దేశమును ప్రేమించుమన్నా' తెలుగు కథ

రచన: గన్నవరపు నరసింహ మూర్తి


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


ఆరోజు చంద్ర‌శేఖ‌రం పొలానికి వెళుతున్న స‌మ‌యంలో భార్య ఇందుమ‌తి వ‌చ్చి “త్వ‌ర‌గా రండి. ఇవాళ అబ్బాయి వ‌స్తునాడు. వాడికేదో మంచి ఉద్యోగం వ‌చ్చిందిట‌..” అని చెప్పింది.


“రానీ.. వ‌స్తే ఎక్క‌డికి వెళ్ళిపోతాడు చెప్పు? వాడేమీ అల్లుడు కాదు రాగానే నేను లేకపోతే ఏమైనా అనుకోడానికి” అంటూ చంద్ర‌శేఖ‌రం పొలానికి వెళ్ళిపోయాడు.


చంద్ర‌శేఖ‌రం ఎమ్మే చ‌దివి అదే ఊళ్ళో టీచ‌రుగా ప‌నిచేస్తున్నాడు. అత‌ని భార్య ఇందుమ‌తి మేన‌మామ కూతురే.. వాళ్ళ‌కి పెళ్ళైన ప‌ది సంవ‌త్స‌రాల‌కు పుట్టాడు సుభాష్‌.. ప్ర‌స్తుతం ఇంజ‌నీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల వేట‌లో ఉన్నాడు. కొడుకుని సివిల్ ఇంజ‌నీరింగ్ చ‌దివించి ఇక్క‌డే రాష్ట్ర ప్ర‌భుత్వంలో ఇంజ‌నీరుగా చెయ్యాల‌ని చంద్ర‌శేఖ‌రం కోరిక‌..


కానీ సుభాష్ త‌ద్విరుద్ధంగా కంప్యూట‌ర్ సైన్స్ చ‌దివి అమెరికా వెళ్ళే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. అత‌ను త‌మ‌ని వ‌ద‌లి అమెరికా వెళ్ళ‌డం ఆ దంప‌తుల‌కు సుత‌రామూ ఇష్టం లేదు.. కానీ సుభాష్ ఈత‌రం కుర్ర‌వాడు..


ఆధునిక‌త‌ను వంట ప‌ట్టించుకున్న‌వాడు కావ‌డంతో త‌ల్లిదండ్రుల మాట పెడ‌చెవిని బెట్టి అమెరికా వెళ్ళే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు.


అందుకు తగ్గట్టుగా సుభాష్ చ‌దువు పూర్తి కాగానే హైద‌రాబాద్ వెళ్ళి అక్క‌డ ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్, రోబోటిక్స్ ఆటోమేష‌న్‌, ఈ-కామ‌ర్స్ లాంటి కొత్త సాఫ్ట్ వేర్ లాంగ్వేజెస్ నేర్చుకునీ జీ అర్ ఈ ప‌రీక్ష వ్రాసేడు. అందులో మంచి స్కోర్ వ‌చ్చింది. ఈలోగా అత‌నికి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం వ‌చ్చింది.. అందులో చేరాలా లేక అమెరికా వెళ్ళి ఎమ్ఎస్ చ‌దివి అక్క‌డ ఉద్యోగం చెయ్యాలా అన్న మీమాంస‌లో ఉన్నాడు..


అదే విష‌యాన్ని త‌న తండ్రి చంద్ర‌శేఖ‌రానికి చెబితే “నువ్వు ఇక్క‌డికి వచ్చిన తరువాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం” అని చెప్ప‌డంతో సుభాష్ గోదావ‌రిలో బ‌య‌లుదేరి ఈరోజు వ‌స్తునాడు.

చంద్ర‌శేఖ‌రానిది స్వాతంత్య్ర స‌మ‌ర యోధుల కుటుంబం. అత‌ని తాత బాల‌గంగాధ‌ర్ తిల‌క్‌.. అత‌ను గాంధీతో క‌ల‌సి దండి ఉప్పు స‌త్యాగ్ర‌హంలో పాల్గొన్న గొప్ప దేశ‌భ‌క్తుడు. అత‌ని తండ్రి స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడైన బాల‌గంగాధ‌ర తిల‌క్ మీద అభిమానంతో కొడుక్కి ఆ పేరు పెట్టాడు. అప్ప‌ట్లో దేశంలో చాలామంది స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల పేర్లు పెట్టుకునేవారు. అత‌ని కొడుకు అంటే చంద్ర‌శేఖ‌రం తండ్రి సుభాష్ చంద్ర‌బోస్ కూడా తండ్రి కంటే గొప్ప దేశ‌భ‌క్తుడు; బ్రిటిష్ వాళ్ళ‌ను ఎదిరించి లాఠీ దెబ్బ‌లు తిన్న‌వాడు.. చంద్ర‌శేఖ‌రం త‌ల్లి సుశీల‌కు ప‌ద‌హారేళ్ళ వ‌య‌సులో సుభాష్‌తో పెళ్ళైంది..


అప్ప‌ట్నుంచి ఆమె భ‌ర్త అడుగుజాడ‌ల్లోనే న‌డిచింది. దేశం కోసం స్వాతంత్య్ర పోరాటం చేస్తూ త‌మ జీవితాల‌ను త్యాగం చేసారు ఆ దంప‌తులు.. పిల్ల‌లు ఉంటే త‌మ పోరాటానికి ఆటంక‌మౌతుంద‌ని స్వాతంత్య్రం వ‌చ్చేదాకా ఆ దంప‌తులు పిల్ల‌ల‌ను వ‌ద్ద‌నుకున్నారు. అందుకే చంద్ర‌శేఖ‌రం ఆ దంప‌తుల‌కు న‌ల‌భై ప‌దులు దాటిన త‌రువాత పుట్టాడు. కొడుక్కి స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడైన చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ పేరు పెట్టుకొని త‌న దేశ‌భ‌క్తిని చాటుకున్నాడు సుభాష్ చంద్ర‌.


చంద్ర‌శేఖ‌ర్, అమ్మ సుశీల కోరిక మీద ఆమె త‌మ్ముడి కూతురైన ఇందుమ‌తిని పెళ్ళి చేసుకున్నాడు.


వాళ్ళ‌కి చాలా సంవ‌త్స‌రాల దాకా పిల్ల‌లు పుట్ట‌లేదు. త‌ను బ‌తికుండ‌గా మ‌న‌వల‌ను చూస్తానో లేదో అన్న భ‌యంతో ఉన్న సుశీల‌కు ఆమె చ‌నిపోయే రెండు సంవ‌త్స‌రాల ముంద‌ర మ‌న‌వ‌డు పుట్ట‌డంతో ఎంతో ఆనందించి మ‌న‌వ‌డికి తాత‌గారి పేరైన సుభాష్ చంద్ర‌బోస్ పేరు పెట్టి ఆ త‌రువాత చ‌నిపోయింది.


ఇక ప్ర‌స్తుతానికొస్తే ఆరోజు పొలం ప‌నులు చూసుకొని చంద్ర‌శేఖ‌రం ఇంటికొచ్చేస‌రికి సుభాష్ నిద్ర‌పోతూ క‌నిపించాడు..


ఆ సాయంత్రం తండ్రీ కొడుకులు `టీ` తాగుతున్న‌ప్పుడు అత‌ని ఉద్యోగ విష‌యం ప్ర‌స్తావ‌నకొచ్చింది..


సుభాష్ తండ్రితో ``నాకు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం వ‌చ్చింది. కానీ జీఆర్ఈలో మంచి స్కోర్ రావ‌డంతో నాకు స్టాన్‌ఫోర్డ్‌లో సీటొచ్చింది.. స్టాన్‌ఫోర్డ్ అంటే ఇంజ‌నీరింగ్‌లో ప్ర‌పంచంలోనే నెంబ‌రు వ‌న్ విశ్వ‌విద్యాల‌యం. అక్క‌డ సీటు రావ‌డం అంటే మామూలు విష‌యం కాదు.. సిలికాన్ వేలీ రూప‌క‌ర్త ఆ స్టాన్‌ఫోర్డ్ విశ్వ‌విద్యాల‌యం.. ఆ విశ్వ‌విద్యాల‌యంలో చ‌దివిన 64 మందికి నోబుల్ బ‌హుమ‌తులు వ‌చ్చాయి. అందుక‌ని అటువంటి విశ్వ‌విద్యాల‌యంలో వ‌చ్చిన సీటును వ‌దులుకోవ‌డం నాకు ఇష్టం లేదు. కాబ‌ట్టి నేను అమెరికా వెళ్ళాల‌నే నిర్ణ‌యించుకున్నాను`` అని చెప్పాడు..


అత‌ని మాట‌లు విన్న చంద్ర‌శేఖ‌రం చాలా సేపు మౌనం వ‌హించాడు. ఆ త‌రువాత విష‌ణ్ణ‌ వ‌ద‌నంతో ``సుభాష్‌! మ‌న‌ది దేశ‌భ‌క్తుల కుటుంబం. దేశం గురించి ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప చ‌రిత్ర ఉంది మ‌న కుటుంబానికి. మా తాత గంగాధ‌రం దేశం కోసం త‌న జీవితాన్ని త్యాగం చేసి జైలుకి వెళ్ళాడు. అలాగే మా అమ్మ‌నాన్నలు దేశం కోసం పిల్ల‌లు వ‌ద్ద‌నుకున్నారు. అందువ‌ల్ల వాళ్ళ‌కి నేను ఆల‌స్యంగా స్వాతంత్య్రం వ‌చ్చిన త‌రువాత పుట్టాను.


అదేం ప్రార‌బ్ధ‌మో కానీ మాకు కూడా నువ్వు చాలా ఆల‌స్యంగా పుట్టావు. నీకు సుభాష్ చంద్ర అన్న పేరు నీ మామ్మ అంటే మా అమ్మ పెట్టింది.. అది మా నాన్న పేరే కాక ఈ దేశ స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ ప్ర‌భుత్వానికి ఎదురొడ్డి పోరాడిన దేశ భక్తుడు, అజాద్ హింద్ ఫౌజ్ రూప‌క‌ర్తైన సుభాష్ చంద్ర‌బోస్ పేరు.


అటువంటి దేశ‌భ‌క్తుల పేరు పెట్టుకున్న‌నువ్వు ఈరోజు ఈ గొప్ప దేశాన్ని, ముదిమి వ‌య‌సులో ఉన్న మ‌మ్మ‌ల్ని వ‌ద‌లి వేల‌మైళ్ళ దూరంలో ఉన్న అమెరికా వెళ్ళి పోతాన‌న‌డం చాలా బాధాక‌రం.. ఈ ప‌విత్ర గ‌డ్డ మీద పుట్టిన మ‌నం మన దేశ‌మాతకు సేవ చెయ్య‌కుండా వేరే దేశాల‌కు సేవ‌ చేస్తాన‌న‌డం అందునా దేశ‌భ‌క్తుల కుటుంబంలో పుట్టిన నువ్వు అన‌డాన్ని నేను జీర్ణించుకోలేక పోతున్నాను..


నువ్వు ఈ త‌రం వ్య‌క్తివి కాబ‌ట్టి దేశ స్వాతంత్య్రం గురించి, దాని విలువ గురించి నీకు తెలియ‌దు.. ఆరోజు నీ తాత‌ల త‌ర‌మంతా ఎన్నో బాధ‌లుప‌డి, త్యాగాలు చేసి పోరాడ్డం వ‌ల్లే ఈరోజు మ‌న‌మంతా స్వేచ్ఛ‌గా హాయిగా జీవించ‌ గ‌లుగుతున్నాము. న‌ది ఒడ్డున ఉన్న‌వాడికి దాహం విలువ పెద్ద‌గా తెలియ‌దు. అలాగే స్వేచ్ఛ అనుభ‌విస్తున్న నీలాంటి ఈత‌రం వాళ్ళ‌కి దాని విలువ అంత‌గా తెలియ‌దు” అని చెమ‌ర్చిన క‌ళ్ళ‌ను తుడుచుకుంటూ ఎదురుగా గోడ‌కు వేలాడుతున్న త‌న త‌ల్లిదండ్రులు తెలుపు న‌లుపు పోటో ద‌గ్గ‌రికి వెళ్ళాడు..


ఆవేశంతో తండ్రి చెప్పిన మాట‌లు వింటున్న సుభాష్ ఒక్క‌సారిగా అటువైపు చూసాడు. ఎదురుగా నిలువెత్తు తాత మామ్మ‌ల బ్లాక్ అండ్ వైట్ ఫోటో..


“ఒరేయ్‌! నువ్వు ఈ గొప్ప స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల మ‌న‌వ‌డివి.. నా త‌ల్లి సుశీల, తండ్రి సుభాష్‌చంద్ర ఈ దేశం కోసం త‌మ జీవితాల‌నే ప‌ణంగా పెట్టారు. మా అమ్మ‌కి పెళ్ళైన సంవ‌త్స‌రానికి మా తండ్రిని బ్రిటిష్ ప్ర‌భుత్వం జైలులో పెట్టింది. త‌ను భర్తకు వంద‌ల మైళ్ళ దూరంలో ఉండి బ్రిటిష్ పాల‌కుల దౌర్జ‌న్యాల‌ను, చిత్ర‌హింస‌లను భ‌రిస్తూ కూడా చాలా ధైర్యంగా ఈ దేశం కోసం పోరాడింది..


త‌ను బ్రిటిష్ ప్ర‌భుత్వం వ‌ల్ల ఎన్నో బాధ‌లు పడుతున్నానన్న విష‌యం భ‌ర్త‌కి తెలిస్తే అత‌ను ఎక్కడ నిరాశ‌చెంది అనారోగ్యం పాలవుతాడోనన్న‌ భయంతో ఆ విష‌యం భ‌ర్త‌కు తెలియ‌కుండా తాను హాయిగా ఉన్నాన‌నీ, త‌న కోసం భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌నీ అబద్ధాలు ఉత్తరాల్లో వ్రాస్తూ అత‌న్ని ఉత్తేజ ప‌రిచిన ధీర‌వ‌నిత మా అమ్మ‌.. దాంతో మా నాన్న ధైర్యంగా జైలు జీవితాన్ని గడిపి బయటకు వచ్చిన తరువాత మళ్ళీ అకుంఠిత దీక్ష‌తో స్వాతంత్ర్య పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళ దాస్య శృంఖ‌లాల నుంచి ఈ దేశాన్ని విడిపించి మ‌న‌కు స్వాతంత్ర్యం వచ్చేటట్లు చేసారు.

ఆనాడు వాళ్ళు చేసిన ఆ పోరాటాల ఫ‌లిత‌మే మ‌నం ఈనాడు అనుభ‌విస్తున్న ఈ స్వేచ్ఛ‌. ఆనాడు వాళ్ళు కూడా మ‌న లాగే ఆలోచిస్తే ఈనాడు మ‌నం ప‌రాయివాళ్ళ పాల‌న కింద మ‌గ్గిపోయి ఉండేవాళ్ళం. ఆనాడు వాళ్ళు త‌మ చెమటని ర‌క్తంగా మార్చి పోరాటం చేసి వేసిన ర‌హ‌దారి మీద మ‌నం ఆనందంగా న‌డుస్తున్నాం”..


“అదీకాక ఇప్పుడు మేము వాన‌ప్రస్థం లోకి ప్ర‌వేశించాము.. ఇప్పుడే నీ అవ‌స‌రం మా కుంటుంది. క‌న్న‌పిల్ల‌లు ముదిమి వ‌య‌సులో త‌ల్లితండ్రుల‌కు ఊత‌కర్ర‌లా మారి సేవ చెయ్యాలి. అప్పుడే త‌ల్లితండ్రుల రుణం తీర్చిన‌ట్ల‌వుతుంది.. అలా కాక నువ్వు మ‌మ్మ‌ల్ని వ‌ద‌లి వెళ్ళిపోతే నీ రాక కోసం చ‌కోర‌ప‌క్షిలా ఎదురు చూస్తూ ఈ వ‌య‌సులో బ‌త‌క‌డం మ‌ర‌ణంతో స‌మానం”..


“ప‌క్షులు రెక్క‌లు రాగానే ఎగిరిపోతాయి. మ‌నం ప‌క్షులం కాకూడ‌దు. ఈ నేల‌లో పుట్టిన మ‌నం ఈ మ‌ట్టిప‌రిమ‌ళాన్ని ఆస్వాదిస్తూ బ‌తికితే ఈ దేశం గ‌ర్వ‌ప‌డుతుంది. అందుకే గురజాడ "దేశమును ప్రేమించు మన్న; మంచి అన్నది పెంచుమన్న " అని అన్నాడు; కాబట్టి ఆలోచించి సరైన నిర్ణ‌యం తీసుకో” అన్నాడు చంద్ర‌శేఖ‌రం క‌ళ్ళ‌ను తుడుచుకుంటూ..


సుభాష్ తండ్రి వైపు చూసాడు.. అత‌ని క‌ళ్ళ‌ల్లో నీరు.. ఎదురుగా నిలుచుని ఉంది త‌ల్లి ఇందుమ‌తి. భ‌ర్త క‌న్నీళ్ళు చూసి కాబోలు ఆమెకూ క‌ళ్ళు చెమ‌రుస్తున్నాయి.


కొద్దిసేపు అక్క‌డే నిల‌బ‌డి వెళ్ళిపోయాడు సుభాష్‌..


వారం రోజుల త‌రువాత తల్లి తండ్రులతో క‌ల‌సి హైద‌రాబాద్ వెళ్ళి ఇన్ఫోసిస్‌లో చేరాడు సుభాష్‌..

(స‌మాప్తం)

గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.


81 views0 comments
bottom of page