top of page

దేవుడు కోటేసు


'Devudu Kotesu' New Telugu Story


Written By Ch. C. S. Sarma
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

ప్రతి మనిషిలో దైవత్వం వుంది. కొందరి విషయంలో అది నివురుగప్పిన నిప్పులా ఉంటూ దానవతను గుర్తుచేస్తుంది. కొందరి విషయంలో ఆ గొప్ప గుణం సలక్షణంగా సాటివారికి సహాయపడుతుంది. ఆ మహా గుణ సంపదకు భోగభాగ్యాలు పరిమితం కావు. మంచి మానవత్వం... అదే దైవత్వం.


"రంగా!..."

మూసి ఉన్న తలుపును తట్టి పిలిచాడు కోటేసు. అతని ప్రక్కన భార్య లక్ష్మి ఉంది. పాతిక సంవత్సరాల తర్వాత కోటేసు తన ఊరికి భార్యతో కలిసి వచ్చాడు. తన పిన తండ్రి కొడుకు రంగను, తన ఊరిని, తన యజమాని రామచంద్ర రావు గారిని చూడాలని.


కోటేసు రెండవ పిలుపు విని రంగా తలుపు తెరిచి వరండాలోకి వచ్చాడు రంగా. కోటేసుకన్నా మూడు సంవత్సరాలు చిన్నవాడు ప్రస్తుతములో కోటేష్ వయస్సు అరవై సంవత్సరాలు అతని ఇల్లాలు లక్ష్మికి యాభై ఐదు సంవత్సరాలు.


అన్నా వదినలను చూచి రంగా ఆశ్చర్యపోయాడు. చాలా కాలం తర్వాత వారిని చూసినందుకు రంగ తన కళ్ళనుతానేనమ్మలేకపోయాడు. కొద్ది క్షణాలు వారిని పరీక్షగా చూశాడు.


"రంగా!... నేను కొటేసును." నవ్వుతూ చెప్పాడు కోటేసు.

రంగా వదనంలో ఎంతో ఆనందం "అన్నా!..." అని చేతులు జాచి కౌగిలించుకున్నాడు కొటేసును.


"ఇన్నేళ్ళుగా ఎక్కడ ఉన్నేవన్నా!..." అన్న గద్గద స్వరంతో అడిగాడు రంగ.

"నన్ను... మీ వదినను ఎవరూ గుర్తించని చోట కాయకష్టం చేసుకుంటూ జీవితాన్ని లాక్కొచ్చాను ఇంతవరకూ!..." నవ్వుతూ చెప్పాడు కోటేసు.


"మిమ్మల్ని చూచిన నాకు ఎంతో ఆనందంగా ఉందన్న. రండి...” లోనికి చూస్తూ "మంగా... మంగా!... ఎవరొచ్చారో చూడు." ఆనందంతో పలికాడు రంగ.

మంగ వచ్చింది. వారిని చూసింది. ఆనందంగా కోటేసు ఇల్లాలు లక్ష్మి చేతులు పట్టుకుంది.


"అక్కా!... బాగున్నావా !..." ఎంతో ఆప్యాయంగా అడిగింది మంగ.

"బాగున్నాను మంగా!..." నవ్వుతో చెప్పింది లక్ష్మి

నలుగురూ ఇంట్లోకి నడిచారు. ఆ నాలుగు హృదయాల్లో ఒకరి పట్ల ఒకరికి ఎంతో ప్రేమాభిమానాలు. అది మానవతావాదానికి నిదర్శనం.

***

అన్నదమ్ములు కోటేసు, రంగా చెరువు కట్ట మీది మర్రిచెట్టు క్రింద కూర్చుని తమ గతాన్ని తలపోసుకుంటున్నారు.


"రంగా !..." మన అయ్యగారు బాగున్నారా!..." శూన్యంలోకి చూస్తూ అడిగాడు కోటేసు.


"అన్నా!.. ఆయనకేం తక్కువ. మంచి మనసున్న మహారాజు. అమ్మ వందనమ్మ ఆయనకు తగిన ఇల్లాలు. కొడుకు పరుశురాం కలెక్టర్ అయ్యాడు. ఆ బాబు పుట్టిన మూడేళ్ళకు ఆమెకు ఒక పాప పుట్టింది. ఆమె పేరు పావని. పోయిన సంవత్సరంలో ఆమె పెండ్లిని ఎంతో ఘనంగా చేశారు అయ్యగారు. అల్లుడు సబ్ రిజిస్ట్రార్. వారు నెల్లూరులో ఉంటున్నారు. పరుశురాం భార్య పేరు కళ్యాణి. ఆమెకి ఇద్దరు పిల్లలు. మొదట బాబు. పేరు రఘు. రెండవది పాప. సిరి వాళ్ళ వయసు ఐదు... మూడు సంవత్సరాలు. ఉండేది గుంటూరులో. నెలకొకసారి ఇక్కడికి వచ్చి అమ్మానాన్నలను చూసి రెండు రోజులు ఉండి వెళ్ళిపోతుంటాడు. రేపు మాపో వస్తాడని విన్నాను. వస్తే... నీవూ వారిని చూడవచ్చు.” అన్న కోటేసు ముఖంలోకి చూస్తూ... అతని ముఖ భావాలను గమనిస్తూ చెప్పాడు రంగ.


కోటేసు ముఖంలోని ఆనందాన్ని చూసి...

"అన్నా!... అయ్యగారు, అమ్మగారంటే నీకు ఎంతో ఇష్టం కదూ!..."


"అవును రంగా!... పాతిక సంవత్సరాలు వాళ్ళ ఉప్పూ పులుసు తిని బ్రతికానురా. ఆ గతాన్ని ఎలా మరిచిపోగలను? రంగా!... ఒకసారి ఆ పరుశురాం బాబును చూడాలని నాకూ మీ వదినకు ఆశరా!... మా ఆశ తీరుతుందా?" ప్రశ్నార్థకంగా చూశాడు కోటేసు... రంగ ముఖంలోకి.


"అన్నా!... నీవు వదిన చాలా మంచోళ్ళు. మీ కోర్కె తప్పక తీరుతుంది. రేపు చిన బాబు గారు తప్పక వస్తార్లే. పద... ఇంటికి పోదాం." నవ్వుతూ చెప్పాడు రంగ.

ఇరువురు లేచి రంగా ఇంటి వైపుకు నడిచారు.

***

ఆ రాత్రి భోజనానంతరం అందరూ పడుకున్నారు. లక్ష్మీ మంగ ప్రక్కన పడుతుంది. రంగా, కోటేసు వేర్వేరు మంచాల్లో ఇంటిముందు పడుకున్నారు. లక్ష్మికి నిద్ర పట్టలేదు మెల్లగా లేచి... కోటేసి మంచాన్ని సమీపించింది. కోటేసు భుజంపై తట్టి...


"అయ్యా!..." మెల్లగా పలికింది.

కోటేసుమేల్కొన్నాడు. లక్ష్మిని చూశాడు.

"ఏమిటి లక్ష్మి?...."

"మనం అబ్బాయిని చూడగలమా?..." స్వరంలో కంపనాన్ని గుర్తించాడు కోటేసు. ఆమె మనోవేదన మాటల్లో ప్రతిబింబించింది.


"తప్పకుండా చూడగలము. రేపు భార్యాపిల్లలతో మన ఈ ఊరికి వస్తాడట."

"అబ్బాయి పేరు ఏందయ్యా?"

"పరశురాం." కోటేసు జవాబు.

"మంచి పేరు... చాలా మంచి పేరు" గద్గద స్వరంతో పలికింది లక్ష్మి.


"లక్ష్మీ... వెళ్ళు... పడుకోపో... రేపు మనం తప్పక బాబును చూస్తాం. నా మాట నమ్ము." ఎంతో అనునయంగా పలికాడు కోటేసు.

పవిటి కొంగుతో కన్నీటిని తుడుచుకొని లక్ష్మి మెల్లగా నడిచి మంగ ప్రక్కకు చేరి పడుకుంది. ఆమె మనో దర్పణం మీద గత స్మృతులు ప్రతిబింబించాయి.

***

సంపన్న కుటుంబీకుడు రామచంద్రరావు ఇల్లాలు వందనకు మూడు కాన్పులు పోయాయి. నాలుగవ కాన్పుకు హాస్పిటల్లో చేరింది. అదే సమయానికి లక్ష్మి కూడా డెలివరీకి ఆ హాస్పిటల్లోనే చేరింది.


వందన బిడ్డ కడుపులోనే పోయాడు. పెద్ద ఆపరేషన్ చేసి డాక్టర్లు వందనములు బ్రతికించారు. గర్భసంచిని తీసేసారు.

డాక్టర్ వనజ రామచంద్రరావుకు చెల్లెలి వరస. అన్నా వదినలకు కలిగిన కష్టానికి ఎంతో బాధపడింది.


లక్ష్మి పండంటి ఇద్దరు మగ బిడ్డలను కన్నది. బిడ్డలు తల్లీ క్షేమం.

వనజ సుదీర్ఘంగా ఆలోచించింది అన్నా వదినల కష్టాన్ని దుఃఖాన్ని తీర్చాలని నిర్ణయించుకుంది. లక్ష్మితో ఏకాంతంగా తన వదిన గారి పరిస్థితిని వివరించింది. ఒక బిడ్డను మా వదినకు ఇవ్వు... అని లక్ష్మిని అర్థించింది. ఆమెకు ప్రాణదీక్ష పెట్టమని కోరింది. వనజ మాటలకు లక్ష్మి చలించిపోయింది. వనజ కోరిక ప్రకారం తన ఒక బిడ్డను వందనమ్మ పక్క మీదకు చేర్చింది. ఆరు రోజుల తర్వాత లక్ష్మి బిడ్డతో తన ఇంటికి చేరింది. పన్నెండు రోజుల తర్వాత వందనమ్మ బిడ్డతో భవంతికి చేరింది.


బిడ్డకు పాలు ఇచ్చే సమయంలో లక్ష్మి మనస్సంతా తన మరో బిడ్డ మీదే ఉండేది. మనసులో ఎంతో ఆవేదన. నయనాలు ఎడతెరిపి లేకుండా అశ్రుధారలనుకురిపించేవి. భర్త కోటేసు మాట ప్రకారం తన హృదయ ఆవేదనను దిగమిరింగిశిలా ప్రతిమల కూర్చునిపోయేది లక్ష్మి.


రామచంద్రరావు తన ఇల్లాలు వందన ముఖంలో ఉండే సంతోషాన్ని శాశ్వతంగా నిలచిఉండేదానికికోటేసును పిలిచి కొంత డబ్బు ఇచ్చి వారిని ఆ ఊరు వదిలి దూరంగా ఎక్కడికైనా పోయి బ్రతకమని చెప్పాడు. యజమానే దైవంగా భావించిన కోటేసు అతని మాటలను శిరసావహించి నెల్లూరు జిల్లాను వదిలి ఈస్ట్ గోదావరి జిల్లాకు భార్యాబిడ్డలతో వెళ్లిపోయాడు.


పది అంకణాల స్థలం కొని పాక వేసుకుని మొదట కొన్ని సంవత్సరాలు రిక్షా ఆ తర్వాత ఆటో నడుపుతూ జీవితాన్ని సాగించాడు.


కొడుకు వెంకయ్యకు చదువు అబ్బలేదు. పదేళ్ల వయస్సులో ఒక మెకానిక్ షాపులో వదిలాడు. ఈనాటికి వెంకయ్య పెద్ద మెకానిక్ అయ్యాడు. వాడికి ఇప్పుడు పాతిక సంవత్సరాలు. వెంకయ్య ఏనాడు తండ్రిని ఎదిరించలేదు తల్లి తండ్రి అంటే వాడికి ఎంతో ప్రేమ, గౌరవం. త్వరలో ఇల్లు కట్టి, పెళ్లి చేసుకోవాలన్నది అతని ఆశయం. ఆ లక్ష్యాన్ని సాధించే దానికి రాత్రింబవళ్లు కష్టపడి వర్క్ షాపులో పనిచేస్తాడు.

తల్లిదండ్రులను ఎంతో ఆదరాభిమానాలతో చూసుకుంటాడు.

గతాన్ని తలపోసుకుంటూఉండిన లక్ష్మి మనస్సు నిద్రమ్మ ఒడిలో ఒరిగిపోయింది.

***

"దండాలు బాబయ్యా!... కోటేసు, లక్ష్మి ఏకకంఠంతో పలికారు. తమ పాత యజమాని రామచంద్ర రావు గారి ముందు నిలబడి చేతులు జోడించి.


రామచంద్ర రావు గారు కళ్లద్దాలను సవరించుకొని వారి ఇరువురిని పరీక్షగా చూశారు. గుర్తించాడు.


"ఓ... కోటేసు లక్ష్మి...! బాగున్నారా!..." ఆప్యాయంగా పలకరించాడు రామచంద్రరావు.


"అంతా తమ దయ అయ్యా!... బాగానే ఉన్నాం." ఎంతో వినయంగా చెప్పాడు కోటేసు.

వందనమ్మ వరండాలోకి వచ్చింది. వచ్చిన వారిని ఆశ్చర్యంగా చూసింది. వారి పేర్లను వందనకు రామచంద్రరావు చెప్పాడు. వారిని ఆప్యాయంగా పలకరించింది వందన.

కారు వచ్చి వరండా ముందు ఆగింది. పరుశురాం... కళ్యాణి... పిల్లలు రఘు సిరి కారు నుండి దిగారు. వారిని చూసి రామచంద్ర రావు వందనమ్మ ఎంతో ఆనందంతో పలకరించారు.


పిల్లలు రఘు, సిరి, నానమ్మ... తాతయ్యలను సమీపించి వాళ్ళ కాళ్ళను తమ చేతులతో చుట్టేశారు. మనవరాలిని వందనమ్మ, మనుమడిని రామచంద్రరావు ఎత్తుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన కోటేసు, లక్ష్మిల నయనాలు పరవశంతో ఆనందంతో చెమ్మగిల్లాయి.

వారిని చూసి రామచంద్ర రావు కోటేసు ముఖంలో చూస్తూ "కోటేసు!... మన అబ్బాయి, కోడలు, మనవడు, మనవరాలు. గుంటూరులో ఉంటున్నారు." నవ్వుతూ పలికాడు రామచంద్రరావు.


పరుశురాం... కోటేసును, లక్ష్మిని పరీక్షగా చూశాడు.

"నాన్నా!... వీరు!.." తండ్రి ముఖంలోకి చూస్తూ అడిగాడు.


"వీరు మన ఊరి వారే!... కానీ ఇక్కడ లేరు. ఈస్ట్ గోదావరి ప్రాంతంలో ఉంటున్నారు. నన్ను, మీ అమ్మను చూడాలని వచ్చారు" దరహాస వదనంతో పలికారు రామచంద్ర రావు.

"నమస్కారమండి" సవినయంగా చేతులు జోడించాడు పరుశురాంకోటేసును లక్ష్మిని పరీక్షగా చూస్తూ.


పరవశంతో కోటేసు, లక్ష్మి పరశురాముని సమీపించారు. వారి హృదయానందం వర్ణనాతీతం. పరుశురాముకు మదిలో వారి పట్ల పూజ్యతా భావం అందుకే వినయంగా నమస్కరించాడు.


కోటేసు, లక్ష్మి పరుశురాం చేతులు పట్టుకున్నారు. పై నుంచి క్రింది వరకు రెండు మూడు సార్లు పరీక్షగా చూశారు. వారి కంఠం బొంగురు పోయింది. మాటలు కరువైనాయి. నయనాలు అశ్రుపూరితలైనాయి.


"బాబూ!... పాతికేళ్ల కిందట తమర్నిచూసామయ్యా!.." ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉందయ్యా!... మీరు... మీ ఇల్లాలు బిడ్డలు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలయ్యా! చల్లగా ఉండాలి" అతి ప్రయాసతో ఆనంద పారవశ్యంతో పలికి తన చేతిని పరశురాం తలపై ఉంచాడు కోటేసు. లక్ష్మి కూడా కన్నీటితో అదే పని చేసింది. వారి ఇరువురు శరీరాలు చెమటతో చల్లబడ్డాయి.


"థాంక్స్అండి వస్తాను" నవ్వుతూ పలికి పరశురాం ఇంట్లోకి నడిచాడు. అతని భార్య కళ్యాణి అతన్ని అనుసరించింది పిల్లలు తాత అవ్వల చేతుల్లో నుంచి జారి తల్లిదండ్రుల వెనక లోనికి పోయారు.రామచంద్ర రావు అర్ధాంగి వందన ముఖంలోకి చూశాడు. ఆమె లోనికి వెళ్ళింది‌.

"కోటేసు!... ఊరికి ఎప్పుడు వెళుతున్నారు?" రామచంద్ర రావు గారి ప్రశ్న.


యజమాని ముఖంలోకి చూశాడు కోటేసు. ఆ ప్రశ్నలోని అర్ధాన్ని గ్రహించిన కోటేసు నవ్వుతూ...

"అయ్యా!... ఈ లక్ష్మికి... మిమ్మల్ని అందరినీ చూడాలని ఆశ. దాని కోర్కె తీర్చాలని ఇక్కడికి వచ్చాము. చూడాలనుకున్న వారిని... చూశాము. నా కొడుకూ ప్రయోజకుడు అయ్యాడు. వాడికి నేనంటే ప్రాణం. ఊర్లో మీ భూముల్లో నా చేత్తో నాటిన గింజలు మొక్కలయ్యి ఈ పాతికేళ్లలో మానులుగా మారి పోయాయి. వాటిని అన్నింటిని చూసిన నాకు, నా లక్ష్మికి ఎంతో ఆనందంగా ఉంది. ఈ జన్మకి ఇది చాలు. మేము రేపే వెళ్లిపోతామయ్యా!..." ఎంతో అనునయంగా చెప్పాడు కోటేసు.


వందనమ్మ రెండు ప్లేట్లల్లో ఫలహారాలు తెచ్చింది. కోటేసుకు లక్ష్మికి అందివ్వబోయింది.

"వద్దమ్మా!.. రంగబావ ఇంట్లో తినేసి వచ్చాము. కడుపులో సందు లేదు. తృప్తిగా ఉంది. వెళ్ళొస్తాం" చేతులు జోడించింది లక్ష్మి.


"కొద్దిగా తీసుకోండి." రామచంద్ర రావు గారి పలుకు.

"వద్దయ్యా!... లక్ష్మి చెప్పింది నిజం. ఇక మేము వెళతామయ్యా!" వినయంగా చేతులు జోడించి కోటేసు వరండా మెట్లు దిగాడు. లక్ష్మి అతన్ని అనుసరించింది.

***

"రంగా!... ఈ ఉత్తరాన్ని అయ్యగారికి ఇవ్వు" మడిచిన కాగితాన్ని కోటేసు రంగ చేతిలో ఉంచాడు.

"ఏమిటన్నా!... విషయం?..."


"ఏం లేదురా వారికి నేను ఋణపడిఉన్నేను. దాన్ని తీర్చేశాను. అదే ఇందులో వ్రాశాను. వారికి ఇస్తావు కదూ!..."

"తప్పకుండా అన్నా!..."


"ఇక మేము బయలుదేరుతాం"

"మంచిది. పదండి. నేను బస్టాండ్ దాకా వస్తాను."


కోటేసు... లక్ష్మి... మంగకు, పిల్లలకు చెప్పి బస్టాండ్ కు బయలుదేరారు. రంగా వారితో బస్టాండ్ కు వచ్చాడు‌ బస్సు వచ్చింది. వారిరువురూ ఎక్కారు. బస్సు కదిలింది.


రంగా అయ్యగారు ఇంటికి వచ్చాడు. కోటేసు వ్రాసిన ఉత్తరాన్ని రామచంద్ర రావు గారికి ఇచ్చాడు. తన ఇంటి వైపుకు వెళ్ళిపోయాడు.


రామచంద్ర రావు కాగితపు మడతను విప్పాడు. చూశాడు.


"అయ్యా!... పాతిక సంవత్సరాలు మీ సేవ చేసుకుంటూ మీ ఇంటి ఉప్పు పులుసు తిన్నాం. బాబును చూడాలని ఈ పాతికేళ్లుగా లక్ష్మి నన్ను ఎన్నోసార్లు కోరింది. మాకూ వయస్సు అవుతూ ఉంది కదయ్యా! కట్టుకున్న దాని ఆశను తీర్చాలని మన ఊరికి వచ్చాను. ఆ దేవుని దయవలన మా కోరిక నెరవేరింది. నా బిడ్డను... కోడలిని, మనవడు, మనవరాలని చూసాము. ఇప్పుడు మా మనస్సు ఎంతో శాంతిగా ఆనందంగా ఉందయ్యా!... పాపం మీరు భయపడ్డారు కదూ!... మేము ఆ బిడ్డతో చుట్టరికాన్ని కలేస్తామని... అందుకే తమరు అడిగారు ఊరికి ఎప్పుడు వెళతారని. అయ్యా!... మేము చాలా పేదవాళ్లం. ఆ మా పేదరికం ఆస్తిపాస్తుల విషయానికి వర్తిస్తుందేమో కానీ... గుణానికి... నీతి... నిజాయితీకి కాదయ్యా! ఆ దేవుడు మాకు ఇచ్చిన ఆస్తి అవేనయ్యా!...


మాట ఇచ్చి తప్పడం మాకు తెలవదయ్యా!... మా బిడ్డను చూడాలని వచ్చాం. చూశాం. కానీ... తమరు నా చిన్న బిడ్డను గురించి ఒక్క మాట కూడా అడగలేదంటే మీ దృష్టిలో మాకు ఉన్న విలువ నాకు బాగా అర్థమైందయ్యా!... మీ దంపతులు, నా పెద్ద బిడ్డ, కోడలు వారి పిల్లలు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవుడిని కోరుతున్నానయ్యా!... ఇక ఈ జన్మలో మేము ఈ ఊరికి రాము. మీకు ఎలాంటి కష్టాన్ని కలిగించం. నా మాటను నమ్మండి.”

ఇట్లు

కోటేసు


కోటేసు మనస్తత్వానికి రామచంద్రరావు చలించి పోయాడు. అతనికి దైవం మనుష్య రూపేణా, అనే ఆర్యోక్తి జ్ఞాపకం వచ్చింది. అతని నయనాలు చమ్మగిల్లాయి. మనస్సులో మాపాలిటి 'దేవుడు కోటేసు' అనుకొన్నాడు.


"దేవదేవా.. ఆ కోటేసును, అతని కుటుంబ సభ్యులను, చల్లగా చూచి కాచి రక్షించు తండ్రి." చేతులు జోడించి కళ్ళు మూసుకొన్నాడు.


నయనాల్లో నిండిన కన్నీరు, చెక్కిళ్ళ పైకి జారాయి.


* * *

-సమాప్తం-


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Twitter Link


Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.49 views0 comments

Comments


bottom of page